వేదాంత శాస్త్ర సందిగ్ధావస్థ
“ఆత్మ అమర్త్యత అనే తలంపు మరియు మృతుల పునరుత్థానములో విశ్వాసము . . . రెండు పూర్తి భిన్న సమాంతర సిద్ధాంతాలు, ఆ రెండింటిలో ఎంపిక చేయవలసిన అవసరముంది.” ఫిలిప్పి మెనో పలికిన ఈ మాటలు మృతుల పరిస్థితిని గూర్చి ప్రొటెస్టెంటు మరియు కాథోలిక్కు వేదాంతులు ఎదుర్కొన్న సందిగ్ధావస్థను గూర్చి క్లుప్తంగా చెబుతున్నాయి. “అంత్యదినమున” జరుగు పునరుత్థాన నిరీక్షణను గూర్చి బైబిలు మాట్లాడుతుంది. (యోహాను 6:39, 40, 44, 54) వేదాంతవేత్తయైన కిస్‌బర్ట్ క్రెసాగా ఈ విధంగా చెబుతున్నాడు, అనేక మంది విశ్వాసుల నిరీక్షణ “ఆత్మ అమర్త్యతపై ఆధారపడి ఉంది, అది మరణమందు శరీరం నుండి విడిపోయి దేవుని వద్దకు తిరిగి వెళ్తుంది, అయితే పునరుత్థాన నిరీక్షణ పూర్తిగా కాకపోయినా చాలా వరకు అంతర్ధానమయ్యింది.”
ఆ పరిస్థితిలో ఒక జటిలమైన ప్రశ్న తలెత్తుతుందని బెర్నార్డ్ సెస్‌బో వివరిస్తున్నారు: “శారీరక మరణానికి మరియు వారి కడవరి పునరుత్థానానికి ‘మధ్య కాలంలో’ మృతుల పరిస్థితి ఏమిటి?” ఆ ప్రశ్న అనేది గత కొన్ని సంవత్సరాలుగా వేదాంత సంబంధమైన చర్చకు ముఖ్య విషయంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఏది దానికి నడిపింది? మరి ప్రాముఖ్యంగా మృతుల నిజమైన నిరీక్షణ ఏమిటి?
సందిగ్ధావస్థ ఉద్భవము మరియు వికాసము
తొలి క్రైస్తవులకు ఈ విషయాన్ని గూర్చిన స్పష్టమైన అవగాహన ఉండేది. చనిపోయిన వారు ఏమీ ఎరగరని లేఖనాల ద్వారా వారికి తెలుసు, ఎందుకంటే, హెబ్రీ లేఖనాలు ఈ విధంగా చెబుతున్నాయి: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.” (ప్రసంగి 9:5, 10) భవిష్యత్తులో “క్రీస్తు ప్రత్యక్షత” సమయంలో జరుగబోవు పునరుత్థానాన్ని గూర్చి ఆ క్రైస్తవులు నిరీక్షించారు. (1 థెస్సలోనికయులు 4:13-17) వారు ఆ సమయం కొరకు ఎదురు చూస్తుండగా మరొకచోట తాము జీవించి ఉంటారని వారు నిరీక్షించలేదు. జోసఫ్ రాట్సింగర్ వాటికాన్ సభ యొక్క ప్రస్తుత విశ్వాస సిద్ధాంతంలో నిష్ణాతుడైన అతడు ఈ విధంగా చెబుతున్నాడు: “పురాతన చర్చిలో ఆత్మ అమర్త్యతను గూర్చిన సిద్ధాంతపరమైన ఏ ప్రకటనా లేదు.”
