దేవుని మందను ప్రేమతో కాయుట
“మీ మధ్యనున్న దేవుని మందను . . . కాయుడి.”—1 పేతురు 5:2.
1, 2. యెహోవా యొక్క ప్రముఖ లక్షణమేది, దానంతటదే ఎలా వ్యక్తంచేయబడింది?
పరిశుద్ధ లేఖనాలన్నింటిలోనూ, ప్రేమ దేవుని లక్షణాల్లో ప్రముఖమైనదని స్పష్టం చేయబడింది. “దేవుడు ప్రేమాస్వరూపి” అని 1 యోహాను 4:8 తెలియజేస్తుంది. ఆయన ప్రేమ క్రియ ద్వారా వ్యక్తం చేయబడింది గనుక, దేవుడు “మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” అని 1 పేతురు 5:7 చెబుతుంది. బైబిలునందు యెహోవా తన ప్రజలనుగూర్చి శ్రద్ధతీసుకోవడం, ప్రేమగల ఒక గొర్రెలకాపరి తన గొర్రెలనుగూర్చి మృదువుగా శ్రద్ధ తీసుకునే విధానానికి పోల్చబడింది: ఇదిగో . . . ప్రభువగు యెహోవా . . . తన మందను మేపును. తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.” (యెషయా 40:10, 11) “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు” అని చెప్పగల్గడానికి దావీదు ఎంత ఓదార్పు పొందాడో!—కీర్తన 23:1.
2 బైబిలు, దేవుడు యిష్టపడే ప్రజలను గొర్రెలతో పోల్చడం సరియైనదే, ఎందుకంటే గొర్రెలు సమాధానము, విధేయత కలిగి వాటిని సంరక్షించే కాపరికి లోబడివుంటాయి. ప్రేమగల కాపరి వలె, యెహోవా గొర్రె స్వభావంగల ప్రజలను ఎంతో సంరక్షిస్తాడు. భౌతికంగాను, ఆత్మీయంగాను కావల్సినవి దయచేయడంద్వారాను, రాబోయే ఆయన నూతన లోకంవైపు పయనిస్తున్న వారిని ఈ దుష్టలోకంయొక్క కష్టతరమైన “అంత్య దినాల్లో” నడిపించడంద్వారాను దీనిని ఆయన ప్రదర్శిస్తున్నాడు.—2 తిమోతి 3:1-5, 13; మత్తయి 6:31-34; 10:28-31; 2 పేతురు 3:13.
3. యెహోవా తన మందను సంరక్షించే విధానాన్ని కీర్తనల గ్రంథకర్త ఎలా వర్ణించాడు?
3 యెహోవాకు తన గొర్రెలయెడలగల ప్రేమపూర్వక శ్రద్ధను గమనించండి: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును. విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.” (కీర్తన 34:15-19) గొర్రెలాంటి తన ప్రజలకు విశ్వవ్యాపిత కాపరి ఎంత గొప్ప ఓదార్పు దయచేస్తాడో!
గొప్పకాపరి యొక్క మాదిరి
4. దేవుని మందను సంరక్షించుటలో యేసు పాత్ర ఏమిటి?
4 దేవుని కుమారుడైన యేసు, తన తండ్రివద్దనుండి బాగా నేర్చుకున్నాడు, ఎందుకంటే బైబిలు యేసును “మంచి కాపరి” అని పిలుస్తున్నది. (యోహాను 10:11-16) దేవుని మందకు ఆయన చేసే ప్రాముఖ్యమైన సేవ ప్రకటన 7వ అధ్యాయంలో వివరించబడింది. తొమ్మిదవ వచనంలో, మన కాలంలోని దేవుని సేవకులు, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడు వారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము”గా పిలువబడ్డారు. తర్వాత 17వ వచనంలో యిలా వివరించబడింది: “గొర్రెపిల్ల [యేసు] వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” యేసు, దేవుని మందను నిత్యజీవానికి నడిపే సత్య జలాలవద్దకు నడుపుతాడు. (యోహాను 17:3) ఆయన గొర్రెలాంటి లక్షణాలను సూచిస్తూ, దేవుని యెడలగల ఆయన వినయమునకు, విధేయతకు మాదిరికర్తగా ఉన్నాడు గనుక యేసు “గొర్రెపిల్ల” అని పిలువబడ్డాడు.
5. ప్రజలనుగూర్చి యేసు ఎలా భావించాడు?
5 భూమిపై యేసు ప్రజలమధ్య జీవించి, వారి దీన పరిస్థితిని చూశాడు. వారి దుస్థితికి ఆయన ఎలా ప్రతిస్పందించాడు? “ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడెను.” (మత్తయి 9:36) కాపరిలేని గొర్రెలు దుండగుల చేతుల్లో బహుగా బాధననుభవిస్తాయి, అలాగే సరిగ్గా శ్రద్ధచూపని కాపరిగల గొర్రెలు కూడ బాధపడతాయి. కాని యేసు ఎంతో శ్రద్ధను కల్గియున్నాడు, అందుకే ఆయన యిలా చెప్పాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30.
6. నలిగినవారి యెడల యేసు ఎలా శ్రద్ధను చూపాడు?
6 యేసు ప్రజలతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తాడని బైబిలు ప్రవచనం ముందుగానే తెలియజేసింది: “యెహోవా నన్ను అభిషేకించెను . . . నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును, . . . దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును . . . ఆయన నన్ను పంపియున్నాడు.” (యెషయా 61:1-3; లూకా 4:17-21) దురదృష్టవంతులను, బీదలను యేసు ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. బదులుగా, ఆయన యెషయా 42:3ను నెరవేర్చాడు: “నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు.” (మత్తయి 12:17-21 పోల్చండి.) నూనె లేకపోవడంతో బూడిద కావడానికి సిద్ధంగావున్న దీపపు వత్తిలవలె, నలిగిన రెల్లువలె దాస్యములోనున్న ప్రజలు ఉండిరి. వారి దుస్థితిని గుర్తిస్తూ, యేసు వారియెడల కనికరాన్ని చూపి, ఆత్మీయంగాను భౌతికంగాను స్వస్థపరుస్తూ బలము, నిరీక్షణలతో వారిని వెలిగించాడు.—మత్తయి 4:23.
7. ఆయన మాటలకు స్పందించిన ప్రజలను యేసు ఎక్కడికి నడిపించాడు?
7 గొర్రెలాంటి ప్రజలు అనేకమంది యేసు చెప్పినదానికి ప్రతిస్పందించారు. ఆయన బోధ ఎంతగా మనస్సునాకట్టుకొనేదిగా ఉండేదంటే ఆయనను పట్టుకొనడానికి పంపబడిన బంట్రౌతులు యిలా చెప్పారు: ‘ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు.’ (యోహాను 7:46) అంతెందుకు, వేషధారులైన మత నాయకులు యిలా ఫిర్యాదు చేశారు: “ఇదిగో లోకము ఆయనవెంట పోయినది”! (యోహాను 12:19) కాని యేసు తనకు ఘనత లేదా మహిమ కావాలని కోరుకోలేదు. ఆయన ప్రజలను తన తండ్రియొద్దకు నడిపించాడు. యెహోవాయొక్క పొగడదగిన లక్షణాల ద్వారా ప్రేమతో కదలింపబడినవారై ఆయనను సేవించాలని వారికి బోధించాడు: ‘నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణశక్తితోను, నీ పూర్ణవివేకముతోను ప్రేమింపవలెను.’—లూకా 10:27, 28.
8. దేవుని ప్రజలు ఆయనకు చూపే విధేయత, లోక నాయకులకు యితరులు చూపే విధేయతకు ఎలా భిన్నంగా ఉంది?
8 ఆయన యెడలగల వారికున్న ప్రేమనుబట్టి, ఆయన విశ్వాధిపత్యానికి గొర్రెలాంటి ప్రజలు మద్దతునిస్తారు, గనుక యెహోవా మహిమపర్చబడతాడు. ఆయన ప్రేమమయమైన లక్షణాలను గూర్చిన జ్ఞానాన్నిబట్టి వారు యిష్టపూర్వకంగా సేవించడానికి ఎన్నుకుంటారు. ఈ లోక నాయకుల క్రిందనున్న ప్రజలు కేవలం వారియెడలగల భయంతో లేదా బలవంతంగా లేదా తమకున్న అంతరంగిక దృక్పథాన్నిబట్టి లోబడేవారికి యిదెంత భిన్నంగా ఉంది! రోమన్ కాథోలిక్ చర్చియొక్క పోప్‌ను గూర్చి చెప్పిన విధంగా ఎన్నడూ యెహోవానుగూర్చిగాని లేదా యేసునుగూర్చిగాని చెప్పబడదు: “అనేకమంది ఆయనను మెచ్చుకొన్నారు, అందరూ భయపడ్డారు, ఎవరూ ఆయనను ప్రేమించలేదు.”—పీటర్ డి రోజా వ్రాసిన వికార్స్ ఆఫ్ క్రైస్ట్—ది డార్క్ సైడ్ ఆఫ్ ది పాపసీ.
ఇశ్రాయేలునందుగల క్రూరమైన కాపరులు
9, 10. ప్రాచీన ఇశ్రాయేలునందు, మొదటి శతాబ్దమందుగల మత నాయకులను వర్ణించండి.
9 యేసువలె కాకుండా, ఆయన కాలంలోని ఇశ్రాయేలునందలి మత నాయకులు తమ గొర్రెలయెడల ప్రేమలేనివారైయుండిరి. వారు తమ పూర్వీకుల వలె ఉండిరి, వారిని గూర్చి యెహోవా యిలా చెప్పాడు: “తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయులకు శ్రమ; కాపరులు గొర్రెలను మేపవలెనుగదా. . . . బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.”—యెహెజ్కేలు 34:2-4.
10 వారి పితరులవలెనే, మొదటి శతాబ్దమందలి యూదా మత నాయకులు కఠినమనస్కులైయుండిరి. (లూకా 11:47-52) దీన్ని వివరించడానికి, యేసు దోచుకోబడి, కొట్టబడి, కొరప్రాణముతో దారి ప్రక్కన విడిచిపెట్టబడ్డ ఒక యూదునిగూర్చి చెప్పాడు. ఒక ఇశ్రాయేలు యాజకుడు ఆ త్రోవలో వచ్చాడు, కాని ఆ యూదుని చూచి, అతడు వేరొక ప్రక్కగా వెళ్లిపోయాడు. ఒక లేవీయుడు కూడా ఆలాగే చేశాడు. తర్వాత తృణీకరించబడిన సమరయుడైన ఒక అన్యుడు వచ్చాడు, పడియున్నవానిపై జాలిపడ్డాడు. అతడు వానికి కట్లుకట్టి, తన స్వంత పశువుపై ఎక్కించి, పూటకూళ్లవాని యింటికి తీసికొనివెళ్లి, ఆయనయెడల శ్రద్ధ తీసుకున్నాడు. అతడు పూటకూళ్లవానికి కొంత డబ్బిచ్చి, నీవింకేమైనా ఖర్చు చేసినయెడల దాన్ని చెల్లించడానికి నేను మరల వస్తానని చెప్పాడు.—లూకా 10:30-37.
11, 12. (ఎ) యేసు కాలంలో మత నాయకుల దుష్టత్వం ఎలా శిఖరాగ్రానికి చేరుకుంది? (బి) రోమీయులు చివరకు మత నాయకులకు ఏమి చేశారు?
11 యేసు కాలంలోని మత నాయకులు ఎంత అవినీతిపరులంటే, యేసు లాజరును పునరుత్థానం చేసినప్పుడు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను సమకూర్చి, యిలా చెప్పారు: “మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు [యేసు] అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు.” (యోహాను 11:47, 48) చనిపోయిన వానిగూర్చి యేసు చేసిన మంచిదాన్ని గూర్చి వారు పట్టించుకోలేదు. వారు తమ స్థానములను గూర్చే చింతించారు. కాబట్టి “ఆ దినమునుండి వారు ఆయనను [యేసును] చంప నాలోచించుచుండిరి.”—యోహాను 11:53.
12 వారి దుష్టత్వానికి తోడు, ఆ ప్రధాన యాజకులు తర్వాత “అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక . . . లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.” (యోహాను 12:10, 11) తమ స్థానాలను కాపాడుకోవాలనే వారి ప్రయత్నాలు ఎందుకూ పనికిరానివయ్యాయి, ఎందుకంటే యేసు వారితో యిలా చెప్పాడు: “మీ యిల్లు మీకు విడువబడియున్నది.” (మత్తయి 23:38) ఆ మాటల నెరవేర్పుగా, ఆ తరంలో రోమీయులు వచ్చి ‘వారి స్థానాన్ని, వారి రాష్ట్రాన్ని,’ వారి ప్రాణాలనుకూడా తీసుకుపోయారు.
క్రైస్తవ సంఘంలో ప్రేమపూర్వకమైన కాపరులు
13. తన మందను కాయుటకు ఎవరిని పంపుతానని యెహోవా వాగ్దానం చేశాడు?
13 క్రూరమైన, స్వార్థపరులైన కాపరులకు బదులుగా, యెహోవా తన మందను సంరక్షించడానికి మంచి కాపరియైన యేసును నియమిస్తాడు. గొర్రెలను సంరక్షించడానికి ప్రేమమయమైన ఉపకాపరులను నియమిస్తానని కూడా ఆయన వాగ్దానం చేశాడు: ‘నేను వాటిమీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడవు.’ (యిర్మీయా 23:4) ఆవిధంగా, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘాల్లో వలెనే ఈనాడు, “ప్రతి పట్టణములోను పెద్దలను” నియమించడం జరుగుతుంది. (తీతు 1:5) ఆత్మీయంగా పెద్దవారైన వీరు ‘దేవుని మందను కాయుటకు’ లేఖనాల్లో వివరించిన అర్హతలను కలిగివుంటారు.—1 పేతురు 5:2; 1 తిమోతి 3:1-7; తీతు 1:7-9.
14, 15. (ఎ) శిష్యులు ఏలాంటి దృక్పథాన్ని వృద్ధిచేసుకోవడాన్ని కష్టంగా భావించారు? (బి) పెద్దలు వినయంగల సేవకులని వారికి చూపడానికి యేసు ఏం చేశాడు?
14 గొర్రెలను సంరక్షించుటలో, పెద్దలు వాటియెడల “అన్నింటికంటె ముఖ్యముగా,” “మిక్కుటమైన ప్రేమ”గలవారైయుండాలి. (1 పేతురు 4:8) కాని యేసు శిష్యులు, హోదాను, స్థానాన్ని గూర్చి ఎక్కువ పట్టించుకొన్నారు గనుక, దీన్ని నేర్చుకోవాల్సివచ్చింది. కాబట్టి, “నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని” ఇద్దరు శిష్యుల తల్లి యేసుతో చెప్పినప్పుడు, యితర శిష్యులు కోపోద్రేకులైరి. యేసు వారితో యిలా చెప్పాడు: “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను.”—మత్తయి 20:20-28.
15 మరొక సందర్భంలో, శిష్యులు “ఎవడు గొప్పవాడని . . . ఒకనితో ఒకడు వాదించి”న తర్వాత, యేసు వారితో యిట్లనెను: “ఎవడైనను మొదటివాడై యుండ గోరినయెడల, వారందరిలో కడపటివాడును అందరికి పరిచారకుడునై యుండవలెను.” (మార్కు 9:34, 35) తమ్మును తాము తగ్గించుకొని, యిష్టపూర్వకంగా సేవించడమనేది వారి వ్యక్తిత్వంలో ఒక భాగమైపోవాలి. అయినా, ఆ విషయంలో శిష్యులు సమస్యలనెదుర్కొంటూనే వచ్చారు, ఎందుకంటే యేసు చనిపోక ముందు రాత్రి, ఆయన చివరి సాయంకాల భోజన సమయంలో, వారిలో ఎవరు గొప్ప అనే “వివాదము” చెలరేగింది! ఒక పెద్ద, మందను ఎలా కాయాలి అనేది చూపెట్టిన తర్వాత కూడా అది జరిగింది; ఆయన తన్నుతాను తగ్గించుకొని వారి పాదాలను కడిగాడు. ఆయన యిలా చెప్పాడు: “ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.”—లూకా 22:24; యోహాను 13:14, 15.
16. పెద్దలయొక్క అతి ప్రాముఖ్యమైన లక్షణాన్నిగూర్చి 1899లో వాచ్‌టవర్ ఎలాంటి వ్యాఖ్యానాలు చేసింది?
16 పెద్దలు ఈ విధంగానే ఉండాలని యెహోవాసాక్షులు ఎల్లప్పుడూ బోధిస్తూవచ్చారు. రమారమి ఒక శతాబ్దం క్రితం, ఏప్రిల్ 1, 1899 వాచ్‌టవర్ 1 కొరింథీయులు 13:1-8 నందలి పౌలు మాటలను పేర్కొని, తర్వాత యిలా చెప్పింది: “అపొస్తలుడు స్పష్టంగా సూచించేదేమంటే, జ్ఞానము, వాక్‌చాతుర్యం అనేవి పరీక్షలు కాదుగాని, ప్రేమ హృదయంలోకి చొచ్చుకొని, జీవిత కాలమంతటిలోనూ కొనసాగిస్తూ, మర్త్యమైన మన శరీరభాగాలను ప్రేరేపించి, వాటిలో పనిచేయింపజేయడమే నిజమైన పరీక్ష, అదే మన దైవిక బంధానికి నిజమైన నిదర్శనము. . . . చర్చి సేవకుడుగాను పరిశుద్ధమైన వాటికి పరిచర్య చేయడానికిని అంగీకరింపబడే ప్రతి ఒక్కరిలో చూడవలసిన ప్రధానమైన లక్షణం మొట్టమొదటిగా ప్రేమతో కూడిన స్ఫూర్తే అయ్యుండాలి.” ప్రేమతో వినయంగా సేవించని పురుషులు “క్షేమకరముకాని బోధకులైయుండి, బహుశా మంచికంటే హానినే ఎక్కువ చేస్తారు” అని అది పేర్కొన్నది.—1 కొరింథీయులు 8:1.
17. పెద్దలు కల్గివుండాల్సిన లక్షణాలను బైబిలు ఎలా నొక్కిచెప్పింది?
17 ఆవిధంగా, పెద్దలు మందపై ‘ప్రభువులైనట్టుండ కూడదు.’ (1 పేతురు 5:3) బదులుగా, వారు “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై” నడిపించాలి. (ఎఫెసీయులు 4:32) పౌలు యిలా నొక్కిచెప్పాడు: “జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. . . . వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి.”—కొలొస్సయులు 3:12-14.
18. (ఎ) గొర్రెలతో వ్యవహరించడంలో పౌలు ఏ శ్రేష్ఠమైన మాదిరినుంచాడు? (బి) గొర్రెల అవసరతలను పెద్దలు ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు?
18 పౌలు దీన్ని చేయడం నేర్చుకుని, యిలా చెబుతున్నాడు: “అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి.” (1 థెస్సలొనీకయులు 2:7, 8) దానితో పొందికగా, ఆయన యిలా చెప్పాడు: “ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.” (1 థెస్సలొనీకయులు 5:14) గొర్రెలు తమవద్దకు తీసుకువచ్చే సమస్య ఎలాంటిదైనప్పటికి, పెద్దలు సామెతలు 21:13 జ్ఞాపకముంచుకోవాలి: “దరిద్రుల మొర్ర వినక చెవి మూసికొనువాడు తాను మొర్రపెట్టునప్పుడు అంగీకరింపబడడు.”
19. ప్రేమపూర్వకమైన పెద్దలు ఎందుకు ఒక ఆశీర్వాదము, మరి అలాంటి ప్రేమకు గొర్రెలు ఎలా స్పందిస్తాయి?
19 మందను ప్రేమపూర్వకంగా కాయు పెద్దలు గొర్రెలకు ఒక ఆశీర్వాదము. యెషయా 32:2 యిలా ప్రవచించింది: “మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును. ఎండినచోట నీళ్లకాలువలవలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండనీడవలెను ఉండును.” మన పెద్దలలో చాలామంది ఆ ఉల్లాసాన్ని కల్గించే సుందరమైన వర్ణనకు పొందికగా ఉన్నారని తెలిసికోవడానికి మనం సంతోషిస్తాము. వారు ఈ క్రింది సూత్రాన్ని అన్వయించుకోవడానికి నేర్చుకున్నారు: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) ఇటువంటి ప్రేమను, వినయమును పెద్దలు చూపినప్పుడు, మంద ‘వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచడంద్వారా’ ప్రతిస్పందిస్తుంది.—1 థెస్సలొనీకయులు 5:12, 13.
స్వేచ్ఛాచిత్తం ఉపయోగించడాన్ని గౌరవించండి
20. పెద్దలు స్వేచ్ఛాచిత్తాన్ని ఎందుకు గౌరవించాలి?
20 తమ సొంత నిర్ణయాలు చేసుకొనే స్వేచ్ఛతో మానవులను యెహోవా సృష్టించాడు. పెద్దలు సలహాను, గద్దింపును కూడ యివ్వవలసినప్పటికి, వారు మరొకరి జీవితాన్ని లేదా విశ్వాసాన్ని నిర్బంధించకూడదు. పౌలు యిలా చెప్పాడు: “మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.” (2 కొరింథీయులు 1:24) ఔను, “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా?” (గలతీయులు 6:5) యెహోవా తన నియమాలు, సూత్రాల పరిధిలోనే మనకు ఎంతో స్వేచ్ఛను యిచ్చాడు. అందుకే పెద్దలు లేఖన సూత్రాలు మీరనిచోట తమ సొంత నియమాలు పెట్టకూడదు. వారు తమ సొంత వ్యక్తిగత అభిప్రాయాలను పిడివాదముగా అందించే స్వభావానికి లేదా ఎవరైనా అలాంటి అభిప్రాయాలను ఒప్పుకొనకపోతే తమ సొంత అహంకారానికి తావివ్వకుండా అడ్డుకోవాలి.—2 కొరింథీయులు 3:17; 1 పేతురు 2:16.
21. ఫిలేమోను యెడలగల పౌలు దృక్పథంనుండి ఏం నేర్చుకోగలం?
21 పౌలు రోములో ఖైదీయైనప్పుడు, ఆసియా మైనరులోని కొలస్సీలో దాసులను కల్గివున్న క్రైస్తవుడైన ఫిలేమోనుతో ఎలా వ్యవహరించాడో గమనించండి. ఫిలేమోను దాసుడైన ఒనేసిము రోముకు పారిపోయి, క్రైస్తవునిగా మారి, పౌలుకు సహాయంచేస్తూ ఉండెను. పౌలు ఫిలేమోనుకు యిలా వ్రాశాడు: “నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని నీ ఉపకారము బలవంతముచేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టము లేదు.” (ఫిలేమోను 13, 14) అతనిని ఒక క్రైస్తవ సహోదరునిగా చూడమని ఫిలేమోనును అడుగుతూ, పౌలు ఒనేసిమును తిరిగి పంపించాడు. మంద అతనిది కాదు; అది దేవునిదేనని పౌలు గుర్తించాడు. ఆయన దానికి యజమానుడు కాదుగాని దాని సేవకుడే. పౌలు ఫిలేమోనును ఆజ్ఞాపించలేదు; అతని స్వేచ్ఛాచిత్తాన్ని గౌరవించాడు.
22. (ఎ) తమ స్థానము ఎలాంటిదని పెద్దలు అర్థంచేసుకోవాలి? (బి) ఎలాంటి సంస్థను యెహోవా అభివృద్ధి చేస్తున్నాడు?
22 దేవుని సంస్థ అభివృద్ధి చెందుచుండగా, ఎక్కువమంది పెద్దలు నియమించబడుతున్నారు. వారు, అలాగే ఎక్కువ అనుభవంగల పెద్దలు, తమ స్థానము వినయంతో కూడిన సేవ చేయుటకేనని అర్థంచేసుకోవాలి. ఈ విధంగా, దేవుడు తన సంస్థను నూతన లోకంవైపు నడిపిస్తుండగా, ఆయన కోరినట్లుగానే అది వృద్ధిచెందుటలో కొనసాగుతుంది—బాగా సంస్థీకరించబడుతుంది, కాని సామర్థ్యం నిమిత్తం ప్రేమ, కనికరాన్ని పణంగా పెట్టిమాత్రం కాదు. అందువల్ల దేవుడు, ‘ఆయనను ప్రేమించువారికి, . . . మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగునట్లు’ చేస్తాడనే రుజువును దానిలో చూసే గొర్రెలాంటి ప్రజలకు ఆయన సంస్థ ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రేమపై నిర్మింపబడిన ఒక సంస్థనుండి అది ఆశింపదగినదే, ఎందుకంటే “ప్రేమ శాశ్వతకాలముండును.”—రోమీయులు 8:28; 1 కొరింథీయులు 13:8.
మీరెలా జవాబిస్తారు?
◻ తన ప్రజలయెడలగల యెహోవా శ్రద్ధను బైబిలు ఎలా వర్ణిస్తుంది?
◻ దేవుని మందను సంరక్షించడంలో యేసు ఎలాంటి పాత్ర వహిస్తున్నాడు?
◻ పెద్దలు కల్గి ఉండాల్సిన ప్రముఖమైన లక్షణమేది?
◻ గొర్రెల స్వేచ్ఛాచిత్తాన్ని పెద్దలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి?
[16వ పేజీలోని చిత్రం]
“మంచి కాపరియైన” యేసు, కనికరమును చూపాడు
[17వ పేజీలోని చిత్రాలు]
యేసును చంపాలని అవినీతిపరులైన మత నాయకులు కుట్రపన్నారు