కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 6/1 పేజీలు 3-5
  • అవినీతిలేని లోకమును గూర్చిన వాగ్దానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అవినీతిలేని లోకమును గూర్చిన వాగ్దానం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అవినీతి మిమ్మల్ని బాధిస్తుంది
  • బైబిలు మనకు చెప్పేదేమంటే
  • ప్రజలు మారగలరు
  • యెహోవా వాగ్దానం
  • ఎందుకింత అవినీతి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఆత్మ ఖడ్గముతో అవినీతిని ఎదుర్కోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • అవినీతి లేని ప్రభుత్వం సాధ్యమేనా?
    అదనపు అంశాలు
  • దేవుని పరిపాలన—అవినీతి లేని పాలన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 6/1 పేజీలు 3-5

అవినీతిలేని లోకమును గూర్చిన వాగ్దానం

అవినీతి సమాజం యొక్క అన్ని స్థాయిల్లోను చొచ్చుకు పోయింది. ప్రభుత్వంలోనైనా, విజ్ఞానశాస్త్రంలోనైనా, క్రీడల్లోనైనా, మతంలోనైనా లేదా వ్యాపారంలోనైనా అవినీతి అదుపు తప్పినట్లు కనిపిస్తుంది.

ప్రపంచమంతటా అవినీతి కుంభకోణాలను గూర్చిన కృంగదీసే వార్తలు వార్తాశీర్షికల్లో కనిపిస్తున్నాయి. ప్రజాక్షేమం కొరకు సేవ చేయడమనే బాధ్యతను తీసుకున్న అనేకులు లంచాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్వంత క్షేమాన్ని చూసుకునేవారని బయలుపరచుకున్నారు. ఆర్థిక నేరాలు మితిమీరిపోతున్నాయి. సామాజికంగాను ఆర్థికంగాను ఉన్నత స్థాయిలో ఉన్న ప్రజలు తమ దైనందిన వృత్తుల్లో తీవ్రమైన వర్గీయ మరియు చట్ట విరుద్ధ ఉల్లంఘనలు చేసిన అపరాధులు.

“‘ఉన్నత వర్గీయుల అవినీతి’—సీనియర్‌ అధికారులు, మంత్రులు మరియు తరచూ దేశాధ్యక్షులు పెద్ద కొనుగోలులకు మరియు పథకాలకు అనుమతి ఇచ్చేందుకు లంచాలను పుచ్చుకుంటున్నారు,” అని ఐరోపా పత్రిక వర్ణిస్తున్న దానిని గూర్చి వ్యాకులత అధికమౌతుంది. ఒక దేశంలో “రెండు సంవత్సరాల పోలీసు దర్యాప్తు అన్వేషణ మరియు ప్రతి రోజు అరెస్టులు చేయడం అనేవి సరిదిద్దలేని అవినీతిపరులను ఆపలేదు,” అని ది ఎకానమిస్ట్‌ అనే బ్రిటీష్‌ పత్రిక చెబుతుంది.

విస్తృతమైన ఇలాంటి అవినీతిని బట్టి, నేడు తాము నమ్మదగినవారు ఎవరూ లేరని అనేకులు భావిస్తున్నారు. బైబిలు రచయిత అయిన దావీదు ఈ విధంగా చెప్పిన మాటలను వారు ప్రతిధ్వనింపజేస్తున్నారు: “వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు.”—కీర్తన 14:3.

ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఉందనే వాస్తవంతో మీరెలా రాజీపడతారు? నేడు అనేకమంది ప్రజలు దానిని విస్మరిస్తారు. అయితే మీరు అవినీతిని విస్మరించినప్పటికీ, అది మిమ్మల్ని గాయపరుస్తుంది. ఎలా?

