క్రిస్మస్—ప్రాపంచిక సెలవుదినమా లేక మతపరమైన పండుగ దినమా?
చైనాలో అతడు క్రిస్మస్ తాతని పిలువబడ్డాడు. యునైటెడ్ కింగ్డమ్లో ఫాదర్ క్రిస్మస్‌గా పేరుగాంచాడు. రష్యాలోని ప్రజలు గ్రాండ్‌ఫాదర్ ఫ్రోస్ట్ అనే పేరును ఉపయోగిస్తారు. మరి అమెరికాలో అతనికి శాంటాక్లాస్ అనే మారు పేరుంది.
పెద్దపొట్టా, తెల్లగా మెరిసే గెడ్డంతో ఉండే ఉల్లాసవంతుడైన ఈ వృద్ధున్ని క్రిస్మస్కు మూర్తిమంతమని అనేకులు దృష్టిస్తారు. శాంటాక్లాస్ అనేది ఓ మిథ్య, అది (ఆధునిక టర్కీలోని) మూర దేశానికి చెందిన నాలుగవ శతాబ్దంనాటి బిషప్తో ముడిపడిన సాంప్రదాయక అభిప్రాయాలపై ఆధారపడిన ఓ కట్టుకథ అనే విషయం అందరికీ తెలిసినదే.
ఆచారాలూ, సాంప్రదాయాలూ వేడుకలపై ఎల్లప్పుడూ శక్తివంతమైన ప్రభావాన్ని చూపించేవి, మరి క్రిస్మస్ వాటికి భిన్నమైందేమీ కాదు. శాంటా కట్టుకథ అనేది ప్రసిద్ధిగాంచిన ఒక సెలవు దినానికి ముడిపెట్టబడిన సాంప్రదాయ నమ్మకాలకొక ఉదాహరణ మాత్రమే. క్రిస్మస్ ఆచారాలు బైబిల్లో రాయబడిన సంఘటనలపై ఆధారపడి ఉన్నాయని కొంతమంది ప్రజలు చెబుతున్నప్పటికీ, వాస్తవానికీ ఆ ఆచారాల్లో అనేకం అన్యమతాలకు చెందినవే.
మరొక ఉదాహరణ, క్రిస్మస్ చెట్టు. ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇలా చెబుతోంది: “అన్య మతాలకు చెందిన యూరోపియన్లలో సర్వసాధారణమైన వృక్షారాధన, వాళ్లు క్రైస్తవత్వాన్ని స్వీకరించిన తర్వాత అపవాదిని భయపెట్టి పారద్రోలడానికి నూతన సంవత్సర సంబరాల్లో గృహాన్నీ, గిడ్డంగుల్నీ సతతహరిత పొదలతో అలంకరించే స్కాండినేవియా ఆచారాల్లోనూ, క్రిస్మస్ సమయంలో పక్షుల కొరకు ఓ చెట్టును పెట్టడంలోనూ నిలిచేవుంది.”
హోల్లీ పూలమాలలనో లేక మరితర సతతహరిత దండలనో చేయడమనేది మరొక ప్రసిద్ధిగాంచిన క్రిస్మస్ ఆచారం. ఇది కూడా అన్యమతారాధనలో లోతుగా పాతుకుపోయినదే. వ్యవసాయ దేవతయైన సాటర్న్కు చలికాలం మధ్యలో చేసే సాటర్నాలియా పండుగ కాలంలో ఆలయాల్ని అలంకరించడానికి హోల్లీ కొమ్మల్ని ప్రాచీన రోమన్లు ఉపయోగించేవారు. ఈ అన్యమత పండుగ, తాగి తందనాలాడడం విషయంలోనూ విచ్చలవిడితనం విషయంలోనూ దాని అదుపులేని తనానికి అది పేరుగాంచింది.
మిసల్‌టో అనే (ఇక్కడ చిత్రించబడిన) చెట్టు కొమ్మక్రింద ముద్దుపెట్టుకునే క్రిస్మస్ ఆచారం, బహుశా ఒకనికి ప్రేమకలాపంలా కన్పించినా అది మధ్యయుగాల్ని తలపింపచేస్తుంది. ప్రాచీనకాలంనాటి బ్రిటన్‌కు చెందిన డ్రుయిడ్ తెగవాళ్లు మిసల్టోకు మాంత్రిక శక్తులున్నాయని విశ్వసించేవారు; అందుకే, దాన్ని దయ్యాలనుండీ, మంత్రోచ్ఛారణల నుండీ మరితర రకాలైన దుష్టశక్తులనుండీ రక్షణగా ఉపయోగించేవారు. కాలక్రమేణా, మిసల్‌టో చెట్టుక్రింద ముద్దులాడుకోవడం వివాహానికి దారితీస్తుందనే మూఢనమ్మకం తలెత్తింది. క్రిస్మస్ కాలంలో ఈ అభ్యాసం ఇప్పటికీ కొంతమంది ప్రజల మధ్య ప్రాచుర్యంలో ఉంది.
అన్యమత బోధలచే ప్రభావితం చేయబడిన లేక పూర్తిగా వాటినుండి ఉద్భవించిన ఆధునిక కాల క్రిస్మస్ ఆచారాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. అయితే, ఇవన్నీ ఎలా వచ్చాయని బహుశా మీరు ఆలోచించవచ్చు. క్రీస్తు జన్మదినాన్ని ఘనపరుస్తున్నాన్నట్లు చెప్పుకుంటున్న ఒక సెలవు దినం క్రైస్తవత్వంకాని ఆచారాలతో అంతగా ఎలా ముడిపడివుంది? మరి ప్రాముఖ్యంగా, దీన్ని దేవుడు ఎలా దృష్టిస్తాడు?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
పేజీ 3: శాంటాక్లాస్: Thomas Nast/Dover Publications, Inc., 1978; పేజీ 3లో ఉన్న మిసల్‌టో చెట్టు, పేజీ 4లో ఉన్న చిత్రం: Discovering Christmas Customs and Folklore by Margaret Baker, published by Shire Publications, 1994