బైబిలు ప్రామాణికత్వాన్ని ఎందుకు పరీక్షించాలి?
బైబిలును నీవెట్లు దృష్టిస్తావు? అది మానవునికి దేవుడనుగ్రహించిన ప్రత్యక్షత అని కొందరు దృఢంగా నమ్ముతున్నారు. కేవలము అదొక సామాన్య పుస్తకమని యితరులు నమ్ముతున్నారు. మరికొందరైతే ఏ నిర్ణయం చేసుకోలేకపోతున్నారు. బైబిలు మూలమును గూర్చి నీకేదైనా సందేహముంటే, దానిని పరీక్షించి ఆ సందేహాన్ని నివృత్తిచేసుకునే బలమైన కారణాలు ఉన్నాయి.
బైబిలు దేవుని వాక్యమని 18వ శతాబ్దము వరకు క్రైస్తవ మతసామ్రాజ్య దేశాలలో బహుగా గౌరవించబడింది. అయితే 19వ శతాబ్దము నుండి అనేకమంది విద్యావేత్తలు, విజ్ఞానశాస్త్రజ్ఞులు, వేదాంతులు, చర్చినాయకులు సహితం బైబిలు ప్రామాణికత్వాన్ని గూర్చిన సందేహాన్ని బాహాటంగా వ్యక్తపర్చడం మొదలు పెట్టారు.
కాబట్టి, బైబిలును గూర్చిన విమర్శ బహుగా ప్రబలినందున, అనేకమంది అందలి విషయాలను ఎరుగకయే బైబిలును నిరాకరిస్తున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యమందలి అనేకులు నేడు బైబిలువైపు చూచే బదులు మానవ తత్వములవైపు చూస్తున్నారు. అయినను, ఆధునిక తత్వశాస్త్రము సురక్షితమైన లేదా సంతోషకరమైన లోకాన్ని అందించలేకపోయింది. అందుకే బైబిలిచ్చే మార్గదర్శకము సంతోషానికి, విజయానికి నడిపించగలదేమో చూచేందుకు దానిని పరీక్షించుట ఒక మంచి కారణమైయుంది.
బైబిలు మానవజాతికి చూపుతున్న అద్భుత భవితవ్యాన్నిబట్టి దాని ప్రామాణికత్వాన్ని పరీక్షించుట మరొక కారణమైయుంది. ఉదాహరణకు, కీర్తన 37:29 యిలా అంటున్నది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” (ప్రకటన 21:3-5) అట్టి వాగ్దానములు నీపై ఎట్టి ప్రభావమును చూపుతున్నవి? బైబిలును నమ్మవచ్చునో లేదో పరీక్షించుటకు అవి నిశ్చయంగా తగిన కారణాలై ఉన్నాయి.
ఈ పత్రిక ఎల్లవేళల బైబిలు సత్యత్వాన్ని సమర్థిస్తూ దాని ప్రామాణికత్వానికి గల సాక్ష్యాధారాన్ని తరచు చూపుతూవచ్చింది. బైబిలు ప్రామాణికత్వాన్ని పరీక్షించగల రంగాలెన్నోవున్నాయి. కావలికోట యొక్క వివిధ సంచికలు యిటువంటి ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు నీకు దోహదపడగలవు: ప్రాచీన చరిత్రను గూర్చిన సుపరిచిత వాస్తవాలు బైబిలుతో ఏకీభవిస్తున్నవా? దాని ప్రవచనాలు కచ్చితమైనవా? దాని సలహా అభ్యాససిద్ధమేనా, లేక బైబిలుకు కాలం చెల్లిందని ఆధునిక విద్యావేత్తలు, తత్వవేత్తలు నిరూపించగల్గారా?
నీవు బైబిలు ప్రామాణికత్వాన్ని పరీక్షించగల మరొక రంగం భౌగోళికశాస్త్రం. అన్యమత పురాణాలు తరచు భౌగోళిక వాస్తవాలతో విభేదిస్తూ వుంటాయి. దృష్టాంతమునకు, మృతుల లోకమని పిలువబడేచోటికి చేయబడిన యాత్రలను గూర్చిన కథలెన్నో ప్రాచీనకాల ప్రజలు చెప్పారు. ప్రాచీన గ్రీకులను గూర్చి ఎ గైడ్ టు ది గాడ్స్ అనే పుస్తకము యిలా వివరిస్తున్నది: “సముద్రమనబడే విస్తారమైన నీరు చుట్టూ ఆవరించబడి భూమి బల్లపరుపుగా ఉన్నట్లు పరిగణింపబడింది. దీనికి ఆవలి భాగమున అంధకారముతో, ఫలములులేని వృక్షములతో ఎందుకూ పనికిరాని మరణానంతర లోకమున్నది.” ఇది కట్టుకథయని నిరూపించబడినప్పుడు, అన్యమత తత్వవేత్తలు తమ మరణానంతర లోకాన్ని గూర్చి అన్వేషించాల్సి వచ్చింది. “భూమి క్రింద ఒక అనువైన ప్రదేశము కనుగొనబడింది, అనేక సొరంగములతో ఆ లోకానికి సంబంధమేర్పరచబడింది,” అని గ్రంథకర్త రిచర్డ్ కార్ల్యన్ వివరించాడు. ఇది కూడా కల్పితమని నేడు మనకు తెలుసు. అట్టి క్రింది లోకంగాని దానికి మార్గంగాని లేనేలేదు.
ప్రాచీనప్రజల పుక్కిటి పురాణములందున్నట్లు, భూమి బల్లపరుపుగా ఉన్నదనే తప్పుడు అభిప్రాయము బైబిలు నందు లేదు. బదులుగా భూమి గుండ్రంగా ఉండి శూన్యములో వ్రేలాడుతున్నదన్న విజ్ఞానశాస్త్ర సత్యాన్ని అది పేర్కొంటున్నది. (యోబు 26:7; యెషయా 40:22) బైబిలులో పేర్కొనబడిన మరితర భౌగోళిక వివరాల సంగతేమిటి? అవి కల్పితాలేనా, లేక నేటి ఐగుప్తును, సీనాయి ద్వీపకల్ప పరిసరాలను, ఆధునిక ఇశ్రాయేలును దర్శిస్తున్నప్పుడు బైబిలు సంఘటనలను దృశ్యీకరించుకొనుట సాధ్యపడునా?
[3వ పేజీలోని చిత్రం]
“ఆయన భూమండలము మీద ఆసీనుడైయున్నాడు.”—యెషయా 40:22
“ఆయన . . . శూన్యముపైని భూమిని వ్రేలాడ చేసెను.”—యోబు 26:7