సీల—ప్రోత్సాహానికి మూలం
క్రైస్తవ చరిత్ర తొలినాళ్ల నుండి, దేవుని ప్రజల సంఘాలను ప్రోత్సహించడంలోనూ, భూదిగంతాల వరకు సువార్తను వ్యాపింపజేయడంలోనూ నమ్మకమైన ప్రయాణ పైవిచారణకర్తల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. పైవిచారణకర్తలుగా నియమించబడిన మొట్టమొదటివారిలో సీల ఒకరు, ఆయన ఒక ప్రవక్త, యెరూషలేము సంఘంలో ప్రముఖ సభ్యుడు. ప్రకటనాపని యొక్క ప్రాముఖ్యమైన పురోగమనాలలో ఆయన ప్రధాన పాత్ర వహించాడు, ఐరోపా ప్రాంతానికి సువార్తను ప్రకటించిన తొలి మిషనరీల్లో ఆయన ఒకరు. ఇదంతా చేయడానికి సీలను ప్రాముఖ్యంగా అర్హుణ్ని చేసినదేమిటి? ఆయన వ్యక్తిత్వంలోని ఏ లక్షణాలను మనం అనుకరించడం మంచిది?
సున్నతికి సంబంధించిన వివాదాంశం
దాదాపు సా.శ. 49లో సున్నతికి సంబంధించిన, అభిప్రాయభేదాల మూలంగా అనైక్యతను సృష్టించే ప్రశ్న తలెత్తినప్పుడు యెరూషలేములోవున్న పరిపాలక సభ, ఆ వివాదాంశాన్ని పరిష్కరించేందుకు స్పష్టమైన నిర్దేశాన్ని క్రైస్తవులకు తెలియజేయవలసిన అవసరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో, సిల్వాను అని కూడా పిలువబడే సీల ఆ బైబిలు వృత్తాంతంలో కనిపిస్తాడు. తమ నిర్ణయాన్ని ‘అంతియొకయ, సిరియ, కిలికియలలో ఉన్న సహోదరులకు’ తెలియజేయడానికి ‘అపొస్తలుల మరియు పెద్దల’ ప్రతినిధిగా ఎంపిక చేయబడిన ఈయన, నిర్ణయాలు తీసుకునేవారిలో ఒకరై కూడా ఉండవచ్చు. అంతియొకయలో, బర్నబా మరియు పౌలులతో కలిసి సీల మరియు యూదా (బర్సబ్బా) యెరూషలేము సమావేశంలో జరిగిన సంఘటనలను, అక్కడ తీసుకోబడిన నిర్ణయాలను, పత్రికలోని సమాచారాన్ని బహుశ నోటిమాట ద్వారా తెలియజేస్తూ తాము తీసుకువచ్చిన పత్రికను అందజేశారు. అంతేగాక వాళ్లు “పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.” ఫలితమేమిటంటే, అంతియొకయలోని క్రైస్తవులు “సంతోషించిరి.”—అపొస్తలుల కార్యములు 15:1-32.
అలా, ఆ ప్రాథమిక అంశాన్ని పరిష్కరించడంలో సీల ప్రముఖ పాత్ర వహించాడు. అయితే ఆయన నియామకం అంత సుళువైనదేమీ కాదు. తీసుకున్న నిర్ణయానికి అంతియొకయ సంఘం ఎలా ప్రతిస్పందిస్తుందన్నది తెలుసుకునే అవకాశం లేదు. కాబట్టి, “అపొస్తలులు తమ పత్రికలో వ్రాసినదాన్ని వివరించడానికి ఎంతో జ్ఞానము యుక్తి ఉన్నవారు అవసరమయ్యారు” అని ఒక వ్యాఖ్యానకర్త పేర్కొంటున్నాడు. ఈ సున్నితమైన నియామకం కోసం సీలను ఎంపిక చేయడం, ఆయన ఎలాంటి వాడై ఉండవచ్చుననేదాని గురించి మనకు కొంత తెలియజేస్తుంది. పరిపాలక సభ నిర్దేశాలకు నమ్మకంగా ప్రాతినిధ్యం వహిస్తాడని ఆయనపై పూర్తిగా భరోసా పెట్టుకోవచ్చు. ఈ సీల సంఘం వివాదాల ఉచ్చులో చిక్కుకున్నపుడు సమన్వయపర్చే ప్రభావాన్ని చూపించగల ప్రజ్ఞావంతుడైన పైవిచారణకర్తయై ఉండి ఉంటాడు కూడా.
పౌలుతో ప్రయాణం
ఆ ప్రయాణం తర్వాత సీల యెరూషలేముకు తిరిగివచ్చాడా లేదా అన్నది కచ్చితంగా తెలియదు. ఏదేమైనప్పటికీ, మార్కు అనే మారుపేరుగల యోహాను విషయంలో పౌలు బర్నబాల మధ్య విభేదం తలెత్తిన తర్వాత, పౌలు ఆ సమయంలో అంతియొకయలోనేవున్న సీలను ఎంపిక చేసుకుని తాను తన మొదటి మిషనరీ ప్రయాణంలో ప్రకటించిన నగరాలను తిరిగి దర్శించడానికి తొలుత ఏర్పాటు చేయబడిన క్రొత్త ప్రయాణంలో తనతో తీసుకువెళ్లాడు.—అపొస్తలుల కార్యములు 15:36-41.
ఆయన ఎంపిక అన్యులకు ప్రకటించే పనిపట్ల సీలకున్న అనుకూల దృక్పథం చేతా, సిరియ కిలికియలలోవున్న విశ్వాసులకు పరిపాలకసభ నిర్ణయాలను తెలియజేయడంలో ప్రవక్తగానూ, వారి వాగ్దూతగానూ ఆయనకున్న అధికారం చేతా ప్రభావితం చేయబడి ఉండవచ్చు. ఫలితాలు అద్భుతం. అపొస్తలుల కార్యములు ఇలా తెలియజేస్తుంది: “వారు ఆ యా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయంచిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.”—అపొస్తలుల కార్యములు 16:4, 5.
మిషనరీలు ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా, రెండుసార్లు పరిశుద్ధాత్మ వారు వెళ్లాలనుకున్న ప్రాంతానికి వెళ్లకుండా వారిని ఆటంకపర్చింది. (అపొస్తలుల కార్యములు 16:6, 7) తిమోతిని గురించి అనిర్దిష్టమైన “ప్రవచనము”లు చెప్పబడిన తర్వాత ఆయన లుస్త్రలో ఆ బృందాన్ని కలుసుకున్నాడు. (1 తిమోతి 1:18; 4:14) ప్రవచించే కృపావరాన్ని కూడా కల్గివున్న పౌలుకు ఇవ్వబడిన ఒక దర్శనం ద్వారా, ప్రయాణ సహవాసులను ఐరోపాలోని మాసిదోనియకు ఓడలో వెళ్లమని నిర్దేశించడం జరిగింది.—అపొస్తలుల కార్యములు 16:9, 10.
కొట్టబడి చెరసాలలో వేయబడ్డారు
‘ఆ ప్రాంతమునకు ముఖ్యపట్టణమైన’ ఫిలిప్పీలో సీల ఒక మరపురాని విషమ పరీక్షను ఎదుర్కొన్నాడు. పౌలు దయ్యము పట్టిన ఒక బాలిక నుండి దయ్యాన్ని వెళ్లగొట్టినప్పుడు తమకు వచ్చే రాబడి పోయిందని చూసి ఆ బాలిక యజమానులు సీల పౌలులను గ్రామపు చావడిలోని అధికారుల ఎదుటకి ఈడ్చుకెళ్లారు. ఫలితంగా, వాళ్లిద్దరూ తప్పు చేసినవారిగా ప్రజల ఎదుట నిలబెట్టబడి అవమానానికి గురై, తమ పైవస్త్రములు తీసివేయబడి, గ్రామపు చావిడిలో బెత్తములతో కొట్టబడ్డారు.—అపొస్తలుల కార్యములు 16:12, 16-22.
సహనం నశించిపోయేలా అలా బెత్తములతో కొట్టబడడం భయంకరమైన శిక్షే గాక పౌలు సీలల విషయంలో అది చట్టవిరుద్ధమైనది కూడా. ఎందుకు? రోమా చట్టం రోమా పౌరులైన వారెవర్నీ అలా కొట్టకూడదని నిర్దేశించింది. పౌలుకు రోమా పౌరసత్వం ఉంది, బహుశా సీలకు కూడా ఉండివుండవచ్చు. వారిని “చాల దెబ్బలు” కొట్టిన తర్వాత, పౌలు సీలలను చెరసాలలో వేసి, వాళ్ల కాళ్లకు బొండవేసి బిగించారు. బొండ అనేది “చాలా భయంకరమైన పరికరం. అది వేసినప్పుడు ఖైదీలు నిద్రపోకుండా ఉండేలా వాళ్ల రెండు కాళ్లను వీలైనంత ఎడంగా ఉంచుతారు” అని గుస్టాఫ్ స్టాలిన్ వివరిస్తున్నాడు. కొట్టిన దెబ్బలకు వాళ్ల శరీరాలపై బాధాకరమైన గాయాలున్నప్పటికీ, మధ్య రాత్రిలో, “పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి.”—అపొస్తలుల కార్యములు 16:23-25.
