మన జీవితంలో యెహోవా ఆరాధనకు సరైన స్థానాన్నివ్వడం
“అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.”—కీర్తన 145:2.
1. ఆరాధన విషయంలో, యెహోవా దేన్ని కోరుతున్నాడు?
“నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను.” (నిర్గమకాండము 20:5) మోషే ఆ ప్రకటనను యెహోవా నుండి మళ్ళీ విన్నాడు, మరి ఇశ్రాయేలీయులతో మాట్లాడేటప్పుడు ఆయన దాన్ని తిరిగి చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 5:9) యెహోవా దేవుడు తన సేవకులు తనను మాత్రమే ఆరాధించాలని అపేక్షించాడనడంలో మోషేకు అసలు సందేహమే లేదు.
2, 3. (ఎ) సీనాయి పర్వతం వద్ద జరిగినది అసమానమైనదనడంలో ఏది ఇశ్రాయేలీయులకు తోడ్పడింది? (బి) ఇశ్రాయేలీయుల మరియు నేటి దేవుని సేవకుల ఆరాధనను గూర్చిన ఏ ప్రశ్నలను మనం పరిశీలిస్తాము?
2 సీనాయి పర్వతం వద్ద గుడారాలేర్పర్చుకున్న ఇశ్రాయేలీయులు అంతేకాకుండ ఐగుప్తును విడిచి వచ్చిన “అనేకులైన అన్యజనుల సమూహము” అసమానమైనదాన్ని చూశారు. (నిర్గమకాండము 12:38) అది, పది విపత్తులవల్ల లేక తెగుళ్ల వల్ల యిప్పుడు అవమానించబడిన ఐగుప్తీయుల దేవతల ఆరాధనకు ఎంత మాత్రమూ పోలినది కాదు. యెహోవా తన ఉనికిని మోషేకు ప్రత్యక్షపర్చినప్పుడు, భయోత్పాత సంభ్రమాశ్చర్య సంఘటన సంభవించింది: ఉరుములూ మెరుపులూ బూర యొక్క మహాధ్వని ఆ పాళెమునంతటినీ వణికించాయి. తర్వాత, పర్వతమంతా కంపించగా, అగ్నీ ధూమము వచ్చాయి. (నిర్గమకాండము 19:16-20; హెబ్రీయులు 12:18-21) జరుగుతున్నది అసమానమైనదనేందుకు రుజువు కావాలనుకునే ఏ ఇశ్రాయేలీయునికైనా అది త్వరలోనే రుజువవుతుంది. ఇంతలోనే దైవిక ఆజ్ఞల రెండవ ప్రతిని తీసుకుని మోషే పర్వతం దిగివచ్చాడు. ప్రేరేపిత దృష్టాంతం ప్రకారంగా: “అతని [మోషే] ముఖచర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి.” నిజమే, మరవరాని, మానవాతీత అనుభవం!—నిర్గమకాండము 34:30.
3 దేవుని ఆ విశిష్టమైన జనాంగానికి యెహోవా ఆరాధనకు ఏ స్థానం యివ్వాలన్న విషయంలో ఏ సందేహమూ లేదు. ఆయన వారి విమోచకుడు. వారు తమ జీవితాలనే ఆయనకు అచ్చివున్నారు. అంతేకాకుండా ఆయన వారి న్యాయనిర్ణేత. అయితే వారు యెహోవా ఆరాధనను మొదటి స్థానంలో ఉంచారా? మరి దేవుని ఆధునిక దిన సేవకుల మాటేమిటి? యెహోవా ఆరాధన వారి జీవితాల్లో ఏ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది?—రోమీయులు 15:4.
ఇశ్రాయేలీయుల యెహోవా ఆరాధన
4. అరణ్య ప్రాంత ప్రయాణంలో ఇశ్రాయేలీయుల పాళెం యొక్క రూపురేఖలు ఎలా ఉండేవి, మరి పాళెము నడుమ ఏమి ఉండేది?
4 అరణ్యంలో పాళెమేర్పర్చుకున్న ఇశ్రాయేలీయులను మీరు పైనుండి చూడగల్గితే, మీరు ఏమి చూసి ఉండేవారు? విస్తారమైనప్పటికీ ఎంతగానో సంస్థీకరించబడిన ముప్పయి లక్షలమంది ఉండే గుడారాల వరుస కనిపిస్తుంది. వారు ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలకు మూడు తెగల ధ్వజములుగా విభాగించబడినట్లు మీరు చూస్తారు. మీరు మరికాస్త సమీపించి చూస్తే, పాళెము నడుమ ఉన్నదానికి దగ్గరలో మరో గుంపు ఉన్నట్లు గమనిస్తారు. ఈ నాలుగు చిన్న గుడారాల గుంపుల్లో లేవీ గోత్రీకుల కుటుంబాలు ఉండేవి. సరిగ్గా పాళెము మధ్యలో, బట్టతో వేరుపర్చిన స్థలంలో ఒక విశేషమైన కట్టడం ఉంది. అది “ప్రత్యక్షపు గుడారము” లేదా గుడారము, దాన్ని “వివేక హృదయులు” యెహోవా పథకం ప్రకారం చేయవలసి ఉండేది.—సంఖ్యాకాండము 1:52, 53; 2:3, 10, 17, 18, 25; నిర్గమకాండము 35:10.
5. ఇశ్రాయేలీయుల్లో గుడారం ఏ ఉద్దేశాన్ని నెరవేర్చింది?
5 దానిలోనూ అరణ్య ప్రయాణ సమయమందు, 40 పాళెపు మైదానాల్లో ప్రతి దానిలోనూ ఇశ్రాయేలీయులు ఒక గుడారాన్ని నిర్మించేవారు, అంతేకాకుండ అది వారి పాళెంలోని ముఖ్య విషయంగా మారింది. (సంఖ్యాకాండము 33వ అధ్యాయం) దానికి తగినట్లుగా, యెహోవా తన ప్రజల పాళెము మధ్యలో నివసిస్తున్నాడని బైబిలు వర్ణిస్తోంది. ఆయన మహిమ గుడారంలో నిండివుంది. (నిర్గమకాండము 29:43-46; 40:34; సంఖ్యాకాండము 5:3; 11:20; 16:3) అవర్ లివింగ్ బైబిల్ అనే పుస్తకం యిలా వ్యాఖ్యానిస్తోంది: “తమతో కూడా తీసుకువెళ్లగలిగే ఈ గుడారం, ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండేది, ఎందుకంటే ఈ గోత్రీకులందరూ మతపరంగా ఒక చోటికి చేరే కేంద్రాన్ని అది సృష్టించింది. అలా అది, తమ అనేక సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఐకమత్యంతో పనిచేయడం, అంతేకాకుండ ఐక్యతతో కూడిన చర్యలు సాధ్యమయ్యేలా చేసింది.” అంతకంటే ఎక్కువగా, తమ సృష్టికర్తను ఆరాధించడమే వారి జీవితాల్లో కేంద్రమని ఇశ్రాయేలీయులకు ఎల్లప్పుడు గుర్తుచేస్తూ ఉండేది.
6, 7. గుడారం స్థానే ఆరాధన కొరకు ఏ కట్టడం చోటుచేసుకుంది, మరి అది ఇశ్రాయేలీయుల జనాంగానికి ఎలా తోడ్పడింది?
6 ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత, గుడారం ఇశ్రాయేలీయుల ఆరాధనకు కేంద్రంగా కొనసాగింది. (యెహోషువ 18:1; 1 సమూయేలు 1:3) ఈ మధ్యకాలంలో, రాజైన దావీదు ఒక శాశ్వత కట్టడాన్ని నిర్మించాలని ఉద్దేశించాడు. తర్వాత అది తన కుమారుడైన సొలొమోను నిర్మించిన ఆలయమైంది. (2 సమూయేలు 7:1-10) దాని ప్రారంభోత్సవంనాడు, యెహోవా ఆ కట్టడాన్ని అంగీకరించాడని సూచించేందుకు ఒక మేఘం దిగివచ్చింది. “నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి యున్నాను; సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొకస్థలము ఏర్పరచియున్నాను అని” సొలొమోను ప్రార్థించాడు. (1 రాజులు 8:12, 13; 2 దినవృత్తాంతములు 6:2) కొత్తగా నిర్మించిన ఆలయం, ఆ జనాంగపు ఆరాధనకు కేంద్ర స్థానమైంది.
7 సంవత్సరానికి మూడు సార్లు ఇశ్రాయేలీయుల్లోని పురుషులు, దేవుని ఆశీర్వాదానికి గురుతుగా ఆలయంలో జరిగే ఆనందదాయకమైన ఉత్సవానికి హాజరయ్యేందుకు వెళ్లేవారు. సరిగ్గా దానికి తగినట్లుగా, యిలా తిరిగి కలుసుకునే సందర్భాలు, దేవుని ఆరాధనపై అవధానాన్ని కేంద్రీకరిస్తూ “యెహోవా నియామకకాలములు” అని పిలువబడేవి. (లేవీయకాండము 23:2, 4) భక్తిగల స్త్రీలు కుటుంబ యితర సభ్యులతో హాజరయ్యేవారు.—1 సమూయేలు 1:3-7; లూకా 2:41-44.
8. యెహోవా ఆరాధనకు యివ్వాల్సిన ప్రాముఖ్యతకు కీర్తన 84:1-12 ఎలా సాక్ష్యంగా నిలిచింది?
8 తమ జీవితాల్లో ఆరాధనకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్న విషయాన్ని కీర్తనల రచయితలు ఎంతో చక్కటి పదజాలంతో ఒప్పుకున్నారు. “సైన్యములకధితివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు!” అని కోరహు కుమారులు పాడారు. నిశ్చయంగా కేవలం ఆ నిర్మాణాన్ని వారు పొగడడం లేదు. బదులుగా, “జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి” అని ప్రకటిస్తూ, యెహోవా దేవుని మహిమపర్చేందుకు వారు తమ గొంతెత్తి పాడారు. లేవీయుల సేవ వారికి గొప్ప ఆనందాన్ని తెచ్చింది. “నీ మందిరమునందు నివసించువారు ధన్యులు!” అని వారు చాటారు. “వారు నిత్యము నిన్ను స్తుతించుదురు.” వాస్తవానికి, ఇశ్రాయేలీయులందరూ యిలా పాడగల్గారు: “నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు . . . వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును.” ఒక ఇశ్రాయేలీయుడు యెరూషలేముకు ప్రయాణించేందుకు చాలా దీర్ఘకాలం పట్టేది మరియు కఠినమైనదైనప్పటికీ, ఆ రాజధానిని చేరుకున్నప్పుడు అతని శక్తిని తిరిగి పొందేవారు. “నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్దనుండుట నాకిష్టము. . . . సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు,” అని యెహోవాను ఆరాధించేందుకు తనకు గల ఆధిక్యతనుబట్టి అతను అతిశయించినప్పుడు అతని హృదయం ఆనందంతో నిండిపోయివుంటుంది. అలా వ్యక్తపర్చబడిన భావాలు యెహోవా ఆరాధనకు ఇశ్రాయేలీయులు యిచ్చే ప్రాముఖ్యతను బయల్పరుస్తాయి.—కీర్తన 84:1-12.
9. యెహోవా ఆరాధనను మొదటి స్థానంలో ఉంచడంలో విఫలమైనప్పుడు ఇశ్రాయేలీయుల జనాంగానికి ఏమి సంభవించింది?
9 విషాదకరంగా, ఇశ్రాయేలీయులు నిజమైన ఆరాధనకు మొదటి స్థానం యివ్వడంలో విఫలులయ్యారు. యెహోవా యెడల తమకున్న ఆసక్తిని తగ్గించేటట్లుగా అబద్ధ దేవుళ్ల ఆరాధనను వారు అనుమతించారు. తత్ఫలితంగా, బబులోనులో వారు చెరగా కొనిపోబడడాన్ని అనుమతిస్తూ, యెహోవా వారిని వారి శత్రువుల చేతిలో విడిచిపెట్టాడు. వారు 70 సంవత్సరాల తర్వాత తమ స్వస్థలానికి తిరిగి రప్పించబడినప్పుడు, నమ్మకమైన ప్రవక్తలైన హగ్గయి, జెకర్యా, మలాకీల పురికొల్పే ఉద్బోధలను యెహోవా అందించాడు. యాజకుడైన ఎజ్రా, అధికారియైన నెహెమ్యాలు ఆలయాన్ని తిరిగి నిర్మించి అక్కడ నిజమైన ఆరాధనను పునఃస్థాపించేందుకు దేవుని ప్రజలను పురికొల్పారు. అయితే శతాబ్దాలు గడిచేకొలది, నిజమైన ఆరాధన ఆ జనాంగంలో మరలా అల్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది.
నిజమైన ఆరాధన యెడల మొదటి శతాబ్దమందున్న ఆసక్తి
10, 11. యేసు భూమ్మీద ఉన్నప్పుడు జీవించిన నమ్మకస్థుల జీవితాల్లో యెహోవా ఆరాధన ఏ స్థానాన్ని పొందింది?
10 యెహోవా నిర్ణయకాలమందు, మెస్సీయా కనిపించాడు. నమ్మకమైన ఇశ్రాయేలీయులు తమ విడుదలకొరకు యెహోవా యందు నిరీక్షించారు. (లూకా 2:25; 3:15) ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధురాలైన అన్న, “దేవాలయము విడువక ఉపవాసప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయు” విధవరాలని లూకా వృత్తాంతం స్పష్టంగా వర్ణిస్తోంది.—లూకా 2:37.
11 “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది” అని యేసు చెప్పాడు. (యోహాను 4:34) ఆలయంలోని రూకలు మార్చే వారిని కలిసినప్పుడు యేసు ఎలా ప్రతిస్సందించాడో జ్ఞాపకం చేసుకోండి. వారి బల్లలనూ పావురాలను అమ్మే వర్తకుల పీటలనూ పడేశాడు. మార్కు యిలా చెబుతున్నాడు: “[యేసు] దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. మరియు ఆయన బోధించుచు—నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి.” (మార్కు 11:15-17) అవును, పట్టణంలోని మరో భాగం నుండి దగ్గర దారియైన ఆలయపు ఆవరణగుండా పాత్రలను తీసుకువెళ్లేందుకు కూడా యేసు ఎవరినీ అనుమతించలేదు. “మీరు ఆయన [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అని అంతకుముందు ఆయన సలహాను యేసు క్రియలు మరింత బలపర్చాయి. (మత్తయి 6:33) యెహోవాకు తన అనితర భక్తిని అందించడంలో యేసు మన కొరకు మంచి మాదిరిని ఉంచాడు. ఆయన బోధించినవాటిని ఆయన నిజంగా ఆచరించాడు.—1 పేతురు 2:21.
12. యెహోవా ఆరాధనకు తాము యిచ్చిన ప్రాముఖ్యతను యేసు శిష్యులు ఎలా ప్రదర్శించారు?
12 పీడితులైనప్పటికీ, నమ్మకస్థులుగానున్న యూదులను అబద్ధమత ఆచారాల నుండి విడిపించే తన పనిని నెరవేర్చిన పద్ధతి ద్వారా యేసు తన శిష్యులకు ఒక మాదిరిని ఉంచాడు. (లూకా 4:18) శిష్యులను చేసి వారికి బాప్తిస్మమిమ్మని యేసు యిచ్చిన ఆజ్ఞానుసారంగా, పునరుత్థానం పొందిన తమ ప్రభువు సంబంధంగా తొలి క్రైస్తవులు ధైర్యంగా యెహోవా చిత్తాన్ని ప్రకటించారు. వారు తన ఆరాధనకు యిచ్చిన ప్రాముఖ్యతను బట్టి యెహోవా ఎంతో సంతోషించాడు. కనుక, దేవుని స్వంత దూత అద్భుతమైన రీతిలో పేతురునూ యోహానును చెరనుండి విడిపించి వారికిలా బోధించాడు: “మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడి.” పునఃప్రోత్సహించబడినవారై, వారు దానికి లోబడ్డారు. ప్రతి రోజూ యెరూషలేము ఆలయంలోనూ అలాగే యింటింట వారు “మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.”—అపొస్తలుల కార్యములు 1:8; 4:29, 30; 5:19బి, 20, 42; మత్తయి 28:19, 20.
13, 14. (ఎ) తొలి క్రైస్తవుల కాలాల నుండి, దేవుని సేవకులకు ఏమి చేసేందుకు సాతాను ప్రయత్నించాడు? (బి) దేవుని నమ్మకమైన సేవకులు ఏమి చేయడంలో కొనసాగుతున్నారు?
13 వారి ప్రకటనపనికి వ్యతిరేకత ఎక్కువైనప్పుడు, సమయానుకూలమైన సలహాలను రాసేందుకు తన నమ్మకమైన సేవకులను దేవుడు నడిపించాడు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి” అని సా.శ. 60 దాటిన వెంటనే పేతురు రాశాడు. “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.” తొలి క్రైస్తవులు ఆ మాటలనుండి నిస్సందేహంగా ధైర్యాన్ని పొందారు. వారు కొంతకాలం బాధపడిన తర్వాత దేవుడు తమ శిక్షణను పూర్తి చేస్తాడని వారికి తెలుసు. (1 పేతురు 5:7-10) యూదా విధానపు ఆ చివరి కాలంలో, నిజమైన క్రైస్తవులు యెహోవా ఆరాధనను నూతన అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు.—కొలొస్సయులు 1:23.
14 అపొస్తలుడైన పౌలు ప్రవచించినట్లుగా, మతభ్రష్టత్వం అంటే నిజమైన ఆరాధననుండి వైదొలగడం సంభవించింది. (అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 థెస్సలొనీకయులు 2:3) మొదటి శతాబ్దపు చివరి దశాబ్దాల్లోని సాక్ష్యం దీని రుజువును సమకూర్చింది. (1 యోహాను 2:18, 19) గోధుమల వంటి క్రైస్తవుల్లో నుండి ఈ “గురుగులను” విడిగా గుర్తించడాన్ని కష్టతరం చేస్తూ యథార్థమైన వారిలో అనుకరణ క్రైస్తవులను సాతాను విజయవంతంగా నాటగల్గాడు. అయినప్పటికీ గత శతాబ్దాలుగా కొందరు వ్యక్తులు తమ జీవితాలు అపాయంలో ఉన్నప్పటికీ దేవుని ఆరాధనను మొదటుంచారు. అయితే “అన్యజనముల కాలముల” చివరి దశాబ్దాలవరకు నిజమైన ఆరాధనను ఉన్నతపర్చేందుకు దేవుడు తన సేవకులను సమకూర్చలేదు.—మత్తయి 13:24-30, 36-43; లూకా 21:24.
యెహోవా ఆరాధన నేడు ఉన్నతపర్చబడడం
15. యెషయా 2:2, 4, మీకా 4:1-4 నందలి ప్రవచనాలు 1919 నుండి ఎలా నెరవేరాయి?
15 యెహోవా, 1919లో నిజమైన దేవుని ఆరాధనను ఉన్నతపర్చిన ధైర్యంతో కూడిన ఈ సాక్ష్యపు కార్యక్రమాన్ని చేపట్టే శక్తిని అభిషక్త శేషానికి యిచ్చాడు. పందొమ్మిదివందల ముప్పై అయిదు నుండి సూచనార్థకమైన “వేరే గొఱ్ఱె” ప్రవేశంతో, “యెహోవా మందిర పర్వతము”ను ఎక్కేందుకు వచ్చే ప్రజల ప్రవాహం అధికమౌతూ ఉంది. సేవా సంవత్సరం 1993 నందు 47,09,889 మంది యెహోవాసాక్షులు, ఉన్నతపర్చబడిన యెహోవా ఆరాధనకు యితరులను ఆహ్వానించడం ద్వారా ఆయనను వారు మహిమపర్చారు. క్రైస్తవమత సామ్రాజ్యంలో కనిపించేటటువంటి అబద్ధమత సామ్రాజ్యపు విభాగించబడిన “కొండల” ఆత్మీయ నీచ స్థితికి యిది ఎంత భిన్నంగా ఉందో కదా!—యోహాను 10:16; యెషయా 2:2-4; మీకా 4:1-4.
16. యెషయా 2:10-22లో ప్రవచించిన దాని దృష్ట్యా దేవుని సేవకులందరూ ఏమి చేయాల్సిన అవసరముంది?
16 అబద్ధమతానికి చెందినవారు తమ చర్చీలూ కాథడ్రల్లూ చివరికి వారి మతగురువులకు సహితం ఘనమైన బిరుదులనూ సన్మాన చిహ్నాలనూ ఆపాదిస్తూ “ఉన్నతమైన”వని దృష్టిస్తారు. అయితే యెషయా ఏమి ప్రవచించాడో గమనించండి: “నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.” ఇది ఎప్పుడు జరుగుతుంది? వేగంగా సమీపిస్తున్న మహా శ్రమల సమయంలో ‘విగ్రహములు బొత్తిగా నశించిపోవునప్పుడు’ జరుగుతుంది. భయాశ్చర్యకరమైన ఆ సమయం దగ్గరవుతున్న దృష్ట్యా దేవుని సేవకులందరూ తమ జీవితాల్లో యెహోవా ఆరాధనకు ఏ స్థానముందో గంభీరంగా పరిశీలించి చూసుకోవాలి.—యెషయా 2:10-22.
17. యెహోవా ఆరాధనకు తామిస్తున్న ప్రాధాన్యతను నేడు యెహోవా సేవకులు ఎలా ప్రదర్శిస్తున్నారు?
17 అంతర్జాతీయ సహోదరత్వం వలె యెహోవాసాక్షులు రాజ్య పరిచర్య యందు తాము కల్గివున్న ఆసక్తిని బట్టి పేరుగాంచారు. వారి ఆరాధన, వారానికి ఒక గంట లేక యించుమించు గంటకు మాత్రమే పరిమితమైన కేవలం నామాకార్థ ఆరాధన కాదు. అది వారి జీవిత విధానం. (కీర్తన 145:2) వాస్తవానికి, గత సంవత్సరం 6,20,000 కంటే ఎక్కువ మంది, సాక్షులు క్రైస్తవ పరిచర్యలో పూర్తి కాలంగా పనిచేసేందుకు తమ వ్యవహారాలను తగినట్లుగా ఏర్పాటు చేసుకున్నారు. మిగిలినవారు యెహోవా ఆరాధనను నిస్సందేహంగా అలక్ష్యం చేయరు. వారి కుటుంబ బాధ్యతలవల్ల తమ లౌకిక ఉద్యోగాల వద్ద ఎక్కువగా కష్టపడి పని చేయవల్సి వచ్చినప్పటికీ తమ ప్రతి దిన సంభాషణలో తమ బహిరంగ ప్రకటన పనిలో అది ప్రాముఖ్యంగా కనిపిస్తుంది.
18, 19. సాక్షుల జీవిత కథలను చదవడం ద్వారా బహుశ మీరు ప్రోత్సాహాన్ని పొందిన ఉదాహరణలను సూచించండి.
18 కావలికోటలో ప్రచురించబడే సాక్షుల జీవిత కథలు, వివిధ సహోదర సహోదరీలు యెహోవా ఆరాధనకు తమ జీవితంలో ప్రాధాన్యతనెలా యిచ్చారన్న విషయంలో అంతర్దృష్టిని అందిస్తాయి. తన జీవితాన్ని ఆరేండ్ల వయస్సులో యెహోవాకు సమర్పించుకున్న ఒక యౌవ్వన సహోదరి, మిషనరీ సేవను తన గమ్యంగా పెట్టుకుంది. యౌవ్వన సహోదర సహోదరీలారా, యెహోవా ఆరాధనకు మీ జీవితాల్లో మొదటి స్థానాన్నిచ్చేందుకు సహాయపడే ఏ గమ్యాన్ని మీరు ఎన్నుకోగలరు?—మార్చి 1, 1992 కావలికోటలో (ఇంగ్లీష్) 26-30 వరకున్న పేజీలందలి, “ఆరేళ్ల ప్రాయంలో ఏర్పర్చుకున్న గమ్యాన్ని వెంబడించడం” అనే శీర్షికను చూడండి.
19 ఒక విధవరాలైన వృద్ధ సహోదరి, యెహోవా ఆరాధనను సరైన స్థాన మందుంచడంలో మరో చక్కటి మాదిరిని అందించింది. సత్యాన్ని నేర్చుకునేందుకు తనకు సహాయపడిన వారి నుండి, సహించడానికి ఆమె ఎంతో ప్రోత్సాహాన్ని పొందింది. వారు ఆమె “కుటుంబంగా” ఉండేవారు. (మార్కు 3:31-35) మీరు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నట్లు మీరు కనుగొంటే, సంఘంలోని యౌవనుల సహాయాన్ని, మద్దతునూ అంగీకరిస్తారా? (జూలై 1, 1992 కావలికోట [ఆంగ్లం] నందలి 21-3 పేజీల్లో ఉన్న “కోతకాలంలో నేను ప్రతిస్పందించాను,” అనే శీర్షికలో సహోదరియైన వినిఫ్రెడ్ రెమె తన భావాలను ఆమె ఎలా వ్యక్తపర్చిందో దయచేసి గమనించండి.) పూర్తికాల సేవకులారా, దైవపరిపాలనా నడిపింపుకు లోబడుతూ మీరు నియమించబడిన ప్రాంతాల్లో వినయంగా సేవచేస్తూ మీ జీవితాల్లో యెహోవా ఆరాధన మొదట వస్తుందని ప్రదర్శించండి. (డిశంబరు 1, 1991 కావలికోటలోని [ఆంగ్లం] 24-7 పేజీల్లో ఉన్న “దేవుని సంస్థకు సన్నిహితంగా ఉండండి,” అనే శీర్షికలో చెప్పబడినట్లుగా సహోదరుడైన రాయి ర్యాన్ మాదిరిని గమనించండి.) మనం యెహోవా ఆరాధనకు మొదటి స్థానాన్నిచ్చినప్పుడు, ఆయన మన యెడల శ్రద్ధ వహిస్తాడనే అభయం మనకుంది అని జ్ఞాపకముంచుకోండి. జీవితావసరతలు ఎలా తీర్చబడతాయన్న విషయాన్ని గూర్చి మనం చింతపడనవసరం లేదు. ఆలివ్, సోనియా స్ప్రింగేట్ సహోదరీల అనుభవాలు దీన్ని దృష్టిస్తున్నాయి.—ఫిబ్రవరీ 1, 1994 కావలికోటలో 20-5 పేజీల్లోని “మేము రాజ్యాన్ని మొదట వెదికాము” అనే శీర్షికను చూడండి.
20. ఎలాంటి సంగతమైన ప్రశ్నలను యిప్పుడు మనకై మనం ప్రశ్నించుకోవాలి?
20 అయితే, వ్యక్తిగతంగా మనకై మనం కొన్ని ఆలోచింపజేసే ప్రశ్నలను వేసుకోకూడదా? నా జీవితంలో యెహోవా ఆరాధన ఏ స్థానాన్ని కల్గివుంది? దేవుని చిత్తం చేసేందుకు నా శాయశక్తులా కృషిచేస్తానన్న నా సమర్పణకు తగినట్లుగా నేను జీవిస్తున్నానా? నా జీవితంలో ఏ రంగంలో నేను అభివృద్ధిని సాధించగలను? మన పరలోకపు తండ్రియు, సర్వాధికారియైన యెహోవా ఆరాధనను—జీవితంలో మనమెన్నుకున్న ప్రాధాన్యతగా కొనసాగించే విషయంలో మన వనరులను మనం ఏ విధంగా ఉపయోగించాలనే దానిపై తలంచే అవకాశాన్ని తర్వాతి శీర్షికను ఆలోచనతో పరిశీలించడం తెలియజేస్తుంది.—ప్రసంగి 12:13; 2 కొరింథీయులు 13:5.
పునఃసమీక్షలో:
◻ ఆరాధన విషయంలో యెహోవా ఏమి కోరుతున్నాడు?
◻ దేని విషయంలో గుడారం ఒక జ్ఞాపికగా పనిచేసింది?
◻ సా.శ. మొదటి శతాబ్దంలో నిజమైన ఆరాధన విషయమందు ఆసక్తిని కనపర్చిన వారిలో ఎవరు విశిష్టమైన మాదిరిగా ఉన్నారు, ఎలా?
◻ యెహోవా ఆరాధన 1919 నుండి ఎలా ఉన్నతపర్చబడింది?