కుటుంబం—ఒక మానవ అవసరత!
కుటుంబాలు ఎంత సుభిక్షంగా ఉంటే మానవ సమాజం కూడా అంతే సుభిక్షంగా ఉంటుంది అంటారు. కుటుంబ ఏర్పాటు ఎప్పుడు బలహీనమౌతుందో అప్పుడే సమాజాల బలమూ, జాతి బలమూ క్షీణిస్తుందని చరిత్ర చూపుతుంది. ప్రాచీన గ్రీసులోని నైతిక పతనం కుటుంబాలను నాశనం చేసినప్పుడు, దాని నాగరికతే కుప్పకూలిపోయింది, దాంతో అది రోమన్ల విజయోత్సాహానికి తల ఒగ్గింది. రోమా సామ్రాజ్యంలోని కుటుంబాలు ఎంత కాలం దృఢంగా ఉన్నాయో అంత కాలమూ ఆ సామ్రాజ్యం బలంగా నిలిచింది. కానీ శతాబ్దాలు గడుస్తుండగా కుటుంబ జీవితం బలహీనమైంది, తత్ఫలితంగా సామ్రాజ్య బలం కూడా క్షీణించింది. “కుటుంబంలోనూ, కుటుంబ జీవితంలోనూ ఉన్న భద్రత, ఔన్నత్యము అనేవి నాగరికతకు ప్రధాన విషయాలు. ఆ రెండూ మన ప్రయాసలన్నింటికీ అంతిమ లక్ష్యాలు” అని హార్వర్డ్ యూనివర్శిటీకి పూర్వం అధ్యక్షునిగా ఉన్న చార్లెస్ డబ్ల్యు. ఎలియట్ వ్యాఖ్యానించాడు.
అవును, కుటుంబం ఒక మానవ అవసరత. సమాజపు స్థిరత్వంపైనా, పిల్లల సంక్షేమంపైనా, భావి తరాల సంక్షేమంపైనా అది ప్రత్యక్ష ప్రభావం కలిగివుంది. తమ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఎంతోమంది ఒంటరి తల్లులు తీవ్రంగా కృషి చేస్తున్నారు, మరి వారు చేస్తున్న చక్కని పనికి వారిని మెచ్చుకోవల్సిందే. అయితే, తలిదండ్రులిద్దరూ ఉన్న కుటుంబాల్లో పెరిగే పిల్లలు సామాన్యంగా మరెక్కువ మెరుగ్గా ఉన్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
2,100 మంది యుక్తవయస్కులపై ఆస్ట్రేలియాలో జరిపిన ఒక అధ్యయనం, “ఐక్య కుటుంబాల నుండి వచ్చిన పిల్లలకన్నా విడిపోయిన కుటుంబాల్లో నుండి వచ్చిన పిల్లలకు ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వారిలో భావోద్వేగ సమస్యలు ఎక్కువగా కనపడే అవకాశం ఉందని, లైంగికంగా ఎక్కువ క్రియాశీలంగా ఉండే అవకాశం ఉందని” తెలిపింది. యు.ఎస్. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ స్టాటిస్టిక్స్ జరిపిన ఒక అధ్యయనం, విచ్ఛిన్నమైన కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు, “ఏదైనా ప్రమాదానికి గురయ్యే అవకాశం 20-30 శాతం ఎక్కువగాను, స్కూల్లో ఒకే తరగతిలో రెండు సార్లు కూర్చోవల్సివచ్చే అవకాశం 40-75 శాతం ఎక్కువగాను, స్కూలు నుండి బహిష్కరించబడే అవకాశం 70 శాతం ఎక్కువగాను” ఉందని వెల్లడించింది. అంతేగాక, కార్యాచరణ విధాన విశ్లేషకుడు ఒకాయన, “సాంప్రదాయిక గృహాల్లో కన్నా, తల్లి లేక తండ్రి మాత్రమే ఉన్న గృహాల్లో పెరిగిన పిల్లలు నేరాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని” నివేదిస్తున్నాడు.
గృహమే ఆశ్రయస్థానం
కుటుంబ ఏర్పాటు అనేది అందరికీ ఒక ఆనందకరమైన, క్షేమాభివృద్ధికరమైన, ఆహ్లాదకరమైన గృహాన్ని అందిస్తుంది. “సంతోషానికీ, సంక్షేమానికీ అత్యంత ప్రాముఖ్యమైన మూలం కెరీర్‌గాని, వస్తువులుగాని, సరదా పనులుగాని లేక స్నేహితులుగాని కాదు, కుటుంబమే దానికి మూలం” అని స్వీడన్‌కు చెందిన ఒక అధికారిక మూలం తెలియజేస్తుంది.
భూమ్మీది ప్రతి కుటుంబమూ కుటుంబాలన్నింటికీ గొప్ప సృష్టికర్త అయిన యెహోవా దేవుడ్నిబట్టే కుటుంబమని పిలువబడుతుందనీ, ఎందుకంటే కుటుంబ ఏర్పాటును స్థాపించింది ఆయనేననీ బైబిలు చూపిస్తుంది. (ఆదికాండము 1:27, 28; 2:23, 24; ఎఫెసీయులు 3:14, 15) అయితే, కుటుంబంపైన క్రూరమైన దాడి జరుగుతుందని అపొస్తలుడైన పౌలు ప్రేరేపిత లేఖనాల్లో ముందే చెప్పాడు, దాని ఫలితంగా క్రైస్తవ సంఘానికి వెలుపట నైతికతా, మానవ సమాజమూ పతనమౌతాయనీ చెప్పాడు. “అంత్య దినములలో” చివరికి ‘భక్తిగలవారిలో’ కూడా అవిధేయత, ‘అనురాగం’ కొరవడడం, తలిదండ్రులకు అవిధేయత చూపడం వంటివి ఉంటాయని ఆయన చెప్పాడు. అటువంటి వారికి విముఖులై ఉండమని ఆయన క్రైస్తవులకు ఉద్బోధచేశాడు. దేవుని సత్యంపట్ల కలిగే వ్యతిరేకత కుటుంబాలను విభజిస్తుందని యేసు ముందే చెప్పాడు.—2 తిమోతి 3:1-5; మత్తయి 10:32-37.
అయితే దేవుడు మనల్ని నిస్సహాయులనుగా విడిచిపెట్టలేదు. కుటుంబ సంబంధాల విషయంలో ఎంతో ఉపదేశాన్ని ఆయన తన వాక్యంలో అందించాడు. కుటుంబాన్ని ఎలా విజయవంతం చేసుకోవచ్చో, గృహాన్ని ఆనంద నిలయంగా ఎలా చేసుకోగలమో అది మనకు చెబుతుంది. కుటుంబంలోని ప్రతి సభ్యునికి ఇతరులపట్ల నెరవేర్చవలసిన ఒక బాధ్యత ఉందని ఆ గ్రంథం చెబుతుంది.a—ఎఫెసీయులు 5:33; 6:1-4.
కుటుంబం ఇంత తీవ్రమైన ప్రమాదంలో ఉన్న ఈ రోజుల్లో అటువంటి సంతోషకరమైన సంబంధాన్ని కల్గివుండడం సాధ్యమా? తప్పకుండా సాధ్యమే! ఆయాసకరమైన ఎడారిలాంటి ఈ లోకంలో మీ కుటుంబాన్ని ఒక ఆనందించదగ్గ, సేదదీర్పునిచ్చే ఒయాసిస్సుగా చేసుకోవడంలో విజయాన్ని సాధించవచ్చు. కానీ ఇందుకు కుటుంబంలోని ప్రతి ఒక్కరి తోడ్పాటు ఉండాలి. క్రింద కొన్ని సూచనలు ఉన్నాయి.
మీ కుటుంబం కాపాడబడడానికి సహాయం
కుటుంబం ఐక్యంగా ఉండడానికి అత్యంత శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి ఏమిటంటే సమయాన్ని అందరూ కలిసి గడపడమే. సభ్యులందరూ ఇష్టపూర్వకంగా తమ తీరిక సమయాన్ని కుటుంబంతో గడపాలి. అంటే త్యాగాలు అవసరమవుతాయని దీనర్థం. ఉదాహరణకు యౌవనస్థులారా, మీరు మీ అభిమాన టీవీ కార్యక్రమాన్ని, క్రీడా కార్యక్రమాన్ని, లేక స్నేహితులతో బయట సమయం గడపడాన్ని త్యాగం చేయాల్సి రావచ్చు. తండ్రులారా, కుటుంబాన్ని ప్రధానంగా పోషించేది సాధారణంగా మీరే కాబట్టి, మీ తీరిక సమయాన్ని కేవలం మీ సరదాలు తీర్చుకోవడానికో లేక ఇతర వ్యక్తిగత పనులు చేసుకోవడానికో ఉపయోగించుకోకండి. కుటుంబమంతటితో గడిపేలా కార్యకలాపాలను ప్లాన్ చేయండి, బహుశ శని ఆదివారాల్లో లేక సెలవుల్లో సమయాన్ని ఎలా గడపాలో పథకం వేసుకోండి. ఒక్క మాట, అందరూ ఎదురుచూసేటువంటి, ఆనందాన్ని అనుభవించేటువంటి వాటికొరకు ప్లాన్ చేయండి.
పిల్లలకు శ్రేష్ఠమైన సమయం అని పిలువబడేది—అంటే వేసుకున్న పట్టిక ప్రకారం ఠంచనుగా పిల్లల్తో గంటా అరగంటా గడపడం—మాత్రమే సరిపోదు. వారికి సమయం ఎక్కువ పరిమాణంలో కావాలి. స్వీడన్‌లోని ఒక దిన పత్రికలో కాలమిస్ట్ ఇలా వ్రాస్తున్నాడు: “నా 15 ఏళ్ల రిపోర్టరు చరిత్రలో, నేనెంతోమంది బాలనేరస్థులను కలిశాను . . . వారిలో సామాన్యంగా ఉండే విషయం ఏమిటంటే వారు కేవలం నాణ్యమైన సమయాన్ని మాత్రమే పొందారన్నట్లు కనబడుతుంది: ‘నా తలిదండ్రులకు టైమే ఉండేదికాదు.’ ‘వాళ్లెప్పుడూ నేను చెప్పేది వినిపించుకునేవారుకాదు.’ ‘డాడీ ఎప్పుడూ ప్రయాణాలు చేస్తుండేవాడు.’ . . . మీ పిల్లవానికి ఎంత సమయాన్ని ఇస్తారన్నది ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు ఎంపిక చేసుకోవచ్చు. మీ ఎంపిక ఎంత సరైనదన్నది 15 సంవత్సరాల తర్వాత క్రూరునిగా తయారైన ఒక 15-ఏండ్ల పిల్లవాని ద్వారా తేలుతుంది.”
డబ్బు విషయంలో సరైన దృక్కోణం
డబ్బు విషయంలో సభ్యులందరు సరైన దృక్కోణాన్ని ఏర్పరచుకోవాలి. వారు కుటుంబపు ఉమ్మడి ఖర్చులను భరించడానికిగాను తాము చేయగల్గినంత చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇల్లు గడవడానికి చాలామంది స్త్రీలు ఉద్యోగాన్ని సంపాదించుకోవల్సి ఉంటుంది, కానీ భార్యలారా, మీరు ఎదుర్కోగల ప్రమాదాల గురించీ, ప్రలోభాల గురించీ మీకు తెలిసి ఉండాలి. ఈ లోకం, మిమ్మల్ని మీరు “సంతృప్తి” పరచుకోమని, “మీకిష్టం వచ్చినట్లు చేయండి” అని మీకు ఉద్బోధ చేస్తుంది. అది మీరు ఒక తల్లిగా, ఒక మంచి ఇల్లాలిగా దేవుడు మీకిచ్చిన మీ పాత్ర విషయంలో మీరు స్వతంత్రులయ్యేలా లేక అసంతృప్తిని వెలిబుచ్చేవారిగా చేస్తుండవచ్చు.—తీతుకు 2:4, 5.
తల్లులుగా మీరు ఇంటిదగ్గరుండి మీ పిల్లలకు మార్గదర్శకులుగా, వారికి స్నేహితులుగా ఉండగల్గితే, అది సుఖదుఃఖాల్లో మీ కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడానికి సహాయపడే బలమైన బంధాల్ని నిర్మించడంలో నిశ్చయంగా చాలా తోడ్పడుతుంది. ఒక గృహాన్ని ఆనందకరమైనదిగా, భద్రతగలదిగా, ముందుకు సాగేదిగా చేయడానికి ఒక స్త్రీ విశిష్టంగా తోడ్పడగలదు. “ఒక సైనిక శిబిరం తయారుకావడానికి వందమంది పురుషులు కావాలి, కానీ ఒక గృహం తయారుకావడానికి ఒక్క స్త్రీ చాలు” అని 19వ శతాబ్దపు ఒక రాజకీయవేత్త అన్నాడు.
కుటుంబంలోని వారందరూ కుటుంబపు పూర్తి ఆదాయానికి లోపలే జీవించడానికి సహకరిస్తే, అది ఎన్నో సమస్యలనుండి కుటుంబాన్ని కాపాడుతుంది. జీవితాన్ని సరళంగా ఉంచుకుంటూ ఆధ్యాత్మిక ఆసక్తులను ముందుంచుకోవడానికి దంపతులు నిర్ణయించుకోవాలి. పిల్లలు సంతృప్తిగా ఉండడానికి నేర్చుకోవాలి, కుటుంబ బడ్జెటు భరించలేని వస్తువులు కావాలని డిమాండు చేయకూడదు. నేత్రాశ విషయంలో జాగ్రత్తగా ఉండాలి! తాహతుకు మించిన వస్తువులను కొనుక్కోవాలనే ప్రలోభమూ, అటుతర్వాత అప్పుల్లోకి కూరుకుపోవడమూ చాలా కుటుంబాలు పతనమయ్యేందుకు నడిపించాయి. అందరూ ఏదైనా సమిష్టి కార్యక్రమానికి—ఆహ్లాదకరమైన ప్రయాణానికి, ఉపయోగపడే ఆనందించదగ్గ గృహోపకరణాలను కొనడానికి, లేక క్రైస్తవ సంఘానికి మద్దతునివ్వడానికి చందాలు వేయడానికి తమ డబ్బును ఖర్చుచేయడం కుటుంబ ఐక్యతకు ప్రోది చేయగలదు.
ఆనందకరమైన కుటుంబ స్ఫూర్తికి మరొక రకమైన “చందా” ఏమిటంటే కుటుంబ సభ్యులందరూ ఇంటిని, తోటను, కారును, ఇంకా ఇతరత్రాను శుభ్రపర్చుకోవడంలోనూ, బాగుచేయడంలోనూ, జాగ్రత్తగా చూసుకోవడంలోనూ తమవంతు కృషిని చేయాలి. కుటుంబంలోని ప్రతి సభ్యునికీ చివరికి చిన్నవారికి కూడా ఏదైనా పనిలో కొంత భాగాన్ని అప్పగించవచ్చు. పిల్లల్లారా, మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. బదులుగా, సహాయం చేయాలన్న స్ఫూర్తిని, సహకరించాలన్న స్ఫూర్తిని అభివృద్ధి చేసుకోండి; ఇది నిజమైన స్నేహాలకు, సహవాసాలకు దారితీస్తుంది, మళ్లీ ఇది కుటుంబ ఐక్యతను బలోపేతం చేస్తుంది.
బైబిలు విద్య విలువ
ఒక ఐక్య క్రైస్తవ కుటుంబంలో, క్రమమైన బైబిలు పఠనం యొక్క ప్రాముఖ్యత నొక్కితెల్పబడుతుంది. బైబిలు వచనాలను ప్రతిదినము చర్చించడం, పరిశుద్ధ లేఖనాలను ప్రతి వారం పఠించడం ఒక ఐక్య కుటుంబానికి ఒక ఆలంబననిస్తాయి. కుటుంబంలోని వారందరి హృదయాలనూ కదిలించే రీతిలో ప్రాథమిక బైబిలు సత్యాలను, సూత్రాలను కలిసి చర్చిం చాలి.
అటువంటి కుటుంబ సమావేశాలు విద్యాదాయకంగా ఉండాలి, కానీ అదే సమయంలో ఆనందదాయకంగాను, ప్రోత్సాహకరంగాను ఉండాలి. స్వీడన్‌కు ఉత్తరాన ఉన్న ఒక కుటుంబం, ఆ వారంలో ఎదురైన ప్రశ్నలను పిల్లలు వ్రాసివుంచుకోమని ప్రోత్సహిస్తుంది. ఆ ప్రశ్నలు తర్వాతి వారపు బైబిలు పఠనంలో చర్చించబడేవి. ప్రశ్నలు తరచూ గూఢంగాను ఆలోచనను రేకెత్తించేవిగాను ఉండేవి. అంతేగాక అవి పిల్లల ఆలోచనా సామర్థ్యాలకు, బైబిలు బోధలపట్ల ఉన్న మెప్పుదలకు అద్దంపట్టేవి. కొన్ని ప్రశ్నలు: “అన్నింట్లో పెరుగుదల కలిగేలా యెహోవా ఎప్పుడూ చేస్తూనే ఉంటాడా, లేక ఆయన ఒకేసారి అలా చేసి ఊరుకున్నాడా?” “దేవుడు మానవుడు కాడు కదా, ఆయన మనిషిని ‘తన స్వరూపంలో’ సృష్టించాడని బైబిలు ఎందుకు చెబుతుంది?” “ఆదాము హవ్వలకు చెప్పులూ బట్టలూ ఏమీ లేవుకదా, మరి వారు పరదైసులో చలికాలంలో చలికి బిగుసుకుపోలేదా?” “రాత్రిపూట చీకటిగా ఉండాలికదా, మరి మనకు చంద్రుడెందుకు?” ఆ పిల్లలు ఇప్పుడు పెరిగిపెద్దయ్యారు, పూర్తికాల పరిచారకులుగా దేవుణ్ణి సేవిస్తున్నారు.
కుటుంబ సమస్యలతో వ్యవహరిస్తున్నప్పుడు తల్లిదండ్రులారా, మీరు అనుకూల దృక్పథంతోను ఆనందంగాను ఉండడానికి కృషి చేయడం మంచిది. ఇతరుల్ని పరిగణనలోనికి తీసుకోండి, పరిస్థితులకు అనుకూలంగా మారండి, అయితే ప్రాముఖ్యమైన సూత్రాలను పాటించేటప్పుడు కచ్చితంగా ఉండండి. దేవునిపట్ల ప్రేమా, సరియైన ఆయన సూత్రాలపట్ల ప్రేమా ఎల్లప్పుడూ మీ నిర్ణయాలను నియంత్రిస్తాయని మీ పిల్లలు గ్రహించేలా చేయండి. స్కూలు వాతావరణం సాధారణంగా చాలా ఒత్తిడిని, క్రుంగుదలను కలుగజేస్తుంది, అందుకనే అటువంటి ప్రభావాన్ని త్రిప్పికొట్టడానికి పిల్లలకు ఇంట్లో చాలా ప్రోత్సాహం కావల్సివస్తుంది.
తలిదండ్రులారా, మీరు పరిపూర్ణులన్నట్లు నటించకండి. తప్పుల్ని ఒప్పుకోండి, అవసరమైనప్పుడు మీ పిల్లలకు క్షమాపణలు చెప్పండి. యౌవనస్థుల్లారా, అమ్మా నాన్నలు ఏదైనా ఒక పొరపాటును ఒప్పుకున్నప్పుడు వారిపట్ల మీ ప్రేమను పెంచుకోండి.—ప్రసంగి 7:16.
అవును, ఒక ఐక్యమైన కుటుంబం శాంతి, భద్రత, సంతోషాలతో విలసిల్లే గృహాన్ని అందిస్తుంది. జర్మన్ కవి అయిన గాథ్ ఒకసారిలా అన్నాడు: “రాజైనా రైతైనా, ఇంట్లో సంతోషాన్ని పొందేవాడే అసలైన సంతోషం గలవాడు.” మెప్పుదలగల తలిదండ్రులకూ పిల్లలకూ ఇల్లువంటి స్థలం మరోటి ఉండకూడదు.
నిజమే, నేడు మనం జీవించే లోకంలోని ఒత్తిళ్లవల్ల కుటుంబం తీవ్ర ప్రమాదంలో ఉంది. కానీ కుటుంబం దేవుడినుండి వచ్చింది గనుక అది కాపుదలను పొందుతుంది. ఆనందకరమైన కుటుంబ జీవితానికైన దేవుని నీతియుక్తమైన మార్గదర్శకాలను అనుసరిస్తే మీ కుటుంబం కాపాడబడుతుంది, మీరు కూడా కాపాడబడతారు.
[అధస్సూచి]
a ఈ విషయంపై మరిన్ని వివరాల కోసం, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన 192 పేజీల పుస్తకమైన కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం చూడండి.