జలప్రళయ పురాణగాధ బైబిలు వృత్తాంతాన్ని సమర్థిస్తుంది
నోవహు కాలంలో భూవ్యాప్తంగా సంభవించిన జలప్రళయం ఓ చారిత్రాత్మక వాస్తవం. ఈ వృత్తాంతాన్ని గూర్చిన వివరణలను ప్రపంచవ్యాప్తంగా అనేక విభిన్న నాగరికతలలోని మౌఖిక చరిత్రలో కనుగొనవచ్చు. ఆఫ్రికా దేశమైన చాద్‌లో, మూసాయి తెగ జలప్రళయాన్ని ఇలా వర్ణిస్తోంది:
‘ఒకానొక కాలంలో, ఓ సుదూర ప్రాంతంలో ఒక కుటుంబం నివసించేది. ఒకరోజు, ఈ కుటుంబంలోని తల్లి తన ప్రియమైనవారి కొరకు ఒక పుష్టికరమైన భోజనం తయారుచేయాలనుకుంది. అందుకని జొన్నలను పిండి చేయడానికి ఆమె తన రోలు రోకలి తీసుకుంది. ఆ సమయంలో ఆకాశం ఇప్పుడున్నదాని కంటే ఎంతో దగ్గరగా ఉండేది. వాస్తవానికి, మీరు మీ చెయ్యిపైకి చాపితే, మీరు దాన్ని తాకగలుగుతారు. ఆమె తన శక్తినంతా ఉపయోగించి జొన్నలను దంచింది, ఆమె దంచిన జొన్నలు త్వరగా పిండిగా మారాయి. కాని ఆ స్త్రీ అలా దంచుతున్నప్పుడు, నిర్లక్ష్యంగా తన రోకలిని మరీ పైకి లేపడంతో, ఆమె ఆకాశానికి రంధ్రం చేసింది! వెంటనే, విస్తారమైన నీళ్లు భూమిమీద పడడం ప్రారంభమైంది. ఇది సామాన్యమైన వర్షం కాదు. మొత్తం భూమంతా నీళ్లతో నిండిపోయేంతవరకు, ఏడు దినాలు ఏడు రాత్రులు వర్షం కురిసింది. వర్షం కురుస్తుండగా, ఆకాశం ఇప్పుడున్న స్థలానికి అంటే అందుకోలేనంత ఎత్తుకి వెళ్లిపోయింది. మానవజాతికి ఎంతటి దుర్దశ! అప్పటి నుండి, మనం మన చేతితో ఆకాశాన్ని తాకే ఆధిక్యతను కోల్పోయాము.’
ఆసక్తికరంగా, భూవ్యాప్త జలప్రళయాన్ని గూర్చి చెప్పే ప్రాచీన వృత్తాంతాలను ప్రపంచమంతటా కనుగొనవచ్చు. అమెరికాలకు చెందిన స్థానిక నాగరికతలకు అలాగే ఆస్ట్రేలియాకు చెందిన ఆదివాసులకు దాన్ని గూర్చిన కథలు ఉన్నాయి. వివరాలు వేరుగా ఉండవచ్చు, కాని అనేక వృత్తాంతాలలో భూమి నీటితో నిండిపోయిందని, కేవలం కొంతమంది మాత్రమే మానవ నిర్మిత ఓడలో కాపాడబడ్డారనే తలంపు ఉంది. ఈ అంశం విస్తృతంగా వ్యాప్తి చెందడం బైబిలునందు నివేదించబడినట్లుగా ప్రపంచవ్యాప్త జలప్రళయం సంభవించిందనే వాస్తవాన్ని సమర్థిస్తుంది.—ఆదికాండము 7:11-20.