ఇచ్చుట—అది అపేక్షించబడుతుందా?
కానుకలు ఇవ్వడాన్ని తరచూ ఆచారం అదుపు చేస్తోందని మీకు తెలిసే ఉండవచ్చు. కానుకల కొరకు నిరీక్షించే సందర్భాలు అనేక సాంప్రదాయాల్లో ఉన్నాయి. అలాంటి కానుకలు గౌరవానికి చిహ్నాలుగా లేక ప్రేమను వ్యక్తం చేయడానికీ ఇవ్వబడవచ్చు. వాటిలో అనేకం వాటిని పొందినవారి చేత ఎన్నడూ ఉపయోగింపబడలేదు; ఇతరమైనవి నిజంగా అవసరతలను తీర్చాయి, ఎంతో మెప్పును పొందాయి.
డెన్మార్క్‌లో ఒక శిశువు జన్మిస్తే, స్నేహితులు మరియు బంధువులు ఆ శిశువుకు అవసరం కావచ్చునని భావించే కానుకలను తీసుకుని వస్తారు. ఇతర దేశాల్లో, స్నేహితులు ఒక వేడుక చేయవచ్చు, జననం కొరకు ఎదురుచూస్తూ ఆ సమయంలో అలాంటి కానుకలు ఇవ్వబడతాయి.
అనేక సందర్భాల్లో, కానుకల కొరకు ఎదురుచూసే సందర్భాలు వార్షికమైనవే. అలాంటి వేడుకలు తొలి క్రైస్తవుల మధ్య వాడుకలో లేకపోయినప్పటికీ, క్రైస్తవులమని చెప్పుకుంటున్నవారి మధ్య అలాగే క్రైస్తవులు కానివారి మధ్య అవి ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇతర సాంప్రదాయాల్లో, పిల్లలు పెద్దవారౌతుండగా జన్మదిన కానుకలివ్వడమనే ఆచారం మరుగున పడిపోతుండవచ్చు, కాని గ్రేకుల మధ్య ఆ ఆచారం మరో విధంగా శాసిస్తుంది. గ్రీసులో జన్మదినాలకు ఎక్కువ శ్రద్ధ ఇవ్వబడుతుంది. వాళ్లు ఒక వ్యక్తికి అతని “నామకరణ దినాన” కూడా కానుకలిస్తారు. అదేమిటి? మతాచారం, సంవత్సరంలోని ప్రతి దినానికి ఒక్కొక్క “పరిశుద్ధుని” జతచేస్తుంది, అనేకమంది ప్రజలకు “పరిశుద్ధులను” బట్టి పేరు పెట్టబడుతుంది. “పరిశుద్ధుల” దినం వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధుని పేరుగల వారు కానుకలు పొందుతారు.
తమ పిల్లల జన్మదిన వేడుకలను జరుపడమే కాకుండా, కొరియా దేశస్థులకు బాలల దినం అనే జాతీయ సెలవు దినం ఒకటుంది. ఆ సమయంలో కుటుంబమంతా కలిసి విహారానికి వెళ్తారు, వారి జన్మదిన తేదీ ఏదైనప్పటికీ పిల్లలకు కానుకలు ఇవ్వబడతాయి. కొరియా దేశస్థులకు తలిదండ్రుల దినం అనేది కూడా ఒకటుంది, అప్పుడు పిల్లలు తమ తలిదండ్రులకిస్తారు, ఉపాధ్యాయుల దినం, అప్పుడు విద్యార్థులు తమ ఉపాధ్యాయులను గౌరవించి, వారికి కానుకలిస్తారు. కొరియన్ల సాంప్రదాయం ప్రకారం, ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సుకు చేరినప్పుడు, పెద్ద వేడుక చేస్తారు. కుటుంబం మరియు స్నేహితులు కలిసి, జీవితంలో ఆ దశకు చేరిన వ్యక్తికి దీర్ఘాయుష్యానందాలు కలగాలని కోరుకుంటూ, కానుకలిస్తారు.
జనాదరణ పొందిన ఆచారం ప్రకారం, కానుకలివ్వవలసిన మరో సందర్భం వివాహ సమయం. కెన్యాలో ఒక జంటకు వివాహమైనప్పుడు, పెండ్లి కుమారుని కుటుంబం పెండ్లి కుమార్తె కుటుంబానికి కానుక ఇవ్వవలసి ఉంటుంది. అతిధులు కూడా కానుకలు తెస్తారు. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు సాంప్రదాయాన్ని అనుసరించేటట్లయితే, వాళ్లు ఒక వేదిక మీద కూర్చుంటారు, అప్పుడు అతిథులు తమ కానుకలు అందజేస్తారు. ఒక్కొక్కటి ఇవ్వబడుతుండగా, “ఫలాన వాళ్లు దంపతుల కొరకు ఒక కానుక తెచ్చారు” అనే ప్రకటన చేయబడుతుంది. అలాంటి గుర్తింపును పొందలేకపోతే, కానుకలిచ్చేవారనేకులు ఎంతో అసంతృప్తి చెందుతారు.
లెబనాను దేశస్థులలో ఎవరికైనా వివాహమైతే, స్నేహితులు మరియు పొరుగువారు చివరికి ఆ దంపతులకు పరిచయంలేని వారు కూడా ఆ తర్వాత ఎన్నో రోజుల వరకు కానుకలు తీసుకుని వస్తారు. కానుకలివ్వడమనేది పన్ను కట్టడంలా ఒక బాధ్యత అని వారికి చిన్నతనం నుండే నేర్పబడుతుంది. లెబనాను దేశస్థుడు ఒకతను ఇలా చెప్పాడు: “అలా చేయకపోతే మీకు బాగుండదు, అది సాంప్రదాయం.”
అయితే ఇవ్వడాన్ని అపేక్షించే సందర్భాలన్నిటిలోను అనేక దేశాల్లో క్రిస్టమస్ అత్యంత ప్రాముఖ్యమైనది. మీరు నివసించే ప్రాంతంలో అలాగే లేదా? అమెరికా దేశస్థులు క్రిస్టమస్ కానుకలపై సాలీనా 4,000 కోట్లకంటే ఎక్కువ డాలర్లు ఖర్చు చేస్తారని ఇటీవలి కాలంలో అంటే 1990లో అంచనా వేయబడింది. అదే సెలవు దినాన్ని జపాన్‌లో బౌద్ధులు మరియు షింటోలు ఎంతో ఆసక్తితో జరుపుకుంటారు, ఐరోపా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో ఈ వేడుక వివిధ రూపాల్లో ఆచరింపబడుతుంది.
క్రిస్టమస్ అన్నది ప్రజలు సంతోషంగా ఉండాలని నిరీక్షించే సమయం, కాని అనేకులు సంతోషంగా ఉండడం లేదు. కానుకలు కొనుగోలు చేయడమనే మోజు మరియు ఖరీదు చేసిన వాటికి డబ్బు చెల్లించడం గురించి కలిగే చింత, తాము పొందిన ఆనందపు క్షణాల్ని కోల్పోయేలా చేస్తున్నట్లు అనేకులు కనుగొంటున్నారు.
అయినప్పటికీ, ఇవ్వడంలో ఆనందం ఉందని బైబిలు చెబుతుంది. నిజమే, ఏ స్వభావంతో ఇవ్వడం జరుగుతుందనే దానిపై ఆనందం ఆధారపడి ఉంటుంది.—అపొస్తలుల కార్యములు 20:35.