కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 5/15 పేజీలు 29-31
  • సౌలు—ప్రభువు కోసం ఏర్పరచబడిన సాధనం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సౌలు—ప్రభువు కోసం ఏర్పరచబడిన సాధనం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సౌలు కుటుంబ నేపథ్యం
  • సౌలు విద్య
  • సామర్థ్యాలను చక్కగా ఉపయోగించుకోవడం
  • యేసు సౌలును ఎన్నుకున్నాడు
    నా బైబిలు పుస్తకం
  • “సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • ‘బలులు అర్పించడం కన్నా ఆజ్ఞను గైకొనడం శ్రేష్ఠం’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • హింసకుడు గొప్ప వెలుగును చూశాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 5/15 పేజీలు 29-31

సౌలు—ప్రభువు కోసం ఏర్పరచబడిన సాధనం

తార్సు వాడైన సౌలు క్రీస్తు అనుచరులను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. కాని ప్రభువు అతని కోసం భిన్నమైన భవిష్యత్తును సిద్ధంచేసి ఉంచాడు. దేన్నైతే సౌలు తీవ్రంగా వ్యతిరేకించాడో, దానికే ఆయన విశేషమైన ప్రతినిధి కావలసి ఉంది. ‘అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు [సౌలు] నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు’ అని యేసు చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 9:15.

సౌలుపై దయ చూపించబడి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ‘ఏర్పరచుకొనిన సాధనం’ అవ్వడంతో, ‘హానికరుడుగా’ ఉన్న ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. (1 తిమోతి 1:12, 13) స్తెఫనును రాళ్లతో కొట్టినప్పుడూ, యేసు శిష్యులపై చేసిన ఇతర దాడులలోనూ భాగం వహించడానికి ప్రేరేపించిన సౌలు సామర్థ్యాలు, ఆయన క్రైస్తవ అపొస్తలుడైన పౌలుగా మారడంతో పూర్తిగా భిన్నమైన లక్ష్యాల వైపుకు మళ్లించబడ్డాయి. సౌలులో ఉన్న కోరదగిన లక్షణాలను యేసు చూశాడని స్పష్టమౌతుంది. అవి ఏ లక్షణాలు? ఈ సౌలు ఎవరు? సత్యారాధనను వ్యాప్తి చేసేందుకు ఆయనను ఉపయోగించుకోవడానికి ఆయన నేపథ్యం ఆయనను ఎలా తగినవానిగా చేసింది? ఆయన అనుభవం నుండి మనమేమైనా నేర్చుకోగలమా?

సౌలు కుటుంబ నేపథ్యం

సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత ఎంతోకాలం గడవకముందే స్తెఫను హత్య చేయబడే సమయానికి సౌలు ‘యౌవనుడు.’ దాదాపు సా.శ. 60-61లో ఫిలేమోనుకు వ్రాసే సమయానికి ఆయన ‘వృద్ధుడు.’ (అపొస్తలుల కార్యములు 7:58; ఫిలేమోను 8) పండితులు సూచిస్తున్న దాని ప్రకారం, ప్రాచీన కాలాల్లో వయస్సును లెక్కించే దానిని బట్టి బహుశ 24 నుండి 40 సంవత్సరాల వయసున్నవారిని ‘యౌవనులని’ అయితే 50 నుండి 56 సంవత్సరాల వయస్సున్న వారిని ‘వృద్ధులని’ పరిగణించేవారు. కాబట్టి, బహుశ యేసు పుట్టిన కేవలం కొన్ని సంవత్సరాలకే సౌలు పుట్టి ఉండవచ్చు.

అప్పట్లో యూదులు ప్రపంచంలోని అనేక భాగాల్లో జీవించేవారు. ఇతర దేశాలు జయించడం, బానిసత్వం, బహిష్కరించబడడం, వ్యాపారం, స్వచ్ఛందంగా ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళడం వంటివి వారు యూదా ప్రాంతంనుంచి చెదరివెళ్ళడానికి కారణమైన వాటిలో ఉన్నాయి. ఈయన కుటుంబంలోనివారు చెదరిపోయిన యూదులు అయినప్పటికీ, ‘ఎనిమిదవ దినమున సున్నతి పొంది, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనయ్యానని చెప్తూ,’ తాము ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశ చట్టాన్ని అనుసరించామని సౌలు నొక్కి చెప్తున్నాడు. తన తెగలో ప్రముఖుడైన, ఇశ్రాయేలీయుల మొదటి రాజుకు ఉన్న అదే హెబ్రీ పేరును సౌలు కల్గివున్నాడు. పుట్టుకతో రోమీయుడైన తార్సువాడైన సౌలుకి పౌలస్‌ అనే లాటిన్‌ పేరు కూడా ఉంది.—ఫిలిప్పీయులు 3:5; అపొస్తలుల కార్యములు 13:21; 22:25-29.

సౌలు రోమీయుడిగా పుట్టాడంటే దానర్థం ఆయన పూర్వికులలో ఒకరు రోమా పౌరసత్వపు ఆధిక్యతను సంపాదించి ఉంటారు. ఎలా? అలా పొందడానికి అనేక సాధ్యతలు ఉన్నాయి. పౌరసత్వాన్ని వారసత్వంగా పొందడమే కాకుండా, ఇది ఒక వ్యక్తికైనా లేక గుంపులకైనా ప్రత్యేక అర్హతలను బట్టి, కేవలం రాజకీయ ప్రయోజనార్థం లేక దేశంకోసం ప్రత్యేకమైన సేవచేయడం వల్ల లభించే ప్రతిఫలంగా ఇవ్వబడవచ్చు. ఒక రోమా పౌరుని నుంచి తన స్వేచ్ఛను ఒక బానిస కొనుక్కోగల్గితే లేక ఒక రోమా పౌరుడు ఒకర్ని తన నిర్బంధం నుంచి విడిచిపెట్టేస్తే, ఆ వ్యక్తి రోమా పౌరుడవుతాడు. అలాగే రోమా సైనిక విభాగంలో సాయుధ సైనికులుగా ఉన్నవారు ఆ బాధ్యత నుండి స్వతంత్రులైన తర్వాత రోమా పౌరసత్వం పొందుతారు. రోమా కాలనీలలో నివసిస్తున్న స్థానిక ప్రజలు కొంతకాలానికి ఆ దేశ పౌరులుకావచ్చు. కొన్ని కాలాల్లో పౌరసత్వాన్ని పెద్ద మొత్తం ఇచ్చి కొనుక్కునేవారు అని కూడా చెప్పబడుతుంది. సౌలు కుటుంబంవారు రోమా పౌరసత్వం ఎలా పొందారన్నది తెలియదు.

సౌలు రోమా మండలమైన (ఇప్పుడు దక్షిణ టర్కీలో ఉన్న) కిలికియ యొక్క ప్రధాన నగరమూ, రాజధాని అయిన తార్సు నుండి వచ్చాడని మనకు తెలుసు. ఆ ప్రాంతంలో ఎక్కువ మంది యూదులు నివసిస్తున్నప్పటికీ, అక్కడ జీవించిన సౌలుపై అన్యుల సంస్కృతి ప్రభావం కూడా పడివుండవచ్చు. తార్సు అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరం, అది గ్రీకు సంబంధిత విద్యాభ్యాసానికి లేక గ్రీకు విజ్ఞానానికి కేంద్రంగా పేరుపొందింది. మొదటి శతాబ్దంలో దాని జనాభా 3,00,000 నుండి 5,00,000 మధ్యన ఉండివుండవచ్చునని అంచనాలు తెలియజేస్తున్నాయి. ఇది ఆసియా మైనరుకూ సిరియాకూ మెసపటోమియాకూ మధ్యనున్న ప్రధాన రహదారిమీద వర్తక కేంద్రంగా ఉండేది. తార్సు, వర్తకం వలన, దాని పరిసర ప్రాంతాల్లోని సారవంతమైన భూముల వలన అభివృద్ధి చెందింది, ఆ నేలల్లో ముఖ్యంగా ధాన్యపు గింజలు, ద్రాక్ష, నార ఉత్పత్తి అయ్యేవి. వర్ధిల్లుతున్న దాని చేనేత పరిశ్రమ నుంచి మేకవెంట్రుకలతో నేసిన బట్ట ఉత్పత్తి అయ్యేది, దానితోనే డేరాలు తయారుచేసేవారు.

సౌలు విద్య

సౌలు లేక పౌలు తనకోసం తాను నిజాయితీతో కూడిన ఏర్పాట్లు చేసుకున్నాడు, డేరాలు కుట్టడం ద్వారా ఆయన మిషనరీ సేవలో ఆర్థికంగా తననుతాను పోషించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 18:2, 3; 20:34) ఆయన సొంత నగరమైన తార్సు డేరాలు కుట్టే వృత్తికి పేరుపొందింది. సౌలు చిన్నప్పుడే తన తండ్రి దగ్గర నుంచి డేరాలు కుట్టే వృత్తిని నేర్చుకుని ఉండవచ్చు.

భాషల్లో సౌలుకున్న పరిజ్ఞానం—ముఖ్యంగా ఆయనకు రోమా సామ్రాజ్యంలో సాధారణంగా ఉపయోగించబడే భాష అయిన గ్రీకుభాషలో ఉన్న ప్రావీణ్యత—కూడా ఆయన మిషనరీ సేవలో అమూల్యమైనదిగా నిరూపించబడింది. (అపొస్తలుల కార్యములు 21:37–22:2) ఆయన వ్రాతలను విశ్లేషించిన నిపుణులు ఆయన ఉపయోగించిన గ్రీకు సర్వశ్రేష్ఠమైనదని చెప్తారు. ఆయన ఉపయోగించిన భాష ప్రాచీన గ్రీకు సాహిత్యానికి సంబంధించిన కావ్యభాష కాదు లేక గ్రాంథికమైనది కాదు, గానీ ఆయన తరచూ దేనినుండైతే ఉదహరించాడో లేక ఎత్తి చెప్పాడో ఆ సెప్టాజింట్‌లోని అంటే హెబ్రీ లేఖనాల గ్రీకు అనువాదంలోని గ్రీకు భాషను పోలివుంది. ఈ ఆధారాన్ని బట్టి, సౌలు బహుశ యూదుల పాఠశాలలో గ్రీకులో కనీసం మంచి ప్రాథమిక విద్యను పొంది ఉంటాడు, అని వివిధ విద్వాంసులు భావిస్తున్నారు. “ప్రాచీనకాలంలో మంచి విద్యను, ప్రాముఖ్యంగా గ్రీకుభాషలో విద్యను ఉచితంగా పొందడం సాధ్యమయ్యేది కాదు; కాబట్టి దానిని పొందాలంటే వస్తుపరంగా కొంతమేరకు మంచి స్థితిలో ఉండాలి” అని పండితుడైన మార్టిన్‌ హెన్గెల్‌ చెప్తున్నాడు. సౌలు ప్రముఖ కుటుంబం నుండి వచ్చాడని అతని విద్యాభ్యాసం సూచిస్తుంది.

బహుశ, ఆయనకు 13 సంవత్సరాలు కూడా రాకముందే సౌలు ఇంటినుంచి దాదాపు 840 కిలోమీటర్ల దూరంలో అంటే యెరూషలేములో ఉండి తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. పరిసయ్యుల సంప్రదాయంలో పేరుగాంచినవాడూ ఉన్నతంగా ఎంచబడిన బోధకుడూ అయిన గమలీయేలు పాదములయొద్ద ఆయన విద్యనభ్యసించాడు. (అపొస్తలుల కార్యములు 22:3; 23:6) ఈ రోజుల్లోని యూనివర్సిటీ విద్యతో సమానమైన ఆ చదువులు, యూదామతంలో ప్రముఖస్థానాన్ని పొందడానికి అవకాశాన్ని ఇచ్చేవి.a

సామర్థ్యాలను చక్కగా ఉపయోగించుకోవడం

గ్రీకు చరిత్ర ఉన్న రోమా పట్టణంలో యూదుల కుటుంబంలో పుట్టడం వల్ల సౌలు మూడు వర్గాలకు చెందినవాడయ్యాడు. ‘అందరికి అన్నివిధముల వాడయ్యేందుకు’ వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ భాషలకు చెందిన నేపథ్యం నిస్సందేహంగా ఆయనకు సహాయపడింది. (1 కొరింథీయులు 9:19-23) ఆయనకున్న రోమా పౌరసత్వం ఆయన తన పరిచర్యను చట్టబద్ధంగా పరిరక్షించడానికీ, రోమా సామ్రాజ్యంలోని ఉన్నత అధికారుల సమక్షంలోకి సువార్తను తీసుకొని వెళ్ళడానికీ ఆయనకు అవకాశాన్ని ఇచ్చింది. (అపొస్తలుల కార్యములు 16:37-40; 25:11, 12) “నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు. ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని” అననీయతో చెప్పిన పునరుత్థానుడైన యేసుకు సౌలు నేపథ్యం గురించి, విద్య గురించి, వ్యక్తిత్వం గురించి తెలుసు. (అపొస్తలుల కార్యములు 9:13-16) సరియైన మార్గనిర్దేశనం ఇవ్వబడినప్పుడు సౌలుకున్న ఆసక్తి రాజ్య సందేశాన్ని సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చేసేందుకు మంచి ఉపకరణంగా పనిచేసింది.

యేసు సౌలును ప్రత్యేకమైన పనికోసం ఎన్నుకోవడం క్రైస్తవ చరిత్రలో విశేషమైన సంఘటన. అయినా, రాజ్యసువార్తను వ్యాప్తి చేయడంలో ప్రభావవంతంగా ఉపయోగించగల వ్యక్తిగత సామర్థ్యాలు, లక్షణాలు ప్రస్తుతకాలంలోని క్రైస్తవులందరికీ ఉన్నాయి. తన నుండి యేసు ఏమి ఆశిస్తున్నాడో సౌలు అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఇక వెనుదీయలేదు. రాజ్యాసక్తులను పెంపొందింపజేయడానికి ఆయన తాను చేయగలిగినదంతా చేశాడు. మీరూ అలాగే చేస్తున్నారా?

[అధస్సూచీలు]

a సౌలు గమలీయేలు దగ్గర ఏ విద్యను పొందుంటాడు, ఎలాంటి విద్యను పొందుంటాడు అన్నదాని గురించి కావలికోట, జూలై 15, 1996, 26-9 పేజీలను చూడండి.

[30వ పేజీలోని బాక్సు]

రోమా పౌరసత్వ నమోదు, ధ్రువీకరణ

రోమా పౌరుల చట్టబద్ధమైన పిల్లలను నమోదు చేయడానికి అగస్టస్‌ రెండు శాసనాలను ప్రవేశపెట్టాడు, ఆయన ప్రవేశపెట్టిన శాసనాలు ఒకటి సా.శ 4లోనూ, మరొకటి సా.శ 9లోను అమలులోకి వచ్చాయి. పుట్టిన 30 రోజుల్లోపే నమోదు చేయించాలి. రోమా గవర్నరు పాలనక్రింద ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక కుటుంబం తమకు కేటాయించబడిన పబ్లిక్‌-రికార్డ్‌ ఆఫీస్‌లో న్యాయపాలనాధికారి ఎదుట, ఈ పిల్లవాడు చట్టబద్ధంగా తమకు పుట్టినవాడే గనుక వాడికి రోమా పౌరసత్వం ఉంది అని చెప్పాలి. తల్లిదండ్రుల పేర్లు, పిల్లల పేర్లు అలాగే వారు ఆడా మగా అన్నది, వారి పుట్టిన తేదీ కూడా నమోదు చేయబడేవి. ఈ చట్టాలన్నిటినీ ప్రవేశపెట్టడానికి ముందే అన్ని రోమా మునిసిపాలిటిల్లోనూ, కాలనీలలోనూ, ప్రీఫెక్ట్‌ పరిపాలన క్రిందనున్న జిల్లాలలోనూ ఉన్న పౌరులను నమోదుచేయడం జనాభా లెక్కల సేకరణ ద్వారా ప్రతీ అయిదు సంవత్సరాలకు ఒకసారి పునర్నవీకరించబడేది.

అలా సంకలనం చేసిన వాటిని తగిన విధంగా జాగ్రత్త పెట్టేవారు, ఆ విధంగా జాగ్రత్త చేయబడిన వివరాలు ఒకరి హోదాను తెలియజేయగలవు. ధ్రువీకరించబడిన అలాంటి వివరాల ప్రతులు కావాలంటే వాటిని, మడవడానికి వీలయ్యే చిన్న చెక్క పలక మీద వ్రాసిచ్చేవారు. పౌలు తనకు రోమా పౌరసత్వం ఉందని చెప్పినప్పుడు దానిని ధ్రువపర్చడానికి ఆయన ఆ విధమైన పత్రాలను చూపించగల్గివుండేవాడన్నది కొంతమంది పండితుల అభిప్రాయం. (అపొస్తలుల కార్యములు 16:37; 22:25-29; 25:11) రోమా పౌరసత్వం ఉందంటే, అది ఇంచుమించు “పవిత్ర లక్షణం” ఉన్నట్లు దృష్టించబడేది గనుకా, అది ఒక వ్యక్తికి అనేక ఆధిక్యతలను ఇచ్చేది గనుకా, అలాంటి పత్రాల నకిలీలను తయారుచేయడం అత్యంత గంభీరమైన అపరాధం. ఒక వ్యక్తి తన హోదాను తప్పుగా కల్పించి చెప్పడం మరణశిక్ష విధించబడేంత తప్పు.

[క్రెడిట్‌ లైను]

Historic Costume in Pictures/Dover Publications, Inc., New York

[31వ పేజీలోని బాక్సు]

సౌలుకున్న రోమా పేరు

రోమా పౌరుడైన ప్రతీ పురుషునికీ అతని పేరులో కనీసం మూడు భాగాలు ఉంటాయి. ఆయనకు ఒక మొదటి పేరు, ఒక కుటుంబ పేరు, (అది అతని తెగతో లేక జెన్స్‌తో సంబంధం కల్గివుండేది), ఒక అదనపు పేరు ఉండేవి. ప్రసిద్ధమైన ఒక ఉదహరణ గాయస్‌ జూలియస్‌ సీజర్‌. బైబిలు పూర్తి రోమా పేరులను ఇవ్వడం లేదు, గాని లౌకిక గ్రంథాలు అగ్రిప్ప పూర్తి పేరును మార్కస్‌ జూలియస్‌ అగ్రిప్ప అని చెబుతున్నాయి. గల్లియోను పూర్తి పేరు లూక్యస్‌ జూనియస్‌ గల్లియో. (అపొస్తలుల కార్యములు 18:12; 25:13) ఒక వ్యక్తికుండే మూడు పేర్లలో చివరి రెండు పేర్లు ఇవ్వబడిన లేఖనాలలోని ఉదహరణలు, పొంతి పిలాతు (నాణెం క్రింద ఇవ్వబడింది) సెర్గి పౌలు, క్లౌదియ లూసియా, పోర్కియు ఫేస్తు.—అపొస్తలుల కార్యములు 4:27; 13:7; 23:26; 24:27.

పౌలస్‌ అనేది సౌలుకున్న మొదటిపేరా లేక అదనపు పేరా అన్నది కచ్చితంగా నిర్ణయించడం సాధ్యంకాదు. ఒక వ్యక్తికి అదనంగా మరోపేరును పెట్టడం కూడా అసాధారణమేమీకాదు, కుటుంబంలోని వారు, పరిచయస్థులు సాధారణంగా ఆ పేరుతో అతనిని సంబోధించడం జరిగేది. అంతేగాక, రోమా పేరు కాని సౌలు అనే పేరును ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. “[సౌలు] అన్నది రోమా పేరుగా ఎన్నడూ సరిపోదు గానీ ఒక రోమా పౌరునికి నామాంతరంగా ఇవ్వబడే స్థానిక పేరుగా అయితే పెట్టబడే అవకాశం ఉంది” అని ఒక పండితుడు తెలియజేస్తున్నాడు. అనేక భాషలు ఉపయోగంలోవున్న ప్రాంతాల్లో, ఒకవ్యక్తి తన పేర్లలో ఏ పేరును ఉపయోగించడానికి ఎంపిక చేసుకోవాలనేది పరిస్థితి నిర్ణయించేది కావచ్చు.

[క్రెడిట్‌ లైను]

Photograph by Israel Museum, ©Israel Antiquities Authority

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి