‘నేనంటే దేవునికి పట్టింపు ఉందా?’
“నేనంటే పట్టింపు ఉందా? దేవుడు శ్రద్ధ కల్గివున్నాడా?” అది క్రైస్తవత్వం నేడులోని ఒక శీర్షిక ముఖ్యాంశం. ఆ శీర్షిక రచయితయైన ఫిలిప్ యాన్సీ ఇలా తెలియజేస్తున్నాడు: “రచయితగా నా వృత్తిలోని అధికభాగం, బాధను గూర్చిన సమస్య చుట్టూ పరిభ్రమించింది. ఎన్నడూ పూర్తిగా మానని పాత పుండును కెలికినట్లు, నేను మళ్లీ మళ్లీ అవే ప్రశ్నల దగ్గరికి వస్తాను. నా పుస్తకాలు చదివే పాఠకులు చెప్పేది నేను వింటాను, వారి వేదనభరితమైన గాథలు నా సందేహాలను దృఢపరుస్తాయి.”
మీ జీవితం ఎడల దేవుడు కల్గివున్న శ్రద్ధ గురించి బహుశా మీరు కూడా తలంచివుండవచ్చు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని . . . అనుగ్రహించెను” అని తెలియజేస్తున్న యోహాను 3:16 మీకు సుపరిచితమే కావచ్చు. లేదా యేసు “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము”నివ్వడానికి వచ్చాడని చెబుతున్న మత్తయి 20:28ని మీరు చదివి ఉండవచ్చు. అయినా, ‘దేవుడు నన్ను గమనిస్తాడా? ఒక వ్యక్తిగా నా ఎడల ఆయన శ్రద్ధ కల్గివుంటాడా?’ అని మీరు అడుగవచ్చు. మనం చూడబోతున్నట్లుగా, ఆయన శ్రద్ధ తీసుకుంటాడని నమ్మడానికి మంచి కారణముంది.