తిరిగి మంటికి చేరడం—ఎలా?
‘నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.’ మొదటి మానవుడైన ఆదాము ఆ మాటలను విన్నప్పుడు, ఏమి అపేక్షించాలో ఆయనకు తెలుసు. ఆయన నేలమట్టి నుండి తయారు చేయబడ్డాడు, తుదకు మంటికే తిరిగి చేరతాడు. ఆయన తన సృష్టికర్తయైన యెహోవా దేవునికి అవిధేయుడయ్యాడు గనుక ఆయన మరణిస్తాడు.—ఆదికాండము 2:7, 15-17; 3:17-19.
మానవులు మట్టి నుండి తయారు చేయబడ్డారని బైబిలు చూపిస్తుంది. అది ఇలా కూడా చెబుతుంది: “పాపము చేయు ప్రాణము—అదే మరణిస్తుంది.” (యెహెజ్కేలు 18:4, NW; కీర్తన 103:14) మరణం కోట్లాదిమందికి వేదన కలుగజేసింది, మానవ కళేబరాన్ని నిర్మూలించడం గురించి ప్రశ్నలను పదేపదే లేవదీసింది.
గత మరియు ప్రస్తుత ఆచారాలు
ప్రాచీన కాలంలో దేవుని ప్రజలు మానవ కళేబరాన్ని ఎలా నిర్మూలించేవారు? బైబిలు దాని తొలి పుటల్లో, మృతులను భూమిలో పాతిపెట్టడంతో సహా చేపట్టిన అనేక విధానాల గురించి తెలియజేస్తుంది. (ఆదికాండము 35:8) పితరుడైన అబ్రాహాము, ఆయన భార్యయైన శారా, అలాగే వారి కుమారుడైన ఇస్సాకు, మనుమడైన యాకోబు మక్పేలా గుహలో పాతిపెట్టబడ్డారు. (ఆదికాండము 23:2, 19; 25:9; 49:30, 31; 50:13) ఇశ్రాయేలు న్యాయాధిపతులైన గిద్యోను మరియు సమ్సోను ‘తమ పితరుల సమాధులలో’ పాతిపెట్టబడ్డారు. (న్యాయాధిపతులు 8:32; 16:31) ప్రాచీన కాల దేవుని ప్రజలు కుటుంబం కొరకు సమాధుల శ్మశాన వాటికలను కలిగివుండేందుకు ఇష్టపడేవారని ఇది సూచిస్తుంది. సా.శ. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు మరణించినప్పుడు, ఆయన శరీరం రాతిలో క్రొత్తగా తొలిపించబడిన సమాధిలో ఉంచబడింది. (మత్తయి 27:57-60) సాధారణంగా, అప్పట్లో మానవ కళేబరాలను భూమిలో గాని, తొలిపించిన గుహల్లోగాని పాతిపెట్టేవారు. భూవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ ఒక ఆచారంగానే ఉంది.
అయితే నేడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, స్థలం కొరత, స్థలానికి విపరీతమైన ఖరీదు ఉండడాన్నిబట్టి శ్మశాన వాటికలను కొనడం ఎంతో కష్టతరం అవుతుంది. అందుకే, మానవ కళేబరాలను నిర్మూలించడం కొరకు కొంతమంది ప్రజలు ఇతర మార్గాలను వెతుకుతున్నారు.
మానవ కళేబరాన్ని దహనం చేసిన తర్వాత చితాభస్మాన్ని వెదజల్లడం సర్వసాధారణమౌతోంది. ఇంగ్లాండులో 40 శాతం మంది మృతులను ఈ విధంగానే నిర్మూలిస్తున్నారు. స్వీడెన్‌లో, నగరప్రాంతాలందు మరణించినవారిలో 80 శాతం కంటే ఎక్కువమందిని దహనం చేస్తున్నారు, చితాభస్మాన్ని వెదజల్లేందుకు కొన్ని అడవులు కేటాయించబడ్డాయి. చైనాలోని షాంగాయ్ మరియు ఇతర కొన్ని తీరప్రాంత నగరాల్లో, సంవత్సరంలోని అనేక పర్యాయాలు సముద్రం మీద పెద్ద మొత్తంలో వెదజల్లే కార్యక్రమాన్ని నగర ప్రభుత్వాలు చేపడుతున్నాయి.
చితాభస్మాన్ని ఎక్కడ వెదజల్లవచ్చు? ఎక్కడబడితే అక్కడ కాదు. చితాభస్మాన్ని వెదజల్లడం పర్యావరణానికి హాని కలిగిస్తుందని కొందరు భయపడవచ్చు. అయితే, వాస్తవానికి తెగుళ్లు రాగల ప్రమాదం శవదహనం ద్వారా తగ్గించబడుతుంది. ఇంగ్లాండులోని కొన్ని శ్మశానాలు మరియు అమెరికాలోని కొన్ని సమాధుల తోటలు, పచ్చిక బయళ్లను లేక పూల తోటలను అలా వెదజల్లే స్థలాలుగా కేటాయించాయి. అయితే, క్రైస్తవులు ప్రాముఖ్యంగా శవదహనం మరియు చితాభస్మాన్ని వెదజల్లడం వంటివాటికి సంబంధించి లేఖనాధార అభిప్రాయం ఏమిటనేదాని గురించి శ్రద్ధ కలిగివున్నారు.
లేఖనాధార అభిప్రాయం ఏమిటి?
“బబులోను రాజు”కు తీర్పును ప్రకటిస్తూ ప్రవక్తయైన యెషయా ఇలా చెప్పాడు: “నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలెనున్నావు.” (యెషయా 14:4, 19) చితాభస్మాన్ని వెదజల్లడాన్ని అలాంటి అవమానంతో పోల్చవచ్చా? పోల్చకూడదు, ఎందుకంటే అక్కడ శవదహనం గురించి, భద్రపర్చడం గురించి లేక మిగిలే బూడిదను వెదజల్లడం గురించి ప్రస్తావించబడలేదు.
“సమాధులలోనున్న వారందరు [నా] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు” అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఆయన తన వెయ్యేండ్ల పరిపాలన కాలంలో జరిగే భూసంబంధమైన మృతుల పునరుత్థానం గురించి మాట్లాడాడు. (యోహాను 5:28, 29) అయితే, పునరుత్థానాన్ని గూర్చిన మరో ప్రవచనార్థక వివరణ, ఒక వ్యక్తిని పునరుత్థానం చేయడానికి ఒక ప్రత్యేకమైన సమాధి అవసరం లేదని తెలియజేస్తుంది. ప్రకటన 20:13 ఇలా అంటోంది: “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను.” కాబట్టి ఒక వ్యక్తి ఎక్కడ లేక ఎలా ‘తిరిగి మన్నైపోతాడన్నది’ ప్రాముఖ్యమైన విషయం కాదు. బదులుగా, అతన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా, పునరుత్థానం చేస్తాడా అన్నది ప్రాముఖ్యం. (యోబు 14:13-15; లూకా 23:42, 43 పోల్చండి.) ప్రజలను జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేసేందుకు యెహోవాకు ఆడంబరమైన సమాధులు ఎంతమాత్రం అవసరం లేదు. శవదహనం ఒక వ్యక్తి పునరుత్థానాన్ని నివారించదు. అబద్ధ మత ఆచారాలేవి లేకుండా, సరైన దృక్పథంతో చితాభస్మాన్ని వెదజల్లితే అది లేఖనవిరుద్ధమేమికాదు.
చితాభస్మాన్ని వెదజల్లాలని నిర్ణయించుకునేవారు ఆ దేశానికి సంబంధించిన చట్టాన్ని పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. దుఃఖిస్తున్నవారి, మరితరుల భావాలను వారు పరిగణలోకి తీసుకోవడం కూడా సముచితమైనదే. ఈ విషయంలో యెహోవా సేవకులు తమకున్న లేఖనాధార స్వేచ్ఛను ఉపయోగించుకోవడం వల్ల క్రైస్తవులు కల్గియున్న మంచి పేరుపై అపనిందను తీసుకురాకుండా ఉండడానికి జాగ్రత్త వహిస్తారు. శవదహనం మరియు చితాభస్మాన్ని వెదజల్లడం చట్టబద్ధంగా అనుమతించబడినా, సమాజంలో ఇంకా పూర్తిగా అంగీకరించబడని దేశాల్లో ప్రత్యేకంగా ఇది ప్రాముఖ్యము. అయితే, మానవ ప్రాణం అమర్త్యమైనదనే నమ్మకంపై ఆధారపడిన ఏ ఆచారాలు లేక సాంప్రదాయాలనుండైనా ఒక క్రైస్తవుడు దూరంగా ఉంటాడు.
సమాధి నుండి పూర్తి స్వేచ్ఛ!
చితాభస్మాన్ని వెదజల్లడాన్ని సమర్థించే కొందరు అలా చేయడం సమాధుల్లో పాతిపెట్టడం నుండి స్వేచ్ఛను కలిగిస్తుందని చెబుతారు. అయితే, “కడపట నశింపజేయబడు శత్రువు మరణము” అనే బైబిలు వాగ్దాన నెరవేర్పు అత్యధిక ఉపశమనాన్ని కలిగిస్తుంది.—1 కొరింథీయులు 15:24-28.
దీని భావమేమిటంటే సమాధులు, గోరీలు చివరికి శవదహనం మరియు చితాభస్మాన్ని వెదజల్లడం గతించిన విషయాలై ఉంటాయి. అవును, మరణం ఇక ఉండదు. దైవిక ప్రేరణతో అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “అప్పుడు—ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.”—ప్రకటన 21:3, 4.
దేవుని రాజ్యం క్రింద, ఆదాము పాపం ఫలితంగా వచ్చిన మానవ మరణం పూర్తిగా నిర్మూలింపబడినప్పుడు ఇదంతా సంభవిస్తుంది. అప్పుడు, విధేయులైన మానవజాతి తిరిగి మట్టికి చేరే అవసరం ఉండదు.
[29వ పేజీలోని చిత్రం]
మానవ కళేబరాన్ని నిర్మూలించే సాధారణ పద్ధతులు
[31వ పేజీలోని చిత్రం]
జపాన్ నందలి సగామి ఖాతంలో చితాభస్మాన్ని వెదజల్లడం
[క్రెడిట్ లైను]
Courtesy of Koueisha, Tokyo