అద్భుత స్వస్థతలు ఇప్పటికీ జరుగుతున్నాయా?
“యేసును స్వీకరించు, స్వస్థతపొందు!” తన అస్వస్థత కొరకు మందు తీసుకోవడం విశ్వాసరాహిత్యాన్ని సూచిస్తుందని నమ్మడానికి ఇటువంటి నినాదాలు ఒక ఇవాంజిలికల్ చర్చి సభ్యుడైన ఆలిషాండ్రేను నడిపించాయి. కేవలం తన విశ్వాసం మాత్రమే తనకవసరమైన అద్భుత స్వస్థతను తీసుకువస్తుందన్న నమ్మకం ఆయనకు ఏర్పడిపోయింది. ఒక నిష్ఠగల కాథలిక్కు అయిన బెనడీట బ్రెజిల్లో సావో పాలో రాష్ట్రంలోని ఆపారెసీడ డ నోర్ట ప్రాంగణంలో జరిగే అద్భుత స్వస్థతల గురించి విన్నప్పుడు భావోద్రేకంగా బాగా చలించిపోయింది. తన పెద్దమ్మ నేర్పిన కొన్ని మంత్ర వచనాలను ఉపయోగిస్తూ, బెనడీట రోగులను స్వస్థపర్చడానికి తనకు శక్తినివ్వమని అవర్ లేడీ ఆఫ్ ఆపారెసీడకు, ఆంథోనీకీ, మరితర “పరిశుద్ధుల”కు ప్రార్థించింది.
స్పష్టంగానే, 20వ శతాబ్దపు చివర్లో కూడా చాలామంది ప్రజలు అద్భుత స్వస్థతల్ని ఇంకా నమ్ముతున్నారు—కానీ ఎందుకు? బహుశ, కొంతమంది తమ ప్రియమైనవారికి, ప్రత్యేకంగా తమ పిల్లలకు వచ్చే వ్యాధినీ, నొప్పినీ, బాధల్నీ తగ్గించడానికి డాక్టర్లు ఎక్కువేమీ చేయలేకపోతున్నప్పుడు నిరాశా నిస్పృహలకు లోనౌతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులచే పీడించబడుతున్నవారు ఆధునిక చికిత్సకయ్యే ఖర్చు విపరీతంగా ఉండడం మూలాన తాము విశ్వాస స్వస్థత వైపుకి తిరగడంలో నష్టం ఏమీ లేదని భావిస్తారు. ఎయిడ్స్, క్రుంగుదల, క్యాన్సర్, పిచ్చి, హైబ్లడ్ ప్రెషర్, మరితరత్రా ఎన్నో అస్వస్థతలకు చికిత్సలను అందిస్తామని టీవీలో వివిధ చర్చీలూ, వ్యక్తులూ చెప్పడం కొంతమంది చూస్తారు. ఆ విధంగా చెప్పేవారి మాటల్లో వారికి నమ్మకం ఉన్నా లేకపోయినా, వారు చివరి ప్రయత్నంగా వీరిని సమీపిస్తారు. తమ అస్వస్థత దుష్ట ఆత్మల వలన కలిగిందని నమ్మే మరికొందరు తమకు సహాయం చేసే శక్తి సాంప్రదాయిక మందులకు లేదని భావిస్తారు.
మరోవైపు, చనిపోయిన “పరిశుద్ధులు” లేదా జీవించివున్న స్వస్థతపర్చేవారు చేసే అద్భుత స్వస్థతలను గూర్చిన తలంపునే తీవ్రంగా వ్యతిరేకించేవారూ, చివరికి ఖండించేవారూ ఉన్నారు. జోర్నల్ డా టార్డ ప్రకారం, అద్భుత స్వస్థతల్లో నమ్మకముంచడం “అజాగ్రత్తతోనూ, నిరాశతోనూవున్నవారి విశ్వాసం బలహీనమయ్యేలా చేస్తుంది” అని ఇమ్యూనాలజిస్ట్ అయిన డ్రావుస్యూ వారెల్లా భావిస్తున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “అద్భుతాల్లో నమ్మకం పెట్టుకుని, చాలామంది ఈ మోసగాళ్ల మూలాన అత్యవసరమైన వైద్య చికిత్సను తృణీకరించవచ్చు.” అంతేగాక, ద న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఇలా వివరిస్తోంది: “గతంలో సాంప్రదాయబద్ధంకాని స్వస్థతలు పవిత్ర స్థలాలూ మత ఆచారాలూ వంటివాటితో ముడిపెట్టబడ్డాయి. అటువంటి స్వస్థతలు అనుకూల పరిస్థితుల్లో ఇంద్రజాలం ఆధారంగా చేయబడేవని వివరించడానికే వైద్య విజ్ఞానశాస్త్రం సుముఖత చూపుతుంది.” అయినప్పటికీ, తాము నిజంగానే ఒక అద్భుతంచేత స్వస్థపర్చబడ్డామని నమ్మేవారు ఎంతోమంది ఉన్నారు. వారికి స్వస్థత చేకూరింది!
బైబిలుతో పరిచయం ఉన్నవారికి, యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో రోగులను స్వస్థపర్చాడనీ, “దేవుని శక్తి”తో దాన్ని చేశాడనీ తెలుసు. (లూకా 9:42, 43, NW) అందుకని వారిలా అనుకోవచ్చు, ‘దేవుని శక్తి నేడు ఇంకా పనిచేస్తూ, అద్భుత స్వస్థతలు జరిగేలా చేస్తోందా?’ చేస్తున్నట్లైతే, స్వస్థపరచేందుకైన ప్రయత్నాలు వాగ్దానం చేయబడిన ఫలితాలను తీసుకురావడంలో ఎందుకు విఫలమౌతున్నాయి? దానికి కారణం, రోగికి సరిపడినంత విశ్వాసం లేకపోవడమా లేక ఆయన అంత ఎక్కువ చందా ఇవ్వకపోవడమా? ఒక క్రైస్తవుడు తాను వేదనాభరితమైన వ్యాధితోనో లేక బహుశ చికిత్సే లేని వ్యాధితోనో బాధపడుతున్నప్పుడు అద్భుతమైన స్వస్థతను పొందాలనుకోవడం యుక్తమేనా? అంతేగాక యేసు చేసినటువంటి విఫలంకాని అద్భుత స్వస్థతలు అసలు మళ్లీ ఎప్పుడైనా సంభవిస్తాయా? కీలకమైన ఈ ప్రశ్నలకు జవాబులను మీరు తర్వాతి శీర్షికలో కనుగొనగలరు.