“యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు”
“నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.”—కీర్తన 34:19.
1, 2. (ఎ) నేడు యెహోవా తన ప్రజలను ఎలా దీవిస్తున్నాడు? (బి) అనేకమంది క్రైస్తవులు ఏమి ఎదుర్కొంటున్నారు, ఏ ప్రశ్నలు తలెత్తుతాయి?
బైబిలు ప్రవచన నెరవేర్పుగా, యెహోవా ఆరాధికులు ఆత్మీయ పరదైసులో నివసిస్తున్నారు. (2 కొరింథీయులు 12:1-4) యెహోవాసాక్షులు ప్రేమా ఐక్యతలచే గుర్తించబడే ఒక అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి చెందిన వారైయున్నారు. (యోహాను 13:35) బైబిలు సత్యాలను గూర్చిన ప్రగాఢమైన, సంగ్రహమైన జ్ఞానంలో వారు ఆనందిస్తున్నారు. (యెషయా 54:13) యెహోవా తన ఆత్మీయ గుడారంలో అతిథులుగా ఉండగల అధిక్యతను తమకు ఇస్తున్నాడని వారు యెహోవాకెంత కృతజ్ఞులైయున్నారో!—కీర్తన 15:1.
2 యెహోవా సంస్థలోని వారందరూ ఆత్మీయ సమృద్ధిని అనుభవిస్తున్నప్పటికీ, కొందరు కొంతమేరకు శాంతి సమాధానాలతో జీవిస్తున్నారని అనిపిస్తున్నా మిగిలినవాళ్లు ఏదో ఒక విధమైన దుఃఖాలను అనుభవిస్తున్నారు. అనేకమంది క్రైస్తవులు ఎంతోకాలం పాటూ ఎటువంటి ఉపశమనమూ లేకుండా దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నట్లు ఉంది. అలాంటి పరిస్థితుల్లో నిరుత్సాహం కలగడం సహజమే. (సామెతలు 13:12) కష్టాలు రావడం దేవుడు మన ఎడల కోపంగా ఉన్నాడనేందుకు రుజువా? యెహోవా కొంతమంది క్రైస్తవులను అలక్ష్యం చేస్తూ మిగిలిన వారికి ప్రత్యేక కాపుదలను అనుగ్రహిస్తున్నాడా?
3. (ఎ) యెహోవా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు ఆయనే కారణమా? (బి) యెహోవా యొక్క నమ్మకమైన ఆరాధికులు కూడా మానవ సహజమైన కష్టాలను ఎందుకు ఎదుర్కొంటారు?
3 బైబిలిలా సమాధానమిస్తుంది: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” (యాకోబు 1:13) యెహోవా తన ప్రజలను కాపాడి, సంరక్షిస్తాడు. ఆయన వారికి జీవాన్ని అనుగ్రహించే దేవుడు. (కీర్తన 91:2-6) “యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు.” (కీర్తన 94:14) దీని అర్థం నమ్మకమైన ఆరాధికులు బాధలను అనుభవించరని కాదు. ఈ ప్రస్తుత లోక విధానం జన్మతః అపరిపూర్ణులైన వ్యక్తులచే పరిపాలించబడుతుంది. అనేకులు భ్రష్టులు. కొందరు ఖరాఖండీగా దుష్టులైయున్నారు. వారిలో ఎవరూ జ్ఞానం కొరకు యెహోవా వైపు చూడరు. ఇది అనేక విధాలైన మానవ బాధలకు దారి తీస్తుంది. మానవ అపరిపూర్ణత మరియు దుష్టత్వం యొక్క దుఃఖకరమైన పరిణామాలను యెహోవా ప్రజలు ఎల్లవేళలా నివారించలేరు అనే విషయాన్ని బైబిలు స్పష్టం చేస్తుంది.—అపొస్తలుల కార్యములు 14:22.
యథార్థ క్రైస్తవులకు బాధలు అనివార్యం
4. ఈ దుష్ట విధానంలో జీవిస్తున్నంత కాలం క్రైస్తవులందరికీ ఏది అనివార్యం మరియు ఎందుకు?
4 యేసు శిష్యులు ఈ లోకంలో ఒక భాగం కాకపోయినప్పటికీ వారు ఈ విధానంలోనే జీవిస్తున్నారు. (యోహాను 17:15, 16) సాతాను ఈ లోకంపై ఆధిపత్యం చేస్తున్న శక్తిగా బైబిలునందు బయల్పర్చబడ్డాడు. (1 యోహాను 5:19) కాబట్టి, క్రైస్తవులందరూ ఎప్పుడో ఒకసారి గంభీరమైన సమస్యలను ఎదుర్కోవడం అనివార్యం. ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకుని, అపొస్తలుడైన పేతురు ఇలా చెబుతున్నాడు: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.” (1 పేతురు 5:8, 9) అవును, క్రైస్తవుల సంఘమంతా కూడా కష్టాలు వస్తాయని అపేక్షించవచ్చు.
5. నమ్మకమైన క్రైస్తవులు జీవితంలో దుఃఖకరమైన సంగతులను అనుభవిస్తారు అనే విషయాన్ని యేసు ఎలా స్పష్టం చేశాడు?
5 మనం యెహోవాను గాఢంగా ప్రేమిస్తున్నప్పటికీ, మనమాయన సూత్రాల ఎడల యథార్థంగా ఉన్నప్పటికీ, మనం జీవితంలో దుఃఖకరమైన సంగతులను అనుభవిస్తాము. మత్తయి 7:24-27 నందు నివేదించబడిన తన ఉపమానంలో యేసు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు, అక్కడ ఆయన తన మాటలకు విధేయత చూపే వారికీ, చూపని వారికీ మధ్య ఉండే వ్యత్యాసాన్ని చూపుతున్నాడు. ఆయన విధేయులైన శిష్యులను దృఢమైన బండపై ఇంటిని కట్టుకునే బుద్ధిమంతునితో పోల్చాడు. తన మాటలకు విధేయత చూపని వారిని ఇసుకపై ఇల్లు కట్టుకునే బుద్ధిహీనునితో పోల్చాడు. పెను తుపాను తర్వాత బండపై నిర్మింపబడిన ఇల్లే తట్టుకుని నిలబడుతుంది. బుద్ధిమంతుని ఇంటిపై “వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు” అనే విషయాన్ని గమనించండి. బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ శాంతి సమాధానాలను అనుభవిస్తాడని యేసు వాగ్దానం చేయలేదు. బదులుగా, ఆ వ్యక్తి యొక్క వివేచన ఆ తుపానును తట్టుకునేందుకు ఆయనను సిద్ధం చేస్తుంది. విత్తువాని ఉపమానంలో కూడా అదే విధమైన తలంపు అందించబడింది. “యోగ్యమైన మంచి మనస్సు”గల విధేయులైన ఆరాధికులు కూడా “ఓపికతో ఫలించ”గలుగుతారని యేసు ఆ ఉపమానంలో వివరించాడు.—లూకా 8:4-15.
6. అగ్నికి తట్టుకుని నిలిచే వస్తువులను గురించిన పౌలు ఉదాహరణలో అగ్ని పరీక్షలను ఎవరు ఎదుర్కొంటారు?
6 కొరింథీయులకు వ్రాసినప్పుడు, కష్టాలను ఎదుర్కునేందుకు మనకు సహాయపడగల మన్నికగల లక్షణాల అవసరతను విశదీకరించేందుకు అపొస్తలుడైన పౌలు రూపకాలంకార భాషను ఉపయోగించాడు. బంగారం, వెండి, వెలగల రాళ్ల వంటి అగ్నిని తట్టుకునే వస్తువులు దైవిక లక్షణాలకు సూచనగా ఉన్నాయి. (సామెతలు 3:13-15; 1 పేతురు 1:6, 7 పోల్చండి.) మరో వైపు, శరీర సంబంధ లక్షణాలు కాలిపోయే వస్తువులకు పోల్చబడ్డాయి. తర్వాత పౌలు ఇలా చెబుతున్నాడు: “వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును.” (1 కొరింథీయులు 3:10-14) ఇక్కడ కూడా, మనమందరమూ ఏదో ఒక విధమైన అగ్ని పరీక్షను ఎదుర్కోవడం తప్పదని బైబిలు వివరిస్తుంది.
7. రోమీయులు 15:4 ప్రకారం, మనం శ్రమలను సహించేందుకు లేఖనాలు మనకు ఎలా సహాయం చేయగలవు?
7 కష్టాలను ఎదుర్కోవలసి వచ్చిన దేవుని యథార్థవంతులైన సేవకుల అనేకానేక వృత్తాంతాలు బైబిలునందు ఉన్నాయి, వారు కొన్నిసార్లు ఎంతో కాలం వరకూ సహించాల్సి వచ్చింది. అయినప్పటికీ, యెహోవా వారిని విడనాడలేదు. “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి” అని అపొస్తలుడైన పౌలు చెప్పినప్పుడు బహుశ ఆయన మనస్సులో ఇలాంటి ఉదాహరణలే ఉండి ఉంటాయి. (రోమీయులు 15:4) దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటూనే అనేక విపత్తులను అనుభవించిన ముగ్గురు వ్యక్తుల ఉదాహరణలను పరిశీలించండి.
బైబిలు వృత్తాంతాల నుండి మనం నేర్చుకునే విషయాలు
8. యోసేపు విషయంలో యెహోవా ఏమి అనుమతించాడు, ఎంత కాలం వరకు అనుమతించాడు?
8 యాకోబు కుమారుడైన యోసేపు చిన్న వయస్సునుండే యెహోవా అనుగ్రహాన్ని పొందాడు. అయినప్పటికీ, తన తప్పేమీ లేకుండానే, ఆయన ఒకదాని తర్వాత ఒకటి చొప్పున అనేక కష్టాలను అనుభవించాడు. ఆయన స్వంత అన్నలే ఆయనను అపహరించి, క్రూరంగా వ్యవహరించారు. ఆయన పరాయి దేశంలో దాసునిగా అమ్మబడ్డాడు, అక్కడ ఆయన అబద్ధారోపణ చేయబడి “చెరసాలలో” వేయబడ్డాడు. (ఆదికాండము 40:15) అక్కడ “వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను.” (కీర్తన 105:18) ఆయన తాను దాసత్వం మరియు చెరసాల శిక్ష అనుభవిస్తున్న కాలాల్లో, విడుదలను కోరుతూ యెహోవాకు పదే పదే విన్నపం చేసి ఉంటాడనటంలో సందేహం లేదు. అయినప్పటికీ, యెహోవా ద్వారా వేర్వేరు మార్గాల్లో బలపర్చబడుతూ ఉండినప్పటికీ, దాదాపు 13 సంవత్సరాల పాటూ ఆయన ప్రతి రోజూ ఒక దాసునిగానే లేక ఖైదీగానే ఉండిపోయాడు.—ఆదికాండము 37:2; 41:46.
9. దావీదు అనేక సంవత్సరాల పాటు ఏమి సహించవలసి వచ్చింది?
9 దావీదు విషయంలో కూడా అదే విధంగా జరిగింది. ఇశ్రాయేలీయులపై పరిపాలించేందుకు యెహోవా ఒక యోగ్యుడైన వ్యక్తిని ఎంపిక చేసుకుంటూ, ఇలా అన్నాడు: “నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు.” (అపొస్తలుల కార్యములు 13:22) దావీదు యెహోవా దృష్టిలో అనుగ్రహాన్ని పొందినప్పటికీ, ఎన్నో బాధలుపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో, ఆయన అనేక సంవత్సరాలు అడవుల్లోనూ, గుహల్లోనూ బండ సందుల్లోనూ విదేశీ ప్రాంతంలోనూ తలదాచుకున్నాడు. ఒక క్రూర జంతువును వేటాడినట్లు తనను వేటాడినప్పుడు ఆయన నిరుత్సాహానికి గురయ్యాడు, భయపడ్డాడు. అయినప్పటికీ, ఆయన యెహోవా శక్తితో వాటిని సహించాడు. దావీదు తన స్వంత అనుభవంతో యుక్తంగానే ఇలా చెప్పగలిగాడు: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.”—కీర్తన 34:19.
10. నాబోతుకూ అతని కుటుంబానికీ ఏ తీవ్రమైన విపత్తులు ఎదురయ్యాయి?
10 ప్రవక్తయైన ఏలియా కాలంలో, అబద్ధ దేవతయైన బయలు ఎదుట మోకాళ్లూనని వారు ఇశ్రాయేలులో కేవలం 7,000 మంది మాత్రమే. (1 రాజులు 19:18; రోమీయులు 11:4) బహుశ వారిలో ఒకడైయుండిన నాబోతు భయంకరమైన అన్యాయానికి గురయ్యాడు. దైవదూషణ చేశాడనే నిందను మోయవలసిన అవమానానికి అతడు గురయ్యాడు. దోషిగా నిరూపించబడినందున, అతడు రాళ్లతో కొట్టి చంపబడాలని రాజు తీర్పు తీర్చాడు, అతని రక్తాన్ని కుక్కలు నాకాయి. చివరికి అతడి కుమారులు కూడా చంపబడ్డారు! వాస్తవానికి, అతడు నిరపరాధి. అతడికి విరుద్ధంగా సాక్ష్యమిచ్చిన వారు అబద్ధీకులు. ఆ వ్యవహారమంతా కూడా, నాబోతుకు చెందిన ద్రాక్ష తోటను రాజు పొందడానికిగానూ దుష్ట రాణియైన యెజెబెలు పన్నిన పన్నాగం.—1 రాజులు 21:1-19; 2 రాజులు 9:26.
11. బైబిలు చరిత్రలోని నమ్మకమైన స్త్రీ పురుషులను గురించి అపొస్తలుడైన పౌలు ఏమి వ్రాశాడు?
11 యోసేపు, దావీదు మరియు నాబోతులు కష్టాలను అనుభవించారని బైబిలులో ప్రస్తావించబడిన అనేకమంది నమ్మకమైన స్త్రీ పురుషులలో ముగ్గురు మాత్రమే. అపొస్తలుడైన పౌలు గత కాలమంతటిలోని యెహోవా సేవకుల చారిత్రాత్మక సమీక్షను వ్రాశాడు. దానిలో, ఆయన “తిరస్కారములను కొరడాదెబ్బలను, బంధకములను ఖైదును అనుభవించి”న వారి గురించి ప్రస్తావించాడు. వారు “రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు.” (హెబ్రీయులు 11:36-38) అయితే యెహోవా వారిని ఎడబాయ లేదు.
కష్టాలనుభవిస్తున్న వారి ఎడల యెహోవా శ్రద్ధవహిస్తాడు
12. నేడు యెహోవాసాక్షులు అనుభవిస్తున్న కొన్ని కష్టాలు ఏవి?
12 నేడు యెహోవా ప్రజల సంగతేమిటి? ఒక సంస్థగా మనం దైవిక కాపుదల కొరకు మరియు ఈ అంత్య దినాలనూ మహాశ్రమనూ సురక్షితంగా దాటడానికి ఎదురు చూడవచ్చు. (యెషయా 54:17; ప్రకటన 7:9-17) అయితే, ఆ యా వ్యక్తులుగా మానవులందరికీ “అదృష్టవశముచేతనే కాలవశము చేతనే” పరిస్థితులు తారుమారౌతాయని మనం గుర్తిస్తాము. (ప్రసంగి 9:11) నేడు కష్టాలను అనుభవిస్తున్న నమ్మకమైన క్రైస్తవులు అనేకమంది ఉన్నారు. కొందరు తీవ్రమైన దారిద్ర్యాన్ని సహిస్తున్నారు. శ్రమలనుభవిస్తున్న క్రైస్తవులైన “దిక్కులేని పిల్లలను విధవరాండ్రను” గురించి బైబిలు మాట్లాడుతుంది. (యాకోబు 1:27) ఇతరులు ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, నేరం, అధికార దుర్వినియోగం, అనారోగ్యం మరియు మరణం మూలంగా బాధలను అనుభవిస్తారు.
13. ఏ కష్టతరమైన అనుభవాలు ఇటీవల నివేదించబడ్డాయి?
13 ఉదాహరణకు, వాచ్‌టవర్ బ్రాంచి కార్యాలయాలు యెహోవాసాక్షుల పరిపాలక సభకు తమ 1996 నివేదికను పంపుతూ, బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవిస్తున్నందుకు మన సహోదరీ సహోదరుల్లో కొందరు అతి దారుణమైన పరిస్థితుల్లో చెరసాలలో వేయబడ్డారని తెలియజేశాయి. ఒక దక్షిణ అమెరికా దేశంలో, గొరిల్లా గుంపులు వందలాది సాక్షులను ఆ ప్రాంతంనుండి తరలి వెళ్లమని ఒత్తిడి చేసినప్పుడు మూడు సంఘాలు రద్దు చేయబడ్డాయి. ఒక పశ్చిమాఫ్రికా దేశంలో, అంతర్యుద్ధంలో మొదలైన గొడవలో చిక్కుకున్న కొంతమంది సాక్షులు చంపబడ్డారు. మధ్య అమెరికా దేశంలో, అప్పటికే సంక్లిష్టంగా ఉన్న కొంతమంది సహోదరుల ఆర్థిక పరిస్థితి, అనుకోకుండా దాడి చేసిన ప్రచండమైన తుపాను మూలంగా క్షీణించింది. దారిద్ర్యమూ, ఆహార కొరతా గంభీరమైన సమస్యలు కాని ఇతర స్థలాల్లో, ప్రతికూల ప్రభావాలు కొందరి ఆనందాన్ని క్షీణింపజేయవచ్చు. ఆధునిక దిన జీవన విధానంలోని ఒత్తిడుల మూలంగా అనేకులు కృంగిపోతున్నారు. మరి కొందరు రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రజల ఉదాసీనత మూలంగా నిరుత్సాహపడవచ్చు.
14. (ఎ) యోబు మాదిరి నుండి మనమేమి నేర్చుకుంటాము? (బి) మనం బాధలను అనుభవిస్తున్నప్పుడు ప్రతికూలంగా ఆలోచించే బదులు మనమేమి చేయాలి?
14 ఈ పరిస్థితులను దేవుని కోపానికి రుజువులుగా మనం విశ్లేషించకూడదు. యోబు పరిస్థితినీ ఆయన అనుభవించిన అనేక కష్టాలనూ జ్ఞాపకం చేసుకోండి. ఆయన “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై”న వాడు. (యోబు 1:8) యోబు తప్పు చేశాడని ఎలీఫజు ఆరోపించినప్పుడు యోబు ఎంత నిరుత్సాహపడి ఉండవచ్చు! (యోబు 4, 5, 22 అధ్యాయాలు) మనం ఏదో రీతిలో యెహోవాకు దుఃఖాన్ని కలిగించాము గనుకనే లేక యెహోవా తన ఆశీర్వాదాలు మనకు దక్కకుండా చేస్తున్నాడు గనుకనే మనం కష్టాలను అనుభవిస్తున్నామనే నిర్ధారణకు మనం వెంటనే రాకూడదు. కష్టాలనుభవిస్తున్న సమయంలో ప్రతికూలంగా ఆలోచించడం మన విశ్వాసాన్ని బలహీనం చేయగలదు. (1 థెస్సలొనీకయులు 3:1-3, 5) విపత్తును అనుభవిస్తున్న సమయంలో ఏమి జరిగినప్పటికీ నీతిమంతులకు యెహోవా యేసుక్రీస్తులు ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటారనే వాస్తవాన్ని గురించి ధ్యానించడం మంచిది.
15. తన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల విషయమై యెహోవా ఎంతో శ్రద్ధను కలిగి ఉన్నాడని మనకెలా తెలుసు?
15 “క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? . . . మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను” అని వ్రాయడం ద్వారా అపొస్తలుడైన పౌలు మనకు నిశ్చయతను ఇస్తున్నాడు. (రోమీయులు 8:35, 38, 39) యెహోవా మన ఎడల ప్రగాఢ చింత కలిగి ఉన్నాడు మరియు మన కష్టాలను గురించి ఆయనకు తెలుసు. దావీదు ఇంకా పలాయితునిగానే ఉన్నప్పుడు ఇలా వ్రాశాడు: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు.” (కీర్తన 34:15, 18; మత్తయి 18:6, 14) మన పరలోకపు తండ్రి మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు మరియు బాధ అనుభవించే వారి ఎడల ఆయన జాలిపడతాడు. (1 పేతురు 5:6, 7) మనం ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ సహించేందుకు మనకేమి అవసరమో ఆయన మనకు అనుగ్రహిస్తాడు.
యెహోవా ఇచ్చే వరాలు మనకు ఆదరణనిస్తాయి
16. మనం సహించేందుకు యెహోవా నుండి వస్తున్న ఏ ఏర్పాటు మనకు సహాయం చేస్తుంది, ఎలా?
16 ఈ పాత విధానంలో మనం ఎలాంటి కష్టాలూ లేని జీవిత విధానాన్ని అపేక్షించలేక పోయినప్పటికీ మనం “దిక్కు లేనివారము కాము.” (2 కొరింథీయులు 4:8, 9) యేసు తన అనుచరులకు సహాయకారిని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయనిలా చెప్పాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.” (యోహాను 14:16, 17) సా.శ. 33 పెంతెకొస్తు నాడు, తన శ్రోతలు “పరిశుద్ధాత్మ అను వరము” పొందుతారని అపొస్తలుడైన పేతురు వారితో చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 2:38) నేడు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుందా? చేస్తుంది! యెహోవా యొక్క చురుకైన శక్తి మనకు ఇచ్చే అద్భుతమైన ఫలాలు: “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.” (గలతీయులు 5:22, 23) అవన్నీ కూడా మనం సహించేందుకు మనకు సహాయం చేసే అమూల్యమైన లక్షణాలు.
17. మన విశ్వాసాన్ని మరియు యెహోవా కొరకు సహనంతో ఎదురుచూడాలనే తీర్మానాన్ని బలపరిచే కొన్ని బైబిలు సత్యాలు ఏవి?
17 నిరంతర జీవిత ఉత్తరాపేక్షతో పోల్చిచూస్తే, ప్రస్తుత శ్రమలు “క్షణమాత్రముండు . . . చులకని”వని మనం అర్థం చేసుకునేందుకు కూడా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. (2 కొరింథీయులు 4:16-18) మన పనులను మరియు తన ఎడల మనం చూపే ప్రేమను దేవుడు మరిచిపోడని మనం ఒప్పించబడ్డాము. (హెబ్రీయులు 6:9-12) బైబిలు యొక్క ప్రేరేపిత వాక్యాలను చదవడం ద్వారా, అనేక శ్రమలను సహించినప్పటికీ ధన్యులని తీర్చబడిన ప్రాచీన విశ్వాసయోగ్యులైన సేవకుల మాదిరుల ద్వారా మనం ఆదరణను పొందుతాము. యాకోబు ఇలా వ్రాశాడు: “నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము.” (యాకోబు 5:10, 11) మనం కష్టాలను సహించేందుకు సహాయం చేసే “బలాధిక్యము”ను గురించి బైబిలు వాగ్దానం చేస్తుంది. యెహోవా మనలను పునరుత్థాన నిరీక్షణతో కూడా దీవిస్తున్నాడు. (2 కొరింథీయులు 1:8-10; 4:7) అనుదినం బైబిలు చదవడం ద్వారా మరియు ఈ వాగ్దానాలను గురించి ధ్యానించడం ద్వారా, మనం మన విశ్వాసాన్నీ దేవుని కొరకు సహనంతో వేచి ఉండాలనే తీర్మానాన్నీ మనం బలపర్చుకుంటాము.—కీర్తన 42:5.
18. (ఎ) మనం ఏమి చేయాలని 2 కొరింథీయులు 1:3, 4 నందు ప్రోత్సహించబడ్డాము? (బి) క్రైస్తవ పైవిచారణ కర్తలు ఆదరణ మరియు ఉపశమనానికి ఎలా మూలం కాగలరు?
18 దానికి తోడు, యెహోవా మనకు ఆత్మీయ పరదైసునిచ్చాడు, అక్కడ మనం మన క్రైస్తవ సహోదర సహోదరీల నిజమైన ప్రేమను అనుభవించగలము. ఒకరికొకరం ఆదరణను ఇచ్చుకునే విషయంలో మనం అందరమూ ఒక పాత్ర పోషించవలసి ఉంది. (2 కొరింథీయులు 1:3, 4) ప్రాముఖ్యంగా క్రైస్తవ పైవిచారణకర్తలు ఆదరణా ఉపశమనాలకు ముఖ్య మూలాలుగా ఉండగలరు. (యెషయా 32:2) ‘మనుష్యులకు ఈవులుగా,’ వారు బాధలనుభవిస్తున్న వారిని బలపర్చాలని, ‘ధైర్యము చెడినవారిని ధైర్యపరచి బలహీనులకు ఊత నియ్యాలని’ ఆజ్ఞాపించబడ్డారు. (ఎఫెసీయులు 4:8, 11, 12; 1 థెస్సలొనీకయులు 5:14) పెద్దలు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేస్తున్న కావలికోట, తేజరిల్లు! పత్రికలనూ అలాగే ఇతర ప్రచురణలను చక్కగా ఉపయోగించుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు. (మత్తయి 24:45-47) మనకు చింత కలిగించే కొన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు, చివరికి వాటిని నివారించేందుకు మనకు సహాయపడగల బైబిలు ఆధారిత సలహాల సంపద వాటిలో ఉంది. కష్ట కాలాల్లో ఒకరికొకరం ఆదరణనూ ప్రోత్సాహాన్నీ ఇచ్చుకోవడం ద్వారా మనం యెహోవాను అనుకరిద్దాం!
19. (ఎ) కొన్ని కష్టాలను నివారించేందుకు ఏది మనకు సహాయం చేస్తుంది? (బి) మొత్తానికి మనం ఎవరియందు విశ్వాసముంచాలి మరియు శ్రమలను సహించేందుకు ఏది మనకు సహాయం చేస్తుంది?
19 అంత్యదినాల చివరి భాగం సమీపిస్తుండగా, ఈ ప్రస్తుత విధానంలోని పరిస్థితులు మరింత క్షీణిస్తుండగా, క్రైస్తవులు కష్టాలను నివారించేందుకు తాము చేయగలిగినదంతా చేస్తారు. (సామెతలు 22:3) మంచి యుక్తాయుక్త పరిజ్ఞానం, మానసిక స్థిరత్వం మరియు బైబిలు సూత్రాలను గూర్చిన జ్ఞానం మనం వివేకవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు మనకు సహాయపడగలవు. (సామెతలు 3:21, 22) మనం అనవసరమైన తప్పిదాలను చేయకుండా నివారించేందుకు యెహోవా వాక్యం విని దానికి విధేయులమౌతాము. (కీర్తన 38:4) అయినప్పటికీ, మనం ఎంత ప్రయత్నించినా మన జీవితాల్లోనుండి కష్టాలు సంపూర్ణంగా తీసివేయబడలేవనే విషయాన్ని మనం గుర్తిస్తాము. ఈ విధానంలో అనేకమంది నీతిమంతులు విపరీతమైన కష్టాలను అనుభవిస్తారు. అయితే, “యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు” అనే సంపూర్ణ నమ్మకంతో మనం మన శ్రమలను ఎదుర్కొనవచ్చు. (కీర్తన 94:14) మరియు ఈ విధానమూ దాని శ్రమలూ త్వరలోనే తీసివేయబడతాయని మనకు తెలుసు. కాబట్టి, “మనము మేలుచేయుట యందు విసుకక” ఉందామని తీర్మానించుకుందాము. ఎందుకంటే, “మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతుము.”—గలతీయులు 6:9.
మనం ఏమి నేర్చుకున్నాము?
◻ క్రైస్తవ సహోదరులందరూ ఏ కష్టాలను అనుభవిస్తున్నారు?
◻ యెహోవా మన ఎడల కోపంగా ఉన్నాడనేందుకు కష్టాలు రుజువులు కాదనే విషయాన్ని అర్థం చేసుకోడానికి ఏ బైబిలు ఉదాహరణలు మనకు సహాయపడతాయి?
◻ తన ప్రజలు అనుభవించే కష్టాలను గురించి యెహోవా ఎలా భావిస్తాడు?
◻ మనం శ్రమలను సహించేందుకు మనకు సహాయపడే కొన్ని వరములు ఏవి?
[10వ పేజీలోని చిత్రం]
దావీదు, నాబోతు, యోసేపులు కష్టాలను అనుభవించిన ముగ్గురు