అయినప్పటికీ, ఆగష్టీన్ లేదా అంబ్రోస్ వంటి చర్చి పితరుల రచనలను చదివినప్పుడు, “మనం బైబిలు ఆచార సంబంధంగా క్రొత్తదొకటి—ప్రాథమికంగా యూదా క్రైస్తవుల నుండి విభిన్నమైన గ్రీకు మరణోత్తరవిద్య దృగ్గోచరమగుటను గురించి తెలుసుకుంటాము” అని నూవో డిజియెనారియో దె థియోలోజియా వివరిస్తుంది. ఈ క్రొత్త బోధ “ఆత్మ అమర్త్యతపై, మరణించిన వెంటనే వ్యక్తిగతంగా ప్రతిఫలంతో లేక శిక్షతో తీర్పుతీర్చబడడం” అనే దానిపై ఆధారపడింది. కాబట్టి, “మధ్యమ స్థితిని” గూర్చిన ప్రశ్న తలెత్తింది: ఆత్మ శారీరక మరణాన్ని తప్పించుకుని బ్రతికేటట్లయితే, “అంత్యదినమున” పునరుత్థానము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దానికి ఏమి సంభవిస్తుంది? ఇది వేదాంతులు విశ్లేషించడానికి పోరాడుతున్న ఒక సందిగ్ధావస్థ.
సా.శ. ఆరవ శతాబ్దంలో, పోప్ గ్రిగరీ I, మరణమందు ఆత్మలు తమకు నిర్ణయించబడిన స్థలానికి వెంటనే పోతాయని వాదించాడు. 14వ శతాబ్దంలోని పోప్ జాన్ XXII మృతులు తీర్పు దినమున తమ అంతిమ ప్రతిఫలాన్ని పొందుతారని ఒప్పించబడ్డాడు. అయినప్పటికీ, పోప్ బెనెడిక్ట్ XII తన పూర్వీకునిది తప్పని ఖండించాడు. బుల్‌లో బెనెడిక్టస్స్ డ్యూస్ అనబడే పోప్ ఉత్తరంలో (1336), ఆయన ఏ నిర్ణయానికి వచ్చాడంటే “మరణించిన వెంటనే గతించిన వారి ఆత్మలు ఆనందకరమైన (పరలోక) పరిస్థితుల్లోనికి ప్రవేశిస్తాయి, పవిత్రపరచడానికి [పర్గేటరీ] లేదా నాశనము [నరకం] నకు వెళ్తాయి, అదీ, లోకాంతమందు పునరుత్థానమునొందిన తమ శరీరాల్లో ఏకమగుటకే.”
వివాదము, మరియు చర్చలు ఉన్నప్పటికీ, క్రైస్తవలోకంలోని చర్చీలు శతాబ్దాలుగా ఇదే దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, సాధారణంగా ప్రొటెస్టెంట్ మరియు ఆర్థడోక్స్ చర్చీలు పర్గేటరీనందు విశ్వాసముంచవు. అయినప్పటికీ, గత శతాబ్దాంతం నుండి, అనేక మంది పండితులు ఆత్మ అమర్త్యమనే సిద్ధాంతం బైబిలేతర ప్రారంభం కలది అని చూపించారు, మరియు దాని ఫలితంగా, “మానవుడు మొత్తంగా ఒకటని, మరణించినప్పుడు పూర్తిగా నశిస్తాడని తలంచడానికి ఆధునిక వేదాంతం ఇప్పుడు తరచూ ప్రయత్నం చేస్తుంది.” (ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్) కాబట్టి, బైబిలు వ్యాఖ్యాతలు, “మధ్యమ స్థితి” ఉనికిని సమర్థించడం కష్టతరమని కనుగొన్నారు. బైబిలు దాని గురించి మాట్లాడుతుందా, లేక అది ఓ భిన్నమైన నిరీక్షణనిస్తుందా?
పౌలు “మధ్యమ స్థితి” ఉందని నమ్మాడా?
కాటెసిసమ్ ఆఫ్ ది కాథోలిక్ చర్చి ఏమి చెబుతుందంటే: “క్రీస్తుతో పాటు పునరుత్థానమగుటకు, తప్పకుండా మనం క్రీస్తుతో పాటు మరణించాలి: మనం తప్పకుండా ‘శరీరం నుండి, వేరై, ప్రభువు ఇంట ఉండాలి.’ [2 కొరింథీయులు 5:8] మరణమనే ఆ ‘నిర్గమనములో’ మన ఆత్మ శరీరం నుండి వేరవుతుంది. [ఫిలిప్పీయులు 1:23] అది మృతుల పునరుత్థాన దినమున శరీరంతో మరలా ఏకమౌతుంది.” అయితే ఆత్మ శరీర మరణాన్ని తప్పించుకుని శరీరంతో తిరిగి కలుసుకోడానికి “కడవరి తీర్పు” కొరకు ఎదురు చూస్తుందని ఇక్కడ ఉదాహరించబడిన లేఖనాల్లో అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడా?
రెండవ కొరింథీయులు 5:1నందు, పౌలు తన మరణాన్ని గూర్చి చెబుతూ “శిథిలమైపోవు” “భూమి మీది గుడారమును” గూర్చి మాట్లాడుతున్నాడు. శరీరాన్ని అమర్త్యమైన ఆత్మ వదిలిపెట్టిపోతుందని ఆయన తలంచాడా? లేదు. మానవుడు ఆత్మ అని పౌలు నమ్మాడు, గాని మానవునికి ఆత్మ ఉందని నమ్మలేదు. (ఆదికాండము 2:7; 1 కొరింథీయులు 15:45) పౌలు ఆత్మాభిషక్తుడైన క్రైస్తవుడు, తొలి శతాబ్దపు తన సహోదరుల వలె ఆయన నిరీక్షణ ‘పరలోకమందు భద్రపరచబడి ఉన్నది.’ (కొలొస్సయులు 1:5; రోమీయులు 8:14-18) కాబట్టి, ఆయన ‘బలమైన మనోభిలాశ,’ ఏంటంటే దేవుని నియమిత సమయమున అమర్త్యమైన ఆత్మీయ జీవిగా పరలోకంలోనికి పునరుత్థానమవ్వాలన్నదే. (2 కొరింథీయులు 5:2-4) ఈ నిరీక్షణను గూర్చి మాట్లాడుతూ, ఆయన ఈ విధంగా వ్రాశాడు: “కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.”—1 కొరింథీయులు 15:51, 52.
రెండవ కొరింథీయులు 5:8నందు పౌలు ఈ విధంగా అంటున్నాడు: “ఇట్లు ధైర్యము కలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.” ఈ మాటలు రానున్న మధ్యతరహా పరిస్థితిని సూచిస్తున్నాయని కొందరు నమ్ముతున్నారు. అలాంటి వారు, యేసు తన అనుచరులతో ‘తానే వారిని ఇంటికి తీసుకువెళ్తానని’ చేసిన వాగ్దానాన్ని కూడా సూచిస్తారు. కాని ఆ నిరీక్షణలు ఎప్పుడు నిజమౌతాయి? ఆయన తన భవిష్యత్తు ప్రత్యక్షతలో, ‘తాను మళ్ళీ వచ్చినప్పుడు’ అలా జరుగుతుందని యేసు చెప్పాడు. (యోహాను 14:1-3) అదేవిధంగా, 2 కొరింథీయులు 5:1-10నందు అభిషక్త క్రైస్తవుల సామాన్య నిరీక్షణ పరలోక నివాసస్థలంలో ప్రవేశించడమేనని పౌలు చెప్పాడు. ఇది అమర్త్యమైన ఆత్మ అని ఊహించబడుతున్నట్లు గాక, క్రీస్తు ప్రత్యక్షతయందు పునరుత్థానము ద్వారా నెరవేరుతుంది. (1 కొరింథీయులు 15:23, 42-44) ఎక్సెజెట్ చార్ల్స్ మాసన్ నిర్ధారించేదేమంటే, 2 కొరింథీయులు 5:1-10ని “‘మధ్యమ స్థితిని’ ఊహించనవసరం లేకుండానే బాగా అర్థం చేసుకోవచ్చు.”
ఫిలిప్పీయులు 1:21, 23నందు పౌలు ఈ విధంగా చెబుతున్నాడు: “నా మట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు.” పౌలు ఇక్కడ “మధ్యమ స్థితిని” సూచిస్తున్నాడా? కొందరు అలాగే తలస్తున్నారు. అయితే, పౌలు తాను రెండు సంభావ్యతల ఒత్తిళ్ళలో—జీవము లేదా మరణము క్రింద ఉన్నాడని చెబుతున్నాడు. ఆయన మూడవ సాధ్యతను పేర్కొంటూ ఇంకా ఈ విధంగా చెప్పాడు, “నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది.” మరణించిన వెంటనే క్రీస్తుతోకూడ ఉండుటకు “వెడలిపోవడమా?” నిజమే, ముందు చూసినట్లు, నమ్మకస్థులైన క్రైస్తవులు క్రీస్తు ప్రత్యక్షతయందు పునరుత్థానమవుతారని పౌలు విశ్వసించాడు. కాబట్టి ఆ కాలంలోని సంఘటనలు ఆయన మనస్సులో ఉండి ఉండాలి.
దీనిని ఫిలిప్పీయులు 3:20, 21 మరియు 1 థెస్సలోనికయులు 4:16నందు చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రత్యక్షత కాలమందలి అలాంటి “విడుదల” యెహోవా అతని కొరకు సిద్ధం చేసిన ప్రతిఫలాన్ని పొందడానికి పౌలుకు సాధ్యం చేసింది. ఇదే ఆయన నిరీక్షణ అనే వాస్తవము యౌవనస్థుడైన తిమోతికి ఆయన వ్రాసిన మాటల్లో కనిపిస్తాయి: “ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకుమాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.”—2 తిమోతి 4:8.
పునరుత్థానము—మహిమాన్విత బైబిలు సత్యం
తొలి క్రైస్తవులు పునరుత్థానమనే సంఘటన క్రీస్తు ప్రత్యక్షత కాలంలో ఆరంభమవుతుందని తలంచారు, వారు ఈ మహిమాన్విత బైబిలు సత్యం నుండి శక్తిని ఓదార్పును పొందారు. (మత్తయి 24:3; యోహాను 5:28, 29; 11:24, 25; 1 కొరింథీయులు 15:19, 20; 1 థెస్సలొనీకయులు 4:13) అమర్త్యమైన ఆత్మ అనే మతభ్రష్ట బోధలను తిరస్కరిస్తూ, వాళ్ళు నమ్మకంగా బావి సంతోషం కొరకు ఎదురు చూశారు.—అపొస్తలుల కార్యములు 20:28-30; 2 తిమోతి 4:3, 4; 2 పేతురు 2:1-3.
నిజమే, పరలోక నిరీక్షణ గల క్రైస్తవులకు మాత్రమే పునరుత్థానం పరిమితం కాదు. (1 పేతురు 1:3-5) పూర్వీకులు మరియు దేవుని మరితర ప్రాచీన సేవకులు మృతులను భూమిపైకి తిరిగి జీవంలోనికి తేగల యెహోవా సామర్థ్యమునందు విశ్వాసముంచారు. (యోబు 14:14, 15; దానియేలు 12:2; లూకా 20:37, 38; హెబ్రీయులు 11:19, 35) “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము” కలుగబోవుచున్నది గనుక, శతాబ్దాలుగా దేవుని ఎరుగని కోట్లకొలది ప్రజలు భూపరదైసుపై జీవంలోనికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. (అపొస్తలుల కార్యములు 24:15; లూకా 23:42, 43) ఇది పులకరింపజేసే నిరీక్షణ కాదా?
దుఃఖము మరణము ఎల్లవేళలా ఉంటుందని మనం నమ్మే బదులు “కడవరి శత్రువు, మరణము” శాశ్వతముగా తీసివేయబడి, నమ్మకస్థులైన మానవజాతి పునఃస్థాపించబడిన పరదైసుపై నిత్యం జీవించే కాలం వస్తుందని యెహోవా చూపిస్తున్నాడు. (1 కొరింథీయులు 15:26; యోహాను 3:16; 2 పేతురు 3:13) మన ప్రియమైనవారు తిరిగి జీవానికి రావడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! దేవుని వాక్యానుసారము కాని గ్రీకు తత్త్వశాస్త్ర ఆధారితమైన మానవ ఆత్మ అమర్త్యమైనదనే ఊహకన్నా, కచ్చితమైన ఈ నిరీక్షణ ఎంత శ్రేష్ఠమైనదో కదా! మీరు దేవుని కచ్చితమైన వాగ్దానంపై నిరీక్షణనుంచినట్లయితే, మీరు కూడా త్వరలోనే “మరణము కూడా ఇక ఉండదు” అనే నిశ్చయతను కలిగి ఉండగలరు.—ప్రకటన 21:3-5.
[31వ పేజీలోని చిత్రం]
పునరుత్థానమనేది ఓ మహిమాన్వితమైన బైబిలు సత్యము