దేవునియందు విశ్వాసం అందుకు అద్భుతం అవసరమా?
ఆల్బర్ట్ దేవుని కొరకు అన్వేషించడం మొదలు పెట్టినప్పుడు తను 20వ పడి తొలిభాగంలో ఉన్నాడు. ఆయన ఎన్నో మతాలను పరిశీలించాడు, కానీ అసంతృప్తే మిగిలింది. బైబిలు భాగాలను చదవడం ద్వారా, నోవహు, అబ్రాహాము, శారా, మరియు మోషే వంటి వ్యక్తులతో దేవుడు ఎలా వ్యవహరించాడో ఆయన తెలుసుకున్నాడు. తాను బైబిలులోని దేవునికి చేరువైనట్లు ఆల్బర్ట్ కనుగొన్నాడు. అయితే, దేవుడు నిజంగా ఉనికిలో ఉన్నాడు అనే నిశ్చయతను ఆయన కలిగి ఉండగలిగాడా?
ఒక రోజు సాయంకాలం, ఏకాంతంగా ఉండే ప్రదేశానికి ఆయన వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళాడు, “దేవా, ఒక సూచన దయచేసి చూపించు—నువ్వు ఉనికిలో ఉన్నావని రుజువు చేసే దేనినైనా చూపించు” అని అక్కడ ఉండి ప్రార్థించాడు. ఆల్బర్ట్ అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏమీ జరగకపోయే సరికి, తన నిరీక్షణ “నిరాశగా, శూన్యతాభావంగా, కోపంగా మారింది” అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు.
ఆల్బర్ట్లాగే అనేకులు దేవుని కొరకు వ్యర్థంగా అన్వేషించామని భావిస్తారు. వాళ్ళు చర్చి పురోహితుల ప్రసంగాల వల్ల తికమకపడి ఉండవచ్చు, లేదా మతాన్ని అమ్మే దూరదర్శిని సువార్తికులను చూసి నిరాశచెంది ఉండవచ్చు. తమ పొరుగువారిలో అనేకుల మధ్య స్పష్టంగా కనిపించే వేషధారణను గమనించినందువల్ల దేనిని విశ్వసించాలో కొందరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే, ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు ఇలా హామీ ఇచ్చాడు: “నీవు . . . [దేవునిని] వెదకిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును.”—1 దినవృత్తాంతములు 28:9.
సరే, అయితే దేవుడు తనను ఎలా బయల్పరచుకుంటాడు? మీరు ఒక సూచన కొరకు—దేవుడు ఉనికిలో ఉన్నాడని మీకు రుజువు చేసే ఒక మానవాతీత అనుభవం కొరకు నిరీక్షించాలా? టైమ్స్ పత్రికలో రిపోర్టు చేయబడిన ఇటీవలి సర్వే ప్రకారం, అమెరికాలో మూడింట రెండు వంతులకన్నా ఎక్కువ మంది అద్భుతాలను నమ్ముతారు. “అమెరికాలో అతివేగంగా పెరుగుతున్నది తమ ఆరాధనను ‘సూచనలు మరియు అద్భుతాల’పై కేంద్రీకరించిన కరిస్మాటిక్ సంఘాలూ, పెంతెకొస్తు సంఘాలేనని” కూడా ఆ శీర్షిక పేర్కొంది.
దేవుని యందు నమ్మకముంచేందుకు “సూచనలూ, అద్భుతాలూ” నిజంగా అవసరమా? ఆయన గత కాలాల్లో అద్భుతాలను ఉపయోగించాడు. ఉదాహరణకు: దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అనుచరులను హింసిస్తూ ఉండిన తార్సువాడైన సౌలుకు యెరూషలేము నుండి దమస్కుకు వెళ్ళే మార్గంలో అసాధారణమైన అనుభవం కలిగింది. పునరుత్థానమైన యేసు అలా అద్భుత రీతిలో ఎదురవ్వడం సౌలు మారేందుకు కారణమయ్యింది. (అపొస్తలుల కార్యములు 9:1-22) అలా మునుపు హింసిస్తూ ఉండిన వ్యక్తి అపొస్తలుడైన పౌలయ్యాడు—క్రైస్తవత్వాన్ని ప్రకటించిన ప్రధానుల్లో ఒకడయ్యాడు!
అయితే అద్భుతాలు ఎల్లవేళలా అలాంటి అనుకూలమైన ప్రతిస్పందనను కలిగిస్తాయా? దేవునియందలి యథార్థమైన విశ్వాసం ఒకరు అద్భుతమైన అనుభవం కలిగివుండడంపై ఆధారపడుతుందా?
[3వ పేజీలోని చిత్రం]
దేవుని కుమారుడు తార్సువాడైన సౌలుతో అద్భుతమైన రీతిలో మాట్లాడాడు. మీరూ అద్భుతాన్ని నిరీక్షించాలా?