అవినీతి మిమ్మల్ని బాధిస్తుంది

ఉన్నత స్థాయిల్లో జరిగే అవినీతి మరియు స్వల్ప విషయాల్లోని అవినీతి జీవన వ్యయాన్ని అధికం చేస్తాయి, వస్తువుల నాణ్యతను తగ్గిస్తాయి, ఉద్యోగాల కొరతకు మరియు తక్కువ వేతనాలకు కారణమౌతాయి. ఉదాహరణకు, ఇల్లు దోచుకోవడం, దోపిడీ మరియు దొంగతనం మొత్తం కలుపగా వచ్చే మూల్యం కన్నా అపహరణం, వంచన వంటి నేరాలు కనీసం పది రెట్లు ఎక్కువ మూల్యాన్ని కలిగి ఉన్నాయి. ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (1992) ఈ విధంగా చెబుతుంది: “ఉద్యోగస్థులు చేసే నేరాలు అమెరికాలో పకడ్బంధీగా జరుగుతున్న నేరాల మూల్యం కన్నా మూడు రెట్లు ఎక్కువగా, అంటే 2,00,00,00,00,000 డాలర్ల మూల్యం కలిగి ఉన్నాయని అంచనా వేయబడింది.” ఈ సమాచార మూలం చెప్పేదేమంటే, దాని ఫలితాలు వెంటనే కనుగొనబడకపోయినప్పటికీ, “ఇలాంటి నేరాలు కార్మికుల, వినియోగదారుల మరియు పరిసరాల సురక్షితత్వముపై తీవ్ర ప్రభావం కలిగి ఉన్నాయి.”

అవినీతి యొక్క చేదు ఫలితాలు రాజైన సొలొమోను మాటలను మనకు గుర్తు చేస్తున్నాయి: “సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.”—ప్రసంగి 4:1.

మనల్ని అవినీతికి అప్పగించుకుంటామా? అది అనివార్యమా? అవినీతి లేని లోకం అసాధ్యమైన ఓ స్వప్నమా? సంతోషకరంగా, అసాధ్యం కాదు! అన్యాయం, అరాజకత్వం త్వరలోనే తీసివేయబడుతాయని బైబిలు మనకు బోధిస్తుంది.

బైబిలు మనకు చెప్పేదేమంటే

శక్తిమంతుడైన ఒక దేవదూత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మొదటి మానవ జతను తనతో చేరిపోవడానికి పురికొల్పినప్పుడు అవినీతి మొదలైందని బైబిలు మనకు చెబుతుంది. (ఆదికాండం 3:1-6) వారి పాప పంకిలమైన ప్రవర్తన వలన మంచి ఏమీ కలుగలేదు. బదులుగా ఆదాము, హవ్వలు యెహోవా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన నాటి నుండి, వారు అవినీతి యొక్క దుష్ఫలితాలను అనుభవించనారంభించారు. అనివార్యమైన మరణానికి దారి తీస్తూ, వారి శరీరాలు నెమ్మదిగా క్షీణించనారంభించాయి. (ఆదికాండము 3:16-19) అప్పటి నుండి, చరిత్ర పుటలు లంచం, మోసం, వంచనల దృష్టాంతాలతో నిండుకున్నాయి. అయినప్పటికీ, చాలా మంది తప్పిదస్థులు శిక్షించబడకుండా తప్పించుకుంటున్నారు.

మామూలు నేరస్థులవలె కాక, అవినీతిపరులైన కార్యనిర్వహణాధికారులు, రాజకీయవేత్తలు కారాగారంలో వేయబడడం, లేదా తమ చట్టవిరుద్ధ లాభార్జనలకు జరిమానా విధించబడడం అరుదు. వారు లంచాన్ని, లాభంలోని వాటాలను, బహుమతులను రహస్యంగా తీసుకుంటారు గనుక, ఉన్నత స్థాయిలోని అవినీతిని బట్టబయలు చేయడం తరచూ కష్టంగా ఉంటుంది. అయితే, దీనర్థం అవినీతి లేని లోకం అసాధ్యమైన స్వప్నం అని కాదు.

అవినీతి నుండి విడుదల మానవుని సృష్టికర్తయైన యెహోవా దేవుని నుండి లభిస్తుంది. దైవిక జోక్యమే ఏకైక పరిష్కారం. ఎందుకని? ఎందుకంటే, మానవజాతి యొక్క అదృశ్య శత్రువైన అపవాదియగు సాతాను మానవజాతిని తప్పుదోవపట్టించడంలో కొనసాగుతున్నాడు. మనం 1 యోహాను 5:19లో చదువుతున్నట్లు, “లోకమంతయు దుష్టునియందున్నది.” శిక్షించబడకుండా పెరుగుతున్న ఈ అవినీతిని మరేది వివరించగలదు?

