ఇంకా గొప్ప క్రియాశీల ద్వారం దగ్గర నిలబడడం
“అక్కడ పోటీ స్ఫూర్తి లేదు. ప్రతి ఒక్కరూ సఫలీకృతులవ్వాలన్నదే ప్రతి ఒక్కరూ కోరుకున్నది. మేమందరమూ చాలా భిన్నమైనవారము. కాని ప్రతి విద్యార్థీ మాకు అమూల్యమైనవారే” అని వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 105వ తరగతిలోని తమ తోటి విద్యార్థులను గురించి రిచార్డూ, లూసీయ అన్నారు. “మాలోని వ్యత్యాసాలు మమ్మల్ని ఒకరినొకరికి సన్నిహితులను చేశాయి” అని చెబుతూ వాళ్ళ తోటి విద్యార్థి లోయల్ వాళ్ళతో ఏకీభవిస్తున్నాడు.
1998, సెప్టెంబర్ 12న పట్టభద్రులైనవారి తరగతి నిజంగా చాలా భిన్నమైనది. కొంత మంది విద్యార్థులు రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పయినీరింగ్ చేసి వచ్చారు; కొందరు తాము నివసిస్తున్న ప్రాంతంలోనే నమ్మకంగా సేవ చేశారు. మాట్స్, రోఝ్‌మేరి వంటి కొందరు తాము ఈ స్కూల్‌కు రాకముందు తమ ఇంగ్లీష్‌ను మెరుగుపరచుకునేందుకు చాలా సమయం తీవ్రంగా కృషి చేయవలసి వచ్చింది. చాలా మంది విద్యార్థులు తమ బాల్యం నుండే మిషనరీ సేవ గురించి తలుస్తూ వచ్చారు. ఒక జంట 12 సార్లు దరఖాస్తు చేసింది; 105వ తరగతికి తమకు ఆహ్వానం లభించినప్పుడు, వాళ్ళెంత సంతోషించారో!
20 వారాల తీవ్రమైన తర్ఫీదు అతివేగంగా ముగిసింది. వాళ్ళు తమ చివరి వ్రాతపూర్వక అభ్యాసాన్ని ఇచ్చేయడమూ, తమ చివరి మౌఖిక నివేదికను కూడా సమర్పించేయడమూ జరిగిపోయాయన్న విషయాన్ని వాళ్ళు గుర్తించనే లేదు. ఇంతలోనే, గ్రాడ్యుయేషన్ డే కూడా వచ్చేసింది.
ఈ కార్యక్రమం చెయర్‌మ్యాన్ ఆల్బర్ట్ ష్రోడర్. ఆయన యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడు. మునుపు గిలియడ్ క్లాస్ పూర్తి చేసిన 7,000 కన్నా ఎక్కువ మందిని అనుసరిస్తూ, వాళ్ళు “బైబిలు విద్యాభ్యాస రంగంలో ఇంకా గొప్ప క్రియాశీల ద్వారం దగ్గర నిలుచుని ఉన్నారు” అని ఆయన ఆ తరగతిలోని వాళ్ళకు గుర్తు చేశారు. ఎంతోకాలంగా మిషనరీలుగా ఉన్నవారు వేసవిలో, అంతర్జాతీయ సమావేశాలకు హాజరైన సందర్భంలో వారు ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు వారితో సహవసించే అనుపమానమైన అవకాశాన్ని ఈ విద్యార్థులు పొందారు అని ఆయన పేర్కొన్నాడు.
తర్వాత, సహోదరుడు ష్రోడర్ బెతేల్ ఆపరేషన్స్ కమిటీ సభ్యుడైన మాక్స్ లార్సన్‌ను పరిచయం చేశారు. “నిత్యజీవానికి నడిపించే విద్యాభ్యాసం” అనే అంశాన్ని ఆయన విశదంగా వివరించాడు. “జ్ఞాని నిర్దేశాన్ని విని, హృదయంలోకి తీసుకుంటాడు, అవగాహన చేసుకునే వ్యక్తి నిపుణమైన మార్గదర్శనాన్ని సంపాదిస్తాడు” అని చెబుతున్న సామెతలు 1:5 (NW) మాటలను సహోదరుడు లార్సన్ ఉటంకించాడు. సమర్థతగల మిషనరీగా ఉండేందుకు నైపుణ్యం అవసరం. నిపుణులు రాజుల ఎదుట నిలబడతారు. (సామెతలు 22:29) ఐదు నెలల తర్ఫీదు తర్వాత, అతి గొప్ప రాజులైన యెహోవా దేవుడికీ, క్రీస్తు యేసుకూ ప్రాతినిధ్యం వహించేందుకు విద్యార్థులు ఇంకా చక్కగా సంసిద్ధులయ్యారు.
సర్వీస్ డిపార్ట్‌మెంట్లో పని చేసే డేవిట్ ఓల్‌సన్, “యెహోవా హృదయాన్ని ఆనందింపజేసేందుకు సహాయపడండి” అనే అంశంపై తరువాత మాట్లాడారు. “దేవుడి హృదయాన్ని ఆనందింపజేసేందుకు అపరిపూర్ణులైన మానవులు ఏమి చేయగలరు?” అని ఆయన అడిగారు. దానికి జవాబు? వాళ్ళు ఆయనకు నమ్మకంగా, యథార్థంగా, ఆనందంగా సేవ చేయగలరు. యెహోవా తన ప్రజలు తన సేవను ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు. మనం దేవుడి చిత్తాన్ని ఆనందంతో చేసినప్పుడు మనం ఆయన హృదయాన్ని సంతోషపరచినవారమౌతాం. (సామెతలు 27:11) 104వ తరగతిలో గ్రాడ్యుయేషన్ పొందిన ఒక మిషనరీ దంపతులు వ్రాసిన ఒక ఉత్తరాన్ని సహోదరుడు ఓల్‌సన్ చదివారు. వాళ్ళు తమ క్రొత్త నియామకాన్ని ఆస్వాదిస్తున్నారా? “దాదాపు 140 మంది ప్రచారకులున్నారు. సరాసరి కూటాల హాజరు 250 నుండి 300 వరకు ఉంటుంది. ప్రాంతీయ సేవ చాలా బాగుంటుంది. మాకు ఒక్కొక్కరికీ నాలుగు స్టడీస్ చొప్పున ఉన్నాయి. కొందరు కూటాలకు రావడం కూడా మొదలుపెట్టారు” అని వాళ్ళు తమ సంఘం గురించి వ్రాశారు.
పరిపాలక సభలో సభ్యుడైన లైమన్ స్వింగల్ “ఒక నిమిషం ఆగి, మీ ఆశీర్వాదాలను గురించి ఆలోచించుకోండి” అనే అంశంపై మాట్లాడారు. గిలియడ్ తర్ఫీదు అనేక ఆశీర్వాదాలను తెచ్చింది. జ్ఞానాభివృద్ధి చేసుకునేందుకూ, యెహోవా సంస్థ విషయమైన గుణగ్రహణలో ఎదిగేందుకూ, అణుకువ వంటి ప్రాముఖ్యమైన గుణాలను అలవరచుకునేందుకూ అది విద్యార్థులకు సహాయపడింది. “ఇక్కడికి వచ్చి, నిర్దేశాన్ని ఆలకించేందుకు సమయాన్ని వెచ్చించడం అణకువను నేర్పే అనుభవం. మీరు ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు, మీరు యెహోవా నామాన్ని ఘనపరచేందుకు ఇంకా బాగా సంసిద్ధులై ఉంటారు” అని కూడా సహోదరుడు స్వింగల్ అన్నాడు.
“మీ ఆనందం ఎంతో గొప్పది—మరి విచారం ఎందుకు?” అన్నది డానియేల్ సిడ్లిక్ ఇచ్చిన ప్రసంగం పేరు. ఆయన కూడా పరిపాలక సభ సభ్యుడే. సమస్యలు తలెత్తినప్పుడు, మార్గదర్శనం కోసం లేఖనాలను చూడండి అని ఆయన ఉద్బోధించాడు. మత్తయి 6వ అధ్యాయంలోని ఎంపిక చేసిన వచనాలను, తీసి, మార్గదర్శనం కోసం లేఖనాలను ఎలా చూడవచ్చో సహోదరుడు సిడ్లిక్ సోదాహరణంగా చెప్పాడు. విశ్వాసం కొరవడడం, అన్న వస్త్రాలు వంటి దైనందిన విషయాలను గురించి మనం అనవసరంగా బాధపడేలా చేస్తుంది. అయినప్పటికీ, మనకు ఏమి అవసరమో యెహోవాకు తెలుసు. (మత్తయి 6:25, 30) విచారపడడం ఒక్కో రోజు వచ్చే బాధను అధికం చేయగలదే తప్ప మరేమీ చేయలేదు. (మత్తయి 6:34) మరొకవైపు, పథకం వేయడం కొంత వరకు అవసరమే. (పోల్చండి లూకా 14:28.) “యేసు నిషేధిస్తున్నది భవిష్యత్తు కోసం బుద్ధిపూర్వకంగా ఆలోచించడాన్ని కాదు కాని, బుద్ధిరహితంగా దాని గురించి విచారపడడాన్నే” అని సహోదరురడు సిడ్లిక్ వివరించాడు. “విచారాన్ని పోగొట్టగల మంచి చికిత్సల్లో ఒకటి చర్య తీసుకోవడమే. మనకు విచారం కలిగినప్పుడు మనం సత్యాన్ని గురించి మాట్లాడనారంభించడం మంచిది.”
నిర్దేశకులు ఇచ్చిన వీడ్కోలు సలహా
తర్వాత గిలియడ్ విద్యా విభాగంలోని ముగ్గురు సభ్యులు ప్రసంగించారు. కాల్ ఆడమ్స్, “యెహోవాకు మీరు ఏమి తిరిగి చెల్లిస్తారు?” అనే అంశంపై మొదట మాట్లాడారు. ఆయన ప్రసంగం 116వ కీర్తనపై ఆధారపడింది. ఆ కీర్తనను యేసు తన మరణానికి ముందటి రాత్రి పాడి ఉండవచ్చు. (మత్తయి 26:30) “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?” అనే మాటలను యేసు ఆలపించినప్పుడు ఆయన మనస్సులో ఏ విషయం మెదిలి ఉండవచ్చు? (కీర్తన 116:12) తన కోసం యెహోవా సిద్ధం చేసిన పరిపూర్ణ శరీరం విషయమై ఆయన పర్యాలోచించి ఉండవచ్చు. (హెబ్రీయులు 10:5) మరుసటి రోజు, తన ప్రేమ లోతును తెలియజేస్తూ ఆయన తన శరీరాన్ని యాగముగా అర్పించనున్నాడు. 105వ తరగతి విద్యార్థులు గత ఐదు నెలలుగా, యెహోవా మంచితనాన్ని చవిచూశారు. తమ మిషనరీ నియామకాల్లో కష్టపడి పనిచేయడం ద్వారా దేవుడి మీద తమకున్న ప్రేమను వాళ్ళు ఇప్పుడు చూపిస్తారు.
మాట్లాడవలసిన రెండవ గిలియడ్ నిర్దేశకుడు మార్కు న్యూమర్. ఆయన, “సరైనది చేయడంలో కొనసాగండి” అనే సలహాను విద్యార్థులకు ఇచ్చారు. యోసేపు దాసుడుగా ఈజిప్టుకు అమ్మబడిన తర్వాత, 13 సంవత్సరాలు అన్యాయపు శిక్షను సహించాడు. ఇతరులు చేసిన తప్పిదాలు తను దేవుడికి సేవచేయకుండా తనను నిష్క్రియుడిగా చేసేందుకు ఆయన అనుమతించాడా? లేదు. ఆయన సరైనది చేయడంలో కొనసాగాడు. తర్వాత, దేవుడి నియమిత సమయంలో, యోసేపు తన పరీక్షల నుండి విముక్తుడయ్యాడు. అకస్మాత్తుగా, ఆయన నివాసస్థలం జైలు గది నుండి రాజ భవనంలోకి మారింది. (ఆదికాండము 37-50 అధ్యాయాలు) “మీ అసైన్‌మెంట్‌లో మీరు అనుకున్నవి జరగకపోతే, మీరు మిషనరీ సేవను వదిలిపెడతారా? మీరు నిరాశకు లోనౌతారా? లేక యోసేపులా మీరు సహిస్తారా?” అని నిర్దేశకుడు తన విద్యార్థులను అడిగాడు.
చివరికి, గిలియడ్ స్కూల్ రిజిస్ట్రార్ వాలస్ లివరన్స్ “రాజు గురించి, రాజ్యాన్ని గురించి ప్రకటించండి” అనే అంశాన్ని ఆ తరగతివారితో చర్చించడంలో అధ్యక్షత వహించాడు. కొంతమంది విద్యార్థులు తాము ఇంటింటా, దుకాణాల్లోనూ, వీధుల్లోనూ బోధిస్తున్నప్పుడు కలిగిన అనుభవాలను చెప్పారు. వేరే భాష మాట్లాడే ప్రజలకు సాక్ష్యమిచ్చేందుకు ఎలా వెళ్ళేవారో ఇతరులు చెప్పారు. విభిన్న మత నేపథ్యాలుగల ప్రజలకు బోధించడమెలాగో మరి కొందరు చూపించారు. గ్రాడ్యుయేట్‌లు అందరూ కూడా మిషనరీ రంగంలో పరిచర్యలో పూర్తి భాగం కలిగి ఉండాలని ఆతురతగా ఉన్నారు.
ఎంతోకాలంగా సంతోషంగా ఉన్న మిషనరీలు
“మిషనరీ సేవ వల్ల వచ్చే ఆనందభరితమైన ఫలితాలు” అనే రెండవ భాగాన్ని రాబర్ట్ ఉలన్ సమర్పించారు. ఈ భాగంలో, అనుభవజ్ఞులైన మిషనరీలతో నిర్మాణాత్మక సహవాసాన్ని ఇటీవల అనుభవించగలిగిన నలుగురు సహోదరులతో చేసిన ఇంటర్వ్యూలు కూడ ఉన్నాయి. వాళ్ళు నలుగురూ ప్రధాన కార్యాలయ సిబ్బందిలోనివారు. క్రొత్త భాష నేర్చుకోవడం గానీ, మరో సంస్కృతికి సర్దుకుపోవడం గానీ, క్రొత్త వాతావరణానికి అలవాటు పడడం గానీ అంత సులభం కాలేదని ఆ మిషనరీలు వెంటనే ఒప్పుకున్నారు. దానికి తోడు ఇంటి బెంగ వల్ల కలిగే మానసిక వ్యధలను అధిగమించవలసి ఉండింది. కొన్నిసార్లు, ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కాని వాటన్నింటినీ సహించి, మిషనరీలు అనుకూల దృక్పథాన్ని కాపాడుకున్నారు. వారి పట్టుదల ఆశీర్వదించబడింది. కొంతమంది అనేకులను యెహోవా జ్ఞానంలోనికి తీసుకువచ్చారు. ఇతరులు తమ దేశాల్లో రాజ్య పని మొత్తం మీద పెరిగేందుకు వివిధ విధాల్లో తోడ్పడ్డారు.
చివరన మాట్లాడింది క్యారీ బార్బర్. ఆయన పరిపాలక సభ సభ్యుడు. ఆయన “దైవిక జీవిత మార్గము” అనే సమావేశంలోని ముఖ్యాంశాలను పునఃసమీక్షించాడు. “ఈ సమావేశ కార్యక్రమం యెహోవా దేవుడితో మీకు గల సంబంధంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది?” అని ఆయన తన ప్రేక్షకులను అడిగాడు. ఆ ప్రసంగీకుడు దేవుడి మార్గాన్ని అనుసరించడం వల్ల ఆశీర్వాదంగా వచ్చే ఫలితాలను లోకపు మార్గాన్ని అనుసరించడం వల్ల కలిగే నాశనకరమైన అంతంతో తారతమ్యం చేశాడు. మెరీబా దగ్గర మోషే చూపిన అతిక్రమాన్ని గురించి చెప్పి, “ఒక వ్యక్తి అనేక సంవత్సరాలు నమ్మకంగా సేవ చేసిన తర్వాత కూడా, తన నీతియుక్తమైన నియమాల్లో చిన్నదాన్ని ఉల్లంఘించినా, యెహోవా దానిని తేలికగా తీసుకోడు” అని ఆయన హెచ్చరించాడు. (సంఖ్యాకాండము 20:2-13) అన్నిచోట్లా ఉన్న దేవుడి సేవకులు అందరూ కూడా తమకున్న ప్రశస్తమైన సేవాధిక్యతలను గట్టిగా పట్టుకుందురు గాక!
విద్యార్థులు డిప్లోమాలను పొందే సమయం వచ్చింది. అప్పుడు తరగతి ప్రతినిధి ఒకరు విద్యార్థులు పొందిన తర్ఫీదు విషయమై తమ మెప్పుదలను సూచించే ఉత్తరాన్ని చదివారు. ముగింపు పాటా, హృదయపూర్వకమైన ప్రార్థనా తర్వాత, గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ముగిసింది. కానీ, 105వ తరగతివారికి ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే, క్రొత్త మిషనరీలు “ఇంకా గొప్ప క్రియాశీల ద్వారం దగ్గర నిలుచుని ఉన్నారు.”
[23వ పేజీలోని బాక్సు]
తరగతి గణాంకాలు
ప్రాతినిధ్యం వహించబడిన దేశాలు: 9
నియమించబడిన దేశాల సంఖ్య: 17
విద్యార్థుల సంఖ్య: 48
వివాహిత దంపతుల సంఖ్య: 24
సరాసరి వయస్సు: 33
సత్యంలో ఉన్న సరాసరి సంవత్సరాలు; 16
పూర్తికాల పరిచర్యలో ఉన్న సరాసరి సంవత్సరాలు: 12
[24వ పేజీలోని బాక్సు]
వాళ్ళు పూర్తికాల సేవను ఎన్నుకున్నారు
“నా చిన్నప్పుడు, పయినీరింగ్ చేసే ప్లానేమీ నాకు ఉండేది కాదు. ప్రత్యేక సామర్థ్యాలూ, ఆదర్శవంతమైన పరిస్థితులూ ఉన్నవారు మాత్రమే పయినీరింగ్ చేయగలరని అనుకునేవాడ్ని” అని 105వ తరగతి గ్రాడ్యుయేట్ అయిన బెన్ అంటున్నారు. “కానీ నేను ప్రాంతీయ సేవను ప్రేమించడం నేర్చుకున్నాను. పయినీర్‌గా ఉండడమంటే, పరిచర్యలో గొప్ప భాగాన్ని కలిగివుండడమనే భావం తర్వాత ఒకరోజు నా మనస్సులో స్ఫురించింది. నేను పయినీరింగ్ చేయగలనని అప్పుడే నేను గ్రహించింది” అని కూడా ఆయన అంటున్నారు.
“మా ఇంట్లో పూర్తికాల సేవకులను ఎల్లప్పుడూ చాలా గౌరవంగా చూసేవారు” అని లూసియ చెబుతుంది. మిషనరీలు సందర్శించడానికి వచ్చిన ప్రతిసారీ తమ సంఘంలో వెల్లువలా ఉప్పొంగే ఆనందావేశాలను ఆమె గుర్తు చేసుకుంటుంది. “నేను పూర్తికాల సేవను నా పథకాల్లో ఉంచుకోవచ్చని నేను పెరిగి పెద్దవుతున్నకొలది నాకు అర్థమైంది” అని ఆమె అంటుంది.
థీయడిస్‌కు 15 ఏండ్లున్నప్పుడు వాళ్ళమ్మగారు చనిపోయారు. “ఆ సమయంలో, సంఘం నాకు నిజంగా ఆసరాగా ఉండింది. కనుక, ‘నా మెప్పుదలను చూపించేందుకు నేను ఏమి చేయగలను?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను” ఆని ఆయన అంటున్నారు. ఇది ఆయన పూర్తి కాల సేవలో ప్రవేశించేందుకూ ఇప్పుడు ఆయన మిషనరీ పని చేసేందుకు నడిపించింది.
[25వ పేజీలోని చిత్రం]
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 105వ తరగతి
ఈ క్రింది లిస్ట్‌లో, ముందు నుండి వెనుకకు నంబర్లు ఇవ్వబడ్డాయి. పేర్లు ప్రతి వరుసలోను ఎడమ నుండి కుడికి ఇవ్వబడ్డాయి
(1) సామ్ప్‌సన్, ఎమ్.; బ్రౌన్, ఐ.; హెగ్లీ, జి.; అబూయన్, ఇ.; డేబ్‌వా, ఎమ్.; పూర్తీ, పీ. (2) కాసమ్, జి.; లిన్‌బర్గ్. ఆర్.; డాపుజో, ఏ.; టెయ్‌లర్, సీ.; లఫెవ్‌ర, కే.; వాకర్, ఎస్.; (3) బేకర్, ఎల్.; పెలాస్, ఎమ్.; వోగాన్, ఈ., బోనా, సీ.; ఆస్ప్‌లుండ్, జే.; హైల, జె. (4) పూర్తీ, టీ.; విట్టాకర్, జే.; పాల్మర్, ఎల్.; నార్‌టోన్, ఎస్.; గేరింగ్, ఎమ్.; హైల, డబ్ల్యు. (5) వాకర్, జె.; బోనా, ఎ.; గ్రూన్‌వల్డ్, సీ.; వాషింగ్‌టన్, ఎమ్.; విట్టాకర్, డి.; అబూయన్, జె. (6) గేరింగ్, డబ్ల్యు.; వాషింగ్‌టన్, కే.; పెలాస్, ఎమ్.; డేబ్‌వా. ఆర్.; హెగ్లీ, టీ.; ఆస్ప్‌లుండ్, ఏ. (7) వోగాన్, బీ.; లఫెవ్‌ర, ఆర్.; టెయ్‌లర్, ఎల్.; బ్రౌన్, టీ.; గ్రూన్‌వల్డ్, ఆర్.; పాల్మర్, ఆర్. (8) నార్‌టోన్, పీ.; సామ్ప్‌సన్, టీ.; బేకర్, సీ.; లిన్‌బర్గ్, ఎమ్.; కాసమ్, ఎమ్.; డాపుజో, ఎమ్.