“మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు”
“మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు . . . ఆనందించుచున్నారు.”—1 పేతురు 1:8.
1. నేడు భూమిపైనున్న వారెవరూ యేసును చూడకపోయినప్పటికీ, కొంతమంది మతనిష్ఠగల ప్రజలు ఆయన ఎడల భక్తిని చూపించడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు?
నేడు భూమిపై సజీవంగా ఉన్న ఎవరూ ఎన్నడూ యేసుక్రీస్తును చూడలేదు. అయినప్పటికీ, కోట్లాదిమంది ప్రజలు ఆయనను ప్రేమిస్తున్నామని చెబుతారు. ఫిలిప్పైన్స్ నందలి మనీలాలో ప్రతి సంవత్సరం జనవరి 9న శిలువను మోస్తున్న యేసుక్రీస్తు నిలువెత్తు విగ్రహం వీధుల్లోగుండా లాక్కెళ్లబడుతుంది, ఇది ఆ దేశంలో ప్రజాదరణ పొందిన మతం యొక్క అత్యంత పెద్దదైన, అత్యంత ఉత్తేజవంతమైన ప్రదర్శనగా వివరించబడింది. ఉత్తేజం పొందిన సమూహాలు తోసుకుంటారు, నెట్టుకుంటారు; ఆ విగ్రహాన్ని ముట్టుకోవడానికి ప్రజలు ఉన్మాదంగా ఒకరిపైకి ఒకరు ఎక్కుతారు. దీన్ని చూడడానికి వచ్చే అనేకులు ప్రాముఖ్యంగా ఉత్సవ ఊరేగింపునుబట్టి ఆకర్షితులౌతారు. అయితే, వారిలో కొందరు నిస్సందేహంగా యేసువైపుకు యథార్థంగా ఆకర్షించబడినట్లు భావించే ప్రజలే. దానికి నిదర్శనంగా, వారు శిలువపైనున్న క్రీస్తు బొమ్మను ధరించవచ్చు లేక క్రమంగా చర్చికి వెళ్లవచ్చు. అయితే, అలాంటి విగ్రహారాధనను సత్యారాధనగా పరిగణించవచ్చా?
2, 3. (ఎ) యేసు అనుచరులలోని ఎవరెవరు వాస్తవంగా ఆయనను చూసి, ఆయన చెప్పిన సంగతులు విన్నారు? (బి) మొదటి శతాబ్దానికి చెందిన మరెవరు యేసును వ్యక్తిగతంగా ఎన్నడూ చూడకపోయినప్పటికీ, ఆయనను ప్రేమించి ఆయనయందు విశ్వాసముంచారు?
2 మొదటి శతాబ్దంలో, యూదయ సమరయ పెరయ గలిలయ వంటి రోమా ప్రాంతాల్లో యేసుక్రీస్తును కచ్చితంగా వ్యక్తిగతంగా చూసిన, వినిన వారు ఎన్నో వేలమంది ఉండేవారు. దేవుని రాజ్యాన్ని గూర్చిన ఓదార్పుకరమైన సత్యాలను ఆయన వివరిస్తుండగా వారు విన్నారు. ఆయన చేసిన అద్భుతాలకు వారు ప్రత్యక్ష సాక్షులు. వీరిలో కొందరు, ఆయనే ‘సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు’ అని ఒప్పించబడి, ఆయన సమర్పిత శిష్యులయ్యారు. (మత్తయి 16:16) అయితే, అపొస్తలుడైన పేతురు తన మొదటి ప్రేరేపిత లేఖను ఎవరికి వ్రాశాడో వారు వీరిలో లేరు.
3 పేతురు ఎవరిని ఉద్దేశించి వ్రాశాడో వారు రోమా ప్రాంతాలైన పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియలలో నివసించేవారు, ఇవన్నీ ఆధునిక దిన టర్కీ ప్రాంతంలో ఉన్నాయి. వారికి పేతురు ఇలా వ్రాశాడు: “మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు . . . చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.” (1 పేతురు 1:2, 8) యేసుక్రీస్తును ప్రేమించి, ఆయనయందు విశ్వాసముంచేంతగా వారు ఆయన గురించి ఎలా తెలుసుకోగలిగారు?
4, 5. యేసును ఎన్నడూ చూడని ఆ ప్రజలు, ఆయనను ప్రేమించి ఆయనయందు విశ్వాసముంచేంతగా ఆయన గురించి ఎలా తెలుసుకున్నారు?
4 సా.శ. 33 పెంతెకొస్తు పండుగకు హాజరైన సమూహానికి అపొస్తలుడైన పేతురు సాక్ష్యమిచ్చినప్పుడు కొందరు యెరూషలేములో ఉన్నారని స్పష్టమౌతుంది. పండుగ తర్వాత అపొస్తలుల నుండి మరింత ఉపదేశం పొందేందుకు అనేకమంది శిష్యులు యెరూషలేములో ఉండిపోయారు. (అపొస్తలుల కార్యములు 2:9, 41, 42; 1 పేతురు 1:1 పోల్చండి.) పేతురు తన పేరు మీదవున్న మొదటి బైబిలు సంబంధిత పత్రికను ఆ తర్వాత పంపిన ప్రాంతంలో నివసించిన ప్రజల మధ్య కూడా, అపొస్తలుడైన పౌలు తాను మరల మరల చేసిన మిషనరీ ప్రయాణాల్లో ఆసక్తితో కూడిన పరిచర్యను కొనసాగించాడు.—అపొస్తలుల కార్యములు 18:23; 19:10; గలతీయులు 1:1, 2.
5 యేసును ఎన్నడూ చూడని ఆ ప్రజలు ఆయనవైపు అంత బలంగా ఎందుకు ఆకర్షించబడ్డారు? మన కాలంలో, భూగోళ వ్యాప్తంగా మరిన్ని లక్షలమంది ఆయనను ప్రగాఢంగా ఎందుకు ప్రేమిస్తున్నారు?
వారు వినిన విషయాలు
6. (ఎ) సా.శ. 33 పెంతెకొస్తు నాడు యేసు గురించి పేతురు ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు వినివుంటే, మీరు ఏమి నేర్చుకుని ఉండేవారు? (బి) అప్పుడు అక్కడున్న దాదాపు 3,000 మందిని ఇది ఎలా ప్రభావితం చేసింది?
6 సా.శ. 33లో ఆ పండుగకు హాజరైన సమూహంతో పేతురు మాట్లాడినప్పుడు మీరు యెరూషలేములో ఉండివుంటే, మీరు యేసు గురించి ఏమి నేర్చుకుని ఉండేవారు? ఆయన చేసిన అద్భుతాలు ఆయన దేవుని ద్వారా పంపబడ్డాడని, పాపులైన మనుష్యులు యేసును చంపినప్పటికీ ఆయన ఇక సమాధిలో ఉండకుండా పునరుత్థానం చేయబడి దేవుని కుడిపార్శ్వానికి ఉన్నతపర్చబడ్డాడని, వాస్తవానికి యేసే ప్రవక్తలు ఎవరి గురించైతే వ్రాశారో ఆ మెస్సీయయైన క్రీస్తని, యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ఆయన అనుచరులపై కుమ్మరింపబడిందని, తద్వారా వారు దేవుడు తన కుమారుని ద్వారా చేస్తున్న అద్భుతమైన విషయాల గురించి అనేకదేశాల నుండి వచ్చిన ప్రజలకు వెంటనే సాక్ష్యం ఇవ్వగలిగారని నిస్సంశయంగా తెలియజేశాయి. ఆ సందర్భంలో పేతురు చెప్పినది విన్న అనేకుల హృదయాలు ఎంతో కదిలించబడ్డాయి, దాదాపు 3,000 మంది క్రైస్తవ శిష్యులుగా బాప్తిస్మం తీసుకున్నారు. (అపొస్తలుల కార్యములు 2:14-42) మీరు అక్కడ ఉండివుంటే, మీరు అటువంటి నిర్ణయాత్మకమైన చర్య గైకొని ఉండేవారా?
7. (ఎ) అపొస్తలుడైన పౌలు అంతియొకయలో ప్రకటిస్తుండగా మీరు అక్కడ ఉండివుంటే, మీరు ఏమి నేర్చుకుని ఉండేవారు? (బి) ఆ సమూహంలోని కొందరు ఎందుకు విశ్వాసులై, ఇతరులతో సువార్తను పంచుకున్నారు?
7 రోమా ప్రాంతంలోని గలతీయ నందలి అంతియొకయలో అపొస్తలుడైన పౌలు బోధిస్తున్నప్పుడు అక్కడున్నవారిలో మీరూ ఉండివుంటే, యేసు గురించి మీరు ఇంకా ఏమి తెలుసుకుని ఉండేవారు? యెరూషలేములోని పరిపాలకుల ద్వారా యేసుకు మరణ శిక్ష విధించబడడం ప్రవక్తల ద్వారా ముందే తెలియజేయబడిందని పౌలు వివరించడం మీరు విని ఉండేవారు. యేసు పునరుత్థానాన్ని గూర్చిన ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్ని కూడా మీరు విని ఉండేవారు. యెహోవా యేసును మరణం నుండి పునరుత్థానం చేయడం ద్వారా ఈయనే నిజంగా దేవుని కుమారుడని ధృవీకరించాడని పౌలు ఇస్తున్న వివరణనుబట్టి మీరు తప్పకుండా ప్రభావితులై ఉండేవారు. యేసుయందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ పొందడం నిత్యజీవానికి నడిపించగలదని తెలుసుకున్నప్పుడు మీ హృదయం కృతజ్ఞతాభిమానాలతో నిండిపోయివుండేది కాదా? (అపొస్తలుల కార్యములు 13:16-41, 46, 47; రోమీయులు 1:4) తాము వింటున్నదాని విశేషతను గుర్తించిన అంతియొకయకు చెందిన వారిలో కొందరు శిష్యులై ఇతరులతో సువార్తను చురుగ్గా పంచుకున్నారు, అలా చేయడం మూలంగా తీవ్రమైన హింసను ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ వారలా చేశారు.—అపొస్తలుల కార్యములు 13:42, 43, 48-52; 14:1-7, 21-23.
8. ఎఫెసు సంఘానికి పౌలు వ్రాసిన పత్రికను వారు అందుకున్నప్పుడు ఆ కూటములో మీరు ఉండివుంటే, మీరు ఏమి నేర్చుకుని ఉండేవారు?
8 ఆసియాలోవున్న రోమా ప్రాంతమందలి ఎఫెసులోని క్రైస్తవ సంఘ శిష్యులకు పౌలు వ్రాసిన ప్రేరేపిత లేఖను వారు అందుకున్నప్పుడు మీరు వారితో సహవసిస్తుంటే అప్పుడేమిటి? దేవుని సంకల్పంలో యేసు పాత్ర గురించి దాని నుండి మీరు ఏమి నేర్చుకుని ఉండేవారు? పరలోకంలోని మరియు భూమిమీది విషయాలన్నీ క్రీస్తు ద్వారా దేవుని చిత్తానుసారంగా జరుగుతాయని, క్రీస్తు ద్వారా దేవుని కృపావరము అన్ని దేశాల ప్రజలకు విస్తరించబడిందని, తమ తప్పుల మూలంగా దేవుని దృష్టిలో మృతులైన వ్యక్తులు క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా తిరిగి జీవానికి తీసుకురాబడతారని, ఈ ఏర్పాటు మూలంగా మానవులు తిరిగి దేవుని ప్రియ కుమారులు కాగల అవకాశం ఉందని పౌలు ఆ పత్రికలో వివరించాడు.—ఎఫెసీయులు 1:1, 5-10; 2:4, 5, 11-13.
9. (ఎ) పౌలు ఎఫెసీయులకు వ్రాసినదాని ప్రాముఖ్యతను మీరు వ్యక్తిగతంగా అవగాహన చేసుకుంటారా లేదా అనేదాన్ని గ్రహించడానికి మీకు ఏది సహాయం చేయగలదు? (బి) పేతురు ప్రస్తావించిన రోమా ప్రాంతాల్లోని సహోదరులు, తాము యేసు గురించి నేర్చుకుంటున్నదాని ద్వారా ఎలా ప్రభావితమయ్యారు?
9 దీన్నంతటినీ గుణగ్రహించడం దేవుని కుమారుని ఎడల మీకుగల ప్రేమను అధికం చేసి ఉండేదా? ఎఫెసీయులు 4 నుండి 6 అధ్యాయాల్లో అపొస్తలుడైన పౌలు వివరించినట్లుగా ఆ ప్రేమ మీ అనుదిన జీవితాన్ని ప్రభావితం చేసి ఉండేదా? అలాంటి గుణగ్రహణ మీ జీవితంలో ప్రాముఖ్యతగలవాటి గురించి జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి మిమ్మల్ని పురికొల్పి ఉండేదా? దేవుని ఎడల ప్రేమతో ఆయన కుమారుని ఎడల కృతజ్ఞతతో, దేవుని చిత్తాన్ని చేయడం మీ జీవితంలో నిజంగా కేంద్ర విషయమై ఉండేలా మీరు అవసరమైన మార్పులను చేసుకుని ఉండేవారా? (ఎఫెసీయులు 5:15-17) ఆసియా, గలతీయ మరియు ఇతర రోమా ప్రాంతాల్లోని క్రైస్తవులు తాము నేర్చుకుంటున్నదాన్ని బట్టి ప్రభావితమైన విధానం గురించి, అపొస్తలుడైన పేతురు వారికిలా వ్రాశాడు: ‘మీరు [యేసుక్రీస్తును] చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు . . . ఆయనను . . . విశ్వసించుచు . . . చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.’—1 పేతురు 1:8.
10. (ఎ) తొలి క్రైస్తవులు యేసు ఎడల కలిగివున్న ప్రేమకు నిస్సందేహంగా ఏది దోహదపడింది? (బి) మనం కూడా ఎలా ప్రయోజనం పొందగలము?
10 పేతురు ఎవరికి వ్రాశాడో ఆ తొలి క్రైస్తవులు కలిగివున్న ప్రేమకు నిస్సందేహంగా దోహదపడినది మరింకేదో ఉంది. అదేమిటి? పేతురు తన మొదటి లేఖను వ్రాసే సమయానికి, కనీసం రెండు సువార్తలు—మత్తయి మరియు లూకా—అప్పటికే ప్రచారంలో ఉన్నాయి. యేసును ఎన్నడూ చూడని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఈ సువార్త వృత్తాంతాలను చదవగలిగారు. మనం కూడా చదవగలం. సువార్తలు కల్పనా కథలు కాదు; ఎంతో నమ్మదగిన చరిత్రకుండవలసిన లక్షణాలన్నీ వాటికున్నాయి. ఆ ప్రేరేపిత రికార్డుల్లో, దేవుని కుమారుని ఎడల మనకున్న ప్రేమను అధికం చేయగలదెంతో ఉంది.
ఆయన చూపిన స్ఫూర్తి
11, 12. ఇతర మానవుల ఎడల యేసు చూపిన స్ఫూర్తిలోని ఏది మీరు ఆయనను ప్రేమించేలా చేస్తుంది?
11 యేసు జీవితపు లిఖిత వృత్తాంతములో, ఆయన ఇతర మానవులతో ఎలా వ్యవహరించాడో మనం తెలుసుకుంటాము. ఆయన చూపిన స్ఫూర్తి ఇప్పుడు కూడా అంటే ఆయన మరణించిన 1,960 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత కూడా ప్రజల హృదయాలను తాకుతోంది. సజీవంగా ఉన్న ప్రతి ఒక్కరూ పాప ప్రభావాల భారాన్ని మోస్తున్నారు. అనేక కోట్లమంది అన్యాయానికి గురౌతున్నారు, అనారోగ్యంతో పోరాడుతున్నారు లేక మరితర కారణాలవల్ల నిరుత్సాహ భావాలతో నలిగిపోతున్నారు. అలాంటి వారందరికీ, యేసు ఇలా చెబుతున్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30.
12 పేదవారు, ఆకలిగొన్నవారు, దుఃఖపడుతున్నవారి ఎడల యేసు దయతోకూడిన శ్రద్ధను చూపించాడు. పరిస్థితులనుబట్టి అవసరమైనప్పుడు, ఆయన పెద్ద గుంపులకు ఆహారాన్ని కూడా పెట్టాడు. (లూకా 9:12-17) అణిచివేసే ఆచారాల నుండి ఆయన వారిని స్వతంత్రులను చేశాడు. రాజకీయ మరియు ఆర్థిక అణిచివేతకు ముగింపు తేవాలనే దేవుని ఏర్పాటునందు వారి విశ్వాసాన్ని కూడా ఆయన పెంపొందింపజేశాడు. అప్పటికే కృంగిపోయి ఉన్న వారి ఆత్మను యేసు నలగగొట్టలేదు. ఆయన దీనులను ప్రేమ ఆప్యాయతలతో నైపుణ్యంగా ఓదార్చాడు. కృంగిపోయి నలిగినరెల్లులా ఉన్నవారికి, ఆరిపోడానికి సిద్ధంగావుండి మకమకలాడుతున్న ఒత్తిలా ఉన్నవారికి ఆయన ఉపశమనాన్ని కలుగజేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ, ఆయనను ఎన్నడూ చూడని వారి హృదయాల్లో కూడా ఆయన పేరు నిరీక్షణను కలుగజేస్తుంది.—మత్తయి 12:15-21; 15:3-10.
13. యేసు పాపులతో వ్యవహరించిన విధానం ప్రజలను ఎందుకు ఆకర్షిస్తుంది?
13 తప్పు చేయడాన్ని యేసు ఆమోదించలేదు, అయినప్పటికీ జీవితంలో తప్పులు చేసి పశ్చాత్తాపాన్ని కనపర్చి సహాయం కొరకు ఆయనను ఆశ్రయించిన వారి ఎడల ఆయన అవగాహనను కనబర్చాడు. (లూకా 7:36-50) సమాజంలో తక్కువగా చూడబడుతున్నవారితో కలిసి భోజనం చేస్తే అది వారికి ఆత్మీయంగా సహాయం చేసే అవకాశమిస్తుందని ఆయన భావిస్తే, ఆయన అలా చేసేవాడు. (మత్తయి 9:9-13) యేసును ఎన్నడూ చూడని, అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న కోట్లాదిమంది ఆయన చూపించిన స్ఫూర్తి మూలంగా ఆయన గురించి తెలుసుకుని ఆయనయందు విశ్వాసముంచేలా కదిలింపబడ్డారు.
14. అనారోగ్యులకు, వికలాంగులకు, లేక దుఃఖంలో ఉన్నవారికి యేసు సహాయం చేసిన విధానంలోని ఏ విషయం మిమ్మల్ని ఆకర్షిస్తుంది?
14 అనారోగ్యంగా లేక అసమర్థంగా ఉన్న వారితో యేసు వ్యవహరించిన విధానం ఆయనకున్న ప్రేమా వాత్సల్యాలకు అలాగే వారికి ఉపశమనం కలిగించగల ఆయన సామర్థ్యానికి నిదర్శనంగా ఉంది. అందుకే, కుష్ఠువ్యాధితో నిండివున్న వ్యక్తి తనను సమీపించి, సహాయం కొరకు వేడుకున్నప్పుడు, అతన్ని చూసిన వెంటనే యేసు జుగుప్సతో వెనుకంజ వేయలేదు. అతని ఎడల తనకు జాలి కలుగుతున్నప్పటికీ, కుష్ఠువ్యాధి మరీ ముదిరిపోయినందున సహాయం చేయడానికి ఇక తాను ఏమి చేయలేనని ఆయన ఆ వ్యక్తితో చెప్పలేదు. ఆ వ్యక్తి, “ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవ”ని వేడుకున్నాడు. యేసు ఏమాత్రం సంకోచించకుండా కుష్ఠువ్యాధిగల ఆ వ్యక్తిని సమీపించి, “నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని” అంటూ అతన్ని ముట్టుకున్నాడు. (మత్తయి 8:2, 3) మరో సందర్భంలో ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును రహస్యంగా ముట్టుకోవడం ద్వారా స్వస్థత పొందాలని ప్రయత్నించింది. యేసు ఆమెతో దయగా, ధైర్యాన్నిచ్చే విధంగా వ్యవహరించాడు. (లూకా 8:43-48) ఒక అంత్యక్రియల ఊరేగింపు ఆయనకెదురైనప్పుడు, తన ఏకైక కుమారుడు మరణించడంతో దుఃఖిస్తున్న విధవరాలి ఎడల ఆయన కనికరపడ్డాడు. తనకు దేవుడిచ్చిన శక్తిని తన కొరకు ఆహారాన్ని సంపాదించుకొనేందుకు అద్భుత రీతిలో ఉపయోగించడానికి ఆయన నిరాకరించినప్పటికీ, మరణించిన ఆ వ్యక్తిని పునరుత్థానం చేసి, అతని తల్లికి అతన్ని తిరిగి అప్పగించడానికి ఆయన దాన్ని స్వేచ్ఛగా ఉపయోగించాడు.—లూకా 4:2-4; 7:11-16.
15. యేసును గూర్చిన వృత్తాంతాల్ని చదవడం మరియు దాని గురించి ధ్యానించడం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
15 మనం ఈ వృత్తాంతాలను చదివి, యేసు చూపిన స్ఫూర్తిని గూర్చి ధ్యానించినప్పుడు, మనం నిరంతరం జీవించగలిగేలా తన మానవ జీవితాన్ని బలి అర్పించిన ఈ వ్యక్తి ఎడల మన ప్రేమ అత్యధికమౌతుంది. మనం ఆయనను ఎన్నడూ చూడకపోయినప్పటికీ, మనం ఆయనవైపు ఆకర్షించబడినట్లు భావిస్తాము, ఆయన అడుగుజాడల్లో నడవాలని మనం కోరుకుంటాము.—1 పేతురు 2:21.
ఆయన దీనత్వంతో దేవునిపై ఆధారపడడం
16. యేసు ప్రాథమికంగా ఎవరిపై అవధానాన్ని కేంద్రీకరింపజేశాడు, ఏమి చేయమని ఆయన మనల్ని ప్రోత్సహించాడు?
16 అన్నిటికంటే ముఖ్యంగా, యేసు తన అవధానాన్ని మన అవధానాన్ని తన పరలోక తండ్రియైన యెహోవా దేవునిపై కేంద్రీకరింపజేశాడు. “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెన”ని చెబుతూ, ఆయన ధర్మశాస్త్రంలోని ప్రధానమైన ఆజ్ఞను గుర్తించాడు. (మత్తయి 22:36, 37) “దేవునియందు విశ్వాసముంచుడి” అని ఆయన తన శిష్యులకు ఉపదేశించాడు. (మార్కు 11:22) వారు తమ విశ్వాసానికి సంబంధించిన గంభీరమైన పరీక్షనెదుర్కొన్నప్పుడు, “[“ఎడతెగక,” NW] ప్రార్థనచేయుడి” అని ఆయన వారికి ఉద్బోధించాడు.—మత్తయి 26:41.
17, 18. (ఎ) యేసు తాను తన తండ్రిపై దీనంగా ఆధారపడడాన్ని ఎలా చూపించాడు? (బి) ఆయన చేసినది మనకు ఎందుకంత ప్రాముఖ్యము?
17 యేసు తానే మాదిరినుంచాడు. ప్రార్థన ఆయన జీవితంలో ప్రాముఖ్యమైన భాగమై ఉంది. (మత్తయి 14:23; లూకా 9:28; 18:1) తన అపొస్తలులను ఎంపిక చేసుకోవలసిన సమయం వచ్చినప్పుడు, పరలోకంలోని దేవదూతలందరూ మునుపు తన పర్యవేక్షణ క్రిందనే ఉన్నప్పటికీ, యేసు కేవలం తన సొంత తీర్పుపై ఆధారపడలేదు. ఆయన దీనంగా తన తండ్రికి ప్రార్థించడంలో మొత్తం రాత్రంతా గడిపాడు. (లూకా 6:12, 13) యేసు నిర్బంధింపబడి, వేదనభరితమైన మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఆయన పట్టుదలతో ప్రార్థిస్తూ మళ్లీ తన తండ్రి వైపు తిరిగాడు. తనకు సాతాను బాగా తెలుసని, ఆ దుష్టుడు ఏమి సంకల్పించినప్పటికీ తాను దానితో సులభంగా వ్యవహరించగలనని ఆయన భావించలేదు. తాను విఫలమవ్వకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో యేసు గుర్తించాడు. యేసు విఫలమవ్వడం ఆయన తండ్రికి ఎంతటి అపనిందను తెస్తుందో కదా! యేసు ఇవ్వబోయే బలిపై తమ జీవిత ఉత్తరాపేక్షలు ఆధారపడివున్న మానవజాతికి అదెంతటి నష్టమో కదా!
18 యేసు యెరూషలేములో మేడగదిలో తన అపొస్తలులతోపాటు ఉన్నప్పుడు పదే పదే ప్రార్థించాడు, గెత్సమనే తోటలో ఉన్నప్పుడు మరింత ఎడతెగక ప్రార్థించాడు. (మత్తయి 26:36-44; యోహాను 17:1-26; హెబ్రీయులు 5:7) హింసాకొయ్యపై బాధననుభవిస్తున్నప్పుడు, తనను నిందించినవారిని ఆయన దూషించలేదు. బదులుగా, తెలియక అలా చేస్తున్నవారి కొరకు, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” ఆయన ప్రార్థించాడు. (లూకా 23:34) “న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించు”కొంటూ ఆయన తన మనస్సును తన తండ్రిపై కేంద్రీకరించాడు. హింసాకొయ్యమీది నుండి ఆయన పలికిన చివరి మాటలు, ఆయన తన తండ్రికి చేసిన ప్రార్థనయై ఉండెను. (1 పేతురు 2:23; లూకా 23:46) యేసు యెహోవాపై పూర్తిగా ఆధారపడి, తన తండ్రి తనకు అప్పగించిన పనిని నమ్మకంగా ముగించినందుకు మనం ఎంత కృతజ్ఞత కలిగివుంటామో కదా! మనం యేసుక్రీస్తును ఎన్నడూ చూడకపోయినప్పటికీ, ఆయన చేసినదాన్నిబట్టి మనం ఆయనను ఎంత గాఢంగా ప్రేమిస్తామోకదా!
ఆయన ఎడల మనకున్న ప్రేమను వ్యక్తపర్చడం
19. యేసు ఎడల ప్రేమను వ్యక్తపర్చడంలో, ఏ ఆచారాలను మనం పూర్తిగా అసమంజసమైనవిగా నివారించాలి?
19 మనం కలిగివున్న ప్రేమ కేవలం మాటలకంటే ఎక్కువైనదనే దానికి మనమెలా నిదర్శనాన్నివ్వవచ్చు? యేసు ప్రేమించిన అతని తండ్రి, విగ్రహాలను చేసుకుని వాటిని ఆరాధనా వస్తువులుగా చూడడాన్ని నిషేధించాడు గనుక, అలాంటి బొమ్మను మన మెడ చుట్టూ దండలో వేసుకోవడం ద్వారా లేక అలాంటి విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించడం ద్వారా మనం నిజంగా యేసుకు ఘనత తీసుకురాము. (నిర్గమకాండము 20:4, 5; యోహాను 4:24) మనం వారమంతా ఆయన బోధలకు అనుగుణంగా జీవించకుండా మత సంబంధమైన కార్యక్రమాలకు హాజరవ్వడం, అదీ వారంలో అనేకసార్లు అలా చేయడం యేసుకు ఘనత తెచ్చినట్లు కాదు. యేసు ఇలా చెప్పాడు: “నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును.”—యోహాను 14:21, 23; 15:10.
