కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 5/15 పేజీలు 21-23
  • ‘మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయము కలదు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయము కలదు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నాలుకను మచ్చిక చేసుకునే మార్గాలు
  • కోపంలో ఉన్నప్పుడు నాలుకను అదుపుచేసుకోవడం
  • మౌనం పరిష్కారం కాని సమయం
  • దేవుని రాజ్యాన్ని గూర్చి ‘మాట్లాడవలసిన సమయం’
  • మీ నాలుకను మంచి కోసం ఉపయోగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • నేను ఎందుకు ఎప్పుడూ తప్పుగా మాట్లాడుతుంటాను?
    యువత అడిగే ప్రశ్నలు
  • మీ నాలుకను అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రేమను, గౌరవాన్ని చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • దయగల మాటలు సత్సంబంధాలను పెంచుతాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 5/15 పేజీలు 21-23

‘మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయము కలదు’

“నేనలా అనకుండా ఉంటే ఎంత బాగుండును” అని మీరు ఎన్నిసార్లు బాధపడ్డారు? అయితే, మీరు స్వేచ్ఛగా మాట్లాడలేకపోయిన సందర్భాలు కూడా మీకు గుర్తుండవచ్చు. పునరాలోచనలో, ‘నేనేమన్నా అని ఉండవలసింది’ అని మీరనుకోవచ్చు.

‘మౌనముగా నుండుటకు మాటలాడుటకు సమయము కలదు’ అని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 3:7) అయితే, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అని తీర్మానించడమే సమస్య. మన అపరిపూర్ణ మానవ స్వభావం తరచూ కాని సమయాల్లో పనులను చేసేందుకు, చెప్పేందుకు ప్రేరేపిస్తుంది. (రోమీయులు 7:19) మనం మన అధీనంలో ఉంచుకోలేని నాలుకను అదుపులో పెట్టుకోగలమా?—యాకోబు 3:2.

నాలుకను మచ్చిక చేసుకునే మార్గాలు

ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే దానిని నిర్ణయించేందుకు మనకు సహాయపడేందుకు సాధ్యమైన ప్రతి సందర్భానికి తగిన నియమాలున్న పెద్ద పట్టిక మనకు అవసరం లేదు. బదులుగా, క్రైస్తవ వ్యక్తిత్వంలో సహజ భాగమైన గుణాలచేత మనం నడిపింపబడవలసి ఉంది. ఈ గుణాలేవి?

తన శిష్యులను పురికొల్పే ముఖ్యమైన గుణం ప్రేమయని యేసుక్రీస్తు వివరించాడు. ‘మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలుసుకొందురని’ ఆయన అన్నాడు. (యోహాను 13:35) మనం అలాంటి ప్రేమను ఎంతగా ప్రదర్శిస్తామో అంత బాగా మనం మన నాలుకను అదుపులో పెట్టుకుంటాం.

దీనికి సంబంధించిన రెండు గుణాలు కూడా చాలా సహాయపడతాయి. ఇందులో ఒకటి దీనత్వం. ‘ఇతరులను మనకంటె యోగ్యులుగా ఎంచడానికి’ ఇది మనలను సమర్థులను చేస్తుంది. (ఫిలిప్పీయులు 2:3) మరొకటి సాత్వికము, ఇది మనం ‘కీడును సహించేలా’ చేస్తుంది. (2 తిమోతి 2:24, 25) ఈ గుణాలను ఎలా అభ్యసించాలనే దానికి యేసుక్రీస్తునందు మనకు పరిపూర్ణమైన మాదిరి ఉంది.

మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన నాలుకను అదుపు చేయడం మరింత కష్టం కనుక, యేసు మరణానికి ముందటి రాత్రిని అంటే ఆయన “బహు దుఃఖములో మునిగియున్న” సమయాన్ని పరిశీలిద్దాం. (మత్తయి 26:37, 38) మానవజాతి నిత్య భవిష్యత్తు అనేది ఆయన దేవునికి నమ్మకస్థునిగా ఉండడంపై ఆధారపడి ఉంటుంది కనుక యేసు ఈ విధంగా భావించినందుకు ఆశ్చర్యపడనవసరం లేదు.—రోమీయులు 5:19-21.

