వాళ్ళెందుకు క్షమాపణ కోరుతున్నారు?
చర్చీలు తాము చేసిన తప్పిదాల విషయమై పశ్చాత్తాపపడి, తమ తప్పులు సరిదిద్దుకోవాలన్న తలంపు క్రొత్తదేమీ కాదు. రేలీజోనీ ఏ మీటీ (మతాలు మరియు పురాణాలు) అనే మతసంబంధ నిఘంటువు ఏమని చెబుతుందంటే, తొలి చర్చీల యథార్థత మీద ఉన్న నమ్మకం మధ్యయుగంనాటి ప్రజల్లో ఆసక్తిని కలిగించి, అనేకులు మతసంస్కరణ కోసం అభ్యర్థించేందుకు నడిపింది.
1523లో, మార్టిన్ లూథర్ రోమ్‌తో గల సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్న తర్వాత, న్యూరమ్‌బర్గ్ రాజసభకు పోప్ అడ్రియన్ VI ఒక సందేశాన్ని పంపడం ద్వారా తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి దృఢపర్చేందుకు ప్రయత్నించాడు. ఆ సందేశం ఇలా ఉంది: “అనేక సంవత్సరాలుగా, పవిత్ర సింహాసనంపై అసహ్యకరమైన విషయాలు ప్రోగై కూర్చున్నాయి. . . . మిగిలిన అన్ని విషయాల కన్నా ముందు రోమా సభను సంస్కరించేందుకు మనం ప్రతివిధమైన జాగ్రత్తలను పాటించాలి. బహుశా సమస్త చెడు విషయాలు అక్కడే ఆవిర్భవించి ఉండవచ్చు.” అయితే, అలా ఒప్పుకోవడం తెగిన సంబంధాన్ని దృఢపర్చడంలోనో, పోప్ సభలోని అవినీతిని తీసివేయడంలోనో సఫలీకృతం కాలేదు.
మారణహోమం జరుగుతున్నప్పుడు, మౌనం వహించినందుకు చర్చీలు ఇటీవల బాగా విమర్శకు గురౌతున్నాయి. యుద్ధాల్లో పాల్గొనకుండా ఉండేలా తన సభ్యులను నిరుత్సాహపరచనందుకు కూడా నిందించబడుతున్నాయి. 1941లో యుద్ధం తీవ్రతరమైంది, అప్పుడు ప్రీమో మాట్‌సోలారీ అనే పేరుగల ఒక ప్రీస్ట్ ఇలా ప్రశ్నించాడు: “అంత పెద్ద వివాదాస్పదం కాని సిద్ధాంతాల విషయాలకు కూడా రోమ్ సహజంగా ప్రతిస్పందిస్తుంది, అది ఇప్పటికీ అలాగే ప్రతిస్పందిస్తుందే. మరి క్యాథలిక్ బోధలు మరీ అధోముఖం పడుతుంటే, ఎందుకు ప్రతిస్పందించలేదు?” ఇక్కడ ఆయన ఉద్దేశించిన సిద్ధాంతాలు వేటికంటే ఎక్కువ వివాదాస్పదమైనవి కావు? ఆ సమయంలో నాగరికతను చీలికలుగా చేస్తున్న యుద్ధాన్ని రేకెత్తించే జాతీయవాదాన్ని గురించే ప్రీస్ట్ అక్కడ మాట్లాడుతున్నాడు.
అయితే, వాస్తవమేమిటంటే, ఇటీవలి కాలం వరకూ, మతాలు తమ అపరాధాన్ని ఒప్పుకోవడమన్నది అసాధారణమైన విషయమే. 1832లో, క్యాథలిక్ చర్చి “పూర్వస్థితికి” రావాలని అనేకులు వాదించినప్పుడు ప్రతిస్పందిస్తూ, “నిర్దిష్ట ‘పునఃస్థాపన మరియు పునఃస్థితీకరణలను’ ప్రతిపాదించడం అర్థరహితమైన పని అన్నదీ, అలా చేస్తే అది [చర్చి] లోపాలుగలదిగా తలంచబడగలదు గనుక ఆ పద్ధతి దాని [చర్చి] భద్రతకూ, అభివృద్ధికీ హానికరమవుతుందన్నదీ స్పష్టమే” అని గ్రిగరీ XVI అన్నాడు. త్రోసిపుచ్చలేనంతటి ఘోరమైన లోపాల విషయమేమిటి? చేసిన తప్పిదాలను సమర్థించుకోవడానికి చాలా తంత్రాలు ఆవిష్కరించబడ్డాయి. ఉదాహరణకు, చర్చి పరిశుద్ధమైనది, అలాగే పాపభరితమైనది అని కొందరు వేదాంతులు చెప్పారు. తను పరిశుద్ధమైనదని—దేవుడు తనను తప్పు చేయడం నుండి తప్పిస్తాడని చర్చి తనకు తానే చెప్పుకుంది. అయినప్పటికీ, దాని సభ్యులు పాపభరితులే. కనుక, చర్చి పేరిట దారుణమైన కృత్యాలు జరిగినప్పుడు, ఆ సంస్థ బాధ్యురాలు కాదు, గానీ ఆ సంస్థలోని వ్యక్తులే దానికి బాధ్యత వహించాలి. అది సహేతుకమని అనిపిస్తుందా? రోమన్ క్యాథలిక్ వేదాంతియైన హాన్స్ క్యూంగ్ దృష్టిలో అది సహేతుకం కాదు. ఆయన ఇలా వ్రాశాడు: “మానవ ప్రపంచంలో ఎక్కడా కూడా ఆదర్శవంతమైన చర్చీ లేదు.” ఆయనిలా వివరిస్తున్నాడు: “తప్పొప్పుకోవలసిన అవసరంలేని చర్చీ ఏదీ కూడా ఉనికిలో లేదు.”
