బైబిలు విమర్శకులను విస్మయపరచిన ఒకనాటి సామ్రాజ్యం
“ఇంతకుముందు అష్షూరీయుల సామ్రాజ్య చరిత్ర ప్రపంచ చరిత్ర పుటల్లో అస్పష్టంగా ఉండెను.” “ప్రాచీన నీనెవెను గూర్చి తెల్సిందల్లా పరోక్షంగా అక్కడక్కడి పూర్వగాథల్లో, బైబిలు ప్రవచనాల్లో మాత్రమే ఉంది, ఆలాగే డియోడొరెస్ సిక్లెస్, . . . మరియు ఇతరులు వ్రాసిన వ్రాతల్లో అష్షూరీయుల చరిత్రను గూర్చిన సాధారణ, క్లుప్త వివరాలున్నాయి.”—సైక్లోపీడియా ఆఫ్ బిబ్లికల్ లిటరేచర్, సంపుటలు 1, 3, 1862.
గ్రీకు చరిత్రకారుడైన డియోడొరెస్ సిక్లెస్ 2,000 సంవత్సరాల పూర్వం జీవించాడు. నీనెవె చతురస్రాకారపు పట్టణమని, దాని నలువైపుల మొత్తం పొడవు 480 స్టేడియాలని అతడు చెప్పాడు. అంటే దాని చుట్టుకొలత 96 కిలోమీటర్లు! బైబిలు కూడ అదే విధంగా తెలియజేస్తూ, “మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల” గొప్ప పట్టణమని నీనెవెను వర్ణించింది.—యోనా 3:3.
ప్రాచీనకాలమందు తెలియబడని ఒక పట్టణము అంత పెద్దగా ఎలావుండగలదని బైబిలు విమర్శకులు 19వ శతాబ్దమందు నమ్మలేదు. అసలు నీనెవె అనే పట్టణమే ఉనికిలో ఉండివుంటే, అది బబులోనుకంటె ముందున్న ప్రాచీన నాగరికతలో ఒక భాగమై యుండవచ్చునని కూడా వారన్నారు.
నోవహు ముని మనుమడైన నిమ్రోదు బాబెలు లేదా బబులోను ప్రాంతంలో మొదటి రాజకీయ రాజ్యాన్ని నిర్మించాడని చెప్పే ఆదికాండము 10వ అధ్యాయానికి ఈ అభిప్రాయము విరుద్ధమైయుంది. బైబిలు ఇంకనూ ఇలా చెప్పింది: “ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్టణము.” (ఆదికాండము 10:8-12) లేఖనము అష్షూరీయుల ఆ నాలుగు క్రొత్త పట్టణాల్ని కలిపి ఒక “మహా పట్టణమని” వర్ణించడాన్ని గమనించండి.
ఫ్రెంచి పురావస్తు శాస్త్రజ్ఞుడైన పాల్ ఎమిల్ బొటా, అష్షూరీయుల పట్టణంలో భాగమని రుజువైన ఒక రాజభవనపు శిధిలాల్ని 1843లో కనుగొన్నాడు. ఈ పరిశోధనా వార్తలు బయటి ప్రపంచానికి తెలిసినప్పుడు, అదెంతో ఉత్తేజాన్ని కల్గించింది. “ఆ రాజభవనం యెషయా 20:1లో అష్షూరీయుల రాజని చెప్పబడిన సర్గోనుదని రుజువు పర్చబడినప్పుడు ప్రజల ఆసక్తి మిన్నంటింది. ఆ రాజును గూర్చిన ఆధారం మరెక్కడా లేనందున, అంతవరకు అతని ఉనికిని సందేహించడం జరిగిందని” ఆలెన్ మిలార్డ్ తన పుస్తకమగు ట్రెజర్స్ ఫ్రం బైబిల్ టైమ్స్‌లో వివరించాడు.
ఇదే సమయంలో మరో పురావస్తు శాస్త్రజ్ఞుడైన ఆస్టన్ హెన్రీ లేయార్డ్, కొర్సెబాద్కు ఈశాన్యదిక్కుగా 42 కిలోమీటర్ల దూరాన నిమ్రద్ అనే ప్రదేశపు శిధిలాలను త్రవ్వడం ఆరంభించాడు. ఆ శిధిలాలు ఆదికాండము 10:11 నందు చెప్పబడిన అష్షూరీయుల ఆ నాలుగు పట్టణాల్లో ఒకటైన కాలహుకు సంబంధించినవని నిరూపించబడినవి. ఆ తర్వాత, 1849లో లేయార్డ్ కాలహుకు కొర్సెబాద్కు మధ్యనగల కుయెన్జిక్ అనే ప్రదేశంలో మరో పెద్ద రాజభవనపు శిధిలాల్ని వెలికితీశాడు. ఆ రాజభవనం నీనెవెలో భాగంగా నిరూపించబడింది. కొర్సెబాద్కు కాలహుకు మధ్య ఇతర నివాస స్థలాలతోపాటు కర్మెలాస్ అనే మట్టిదిబ్బ ఉంది. “నిమ్రద్ [కాలహు], కుయెన్జిక్ [నీనెవె], కొర్సెబాద్, కర్మెలాస్ల్లోని మట్టిదిబ్బలను నాలుగు మూలలుగా మనం తీసుకుంటే, “దాని నాలుగు దిక్కులు సరిగ్గా 480 స్టేడియాలకు లేదా 60 మైళ్ల భూపరిమాణమునకు అంటే [యోనా] ప్రవక్త మూడు దినముల ప్రయాణానికి సరిపోతుందని” లేయార్డ్ అభిప్రాయపడ్డాడు.
కాబట్టి, యోనా ఈ నివాస స్థలాలన్నింటిని కలిపి ఆదికాండము 10:11 నందు మొదట వ్రాయబడిన పట్టణపు పేరుతో అనగా, నీనెవె “మహా పట్టణమని” పిలిచాడు. అది నేడునూ నిజమైయుంది. ఉదాహరణకు, అసలు లండను నగరానికి దాని చుట్టుపట్ల ప్రాంతాలకు చాలా వ్యత్యాసముంది, వీటన్నింటిని కలిపి కొన్నిసార్లు అది “గ్రేటర్ లండన్” అని పిలవబడుతుంది.
గర్విష్టియైన అష్షూరు రాజు
నీనెవెలోని ఆ రాజభవనమందు దాదాపు మూడు కిలోమీటర్ల గోడలుగల 70 గదులు కలవు. ఈ గోడలపై సైనిక విజయాలు, సాధించిన ఇతర కార్యాల జ్ఞాపకార్థ ఉత్సవాల చెక్కడపు చిత్రాలు కాలగా మిగిలినవి ఉన్నవి. వాటిలో చాలావరకు పాడైపోయాయి. తానక్కడ నుండి ఇకవచ్చేసే ముందు లేయర్డ్ ఇంకా చెక్కుచెదరకుండావున్న ఒక గదిని కనుగొన్నాడు. దాని గోడలపై, ఒక దుర్భేద్యమైన నగరాన్ని వశపర్చుకోవడం, అలా ముట్టడివేసిన రాజు నగరం బయట కూర్చొనివుండగా, ఆయన ఎదురుగా బంధీలు కొనిపోబడ్డం చిత్రీకరించబడి ఉంది. రాజు పైభాగాన వ్రాయబడిన సంగతిని అష్షూరీయుల వ్రాతలందు ప్రవీణులైన వారు ఈ విధంగా అనువదిస్తున్నారు: “ప్రపంచానికే రాజైన, అష్షూరీయుల రాజగు సన్హెరీబు నిముదు సింహసనంపై ఆసీనుడై లాకీషు (లాకీసు) నుండి (తెచ్చిన) దోపుడుసొమ్మును పరిశీలించాడు.”
నేడు ఆ చిత్రాన్ని, దానిపైనున్న వ్రాతను బ్రిటీషు సంగ్రహాలయంలో చూడవచ్చును. ఇది బైబిల్లో 2 రాజులు 18:13, 14 నందు వ్రాయబడిన చరిత్రాత్మక సంఘటనతో పొందిక కలిగియున్నది: “రాజైన హిజ్కియా యేలుబడిలో పదునాలుగవ సంవత్సరమందు అష్షూరురాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములుగల పట్టణములన్నిటిమీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి—నావలన తప్పు వచ్చినది; నాయొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయిన యెడల నామీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరురాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరువందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను.”
యూదాపై సన్హెరీబు దండెత్తడం, హిజ్కియా కప్పం చెల్లించడాన్ని గూర్చిన అదనపు వివరాలుగల ఇతర వ్రాతలు నీనెవె శిధిలాల్లో కనుగొనబడ్డాయి. “హిజ్కియా నుండి అరువది మణుగుల బంగారం రూపంలో తీసుకున్న నిధిని గూర్చి రెండు విభిన్న వృత్తాంతాల్లో ఒకేవిధంగా ఉండడం బహుశ చారిత్రక వాస్తవాల్లోనే అరుదైన విషయం” అని లేయార్డ్ వ్రాశాడు. నిగూఢ అష్షూరు వ్రాతల్ని చదవడానికి సహాయపడిన హెన్రీ రాలిన్సన్, గోడలపై ఈ వ్రాతలు “[సన్హెరీబు] చారిత్రక గుర్తింపును పూర్తిగా వివాద రహితం చేశాయని” తెల్పాడు. అంతేకాదు, నీనెవె అండ్ బాబిలోన్ అనే తన పుస్తకంలో లేయార్డ్ ఇలా ప్రశ్నించాడు: “స్వయంగా సన్హెరీబు యుద్ధంచేసిన కాలంలోనే వ్రాయబడినట్లు హిజ్కియాకు సన్హెరీబుకు మధ్య జరిగిన యుద్ధాలనూ, బైబిల్లో వ్రాయబడిన అతిచిన్న వివరాల్ని సహితం రూఢిపరచే చరిత్ర, నీనెవె ఉండెనని గుర్తింపబడిన భూభాగంలో చెత్తాచెదారంగల మట్టిదిబ్బల క్రింద ఈ విషయాల్ని కనుగొనక పూర్వం బహుశ దాన్ని ఎవరు నమ్మివుండేవారు?”
అయితే సన్హెరీబు చరిత్రయందలి కొన్ని వివరాలు బైబిలుతో అంగీకరించవు. ఉదాహరణకు, పురావస్తు శాస్త్రజ్ఞుడైన ఆలన్ మిలార్డ్ యిలా వ్రాశాడు: “[సన్హెరీబు చరిత్ర] ముగింపునందు బహు స్పష్టమైన వాస్తవమొకటి కనబడుతుంది. ‘ఆ తర్వాత, నీనెవె’ నందలి సన్హెరీబునొద్దకు హిజ్కియా దూతలను, చెల్లించాల్సిన కప్పమంతటిని పంపించెను. అష్షూరీయుల సైన్యము దాన్ని సాధారణ విజయోత్సాహపు రీతిలో స్వదేశానికి తీసుకెళ్లలేదు.” అష్షూరు రాజు నీనెవెకు తిరిగివెళ్లకముందు ఆ కప్పం చెల్లించబడెనని బైబిలు తెల్పుచున్నది. (2 రాజులు 18:15-17) ఈ భేదమెందుకు? దుర్భేద్యమైన యూదా పట్టణమగు లాకీషుపై తన విజయాన్ని గూర్చి పలికినట్లు, యూదా ముఖ్యపట్టణమగు యెరూషలేమును జయించినట్లు సన్హెరీబు ఎందుకు ప్రగల్భాలు పలకలేకపోయాడు? దానికి ముగ్గురు బైబిలు రచయితలు జవాబిస్తున్నారు. వారిలో ప్రత్యక్షసాక్షియైన ఒక రచయిత యిలా వ్రాశాడు: “అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరువారి దండుపేటలో లక్ష యెనుబది యైదు వేలమందిని మొత్తెను; ఉదయమున జనులు లేవగా వారందరును మృతకళేబరములుగా ఉండిరి. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించెను.”—యెషయా 37:36, 37; 2 రాజులు 19:35; 2 దినవృత్తాంతములు 32:21.
ట్రెజర్స్ ఫ్రం బైబిల్ టైమ్స్ అనే తన పుస్తకములో మిలార్డ్ యిలా తీర్మానానికొచ్చాడు: “ఈ నివేదికను సందేహించడానికి ఏ మంచి కారణమూ లేదు . . . అది తనకు అవమానము గనుక, దాన్ని తన వారసులు చదవడానికి ఆ విపత్కర సంఘటనను గూర్చి సన్హెరీబు వ్రాయడనుట స్పష్టం.” బదులుగా, నీనెవెకు కప్పం పంపిస్తూ యూదాపై తాము జరిపిన దాడి విజయవంతమైందని, హిజ్కియా తమకు లోబడియున్నాడనే భావాన్ని కలుగజేయుటకు సన్హెరీబు ప్రయత్నించాడు.
అష్షూరీయ పుట్టుపూర్వోత్తరాలు రుజువాయెను
నీనెవెలో కనుగొనబడిన మట్టి పలకలు సహితం ఆయా గ్రంథాలయాల్లో వేలసంఖ్యలో ఉన్నవి. ఆదికాండము 10:11 సూచించినట్లే, అష్షూరీయుల సామ్రాజ్యం దక్షిణ బబులోనులో వేళ్లూనుకొనెనని ఈ పలకలు నిరూపిస్తున్నవి. ఈ సమాచారాన్ని ఆధారం చేసుకుని, పురావస్తు శాస్త్రజ్ఞులు దక్షిణాన తమ ప్రయత్నాలు కేంద్రీకరించడం ఆరంభించారు. ఎన్సైక్లోపీడియా బిబ్లికా యిలా వివరిస్తుంది: “అష్షూరీయుల ప్రాంతపు శిధిలాలన్నీ తమ పుట్టుక బబులోననే నిరూపిస్తున్నవి. వారి భాష, వ్రాసే విధానం, వారి సాహిత్యం, వారి మతం, శాస్త్రం కొద్దిపాటు మార్పులతో దక్షిణానగల వారి పొరుగువారి నుండి తెచ్చుకున్నవే.”
పైన ప్రస్తావించబడిన పరిశోధనా ఫలితాలు బైబిలు విమర్శకులు తమ అభిప్రాయాలు మార్చుకొనునట్లు చేశాయి. శ్రద్ధగాచేసిన బైబిలు నిశిత పరిశీలన అది జాగ్రత్తపరులును, నమ్మకస్థులునైన రచయితలచే వ్రాయబడిందనే విషయాన్ని బయలుపరుస్తుంది. అమెరికా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సాల్మన్ పి. చేస్ స్వయంగా బైబిలును పరిశోధించిన తర్వాత యిలా అన్నాడు: “అది గంభీరమైన, దీర్ఘకాలపు నిగూఢ పఠనం: నేనెల్లప్పుడూ లౌకిక విషయాల్లో జరిగించినట్లే ఈ మతవిషయపు సాక్ష్యాధారాలన్నింటిని ఉపయోగించి, బైబిలు మానవాతీత గ్రంథమని, అది దేవున్నుండి కల్గిందనే తీర్మానానికి వచ్చాను.”—ది బుక్ ఆఫ్ బుక్స్: ఎన్ ఇన్ట్రొడక్షన్.
బైబిలు నిజంగా కేవలం ప్రామాణిక చరిత్రకంటే ఎంతో ఎక్కువైయుంది. అది దేవుని ప్రేరేపిత వాక్యము, మానవ కళ్యాణానికి ఆయనిచ్చిన వరము. (2 తిమోతి 3:16) దీనికి సంబంధించిన రుజువును బైబిలు సంబంధిత భౌగోళికశాస్త్రాన్ని పరిశీలించుటద్వారా కనుగొనవచ్చును. ఇది తర్వాతి సంచికలో చర్చించబడును.
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
Courtesy of the Trustees of The British Museum
[6, 7వ పేజీలోని చిత్రాలు]
పైన: గోడమీది చిత్రాలనుండి సేకరించబడిన మూడు వివరములు
క్రింద: లాకీషును పట్టుకోవడాన్ని చూపిస్తున్న అష్షూరీయుల గోడమీది చిత్రం
[క్రెడిట్ లైను]
(Courtesy of The British Museum)
(From The Bible in the British Museum, published by British Museum Press)