క్రైస్తవ సంఘం—బలపర్చే సహాయానికి మూలం
పోపీ అనే పేరుగల యువతికి దాదాపు ఇరవై ఏళ్లుంటాయి. తన తల్లిదండ్రులతో మనసువిప్పి మాట్లాడుకునే అవకాశం లేనందువల్ల ఇంట్లో ఏర్పడిన ఒక బాధాకరమైన పరిస్థితిని బట్టి ఆమె ఎంతో వ్యధకు గురైంది.a తన భావాలను ఒక క్రైస్తవ పెద్దతోనూ ఆయన భార్యతోనూ చెప్పుకున్న తర్వాత, ఆమె వారికిలా వ్రాసింది: “నాతో మాట్లాడడానికి సమయం తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. మీరు నా పట్ల శ్రద్ధ తీసుకోవడమన్నది నాకు ఎంత ప్రాముఖ్యమైన విషయమో మీరూహించలేరు. నేను నమ్మగల, నా భావాలను పంచుకోగల ప్రజలను నాకిచ్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు తెల్పుతున్నాను.”
యౌవనస్థులైన ఇద్దరు పిల్లలున్న, ఇటీవలనే భర్తను కోల్పోయిన టూలా కలవరపర్చే మానసిక, ఆర్థిక సమస్యల ఊబిలో చిక్కుకుపోయింది. సంఘంలోని ఒక క్రైస్తవ జంట ఆమెను ఆమె పిల్లలను క్రమంగా సందర్శించి బలపర్చేవారు. ఆమె తన పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కొన్న తర్వాత, ఆమె ఇలా వారికొక కార్డు పంపింది: “నా ప్రార్థనల్లో మిమ్మల్నెప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. మీరు నా ప్రక్కన నిలిచి, నాకు మద్దతునిచ్చిన అనేకానేక సమయాలను నేను జ్ఞాపకం చేసుకుంటాను.”
మీరు కొన్నిసార్లు, అధికమౌతున్న ఈ ప్రపంచపు ఒత్తిళ్ల మూలంగా మీపై ‘భారము మోపబడినట్లు’ భావిస్తారా? (మత్తయి 11:28) ‘కాలవశముచేతనూ అనూహ్యంగానూ’ జరిగే సంఘటనలు మీ జీవితాన్ని బాధాకరమైన అనుభవాలతో నింపేశాయా? (ప్రసంగి 9:11, NW) అలాగైతే వాటికి గురయ్యేది మీరు ఒక్కరే కాదు. అయితే దుఃఖితులైన వేలాదిమంది ఇప్పటికే కనుగొన్నట్లుగా మీరు కూడా యెహోవాసాక్షుల క్రైస్తవ సంఘంలో అర్థవంతమైన సహాయాన్ని కనుగొనవచ్చు. సా.శ. మొదటి శతాబ్దంలో, కొంతమంది తోటి విశ్వాసులు తనకు ప్రత్యేకంగా “ఆదరణ” కలిగించేవారిగా ఉన్నట్లు అపొస్తలుడైన పౌలు కనుగొన్నాడు. (కొలొస్సయులు 4:10, 11) మీరు కూడా అలాంటి అనుభవాన్నే పొందవచ్చు.
మద్దతు, సహాయం
క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో, “సంఘం” అనే పదం ఎక్లీసియా అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది, ఒక గుంపు ప్రజలను ఒక దగ్గర సమావేశపర్చడం అనే భావం దానికి ఉంది. ఏకీభావం, పరస్పర సహకారం అనే తలంపులు ఆ పదంలో నిక్షిప్తంగా ఉన్నాయి.
క్రైస్తవ సంఘం దేవుని వాక్య సత్యాన్ని ఉన్నతపర్చి, ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తుంది. (1 తిమోతి 3:15; 1 పేతురు 2:9) అయితే, సంఘం ఆధ్యాత్మిక మద్దతునూ, దానితో సహవసించే వారికి సహాయాన్నీ కూడా అందజేస్తుంది. అక్కడ ఒకరు, ఒత్తిడి సమయాల్లో ఇతరులకు సహాయం చేయడానికీ ఓదార్పునివ్వడానికీ సిద్ధంగావున్న, సుముఖంగావున్న ప్రేమగల, బాగోగులను చూసుకునే, శ్రద్ధగల స్నేహితుల గుంపును కనుగొనవచ్చు.—2 కొరింథీయులు 7:5-7.
యెహోవా ఆరాధకులు ఆయన సంఘంలో ఎల్లప్పుడూ భద్రతనూ, సురక్షితభావాన్నీ కనుగొన్నారు. దేవుని సమాజం మధ్య తాను ఆనందాన్నీ, సురక్షితంగా ఉన్నానన్న భావాన్నీ అనుభవించినట్లు కీర్తన గ్రంథకర్త సూచించాడు. (కీర్తన 27:4, 5; 55:14; 122:1) అలాగే నేడు, ఒకరినొకరు బలపర్చుకునే, ప్రోత్సహించుకునే తోటి విశ్వాసుల సహచర్యమే క్రైస్తవ సంఘం.—సామెతలు 13:20; రోమీయులు 1:11, 12.
“అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయ[డం]” సంఘంలోని సభ్యులకు నేర్పించబడింది. (గలతీయులు 6:10) తాము పొందిన బైబిలు ఆధారిత విద్య, తాము ఒకరిపట్ల ఒకరు సహోదర ప్రేమను, వాత్సల్యాభిమానాలను చూపించుకోవడానికి వారిని కదిలిస్తుంది. (రోమీయులు 12:10; 1 పేతురు 3:8) సంఘంలోని ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు దయగలవారిగా, శాంతికాముకులుగా, వాత్సల్య కనికరాలుగల వారిగా ఉండడానికి కదిలింపబడతారు. (ఎఫెసీయులు 4:3) కేవలం లాంఛనప్రాయమైన ఆరాధకులుగా ఉండే బదులు, వాళ్లు ఇతరుల పట్ల ప్రేమపూర్వకమైన శ్రద్ధను కనబరుస్తారు.—యాకోబు 1:27.
కాబట్టి, నలిగినవారు సంఘంలో కుటుంబ వాతావరణం వంటి స్నేహపూరితమైన వాతావరణాన్ని కనుగొంటారు. (మార్కు 10:29, 30) సన్నిహితంగా అల్లబడిన, ప్రేమపూర్వకమైన గుంపుకు చెందిన వారమనే భావం వారిని బలపరుస్తుంది. (కీర్తన 133:1-3) ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ సంఘం ద్వారా బలవర్ధకమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని “తగినవేళ” అందజేస్తాడు.—మత్తయి 24:45.
ప్రేమగల పైవిచారణకర్తల నుండి సహాయం
ఆధ్యాత్మిక మద్దతును, ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రేమగల, అర్థంచేసుకునే, అర్హులైన కాపరులను క్రైస్తవ సంఘంలో కనుగొనవచ్చునని దాని సభ్యులు ఎదురుచూడవచ్చు. అలాంటి లక్షణాలుగల కాపరులు “గాలికి మరుగైనచోటు [వంటివారు] గాలివానకు చాటైన చోటు [వంటివారు.]” (యెషయా 32:1, 2) ఆత్మచే నియుక్తులైన పెద్దలు లేక పైవిచారణకర్తలు, దేవుని గొఱ్ఱెలవంటి ప్రజల పట్ల శ్రద్ధ తీసుకుంటారు, రోగులను దుఃఖితులను ప్రోత్సహిస్తారు, తప్పు చేసినవారిని సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు.—కీర్తన 100:3; 1 పేతురు 5:2, 3.
అయితే, తోటి విశ్వాసులు ఎదుర్కొనే శారీరక లేక మానసిక ఆరోగ్య సమస్యలను స్వస్థపర్చడానికి సంఘంలోని పెద్దలు వృత్తిపరంగా చికిత్స చేసేవారో లేక వైద్యులో కాదు. ఈ లోకవిధానంలో, రోగాలకు ఇప్పటికీ ‘వైద్యుడవసరమే.’ (లూకా 5:31) అయినప్పటికీ, అలాంటి కాపరులు ఆధ్యాత్మికంగా అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయగలరు. (యాకోబు 5:14, 15) సాధ్యమైనప్పుడు పెద్దలు ఇతర సహాయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు.—యాకోబు 2:15, 16.
అలాంటి ప్రేమపూర్వక ఏర్పాటు వెనుక ఎవరున్నారు? యెహోవా దేవుడే! యెహోవా ఇలా చెప్తున్నట్లు ప్రవక్తయైన యెహెజ్కేలు తెలియజేస్తున్నాడు: “నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును. . . . నేను నా గొఱ్ఱెలను వెదకి . . . ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి . . . నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును.” దుర్భలమైన, బలహీనమైన గొఱ్ఱెల పట్ల కూడా దేవుడు శ్రద్ధ కల్గివున్నాడు.—యెహెజ్కేలు 34:11, 12, 15, 16.
సరైన సమయంలో నిజమైన సహాయం
క్రైస్తవ సంఘంలో నిజమైన సహాయం వాస్తవంగా అందుబాటులో ఉందా? ఉంటుంది, ఈ క్రింద ఇవ్వబడిన ఉదాహరణలు, సంఘం సహాయకరంగా ఉన్నట్లు నిరూపించబడిన వివిధ పరిస్థితులను చూపిస్తాయి.
◆ ప్రియమైనవారి మరణం. అన్నా భర్త తీవ్రమైన అనారోగ్యానికి గురై మరణించాడు. “అప్పటి నుండి నేను క్రైస్తవ సహోదరుల నుండి వాత్సల్యపూరితమైన ప్రేమను పొందుతూనే ఉన్నాను” అని ఆమె చెప్తుంది. “నా తోటి విశ్వాసుల మద్దతు ప్రోత్సాహాల దయగల మాటలు, హృదయపూర్వకమైన ఆలింగనాలు నా హృదయం పగిలిపోకుండా స్పందిస్తూ ఉండేలా చేశాయి, నేను యెహోవాకు కృతజ్ఞతలు తెల్పుతున్నాను. వాళ్ల ప్రేమ నేను గొప్ప మద్దతు లభించినట్లు భావించేలా, చివరికి ప్రోత్సహించబడినట్లు భావించేలా, శ్రద్ధవహించబడినట్లు భావించేలా చేశాయి.” మీరు కూడా మీకు ప్రియమైన వారిని మరణమందు కోల్పోయి అలాంటి వేదనాభరితమైన స్థితిని అనుభవించి ఉండవచ్చు. అలాంటి సమయాల్లో, సంఘ సభ్యులు ఎంతో అవసరమైన ఓదార్పును, మానసికపరమైన మద్దతును అందజేయవచ్చు.
◆ అనారోగ్యం. పోలాండ్‌లోని ఒక ప్రయాణ పైవిచారణకర్త అయిన ఆర్థర్ మధ్య ఆసియాలోని సంఘాలను ఆధ్యాత్మికంగా బలపర్చడానికి వాటిని క్రమంగా సందర్శించేవాడు. అలాంటి ఒక సందర్శన సమయంలో, ఆయన తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు, ఆయన కోలుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. “[కాఝాఖస్తాన్‌లోని ఒక నగరంలోని] సహోదరసహోదరీలు నా పట్ల ఎలా శ్రద్ధ తీసుకున్నారో మీకు చెప్పాలనుకుంటున్నాను” అని ఆర్థర్ ఎంతో మెప్పుతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. “నాకు తెలియని ఎంతోమంది సహోదరసహోదరీలు, చివరికి ఆసక్తిగలవారు, డబ్బు, ఆహారపదార్థాలు, మందులు తీసుకువచ్చారు. . . . అదీ వాళ్లు ఎంతో ఆనందంగా అలా తెచ్చారు.
“కొంత డబ్బు, ఈ క్రింది ఉత్తరం ఉన్న కవరు అందుకున్నప్పుడు నా భావాలు ఎలా ఉండివుంటాయో ఊహించండి: ‘ప్రియమైన సహోదరునికి, మీకు నా నమస్కారాలు. ఐస్‌క్రీమ్ కొనుక్కోమని అమ్మ నాకీ డబ్బిచ్చింది, కానీ మీ మందుల కోసం నేను ఈ డబ్బు మీకివ్వాలనుకుంటున్నాను. దయచేసి త్వరగా కోలుకోండి. మనం యెహోవాకు ఎంతోకాలంపాటు అవసరం. శుభాకాంక్షలు. మాకు ఇంకా కొన్ని మంచి, ఉపదేశాత్మకమైన కథలు చెప్పండి. వోవా.’” అవును, ఈ ఉదంతంలో చూపబడినట్లుగా, సంఘంలోని పిన్నలు పెద్దలు అనారోగ్యం సమయంలో బలపర్చే సహాయాన్ని అందజేయవచ్చు.—ఫిలిప్పీయులు 2:25-29.
◆ కృంగుదల. పయినీరుగా లేక పూర్తికాల రాజ్య ప్రచారకురాలిగా సేవ చేయాలని టెరీ హృదయపూర్వకంగా కోరుకునేది. అయితే కష్టాల మూలంగా ఆమె పయినీరు సేవను ఆపవలసి వచ్చింది. నేను ఆ విధంగా సేవచేయాలనుకున్నాను కానీ కనీసం సంవత్సరమైనా చేయలేక పోయినందుకు నాకెంతో అపరాధ భావం కలిగింది,” అని ఆమె చెప్తోంది. తాను యెహోవాకు చేసే సేవ యొక్క పరిమాణం మీదనే ఆయన ఆమోదం ఆధారపడి ఉంటుందని టెరీ పొరపాటుగా తలంచింది. (మార్కు 12:41-44 పోల్చి భేదాన్ని చూడండి.) ఎంతో కృంగిపోయి ఆమె తనను తాను అందరి నుండి దూరం చేసుకుంది. అయితే అప్పుడు సంఘం నుండి సేదదీర్పునిచ్చే సహాయం వచ్చింది.
టెరీ ఇలా చెప్తుంది: “ఒక పెద్దవయస్కురాలైన పయినీరు సహోదరి నాకు సహాయం చేయడానికి వచ్చింది, నేను నా భావాలను ఆమె ఎదుట కుమ్మరిస్తుండగా ఆమె విన్నది. నేను ఆమె ఇంటినుండి బయలుదేరే సమయానికి నాపై నుండి పెద్ద భారం తీసివేయబడినట్లు భావించాను. అప్పటి నుండి, ఈ పయినీరు సహోదరీ, సంఘంలో పెద్ద అయిన ఆమె భర్తా నాకు విలువైన సహాయాన్ని అందించారు. నేను ఎలా ఉన్నానో కనుక్కోవడానికి వాళ్లు ప్రతి రోజు నాకు ఫోన్ చేసేవారు. . . . కొన్నిసార్లు వాళ్ల కుటుంబ పఠనంలో నన్నూ కూర్చోమనేవారు, కుటుంబాల మధ్య సన్నిహిత బంధం ఉండటం యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసివచ్చింది.”
ఎంతో మంది, చివరికి సమర్పిత క్రైస్తవులు కూడా కృంగిపోవడం, నిరుత్సాహపడటం, ఒంటరితనాన్ని అనుభవించడం అసాధారణమేమీ కాదు. దేవుని సంఘంలో ప్రేమపూర్వకమైన, నిస్వార్థమైన సహాయం అందుబాటులో ఉన్నందున మనం ఎంత కృతజ్ఞత కలిగివుండవచ్చు!—1 థెస్సలొనీకయులు 5:14.
◆ విపత్తులు, దుర్ఘటనలు. తమ ఇల్లు కాలిపోయినప్పుడు తమకున్నవన్నీ కోల్పోయిన నలుగురు వ్యక్తులతో కూడిన కుటుంబం స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. “మమ్మల్ని ఎప్పటికీ కదిలించివేసే, యెహోవా ప్రజల మధ్యనున్న నిజమైన ప్రేమను మాపై ముద్రించిన ప్రోత్సాహకరమైన అనుభవం” అని వాళ్లు చెప్తున్న అనుభవం వాళ్లకు ఎదురైంది. వాళ్లిలా వివరిస్తున్నారు: “దాదాపు వెంటనే, మా ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు తమ మద్దతునూ శ్రద్ధనూ తెలియజేసే ఫోన్ కాల్స్‌తో మమ్మల్ని ముంచెత్తేశారు. ఫోను అలా మ్రోగుతునే ఉంది. ప్రతి ఒక్కరూ చూపిస్తున్న నిజమైన శ్రద్ధ, ప్రేమ ఎంత కదిలించేవిగా ఉన్నాయంటే, కృతజ్ఞతాభావంతో మా కళ్లు చెమర్చాయి.”
కొంతకాలానికే, సహోదరుల ఒక పెద్ద గుంపును సంఘపెద్దలు ఏర్పాటు చేశారు, కొద్దిరోజుల్లో వాళ్లు ఈ కుటుంబం కోసం క్రొత్త ఇంటిని నిర్మించారు. పొరుగింటి స్త్రీ ఒకామె ఇలా అన్నది: “మీరు దాన్ని చూడాల్సిందే! అక్కడ అన్ని రకాల ప్రజలూ అంటే పురుషులు, స్త్రీలు, నల్లవారు, హిస్పానిక్‌లు పనిచేస్తున్నారు!” ఇది నిజంగా సహోదర ప్రేమకు స్పష్టమైన నిదర్శనం.—యోహాను 13:35.
తోటి క్రైస్తవులు ఆ కుటుంబానికి వస్త్రాలు, ఆహారం, డబ్బు కూడా ఇచ్చారు. ఆ తండ్రి ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “అది, అందరూ బహుమానాలు ఇచ్చుకునే క్రిస్మస్ సమయంలో జరిగింది, కాని మేము అనుభవించినంత నిజమైన, అత్యధికమైన ఉదారతను మరెవ్వరూ అనుభవించి ఉండరని మేము నమ్మకంగా చెప్పగలం.” వాళ్లింకా ఇలా చెప్పారు: “అగ్ని ప్రమాద జ్ఞాపకాలు మెల్లిగా గతంలోకి జారిపోతున్నాయి, వాటి స్థానాన్ని దయగల చర్యల, మంచి స్నేహితుల ఆనందభరితమైన జ్ఞాపకాలు ఆక్రమించుకుంటున్నాయి. అలాంటి అద్భుతమైన, ఐక్యమైన సహోదర కుటుంబాన్ని ఈ భూమిపైన ఉంచినందుకు మేము ప్రేమగల పరలోక తండ్రియైన యెహోవాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము, ఆ కుటుంబంలో భాగమైనందుకు మేమెంతో కృతజ్ఞులం!”
అయితే, జరిగే ప్రతి దుర్ఘటన సమయంలోనూ అలా జోక్యం చేసుకోవడం సాధ్యంకాకపోవచ్చు, లేదా జోక్యం చేసుకోవాలనీ ఎదురు చూడబడటం లేదు. కానీ సంఘం అందజేయగల మద్దతును ఈ సంఘటన కచ్చితంగా ఉదహరిస్తుంది.
పైనుండి జ్ఞానం
క్రైస్తవ సంఘంలో అనేకులు సహాయాన్నీ, బలాన్నీ ఇచ్చే మరో రకమైన మూలాన్నీ కనుగొన్నారు. అదేమిటి? ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు’ సిద్ధం చేసే ప్రచురణలు. వాటిలో ప్రముఖమైనవి కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు. అంతర్దృష్టితో కూడిన ఉపదేశాన్నీ, ఆచరణాత్మకమైన ఉపదేశాన్నీ అందజేయడానికి ఈ ప్రచురణలు ప్రాథమికంగా బైబిలునందున్న దైవిక జ్ఞానంపై ఆధారపడతాయి. (కీర్తన 119:105) మానసిక కృంగుదల, అత్యాచారం నుండి కోలుకోవడం, వివిధ సామాజిక ఆర్థిక సమస్యలు, యౌవనస్థులు ఎదుర్కొనే సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన కష్టాలు వంటి అంశాలపై చేసిన బాధ్యతాయుతమైన, అధికారపూర్వకమైన పరిశోధనకు లేఖనాధార సమాచారం జత చేయబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ ప్రచురణలు దేవుని మార్గాన్ని జీవితంలో సర్వశ్రేష్ఠమైన మార్గంగా ఉన్నతపరుస్తాయి.—యెషయా 30:20, 21.
ప్రతి సంవత్సరం వాచ్ టవర్ సంస్థ వేలాది ప్రశంసాపూర్వకమైన ఉత్తరాలను అందుకుంటుంది. ఉదాహరణకు, ఆత్మహత్యలపై వ్రాయబడిన ఒక తేజరిల్లు! శీర్షిక గురించి రష్యాలోని ఒక యువకుడు ఇలా వ్రాశాడు: “కృంగుదల మూలంగా, . . . నేను చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా సమస్యలను పరిష్కరించుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడన్న నా నమ్మకాన్ని ఈ శీర్షిక బలపర్చింది. నేను జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ శీర్షిక ద్వారా ఆయనిచ్చిన మద్దతును బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు తెల్పుతున్నాను.”
ఈ ప్రపంచంలోని కష్టాలు మరీ భరించలేనంత దుర్భరమైనవిగా ఉంటే, క్రైస్తవ సంఘంలో సురక్షితమైన ఆశ్రయస్థానం ఉందని మీరు నిశ్చయత కలిగివుండవచ్చు. వాస్తవానికి, ప్రేమరహిత విధానపు ఈ నిస్సార ఎడారి మీ శక్తిని పీల్చేస్తుంటే, యెహోవా సంస్థలో మీరు నూతన శక్తినిచ్చే ఒయాసిస్‌ను కనుగొనవచ్చు. తన భర్త అనుభవించిన తీవ్రమైన అనారోగ్యంతో విజయవంతంగా వ్యవహరించిన ఒక క్రైస్తవ స్త్రీ వ్యక్తపర్చిన ఈ భావాలనే, అలాంటి మద్దతును పొందిన తర్వాత మీరూ ప్రతిధ్వనింపజేయవచ్చు: “మా పట్ల చూపబడిన ప్రేమా శ్రద్ధలను బట్టి, ఈ కష్టాల కాలంలో యెహోవా మమ్మల్ని తన అరచేతుల్లో పెట్టుకుని కాపాడినట్లు నేను భావిస్తున్నాను. యెహోవా అద్భుతమైన సంస్థలో భాగమై ఉండడానికి ఎంతో కృతజ్ఞురాలినై ఉన్నాను!”
[అధస్సూచీలు]
a పేర్లు మార్చబడ్డాయి.
[26వ పేజీలోని చిత్రాలు]
మనం రోగులకూ, దుఃఖితులకూ, ఇతరులకూ బలపర్చే సహాయాన్ని అందజేయవచ్చు