అఖిలచర్చివాదం మరియు నైతిక దృక్పథం
ఇప్పుడు చర్చీలు క్షమాపణ కోరేందుకు నడిపిన పరిస్థితులేమిటా అని మీరనుకోవచ్చు. మొదట, వేర్వేరు విభాగాల్లోని “గత విభజనలకు” తామే బాధ్యులమని ప్రొటెస్టెంట్లు మరియు ఆర్థడాక్సూ ఒప్పుకున్నారు. 1927లో స్విట్జర్‌లండ్‌లోని లోజాండ్‌లో జరిగిన “విశ్వాసము మరియు క్రమము” అనే అఖిలచర్చి కాన్ఫరెన్స్‌లో వాళ్ళు అలా ఒప్పుకున్నారు. చివరికి రోమన్ క్యాథలిక్ చర్చి వారి మాదిరిని అనుకరించింది. ముఖ్యంగా, వాటికన్ IIa మొదలుకొని, పోప్‌లతో సహా ఉన్నత శ్రేణి మతాధికారులు కూడా క్రైస్తవ మతసామ్రాజ్యంలోనే ఇన్ని విభజనలు కలిగినందుకు, ఎడతెగక చాలా సార్లు క్షమాపణ కోరారు. ఏ ఉద్దేశంతో? స్పష్టంగా, క్రైస్తవమత సామ్రాజ్యంలో మరింత ఐక్యత ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. జాన్ పాల్ II యొక్క “‘మేయా కుల్పా’ పద్ధతిలో, ఒక తంత్రముంది, అఖిలచర్చివాదమే ఆ తంత్రం” అని క్యాథలిక్ చరిత్రకారుడైన నీకోలీనో సారాల్ చెబుతున్నాడు.
అయినప్పటికీ, అందులో అఖిలచర్చివాదం కన్నా ఎక్కువే ఇమిడి ఉంది. నేడు క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క కుప్రసిద్ధ చరిత్ర సర్వవ్యాప్తంగా తెలిసిపోయింది. “క్యాథలిక్ ఈ చరిత్రనంతటినీ కాదనలేదు” అనీ, “ఆయన [పోప్] ఏ చర్చికి చెందినవాడో ఆ చర్చి మనం ఈ రోజుల్లో ఏ మాత్రం ఆమోదించలేని కృత్యాలను చేయడంగానీ అలా చేయడానికి అనుమతించడం గానీ చేసిందనీ” హాన్స్ ఉర్స్ ఫూన్ బాల్‌టాజార్ అనే వేదాంతి అంటున్నాడు. కనుక, “. . . క్షమాపణ కోరగల్గేలా చర్చి యొక్క చీకటి పుటలపై వెలుగు ప్రసరింపజేసేందుకు” పోప్ ఒక కమీషన్‌ను నియమించాడు. అయితే, తన నైతిక స్థానాన్ని తిరిగిపొందాలన్న కోరిక చర్చి ఆత్మవిమర్శ చేసుకునేందుకు సుముఖత చూపడానికి మరొక కారణమని అనిపిస్తుంది.
అదేవిధంగా, క్షమించమని చర్చీలు చేస్తున్న అభ్యర్థనపై వ్యాఖ్యానిస్తూ, చరిత్రకారుడైన ఆల్‌బర్‌టో మెలోనీ ఇలా వ్రాశాడు: “నిజానికి, తరచూ ఇలా అభ్యర్థిస్తున్నది బాధ్యత సంబంధమైన నిందలనుండి ఉపశమనం కోసమే.” అవును, ప్రజల మనస్సుల్లో నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునేందుకే క్యాథలిక్ చర్చి గత పాపాల బరువును తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. సత్యసంధంగా చెబితే, అది దేవునితో కన్నా కూడా లోకంతో సమాధానపడేందుకే ఎక్కువ ఆతురపడుతోందని చెప్పవలసిందే.