ఇది సీల వ్యక్తిత్వాన్ని గురించి మనకు మరో విషయం చెబుతుంది. తాము క్రీస్తు నామము నిమిత్తం బాధింపబడుతున్నందుకు గాను ఆయన ఆనందంగా ఉన్నాడు. (మత్తయి 5:11, 12; 24:9) తమ తోటి క్రైస్తవులు ఆనందించేలా చేస్తూ సంఘాన్ని ప్రోత్సహించడంలోనూ, బలపర్చడంలోనూ ప్రభావవంతంగా ఉండడానికి సీలకు ఆయన సహవాసులకు మునుపు అంతియొకయకు వెళ్లినప్పటి ప్రయాణంలో సహాయంచేసిన స్ఫూర్తి అదేనని స్పష్టమౌతుంది. భూకంపం మూలంగా తాము చెరసాల నుండి అద్భుతరీతిగా విడుదల చేయబడి, ఆత్మహత్య చేసుకోబోయిన చెరసాల నాయకుడూ అతని కుటుంబమూ దేవునియందు విశ్వాసముంచేలా వారికి సహాయపడినప్పుడు పౌలు సీలల ఆనందం అధికమై ఉండవచ్చు.—అపొస్తలుల కార్యములు 16:26-34.
బెత్తం దెబ్బలకు, చెరసాలకు పౌలు గాని సీల గాని భయపడలేదు. వారిని విడుదల చేయమని చెప్పినప్పుడు, న్యాయాధికారులు అనుకున్నట్లుగానే ఫిలిప్పీలోనుండి రహస్యంగా వెళ్లిపోవడానికి వాళ్లు నిరాకరించారు. వాళ్లు తమ నిర్ణయానికి కట్టుబడివుండి, అహంకారులూ నిర్హేతుకమైనవారూ అయిన అధికారుల పథకాలను తారుమారు చేసేశారు. “వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయంచి, యప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా?” అని ప్రశ్నిస్తూ, “మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని” పౌలు అన్నాడు. రాగల పరిణామాలకు భయపడి, వాళ్లనిద్దరిని ఆ పట్టణంలోనుండి వెళ్లిపోమని వేడుకోవలసిన బాధ్యత తమకుందని ఆ అధికారులు గ్రహించారు.—అపొస్తలుల కార్యములు 16:35-39.
రోమా పౌరులుగా తమకున్న హక్కులను అధికారుల మనస్సులపై ఆ విధంగా ముద్రింపజేసిన తర్వాత, పౌలు సీల అధికారుల కోరికను మన్నించారు అయితే తమ స్నేహితుల వద్ద సెలవు పుచ్చుకోకుండా మాత్రం కాదు. ఇప్పటికల్లా, మొత్తం ప్రకటనా ప్రయాణానికే ఒక చిహ్నంగా/గుర్తుగా తయారైనదానికి అనుగుణ్యంగా, సీల మరియు ఆయన సహచరుడు మళ్లీ ఒకసారి తమ సహోదరులను “ఆదరించి” అక్కడి నుండి వెళ్లిపోయారు.—అపొస్తలుల కార్యములు 16:40.
మాసిదోనియ నుండి బబులోనుకు
పౌలు, సీల, వారి సహచరులు, వేరే విధంగానైతే ప్రతికూలమైన అనుభవమై ఉండగల ఆ అనుభవాన్ని బట్టి ధైర్యాన్ని కోల్పోకుండా క్రొత్త మిషనరీ క్షేత్రాలకు తరలివెళ్లారు. థెస్సలొనీకయలో వాళ్లు మళ్లీ కష్టాలను ఎదుర్కొన్నారు. మూడు విశ్రాంతి దినాలుగా పౌలు తాను తన పరిచర్యలో పొందిన విజయం మూలంగా, అసూయ చెందిన వ్యతిరేకులు గలిబిలి రేపి, మిషనరీలు రాత్రికల్లా పట్టణాన్ని విడిచి వెళ్లేలా చేశారు. అలా చేయడం జ్ఞానయుక్తమైంది. మిషనరీలు బెరయకు వెళ్లారు. ఆ పట్టణంలో పౌలు మరియు ఆయన సహచరులు సాధించినవాటిని తెలుసుకుని, వ్యతిరేకులు థెస్సలొనీక నుండి అక్కడికి వచ్చారు. పౌలు ఒక్కడే తన ప్రయాణాన్ని కొనసాగించాడు, అయితే సీల, తిమోతి క్రొత్తగా ఆసక్తి కనబరుస్తున్న వారిని చూసుకోవడానికి బెరయలోనే ఉండిపోయారు. (అపొస్తలుల కార్యములు 17:1-15) సీల తిమోతి మంచివార్తనూ, మాసిదోనియలోని నమ్మకమైన స్నేహితుల నుండి బహుశ బహుమానాన్నీ తీసుకుని కొరింథుకు వెళ్లి అక్కడ పౌలును తిరిగి కలిశారు. అది, అవసరంలోవున్న అపొస్తలుడు తాను కొంతకాలం క్రితం చేపట్టిన లౌకిక పనిని మానివేసి పూర్తికాల ప్రకటనాపనిలో ప్రభావవంతంగా పాల్గొనడాన్ని సాధ్యం చేసివుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 18:1-5; 2 కొరింథీయులు 11:9) కొరింథులో, సీల మరియు తిమోతి కూడా సువార్తికులుగా, పౌలు సహచరులుగా పేర్కొనబడ్డారు. కాబట్టి వాళ్ల కార్యకలాపాలు ఆ పట్టణంలో సహితం మందగించలేదని స్పష్టమౌతుంది.—2 కొరింథీయులు 1:19.
థెస్సలొనీకయులకు వ్రాయబడిన రెండు పత్రికలలో—రెండూ ఈ సమయంలోనే కొరింథు నుండి వ్రాయబడ్డాయి—“మేము” అనే సర్వనామాన్ని ఉపయోగించడం, సీల మరియు తిమోతి ఇద్దరూ కూడా ఆ పత్రికలు వ్రాయడానికి సహాయం చేసివుంటారని చూపిస్తుంది. అయితే, సీల పత్రికలు వ్రాసే పనిలో నిమగ్నమైవుండేవాడనే తలంపు, పేతురు తన స్వంత పత్రికలలో ఒకదాని గురించి చెబుతున్న దాని మీద ప్రాథమికంగా ఆధారపడివుంది. తాను తన మొదటి పత్రికను ‘నమ్మకమైన సహోదరుడైన సిల్వాను చేత’ బబులోను నుండి వ్రాయించానని పేతురు చెబుతున్నాడు. (1 పేతురు 5:12, 13) సిల్వాను కేవలం దాన్ని తీసుకువెళ్లి ఉండవచ్చునన్నదే దాని భావం అయినప్పటికీ, పేతురు వ్రాసిన రెండు పత్రికల శైలిలో ఉన్న వైవిధ్యం, పేతురు మొదటి పత్రికను వ్రాయడానికి సీలను ఉపయోగించుకున్నాడు గానీ రెండవ పత్రికను వ్రాయడానికి ఆయనను ఉపయోగించుకోలేదని సూచించవచ్చు. కాబట్టి, సీలకున్న వివిధ నైపుణ్యాల్లో, దైవపరిపాలనా ఆధిక్యతల్లో బహుశ సెక్రటరీగా ఉండడం కూడా ఒకటై ఉండవచ్చు.
అనుకరించదగిన ఉదాహరణ
సీల చేశాడని మనకు తెలిసిన పనుల గురించి స్థూలంగా ఆలోచించినప్పుడు, ఆయన రికార్డు ఎంతో ప్రభావవంతంగా కనిపిస్తుంది. ఆధునిక-దిన మిషనరీలకూ, ప్రయాణ పైవిచారణకర్తలకూ ఆయన ఒక చక్కని మాదిరి. ఆయన తాను ఎంతో మూల్యాన్ని చెల్లించవలసి వచ్చినప్పటికీ, నిస్వార్థంగా ఎన్నో దూర ప్రయాణాలు చేశాడు, అయితే ఆయనలా చేసింది వస్తుసంబంధమైన ప్రయోజనం కోసమో లేక ప్రతిష్ఠ కోసమో కాదు గాని ఇతరులకు సహాయం చేయడానికే. జ్ఞానవంతమైన, యుక్తితోకూడిన ఉపదేశం ద్వారా, చక్కగా సిద్ధం చేయబడిన వాత్సల్యపూరితమైన ఉపన్యాసాల ద్వారా, అలాగే ప్రాంతీయ పరిచర్యలో తనకున్న ఆసక్తి ద్వారా వారిని ప్రోత్సహించాలన్నదే ఆయన లక్ష్యం. యెహోవా సంస్థీకృత ప్రజల్లో మీ పాత్ర ఏదైనప్పటికీ, మీరూ అలాగే కష్టసమయంలో కూడా అనుకూల దృక్పథాన్ని కల్గివుండడానికి కృషి చేస్తే బహుశ మీరు కూడా మీ తోటి విశ్వాసులకు ప్రోత్సాహానికి మూలంగా ఉండగల్గుతారు.
[29వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
పౌలు రెండవ మిషనరీ ప్రయాణం
మహా సముద్రము
అంతియొకయ
దెర్బె
లుస్త్ర
ఈకొనియ
త్రోయ
ఫిలిప్పీ
ఆంఫిపోలిస్
థెస్సలొనీకయ
బెరయ
ఏథెన్సు
కొరింథు
ఎఫెసు
యెరూషలేము
కైసరు
[క్రెడిట్ లైను]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.