రాజ్య ప్రచారకుల నివేదిక
బైబిలు సత్యం ఒక కుటుంబాన్ని ఐక్యపర్చుట
నేడు, లోకంలోని అనేక ప్రాంతాల్లో, కుటుంబ ఐక్యత దాదాపు గతించిన విషయంగా ఉంది. అయినా, కుటుంబ ఐక్యత యొక్క రహస్యాన్ని బైబిలు వెల్లడిచేస్తుంది. యేసు మాటలను పరిశీలించండి: “యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.” (మత్తయి 7:24) వేలాదిమంది యెహోవాసాక్షుల కుటుంబాలు ఈ మాటలను అన్వయించుకోవడం ద్వారా, ఐక్య కుటుంబాన్ని పెంపొందించుకోవటానికి బైబిలును పునాదిగా ఉపయోగించడం ద్వారా ఐక్యతను సాధించారు. ఈ క్రింది అనుభవం చూపునట్లు, ఇతరులు కూడా అలాంటి ఐక్యతను పొందుతున్నారు.
డానియెల్ ఫ్రాన్స్‌నందు సైన్యంలో సేవచేస్తుండగా, ఒక సైనిక మతాచార్యుడు ఒక బైబిలు కొనుక్కోమని డానియెల్‌కు సలహా యిచ్చాడు, ఆయన అలాగే చేసి, దాన్ని క్రమంగా చదవటం మొదలుపెట్టాడు. తుదకు అతను తహితీకి బదిలీ చేయబడ్డాడు. డానియెల్ తోటి సైనికులు కొంతమంది అడ్వెన్టిస్ట్లుగా, మరి ఇతరులు మార్మొన్స్గా ఉండిరి. వారి సంభాషణ తరచూ మతం అనే విషయంపైకి వచ్చేది. ఒక రోజు ఒక చీఫ్ సార్జెంట్ డానియెల్‌ను యెహోవాసాక్షియైన తన భార్యకు పరిచయం చేశాడు. ఆమె మొత్తం మధ్యాహ్నమంతా డానియెల్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ గడిపి, తహితీలోని స్థానిక యెహోవాసాక్షుల సంఘాలలో ఒకదానిని అతను కలుసుకొనెలా చేసింది. త్వరలోనే ఆయన క్రమమైన బైబిలు పఠనాన్ని ప్రారంభించాడు.
ఫ్రాన్స్‌లో నివసిస్తున్న డానియెల్ తలిదండ్రులు చాలా నిష్టగల కాథలికులు. అతని తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు, ఒక కాథలిక్ పాఠశాలలో మతసంబంధ బోధ విషయంలో పర్యవేక్షకుడు కూడా. తాను నేర్చుకుంటున్న ఆత్మీయ రత్నాలను కొన్నింటిని తన తలిదండ్రులతో కూడా పంచుకోవాలని, డానియెల్ వారికి వ్రాసే ఉత్తరాల్లో కొన్ని బైబిలు సంబంధ తలంపులను వ్రాయడం మొదలుపెట్టాడు.
మొదట్లో డానియెల్ తల్లి ఆనందించింది, కాని తన కుమారుని ఉత్తరాల్లో యెహోవా అనే పేరు కనుగొని ఆమె విభ్రాంతి చెందింది. కొన్ని రోజుల తరువాత, యెహోవాసాక్షులు “ప్రమాదకరమైన వర్గం” వారని చెప్తున్న రేడియో కార్యక్రమాన్ని ఆమె విన్నది. ఆమె వెంటనే సాక్షులతో అన్ని సంబంధాలు తెంచేసుకొమ్మని డానియెల్‌కు వ్రాసింది. అయినా, డానియెల్ తన బైబిలు పఠనంలో అభివృద్ధి సాధించి, త్వరలోనే సైన్యాన్ని విడిచి ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఇంటికి వచ్చిన తరువాత, డానియెల్ ప్రతీ సాయంత్రం—ఒక్కోసారి చాలా రాత్రివరకు కూడా—తన తల్లితో చాలా సమయం వరకు బైబిలు చర్చలు చేసేవాడు. చివరకు డానియెల్‌తోపాటు రాజ్యమందిరానికి రావటానికి ఆమె అంగీకరించింది. మొదటిసారి ఆమె కూటానికి హాజరైనప్పుడు, ఆమె ఎంతగా ప్రభావితురాలైందంటే ఆమె వెంటనే తను కూడా క్రమ బైబిలు పఠనం ప్రారంభించింది. ఆమె వేగంగా అభివృద్ధి చెంది త్వరలోనే బాప్తిస్మం తీసుకుంది.
డానియెల్ తండ్రి చాలా సహనశీలి కాని తన ఉద్యోగం, మత సంబంధ కార్యాల యెడల ఎక్కువ అంకితభావం గలవాడు. అయినప్పటికీ, ఆయన ఒక సందర్భంలో తన భార్యను, డానియెల్‌ను జిల్లా సమావేశానికి వాహనంపై తీసుకుని వచ్చాడు. అది జూలై 14, నగరంలో జరుగుతున్న బాస్టిల్ దిన కవాతును తిలకించాలని అతని మనసులో ఉంది. వేచివున్నప్పుడు, సమావేశ హాలులో ఏం జరుగుతుందోనని ఆసక్తితో లోనికి తొంగి చూడాలని ఆయన నిర్ణయించుకున్నాడు. యెహోవా ప్రజల మధ్య ఉన్న క్రమం మరియు సమాధానాన్ని చూసి ఆయన ఎంతగానో ప్రభావితుడయ్యాడు, ఆయన అనేక సమావేశ డిపార్ట్మెంట్ల దారిన వెళ్తూవుంటే అందరూ అతన్ని “బ్రదర్” అని పిలిచారు. ఆయన బాస్టిల్ దిన కవాతు గురించి పూర్తిగా మర్చిపోయి, సమావేశం అయిపోయేంత వరకు అక్కడే ఉండిపోయాడు. ఆయన బైబిలు పఠనం కొరకు అడిగి సత్యాన్ని నేర్చుకోవడంలో వేగంగా అభివృద్ధి చూపించాడు. అయితే, ఆయన ఎంత ఎక్కువగా నేర్చుకుంటున్నాడో, ఆయన తన పని వద్ద అంత అసౌకర్యంగా భావించడం మొదలుపెట్టాడు, కాబట్టి 58 సంవత్సరాల వయస్సులో ఆయన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు కుటుంబంలోని ముగ్గురూ సమర్పించుకుని బాప్తిస్మం పొంది, ఐక్యంగా కలిసి యెహోవాను సేవిస్తున్నారు.
బైబిలు సత్యమే డానియెల్ కుటుంబాన్ని ఐక్యపర్చింది. ఇతరులు కూడా దాన్ని నేర్చుకుని పూర్ణహృదయంతో అన్వయించుకుంటే అది వారి కుటుంబాలను కూడా ఐక్యపర్చగలదు.