క్రిస్మస్ క్రీస్తును కోల్పోయిందా?
“క్రిస్మస్ పండుగ సమయంలో జరిగే వేడుకలను నేను ఎన్నటికీ అంగీకరించను. అవి క్రీస్తు జీవితానికి, బోధలకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు నేను గమనించాను.”—మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ.
చాలామంది గాంధీ చెప్పిన మాటలతో ఏమాత్రం ఏకీభవించరు. ‘ఒక హిందూ నాయకుడికి ఒక క్రైస్తవ పండుగ దినాన్ని గూర్చి ఏమి తెలుసు?’ అని వారు అడుగుతారు. అయితే, క్రిస్మస్ ప్రపంచమంతటా వ్యాప్తి చెందడం వల్ల దీనికి అన్ని సంస్కృతుల ప్రజలు ప్రభావితం చెందారన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోవలసిందే. ప్రతి డిసెంబరులో ఈ పండుగ దినం అన్ని సంస్కృతుల్లో ఉన్నట్లు కన్పిస్తుంది.
ఉదాహరణకు, 14 కోట్ల, 50 లక్షలమంది ఆసియా ప్రజలు క్రిస్మస్ను జరుపుకుంటారు, ఇది ఒక దశాబ్దం క్రితం కంటే 4 కోట్లు ఎక్కువ. ‘వేడుకలు’ అనడంలో గాంధీ ఉద్దేశం ఆధునిక దిన క్రిస్మస్కి ఉన్న వ్యాపార కోణమే అయితే, అలాగే మనం చూస్తున్నట్లుగా వస్తువులను కూడగట్టుకోవాలనే ఆరాటమే అయితే, పండుగలో ప్రస్ఫుటంగా కన్పిస్తోంది అలాంటి వేడుకలేనన్నది కాదనలేని నిజం. “ఆసియా లోని క్రిస్మస్—హాంగ్‌కాంగ్‌లోని దీపకాంతుల నుండి, బీజింగ్‌లోని హోటల్ లాబీస్లో పెద్ద పెద్ద క్రిస్మస్ చెట్ల నుండి, సింగపూర్ డౌన్‌టౌన్‌లోని పశువుల తొట్టి వరకు—ప్రధానంగా అదొక పెద్ద లౌకిక (వ్యాపార) కార్యకలాపంగా మారిపోయింది” అని ఆసియావీక్ పత్రిక అంటుంది.
ఆధునిక దిన క్రిస్మస్ పండుగ క్రీస్తును కోల్పోయిందా? అధికారపూర్వకంగా, డిసెంబరు 25ను యేసు జన్మదినంగా రోమన్ కాథలిక్ చర్చి అమలు పరచినప్పటి నుండి, అంటే సా.శ. నాలుగవ శతాబ్దం నుండి క్రిస్మస్ ఆచరించబడుతోంది. కానీ అమెరికాలో ఇటీవల జరపబడిన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం, కేవలం 33 శాతం మంది ప్రజలు మాత్రమే క్రిస్మస్లో క్రీస్తు జననం అతి ప్రాముఖ్యమైన అంశమని భావిస్తున్నట్లు తేలింది.
మీరేమని భావిస్తున్నారు? విసుగును తెప్పించే వ్యాపార ప్రకటనలు, బహుమతులు కొనుగోలు చేయాలని తొందర పెట్టడం, క్రిస్మస్ చెట్లను అలంకరించడం, పార్టీలను ఏర్పాటు చేయడం, వాటికి హాజరు కావడం, గ్రీటింగు కార్డులను పంపించడం—ఇవన్నీ చూసినప్పుడు ఏదోవిధంగా యేసు విస్మరించబడినట్లు మీరు కొన్నిసార్లు భావించారా?
క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడని చూపాలంటే క్రీస్తు శిశువుగా ఉన్నటువంటి చిత్రాలను లేదా బొమ్మలను ప్రదర్శించడమే ఒక మార్గమని అనేకులు భావిస్తున్నట్లుగా కన్పిస్తుంది. పశువుల తొట్టిలోని శిశువును ఆయన చుట్టూ ఉన్న మరియ, యోసేపు, కొందరు గొర్రెల కాపరులు, “ముగ్గురు జ్ఞానులు,” లేదా “ముగ్గురు రాజులు,” పశువుల కొట్టంలో ఉండే కొన్ని పశువులు, ఇంకొంతమంది వీక్షకులు ఉన్న బొమ్మలను మీరు చూసే ఉంటారు. ఈ బొమ్మలు క్రిస్మస్ నిజ భావాన్ని ప్రజలకు జ్ఞాపకం చేసేందుకు పని చేస్తాయన్నది సాధారణ భావన. యు.ఎస్. కాథలిక్ పత్రిక ప్రకారం, “ఒక సువార్త ఇచ్చే సమాచారం కంటే, ఎంతో ఎక్కువ సమాచారాన్ని ఒక్క యేసు పుట్టిన పశువుల కొట్టం ఇవ్వగలదు. అయితే ఈ వృత్తాంతాలు చారిత్రకమైనవి కావని కూడా ఆ పశువుల కొట్టం నొక్కి చెబుతుంది.”
అయితే బైబిలులోని సువార్త వృత్తాంతాలు చారిత్రకమైనవి కావని ఒక పశువుల కొట్టం బొమ్మ ఎలా సూచించగలదు? క్రీస్తు జననాన్ని గూర్చిన ఆకర్షణీయమైన ఈ బొమ్మలు పుక్కిటి పురాణమన్న వాతావరణాన్ని లేదా కల్పిత కథలన్న వాతావరణాన్ని కల్పిస్తుందన్నది ఒప్పుకోవలసినదే. 13వ శతాబ్దంలో ఒక సన్యాసి ద్వారా పశువుల తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు బొమ్మ పరిచయం చేయబడి వ్యాప్తి చెందినప్పుడు అది చాలా నిరాడంబరంగా ఉండేది. కానీ ఈనాడు ఆ పండుగలో ఇతర విషయాలు కూడా జతచేయబడుతున్నాయి, ఇది ఒక పెద్ద వ్యాపారంగా తయారయ్యింది. ఇటలీలోని నేపుల్స్లో ప్రెజెపీ అని పిలువబడే ఈ పశువుల కొట్టం బొమ్మలు ఉన్న దుకాణాల వరుసలు సంవత్సరమంతటా ఉంటాయి. సువార్త వృత్తాంతాల్లోని ఆయా వ్యక్తుల స్థానాల్లో ప్రిన్సెస్ డయానా, మదర్ థెరీసా, బట్టల డిజైనర్ జాన్నీ వర్సాషే వంటి నేటి ప్రముఖ వ్యక్తుల బొమ్మలను రూపకల్పన చేస్తారు. మరికొన్ని చోట్ల ఈ ప్రెజెపీ చాక్లెట్తోను, నూడుల్స్తోను, ఆల్చిప్పలతో కూడా తయారవుతాయి. ఇటువంటి ప్రదర్శనలో చరిత్రను చూడడం ఎంత కష్టమో మీరు అర్థం చేసుకోగలరు.
ఇటువంటి బొమ్మలు “ఒక సువార్త ఇచ్చే సమాచారం కంటే ఎక్కువ సమాచారాన్ని” ఎలా ఇవ్వగలవు? సువార్త వృత్తాంతాలు నిజంగానే చారిత్రకమైనవి కావా? గొప్ప విమర్శకులు కూడా యేసు ఒక నిజమైన, చారిత్రకమైన వ్యక్తి అని ఒప్పుకోవలసిందే. కాబట్టి ఆయన ఒకానొక సమయంలో, ఒక నిజమైన వ్యక్తిగా ఒకానొక స్థలంలో పుట్టి ఉండాలి. కాబట్టి పశువుల కొట్టం వంటి బొమ్మల కంటే, ఆయన జననాన్ని గూర్చిన సమాచారాన్ని తెల్సుకోవడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా ఉండాలిన!
వాస్తవానికి ఉంది. యేసు జననాన్ని గూర్చిన వృత్తాంతాలను ఇద్దరు చరిత్రకారులు వేర్వేరుగా వ్రాశారు. కొన్నిసార్లు యేసు ఈ వేడుకల్లో విస్మరించబడినట్లు మీరు భావించినట్లయితే, ఈ వృత్తాంతాలను మీకు మీరుగా ఎందుకు పరిశీలించకూడదు? అప్పుడు ఈ వృత్తాంతాలు పుక్కిటి పురాణాలు, కల్పిత కథలు కాదుగానీ, ఆసక్తిని రేకెత్తించే వృత్తాంతం—యేసుక్రీస్తు జననాన్ని గూర్చిన నిజ వృత్తాంతం మీరు కనుగొంటారు.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
Border on pages 3-6, 8, and 9: Fifty Years of Soviet Art