కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 9/15 పేజీలు 26-28
  • లూదియ—ఆతిథ్యమిచ్చే దైవారాధికురాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లూదియ—ఆతిథ్యమిచ్చే దైవారాధికురాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఊదారంగు పొడిని అమ్మే స్త్రీ’
  • పౌలు ఫిలిప్పీలో ప్రకటించడం
  • ‘దైవారాధికురాలు’
  • ‘ఆమె మమ్మును బలవంతము చేసెను’
  • ఫిలిప్పీలోని సహోదరులు
  • “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయి”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • సంతోషంగా ఉండాలంటే ఏంచేయాలి?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఫిలిప్పీ—నీటి ఊటల స్థలం
    తేజరిల్లు!—1992
  • “మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 9/15 పేజీలు 26-28

లూదియ—ఆతిథ్యమిచ్చే దైవారాధికురాలు

ప్రాచీన కాలాల నుండి, సత్య దేవుని సేవకులు ఆతిథ్యమిచ్చేవారిగా తమ్మును తాము ప్రత్యేకపర్చుకున్నారు. (ఆదికాండము 18:1-8; 19:1-3) “అపరిచితుల ఎడల ప్రేమ, మక్కువ, లేక దయ చూపుట” అని నిర్వచింపబడి, యథార్థమైన హృదయం నుండి ఉత్పన్నమయ్యే ఆతిథ్యమిచ్చే గుణం నేడు కూడా నిజ క్రైస్తవత్వానికి చిహ్నంగా ఉంది. వాస్తవానికి, దేవుని అంగీకారం పొందే విధంగా ఆరాధించే వారందరికీ అది ఒక ఆవశ్యకత.—హెబ్రీయులు 13:2; 1 పేతురు 4:9.

మాదిరికరమైన విధంగా ఆతిథ్యమిచ్చినవారిలో ఒకరు లూదియ. ఫిలిప్పీని సందర్శించడానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలను తన ఇంటిలో ఉండమని ఆమె “బలవంతము చేసెను.” (అపొస్తలుల కార్యములు 16:15) లేఖనాల్లో లూదియ క్లుప్తంగా ప్రస్తావించబడినప్పటికీ, ఆమె గురించి చెప్పబడిన ఆ కొంచెమే మనకు ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఏ విధంగా? లూదియ ఎవరు? ఆమె గురించి మనకు ఏమి తెలుసు?

‘ఊదారంగు పొడిని అమ్మే స్త్రీ’

మాసిదోనియ ముఖ్య నగరమైన ఫిలిప్పీలో లూదియ నివసించేది. అయితే, ఆమె పశ్చిమ ఆసియా మైనరులోగల లూదియ ప్రాంతంలోని నగరమైన తుయతైరకు చెందినది. ఈ కారణాన్నిబట్టి కొందరు, “లూదియ” అన్నది ఆమెకు ఫిలిప్పీలో ఇవ్వబడిన మారుపేరని అంటారు. వేరే మాటల్లో చెప్పాలంటే, యేసుక్రీస్తు సాక్ష్యమిచ్చిన స్త్రీ “సమరయ స్త్రీ” అని ఎలా పిలువబడగలదో అలాగే ఈమె “లూదియ కాపురస్థురాలు” అని పిలువబడింది. (యోహాను 4:9) లూదియ “ఊదారంగు పొడిని” లేక ఈ అద్దకంతో రంగు వేయబడిన వస్తువులను అమ్మేది. (అపొస్తలుల కార్యములు 16:12, 14) తుయతైరలో మరియు ఫిలిప్పీలో అద్దకంపని చేసేవారు ఉండేవారనే విషయాన్ని పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికితీసిన శిలాశాసనాలు ధృవీకరిస్తున్నాయి. లూదియ తన పని నిమిత్తం, అంటే తన స్వంత వ్యాపారాన్ని కొనసాగించడానికో లేక తుయతైరకు చెందిన అద్దకం వ్యాపార సంస్థ ప్రతినిధిగానో అక్కడికి వెళ్లివుండవచ్చు.

ఊదారంగు అనేక మూలాల నుండి లభిస్తుంది. చాలా ఖరీదైనది, కొన్ని రకాలైన సముద్ర నత్తల నుండి తీయబడుతుంది. మొదటి శతాబ్దపు రోమా కవియైన మార్షల్‌ చెప్పేదాని ప్రకారం, తూరుకు (ఈ పదార్థం ఉత్పత్తి చేయబడే మరో కేంద్రం) చెందిన శ్రేష్ఠమైన ఊదారంగు పొర దాదాపు 10,000 సెసస్టర్‌లు లేక 2,500 దేనారములు ఖరీదు చేయగలదు, అంటే అది ఒక కార్మికునికి 2,500 రోజుల పని కొరకు లభించే వేతనంతో సమానం. స్పష్టంగా, అలాంటి దుస్తులు కొంతమంది మాత్రమే కలిగివుండగల విలాస వస్తువులే. కాబట్టి లూదియ ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉండివుండవచ్చు. ఏదేమైనప్పటికీ, ఆమె అపొస్తలుడైన పౌలుకు, ఆయన అనుచరులైన లూకా, సీల, తిమోతి వంటివారికి, బహుశా మరితరులకు ఆతిథ్యం ఇవ్వగలిగింది.

పౌలు ఫిలిప్పీలో ప్రకటించడం

దాదాపు సా.శ. 50వ సంవత్సరంలో, పౌలు మొదటిసారిగా ఐరోపాలో అడుగిడి, ఫిలిప్పీలో ప్రకటించడం ప్రారంభించాడు.a ఒక క్రొత్త నగరంలోకి ప్రవేశించిన వెంటనే, మొదట యూదులకు, సమాజమందిరంలో కూడుకొని ఉండే యూదామత ప్రవిష్టులకు ప్రకటించడానికి అక్కడికి వెళ్లడం పౌలుకు ఆనవాయితి. (అపొస్తలుల కార్యములు 13:4, 5, 13, 14; 14:1 పోల్చండి.) అయితే కొన్ని మూలాలు తెలియజేసేదాని ప్రకారం, యూదులు ఫిలిప్పీ యొక్క “పవిత్ర పొలిమేరల” లోపల తమ మతాన్ని ఆచరించడాన్ని రోమా చట్టం నిషేధించింది. కాబట్టి, మిషనరీలు అక్కడ “కొన్నిదినములు” గడిపిన తర్వాత, ‘ప్రార్థన జరిగే స్థలమని’ వారు భావించిన ప్రాంతంలో అంటే గవిని దాటి నది అవతల విశ్రాంతి దినాన వారు ఒక స్థలాన్ని కనుగొన్నారు. (అపొస్తలుల కార్యములు 16:12, 13) ఇది గాంగైటిస్‌ నది అని స్పష్టమౌతుంది. అక్కడ మిషనరీలు కేవలం స్త్రీలనే కనుగొన్నారు, వారిలో లూదియ ఒకరు.

‘దైవారాధికురాలు’

లూదియ ‘దైవభక్తిగల స్త్రీ’ కాని, ఆమె బహుశా మత సత్యాన్ని వెదుకుతూ యూదామతంలోకి మారి ఉండవచ్చు. తనకు మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ, లూదియ ధనాపేక్షగలదికాదు. బదులుగా, ఆమె తన సమయాన్ని ఆత్మీయ విషయాల కొరకు కేటాయించేది. “ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను” మరియు లూదియ సత్యాన్ని అంగీకరించింది. వాస్తవానికి, ‘ఆమె, ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందారు.’—అపొస్తలుల కార్యములు 16:14, 15.

లూదియ ఇంటివారిలోని ఇతర సభ్యులు ఎవరో బైబిలు స్పష్టపర్చడం లేదు. భర్త గురించిన ప్రస్తావన లేదు గనుక, ఆమె ఒంటరి స్త్రీ లేదా విధవరాలు అయ్యుండవచ్చు. బహుశా ‘ఆమె ఇంటివారిలో’ బంధువులు చేరివుండవచ్చు, కాని ఆ పదం దాసులను లేక పనివారిని కూడా సూచించవచ్చు. ఏదేమైనప్పటికీ, లూదియ తాను నేర్చుకున్న విషయాలను తనతో పాటు ఉంటున్నవారితో ఉత్సాహంగా పంచుకుంది. వాళ్లు నిజమైన విశ్వాసాన్ని నమ్మి, దాన్ని హత్తుకున్నప్పుడు ఆమె ఎంతగా సంతోషించి ఉండవచ్చు!

‘ఆమె మమ్మును బలవంతము చేసెను’

లూదియను కలవక ముందు, బహుశా మిషనరీలు తమ స్వంత ఖర్చులతో తీసుకున్న వసతులతో సంతృప్తి పడవలసి వచ్చేదేమో. కాని వారికి ప్రత్యామ్నాయ వసతులను ఇవ్వగలుగుతున్నందుకు ఆమె సంతోషించింది. అయితే ఆమె బలవంతము చేసిందన్న దాన్నిబట్టి చూస్తే, పౌలు ఆయన తోటివారు కొంతమేరకు నిరాకరించారన్న విషయాన్ని సూచిస్తుంది. ఎందుకు? ఎందుకంటే ‘తనకున్న అధికారాన్ని పూర్ణముగా వినియోగపరచుకొనకుండ, సువార్తను ఉచితముగా ప్రకటించాలని,’ ఎవరికీ భారంగా ఉండకూడదని పౌలు కోరుకున్నాడు. (1 కొరింథీయులు 9:18; 2 కొరింథీయులు 12:14) అయితే లూకా ఇలా జతచేస్తున్నాడు: “ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె—నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు ఎంచితే, నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.” (అపొస్తలుల కార్యములు 16:15) యెహోవా ఎడల నమ్మకంగా ఉండడం గురించి లూదియ ఎంతో పట్టుదల కలిగివుండేది, ఆతిథ్యమివ్వడం స్పష్టంగా ఆమెకున్న విశ్వాసానికి నిదర్శనం. (1 పేతురు 4:9 పోల్చండి.) ఎంత చక్కని మాదిరి! మనం కూడా మనకున్న వనరులను సువార్త కార్యకలాపాలను పెంపొందింపజేయడానికి ఉపయోగిస్తామా?

ఫిలిప్పీలోని సహోదరులు

దయ్యం పట్టిన బానిస బాలికకు సంబంధించిన సంఘటన జరిగిన తర్వాత పౌలు మరియు సీల చెరసాల నుండి విడుదల చేయబడినప్పుడు, వారు లూదియ ఇంటికి తిరిగి వచ్చి, అక్కడ కొంతమంది సహోదరులను కనుగొన్నారు. (అపొస్తలుల కార్యములు 16:40) క్రొత్తగా ఏర్పడిన ఫిలిప్పీ సంఘంలోని విశ్వాసులు లూదియ గృహాన్ని క్రమంగా కూడుకొనే స్థలంగా ఉపయోగించుకొని ఉండవచ్చు. ఆమె గృహం ఆ నగరంలో దైవపరిపాలనా కార్యానికి కేంద్రంగా ఉండడంలో కొనసాగిందని తలంచడం సహేతుకమైనదే.

లూదియ ప్రారంభంలో ఇచ్చిన వాత్సల్యపూర్వకమైన ఆతిథ్యం సంఘమంతటికీవున్న లక్షణమని నిరూపించబడింది. ఫిలిప్పీయులు తాము పేదరికంలో ఉన్నప్పటికీ, పౌలుకు అవసరమైన వస్తువులను అనేక సందర్భాలలో పంపించారు, అపొస్తలుడు ఎంతో కృతజ్ఞత చూపించాడు.—2 కొరింథీయులు 8:1, 2; 11:9; ఫిలిప్పీయులు 4:10, 15, 16.

దాదాపు సా.శ. 60-61 ఆ ప్రాంతంలో పౌలు ఫిలిప్పీయులకు పంపిన పత్రికలో లూదియ గురించి ప్రస్తావించలేదు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో వివరించబడిన సంఘటనలు జరిగిన తర్వాత ఆమెకు ఏమైందో లేఖనాలు బయల్పర్చడం లేదు. ఏమైనప్పటికీ, ఈ హుషారైన స్త్రీని గూర్చిన స్వల్ప ప్రస్తావన, ‘శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చేవారిగా’ ఉండాలనే కోరికను మనకు కలిగిస్తుంది. (రోమీయులు 12:13) లూదియ వంటి క్రైస్తవులను మన మధ్య కలిగివున్నందుకు మనమెంత కృతజ్ఞత కలిగివుండాలోకదా! యెహోవా దేవునికి మహిమ కలిగేలా, సంఘాలను వాత్సల్యపూరితమైనవిగా, స్నేహపూరితమైనవిగా చేసేందుకు వారి స్ఫూర్తి ఎంతో దోహదపడుతుంది.

[అధస్సూచీలు]

a మాసిదోనియలోని అత్యంత ప్రాముఖ్యమైన నగరాల్లో ఫిలిప్పీ పాక్షికంగా వర్ధిల్లుతున్న సైనిక కాలనీగా ఉండేది, అది యూస్‌ ఇటాలికమ్‌ (ఇటలీ చట్టం) ద్వారా నడిపించబడేది. రోమా పౌరులు అనుభవిస్తున్నవాటితో పోల్చదగిన హక్కుల గురించి ఈ శాసనం ఫిలిప్పీయులకు హామీ ఇచ్చింది.—అపొస్తలుల కార్యములు 16:9, 12, 21.

[28వ పేజీలోని బాక్సు]

ఫిలిప్పీలో యూదా జీవనవిధానం

యూదులకు మరియు యూదామత మతప్రవిష్టులకు ఫిలిప్పీలో జీవితం అంత సులభంగా ఏమి ఉండకపోవచ్చు. అక్కడ యూదా వ్యతిరేక నమ్మకాలు ఉండవచ్చు, ఎందుకంటే పౌలు సందర్శనానికి కొంచెం ముందు, క్లౌదియ చక్రవర్తి రోము నుండి యూదులను బహిష్కరించాడు.—అపొస్తలుల కార్యములు 18:2 పోల్చండి.

విశేషంగా, దయ్యం పట్టిన బానిస బాలికను స్వస్థపర్చిన తర్వాత పౌలు సీలలు న్యాయాధిపతుల ఎదుటకి ఈడ్చుకొనిపోబడ్డారు. ఆమె యజమానులు, ఇప్పుడు మంచి లాభసాధనము పోవడంతో, “ఈ మనుష్యులు యూదులై యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని” నొక్కిచెబుతూ తమ తోటి పౌరుల దురభిమానం నుండి లాభం పొందారు. ఫలితంగా, పౌలు మరియు సీల బెత్తములతో కొట్టబడి, చెరసాలలో వేయబడ్డారు. (అపొస్తలుల కార్యములు 16:16-24, ఇటాలిక్కులు మావి.) అలాంటి వాతావరణంలో, యూదుల దేవుడైన యెహోవాను బహిరంగంగా ఆరాధించడానికి ధైర్యం అవసరం. కాని భిన్నంగా ఉండడానికి లూదియ అభ్యంతరపడలేదని స్పష్టమౌతుంది.

[27వ పేజీలోని చిత్రం]

ఫిలిప్పీ వద్దనున్న శిథిలాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి