చెడు వార్తల ప్రభావవిస్తృతి
చెడు వార్తలను ప్రచురించే ముఖ్య శీర్షికలే, మంచి వార్తల కన్నా అధిక పాఠకాసక్తిని పెంపొందిస్తాయని మీరు ఎన్నడైనా గమనించారా? అది ఓ వార్తాపత్రికలోని ప్రకృతి విపత్తును గూర్చిన ముఖ్య శీర్షిక గానీ, ఓ అందమైన పత్రిక ముఖపత్రంపై ప్రముఖంగా కనిపించే చతురమైన గాలి వార్తలు గానీ, మంచి వార్తలకన్నా చెడు వార్తలే ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టున్నాయి.
నేడు చెడు వార్తలకు కొరతేమీ లేదు. అయితే ఏ మంచి వార్తనైనా ప్రక్కనపెట్టి, పత్రికా రచయితలూ విలేఖరులూ చెడు వార్తల కొరకే వెతికి వాటిని కనుగొని వెలికి తీసేందుకు మాత్రమే శిక్షణను పొందారా అని ఒకరు కొన్నిసార్లు ఆలోచించవచ్చు.
చరిత్రంతటిలోనూ మెండుగావున్నాయి
వాస్తవానికి, ఏ మంచి వార్తకున్న విలువనైనా తగ్గిస్తూ శతాబ్దాలన్నింటిలోనూ చెడు వార్తలు మెండుగా ఉంటూ వచ్చాయి. చరిత్ర పుటలలో, మానవజాతి తప్పనిసరిగా అనుభవించాల్సి వచ్చిన మానవ వేదన, నిరాశ, నిస్పృహల వైపుకే తక్కెడ ముల్లు ఒరుగుతోంది.
ఇప్పుడు మనం కేవలం కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. జాక్ లగ్రాన్ కూర్చిన క్రానికల్ ఆఫ్ ది వరల్డ్ అనే పుస్తకం, కొన్ని కథల సమకూర్పును కల్గివుంది, అందులో ప్రతిదీ ఆ సంఘటన జరిగిన రోజు కొరకు వ్రాయబడింది, అయితే అవి ఓ ఆధునిక విలేఖరి ఆ సంఘటనను నివేదిస్తున్నట్టుగా చెప్పబడింది. బాగా పరిశోధించబడిన ఈ నివేదికల నుండి, ఈ గ్రహంపై మానవుడు తన కష్టభరిత ఉనికిగల కాలమంతటిలో విన్న విస్తృతమైన చెడు వార్తను గూర్చి నిశితదృష్టిని మనం పొందుతాము.
మొదట, సా.శ.పూ. 429లో గ్రీస్‌లోని ఈ తొలి నివేదికను పరిశీలించండి. ఏథెన్సు మరియు స్పార్టా మధ్య జరిగిన యుద్ధాన్ని అది నివేదించింది: “నగరరాజ్యమైన పాటడీయ ప్రజలు ఆకలితో చనిపోయిన తమవారి శరీరాలను తినేంతటి హీన స్థితికి దిగజార్చబడిన తర్వాత దాన్ని చుట్టుముట్టిన ఏథెన్సువారికి అది బలవంతంగా లొంగిపోయింది.” నిజంగా ఇది చెడు వార్తే!
మన సామాన్య శకానికి ముందున్న మొదటి శతాబ్దానికి వెళ్ళితే, రోమ్, సా.శ.పూ 44 మార్చి 15, అనే సమయస్థలాల వివరణలున్న జూలియస్ సీజర్ మరణాన్ని గూర్చిన స్పష్టమైన వివరణను మనం కనుగొంటాము. “జూలియస్ సీజర్ చంపబడ్డాడు. నేడు అంటే మార్చి పదిహేనవ తారీఖున అతను శిష్టసభలో కూర్చున్నప్పుడు అతన్ని ఓ విద్రోహుల గుంపు పొడిచి చంపింది, మరి వారిలో కొందరు అతని సన్నిహిత స్నేహితులే.”
ఆ తర్వాతి శతాబ్దాలలో చెడు వార్తలు అధికమౌతూ వచ్చాయి. 1487లో మెక్సికో నుండి వచ్చిన ఈ వార్త ఓ భయంకరమైన ఉదాహరణ: “అజ్‌టెక్ ప్రధాన పట్టణమైన టినోచ్టిట్లాన్‌లో ఇంత వరకు ఎన్నడూ చూడని అతి సంవేదనాత్మక బలి ప్రదర్శనల్లో, తమ యుద్ధ దేవుడైన వీట్జిలోపోచ్‌ట్లీకి 20,000 మంది ప్రజల గుండెలు అలాగే ఇవ్వబడ్డాయి.”
మానవుని క్రూరత్వం మాత్రమే చెడు వార్తను అందించలేదు కానీ అతని అజాగ్రత్త కూడా చెడు వార్తల పెద్ద చిట్టాకు మరిన్ని వార్తల్ని చేర్చింది. లండన్‌లోని మహాగ్ని అలాంటి విపత్తుల్లో ఒకటని తోస్తుంది. ఇంగ్లాండ్‌లోని లండన్ నుండి సెప్టెంబరు 5, 1666న వెలువడిన నివేదిక ఇలా చదువబడుతోంది: “అగ్నిలో చిక్కుకున్న భవనాలను కూల్చివేయడానికి యార్కు ప్రభువు ఫిరంగిదళ బృందాలను తీసుకురావడంతో, లండన్‌లో చెలరేగిన అగ్ని చివరకు నాలుగు రోజుల తర్వాత చల్లబడింది. దాదాపు 400 ఎకరాలకు వ్యాపించిన ఈ అగ్నిలో 87 చర్చీలు, 13,000 పైగా ఇళ్లు నాశనమయ్యాయి. అద్భుతమైన రీతిలో తొమ్మిది మంది మాత్రమే తమ జీవాలను కోల్పోయారు.”
ఈ చెడు వార్తల ఉదాహరణలకు అనేక శతాబ్దాలుగా చెలరేగుతూ వచ్చిన అంటువ్యాధులను మనం చేర్చాల్సి ఉంటుంది—ఉదాహరణకు, 1830వ దశాబ్దపు తొలిభాగంలోని కలరా అంటువ్యాధి. దీన్ని నివేదించిన ముద్రిత ప్రధాన శీర్షిక ఇలా ఉంది: “కలరా యూరప్‌లో సంచరిస్తోంది.” ఆ తర్వాతి వాస్తవిక నివేదిక దాని భీకరమైన దారుణ స్థితిని చిత్రీకరించింది: “1817 వరకు యూరప్‌లో గుర్తెరుగని కలరా ఆసియానుండి పశ్చిమానికి వ్యాపిస్తోంది. మాస్కో, సెంట్. పీటర్స్‌బర్గ్ వంటి రష్యన్ నగరాల్లో అధిక జనాభా దీనికి గురయ్యారు, వీరిలో అత్యధికులు నగరాల్లోని బీదవారే.”
ఇటీవలి సంవత్సరాలలో పెరుగుదల
వ్రాయబడిన చరిత్రంతటిలోనూ చెడు వార్తలు జీవిత సత్యమైనప్పటికీ ఈ 20వ శతాబ్దంలోని ఇటీవలి దశాబ్దాలు చెడు వార్తలు అధికమౌతున్నాయనేందుకు నిదర్శనమిస్తున్నాయి, మరి వాస్తవానికి అవి వేగంగా పెరుగుతున్నాయి.
నిస్సందేహంగా, మన ఆధునిక చరిత్ర విన్నవాటిలో అతి ఘోరమైన చెడు వార్తలు యుద్ధ వార్తలే. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలని సరిగానే పిలువబడిన, చరిత్రలోని రెండు మహా యుద్ధాల వల్ల అతి భీకరంగా చెడు వార్తలు వ్రాయబడ్డాయి. అయితే ఈ అసంతోషకర శతాబ్దం అందించిన చెడువార్తలో ఇది ఒక బిందువు మాత్రమే.
అక్కడక్కడ నుండి ఎన్నుకున్న కొన్ని ప్రధాన శీర్షికలను పరిశీలించండి:
సెప్టెంబరు 1, 1923: టోక్యోను పడద్రోసిన కంపనం—3,00,000 మంది మృతి; సెప్టెంబరు 20, 1931: సంక్షోభం—పౌండు విలువను తగ్గించిన బ్రిటన్; జూన్ 25, 1950: ఉత్తర కొరియా దక్షిణంపైకి దండెత్తడం; అక్టోబరు 26, 1956: సోవియట్ పరిపాలనపై హంగరీయన్ల తిరుగుబాటు; నవంబరు 22, 1963: డల్లాస్‌లో తుపాకీ గుళ్లకు బలైన జాన్ కెనడీ; ఆగస్టు 21, 1968: ప్రేగ్ స్వేచ్ఛా ఎదుగుదలను అణగద్రొక్కేందుకు రష్యా టాంకులు ముందుకు కదిలాయి; సెప్టెంబరు 12, 1970: హైజాక్ చేయబడిన విమానాలు ఎడారిలో పేల్చివేయబడ్డాయి; డిశంబరు 25, 1974: ట్రేసీ తుపాను డార్విన్ను ముంచేసింది—66 మంది మృతి; ఏప్రిల్ 17, 1975: కంబోడియా కమ్యూనిస్టు దళాల చేతుల్లో పడింది; నవంబరు 18, 1978: గయానాలో ఉమ్మడి ఆత్మహత్య; అక్టోబరు 31, 1984: శ్రీమతి గాంధీ కాల్చి చంపబడింది; జనవరి 28, 1986: నింగికెగసిన మరుక్షణమే పేలిపోయిన అంతరిక్ష నౌక; ఏప్రిల్ 26, 1986: సోవియట్ అణుశక్తి కేంద్రం మంటల్లో చిక్కుకుంది: అక్టోబరు 19, 1987: కుప్పకూలిపోయిన స్టాక్ మార్కెట్; మార్చి 25, 1989: చమురు నష్టంవల్ల అలాస్కా ఎంతో ప్రభావితమైంది; జూన్ 4, 1989: తియానన్మెన్ స్క్వేర్ వద్ద ఎదురుతిరిగిన వారిని సైనిక దళాలు హతమార్చడం.
అవును, చెడువార్తలు ఎల్లప్పుడూ మెండుగానే ఉన్నాయని, వాటితో పోలిస్తే మంచి వార్తలు తక్కువగానే ఉన్నాయని చరిత్ర చూపుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో చెడు వార్తలు అధికమౌతుండగా, ప్రతి సంవత్సరం గడిచేకొలది మంచి వార్తలు తరుగుతూ వచ్చాయి.
ఎందుకు ఇలా ఉండాలి? ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందా?
తదుపరి శీర్షిక ఈ రెండు ప్రశ్నలకు జవాబునిస్తుంది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
WHO/League of Red Cross