కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 7/15 పేజీలు 26-29
  • గమలీయేలు—ఆయన తార్సువాడైన సౌలుకు బోధించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గమలీయేలు—ఆయన తార్సువాడైన సౌలుకు బోధించాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • గమలీయేలు ఎవరై ఉండెను?
  • గమలీయేలు చేత బోధింపబడటం—ఎలా?
  • గమలీయేలు బోధల అసలు భావం
  • ఆ తర్ఫీదు పౌలుకు ఏ భావాన్ని కలిగి ఉంది?
  • ‘మేము యేసు గురించి చెప్పకుండా ఉండలేము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • మిష్నా మరియు మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • అంతిమ విజయం వైపుకు ముందుకు సాగడం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 7/15 పేజీలు 26-29

గమలీయేలు—ఆయన తార్సువాడైన సౌలుకు బోధించాడు

ప్రజలు నిశ్శబ్దమయ్యారు. కొన్ని క్షణాలక్రితం వారు అపొస్తలుడైన పౌలును దాదాపు చంపేశారు. తార్సువాడైన సౌలుగా అందరికీ తెలిసిన ఈయన రోమా సైన్యం ద్వారా రక్షింపబడ్డాడు, ఇప్పుడు యెరూషలేములోని దేవాలయం దగ్గరి మెట్లమీది నుండి ప్రజలవైపుకు తిరిగి ఉన్నాడు.

నిశ్శబ్దంగా ఉండమని ప్రజలకు చేసైగ చేస్తూ, పౌలు హెబ్రీలో ఇలా మాట్లాడటం ప్రారంభించాడు: “సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి. . . . నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై” యుంటిని.—అపొస్తలుల కార్యములు 22:1-3.

తన జీవితం ప్రమాదంలో ఉంటే, తాను గమలీయేలు వద్ద శిక్షితుడనయ్యానని చెబుతూ పౌలు తన సంజాయిషీని ఎందుకు ప్రారంభించాడు? గమలీయేలు ఎవరై ఉండెను, ఆయనచే బోధింపబడటంలో ఏమి ఇమిడి ఉండినది? ఈ తర్ఫీదు, సౌలు క్రైస్తవ అపొస్తలుడైన పౌలుగా మారిన తర్వాత కూడా ఆయనను ప్రభావితం చేసిందా?

గమలీయేలు ఎవరై ఉండెను?

గమలీయేలు ఒక పేరుగాంచిన పరిసయ్యుడు. ఆయన పెద్దయగు హిల్లేల్‌ మనుమడు, ఆ హిల్లేల్‌ పరిసయ్యుల యూదా మతంలోని రెండు ముఖ్య పాఠశాలల్లో ఒకదాన్ని స్థాపించాడు.a హిల్లేల్‌ బోధనా విధానం, ఆయన ప్రత్యర్థి శామ్మాయ్‌ కంటే ఎక్కువ సహనం గలదని భావించబడేది. సా.శ. 70లో యెరూషలేము దేవాలయం నాశనమైన తర్వాత, బెట్‌ శామ్మాయ్‌ (శామ్మాయ్‌ యొక్క గృహం) కంటే బెట్‌ హిల్లేల్‌ (హిల్లేల్‌ యొక్క గృహం) ఎక్కువ అంగీకారయోగ్యంగా ఉండేది. దేవాలయం నాశనంతో మిగతా శాఖలన్నీ కనుమరుగయ్యాయి గనుక, హిల్లేల్‌ యొక్క గృహం యూదా మతానికి సంబంధించిన అధికారిక వ్యక్తీకరణ అయ్యింది. బెట్‌ హిల్లేల్‌ నిర్ణయాలు తరచూ, తాల్ముద్‌కు పునాదిగా మారిన మిష్నాలోని యూదా ధర్మశాస్త్రానికి ఆధారమయ్యాయి, బెట్‌ హిల్లేల్‌ ప్రాధాన్యతను సంతరించుకోవడానికి గమలీయేలు ప్రభావం ఓ ముఖ్య కారణమని స్పష్టమౌతుంది.

గమలీయేలు ఎంత ఉన్నతంగా ఎంచబడ్డాడంటే, రబ్బాన్‌ అని పిలువబడిన మొదటి వ్యక్తి ఆయనే, రబ్బాన్‌ అనేది రబ్బి అనే బిరుదుకంటే ఉన్నతమైనది. వాస్తవానికి, గమలీయేలు ఎంతో ఉన్నతంగా గౌరవింపబడిన వ్యక్తి, అందుకే మిష్నా ఆయన గురించి ఇలా చెబుతుంది: “పెద్దయగు రబ్బాన్‌ గమలీయేలు మరణించినప్పుడు, తోరా మహిమ క్షీణించింది, శుద్ధత మరియు స్వచ్ఛత [అక్ష. “ప్రత్యేకత”] నాశనమయ్యాయి.”—సోటాహ్‌ 9:15.

