కాన్స్టెంటైన్ ది గ్రేట్—క్రైస్తవత్వ సమర్థకుడా?
“గ్రేట్ (గొప్పవాడు)” అనే పదాన్ని చరిత్ర ఎవరెవరి పేర్లకైతే జత చేసి వారి పేర్లను అలంకరించిందో ఆ కొద్దిమంది పురుషుల్లో రోమా చక్రవర్తి కాన్స్టెంటైన్ ఒకడు. “సెయింట్,” “పదమూడవ అపొస్తలుడూ,” “అపొస్తలులకు సమానుడైన పరిశుద్ధుడూ,” ‘యావత్ ప్రపంచంలో మహా గొప్ప మార్పును తీసుకువచ్చేందుకు దేవుని దయ మూలంగా ఎంపిక చేయబడిన వాడు’ అనే వ్యక్తీకరణలను క్రైస్తవ మత సామ్రాజ్యం జత చేసింది. మరో వైపున, “లెక్కకు మించిన దౌష్ట్యాల కారణంగా రక్తాపరాధీ, నిందితుడే కాకుండా నిలువెల్లా ద్వేషాగ్ని గలవాడూ, . . . ఘోరమైన నేరాలు చేసిన నీచుడైన నియంత” అని కొందరు కాన్స్టెంటైన్ను వర్ణిస్తారు.
క్రైస్తవులమని చెప్పుకునే అనేకమందికి, క్రైస్తవత్వానికి సహాయం చేసిన వారిలో కాన్స్టెంటైన్ ది గ్రేట్ అత్యంత ప్రముఖుడు అని బోధించబడింది. రోమావారి చేతుల్లో క్రైస్తవులు అనుభవించిన దయనీయమైన హింసల నుండి వారిని రక్షించి మత స్వేచ్ఛను అనుగ్రహించాడని కొనియాడతారు. అంతేకాకుండా, క్రైస్తవ ఉద్యమాన్ని ముందుకుసాగించాలనే తీవ్ర కోరికగలవాడై అతడు యేసుక్రీస్తు అడుగుజాడలను నమ్మకంగా అనుసరించాడని విస్తృతంగా నమ్మబడుతోంది. ఈస్ట్రన్ ఆర్థడాక్స్ మరియు కోప్టిక్ చర్చీలు కాన్స్టెంటైన్నూ అతడి తల్లియైన హెలీనానూ “సెయింట్లు” అని నిర్థారించాయి, వారి పండుగను జూన్ 3వ తేదీనో లేక చర్చి ఉపయోగిస్తున్న క్యాలెండర్ ప్రకారం మే 21వ తేదీనో జరుపుకుంటాయి.
అసలు ఈ కాన్స్టెంటైన్ ది గ్రేట్ ఎవరు? అపొస్తలుల తర్వాత క్రైస్తవత్వాన్ని వృద్ధిపర్చడంలో అతడి పాత్ర ఏమిటి? చరిత్రా పండితులూ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా వినడం ఎంతో విజ్ఞానాన్ని కలిగించవచ్చు.
చరిత్రలో కాన్స్టెంటైన్
కాన్స్టాంటియస్ క్లోరస్ కుమారుడైన కాన్స్టెంటైన్ దాదాపు సా.శ. 275వ సంవత్సరంలో సెర్బియా నందలి నైసస్‌లో జన్మించాడు. తన తండ్రి సా.శ. 293లో రోమా యొక్క పశ్చిమ ప్రాంతాలకు సామ్రాట్ అయినప్పుడు, గలేరియస్ సామ్రాట్ ఆజ్ఞలపై డాన్యూబ్ నదివద్ద కాన్స్టెంటైన్ పోరాడుతున్నాడు. సా.శ. 306లో బ్రిటన్నందు మరణశయ్యపై ఉన్న తన తండ్రి వద్దకు కాన్స్టెంటైన్ తిరిగి వచ్చాడు. తండ్రి మరణించిన వెను వెంటనే, సైన్యం కాన్స్టెంటైన్ను సామ్రాట్ హోదాకు హెచ్చించింది.
ఆ సమయంలో, తాము కూడా అగస్టీలమనే చెప్పుకుంటూ ఐదుగురు ఇతరులు బయల్దేరారు. సా.శ. 306 నుండి 324 మధ్యకాలం, ఎడతెగని అంతర్యుద్ధం జరిగింది, దాని తర్వాత కాన్స్టెంటైన్ ఏకైక ఇంపరేటరయ్యాడు. రెండు దండయాత్రల్లో లభించిన విజయం, కాన్స్టెంటైన్కు రోమా చరిత్రలో ఒక పటిష్ఠమైన స్థానాన్ని కల్పించాయి, అతణ్ణి రోమా సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతిని చేశాయి.
సా.శ. 312లో, రోముకు వెలుపలనున్న మిల్వియాన్ వంతెన యుద్ధంలో తన వ్యతిరేకియైన మాక్సెంట్యస్ను కాన్స్టెంటైన్ ఓడించాడు. ఆ దండయాత్ర సమయంలో సూర్యుని క్రింద మండుతున్న సిలువ కనిపించిందనీ అది “ఈ చిహ్నం మూలంగా జయించు” అనే అర్థం గల ఇన్ హాక్ సిగ్నో విన్కెస్ అనే లాటిన్ పదాలను కలిగి ఉందని క్రైస్తవత్వ సమర్థకులు చెబుతారు. క్రీస్తు పేరులోని మొదటి రెండు అక్షరాలను గ్రీకులో తన సైనికుల డాళ్లపై ముద్రించాలని కాన్స్టెంటైన్కు ఒక స్వప్నంలో చెప్పబడిందని కూడా విశ్వసించబడుతోంది. అయితే ఈ కథ విషయంలో కాలపరిగణనలో అనేక పొరపాట్లు ఉన్నాయి. ఎ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ అనే పుస్తకం ఇలా పేర్కొంటున్నది: “ఈ దర్శనం కచ్చితంగా ఏ సమయంలో, ఏ స్థలంలో కలిగిందనే దానికీ, దాని వివరాలకూ సంబంధించిన రుజువుల విషయంలో పరస్పర విరుద్ధత ఉంది.” రోములోకి కాన్స్టెంటైన్ను ఆహ్వానిస్తూ, అన్య రోమన్ రాష్ట్రసభ అతణ్ణి ముఖ్య అగస్టస్గానూ పాంటిఫెక్స్ మాక్సిమస్గానూ అంటే ఆ సామ్రాజ్యం యొక్క అన్యమత ప్రధాన యాజకునిగా ప్రకటించింది.
తూర్పు ప్రాంతాల పరిపాలకుడైన లిసినియస్ సామ్రాట్‌తో కాన్స్టెంటైన్ సా.శ. 313లో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశాడు. మిలాన్ రాజశాసనం ద్వారా, వారిరువురూ కలిసి మత గుంపులన్నిటికీ ఆరాధనా స్వేచ్ఛనూ సమాన హక్కులనూ ఇచ్చారు. అయితే, అది ఆనవాయితీగా వ్రాయబడిన లేఖేననీ, క్రైస్తవత్వం వైపుకు మరలటాన్ని సూచించే ముఖ్య సామ్రాజ్య సంబంధ పత్రం కాదనీ అంటూ అనేకమంది చరిత్రకారులు ఈ పత్రం ప్రాముఖ్యతను తగ్గిస్తున్నారు.
దాని తర్వాతి పది సంవత్సరాల్లోనే, కాన్స్టెంటైన్ తన చివరి ప్రత్యర్థి అయిన లిసినియస్‌ను ఓడించి, రోమా ప్రపంచపు తిరుగులేని రారాజయ్యాడు. ఇంకా బాప్తిస్మం తీసుకోకముందే సా.శ. 325లో, “క్రైస్తవ” చర్చి యొక్క గొప్ప అఖిల చర్చి మతసభలో అతడు ఆధిపత్యం వహించాడు, అందులో ఏరియనిజం ఖండించబడి, నైసీయ క్రీడ్ అని పిలువబడిన ప్రాముఖ్యమైన విశ్వాసాలు పేర్కొనబడిన లేఖ సిద్ధం చేయబడింది.
సా.శ. 337లో కాన్స్టెంటైన్ తీవ్రంగా వ్యాధిగ్రస్థుడయ్యాడు. తన జీవితంలోని అవసాన దశలో అతడికి బాప్తిస్మం ఇవ్వబడింది, తర్వాత అతడు మరణించాడు. అతడి మరణానంతరం రాష్ట్రసభ అతణ్ణి రోమా దేవుళ్ల వరుసలో చేర్చింది.
కాన్స్టెంటైన్ వ్యూహంలో మతం పాత్ర
మూడవ మరియు నాల్గవ శతాబ్దాలకు చెందిన రోమా సామ్రాట్లు మతం ఎడల కలిగున్న సాధారణ దృక్పథానికి సంబంధించి, ఇస్డారీయ టు ఎలినికూ ఎథ్నూస్ (గ్రీకు దేశ చరిత్ర) అనే పుస్తకం ఇలా చెబుతోంది: “సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించిన వారికి అంత మతపరమైన నమ్మకాలు లేకపోయినప్పుడు కూడా, ప్రజల్లో ప్రబలివున్న ఆలోచనావిధానానికి లొంగిపోతూ తమ చర్యలకు కనీసం మతం రంగు పులిమేందుకు తమ రాజకీయ పన్నాగాల్లో మతానికి ప్రముఖ స్థానాన్ని కల్పించడం తప్పనిసరియని వారు కనుగొన్నారు.”
నిజంగానే కాన్స్టెంటైన్ తన కాలానికి తగినట్లు బ్రతికాడు. తన కెరీర్ ప్రారంభమౌతున్న సమయంలో, అతడికి కొంత “దైవిక” ప్రాపకం అవసరమైంది, అయితే తమ ప్రభావాన్ని కోల్పోతున్న రోమా దేవుళ్ల మూలంగా అది లభించే అవకాశం లేదు. దాని మతమూ ఇతర సంస్థాపనలతో పాటు ఆ సామ్రాజ్యం అంతరించిపోబోతోంది, దాన్ని సంఘటితపర్చాలంటే సరిక్రొత్తదీ చైతన్యం కలిగించేది ఒకటి అవసరమయ్యింది. హిడ్రియా సర్వసంగ్రహ నిఘంటువు ఇలా చెబుతుంది: “తన విజయానికే కాకుండా తన సామ్రాజ్యాన్ని తిరిగి వ్యవస్థీకరించేందుకు కూడా క్రైస్తవత్వం మద్దతు ఇవ్వగలదు గనుక కాన్స్టెంటైన్ ప్రత్యేకంగా క్రైస్తవత్వంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎక్కడున్న క్రైస్తవ చర్చీలైనా అవి అతడి రాజకీయ మద్దతుదారులయ్యాయి. . . . అతడు తన సమయంలోని గొప్ప ఉన్నత మతాధికారులను తన చుట్టూ చేర్చుకున్నాడు . . . తమ ఐకమత్యాన్ని దృఢంగా ఉంచుకోవాలని అతడు వారిని వేడుకున్నాడు.”
“క్రైస్తవ” మతం అప్పటికల్లా భ్రష్టుపట్టి పూర్తిగా కలుషితమైనప్పటికీ, సామ్రాజ్యంపై ఆధిపత్యం సంపాదించడం కొరకైన తన గొప్ప పథకానికి పనికి వచ్చేలా పునర్నూతనం చేసే మరియు ఐక్యపర్చే శక్తిగా చక్కగా దాన్ని ఉపయోగించవచ్చని కాన్స్టెంటైన్ గుర్తించాడు. తన సొంత రాజకీయ కార్యకలాపాలను విస్తృతపర్చుకోవడానికి మద్దతును పొందేందుకు భ్రష్ట క్రైస్తవత్వపు పునాదిని తనకు అనుగుణంగా వాడుకుంటూ, ప్రజలందరినీ ఒక “కథోలిక్” లేక విశ్వ మతం క్రింద ఐక్యపర్చాలని అతడు తీర్మానించుకున్నాడు. అన్యమతాచారాలకూ వేడుకలకూ “క్రైస్తవ” పేర్లు ఇవ్వబడ్డాయి. “క్రైస్తవ” మత నాయకులకు అన్య మత యాజకులకు వలే హోదా, జీతమూ పలుకుబడీ ఇవ్వబడ్డాయి.
రాజకీయ కారణాల కొరకు మత సామరస్యాన్ని వెంటాడుతున్న కాన్స్టెంటైన్, వ్యతిరేకతను వ్యక్తపర్చే గొంతులన్నింటినీ వేదాంతపర సత్యాల ఆధారితంగా కాక అధికసంఖ్యాకుల అంగీకారాన్ని ఆధారంగా తీసుకుని త్వరలోనే నొక్కివేశాడు. పూర్తిగా విభాగించబడిన “క్రైస్తవ” చర్చిలోని సిద్ధాంతసంబంధ వ్యత్యాసాలు, తానొక “దేవుడు పంపిన” మధ్యవర్తివలె అందులో జోక్యం చేసుకునేందుకు అతడికి అవకాశాన్నిచ్చాయి. ఉత్తరాఫ్రికాలోని డొనాటిస్ట్లతోనూ సామ్రాజ్యంలోని తూర్పు భాగంలోని ఏరియస్ అనుచరులతోనూ తనకున్న వ్యవహారాల ద్వారా, దృఢమైన ఐక్య విశ్వాసాన్ని సాధించేందుకు అనునయించడం మాత్రమే సరిపోదని అతడు త్వరలోనే తెలుసుకున్నాడు.a చర్చి చరిత్రలోని మొదటి అఖిల చర్చి మతసభను సమావేశపర్చినది ఏరియన్ వివాదాన్ని పరిష్కరించాలనే ప్రయత్నంలోనే.—“కాన్స్టెంటైన్ మరియు కౌన్సిల్ ఆఫ్ నైసీయ” అనే బాక్సు చూడండి.
కాన్స్టెంటైన్ను గురించి, చరిత్రకారుడైన పాల్ జాన్సన్ ఇలా చెబుతున్నాడు: “క్రైస్తవత్వాన్ని అతను సహించినందుకుగల ముఖ్య కారణాల్లో ఒకటి, సిద్ధాంతంపై చర్చి విధానాన్ని అదుపు చేసేందుకు అది అతడికీ రాష్ట్రానికీ అవకాశాన్ని ఇచ్చిందన్నదే అయ్యుండవచ్చు.”
అతడెప్పుడైనా క్రైస్తవుడయ్యాడా?
జాన్సన్ ఇలా పేర్కొంటున్నాడు: “కాన్స్టెంటైన్ సూర్యారాధనను ఎన్నడూ మానుకోలేదు, తన నాణాలపై సూర్యుని గుర్తు అలాగే ఉంచాడు.” కథోలిక్ ఎన్సైక్లోపీడియా ఇలా గమనించి చెబుతోంది: “కాన్స్టెంటైన్ రెండు మతాలకూ సమానాదరణనిచ్చాడు. పాంటిఫెక్స్ మాక్సిమస్‌గా అతడు అన్యారాధననూ దాని హక్కునూ కాపాడాడు.” “కాన్స్టెంటైన్ ఎన్నడూ ఒక క్రైస్తవుడు కాలేదు. అతడు తన జీవితంలోని చివరి క్షణంలో క్రైస్తవుడయ్యాడని అతడి జీవిత చరిత్ర వ్రాసిన, కైసరయకు చెందిన యుసేబియస్ చెబుతున్నాడు. అది ఏ విధంగానూ ఒప్పింపజేసేదిగా లేదు, ఎందుకంటే దానికి ముందు రోజే [కాన్స్టెంటైన్] తనకు పాంటిఫెక్స్ మాక్సిమస్ అనే బిరుదు ఉన్నందున జీయస్‌కు బలర్పించాడు” అని హిడ్రియా సర్వసంగ్రహ నిఘంటువు పేర్కొంటుంది.
సా.శ. 337లో అతడు మరణించేంత వరకూ, కాన్స్టెంటైన్ మత విషయాల సమున్నత అధికారియైన పాంటిఫెక్స్ మాక్సిమస్ అనే బిరుదును కలిగివున్నాడు. అతడి బాప్తిస్మాన్ని గురించి, ఇలా అడగడం సహేతుకంగానే ఉంటుంది: అది లేఖనాలు కోరుతున్న విధంగా నిజంగా పశ్చాత్తాపం చెంది మారుమనస్సు పొందిన తర్వాత ఇవ్వబడిందా? (అపొస్తలుల కార్యములు 2:38, 40, 41) కాన్స్టెంటైన్ యెహోవా దేవునికి సమర్పించుకున్నాడనే దానికి సూచనగా అది పూర్తిగా నీళ్లలో ముంచడం ద్వారా ఇవ్వబడిందా?—అపొస్తలుల కార్యములు 8:36-39 పోల్చండి.
“సెయింటా”?
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇలా పేర్కొంటుంది: “కాన్స్టెంటైన్ సాధించిన విషయాలను బట్టి మాత్రమే గ్రేట్ అని పిలువబడ్డాడు కానీ అతడి వ్యక్తిత్వాన్నిబట్టి కాదు. అతడి వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే, ప్రాచీన లేక ఆధునిక సమయాల్లో ఎవరైతే [గ్రేట్] అని బిరుదాంకితులైనారో వారందరిలోకీ అతడే అత్యల్పుడై ఉంటాడు.” ఎ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ అనే పుస్తకం మనకిలా తెలియజేస్తోంది: “అతడి హింసాత్మక ప్రవృత్తినీ కోపోద్రిక్తుడైనప్పుడు అతడిలో ఉండే క్రూరత్వాన్ని గురించిన తొలి నివేదికలున్నాయి. . . . అతడికి మానవ జీవం ఎడల ఎలాంటి గౌరవమూ లేదు . . . అతడి వయస్సు పైబడుతున్న కొద్దీ అతడి వ్యక్తిగత జీవితం పశుప్రాయమైంది.”
కాన్స్టెంటైన్కు వ్యక్తిత్వ పరంగా గంభీరమైన సమస్యలు ఉండినవని రుజువులు చూపుతున్నాయి. “త్వరగా కోపానికి లోనయ్యే అతడి స్వభావం అతడన్ని నేరాలు చేసేందుకు తరచూ కారణమయ్యిందని” ఒక చరిత్ర పరిశోధకుడు చెబుతున్నాడు. (“రాజవంశీకుల హత్యలు” అనే బాక్సు చూడండి.) కాన్స్టెంటైన్ “ఒక క్రైస్తవ వ్యక్తిత్వం కలవాడు” కానేకాడని హిస్టరీ ఆఫ్ యూరప్ అనే తన పుస్తకంలో చరిత్రకారుడైన హెచ్. ఫిషర్ చెబుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ ఫలాలైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహములను కలిగివున్న, “నవీనస్వభావము” ధరించుకొనిన నిజమైన క్రైస్తవునిగా అతడు ఎన్నడూ లేడని వాస్తవాలు నిరూపిస్తున్నాయి.—కొలొస్సయులు 3:9, 10; గలతీయులు 5:22, 23.
అతడి ప్రయత్నాల పర్యవసానాలు
అన్యమత పాంటిఫెక్స్ మాక్సిమస్‌గా అలా రోమా సామ్రాజ్యపు మతసంబంధ పెద్దగా కాన్స్టెంటైన్, మతభ్రష్ట చర్చి బిషప్పుల అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించాడు. అతడు వారికి రోము రాష్ట్ర మతాధికారులుగా అధికార స్థానాలనూ, ప్రాముఖ్యతనూ ధనాన్నీ ఇవ్వజూపాడు. కథోలిక్ ఎన్సైక్లోపీడియా ఇలా అంగీకరిస్తుంది: “రాజాస్థానంలోని వైభవం చేత కళ్లు మూసుకుపోయిన కొంతమంది బిషప్పులు, సామ్రాట్‌ను దేవుని దూతయనీ, పవిత్రమైన వ్యక్తియని పొగిడేంత వరకూ, అతడు దేవుని కుమారుని వలె పరలోకంలో పరిపాలిస్తాడని ప్రవచించేంతవరకూ పోయారు.”
మతభ్రష్ట క్రైస్తవత్వం రాజకీయ ప్రభుత్వం యొక్క అనుగ్రహాన్ని పొందిన కొలది, అది ఈ లోకంలో ఈ ప్రాపంచిక వ్యవస్థలో మరింత ఎక్కువగా భాగమై యేసుక్రీస్తు బోధలనుండి వైదొలగిపోయింది. (యోహాను 15:19; 17:14, 16; ప్రకటన 17:1, 2) దాని ఫలితంగా, త్రిత్వం, అమర్త్య ప్రాణము, నరకాగ్ని, పాపవిమోచనా లోకం, మృతుల కొరకు ప్రార్థలను, జపమాలల, చిత్రాల, విగ్రహాల ఉపయోగం, మరియు అటువంటి మరితర అబద్ధ సిద్ధాంతాలూ ఆచారాలతో “క్రైస్తవత్వం” విలీనమైంది.—2 కొరింథీయులు 6:14-18ని పోల్చండి.
అధికారాన్ని చెలాయించే విధానాన్ని కూడా చర్చి కాన్స్టెంటైన్నుండి ఆపాదించుకుంది. పండితులైన హెండర్సన్, బక్‌లు ఇలా చెబుతున్నారు: “సువార్తకున్న సరళత దెబ్బతిన్నది, ఆడంబరమైన ఆచారాలూ వేడుకలు ప్రవేశపెట్టబడ్డాయి, క్రైస్తవత్వాన్ని బోధిస్తున్న వారికి ప్రాపంచిక గౌరవమూ ఉద్యోగలాభాలూ అందించబడ్డాయి, తుదకు క్రీస్తు రాజ్యం సంపూర్ణంగా ప్రపంచ రాజ్యంగా మార్చబడింది.”
నిజ క్రైస్తవత్వం ఎక్కడుంది?
కాన్స్టెంటైన్కున్న “గొప్పతనం” వెనుకగల సత్యాన్ని చరిత్రాత్మక వాస్తవాలు బయల్పర్చుతున్నాయి. క్రైస్తవత్వం నిజ క్రైస్తవ సంఘానికి శిరస్సైన యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడే బదులు, కొంత వరకూ రాజకీయ ప్రయోగాల మరియు అన్య మత సామ్రాట్ల కుటిల ప్రయత్నాల ద్వారా రూపొందింది. “ఆ సామ్రాజ్యం క్రైస్తవత్వానికి లోబడిందా, లేక క్రైస్తవత్వం ఆ సామ్రాజ్యంతో వ్యభిచరించిందా?” అని చరిత్రకారుడైన పాల్ జాన్సన్ సరిగానే అడుగుతున్నాడు.
స్వచ్ఛమైన క్రైస్తవత్వానికి హత్తుకోవాలని నిజంగా ఇష్టపడే వారందరూ, నేడు నిజమైన క్రైస్తవ సంఘాన్ని గుర్తించి దానితో సహవసించేందుకు సహాయాన్ని అందుకోగలరు. నిజమైన క్రైస్తవత్వాన్ని గుర్తించేందుకూ దేవునికి అంగీకారయుక్తమైన విధంగా ఆయనను ఆరాధించేందుకూ యథార్థపరులైన ప్రజలకు సహాయపడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఎంతో ఇష్టపూర్వకంగా ఉన్నారు.—యోహాను 4:23, 24.
[అధస్సూచి]
a డొనాటిజమ్ అనేది సా.శ. నాల్గవ మరియు ఐదవ శతాబ్దాలకు చెందిన “క్రైస్తవ” తెగ. మత సంస్కారాల ప్రామాణికత పరిచారకుని నైతిక వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందనీ గంభీరమైన పాపం చేసిన ప్రజలను తమ సభ్యత్వంనుండి బహిష్కరించాలనీ దాని అవలంబకులు చెబుతారు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరాకరించిన నాల్గవ శతాబ్దపు “క్రైస్తవ” ఉద్యమమే ఏరియనిజం. దేవుడు జన్మించలేదనీ ఆయనకు ప్రారంభం లేదనీ ఏరియస్ బోధించాడు. కుమారుడు జన్మించాడు గనుక ఆయన తండ్రి వంటి స్వభావంలోనే దేవుడు కాడు. కుమారుడు నిత్యత్వంనుండి ఉనికిలో లేడు, అయితే తండ్రి చిత్తం ప్రకారం సృజించబడి ఉనికిలో ఉన్నాడు.
[28వ పేజీలోని బాక్సు]
కాన్స్టెంటైన్ మరియు కౌన్సిల్ ఆఫ్ నైసీయ
బాప్తిస్మం పొందని సామ్రాట్ అయిన కాన్స్టెంటైన్, కౌన్సిల్ ఆఫ్ నైసీయలో ఏ పాత్ర వహించాడు? ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇలా పేర్కొంటుంది: “కాన్స్టెంటైన్ తానే అధ్యక్షత వహించాడు, చర్చలను చురుకుగా నడిపించాడు . . . సామ్రాట్‌కు భయపడిన బిషప్పులు, వారిలో ఇద్దరు తప్ప మిగతా వారందరూ క్రీడ్పై సంతకాలు చేశారు, అయితే వారిలో అనేకులు తమ ఇష్టాలకు వ్యతిరేకంగానే అలా చేశారు.”
రెండు నెలలు సాగిన తీవ్ర మతపర వాదప్రతివాదాల తర్వాత, అన్యుడైన ఈ రాజకీయవేత్త విషయాల్లోకి తలదూర్చి యేసు దేవుడని అన్న వారి పక్షాన తీర్పు తీర్చాడు. కానీ ఎందుకు? “గ్రీకు వేదాంతాన్ని గురించి అడుగుతున్న ప్రశ్నలను గురించిన కనీసావగాహన కూడా కాన్స్టెంటైన్కు లేదు” అని ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్ అనే పుస్తకం చెబుతోంది. అతడు అవగాహన చేసుకున్నదల్లా మతపర విభజన తన సామ్రాజ్యానికి ముప్పు కాగలదన్న విషయం మాత్రమే. మరి తన సామ్రాజ్యాన్ని దృఢపర్చాలన్నది అతడి తీర్మానం.
కాన్స్టెంటైన్ ఆశీస్సులతో నైసీయలో సిద్ధమైన తుది పత్రాన్ని గురించి, ఇస్డారీయ టు ఎలినికూ ఎథ్నూస్ (గ్రీకు దేశ చరిత్ర) ఇలా చెబుతుంది: “ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చిలో ఐక్యతను సాధించాలన్న మొండి పట్టుదలతో అతడు ప్రయత్నించడమూ తుదకు ‘చర్చి వెలుపలి వారి బిషప్పు’గా ఎలాంటి మతపర విషయాలలో కూడా తనదే అంతిమ తీర్పు అనే అతడి నమ్మకం,. . . వేదాంతపర విషయాల పట్ల [కాన్స్టెంటైన్కున్న] వివక్షతను చూపుతున్నాయి.” ఆ కౌన్సిల్ నందు తీసుకున్న ఏ నిర్ణయానికైనా దేవుని ఆత్మ మద్దతు వాస్తవంగా ఉండి ఉంటుందా?—అపొస్తలుల కార్యములు 15:28, 29ని పోల్చండి.
[29వ పేజీలోని బాక్సు]
రాజవంశీకుల హత్యలు
ఈ ముఖ్యశీర్షిక క్రింద, ఇస్డారీయ టు ఎలినికూ ఎథ్నూస్ (గ్రీకు దేశ చరిత్ర) అనే పుస్తకం “కాన్స్టెంటైన్ చేసిన నీచమైన గృహ సంబంధ నేరాలు” అని అది పిలిచిన వాటిని వివరిస్తుంది. తన రాజ్యాన్ని స్థాపించిన వెనువెంటనే, అపేక్షించని విజయాలను ఎలా ఆనందించాలో అతడు మర్చిపోయాడు, తన చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి తెలుసుకున్నాడు. అనుమానపు మనిషి కావటమూ స్వార్థపూరితులైన మనుష్యుల ద్వారా రెచ్చగొట్టబడటమూ మూలంగా, తన తోటి అగస్టసైన లిసినియస్ కొడుకూ, తన మేనళ్లుడూ అయిన లిసినియోనస్ తనకు ప్రత్యర్థి కాగలడని అతడి విషయంలో మొదట అనుమానించడం ప్రారంభించాడు, తన తోటి అగస్టసైన లిసినియస్‌ను ఇంతకు మునుపే చంపించాడు. లిసినియోనస్ హత్య తర్వాత కాన్స్టెంటైన్ సొంత తొలి సంతానమైన క్రిస్పస్ చంపబడ్డాడు, క్రిస్పస్‌ను అతడి సవతి తల్లియైన ఫౌస్టా చంపించింది, ఎందుకంటే అతడు తన సొంత కుమారుని సంపూర్ణ సత్తాకు అడ్డంకుగా ఆమెకు అగుపించాడు గనుకనే.
ఫౌస్టా యొక్క ఈ చర్య తుదకు ఆమె నాటకీయంగా చంపబడేందుకు కారణమయ్యింది. తన కుమారుడైన కాన్స్టెంటైన్పై చివరివరకూ ఎంతో ప్రభావాన్ని కలిగివున్న ఆగస్టా హెలీనా ఆ హత్యలో ఇమిడి ఉందని అనిపిస్తుంది. కాన్స్టెంటైన్ను తరచూ అదుపుచేసిన అతడి అసంగత భావోద్రేకాలు అతడి స్నేహితులూ సహవాసులు అనేకమంది చంపబడేందుకు దారి తీసింది. హిస్టరీ ఆఫ్ మిడిల్ ఏజెస్ అనే పుస్తకం ఇలా చెబుతుంది: “తన సొంత కుమారునికీ భార్యకూ మరణశిక్ష విధించడం—హత్య చేయడం అనకుండా—అనేది అతడ్ని క్రైస్తవత్వపు ఆధ్యాత్మిక ప్రభావం ఎంతమాత్రం స్పృశించలేదని చూపుతుంది.”
[30వ పేజీలోని చిత్రం]
రోమ్‌లోని ఈ ఆర్చ్ కాన్స్టెంటైన్ను ఘనపర్చేందుకు ఉపయోగించబడింది
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
Musée du Louvre, Paris