ఒక బైబిలు ప్రవచన నెరవేర్పు
ఇంగ్లాండు నందలి లండన్‌లోని ఇంపీరియల్ వార్ వస్తుప్రదర్శనశాలలో ఒక విశేషమైన గడియారం మరియు ఒక ఎలక్ట్రానిక్ డిజిటల్ కౌంటర్ ప్రదర్శనకోసం ఉంచబడ్డాయి. గడియారం తిరుగుతుండగా, కౌంటర్ ప్రతి 3.31 సెంకడ్లకు క్లిక్ చేస్తుంది. క్లిక్ చేసిన ప్రతిసారి సంఖ్య మొత్తానికి మరో అంకె జతచేయబడుతుంది. ప్రతి క్లిక్, ప్రతి సంఖ్య ఈ శతాబ్దంలో యుద్ధం మూలంగా మరణించిన ఒక పురుషునికి, ఒక స్త్రీకి, లేక ఒక బాలునికి/బాలికకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
1989 జూన్‌లో కౌంటర్ దాని లెక్కింపును ప్రారంభించింది, 2000ల సంవత్సరం ప్రారంభమయ్యే మధ్యరాత్రి సమయానికి అది ముగుస్తుందని నిరీక్షించబడుతోంది. ఆ సమయానికల్లా కౌంటరులోని సంఖ్య పది కోట్లవుతుంది అంటే అది 20వ శతాబ్దంలో సంభవించిన యుద్ధ సంబంధిత మరణాలుగా అంచనావేయబడిన సంఖ్య.
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, ‘జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచే’ కాలంగా గుర్తించబడే సమయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రవచించాడు. అలాగే, అసంఖ్యాకమైన భూకంపాలు, తెగుళ్లు, ఆహారకొరతలు, ఇతర అభివృద్ధులతోపాటు ఈ శతాబ్దంలోని నాశనకరమైన యుద్ధాలు మొత్తమన్నీ కలిసి మనం “అంత్యదినములలో” అంటే 1914వ సంవత్సరంలో క్రీస్తు పరలోకంలో రాజుగా నియమింపబడిన తరువాతి కాలంలో జీవిస్తున్నామనడానికి రుజువును అందజేస్తాయని యెహోవాసాక్షులు ఎప్పటినుండో ప్రకటిస్తున్నారు.—లూకా 21:10, 11; 2 తిమోతి 3:1.
కావలికోట బైబిలును తన అధికారమూలంగా ఉపయోగించుకుంటూ, దేవుని రాజ్యం త్వరలోనే అణిచివేసేవారిని నాశనం చేసి, భూమిని పరదైసుగా మారుస్తుందనే సువార్తను ప్రకటిస్తోంది. యుద్ధం యొక్క భవిష్యత్తు మాటేమిటి? బైబిలు ఇలా తెలియజేస్తుంది: “యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.”—కీర్తన 46:8, 9.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Clock: By Courtesy of the Imperial War Museum