20. మనం యేసును నిజంగా ప్రేమిస్తున్నామో లేదో చూపించే కొన్ని విషయాలు ఏవి?
20 ఆయన మనకు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు? అన్నిటికంటే ముఖ్యమైనది, సత్యదేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలన్నది. (మత్తయి 4:10; యోహాను 17:3) దేవుని సంకల్పంలో తన పాత్రనుబట్టి, దేవుని కుమారునిగా మనం తనయందు విశ్వాసముంచాలని, దుష్ట కార్యాలను విడనాడి వెలుగులో నడవడం ద్వారా దాన్ని చూపించాలని కూడా యేసు మనకు బోధించాడు. (యోహాను 3:16-21) భౌతిక అవసరతలకు సంబంధించిన ఆసక్తికంటే దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని ముందుంచడం ద్వారా మొదట వీటి కొరకు వెదకమని ఆయన మనకు ఉపదేశించాడు. (మత్తయి 6:31-33) ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనం ఒకరినొకరం ప్రేమించాలని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. (యోహాను 13:34; 1 పేతురు 1:22) ఆయనలానే మనం దేవుని సంకల్పం గురించి సాక్ష్యమిచ్చేవారిగా ఉండాలని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 24:14; 28:19, 20; ప్రకటన 3:14) నేడు దాదాపు 50 లక్షలమంది యెహోవాసాక్షులు, తాము యేసును ఎన్నడూ చూడకపోయినప్పటికీ ఆ ఆజ్ఞలను పాటించేలా నిజమైన ప్రేమచే పురికొల్పబడుతున్నారు. వారు యేసును వ్యక్తిగతంగా చూడకపోవడమన్నది, విధేయత చూపాలన్న వారి నిశ్చయతను ఎంతమాత్రం తగ్గించదు. “నీవు నన్నుచూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని” అపొస్తలుడైన తోమాకు తమ ప్రభువు చెప్పిన మాటలను వారు జ్ఞాపకం చేసుకుంటారు.—యోహాను 20:29.
21. ఈ సంవత్సరం మార్చి 23, ఆదివారాన జరిగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థదినానికి హాజరవ్వడం ద్వారా మనమెలా ప్రయోజనాన్ని పొందుతాం?
21 మానవజాతి ఎడల దేవుడు వ్యక్తపర్చిన అత్యంత గొప్ప ప్రేమను గుర్తు చేసుకోవడానికి, ఆయన నమ్మకమైన కుమారుడైన యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి 1997 మార్చి 23, ఆదివారం సూర్యాస్తమయం తర్వాత యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లో సమకూడే వారిలో మీరు కూడా ఉంటారని అపేక్షించడం జరుగుతుంది. ఆ సందర్భంలో చెప్పబడేది, చేయబడేది యెహోవా ఎడల ఆయన కుమారుని ఎడల ప్రేమను అధికం చేసి, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలనే కోరికను పెంచాలి.—1 యోహాను 5:3.
మీరెలా సమాధానమిస్తారు?
◻ పేతురు తన మొదటి పత్రికను ఎవరికి వ్రాశాడో వారు యేసు గురించి ఎలా తెలుసుకుని, ప్రేమించగలిగారు?
◻ తొలి క్రైస్తవులు వినిన విషయాల్లో మిమ్మల్ని ప్రభావితం చేసేవి కొన్ని ఏవి?
◻ యేసు చూపిన స్ఫూర్తిలోని ఏది ఆయన ఎడల మీకుగల ప్రేమను అధికం చేస్తుంది?
◻ యేసు దీనత్వంతో దేవునిపై ఆధారపడడం మనకెందుకంత ప్రాముఖ్యమైనది?
◻ యేసుక్రీస్తు ఎడల మనకున్న ప్రేమను మనం ఎలా ప్రదర్శించవచ్చు?
[16, 17వ పేజీలోని చిత్రం]
యేసు చూపించిన స్ఫూర్తినిబట్టి మనం ఆయనవైపు ఆకర్షించబడినట్లు భావిస్తాము