మీ మనస్సాక్షికి—శిక్షణనివ్వవలసిన విధానం
“స్వచ్ఛమైన మనస్సాక్షి మంచి నిద్రనిస్తుంది.” ఈ పాత సామెత ఒక ప్రాముఖ్యమైన వాస్తవాన్ని ఉన్నతపరుస్తుంది: మనం మన మనస్సాక్షి చెప్పేది వింటే, మనం అంతర్గత శాంతినీ అంతర్గత పొందికనూ కలిగివుంటాము.
అయితే, అలా చేయాలని అందరూ అనుకోరు. మనస్సాక్షి అనే నీచమైన కల్పిత భూతం లేక భ్రమ నుండి మానవునికి విముక్తి కలిగించాలనే దండయాత్రలో తానున్నానని అడాల్ఫ్ హిట్లర్ ప్రకటించాడు. మనుషులు తమ మనస్సాక్షిని పరిత్యజించినప్పుడు వారెంత క్రూరంగా ఉండగలరనే దానికి అతని భీకరమైన పరిపాలన వణుకుపుట్టించే మచ్చుతునకగా ఉంది. ఎలాంటి పశ్చాత్తాపమూ లేకుండా మానభంగం మరియు హత్య చేసే నేటి దౌర్జన్యపూరితమైన నేరస్థులనేకులు కూడా అంతకంటే నిర్దాక్షిణ్యంగా ఉంటారు. వీరిలో అత్యధికులు చాలా చిన్న వయస్సు వారై ఉన్నారు. ఈ ప్రవృత్తిని విశ్లేషిస్తున్న ఒక గ్రంథం యొక్క పేరులో కొంతభాగం మనస్సాక్షి లేని పిల్లలు (ఆంగ్లం) అని ఉంది.
అనేకమంది అలాంటి దౌర్జన్యపూరితమైన నేరాలను చేయాలని ఎన్నడూ ఆలోచించక పోయినప్పటికీ, లైంగిక అనైతికత, అబద్ధాలాడటం లేక మోసగించడం వంటివి చేసేటప్పుడు వారి మనస్సాక్షి ఎంతమాత్రం పరితాపం చెందదు. నైతిక విలువలు ప్రపంచవ్యాప్తంగా సన్నగిల్లుతున్నాయి. సత్యారాధన నుండి వైదొలగిన గొప్ప మత భ్రష్టత్వాన్ని సూచిస్తూ, కొందరు క్రైస్తవులు ప్రపంచం యొక్క ప్రభావానికి లొంగిపోయి తద్వారా “వాతవేయబడిన మనస్సాక్షిగలవారై” ఉంటారని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 తిమోతి 4:3) ఈ “అంత్యదినములలో” భ్రష్టత్వం సంభవించే ప్రమాదం నేడు మరింత ఎక్కువగా ఉంది. (2 తిమోతి 3:1) తమ మనస్సాక్షిని కాపాడుకునేందుకు క్రైస్తవులు తప్పక గట్టిగా కృషి చెయ్యాలి. మనం దానికి తర్ఫీదునివ్వడం ద్వారా, దాన్ని వృద్ధి చేయడం ద్వారా మనం దాన్ని కాపాడుకోగలం.
మనస్సు, హృదయం మరియు మీ మనస్సాక్షి
అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది.” (రోమీయులు 9:2, 3) కనుక మనస్సాక్షి సాక్ష్యమివ్వగలదు. అది ఒక ప్రవర్తనావిధానాన్ని పరిశీలించి, దాన్ని అంగీకరించడం లేక ఖండించడం చేయగలదు. అత్యధిక విషయాల్లో మంచి చెడ్డలను గూర్చి ఆలోచించగల వివేచనను మన సృష్టికర్త మనకిచ్చాడు. అయినప్పటికీ, మన మనస్సాక్షిని మలచి దానికి తర్ఫీదు నివ్వవచ్చు. ఎలా? దేవుని వాక్యం నుండి కచ్చితమైన జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా మనమలా చేయగలం. “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. (రోమీయులు 12:2) మీరు దేవుని తలంపులనూ చిత్తాన్నీ మీ మనస్సులో నాటుకుంటుండగా, మీ మనస్సాక్షి దైవిక విధానంలో మరింత ఎక్కువగా పని చేయడం ప్రారంభిస్తుంది.
‘యెహోవా దేవుని గురించిన మరియు యేసుక్రీస్తును గురించిన జ్ఞానాన్ని’ తీసుకునేందుకు యెహోవాసాక్షులు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి సహాయం చేశారు. (యోహాను 17:3) తమ ఉచిత గృహ బైబిలు పఠన ఏర్పాటు ద్వారా, వారు యథార్థవంతులైన వారికి లైంగికత, మత్తు పానీయాలు, వివాహం, వ్యాపార లావాదేవీలు మరితర అనేకానేక అంశాలను గురించిన యెహోవా దేవుని ప్రమాణాలను బోధిస్తారు.a (సామెతలు 11:1; మార్కు 10:6-12; 1 కొరింథీయులు 6:9, 10; ఎఫెసీయులు 5:28-33) ఈ “అనుభవజ్ఞానము”ను తీసుకోవడం, దైవిక మనస్సాక్షిని వృద్ధి చేసుకోవడంలో ఎంతో ప్రాముఖ్యమైన చర్య. (ఫిలిప్పీయులు 1:9) ఒక క్రైస్తవుడు బైబిలును గురించి ఒక పరిణతి చెందిన అవగాహనను ఏర్పరచుకున్న తర్వాత కూడా, అతని మనస్సాక్షి ఆరోగ్యంగా ఉండాలంటే అతడు తన మనస్సును దేవుని వాక్యంతో ఎడతెగక నింపుకోవాలి.—కీర్తన 1:1-3.
బైబిలు మనస్సాక్షిని మన భావాలూ భావోద్రేకాలూ ఇమిడివుండే సూచనార్థక హృదయంతో ముడిపెడుతోంది. (రోమీయులు 2:15) మన మనస్సాక్షి సరిగ్గా పని చేయాలంటే మనస్సూ హృదయమూ కలిసి సామరస్యంగా పని చేయాలి. దాని అర్థం మన మనస్సుల్లో సమాచారాన్ని నింపడం కంటే ఎక్కువే. మీరు మీ హృదయాన్ని అంటే మీ అంతరంగ భావాలు, కోరికలు మరియు వాంఛలను కూడా మలచాలి. కాబట్టి సామెతల గ్రంథం “నీ హృదయమును వొంచుము,” “నీ హృదయమును నిలుపుము,” మరియు “నీ హృదయమును నడిపించుము” అనే అక్షరార్థ భావంగల హెబ్రీ వాక్య భాగాలను ఉపయోగిస్తుంది. (సామెతలు 2:2; 23:19; 27:23) అలా చేసేందుకు ఒక మార్గం లేఖనాలను ధ్యానిస్తూ వాటిని గురించి ఆలోచించడమే. “నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును” అని కీర్తన 77:12 చెబుతుంది. ధ్యానించడం మనం మన అంతర్గత భావాలనూ ప్రేరణలనూ చేరుకునేందుకు మనకు సహాయం చేస్తుంది.
ఉదాహరణకు, మీకు పొగత్రాగడం వంటి ఏదైనా అశుభ్రమైన అలవాటు ఉందనుకోండి. అనేకమంది ప్రజలకు వలెనే, దానివలన కలిగే ఆరోగ్య ప్రమాదాలను గురించి మీకు కూడా బాగానే తెలుసు. అయినా, స్నేహితులూ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రేరేపించినప్పటికీ మీరు దాన్ని వదలుకోవడం కష్టంగా ఉందని కనుగొన్నారు. బైబిలు వర్తమానాన్ని ధ్యానించడం ఈ విషయంలో మీ మనస్సాక్షిని ఎలా దృఢపర్చగలదు?
ఒక ఉదాహరణగా, “ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము” అని చెబుతున్న 2 కొరింథీయులు 7:1 నందలి, అపొస్తలుడైన పౌలు యొక్క మాటలను ధ్యానించేందుకు ప్రయత్నించండి. ఈ మాటల భావాన్ని గ్రహించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘పౌలు సూచించిన “ఈ వాగ్దానములు” ఏవి?’ అక్కడి సందర్భాన్ని చదవడం ద్వారా, “మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినైయుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునైయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు” అని ముందు వచనాలు చెబుతున్నాయని మీరు గమనిస్తారు.—2 కొరింథీయులు 6:17, 18.
‘కల్మషము నుండి పవిత్రులనుగా చేసుకొనుడి’ అని పౌలు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఇప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంది! అలా చేసేందుకు ఒక శక్తివంతమైన ప్రేరేపణగా, ‘మనలను చేర్చుకుంటాను’ అంటే మనకు తన కాపుదలనిచ్చి మన ఎడల శ్రద్ధ వహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ‘ఒక కుమారుడు లేక కుమార్తె తన తండ్రితో కలిగి ఉండగలంతటి సన్నిహిత సంబంధాన్ని నేను ఆయనతో కలిగి ఉండగలనా?’ అని మిమ్నల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు. జ్ఞానవంతుడైన, ప్రేమగల దేవుని చేత ‘చేర్చుకొనబడటం’ లేక ప్రేమింపబడటం అనే తలంపు ఎంతో ప్రీతికరమైనదిగా లేదా? అది మీకు అసంగతంగా అనిపిస్తుంటే, ప్రేమగల తండ్రులు తమ పిల్లల ఎడల ప్రేమనూ అపేక్షనూ వ్యక్తం చేయడాన్ని గమనించండి. ఇప్పుడు మీకూ యెహోవాకూ మధ్య అలాంటి బంధం ఉండటాన్ని ఊహించుకోండి! మీరు దాని గురించి ఎంత ఎక్కువ ధ్యానిస్తే, అలాంటి సంబంధం కొరకైన మీ కోరిక అంత పెరుగుతుంది.
అయితే ఇది గమనించండి: మీరు ‘అపవిత్రమైనదానిని ముట్టకుండా’ ఉంటేనే దేవునితో సాన్నిహిత్యం సాధ్యమౌతుంది. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవుడు ఖండించే “అపవిత్రమైన” వాటిలో పొగ త్రాగడానికి అలవాటు పడిపోవడం కూడా చేరి లేదా? దాన్ని ఉపయోగించడం నన్ను నేను అన్ని విధాలైన ఆరోగ్య ప్రమాదాలకూ భేద్యున్ని చేసుకుంటూ ‘శరీరమునకు కల్మషాన్ని కలిగించుకోవడం’ కాదా? యెహోవా శుభ్రమైన, లేక “పరిశుద్ధుడైన” దేవుడు గనుక, నన్ను నేను ఈ ఉద్దేశపూర్వకంగా కలుషితం చేసుకోవడాన్ని ఆయన అంగీకరిస్తాడా?’ (1 పేతురు 1:15, 16) ‘మన ఆత్మ’ లేక మానసిక అభీష్టం యొక్క ‘కాలుష్యానికి’ విరుద్ధంగా కూడా పౌలు హెచ్చరిస్తున్నాడని గమనించండి. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ దురలవాటు నా ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేస్తుందా? నేను ఏ విధముగానైనా సరే నా వాంఛలు తీరితే చాలనుకుంటున్నానా, బహుశ నా ఆరోగ్యాన్ని, నా కుటుంబాన్ని లేక దేవుని ఎదుట నా స్థానాన్ని ప్రమాదంలో పడవేసుకునేంతగా నేను అలా చేస్తున్నానా? పొగ త్రాగడానికి అలవాటు పడిపోవడం నా జీవితాన్ని ఎంత మేరకు పాడు చేసేందుకు నేను అనుమతించాను?’ ఇలాంటి కష్టతరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం, ఆ అలవాటును మానుకునేందుకు మీకు అవసరమైన ధైర్యాన్ని కూడా ఇవ్వవచ్చు!
పొగాకుపై ఆధిపత్యాన్ని సంపాదించేందుకు మీకు ఇతరుల నుండి సహాయం మరియు మద్దతు అవసరం కావచ్చు. అయినప్పటికీ, బైబిలును ధ్యానించడం, మీకై మీరు ఆ అలవాటు నుండి విముక్తి పొందేందుకు మీ మనస్సాక్షికి తర్ఫీదునిచ్చి దాన్ని బలపర్చేందుకు ఎంతో చేయగలదు.
మనం తప్పు చేసినప్పుడు
సరైనది చేయాలని మనమెంత శ్రేష్ఠంగా ప్రయత్నించినప్పటికీ, కొన్నిసార్లు మన అపరిపూర్ణతలు మనపై విజయం సాధిస్తాయి మరి మనం తప్పిదం చేస్తాము. అప్పుడు మన మనస్సాక్షి మనల్ని బాధిస్తుంది, అయితే దాన్ని అలక్ష్యం చేసేందుకు ప్రయత్నించాలని మనం శోధింపబడవచ్చు. లేదా మనం దేవున్ని సేవించేందుకు అవసరమయే ప్రయత్నాలను అన్నింటినీ విడనాడాలని అనుకునేంతగా నిరుత్సాహం చెందవచ్చు. అయితే, రాజైన దావీదు విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన బత్షెబతో వ్యభిచరించిన తర్వాత, ఆయన మనస్సాక్షి ఆయనకు వ్యధ కలిగించింది. తాను అనుభవించిన కలతను ఆయనిలా వర్ణిస్తున్నాడు: “దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను.” (కీర్తన 32:4) బాధాకరమా? అవును బాధాకరమే! అయినప్పటికీ, ఈ దైవిక దుఃఖం దావీదు పశ్చాత్తాపం చెందేందుకు మరియు దేవునితో తిరిగి సమాధానపడేందుకు పురికొల్పింది. (2 కొరింథీయులు 7:10 పోల్చండి.) క్షమాపణ కొరకు దావీదు బహు దుఃఖంతో చేసిన విన్నపం, ఆయన ఎంతగా పశ్చాత్తాపం చెందాడో రుజువు చేస్తుంది. ఆయన తన మనస్సాక్షి చెప్పినది విన్నాడు గనుక, మారడానికీ, తుదకు తన ఆనందాన్ని తిరిగి పొందడానికీ దావీదుకు సహాయం అందించబడింది.—కీర్తన 51.
నేడు కూడా అదే జరుగగలదు. కొందరు గతకాలంలో యెహోవాసాక్షులతో బైబిలు పఠించారు, అయితే తమ జీవితాలు దేవుని ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలుసుకున్నప్పుడు వారు మానుకున్నారు. బహుశ వారు వివాహం చేసుకోకుండా వ్యతిరేకలింగ వ్యక్తితో జీవిస్తుండవచ్చు లేక అశుభ్రమైన అలవాట్లకు బానిసలై ఉండవచ్చు. వారి మనస్సాక్షి వారిని బాధించింది!
ఒకవేళ మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే, పెంతెకొస్తు దినాన అపొస్తలుడైన పేతురు పలికిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన స్వదేశస్థుల పాపాన్ని బహిర్గతం చేసినప్పుడు, ‘వారు హృదయములో నొచ్చుకొన్నారు.’ వదులుకునేందుకు బదులుగా, పశ్చాత్తాపం చెందమని పేతురు ఇచ్చిన సలహాను వారు విన్నారు, వారు దేవుని అనుగ్రహాన్ని పొందారు. (అపొస్తలుల కార్యములు 2:37-41) మీరు కూడా అదే చేయగలరు! మీ మనస్సాక్షి మీకు బాధ కలిగిస్తుందని సత్యాన్ని విడనాడే బదులు, ‘మారుమనస్సునొంది తిరిగేందుకు’ మీ మనస్సాక్షి మిమ్మల్ని పురికొల్పనివ్వండి. (అపొస్తలుల కార్యములు 3:20) దృఢ నిశ్చయతతో మరియు కృషితో, దేవుని అనుగ్రహాన్ని పొందేందుకు అవసరమైన మార్పులను మీరు చేసుకోగలరు.
‘నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి’
మీరు యెహోవా మార్గాలను ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం ప్రారంభిస్తున్నా లేక పరిణతిగల క్రైస్తవునిగా అనేక సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నా, ‘నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండండి’ అని పేతురు ఇచ్చిన సలహా మీకు యుక్తమైనదే. (1 పేతురు 3:15) అది ఒక వరమేగాని భారం కాదు. దేవుని వాక్యమైన బైబిలులో ఉన్న జ్ఞానంతో మీ మనస్సునూ మీ హృదయాన్నీ నింపుకోండి. మీ మనస్సాక్షి మీకు హెచ్చరిక నిచ్చినప్పుడు దాన్ని వినండి. మీ మనస్సాక్షి చెప్పే దానికి విధేయులు కావడం ద్వారా లభించే అంతర్గత శాంతిని ఆనందించండి.
మీ మనస్సాక్షికి తర్ఫీదునిచ్చి దాన్ని మలచడం అంత సులభమైన విషయం కాదని అంగీకరించవలసిందే. అయితే, మీకు సహాయపడేందుకు మీరు యెహోవా దేవునికి ప్రార్థించగలరు. ఆయన సహాయంతో, ‘మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసముతో’ మీరు ఆయనను సేవించగలరు.—1 తిమోతి 1:5.
[అధస్సూచీలు]
a ఉచిత గృహ బైబిలు పఠనాన్ని పొందడంలో మీరు ఆసక్తిని కలిగి ఉంటే యెహోవాసాక్షుల స్థానిక సంఘాన్ని సంప్రదించేందుకు లేక ఈ పత్రిక యొక్క ప్రకాశకులకు వ్రాసేందుకు సంకోచించకండి.
[6వ పేజీలోని చిత్రం]
దేవుని వాక్యాన్ని చదవడం మరియు ధ్యానించడం మన మనస్సాక్షికి తర్ఫీదునిచ్చేందుకు సహాయం చేస్తుంది