మానవుని ఏ ప్రయత్నమూ సాతానును మరియు అతని దయ్యములను అధిగమించలేదు. దైవిక జోక్యము మాత్రమే విధేయత గల మానవజాతికి “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును” హామీ ఇస్తుంది. (రోమీయులు 8:21) మానవజాతిని ఇక ఏ మాత్రం మోసపరచలేని విధంగా సాతాను త్వరలోనే బంధించబడతాడని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (ప్రకటన 20:3) ఈ మధ్యలో, అవినీతి లేని దేవుని నూతన లోకంలో నివసించడానికి మనం ఇష్టపడుతున్నట్లయితే, మనం లోకపు అవినీతి మార్గాలను విడనాడాలి.

ప్రజలు మారగలరు

యేసుక్రీస్తు కాలంలో, కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి, తోటి మానవులను అణగద్రొక్కారు. ఉదాహరణకు, సుంకరులు తమ అవినీతి క్రియలకు పేరుగాంచారు. దేవుని స్పష్టమైన నియమమున్నప్పటికీ ఇలా జరిగింది: “లంచము తీసికొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును.” (నిర్గమకాండము 23:8) ప్రధాన సుంకరియైన జక్కయ్య అన్యాయంగా పన్నులు వసూలు చేశాడని ఒప్పుకున్నాడు. యేసు పెద్ద ఎత్తున సాంఘిక సంస్కరణలు చేసే బదులు, మారుమనస్సు పొంది, తమ అవినీతి క్రియలను విడనాడాలని వ్యక్తులను కోరాడు. దాని ఫలితంగా, మత్తయి, జక్కయ్యవంటి దుష్కీర్తి గాంచిన అవినీతిపరులైన సుంకరులు తమ మునుపటి జీవిత విధానాన్ని విడిచిపెట్టారు.—మత్తయి 4:17; 9:9-13; లూకా 19:1-10.

నేడు అవినీతి క్రియల్లో ఇమిడివున్నవారు కూడా అలాగే “నీతియు, యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనడం” ద్వారా అవినీతిని తృణీకరించవచ్చు. (ఎఫెసీయులు 4:24) నమ్మకంగా పన్ను చెల్లించడం లేదా సందేహాస్పదమైన పద్ధతుల్లో భాగం వహించకపోవడం సులభం కాకపోవచ్చు. అయినప్పటికీ, అలా చేయాలనే చిన్న ప్రయత్నాలకు కూడా ఫలితం ఉంటుంది.

ఈ అవినీతికరమైన లోకానికి లోబడకుండా, ఇతరుల క్షేమాన్ని గూర్చి చింతించే వారు మనశ్శాంతిని అనుభవిస్తారు. తప్పు చేస్తున్నప్పుడు పట్టుబడతామేమో అన్న భయం ఇక ఉండదు. బదులుగా వారు మంచి మనస్సాక్షిని కలిగి ఉంటారు. వారు బైబిలు ఉదాహరణయైన దానియేలు ప్రవక్తను అనుకరిస్తారు. కొందరు ఉన్నతోద్యోగస్థులు దానియేలుకు వ్యతిరేకంగా తప్పు కనిపెట్టాలని ఎడతెగక ప్రయత్నించేవారని బైబిలు వృత్తాంతం చెబుతుంది. “గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయినను లోపమైనను కనుగొనలేకపోయిరి.”—దానియేలు 6:4.

యెహోవా వాగ్దానం

“పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడవంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు” యెహోవా వాగ్దానం చేశాడు.—ప్రసంగి 8:12, 13.

అవినీతి ఇక ఎన్నడూ అసంతోషానికి కారణం కాకపోవడం ఎంత ఉపశమనంగా ఉంటుందో! అవినీతిలేని లోకంలో నిరంతరం జీవించడం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో! ఇది అసాధ్యమేమీ కాదు. ‘అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసిన నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను’ గూర్చి బైబిలు మాట్లాడుతుంది. (తీతు 1:2-4) మీరు అవినీతిని అసహ్యించుకొని, నీతిని ప్రేమిస్తున్నట్లయితే, అవినీతి లేని లోకాన్ని గూర్చిన దేవుని వాగ్దానం నెరవేరడాన్ని మీరు చూడగలరు.

[4వ పేజీలోని చిత్రం]

ప్రభుత్వంలోను, వ్యాపార రంగాల్లోను అవినీతి వ్యాపించి ఉంది

[5వ పేజీలోని చిత్రం]

అవినీతి తరచూ ప్రజా కార్యాలయాల వ్యవహారాలను బాధిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి