నమ్మదగిన నడిపింపును మీరెక్కడ కనుగొనగలరు?
“యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. యెహోవా . . . నన్ను శిక్షింపుము.”—యిర్మీయా 10:23, 24.
బైబిలు రచయిత యిర్మీయా ఆ మాటలను 25 సంవత్సరాల క్రితమే రాశాడు. మానవ నడిపింపును అన్వయించిన వేల సంవత్సరాల తర్వాత మానవజాతి యొక్క దుఃఖకర పరిస్థితి ఈ వ్యాఖ్యానంలోని నిరాక్షేపణ సత్యాన్ని రుజువు చేస్తోంది. అయితే ‘నమ్మదగిన నడిపింపు ఎక్కడ దొరుకుతుంది?’ అని మీరు ప్రశ్నించవచ్చు.
పైన సూచించబడిన లేఖనం నమ్మదగ్గ నడిపింపు మార్గాల మూలానికి, అనగా మానవునికంటే మహోన్నతమైన సృష్టికర్తయైన యెహోవా దేవున్ని సూచిస్తుంది. నిశ్చయంగా, మానవుని తీరు, అతని అవసరతలు మన సృష్టికర్తకంటే బాగా తెలిసినవాడు మరొకడు లేడు. లేనట్లయితే, అలాంటి నడిపింపునూ మార్గాన్ని మనకు అందించడానికి దేవుడు శ్రద్ధకల్గి ఉన్నాడా? ఆయన దాన్ని ఎలా చేస్తాడు? అది మన కాలాల్లో ఆచరణ యోగ్యమేనా?
దైవిక నడిపింపును అందుకునేటట్లు నిర్మించబడ్డారు
మనిషిని జంతువుల నుండి వేరుపర్చే ముఖ్యమైన తేడా మానవ మెదడు రూపం, సామర్థ్యం, నిర్వహణలపై కేంద్రీకృతమై ఉంటుంది. సహజజ్ఞానం అని పిలువబడుతున్న దానిలో జంతువుల మెదడుకు సంబంధించిన దాదాపు అన్ని నిర్వహణలు ముందుగానే నిర్దేశించబడి ఉన్నాయి. మానవుల విషయంలో అలా జరగలేదు.—సామెతలు 30:24-28.
జంతువుల మెదడులా కాకుండా, మానవ మెదడులోని అత్యధిక భాగంలో నియమిత నిర్దేశకాలు లేవు. జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోడానికి, ప్రేమ, ఉదారత, నిస్వార్థం, న్యాయం, వివేకం వంటి ఉన్నత లక్షణాలను కనపర్చడానికి సహాయపడగలదు. స్వేచ్ఛాచిత్తాన్ని జరిగించే శక్తి సామర్థ్యాలను దేవుడు మానవులకు బహూకరించాడు.
అలాంటి మానసిక సామర్థ్యాన్నిచ్చి, దాన్ని శ్రేష్ఠమైన రీతిలో ఉపయోగించుకోడానికి ఏదో రకమైన నడిపింపును అందించకుండా దేవుడు మానవున్ని సృజించాడని తలంచడం సహేతుకంగా ఉందా? (ఆదికాండము 2:15-17, 19; 3:8, 9) మానవుడు పాపంలో పడిన తర్వాత కూడా, యథార్థవంతులైన స్త్రీపురుషులను యెహోవా ముఖ్యంగా తన ప్రేరేపిత వాక్యమైన బైబిలు ద్వారా నడిపిస్తూనే వచ్చాడు. (కీర్తన 119:105) మానవులు తమ స్వేచ్ఛాచిత్తాన్ని వివేకయుక్తంగా ఉపయోగించుకుంటూ తమ జీవితాల్లోని ప్రతిదిన సమస్యలను విజయవంతంగా ఎదుర్కోడానికిది అనుమతించింది.
బైబిలు యొక్క దైవిక గ్రంథకర్తృత్వము
నడిపింపుకొరకు బైబిలును ఓ నమ్మదగిన ఆధారంగా చేసేదేమిటి? ఒక విషయం ఏమంటే, కేవలం సృష్టికర్త మాత్రమే అందించగల సమాచారాన్ని అది దయచేస్తుంది. మానవ జీవితం ప్రారంభం కాకముందు జరిగిన సంఘటనల చరిత్రను అది చూపిస్తుంది. ఉదాహరణకు, మానవ జీవాన్ని పోషించడానికి తగినట్లు భూమి సిద్ధపర్చబడేంత వరకూ జరిగిన క్రమమైన దశల చరిత్రను అది అందిస్తుంది. (ఆదికాండము, 1, 2 అధ్యాయాలు) ఈ విషయం బైబిలునందు 3,000 సంవత్సరాల క్రితమే వ్రాయబడినప్పటికి, ఆధునిక వైజ్ఞానిక సిద్ధాంతాలతో యిది ఏకీభవిస్తోంది.
ఈ భూమి గుండ్రంగా ఉందని మానవజాతి ఒప్పుకోక మునుపే, బైబిలు యిలా తెలియజేసింది: “శూన్యమండలముపైని ఉత్తరదిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన [దేవుడు] పరచెను.” (యోబు 26:7) అంతేకాకుండా, “ఆయన గుండ్రని భూమిమీద ఆసీనుడైయున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు.” (యెషయా 40:22) సృష్టికర్తయైన దేవుడు మాత్రమే ఈ వివరాలను అందించి ఉంటాడు.
భవిష్యత్తును తెలుసుకొనే సామర్థ్యం మానవునికి బహుమానంగా యివ్వబడలేదు. బదులుగా, భవిష్యత్తును గూర్చి సృష్టికర్త బైబిలు పుటల ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు తన్ను గూర్చి వ్రాయడానికి ప్రవక్తయైన యెషయాను యిలా ప్రేరేపించాడు: “దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.”—యెషయా 46:9, 10.
బైబిలు ఆశ్చర్యకరమైన రీతిలో మొదటినుండి తుదివరకూ తు.చ. తప్పకుండా చెప్పగలదని ప్రదర్శించింది. ఉదాహరణకు, వేలకొలది సంవత్సరాల మానవ చరిత్రలోని ప్రముఖమైన ప్రపంచ ఆధిపత్యాల గుణగణాలనూ వాటి ఆవిర్భవాన్ని, పతనాన్ని గూర్చి ముందుగానే చెప్పింది. ఈ అద్భుతమైన ప్రవచనాలు వాటి నెరవేర్పుకు శతాబ్దాల పూర్వమే, కొన్ని సందర్భాల్లో వేల సంవత్సరాల పూర్వమే వ్రాయబడ్డాయి. ఆ విధంగా బైబిలు ఆధునిక దిన సంఘటనలనూ, వాటి తుది పరిణామాలనూ సరిగ్గా ప్రవచిస్తుంది. బైబిలు ప్రత్యేకమైంది, కారణం, “దేవుని మహాదినమున జరుగు యుద్ధ”మైన అర్మగిద్దోనులో అపరిపూర్ణ మానవ ప్రభుత్వాలు నాశనమైనప్పుడు దాన్ని తప్పించుకుని బ్రతికి బయటపడే మార్గాన్ని కూడా అది సూచిస్తుంది.—ప్రకటన 16:14, 16; 17:9-18; దానియేలు 2, 8 అధ్యాయాలు.
ఎల్లప్పుడు ప్రయోజనకరమే—ఎన్నడూ హానికరం కాదు
మానవ జ్ఞానం కేవలం అసంపూర్ణమైంది; కనుక, మానవ సలహా మంచి ఉద్దేశంతోనే యివ్వబడినప్పటికి, అది అన్ని వేళలా ప్రయోజనకరం కాదు. బైబిలు సలహా విషయంలో అలా కాదు. దేవుడు తానే యిలా అంటున్నాడు: “నీకు ప్రయోజనము కలుగునట్లు . . . యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.”—యెషయా 48:17, 18.
దైవిక నడిపింపు, మనం ప్రాధాన్యతలను ఏర్పర్చుకోడానికి, జీవితంలో ఉన్నతమైన విలువలను హత్తుకొని ఉండడానికి సహాయపడుతుంది. ఆధునిక సమాజం వస్తు సంపదను సమకూర్చుకోడానికి, ఆ గురులను ఎంచుకోడానికి ఎక్కువ ప్రాధాన్యత నిస్తుండగా, “దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు” గనుక మనం “దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి” చూడడం ఎంత విలువగలదోనన్న విషయాన్ని బైబిలు నొక్కిచెబుతుంది. (2 కొరింథీయులు 4:18) ఈ విధంగా మనం మన జీవితంలో ఎంతో శ్రేష్ఠమైన గమ్యాలను, ప్రాముఖ్యంగా దేవుని చిత్తాన్ని చేయడంలో ఆత్మీయ గమ్యాలను, తుదకు నీతియుక్తమైన నూతన లోకంలో నిత్యజీవాన్ని పొందే గమ్యాన్ని కల్గివుండేలా ప్రోత్సహింపబడ్డాము.
క్రైస్తవుడు ఈ ఉన్నతమైన గమ్యాలను వెంబడించడానికి పాటుపడుతున్నప్పుడు, ఈ దుష్ట విధానంలో వీలున్నంతమేరకు శ్రేష్ఠమైన జీవితాన్ని జీవించేలా బైబిలు సలహా అతనికి సహాయపడుతుంది. ఆధునిక మానవ జ్ఞానం, తక్కువ పని చేసి ఎక్కువ డబ్బు సంపాదించు అనే తత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. మరో వైపు బైబిలు, “బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును” అని మనకు చెబుతోంది. అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులకు యిలా రాశాడు: “మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు”న్నాము గనుక మంచి మనస్సాక్షి కల్గియున్నామని నమ్ముకొనుచున్నాము.—సామెతలు 10:4; హెబ్రీయులు 13:18.
కుటుంబ ఏర్పాటుపై కూడా బైబిలు ఆచరణయోగ్యమైన సలహాను యిస్తోంది. అది వివాహ ఏర్పాటులో భార్యా భర్తలిరువురి పాత్రనూ అలాగే పిల్లలను విద్యావంతులను చేయించి, సరైన పద్ధతిలో పెంచడానికి తమ తమ నిర్దిష్ట పాత్రలను ఏర్పర్చింది. అది యిలా అంటోంది: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. . . . భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను. పిల్లలారా, . . . మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; . . . తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” సృష్టికర్త యిచ్చే ఉన్నతమైన సలహాను అనుసరించడంవల్ల కుటుంబాలు స్థిరంగాను, సంతోషంగాను ఉండడానికి తోడ్పడుతుంది.—ఎఫెసీయులు 5:21–6:4.
దేవుని నడిపింపును అనుసరించేవారికి సురక్షిత భవిష్యత్తు
మానవ సమస్యలన్నిటికీ దేవుడు తీసుకురాబోవు పరిష్కారాలను గూర్చి దేవుని లిఖిత వాక్యం సూచిస్తోంది. యెహోవా దేవుడు త్వరలోనే ప్రస్తుత విధానాన్ని దాని వేదన, అన్యాయం, బాధలతో పాటు మట్టుపెట్టి, వాటి స్థానే నీతియుక్త నూతన విధానాన్ని ఏర్పాటు చేస్తాడు. బైబిలు దీన్ని 2 పేతురు 3:7-10,లో వివరిస్తూ 13వ వచనంలో యిలా చెబుతోంది: “క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” మానవ జాతికి యివ్వగల్గిన వాటిలో అన్నిటికంటే శ్రేష్ఠమైన సువార్త దీనిలో యిమిడి ఉంది. ఖండితంగా బైబిలు అందిస్తున్న సమాచారం, ఇదే 200 దేశాల్లోనూ, సముద్ర ద్వీపాల్లోనూ యెహోవాసాక్షులు ప్రకటిస్తున్నారు.
దేవుని చిత్తం భూవ్యాప్తంగా ఆచరించబడినప్పుడు, మానవ కుటుంబమంతా దాని సృష్టికర్తయైన యెహోవా యిచ్చే శ్రేష్ఠమైన నడిపింపును అనుసరించడం ద్వారా ప్రయోజనం పొందుతారు. పేదరికం, నేరం, మాదకద్రవ్యాల సమస్యలుండనే ఉండవు. మానవజాతి అనారోగ్యం, వృద్ధాప్య, మరణాలతో యిక ఎన్నడూ పీడించబడరు. మన మొదటి తలిదండ్రులు దేవుని నడిపింపుకు ఎదురు తిరగక ముందున్న స్థితికి అంటే పరిపూర్ణతకు మానవ కుటుంబం తేబడుతుంది.
దైవిక నడిపింపును నమ్ముకున్న వారి ఆనందభరితమైన పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని బైబిల్లోని చివరి పుస్తకం ఎంత చక్కగా వివరిస్తోందో కదా! ప్రకటన 21:4, 5 యిలా అంటోంది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” మన సృష్టికర్త హామీనిస్తూ యిలా అన్నాడు: “ఇదిగో! సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని.” చెబుతూ, “ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి” అని అన్నాడు.
మనం ఈ ఆశీర్వాదాలను అందుకోవాలంటే, మన నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు? దేవుడు, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు,” అని అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. (1 తిమోతి 2:4) మీరు సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని బైబిలు పఠనం ద్వారా సంపాదించుకోవాలని యెహోవాసాక్షులు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. దైవిక చిత్తాన్ని పూర్ణంగా తెలుసుకోవడం ద్వారా, ఈ అపాయకర కాలంలో దైవిక వివేకమే నమ్మకమైన నడిపింపని మీరు కూడా అనుభవం ద్వారా గ్రహించగలరు. మన కాలమందలి అత్యవసరత మునుపెన్నటికంటే యిప్పుడు దాన్ని అనుసరించడం విధాయకమైందిగా చేస్తుంది!