యెహోవా ఎవరు?
యెహోవా తన నమ్మకమైన ఆరాధకులలో ఒకరితో “ఏ నరుడును నన్ను చూచి బ్రదుక[డు]” అని చెప్పాడు. (నిర్గమకాండము 33:20) “దేవుడు ఆత్మ” గనుక మానవులు తమ భౌతిక కళ్లతో ఆయనను చూడలేరు. (యోహాను 4:24) మిట్ట మధ్యాహ్న వేళ సూర్యుడ్ని సూటిగా చూడడం మన కళ్లకు వినాశనకరమైనదిగా ఉండేలానే, మన ప్రకాశమానమైన సూర్యుడినే కాకుండా విశ్వంలోవున్న లెక్కలేనన్ని ఇతర సూర్యుళ్లను సృష్టించిన, అపార శక్తికి మూలమైన వానిని చూడడం కూడా నాశనకరంగా ఉండగలదు.
దేవుని గురించి తెలుసుకోవడానికి మనం ఆయనను చూడవలసిన అవసరం లేదన్నది సంతోషకరమైన విషయం. బైబిలు, మన కోసం ఆ అద్భుతమైన పాకేజ్ అయిన భూమిని సిద్ధం చేసిన వానిని గుర్తించడమే కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా బయల్పరుస్తోంది. మనకు జీవాన్నిచ్చి, ఆ జీవాన్ని ఆనందించడానికి అవసరమైన ఆహ్లాదకరమైన గృహాన్ని కూడా ఇచ్చిన తండ్రి గురించి తెలుసుకోవడానికి బైబిల్లోకి చూడడం తగినదే.
ఆయన నామానికున్న విశిష్టత
అన్ని పేర్లకూ అర్థాలుంటాయి, నేడు అనేకమందికి వాటి గురించి తెలియకపోయినప్పటికీ, అది వాస్తవం. ఉదాహరణకు, సాధారణ ఆంగ్ల పేరైన డేవిడ్, “ప్రియమైనవాడు” అనే భావంగల హెబ్రీ పదం నుండి వస్తుంది. సృష్టికర్త నామమైన యెహోవాకు కూడా అర్థం ఉంది. అదేమిటి? బైబిలు ఆదిమ భాషయైన హెబ్రీలో, దైవిక నామం య్‌హ్‌వ్‌హ్ అనే నాలుగక్షరాల్లో వ్రాయబడుతుంది, హెబ్రీ భాషలో వ్రాయబడిన బైబిలు భాగంలో దాదాపు 7,000 సార్లు అది కనిపిస్తుంది. దైవిక నామానికి “తానే కర్త అవుతాడు” అనే భావమున్నట్లు అర్థమవుతుంది. యెహోవా తన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి తాను ఏమి కావలసిన అవసరం ఉంటే జ్ఞానయుక్తంగా తాను అది అవుతాడని అది సూచిస్తుంది. ఆయన సృష్టికర్త, న్యాయాధిపతి, రక్షకుడు, జీవ ప్రదాత గనుక ఆయన తన వాగ్దానాలను నెరవేర్చగలడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, హెబ్రీ భాషలో యెహోవా అనే నామం క్రియాపదం రూపంలో ఉంది గనుక, అది నెరవేరే ప్రక్రియలో ఉన్న ఒక చర్యను సూచిస్తుంది. అవును, యెహోవా ఇప్పటికీ తనంతట తాను తన సంకల్పాలను నెరవేర్చేవానిగా అవుతున్నాడు. ఆయన సజీవమైన దేవుడు!
యెహోవా సర్వోత్కృష్టమైన లక్షణాలు
బైబిలు సృష్టికర్తను ఇలా వర్ణిస్తోంది, “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా [“ప్రేమపూర్వక కనికరం,” NW] సత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును.” (నిర్గమకాండము 34:6, 7) ‘కృప’ అని లేక “ప్రేమపూర్వక కనికరం” అని అనువదించబడిన హెబ్రీ పదం ఎంతో అర్థవంతమైనది. అది ఒక వస్తువు యొక్క సంకల్పం నెరవేర్చబడేంత వరకు ఆ వస్తువుకు ప్రేమపూర్వకంగా అంటిపెట్టుకుని ఉండే కృపను చూపిస్తుంది. దాన్ని “యథార్థతగల ప్రేమ” అని కూడా అనువదించవచ్చు. యెహోవా యొక్క కృప, ఆయన సృష్టి ప్రాణులకు ప్రేమపూర్వకంగా అంటిపెట్టుకుని ఉండి, ఆయన అద్భుతమైన సంకల్పాన్ని నెరవేరుస్తుంది. మీకు జీవాన్ని ఇచ్చినవాని నుండి మీకు లభించిన అలాంటి ప్రేమను అమూల్యంగా ఎంచరా?
