క్రైస్తవ కుటుంబము ఆత్మీయ విషయములను మొదటపెట్టును
“మీరందరు ఏకమనస్కులై, సానుభూతి, సహోదర అనురాగముతో, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.”—1 పేతురు 3:8 NW.
1. మనందరి ముందు మనము ఎన్నుకోగల ఏ అవకాశం ఉన్నది, మన ఎంపిక మన భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపగలదు?
మానవజాతియొక్క అతి పురాతన వ్యవస్థయగు కుటుంబమునకు పై మాటలు ఎంత చక్కగా అన్వయిస్తాయి! ఈ రంగాలలో తల్లిదండ్రులు నాయకత్వం వహించుట ఎంత ప్రాముఖ్యము! పిల్లలలో తల్లిదండ్రుల అనుకూల లేక ప్రతికూల లక్షణాలు సహజంగానే కనిపిస్తాయి. అయినా వాటిని ఎన్నుకునే అవకాశం ప్రతి కుటుంబ సభ్యునికి ఉన్నది. క్రైస్తవులముగా మనము శరీర సంబంధమైన వారిగానైనా లేక ఆత్మీయ వ్యక్తులుగానైనా ఉండుటకు నిర్ణయించుకోవచ్చును. దేవుని సంతోష పెట్టుటకైనా లేక అసంతోష పెట్టుటకైనా నిర్ణయించుకోవచ్చును. ఆ నిర్ణయము ఆశీర్వాదము, నిత్యజీవము సమాధానాన్నైనా తెస్తుంది, లేక శాపాన్ని, శాశ్వత మరణాన్నైనా తెస్తుంది.—ఆదికాండము 4:1, 2; రోమీయులు 8:5-8; గలతీయులు 5:19-23.
2. (ఎ) కుటుంబము యెడల పేతురు ఎలా తన శ్రద్ధను కనపర్చాడు? (బి) ఆత్మీయత అంటే ఏమిటి? (అథఃస్సూచి చూడండి.)
2 మొదటి పేతురు 3 అధ్యాయము 8వ వచనములోని అపొస్తలుని మాటలు భార్యా భర్తలకు ఒక మంచి సలహా ఇచ్చిన తర్వాతనే చెప్పబడినవి. పేతురు నిజంగా క్రైస్తవ కుటుంబముల క్షేమమందు ఆసక్తి కలిగివున్నాడు. ఐక్యమైన, అనురాగము కరుణగల గృహమునకు బలమైన ఆత్మీయత కీలకమని ఆయనకు తెలుసు.a అందుకే ఆయన, భర్తలకు తానిచ్చిన ఉపదేశాన్ని వారు తృణీకరించినట్లయితే యెహోవాకు వారికి మధ్య ఆత్మీయంగా అగాధము ఏర్పడుతుందని 7వ వచనములో సూచిస్తున్నాడు. ఆయన తన భార్య అవసరతలను నిర్లక్ష్యంచేసి లేక ఆమెతో నిర్దయతో వ్యవహరిస్తే భర్త ప్రార్థనలకు అభ్యంతరము కలుగవచ్చును.
క్రీస్తు—ఆత్మీయతకు పరిపూర్ణమైన మాదిరి
3. పౌలు, భర్తలకు క్రీస్తు మాదిరిని ఎలా ఉన్నతపరచి చూపాడు?
3 కుటుంబ ఆత్మీయత మంచి మాదిరిపై ఆధారపడి ఉంటుంది. భర్త ఆచరణసిద్ధుడైన క్రైస్తవుడైతే, ఆత్మీయ లక్షణములను చూపుటలో ఆయన మాదిరినుంచుతాడు. విశ్వాసియైన భర్త లేని పక్షాన భార్యే సాధారణంగా ఆ బాధ్యత మోయవలసి వస్తుంది. ఏ పరిస్థితియైనా యేసు ఈ విషయంలో అనుసరించదగు పరిపూర్ణ మాదిరినుంచాడు. ఆయన ప్రవర్తన, మాటలు, ఆలోచన ఎల్లప్పుడు క్షేమాభివృద్ధికరమైనవిగా, విశ్రాంతిని కలిగించేవిగా ఉండెను. అనేకమారులు అపొస్తలుడైన పౌలు చదువరికి ప్రేమపూర్వకమైన క్రీస్తు మాదిరిని సూచించాడు. ఉదాహరణకు ఆయన ఇలా అంటున్నాడు: “క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.”—ఎఫెసీయులు 5:23, 25, 29; మత్తయి 11:28-30; కొలొస్సయులు 3:19.
4. ఆత్మీయతకు యేసు ఎటువంటి మాదిరి ఉంచాడు?
4 యేసు ఆత్మీయతకు ఉన్నతమైన మాదిరియేగాక, ఆయన తన శిరసత్వాన్ని ప్రేమ, దయ, కరుణతో ప్రదర్శించాడు. ఆయన స్వయం త్యాగియేగాని, స్వప్రీతిపరుడు కాదు. ఆయన ఎల్లప్పుడు తన తండ్రిని మహిమపరచి ఆయన శిరసత్వాన్ని గౌరవించాడు. ఆయన తన తండ్రి నడిపింపును అనుసరించాడు. అందుకే ఆయన ఇలా అనగలిగాడు: “నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను వినునట్లుగా తీర్పుతీర్చుచున్నాను. నన్ను పంపినవాని చిత్తప్రకారమే చేయగోరుదునుగాని నా యిష్టప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.” “నా అంతట నేనే యేమియుచేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.”—యోహాను 5:30; 8:28; 1 కొరింథీయులు 11:3.
5. తన అనుచరులకు ఆహారమిచ్చుటద్వారా, యేసు భర్తలకు ఏ మాదిరినుంచాడు?
5 భర్తలయెడల దీని భావమేమి? అంటే తన తండ్రి చిత్తానికి ఎల్లప్పుడు లోబడిన క్రీస్తు మాదిరిని వారు అనుకరించాలని దాని భావము. ఉదాహరణకు యెహోవా భూమిపైనున్న సమస్త ప్రాణులకు ఆహారమును ఎలా దయచేశాడో అలాగే యేసు తన అనుచరులకు ఆహారము దయచేశాడు. వారికి కావలసిన ప్రాథమిక అవసరతలను ఆయన విస్మరించలేదు. ఆయన 5,000 మంది పురుషులకు, 4,000 మందికి అద్భుతరీతిగా ఆహారము పెట్టుట, ఆయనకుగల శ్రద్ధ, బాధ్యతయొక్క గుర్తింపుకు నిదర్శనమైయున్నవి. (మార్కు 6:35-44; 8:1-9) ఆలాగే ఈనాడు, బాధ్యతగల కుటుంబ యజమానులు వారి గృహస్థుల భౌతిక అవసరతల యెడల శ్రద్ధవహిస్తారు. అయితే అంతటితోనే వారి బాధ్యత ముగుస్తుందా?—1 తిమోతి 5:8.
6. (ఎ) కుటుంబముయొక్క ఏ ప్రాముఖ్యమైన అవసరతలు తీర్చబడాలి? (బి) భర్తలు మరియు తండ్రులు ఏ అవగాహనను చూపగలరు?
6 యేసు సూచించినట్లు కుటుంబములకు వేరే మరింత ప్రాముఖ్యమైన అవసరతలు కూడ ఉన్నవి. అవి భావోద్రేక, ఆత్మీయ సంబంధమైనవి. (ద్వితీయోపదేశకాండము 8:3; మత్తయి 4:4) మనము కుటుంబములోను, సంఘములోను ఒకరిపై మరొకరము ఆధారపడి పనిచేస్తుంటాము. కావున మనలను క్షేమాభివృద్ధికరమైనవారిగా పురికోల్పేందుకు మనకు మంచి నడిపింపు అవసరము. ఈ విషయములో భర్తలు, తండ్రులు ప్రముఖపాత్ర వహించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా వారు పెద్దలు, లేక పరిచారకులైతే ఈ బాధ్యత వారికి ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒంటరివారైన తల్లి, లేక తండ్రికి తమ పిల్లలకు సహాయముచేసేందుకు అట్టి లక్షణాలు అవసరము. తల్లిదండ్రులు కుటుంబసభ్యులు చెప్పినదాన్ని అర్థంచేసుకోవడమేగాక, చెప్పకుండ ఉన్నదాన్నికూడా అర్థం చేసుకోవాలి. అందుకు వివేకము, సమయము, ఓపిక అవసరము. భర్తలు విషయాలను పరిగణలోనికి తీసుకొనగలవారై, భార్యలతో జ్ఞానముచొప్పున కాపురం చెయ్యాలని పేతురు చెప్పుటలో ఇది కూడా ఒక కారణమే.—1 తిమోతి 3:4, 5, 12; 1 పేతురు 3:7.
నిరోధించవలసిన ప్రమాదాలు
7, 8. (ఎ) కుటుంబము ఆత్మీయంగా ఓడ బ్రద్ధలైనట్లు కాకుండవలెనంటే ఏమి అవసరము? (బి) క్రైస్తవ విధానములో మంచి ప్రారంభముతోపాటు యింకేమి అవసరము? (మత్తయి 24:13)
7 కుటుంబ ఆత్మీయతయెడల శ్రద్ధవహించడం ఎందుకు అంత ప్రాముఖ్యం? దృష్టాంతపరచడానికి మనమిలా అడగవచ్చును, ఓడ నావికుడు లోతులేని మెట్టప్రాంతాలుగల జలములో ఓడను నడుపుతుంటే నావికుడు తనకు మార్గదర్శకంగా ఉన్న చార్టుకు ఎందుకు అంత ఎక్కువ శ్రద్ధనివ్వాలి? ఆగస్టు 1992లో సహజంగా పలుసార్లు నౌకాయాన పొరపాట్లు జరిగే ప్రాంతమైన ఇసుక తిప్పలు, రాళ్లున్న ప్రాంతంలో క్వీన్ ఎలిజబెత్ 2 (క్యుఇ2) అనబడే చిన్న నౌక నడిపించ బడింది. ఆ ప్రాంతపు నివాసి ఒకరు ఇట్లంటున్నారు: “ఆ ప్రాంతములో నడిపి ప్రమాదాలు చేసినందుకు చాలామంది నావికులు తమ ఉద్యోగాన్ని కోల్పోయారు.” క్యుఇ2 నీటి లోపలవుండే రాతి గుట్టను కొట్టుకుంది. ఆ పొరపాటు మూలంగా చాలా నష్టము సంభవించింది. ఓడ ప్రధాన భాగం మూడోవంతు దెబ్బతిన్నది. దానిమూలంగా కొన్నివారాలపాటు అది మరమ్మత్తుల నిమిత్తం నిలిపివేయబడింది.
8 అదేవిధంగా కుటుంబ “నావికుడు” దేవుని వాక్యమనే చార్టును జాగ్రత్తగా పరిశీలించకపోతే తన కుటుంబము సులభంగా ఆత్మీయ దెబ్బకు గురికాగలదు. పెద్ద లేక పరిచారకుని విషయంలో ఇలా జరిగితే సంఘములో తాను తన ఆధిక్యతలు కోల్పోవడం, మరియు ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర హాని సంభవించవచ్చును. అందుచేత ప్రతి క్రైస్తవుడు గతంలోని మంచి పఠన అలవాట్లను లేక ఆసక్తిని నమ్ముకొని దానితోనే ఆత్మీయంగా సంతృప్తి చెందకుండా జాగ్రత్త పడాలి. మన క్రైస్తవ గమనంలో కేవలము మంచి ప్రారంభాన్ని కలిగివుంటేనే సరిపోదు. ప్రయాణాన్ని విజయవంతంగా ముగించాలి.—1 కొరింథీయులు 9:24-27; 1 తిమోతి 1:19.
9. (ఎ) వ్యక్తిగత పఠనము ఎంత ప్రాముఖ్యము? (బి) అందుకు సంబంధించిన ఏ ప్రశ్నలు మనము వేసుకొనవచ్చును?
9 ఆత్మీయ సంబంధమైన మెట్టప్రాంతాలు, రాళ్లు, ఇసుక తిప్పలను తొలగించుకోవాలంటే క్రమంగా దేవుని వాక్యాన్ని పఠించుటద్వారా మన “చార్టు”తో ఎప్పటికప్పుడు పరిచయము కలిగివుండాలి. మనలను సత్యములోకి తెచ్చిన ప్రాథమిక పఠనముపైన మనము ఆధారపడి వుండలేము. మన ఆత్మీయబలము క్రమమైన, సమతుల్యమైన పఠనకార్యక్రమము మరియు సేవపై ఆధారపడివుంటుంది. ఉదాహరణకు మనము కనీసం ప్రస్తుతం చేతిలో పట్టుకొనివున్న ఇదే సంచికతో సంఘ కావలికోట పఠనమునకు హాజరయ్యేటప్పుడు మనలను మనము ఇలా అడుగుకొనవచ్చును, ‘నేను, లేక ఒక కుటుంబముగా మేము, ఈ శీర్షికను దానిలోని లేఖనాలను చూసి, దాని అన్వయింపును ధ్యానించి నిజంగా పఠించామా? లేక కేవలము సమాధానములను గుర్తింపు చేసుకొన్నామా? బహుశా, కూటమునకు హాజరుకాకముందు ఈ శీర్షికను చదవడానికి నిర్లక్ష్యము చేశామా? ఈ ప్రశ్నలకు యథార్థమైన సమాధానము మనలను తీవ్రంగా ఆలోచింపజేసి ఒకవేళ అలా అవసరమైతే మనలో అభివృద్ధి చెందాలనే కోరికను ఉత్తేజపరచవచ్చును.—హెబ్రీయులు 5:12-14.
10. స్వయం పరిశీలన ఎందుకు ప్రాముఖ్యము?
10 ఎందుకు అలాంటి స్వయం పరిశీలన ముఖ్యము? ఎందుకనగా మనము సాతాను ప్రభావంతో ఏలబడుతున్న లోకంలో, అంటే, దేవునియందూ ఆయన వాగ్దానములందూ మన విశ్వాసమును ప్రక్కకు మళ్లించడానికి అనేక కుతంత్ర మార్గాలలో ప్రయత్నించే లోకంలో జీవిస్తున్నాము. ఇది ఆత్మీయ విషయాలనుగూర్చి శ్రద్ధ వహించడానికి సమయమే లేదన్నంతగా మనలను పనిరద్దీలో ముంచివేయాలని కోరే లోకము. అందుచేత మనకై మనము ఇలా ప్రశ్నించుకోవచ్చును, ‘నా కుటుంబము ఆత్మీయంగా బలంగా ఉందా? నేను ఒక తండ్రిగా లేక తల్లిగా ఉండవలసినంత బలంగా ఉన్నానా? మేము ఒక కుటుంబంగా నీతి, యథార్థతను ఆధారం చేసికొని నిర్ణయాలు తీసుకొనడానికి సహాయపడే మనస్సును కలుగజేసే ఆత్మీయ శక్తిని వృద్ధిచేసుకొంటున్నామా?’—ఎఫెసీయులు 4:23, 24.
11. క్రైస్తవ కూటములు ఆత్మీయంగా ఎందుకు ప్రయోజనకరము? ఒక ఉదాహరణ ఇవ్వండి.
11 మన ఆత్మీయత అనేది మనం హాజరయ్యే ప్రతీ కూటంవలన దృఢపరచబడాలి. మనం సాతానుయొక్క విరోధపూరిత లోకంలో బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఎన్నోగంటలు గడిపిన తరువాత, రాజ్యమందిరంలో లేక సంఘపుస్తక పఠనంలో గడిపే ప్రశస్తమైన గంటలు మనకు సేదతీర్చేవైయుంటాయి. ఉదాహరణకు జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని పఠించడం ఎంత ఊరటగా ఉంటుంది! ఇది యేసు, ఆయన జీవితము, ఆయన పరిచర్యనుగూర్చిన మరెక్కువ అవగాహనను పొందడానికి మనకు సహాయపడింది. సూచించబడిన లేఖనములను జాగ్రత్తగా చదివి, వ్యక్తిగత పరిశోధనచేసి యేసు మనకు ఉంచిన మాదిరినుండి ఎంతో నేర్చుకొన్నాము.—హెబ్రీయులు 12:1-3; 1 పేతురు 2:21.
12. ప్రాంతీయ పరిచర్య మన ఆత్మీయతకు ఎలా పరీక్షగా ఉంటుంది?
12 మన ఆత్మీయతకు సరైన పరీక్ష మన క్రైస్తవ పరిచర్య. విభిన్నమైన లేక వ్యతిరేకించే ప్రజలమధ్య సాధారణ సాక్ష్యం, తటస్థ సాక్ష్యమివ్వడానికి మనలో సరైన ప్రేరణ, దేవునియెడల, పొరుగువారియెడల ప్రేమ అవసరము. అయినా మనలో ఎవరము ప్రాంతీయ పరిచర్యలో తిరస్కరించబడటానికి ఇష్టపడము. కాని మన పరిచర్యలో అలా జరగవచ్చును. అయితే తిరస్కరించబడేది మనం ప్రకటించే సువార్తేగాని, వ్యక్తిగతంగా మనం కాదనేదాన్ని గుర్తుంచుకోవాలి. యేసు ఇలా అన్నాడు: “లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోకసంబంధులైన యెడల లోకము తనవారిని స్నేహించును; అయితే మీరు లోక సంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. . . . అయితే వారు నన్ను పంపినవానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.”—యోహాను 15:18-21.
మాటలకంటే క్రియలే గట్టి సాక్ష్యమిస్తాయి
13. కుటుంబ ఆత్మీయతను ఒక వ్యక్తి ఎలా హరింపజేయగలడు?
13 కుటుంబములో ఇంటి పరిశుభ్రత, చక్కదిద్దు విషయంలో కేవలం ఒక సభ్యుడు తప్ప మిగతా వారంతా శ్రద్ధతీసుకుంటే అప్పుడేమి జరుగుతుంది? వర్షము కురిసే రోజున కేవలం మతిమరపువాడు తప్ప మిగతా వాళ్లంతా బురదకాళ్లతో ఇంట్లో ప్రవేశించకుండా జాగ్రత్తపడతారు. ఇల్లంతటా కనిపించే మట్టితోకూడిన పాదముద్రలు ఒకరి అజాగ్రత్తవలన ఇంట్లోవున్న ఇతరులకు అదనపు పని కల్పిస్తాయని సూచిస్తుంది. ఆత్మీయత విషయంలోను ఇదే అన్వయిస్తుంది. కేవలం స్వార్థంగల ఒకరి మూలంగా లేక ఒక వ్యక్తి నిర్లక్ష్య కారణంగా కుటుంబ పేరు ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతుంది. అందుచేత కేవలం తల్లిదండ్రులేగాక, కుటుంబములోనివారంతా క్రీస్తువంటి మనస్సును ప్రతిబింబించడానికి పోరాడాలి. అందరూ కలిసి నిత్యజీవపు దృష్టితో పనిచేస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది! ఆ కుటుంబపు మానసిక-రూపము ఆత్మీయంగా (స్వనీతి కాదు) ఉంటుంది. అలాంటి కుటుంబములో ఆత్మీయ సంబంధమైన నిర్లక్ష్యతను సూచించే గుర్తులు చాలా అరుదుగా ఉంటాయి.—ప్రసంగి 7:16; 1 పేతురు 4:1, 2.
14. వస్తుసంబంధమైన ఏ శోధనలను సాతాను మన ముందు పెడ్తాడు?
14 ప్రతిదినము మన జీవాన్ని పోషించుకొనడానికి అవసరమైన ప్రాథమిక భౌతిక అవసరతలు అందరికి ఉన్నాయి. (మత్తయి 6:11, 30-32) అయితే తరచు అవసరతలకంటె కోరికలు అధికమౌతాయి. ఉదాహరణకు సాతాను విధానము అన్నివిధములైన నూతన వస్తువులను, వాటిని కొనేదానికి వివిధ ప్రేరేపణ పద్ధతులను ఉపయోగిస్తుంది. మనకు ప్రతిసారి అతినూతనమైంది, తాజాఫ్యాషన్ కలదే కావలనుకుంటే ఎన్నటికి మనం తృప్తిపడలేము, ఎందుకంటే ఎప్పుడు క్రొత్తదాని స్థానంలో ఇంకో క్రొత్తది వస్తూనే ఉంటుంది, దానిలోనే మరో మోడల్ వస్తుంటుంది. వ్యాపారలోకం ఎప్పుడూ ఉల్లాసపరచే వాటిని ఎడతెరిపిలేకుండా రూపొందిస్తూనే ఉంటుంది. ఎన్నటికి తీరని మన కోరికలను తీర్చుకోవడానికి ఎప్పుడూ డబ్బు ఇంకా ఎక్కువ కావాలనే అది ప్రేరేపిస్తుంది. ఇది మనలను “హానికరములునైన అనేక దురాశలలో అవివేకయుక్తములును, ” లేక “నష్టములోను నాశనములోను ముంచివేయు” దానిలోకి నడుపగలదు. చివరకు సమతుల్యములేని జీవితము, ఆత్మీయ విషయాలకు చాలా తక్కువ సమయము గడిపే స్థితిగా పరిణమించగలదు.—1 తిమోతి 6:9, 10 ది జెరూసలేమ్ బైబిల్.
15. కుటుంబ శిరస్సుచూపే మాదిరి ఏవిధంగా ప్రాముఖ్యము?
15 మరలా ఇక్కడ క్రైస్తవ గృహమందలి శిరస్సు చూపే మాదిరి చాలా ప్రాముఖ్యమైనది. లౌకిక సంబంధమైన మరియు ఆత్మీయ సంబంధమైన బాధ్యతల విషయంలో ఆయన కలిగివుండే సమతుల్యమైన వైఖరి ఇతర కుటుంబ సభ్యులను ప్రేరేపించాలి. తండ్రి నోటితో చాలా మంచి ఉపదేశాన్ని చేస్తూ, తన స్వంత మాటల ప్రకారం జీవించకపోతే నిశ్చయంగా అది హానికరమే. నేను చెప్పినట్టు చెయ్, కాని నేను చేసినట్టు చెయ్యొద్దు అనే మాటవంటి జీవితాని పిల్లలు పసిగట్టగలరు. అలాగే ఇతరులను ఇంటింటి పరిచర్యలో పాల్గొనండని ప్రోత్సహించే పెద్ద లేక పరిచారకుడు, చాలా అరుదుగా తన కుటుంబంతో ఆ సేవలో పాల్గొంటుంటే తొందరలోనే ఇటు కుటుంబములోను, అటు సంఘములోను తన గౌరవాన్ని పోగొట్టుకుంటాడు.—1 కొరింథీయులు 15:58; మత్తయి 23:3ను పోల్చండి.
16. మనకై మనము ఏ ప్రశ్నలను అడుగుకొనవచ్చును?
16 అందుకే మనము మన జీవితాన్ని ప్రయోజనాత్మకంగా పరిశీలించుకోవాలి. ఆత్మీయ పురోభివృద్ధిని త్యాగంచేస్తూ దానిస్థానంలో లౌకికంగా విజయాన్ని పొందాలనే గమ్యముతో నింపబడివున్నామా? లోకాన్ని వెంబడించడంలో బాగా ముందుకుపోతూ, సంఘములో వెనుకబడి దిగజారి పోతున్నామా? పౌలు ఉపదేశాన్ని జ్ఞాపకముంచుకొనండి: “ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.” (1 తిమోతి 3:1) ఉద్యోగములో పొందే పదోన్నతి కంటే సంఘములో బాధ్యతను గుర్తించగల్గే భావం మన ఆత్మీయతనుగూర్చి ఎక్కువ చెబుతుంది. మన యజమానులు మనం యెహోవాకు కాకుండా వారికే సమర్పించుకున్నామన్నట్లు మనపై ఆధిపత్యమును చేయనివ్వకుండా తగిన జాగ్రత్తతో సమతూకాన్ని కాపాడుకొనవలసిన ఉన్నాము.—మత్తయి 6:24.
అర్థవంతమైన పరస్పర సంభాషణ ఆత్మీయతను పెంపొందించును
17. కుటుంబములో నిజమైన ప్రేమను పెంపొందించటానికి ఏమి దోహద పడుతుంది?
17 నిజానికి నేడు లక్షలాది గృహాలు తాత్కాలికంగా అద్దెకు తీసుకొనే వసతి గృహాలవలె తయారైనవి. ఎలా? కుటుంబ సభ్యులు కేవలం తినడానికి, పడుకోవడానికి మాత్రమే ఇంటికి వచ్చి వెంటనే బయటకు వెళ్లిపోతారు. అందరూ కలిసి భోజనపు బల్లవద్ద కూర్చొని భోజనం చేసేది బహు అరుదు. కుటుంబము అనే భావన తొలగిపోతుంది. ఫలితం? ఒకరి సమాచారం ఒకరికి తెలిసేది లేదు, సరైన సంభాషణ ఉండదు. తద్వారా అది ఇతర సభ్యులయెడల ఆసక్తి లోపించేలాగున చేయవచ్చును, బహుశా నిజమైన శ్రద్దే లేకుండా చేయవచ్చును. మనము ఒకరినొకరము ప్రేమిస్తున్నప్పుడు, మనము మాట్లాడటానికి, వినడానికి సమయము తీసుకుంటాము. ప్రోత్సహిస్తాము, సహాయము చేస్తాము. ఆత్మీయతయొక్క ఈ ఆకృతిలో భార్య భర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య చెప్పుకోతగినంత సంభాషణ ఇమిడివుంది.b మన ఆనందాలను, అనుభవాలను, సమస్యలను ఒకరినుండి మరొకరము తెలుసుకొని మాట్లాడుకొనుటకు సమయము, నేర్పు అవసరము.—1 కొరింథీయులు 13:4-8; యాకోబు 1:19.
18. (ఎ) పరస్పరం ఒకరితోనొకరు సమాచారమును పంచుకొనడానికి ఏది తరచు పెద్ద ఆటంకంగా ఉంటుంది? (బి) అర్థవంతమైన సంబంధాలు దేనిపై నిర్మించబడతాయి?
18 పరస్పరం చక్కగా ఒకరితోనొకరు సమాచారం పంచుకొనడానికి సమయము, ప్రయత్నము అవసరము. అనగా దానికి మాట్లాడుకొనేలా, ఒకరిని మరొకరు వినేలా సమయము కేటాయించుకోవడమని దాని భావము. ఇందుకుగల ముఖ్య ఆటంకాలలో ఒక పెద్ద ఆటంకమేమంటే సమయమును వ్యయపరస్తూ అనేక గృహాలలో గౌరవంగా ఎంచబడే సాధనము—టి.వి. ఇది ఒక సవాలును ముందుంచుతుంది. అదేమంటే—టి.వి మిమ్ములను అదుపులో పెట్టుకుందా లేక మీరు టి.వి.ని అదుపుచేస్తున్నారా? టి.విని అదుపులో ఉంచడానికి స్థిరమైన నిర్ణయం అవసరము. దానిని కట్టి చేయడానికి దృఢచిత్తం కూడా కావాలి. అలాచేస్తే కుటుంబ సభ్యులుగా లేక ఆత్మీయ సహోదర సహోదరీలగా కలిసిపోడానికి తగిన అవకాశాన్నిస్తుంది. అర్థవంతమైన సంబంధాలుండాలంటే పరస్పరం మంచి సంభాషణ, ఒకరినొకరు మన అవసరతలు, ఆనందాలను, అర్థంచేసుకోవడం, మనయెడల చేసిన దయగల పనులను మనమెంతగా మెచ్చుకుంటున్నామో ఒకరితో ఒకరము చెప్పుకోవడం అవసరం. ఇంకోమాటలో చెప్పాలంటే గుర్తించతగినంత సంభాషణ ఇతరులకు మనము కృతజ్ఞులమైయున్నామని, వారిని విలువగల వారిగా మనకు లెక్కిస్తున్నామని చూపును.—సామెతలు 31:28, 29.
19, 20. కుటుంబములో ఉన్నవారందరిపై మనము శ్రద్ధవహిస్తే, ఏమి చేస్తాము?
19 అందుచేత, కుటుంబ నిర్మాణంలో అనగా అవిశ్వాసులైన కుటుంబ సభ్యులతో సహా మనము ఒకరియెడల మరొకరము శ్రద్ధవహిస్తే, మనము మన కుటుంబ ఆత్మీయతను నిర్మించుకొని కాపాడుకొనుటలో ఎంతో పని చేసేవారమౌతాము. కుటుంబ నిర్మాణంలో పేతురు ఉపదేశాన్ని గైకొంటాము: “తుదకు మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయ మనస్కులునైయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.”—1 పేతురు 3:8, 9.
20 మన ఆత్మీయతను మనము కాపాడుకొనడానికి పోరాడితే, మనకు ఇప్పుడు కూడా యెహోవా ఆశీర్వాదము ప్రాప్తించవచ్చు, భవిష్యత్తులో పరదైసు భూమిపై నిత్యజీవ బహుమానము పొందేటప్పుడు ఆయన ఆశీర్వాదమును పొందేందుకును తోడ్పడుతుంది. మనము ఒక కుటుంబముగా ఒకరికొకరము ఆత్మీయంగా సహాయపడేందుకు చేయగల ఇతరవిషయాలు కూడా ఉన్నవి. దీన్ని తదుపరి శీర్షిక ఒక కుటుంబంగా కలిసి పనిచేయుటలోని ప్రయోజనాలను చర్చిస్తుంది.—లూకా 23:43; ప్రకటన 21:1-4.
[అధస్సూచీలు]
a ఆత్మీయత “మత విలువలయెడల అనుబంధము లేక సున్నితమైన స్పందనగా నిర్వచింపబడింది. ఆత్మీయమైన స్థితి లేక లక్షణము.” (వెబ్స్టర్స్ నైన్త్ న్యూ కాలేజియట్ డిక్షనరీ) ఆత్మీయ సంబంధమైన వ్యక్తి, శరీరసంబంధమైన, మృగప్రాయమైన వ్యక్తికి భిన్నంగా ఉంటాడు.—1 కొరింథీయులు 2:13-16; గలతీయులు 5:16, 25; యాకోబు 3:14, 15; యూదా 19.
b కుటుంబంలోని పరస్పర సంభాషణనుగూర్చి ది వాచ్‌టవర్ (ఇంగ్లీషు) సెప్టెంబరు 1, 1991, పేజీలు 20-2 చూడండి.
మీరు జ్ఞాపకంచేసుకోగలరా?
◻ ఆత్మీయత అంటే ఏమిటి?
◻ కుటుంబపు శిరసు క్రీస్తు మాదిరిని ఎలా అనుకరించగలడు?
◻ మన ఆత్మీయతకు ఎదురయ్యే బెదరింపులను ఎలా తొలగించుకొనగలము?
◻ కుటుంబ ఆత్మీయతను ఏది హరింపజేయగలదు?
◻ అర్థవంతమైన సంభాషణ ఎందుకు ప్రాముఖ్యము?
[12వ పేజీలోని చిత్రం]
సంఘ పుస్తక పఠనమునకు హాజరవడం కుటుంబమును ఆత్మీయంగా బలపరస్తుంది