అలాంటి ప్రవర్తన ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలును మనకు గుర్తు చేస్తుంది. (1 సమూయేలు 15:1-12) ఆయన చాలా గంభీరమైన తప్పిదమే చేశాడు. అది బయలుపరచబడినప్పుడు, దేవుని నమ్మకమైన ప్రవక్తయైన సమూయేలు ఎదుట తనను తాను సమర్థించుకోవడానికే—ఏదో ఒక సాకు చెప్పడానికే ఆయన మొదట ప్రయత్నించాడు. (1 సమూయేలు 15:13-21) చివరకు, ఆ రాజు “నేను యెహోవా ఆజ్ఞను . . . మీరి పాపము తెచ్చుకొంటిని” అని సమూయేలు ఎదుట ఒప్పుకోవలసి వచ్చింది. (1 సమూయేలు 15:24, 25) అవును, ఆయన తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. అయితే, ‘నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నన్ను ఘనపరచుము’ అని ఆయన సమూయేలుతో చెప్పిన తరువాతి మాటలు ఆయన మనస్సులో ఏ విషయానికి మొదటిస్థానముందో తెలియజేశాయి. (1 సమూయేలు 15:30) స్పష్టంగా, దేవునితో సమాధానపడేదానికన్నా, ఇశ్రాయేలులో తన స్థానాన్ని గురించే సౌలు ఎక్కువ వ్యాకులపడ్డాడు. ఈ వైఖరి వలన సౌలుకు దేవుని క్షమాపణ లభించలేదు. దానికి సాదృశ్యమైన వైఖరిగల చర్చీలకు దేవుని క్షమాపణ లభిస్తుందని మీరనుకుంటారా?
అందరూ ఏకీభవించరు
చర్చీలు బహిరంగంగా క్షమాపణ కోరాలన్న విషయంతో అందరూ ఏకీభవించరు. ఉదాహరణకు, తమ పోప్ బానిసత్వం విషయమై క్షమాపణ కోరడం గానీ, హూస్ మరియు కాల్విన్ వంటి “చర్చివిరోధుల” పైవున్న అపవాదాన్ని తీసివేయడం గానీ చేస్తే రోమన్ క్యాథలిక్ సభ్యులు కలతచెందుతారు. వాటికన్ సమాచార మూలాల ప్రకారం, గత వెయ్యేండ్ల క్యాథలిక్ చరిత్ర విషయమై “అంతరాత్మ పరిశీలన” చేసుకోవాలని ప్రతిపాదిస్తూ కార్డినల్‌లకు పంపిన డాక్యుమెంట్లను 1994 జూన్‌లో పరిపాలక సభకు హాజరైన కార్డినల్‌లు విమర్శించారు. అయినప్పటికీ, బిషప్ప్‌ల కోసం వ్రాసే లేఖలో ఆ ప్రతిపాదన యొక్క ముఖ్య సారాంశాన్ని ఇమడ్చాలని పోప్ కోరినప్పుడు, ఇటలీ కార్డినల్ అయిన జాకోమో బీఫీ పాదిరీల కొరకు ఒక లేఖను వ్రాసి పంపాడు. “చర్చిలో ఏ పాపమూ లేదు” అని ఆ లేఖలో ఆయన ఖండితంగా పేర్కొన్నాడు. అయితే ఆయన ఇలా ఒప్పుకున్నాడు: “గత శతాబ్దాల్లో చర్చీ చేసిన తప్పిదాలకు క్షమాపణ కోరడం . . . ప్రజల్లో కాస్త అనుకూలమైన దృక్పథాన్ని కల్గించవచ్చు.”
“పాపాన్ని ఒప్పుకోవడమన్నది క్యాథలిక్ చర్చిలోనే అతితీవ్రమైన వివాదాస్పద విషయాల్లో ఒకటౌతుంది” అనీ, “మిషనరీల తప్పిదాలను పోప్ తెలుసుకున్నప్పుడు, సత్యసంధంగా అయిష్టాన్ని కనబరచే మిషనరీలు ఉన్నారు” అనీ వాటికన్ వ్యాఖ్యాతయైన లూయిజీ అక్కాటోలీ అంటున్నాడు. అంతేకాక, “చర్చి చరిత్ర విషయమై పోప్‌కే ఇంత భయానకమైన అభిప్రాయం ఉంటే, ఆ చర్చీనే ‘మానవ హక్కుల’ కోసం ప్రయత్నించే శూరునిగా, నిజమైన ఉజ్జ్వలమైన మూడవ వెయ్యేండ్ల పరిపాలన క్రిందకు మానవాళిని నడిపించే ఒకే ఒక ‘తల్లిగా, బోధకునిగా’ ఇప్పుడెలా పరిచయం చేయగలడో అర్థం చేసుకోవడం చాలా కష్టం” అని ఒక రోమన్ క్యాథలిక్ జర్నలిస్ట్ వ్రాశాడు.