యెహోవా త్వరగా కోపపడడు, మన తప్పిదములను వెంటనే క్షమిస్తాడు. అలాంటి వ్యక్తికి సన్నిహితంగా ఉండడం ఉల్లాసకరంగా ఉంటుంది. అయినప్పటికీ, ఆయన తప్పిదాన్ని చూసీ చూడనట్లు ఊరుకుంటాడని దాని భావం కాదు. ఆయనిలా ప్రకటించాడు: “న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము.” (యెషయా 61:8) న్యాయానికి దేవుడైన ఆయన, తమ దుష్టత్వంలోనే కొనసాగుతూ ఉండే సిగ్గులేని పాపులను ఎల్లకాలం సహిస్తూనే ఉండడు. కాబట్టి, యెహోవా తన తగిన సమయంలో లోకంలోని అన్యాయాలను సరిచేస్తాడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. బాధపడేవారిని ఆయన అలక్ష్యం చేయడు.
ప్రేమా న్యాయాల నడుమ పరిపూర్ణమైన సమతూకాన్ని కల్గివుండడం అంత సులభం కాదు. మీరు ఒక తల్లి/తండ్రి అయితే, మీ పిల్లలు తప్పుగా ప్రవర్తించినప్పుడు వారిని ఎప్పుడు, ఎలా, ఎంతమేరకు సరిదిద్దాలనేది నిర్ణయించడం మీకు కష్టంగా ఉంటుందా? న్యాయాన్ని ప్రేమపూర్వక వాత్సల్యంతో సమతూకం చేయడానికి ఎంతో జ్ఞానం అవసరం. యెహోవా మానవులతో వ్యవహరించేటప్పుడు ఆ గుణాన్ని విస్తృతంగా ప్రదర్శిస్తాడు. (రోమీయులు 11:33-36) వాస్తవానికి, సృష్టికర్త జ్ఞానాన్ని ప్రతి స్థలంలోనూ, ఉదాహరణకు మన చుట్టూవున్న సృష్టి అద్భుతాల్లోనూ చూడవచ్చు.—కీర్తన 104:24; సామెతలు 3:19.
అయితే, జ్ఞానం ఉండడం మాత్రమే సరిపోదు. సృష్టికర్త తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయనకు శక్తి కూడా ఉండాలి, ఆయన ఎంతో శక్తిమంతుడని బైబిలు ఇలా బయల్పరుస్తోంది: “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.” (యెషయా 40:26) యెహోవా తనకున్న “అధికశక్తి” చేత పనులు జరిగేలా చేస్తాడు. అలాంటి లక్షణం ఆయనవైపుకు మిమ్మల్ని ఆకర్షించదా?
అన్ని జనాంగాల దేవుడు
‘కాని యెహోవా “పాత నిబంధన” దేవుడు కాదా, ప్రాచీన ఇశ్రాయేలు దేవుడు కాదా?’ అని మీరనుకోవచ్చు. యెహోవా తనను తాను ఇశ్రాయేలీయులకు బయల్పర్చుకున్నాడన్నది నిజమే. అయినప్పటికీ, మొదటి మానవజతను యెహోవా సృష్టించాడు గనుక, ఆయన ‘భూమిమీద ఉన్న ప్రతి కుటుంబము ఎవరినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ’ దేవుడు. (ఎఫెసీయులు 3:14-16) మీ పూర్వీకులను గౌరవించడం తగినదని మీరు విశ్వసిస్తే, మనందరి పూర్వీకుడూ, నేడు భూమిమీద ఉనికిలోవున్న తరాలన్నిటికీ మూలపురుషుడూ అయిన మొదటి మానవునికి జీవాన్నిచ్చిన వానికి ఆరాధన చెల్లించడం తగినదై ఉండదా?
మానవజాతి సృష్టికర్త సంకుచిత మనస్తత్త్వం గలవాడు కాదు. నిజమే, ఇశ్రాయేలు జనాంగంతో ఆయనకు ఒకప్పుడు ప్రత్యేక అనుబంధం ఉండేది. కానీ అప్పట్లో కూడా ఆయన, తన నామమునుబట్టి ప్రార్థించిన వారినందరినీ ఆహ్వానించాడు. యెహోవాకు ప్రార్థన చేస్తూ ఇశ్రాయేలీయుల జ్ఞానవంతుడైన ఒక రాజు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశమునుండి వచ్చి . . . ప్రార్థన చేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును [ఎరుగుదురు].” (1 రాజులు 8:41-43) ఈనాటికీ, అన్ని జనాంగాల ప్రజలూ యెహోవాను తెలుసుకొని, ఆయనతో అర్థవంతమైన సంబంధాన్ని కల్గివుండగలరు. కాని అది మిమ్మల్నెలా ప్రభావితం చేస్తుంది?
యెహోవాను తెలుసుకోవడంలోని ప్రయోజనాలు
ముందు శీర్షికలోని ఉదాహరణకు మళ్లీ ఒకసారి వెళదాము, ఆకర్షణీయంగా పాక్ చేయబడిన పాకేజీని మీరు అందుకుంటే, ఆ బహుమానం దేని కొరకో తెలుసుకోవాలని మీరు సహజంగానే కుతూహలపడతారు. దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా చూసుకోవాలి? అలాగే, దేవుడు మన కోసం భూమిని సిద్ధం చేసినప్పుడు ఆయన మనస్సులో ఏమి ఉండినదో తెలుసుకోవాలని మనం ఉబలాటపడతాము. “నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు” కానీ, మానవులకు “నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను” అని బైబిలు చెబుతుంది.—యెషయా 45:18.
అయితే, చాలామంది మానవులు సృష్టికర్త ఇచ్చిన బహుమానం గురించి శ్రద్ధ తీసుకోలేదు. వాళ్లు యెహోవాకు ఎంతో మనస్తాపాన్ని కలుగజేస్తూ భూమిని నాశనం చేయడంలో మునిగి ఉన్నారు. అయినప్పటికీ, యెహోవా తన నామానికి అనుగుణ్యంగా, మానవుని ఎడలా భూమి ఎడలా తనకుగల తన ఆది సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో కృతనిశ్చయతతో ఉన్నాడు. (కీర్తన 115:16; ప్రకటన 11:18) ఆయన భూమిని బాగుచేసి, విధేయులైన తన పిల్లలుగా జీవించడానికి ఇష్టపడే వారికి దాన్ని వారసత్వంగా ఇస్తాడు.—మత్తయి 5:5.
అది జరిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనే దాని గురించి బైబిల్లోని చివరి పుస్తకం ఇలా వర్ణిస్తుంది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు. . . . ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].” (ప్రకటన 21:3, 4) అప్పుడు ఎవ్వరూ దుఃఖంతో కన్నీళ్లు కార్చరు లేక తమ ప్రియమైన వారు మరణించినందుకు సంతాపపడరు. ఎవ్వరూ నిస్పృహతో సహాయం కొరకు మొరపెట్టరు లేక ప్రాణాంతకమైన వ్యాధి యొక్క బాధను అనుభవించరు. చివరికి ‘మరణము నశింపజేయబడుతుంది.’ (1 కొరింథీయులు 15:26; యెషయా 25:8; 33:24) యెహోవా మన మొదటి పూర్వీకులను సృష్టించినప్పుడు, మనం ఆనందించాలని ఆయన ఆదిలో సంకల్పించిన విధమైన జీవితాన్ని ఇది వర్ణిస్తుంది.
వాస్తవానికి, యెహోవా ఆరాధకుల మధ్య ఇప్పుడు అలాంటి పరదైసులాంటి పరిస్థితుల ఛాయను మీరు చూడవచ్చు. ఆయన వారికిలా చెబుతున్నాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” (యెషయా 48:17) ఆయన పిల్లలమైన మనకు శ్రేష్ఠమైన జీవన విధానాన్ని బోధించే యెహోవా కనికరంగల తండ్రి. ఆయన మానవులకిచ్చిన మార్గనిర్దేశక సూత్రాలు అనవసరమైన నిర్బంధాలను పెట్టవు గానీ ప్రేమపూర్వకమైన భద్రతనిస్తాయి. “ప్రభువే [“యెహోవాయే,” NW] ఆత్మ. ప్రభువు [“యెహోవా,” NW] యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును” అని వ్రాయబడివున్నట్లుగానే, వాటిని అనుసరించడం మూలంగా నిజమైన స్వాతంత్ర్యమూ సంతోషమూ లభిస్తాయి. (2 కొరింథీయులు 3:17) బైబిలునందు పొందుపర్చబడివున్న మార్గనిర్దేశాలను అనుసరించడం ద్వారా ఆయన పరిపాలనాధికారాన్ని అంగీకరించేవారు, ఒకరోజు సర్వమానవజాతిలో నెలకొని ఉండే మనశ్శాంతిని ఇప్పుడు అనుభవిస్తున్నారు.—ఫిలిప్పీయులు 4:7.
యెహోవా ఎంతటి దయాళువైన తండ్రి! సృష్టి అద్భుతాలన్నిటి వెనుకా ఉన్న ఆయన గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా? అలా ఇష్టపడేవారికి ఇప్పుడు కూడా అమూల్యమైన ప్రయోజనాలున్నాయి. భవిష్యత్తులో ఆశీర్వాదాలు నిరంతరం ఉంటాయి.
[5వ పేజీలోని చిత్రం]
నాలుగు హెబ్రీ అక్షరాల్లో వ్రాయబడే దైవిక నామాన్ని అనేక ప్రాచీన చర్చీ గోడలపై చూడవచ్చు