గమలీయేలు చేత బోధింపబడటం—ఎలా?

అపొస్తలుడైన పౌలు, యెరూషలేములోని జనసమూహాలకు తాను ‘గమలీయేలు పాదములయొద్ద బోధింప’బడ్డానని చెప్పినప్పుడు ఆయన భావమేమిటి? గమలీయేలు వంటి బోధకుని శిష్యుడై ఉండటంలో ఏమి ఇమిడి ఉంది?

అలాంటి తర్ఫీదు గురించి, అమెరికాలోని యూదా వేదాంత సెమినరీ పండితుడైన డోవ్‌ జ్లాట్‌నీక్‌ ఇలా వ్రాశాడు: “మౌఖిక ధర్మశాస్త్రం యొక్క కచ్చితత్వం అలా దాని నమ్మకత్వం దాదాపు పూర్తిగా గురుశిష్యుల సంబంధంపై ఆధారపడి ఉంటుంది: ధర్మశాస్త్రాన్ని బోధించడంలో గురువు తీసుకునే శ్రద్ధ మరియు దాన్ని నేర్చుకోవడంలో శిష్యుని ఆసక్తి. . . . కాబట్టి శిష్యులు పండితుల పాదాల వద్ద కూర్చుని . . . ‘వారు చెప్పే మాటలను తృష్ణతో స్వీకరించాలని’ పురికొల్పబడ్డారు.”—అవోట్‌ 1:4, మిష్నా.

యేసు క్రీస్తు కాలంలో యూదా ప్రజల చరిత్ర (ఆంగ్లం) అనే తన పుస్తకంలో, ఏమీల్‌ స్యూరర్‌ మొదటి శతాబ్దపు రబ్బి బోధకుల పద్ధతుల గురించి తెలియజేస్తున్నాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “ఎక్కువ ప్రఖ్యాతి గాంచిన రబ్బిలు తరచూ ఉపదేశింపబడాలని ఇష్టపడే యౌవనులను చాలా మందిని తమ చుట్టూ సమకూర్చుకునే వారు, ఎంతో విశిష్టంగా మరియు విస్తారంగా ఉన్న ‘మౌఖిక ధర్మశాస్త్రాన్ని’ ఆ యౌవనులకు క్షుణ్ణంగా బోధించాలన్నది వారి ఉద్దేశం. . . . ఉపదేశించడంలో జ్ఞాపకశక్తి కొరకైన ఎడతెగని, క్రమమైన వ్యాయామం ఉండేది. . . . బోధకుడు తన విద్యార్థుల నిర్ణయం కొరకు న్యాయపరమైన అనేక ప్రశ్నలను వారి ఎదుట ఉంచుతాడు, వారు వాటికి సమాధానం చెప్పాలి లేదా తానే వాటికి సమాధానం చెబుతాడు. విద్యార్థులు బోధకున్ని ప్రశ్నలు అడిగేందుకు కూడా అనుమతింపబడేవారు.”

రబ్బిల దృక్కోణం ప్రకారం, విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం కంటే ఎక్కువే సాధించాల్సి ఉండేది. అలాంటి బోధకుల వద్ద అధ్యయనం చేసే వారికి ఇలా హెచ్చరించబడింది: “ఎవరైనా తాను నేర్చుకున్న వాటినుండి ఒక్క విషయాన్నైనా మర్చిపోతే—లేఖనాల ప్రకారం అది జీవన్మరణ సంబంధ విషయం.” (అవాట్‌ 3:8) “తనలోనుండి ఒక చుక్క నీటిని కూడా పోగొట్టుకొనని, గచ్చువేయబడిన బావి” వలె ఉన్న విద్యార్థికి అత్యంత గొప్ప పొగడ్తలు లభించేవి. (అవాట్‌ 2:8) ఆ కాలంలో తార్సువాడైన సౌలు అనే తన హెబ్రీ పేరుతో అందరికీ తెలిసిన పౌలు, గమలీయేలు వద్ద పొందిన తర్ఫీదు ఆ విధంగా ఉండినది.

గమలీయేలు బోధల అసలు భావం

పరిసయ్యుల బోధలకు అనుగుణంగా, గమలీయేలు మౌఖిక ధర్మశాస్త్రంలో నమ్మకాన్ని ప్రోత్సహించాడు. అలా ఆయన ప్రేరేపిత లేఖనాలపైన కంటే రబ్బిల పారంపర్యాలపైనే ఎక్కువ అవధానాన్ని ఉంచాడు. (మత్తయి 15:3-9) గమలీయేలు ఇలా చెప్పాడని మిష్నా పేర్కొన్నది: “మీకై మీరు ఒక బోధకున్ని [ఓ రబ్బిని] ఏర్పరచుకోండి అప్పుడు మీకు ఎలాంటి సందేహాలూ ఉండవు, ఎందుకంటే మీరు మీ స్వంత అంచనాలు వేసి అధిక దశమ భాగాన్ని ఇవ్వకూడదు.” (అవాట్‌ 1:16) దీని భావం, ఏమి చేయాలనే దాని గురించి హెబ్రీ లేఖనాలు స్పష్టంగా చెప్పనప్పుడు, ఒక వ్యక్తి ఒక నిర్ణయాన్ని తీసుకునేందుకు తన స్వంత తర్కాన్ని ఉపయోగించకూడదు లేక తన మనస్సాక్షిని అనుసరించకూడదు. బదులుగా, తన కొరకు నిర్ణయం తీసుకునే ఒక యోగ్యుడైన రబ్బిని ఆయన కనుగొనాలి. గమలీయేలు ప్రకారం, ఈ విధంగా మాత్రమే ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండగలడు.—రోమీయులు 14:1-12 పోల్చండి.

అయితే, గమలీయేలు తన మతపరమైన న్యాయ తీర్మానాల్లో ఎక్కువ సహనం, ఔదార్యం కలిగి ఉండేవాడని పేరొందాడు. ఉదాహరణకు, “[ఆమె భర్త మరణించాడని] ఒక్క సాక్షి ఒప్పుకున్నా సరే, ఆ భార్య తిరిగి వివాహం చేసుకునేందుకు అనుమతిస్తాను” అని ఆయన తీర్మానం చెప్పినప్పుడు ఆయన స్త్రీల ఎడల కనికరాన్ని చూపాడు. (యెవామోత్‌ 16:7, మిష్నా) దానికి తోడు, విడాకులు ఇవ్వబడిన స్త్రీని కాపాడేందుకు, విడాకుల పత్రాన్ని ఇవ్వడం విషయంలో గమలీయేలు అనేక కట్టుబాట్లను ప్రవేశపెట్టాడు.

యేసుక్రీస్తు తొలి అనుచరులతో గమలీయేలు వ్యవహారాల్లో కూడా ఈ స్వేచ్ఛా భావం గోచరమౌతుంది. అపొస్తలుల కార్యముల పుస్తకం దాని గురించి తెలియజేసేదేమంటే, యేసు అపొస్తలులు ప్రకటిస్తున్నారని ఇతర యూదా మత నాయకులు వారిని బంధించి, చంపాలని ఉద్దేశిస్తుండగా “సమస్త ప్రజలవలన ఘనతనొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహా సభలో లేచి—ఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను—ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండి. . . . నేను మీతో చెప్పునదేమనగా—ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. . . . మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.” గమలీయేలు సలహాను విని, అపొస్తలులను విడిచిపెట్టడం జరిగింది.—అపొస్తలుల కార్యములు 5:34-40.

ఆ తర్ఫీదు పౌలుకు ఏ భావాన్ని కలిగి ఉంది?

పౌలు సా.శ. మొదటి శతాబ్దంలోని అతి గొప్ప రబ్బి బోధకుల్లో ఒకరి వద్ద తర్ఫీదు పొంది, విద్యనభ్యసించాడు. నిస్సందేహంగా, అపొస్తలుడు గమలీయేలును సూచించడం యెరూషలేము ప్రజలు ఆయన మాటలకు ప్రత్యేక అవధానాన్ని ఇచ్చేందుకు కారణమయ్యాయి. అయితే ఆయన గమలీయేలు కంటే ఎంతో గొప్పవాడైన బోధకుని గురించి వారితో మాట్లాడాడు—ఆయనే మెస్సీయ అగు యేసు. ఇప్పుడు పౌలు గమలీయేలు శిష్యునిగా కాక యేసు శిష్యునిగా ఆ ప్రజలతో మాట్లాడాడు.—అపొస్తలుల కార్యములు 22:4-21.

గమలీయేలు వద్ద పొందిన తర్ఫీదు, క్రైస్తవునిగా పౌలు బోధలను ప్రభావితం చేసిందా? లేఖనాల్లో మరియు యూదా ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన కఠినమైన ఉపదేశం, క్రైస్తవ బోధకునిగా పౌలుకు ఎంతో ఉపయోగకరంగా ఉండినది. అయినప్పటికీ, బైబిలులో కనుగొనబడే దైవికంగా ప్రేరేపింపబడిన పౌలు లేఖలు, ఆయన గమలీయేలు యొక్క పరిసయ్యుల సంబంధిత నమ్మకాల సమూల భావాన్ని తృణీకరించాడని చూపుతున్నాయి. పౌలు తన తోటి యూదులను మరియు ఇతరులను, యూదా మతం యొక్క రబ్బిల వైపుకు లేక మనుష్యులు కల్పించిన పారంపర్యాల వైపుకు కాక యేసుక్రీస్తు వైపుకు నడిపాడు.—రోమీయులు 10:1-4.

పౌలు గమలీయేలు శిష్యునిగా కొనసాగి ఉంటే ఆయన ఎంతో ఖ్యాతి గడించగలిగేవాడు. గమలీయేలు సహవాసులు ఇతరులు యూదా మతం యొక్క భవిష్యత్తును తీర్మానించేందుకు సహాయం చేశారు. ఉదాహరణకు, గమలీయేలు కుమారుడు, బహుశ పౌలు యొక్క తోటి విద్యార్థి అయిన సుమెయోను, రోమునకు వ్యతిరేకంగా యూదులు చేసిన తిరుగుబాటులో ప్రముఖ పాత్రను పోషించాడు. దేవాలయం నాశనమైన తర్వాత, గమలీయేలు మనుమడైన గమలీయేలు II మహా సభను యెవ్నేకు తరలించి, దాని అధికారాన్ని పునఃస్థాపించాడు. మన కాలం వరకూ యూదుల ఆలోచనకు పునాది రాయిగా మారిన మిష్నాను, గమలీయేలు II యొక్క మనుమడు జూడా హ-నాసీ సమకూర్చాడు.

గమలీయేలు విద్యార్థిగా, తార్సువాడైన సౌలు యూదా మతంలో ఎంతో ప్రముఖ వ్యక్తి అయ్యుండే వాడు. అయినప్పటికీ, అలాంటి వృత్తిపర అవకాశాలను గురించి పౌలు ఇలా వ్రాశాడు: “ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, . . . సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.”—ఫిలిప్పీయులు 3:7, 8, 11.

పరిసయ్యునిగా తన వృత్తిపర భవిష్యత్తును నిరాకరించి యేసుక్రీస్తు అనుచరుడు కావడం ద్వారా, ‘దేవునితో పోరాడువారు’ కాకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలన్న తన పూర్వపు బోధకుని సలహాను పౌలు ఆచరణాత్మకంగా అన్వయించుకున్నాడు. యేసు శిష్యులను హింసించడాన్ని మానుకోవడం ద్వారా పౌలు దేవునికి వ్యతిరేకంగా పోరాడటాన్ని మానుకున్నాడు. బదులుగా, క్రీస్తు అనుచరుడు కావడం ద్వారా, ఆయన ‘దేవుని జతపనివారిలో’ ఒకడయ్యాడు.—1 కొరింథీయులు 3:9.

నిజ క్రైస్తవత్వపు వర్తమానం మన దినంలో కూడా యెహోవా యొక్క ఆసక్తిగల సాక్షుల ద్వారా ప్రకటింపబడటంలో కొనసాగుతుంది. పౌలు వలె వీరిలో అనేకులు తమ జీవితాల్లో స్పష్టమైన మార్పులు చేసుకున్నారు. నిజంగా “దేవునివలన కలిగిన” పనియైన రాజ్య ప్రచార కార్యక్రమంలో ఎక్కువగా భాగం వహించాలనే ఉద్దేశంతో కొందరు లాభకరమైన కరీర్‌లను వదులుకున్నారు. (అపొస్తలుల కార్యములు 5:39) పౌలు పూర్వపు బోధకుడైన గమలీయేలు మాదిరిని కాక పౌలు మాదిరిని అనుసరించినందుకు వారెంతగానో సంతోషిస్తున్నారు!

[అధస్సూచీలు]

a గమలీయేలు హిల్లేల్‌ కుమారుడని కొన్ని సమాచార మూలాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గురించి తాల్ముద్‌ స్పష్టంగా ఏమీ చెప్పడంలేదు.

[28వ పేజీలోని చిత్రం]

తార్సువాడైన సౌలు, అపొస్తలుడైన పౌలుగా అన్ని జనాంగాల ప్రజలకూ సువార్తను ప్రకటించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి