“శక్తివంతమైనవి, ఒప్పింపచేసేవి”
“రేపటి నుండి నేను ప్రకటనాపనిలో దీన్ని ఉపయోగించబోతున్నాను, ఎందుకంటే ఇందులో ఉన్న వాదనాంశాలు నిజంగా శక్తివంతమైనవి, ఒప్పింపచేసేవి అయివున్నాయి” అని ఫ్రాన్స్ నుండి ఒక యెహోవాసాక్షి రాశాడు. అమెరికా నుండి ఒక సాక్షి ఇలా రాశాడు: “నేను దీన్ని పొందిన వెంటనే చదివాను. ఉదాసీనులైన, బైబిలునందు నమ్మకాన్నుంచనటువంటి అనేకమంది ప్రజల్ని కలుస్తాం గనుక ప్రాంతీయ పరిచర్యలో దీన్ని ఉపయోగించకుండా ఉండలేకపోయాను.” వాళ్లు దేన్ని గురించి అలా వర్ణిస్తున్నారు? 1997/98లో నిర్వహించబడిన “దేవుని వాక్యములో విశ్వాసము” అనే జిల్లా సమావేశంలో వాచ్ టవర్ సొసైటీ విడుదల చేసిన 32 పేజీలుగల సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే బ్రోషూరును గురించే.
ఈ ప్రచురణ ఒక ప్రత్యేకమైన గుంపును దృష్టిలో పెట్టుకొని అంటే విద్యావంతులే అయినా బైబిల్ని గురించి అంతగా తెలియని వారిని దృష్టిలో పెట్టుకొని తయారుచేయబడింది. అలాంటి వ్యక్తుల్లో అనేకులు స్వయంగా బైబిలును ఎన్నడూ చదవకపోయినా దాని విషయంలో నిర్దిష్టమైన అభిప్రాయాల్ని కల్గివున్నారు. బైబిలు కనీసం పరిశీలనకు తగినదని పాఠకుణ్ణి ఒప్పింపచేయడమే ఈ బ్రోషూర్ ఉద్దేశం. బైబిలు దైవప్రేరేపితమైనదనే అభిప్రాయాన్ని పాఠకుడు అంగీకరించేలా ఈ బ్రోషూరు బలవంతం చేయదు. బదులుగా, ఇది వాస్తవాల్ని మాట్లాడనిస్తుంది. పదప్రయోగం మరీ కఠినమైనది కాదు గానీ సూటిగానూ తేటతెల్లంగానూ ఉంది.
పైనున్న వ్యాఖ్యానాలు సూచిస్తున్నట్లుగా, సమావేశాలకు హాజరైన వారు తమ ప్రాంతీయ సేవలో ఈ బ్రోషూరును ఉపయోగించాలని తహతహలాడి పోయారు. ఉదాహరణకు, ప్రపంచ యువత దినోత్సవానికి ప్రపంచపు నలుమూలల నుండి లక్షలాది మంది యువ సందర్శకులు పారిస్‌కు వచ్చినప్పుడు ఫ్రాన్స్‌లో ఒక ప్రత్యేక సాక్ష్య ప్రచారం ఆగస్టు 23, 24 తేదీల్లో ఏర్పాటు చేయబడింది. దాదాపు 2,500 మంది సాక్షులు (ఎక్కువ మటుకు 16 నుండి 30 ఏళ్ల వయస్సు మధ్యనున్న వారు) 18,000 బ్రోషూరు ప్రతుల్ని ఆంగ్లం, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పొలిష్, స్ఫానిష్ భాషల్లో అందించారు.
సర్వమానవాళి కొరకైన గ్రంథం అనే ఈ బ్రోషూరును మన పరిచర్యలో తప్పక ఉపయోగిద్దాం. తమకు తాముగా బైబిల్ని పరిశీలించేలా సహేతుకమైన ప్రజల్ని ఒప్పించడంలో ఈ ప్రచురణ విలువైనదని రుజువుపర్చబడుగాక.