తప్పు పట్టబడిన కలవరపాటు వల్ల మాత్రమే పశ్చాత్తాపాన్ని చూపించే వైఖరికి వ్యతిరేకంగా బైబిలు హెచ్చరికనిస్తుంది. అలాంటి పశ్చాత్తాపం ప్రవర్తనలో శాశ్వతమైన మార్పును తేవడం అరుదు. (పోల్చండి 2 కొరింథీయులు 7:8-11.) ‘మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించినప్పుడే’—అంటే, పశ్చాత్తాపంలోని యథార్థతకు రుజువున్నప్పుడే దేవుని దృష్టిలో ఆ పశ్చాత్తాపానికి విలువ ఉంటుంది.—లూకా 3:8.
పశ్చాత్తాపపడి, తప్పొప్పుకునే వ్యక్తి తప్పుడు పనులను వదిలిపెట్టాలని, వాటిని చేయడం మానుకోవాలని బైబిలు చెబుతుంది. (సామెతలు 28:13) అలా సంభవించిందా? సరే, రోమన్ క్యాథలిక్ చర్చి, ఇతర చర్చీలు తమ తప్పిదాలను ఒప్పుకున్న తర్వాత కూడా, మధ్య ఆఫ్రికాలోనూ, తూర్పు యూరప్‌లోనూ పెద్ద సంఖ్యలో “క్రైస్తవులు” పాల్గొన్న ఇటీవలి అంతఃకలహాల్లో ఏమి జరిగింది? చర్చీలు శాంతిస్ఫూర్తి ప్రదాతలుగా పనిచేశాయా? వాటి సభ్యులు చేస్తున్న క్రూర కృత్యాలకు వ్యతిరేకంగా వాటి నాయకులందరూ కలిసికట్టుగా మాట్లాడారా? లేదు. అంతెందుకు కొంత మంది మత పరిచారకులైతే ఆ నరమేధంలో భాగం వహించారు కూడా!
దైవిక తీర్పు
పోప్‌ల పునరావృతమయ్యే మేయా కుల్పాల గురించి మాట్లాడుతూ, కార్డినల్ బీఫీ వ్యంగ్యంగా ఇలా అడుగుతున్నాడు: “చరిత్రాత్మక పాపాల విషయమై సార్వత్రిక తీర్పు కోసం మనందరం వేచి ఉండడమే మంచిది కాదంటారా?” అవును, సర్వమానవజాతి యొక్క న్యాయవిధి సమీపించింది. మతం చరిత్రలోని సమస్త చీకటి పుటలూ యెహోవా దేవునికి బాగా తెలుసు. ఆయన త్వరలోనే దోషులను లెక్క అప్పజెప్పడానికి పిలుస్తాడు. (ప్రకటన 18:4-8) అంతలో, క్రైస్తవ మత సామ్రాజ్యం వేటి విషయమై మన్నించమని కోరుతుందో ఆ రక్తాపరాధమూ, హత్యాపూర్వకమైన అసహిష్ణుత, మరితర నేరాల చేత కళంకితం కాని ఆరాధనా పద్ధతిని కనుగొనడం సాధ్యమేనా? అవును సాధ్యమే.
మనమెలా కనుగొనగలం? “వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు” అని యేసు చెప్పిన సూత్రాన్ని అన్వయించడం ద్వారా కనుగొనవచ్చు. కొన్ని మతాలు మరవబడాలనుకునే చరిత్ర వృత్తాంతం యేసు చెప్పిన “అబద్ధ ప్రవక్తలను” మాత్రమే కాక, “మంచి ఫలములు” ఫలించినవారిని కూడా గుర్తించేందుకు సహాయపడుతుంది. (మత్తయి 7:15-20) వారెవరు? యెహోవాసాక్షులతో బైబిలును పరిశీలించి మీకై మీరే కనుగొనాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నేడు ఈ లోకంలో అధికారం చూపగల స్థానాన్ని భద్రపరచుకోవడానికి ప్రయత్నించక, దేవుని వాక్యాన్ని అనుసరించేందుకు నిజంగా ప్రయత్నించే వారెవరో చూడండి.—అపొస్తలుల కార్యములు 17:11.
[అధస్సూచి]
a 21వ అఖిలచర్చి కౌన్సిల్ 1962 నుండి 1965 వరకు రోమ్‌లో నాలుగు సెష్షన్‌లుగా జరిగింది.
[5వ పేజీలోని చిత్రం]
ఇలాంటి దారుణ కృత్యాల విషయమై చర్చీలు తప్పొప్పుకుంటూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాయి
[క్రెడిట్ లైను]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck