రాజ్య ప్రచారకుల నివేదిక
దయ్యాల ప్రభావం నుండి స్వతంత్రులు కావడం
అభిచార అభ్యాసము ఎంతోకాలంగా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేసింది. కానీ దాన్నుండి స్వతంత్రులు కావడం సాధ్యమే! ప్రాచీన పట్టణమైన ఎఫెసులోని చాలామంది విషయంలో అదే జరిగింది. బైబిలు వృత్తాంతం ప్రకారం, “మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. . . . ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.”—అపొస్తలుల కార్యములు 19:19, 20.
నేడు క్రైస్తవ సంఘము అలాంటి అభివృద్ధినే అనుభవిస్తోంది. ఎఫెసు విషయంలో జరిగినట్లుగానే విశ్వాసులౌతున్న వారిలో పూర్వం భూతవాదాన్ని అభ్యసించినవారున్నారు. జింబాబ్వేనుండి వచ్చిన ఈ క్రింది అనుభవం దీన్ని విశదీకరిస్తోంది.
గోగో (అవ్వ) మటుప తన దగ్గరున్న అభిచార సంబంధ శక్తులకు ప్రసిద్ధురాలు. నాటు మందులతో ఆమె చేసే చికిత్సకొరకు ప్రజలు జాంబియా, బోట్సువానా, దక్షిణ ఆఫ్రికా అంతటి దూరాలనుండి వచ్చేవారు. గోగో మటుప నాన్గా అవ్వడానికి, అంటే మంత్ర వైద్యునిగా అవ్వడానికి కూడా నేర్పించేది. కొన్నిసార్లు ఆమె కొందరిపైన మంత్రాలు కూడా వేసేది!
ఒక ఆదివారం ఉదయం గోగో మటుపను తమ ఇంటింటి పరిచర్యలో ఉన్న యెహోవాసాక్షులు సందర్శించారు. దుష్ట ప్రభావాలన్నింటినుండి విముక్తమైన లోకం గురించిన, నీతియుక్తమైన నూతన లోకం గురించిన బైబిలు వాగ్దానంపై ఆమెకు వారికి మధ్య జరిగిన చర్చలో చాలా ఆనందించింది. ఆమె మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు పుస్తకాన్ని తీసుకుని గృహ బైబిలు పఠనానికి అంగీకారాన్ని తెల్పింది.a కేవలం మూడుసార్లు పఠించిన తర్వాత ఆమె కూటాలకు హాజరవ్వడం ప్రారంభించింది.
తనకున్న అసాధారణమైన శక్తులు యెహోవా సర్వాధిపత్యానికి విరుద్ధంగా తిరుగుబాటు చేసిన దుష్ట ఆత్మ ప్రాణులనుండి వచ్చినవని గోగో మటుప తన బైబిలు పఠనంద్వారా తెలుసుకుంది. (2 పేతురు 2:4; యూదా 6) ఈ దయ్యాలు తమకు సాధ్యమైనంతమందిని యెహోవాకూ స్వచ్ఛారాధనకూ విరుద్ధంగా తిరిగేలా చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నాయని కూడా ఆమె తెల్సుకుంది. ఆమె బ్రతుకుతెరువు ఈ దుష్ట ఆత్మ ప్రాణులను ఆవాహన చేసుకోవడంపైనే ఆధారపడివుంది కనుక ఆమె ఇక ఏమి చేస్తుంది?
గోగో మటుప తనదగ్గరున్న తాయెత్తులూ, అభిచార సంబంధ సరంజామానంతటినీ వదిలించుకోవాలన్న కోరికను వ్యక్తం చేసింది. వీటిలో నాన్గా స్వస్థతల్లో ఉపయోగించిన తన ప్రత్యేక తలపాగా, అలాగే “మాట్లాడే కొమ్ములు” కూడా ఉన్నాయి. ఏకైక సత్య దేవుడూ, సజీవ దేవుడూ అయిన యెహోవాను తాను సేవించగల్గేందుకు అటువంటి వస్తువులన్నింటినీ వదిలించుకోవాలని గోగో మటుప అనుకుంది.
అయితే ఆమె బంధువుల్లో కొంతమంది ఇందుకు అభ్యంతరం తెలిపారు, ఎందుకంటే ఆమె వారికి ఆర్థికంగా మద్దతునిస్తుంది మరి. వారు ఆ వస్తువులనూ, వాటితోపాటు మానవాతీత శక్తులనూ తమకు ఇచ్చివేయమనీ, తద్వారా తాము లాభంపొందవచ్చనీ వారు అభ్యర్థించారు. గోగో మటుప నిరాకరించింది.
యెహోవాసాక్షుల స్థానిక సంఘం సహాయంతో, ఆమె ఆ అభిచార సంబంధ సరంజామాను మూడు పెద్ద సంచుల్లో కట్టి వాటన్నింటినీ తగలబెట్టేసింది. దయ్యాల ఆరాధనకు సంబంధించిన తన ఉపకరణాలన్నీ మంటలకు ఆహుతి అవుతుంటే గోగో మటుప గట్టిగా ఇలా అంది: “అదిగో! ఆ కొమ్ము, అది తనను తాను రక్షించుకోలేకపోతోంది.”
త్వరలోనే, గోగో మటుప ఆనందంగా యెహోవాకు తాను చేసుకున్న సమర్పణను నీటి బాప్తిస్మం ద్వారా సూచించింది. ఆమె ఇప్పుడు జీవనాన్ని ఎలా సాగిస్తోంది? కూరగాయలు అమ్మడంద్వారా. అవును, దేవుని వాక్య శక్తి ద్వారా దయ్యాల ఆరాధన నుండి ఎవరైనా స్వతంత్రులు కావచ్చు. గోగో మటుప ఇలా అంటుంది: “నేనింత స్వేచ్ఛను ఎన్నడూ అనుభవించలేదు.”
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.