యేసు తన పరలోక తండ్రితో మాట్లాడేందుకు నిజంగా ఇది సమయం. కనుక ఆయన తన ముగ్గురు శిష్యులను మెలకువగా ఉండమని చెప్పి, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. కొంత సేపటి తర్వాత ఆయన వచ్చి, వారు నిద్రపోవడం చూశాడు. అప్పుడు ఆయన పేతురుతో “ఒక గడియయైనను నాతోకూడ మేల్కొనియుండలేరా?” అని అన్నాడు. ఈ ప్రేమపూర్వకమైన గద్దింపులో వారి బలహీనతను గూర్చిన అవగాహనను కనబరచిన మాటలు జతచేయబడ్డాయి. “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని” ఆయన అన్నాడు, తరువాత యేసు మళ్ళీ వచ్చి, శిష్యులు నిద్రపోవడం చూశాడు. ఆయన వారితో దయాపూర్వకంగా మాట్లాడి, “వారిని . . . విడిచి వెళ్లి, మూడవ మారు ప్రార్థన చేసెను.”—మత్తయి 26:36-44.

తన శిష్యులు మూడవసారి కూడా నిద్రపోవడం యేసు చూసినప్పుడు, ఆయన కఠినంగా ఉండలేదు గాని, ‘ఇలాంటి సమయంలోనా మీరు నిద్రపోయి అలసట తీర్చుకొనేది! ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగించబడు గడియ వచ్చియున్నది’ అని ఆయన అన్నాడు. (మత్తయి 26:45) ప్రేమతో నిండుకున్న మనస్సుగలిగి నిజంగా సాత్వికముతో కూడిన ప్రవృత్తి గలవారు మాత్రమే అలాంటి క్లిష్టమైన సమయంలో నాలుకను ఆ విధంగా ఉపయోగించగలుగుతారు.—మత్తయి 11:29; యోహాను 13:1.

ఆ వెంటనే, యేసు అరెస్టు చేయబడి విచారణ చేయబడ్డాడు. మనం మన క్రైస్తవ పరిచర్యలో పాల్గొన్నప్పుడు కూడా కొన్నిసార్లు మౌనంగా ఉండడం మంచిదని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. యేసుపై అబద్ధ నేరారోపణ చేసే ఉద్దేశంతోనున్న ప్రధాన యాజకులకు సత్యాన్ని తెలుసుకోవడంలో ఏ మాత్రం ఆసక్తి లేదు. కనుక విపరీతమైన పరిణామాలను తేగల ఆ పరిస్థితిలో యేసు మౌనంగా ఉండిపోయాడు.—మత్తయి 7:6 పోల్చండి.

అయితే “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని” ప్రధాన యాజకుడు అడిగినప్పుడు యేసు మౌనంగా ఉండలేదు. (మత్తయి 26:2363) యేసు మీద ఆనబెట్టబడినందువల్ల, అది ఆయన మాట్లాడవలసిన సమయము. కనుక ఆయన “నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని” జవాబిచ్చాడు.—మత్తయి 26:64.

ఆ ముఖ్యమైన రోజున యేసు తన నాలుకను పరిపూర్ణంగా అదుపులో పెట్టాడు. ఆయన విషయంలో ప్రేమ, సాత్వికము, వినయము ఆయన వ్యక్తిత్వంలో సహజమైన భాగాలు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన నాలుకను అదుపులో ఉంచుకునేందుకు మనమీ గుణాలను ఎలా ఉపయోగించుకోవచ్చు?

కోపంలో ఉన్నప్పుడు నాలుకను అదుపుచేసుకోవడం

మనకు కోపం వచ్చినప్పుడు, తరచూ మన నాలుక అదుపు తప్పుతుంది. ఉదాహరణకు, ఒకసారి పౌలు బర్నబాలకు అభిప్రాయ భేదం వచ్చింది. “మార్కు అను మారుపేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను. అయితే పౌలు, పంఫూలియాలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తముకాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి.”—అపొస్తలుల కార్యములు 15:37-39.

నిర్మాణ పథకాల్లో కొన్ని సంవత్సరాలు పనిచేసిన మైకేల్‌a ఇలా చెబుతున్నాడు: “నిర్మాణ స్థలంలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించిన ఒక వ్యక్తి ఉండేవాడు. కాని ఆయన ఎప్పుడూ నాలో తప్పులు పడుతున్నట్లు అనిపించేది. నేను నొచ్చుకున్నాను, విసుగు చెందాను, కాని నా భావాలను నాలోనే దాచుకున్నాను. ఒకరోజు నేనప్పుడే చేసిన పనిని ఆయన విమర్శించినప్పుడు ఆ పరిస్థితి విషమించింది.

“నాలో దాగివున్న భావాలనన్నింటినీ నేను యథేచ్ఛగా తెలిపాను. నేను ఆవేశంలోవున్న ఆ సమయంలో మా చుట్టూవున్న వారందరికి ఎలాంటి చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుందనే దానిగూర్చి నేను గ్రహించలేదు. మిగిలిన రోజు ఆయనతో మాట్లాడడానికి, ఆయనను చూడడానికి కూడా నేను ఇష్టపడలేదు. నేను సమస్యతో సరైన విధంగా వ్యవహరించలేదని నేనిప్పుడు గ్రహిస్తున్నాను. నేను మౌనంగా ఉండి, కోపం తగ్గినప్పుడు మాట్లాడి ఉంటే ఇంకాస్త బాగుండేది.”

సంతోషకరంగా, క్రైస్తవ ప్రేమ తమ అభిప్రాయ భేదాలను పరిష్కరించుకునేందుకు ఈ ఇద్దరు వ్యక్తులను పురికొల్పింది. “నిర్మొహమాటంగా సంభాషించిన తర్వాత, మేము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం, మా మధ్య ఇప్పుడు గట్టి స్నేహబంధం ఉంది” అని మైకేల్‌ వివరిస్తున్నాడు.

మైకేల్‌ తెలుసుకున్నట్లు, మనం కోపంగా ఉన్నామని మనం తెలుసుకుంటే మౌనంగా ఉండడం కొన్నిసార్లు యుక్తము. “శాంతగుణముగలవాడు వివేకముగలవాడు” అని సామెతలు 17:27 చెబుతుంది. గాయపరిచే విషయాన్ని చెప్పకుండా ఉండేందుకు వివేచన మరియు సహోదర ప్రేమ మన ఉద్రేకాన్ని అణచుకునేందుకు సహాయపడతాయి. మనం నొప్పించబడినట్లయితే, సాత్వికముతో, వినయ స్వభావముతో శాంతిని పునఃస్థాపించాలనే దృష్టితో ఆ వ్యక్తితో మాత్రమే మనం మాట్లాడుదాం. అప్పటికే విపరీతంగా కోపపడడం జరిగినట్లయితే ఏమిటి? అప్పుడు అహంభావాన్ని అణచుకొని, తప్పును సవరించుకోవడానికి ప్రేమ మనలను పురికొల్పుతుంది. యథార్థమైన సంభాషణల ద్వారా మాట్లాడి, పశ్చాత్తాపాన్ని చూపించి, గాయపడిన భావాలను మాన్పేందుకు ఇదే సమయం.—మత్తయి 5:23, 24.

మౌనం పరిష్కారం కాని సమయం

కోపం లేదా విసుగు మనకు కోపం తెప్పించే వ్యక్తితో మాట్లాడకుండా ఉండేందుకు కారణమౌతుంది. ఇది చాలా హానికరం కాగలదు. “మా వివాహం జరిగిన మొదటి సంవత్సరంలో, ఒక్కోసారి నేను నా భర్తతో రోజుల కొలది మాట్లాడని సందర్భాలు ఉండేవి” అని మరీయb ఒప్పుకుంటోంది. “సాధారణంగా, అది పెద్ద సమస్యలవల్ల కాదు గాని, చిన్నచిన్న కోపతాపాలను కూడబెట్టడంవల్లనే. పర్వతమంతటి అడ్డంకుగా తయారయ్యేంతగా ఈ చిన్నచిన్న కోపతాపాలను గూర్చి ఆలోచించేదాన్ని. నేనిక ఏ మాత్రం భరింపలేని క్షణం వచ్చింది, నా నిరుత్సాహం తగ్గేవరకు నేను నా భర్తతో మాట్లాడడం మానేశాను.”

మరీయ ఇంకా ఇలా చెబుతుంది: “‘సూర్యుడస్తమించే వరకు మీ కోపమును నిలిచియుండనివ్వకుడి’ అనే ప్రత్యేకమైన బైబిలు పాఠ్యాంశం నా ఆలోచనా విధానాన్ని మార్చుకునేందుకు నాకు సహాయపడింది. సమస్యలు వృద్ధికాకుండా ఉండేందుకు మా సంభాషణను మెరుగుపరచుకునేందుకు నేను, నా భర్త బాగా కృషిచేశాం. అది అంత సులభంగా లేకపోయినా, పది సంవత్సరాల వివాహ జీవితం తర్వాత, అలాంటి విచారకరమైన నిశ్శబ్దత చాలా అరుదుగా ఉంటుందని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. అయినప్పటికీ, నేను ఈ ధోరణిని అణచుకోవడానికి నేను ఇప్పటికీ కృషి చేస్తున్నానని ఒప్పుకోవలసిందే.”—ఎఫెసీయులు 4:26.

మరీయ కనుగొన్నట్లే, ఇద్దరి మధ్య ఒత్తిళ్ళు ఉన్నప్పుడు, మాట్లాడుకోకపోవడం ఒక పరిష్కారం కాదు. అలాంటి పరిస్థితుల్లో కోపం పెరిగే అవకాశముంది, బంధం చెడిపోవచ్చు. మనం ‘త్వరగా సమాధాన పడవలెను’ అని యేసు చెప్పాడు. (మత్తయి 5:25) “సమయోచితముగా పలుకబడిన మాట” మనం ‘శాంతిని వెంటాడేందుకు’ సహాయపడగలదు.—సామెతలు 25:11; 1 పేతురు 3:11.

మనకు సహాయం అవసరమైనప్పుడు చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఏదో ఆత్మీయ సమస్య ఉన్నందువల్ల మనం బాధపడుతున్నట్లయితే, ఇతరులపై బరువు మోపడానికి మనం వెనుకంజవేస్తుండవచ్చు. కాని మనం మౌనంగా ఉంటే, సమస్య మరింత విషమించి పోవచ్చు. నియమించబడిన క్రైస్తవ పెద్దలు మన ఎడల శ్రద్ధ తీసుకుంటారు, మరి మనం వారిని అనుమతిస్తే, మనకు సహాయపడేందుకు నిస్సందేహంగా వారు ఉత్సుకత చూపిస్తారు. ఇది మనం మాట్లాడవలసిన సమయం.—యాకోబు 5:13-16.

అంతేకాక, యేసు చేసినట్లు మనం మన హృదయపూర్వక ప్రార్థనలో యెహోవాతో క్రమంగా మాట్లాడాలి. నిజంగా మన పరలోక తండ్రికి ‘మన హృదయాలను కుమ్మరించుదాం.’—కీర్తన 62:8; హెబ్రీయులు 5:7ను పోల్చండి.

దేవుని రాజ్యాన్ని గూర్చి ‘మాట్లాడవలసిన సమయం’

క్రైస్తవ పరిచర్య అనేది దైవిక నియామకం, అంతం రాకముందే అది నెరవేర్చబడాలి. కనుక, యెహోవా సేవకులు రాజ్య సువార్తను ప్రకటించడం ముందెన్నటికన్నా ఇప్పుడు మరెక్కువ ప్రాముఖ్యము. (మార్కు 13:10) అపొస్తలుల వలె, నిజమైన క్రైస్తవులు ‘కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేరు.’—అపొస్తలుల కార్యములు 4:20.

నిజమే, సువార్తను వినడానికి అందరూ ఇష్టపడరు. నిజానికి, ప్రకటించడానికి తన శిష్యులను బయటకు పంపించేటప్పుడు, ‘ఎవడు యోగ్యుడో విచారణ చేయమని’ యేసు వారికి సలహా ఇచ్చాడు. తనను ఆరాధించమని యెహోవా ఎవరినీ బలవంతం చేయడు కనుక, రాజ్య సువార్తను కచ్చితంగా తిరస్కరిస్తున్న ఒకరితో మొండిగా మనం మాట్లాడం. (మత్తయి 10:11-14) “నిత్యజీవము కొరకు నిర్ణయింపబడిన” వారితో యెహోవా రాజత్వాన్ని గూర్చి మాట్లాడడంలో మనం సంతోషిస్తాం.—అపొస్తలుల కార్యములు 13:48; కీర్తన 145:10-13.

ప్రేమ, సాత్వికము మరియు దీనత్వము అనే గుణాలు కఠినంగా మాట్లాడే లేదా నిశ్శబ్దంగా ఉండిపోయే మన అపరిపూర్ణ ధోరణిని అదుపు చేసేందుకు మనకు సహాయపడగలవు. మనమీ గుణాలను పెంపొందించుకుంటున్న కొలది మాట్లాడేందుకు ఉచితమైన సమయమేది, కాని సమయమేది అని గ్రహించేందుకు మనలను సంసిద్ధులను చేస్తుంది.

[అధస్సూచీలు]

a అతని అసలు పేరు కాదు.

b ఆమె అసలు పేరు కాదు.

[23వ పేజీలోని చిత్రం]

సమస్యలను మంచి సంభాషణ ద్వారా పరిష్కరించవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి