యౌవనులారా—మీరు వెంబడించేదేమిటి?
“నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము.”—2 తిమోతి 2:22.
1. మన మధ్యనున్న యౌవనులయెడల మన నిరీక్షణ ఏమి?
“యెహోవాసాక్షులు, ప్రతిసంవత్సరం అత్యధిక సంఖ్యలో క్రొత్త సభ్యులను పొందుతున్న ఒక గుంపు అనియు, యిది యౌవస్థుల గొప్పగుంపును కల్గి వుందనియు” డేగన్ అనే స్వీడిష్ పెంటికోస్టల్ వార్తాపత్రిక ప్రకటించింది. బహుశ మీరు దేవునియెడల భయంగల్గి, శుద్ధమైన ఈ యౌవనుల గుంపులో భాగమై యుండవచ్చును. మీరు బాల్యంనుండి క్రైస్తవ పద్ధతిలో పెరిగియుండవచ్చు లేదా మీయంతటమీరు రాజ్యవర్తమానాన్ని విని, ప్రతిస్పందించి యుండవచ్చును. ఏమైనప్పటికినీ, మీరు మా మధ్య ఉన్నందుకు మేము ఆనందిస్తున్నాము. మీరు మొదటి శతాబ్దంలోని యథార్థవంతులైన యౌవన క్రైస్తవుల వలెనే, యథార్థమైన మార్గాన్ని వెంబడిస్తారని మా నిరీక్షణ. అపొస్తలుడైన యోహాను మాటలు మిమ్మును చక్కగా వర్ణించవచ్చు: “యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు.”—1 యోహాను 2:14
2. “ఈడు వచ్చినప్పుడు” నీతిని వెంబడించుటను కష్టతరంచేయగల కారకాలు ఏవి?
2 చాలామంది—ఔను క్రైస్తవ యౌవనులలో చాలామంది—ఈనాడు ప్రపంచపు ఒత్తిడులలో కూడా యథార్థంగా ఉంటున్నారు. అయితే మీరు అటువంటి మార్గాన్ని నిర్వహించడం సులభం కాదని గుర్తించి యుండవచ్చును. మీకు “ఈడు వచ్చినప్పుడు,” తీవ్రమైన, క్రొత్త భావాలతో ముంచెత్తే విధంగా మీరు భావించవచ్చును. (1 కొరింథీయులు 7:36) అదేసమయంలో, మీరు సంఘంలో, ఇంటిలో, పాఠశాల్లోకూడా బాధ్యతలు పెరుగుతున్నట్లు భావించవచ్చును. అపవాదియైన సాతానునుండి కూడా ఒత్తిడి కలదు. అతను ఏదెను వనంలో చేసినట్లుగానే—ప్రమాదపుటంచున కన్పించేవారిపైబడి సాధ్యమైనంతమందిని మోసపుచ్చుటకు నిర్ణయించుకున్నాడు. ఆనాడు, అతడు తన అనునయపూరిత మోసాన్ని ఎక్కువ జ్ఞానవంతుడైన, పెద్దవాడైన ఆదాముపై కాకుండా, ఆదాముకంటే తక్కువ అనుభవంకల్గిన చిన్నదైన హవ్వపై కేంద్రీకరించాడు. (ఆదికాండము 3:1-5) శతాబ్దాల తరువాత, సాతాను అదేరకమైన ఎత్తుగడలను అనుభవంలేని కొరింథు సంఘంలోని క్రైస్తవులపై ప్రయోగించాడు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రతనుండియు ఎట్లయిన తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.”—2 కొరింథీయులు 11:3.
3, 4. అపవాదియైన సాతాను యౌవనులను తప్పుదోవపట్టించుటకు ఉపయోగించే కొన్ని సాధనాలేవి, మరియు దాని ఫలితమేమి?
3 ఈనాడు, మీ క్రైస్తవ తలిదండ్రులు మీయెడలకూడ అదేరకమైన భయంకల్గి యుండవచ్చును. మీరు చెడు అభిరుచులను కల్గియున్నారని కాదుగాని, ప్రాముఖ్యంగా యౌవనులు సాతాను “తంత్రముల” దాడికి అనువైయున్నారని అనుభవమునుబట్టి వారికి తెలుసు. (ఎఫెసీయులు 6:11, అథస్సూచి) మోసగాడైన సాతాను కుతంత్రాలు అపాయకరంగా కన్పించుటకు బదులు, అవి సంతుష్టపరిచేవిగా, కోరదగినవిగా కన్పించేటట్లు చేయబడ్డాయి. దూరదర్శిని ఐశ్వర్యాశక్తిని, లైంగికతను, దౌర్జన్యాన్ని, అభిచారాన్ని వినోదంవలే మంచిగా అందిస్తుంది. యౌవనుల మనస్సు ‘సత్యము, మాన్యము, న్యాయము, పవిత్రము, రమ్యము’ కాని వేటితోనైననూ నిండిపోవచ్చును. (ఫిలిప్పీయులు 4:8) తోటివయస్కుల ఒత్తిడి అనేది సాతానుకున్న మరియొక బలమైన సాధనం. వారివలెనే జీవనవిధానం, దుస్తులు, తలదువ్వుకొనడం ఉండాలని తోటివయస్కులు మిమ్మును తీవ్రంగా ఒత్తిడి చేయవచ్చును. (1 పేతురు 4:3, 4) “యౌవనులకు ఒకవేళ ఎవరైనా ఒక లౌకిక దేవుడంటూవుంటే, అనురూపతే వారి దేవుడు. . . . తోటివయస్కులకు వేరుగా ఉండడమంటే యౌవనుల దృష్టిలో ఒకరికి జరిగే విషయాల్లోకెల్లా చాలా ఘోరమైంది” అని వార్తాపత్రికా రచయిత విలియమ్ బ్రౌన్ అభిప్రాయపడ్డాడు. ఇటలీలో ఒక యౌవనసాక్షి ఇలా ఒప్పుకుంది: “నేను ఒక యెహోవాసాక్షినని నా తోటివిద్యార్ధులకు తెలుపుటకు సిగ్గుపడ్డాను. ఎందుకంటే నా విషయంలో యెహోవా సంతోషించడని నాకు తెలుసు కాబట్టి, నేను దుఃఖంతో కృంగిపోయాను.”
4 మోసపోవద్దు—సాతాను మిమ్ములను నాశనానికి నడిపించాలనే కోరుతున్నాడు. లోకంలోని యౌవనులు చాలామంది తప్పుమార్గంలో పోవుటకు తమకుతామే అనుమతించుకున్నారు గనుక మహాశ్రమలకాలంలో వారు జీవితాల్ని పోగొట్టుకుంటారు. (యెహెజ్కేలు 9:6) దానినుండి తప్పించుకొనే ఒకేఒక్క మార్గమేదనగా ఏది మంచిదో దానిని వెంబడించడమే.
దుష్టసాంగత్యము విషయంలో జాగ్రత్తపడుము
5, 6. (ఎ) యౌవనుడైన తిమోతి ఎఫెసులో నివసించుచుండగా ఏ సవాలులను ఎదుర్కొన్నాడు? (బి) తిమోతికి పౌలు యిచ్చిన సలహా ఏమిటి?
5 ఇది యౌవనుడైన తిమోతికి అపొస్తలుడైన పౌలు ఇచ్చిన హెచ్చరికలోని సారాంశమైయుండెను. పది సంవత్సరాలకుపైగా, తిమోతి అపొస్తలుడైన పౌలుతోపాటు తన మిషనరీ ప్రయాణంలోకూడా ప్రయాణించాడు. ఒక సందర్భంలో తిమోతి అన్యుల పట్టణమైన ఎఫెసులో సేవచేస్తున్నప్పుడు, మరణశిక్షకు ఎదురుచూస్తూ పౌలు రోమీయుల చెరసాలలో ఉన్నాడు. తన మరణకాలం సమీపిస్తూండగా, నిస్సందేహంగా పౌలు తిమోతి ఏమైపోతాడోనని చింతించాడు. ఎఫెసు పట్టణము దాని సంపన్నతకు, అవినీతికి, నీచమైన వినోదాలకు ప్రఖ్యాతిగాంచింది, కాగా తిమోతికి ఇక తన ప్రియ సలహాదారుని సహాయం ఉండదు.
6 కాబట్టి పౌలు తన “ప్రియకుమారునికి” ఈ క్రింది విధంగా వ్రాశాడు: “గొప్ప యింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమేగాక కర్రవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.”—2 తిమోతి 1:2; 2:20-22.
7. (ఎ) పౌలు హెచ్చరిక చేసిన ‘ఘనహీనమైన పాత్రలు’ ఎవరైయుండిరి? (బి) పౌలు మాటలను ఈనాటి యౌవనులు యేవిధంగా అన్వయించుకోవచ్చును?
7 ఆ విధంగా తోటి క్రైస్తవులలో సహితం ‘ఘనహీనమైన పాత్రలు’ అనగా, తాముగా సరిగా ప్రవర్తించని వ్యక్తులుంటారని పౌలు తిమోతికి హెచ్చరిక చేశాడు. ఆ కాలంలో అభిషక్త క్రైస్తవులైన కొందరితో సహవసించడమే తిమోతికి హానికరమైతే, ఈనాడు లోకస్థులతో సహవాసమనేది ఒక యౌవన క్రైస్తవునికి మరి యెంతటి హానికరమో కదా! (1 కొరింథీయులు 15:33) మీ తోటివిద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండకూడదని దీని భావంకాదు. కాని కొన్నిసమయాలలో అది మిమ్మును ఏకాకిగా కన్పించేటట్లు చేసినప్పటికి, వారితో మీరు మితిమీరి సహవసించకుండా జాగ్రత్త పడండి. ఇది చాలా కష్టమైనది కావచ్చు. “ఇది చాలా కష్టం. యౌవన క్రైస్తవులకు తగని స్థలాలకు, విందులకు నా తోటివిద్యార్థులు ఎప్పుడూకూడ నన్ను ఆహ్వానించేవారు. ‘ఏమిటి! నీవు రావడం లేదా? నీవు చాలా పిచ్చిదానివి!’ అని వారంటారని” ఒక బ్రెజిలియన్ బాలిక చెబుతుంది.
8, 9. (ఎ) ఏవిధంగా సహవాసము, అది మంచిగా కన్పించే లోకస్థులతో అయినను, ఒక క్రైస్తవునికి అపాయాన్ని తెచ్చిపెట్టగలదు? (బి) మీరు మంచి స్నేహితులను యెక్కడ కనుగొనగలరు?
8 లోకస్థులైన యౌవనులు కొందరు కేవలం పొగత్రాగరు, దుర్భాషలాడరు, అవినీతికరమైన లైంగికతలో పాల్గొనరు కాబట్టి వారు మంచిగా కన్పించవచ్చును. కానీ, వారు నీతిని వెంబడించనట్లయితే, వారి శారీరక ఆలోచనలు, దృక్పథాలు మీపై సులభంగా ప్రభావం చూపవచ్చును. దానికితోడు, ఎంతవరకూ మీరు అవిశ్వాసితో పొత్తుకల్గి ఉండగలరు? (2 కొరింథీయులు 6:14-16) అంతెందుకు, మీరెంతో ప్రియముగా హత్తుకొన్న ఆత్మీయ విలువలు వారికి “వెర్రితనముగా” ఉన్నవి! (1 కొరింథీయులు 2:14) మీ నియమాలతో రాజీపడకుండా వారి స్నేహాన్ని మీరు కొనసాగించగలరా?
9 కాబట్టి హానికరమైన సహవాసాలను విసర్జించండి. యెహోవాను నిజంగా ప్రేమించే ఆత్మీయ మనసు కల్గిన క్రైస్తవులకు మాత్రమే మీ సహవాసాన్ని పరిమితం చేయండి. క్రైస్తవ సంఘంలోని ప్రతికూల భావాలుగల లేదా విమర్శనాత్మకమైన బుద్ధిగల యౌవనుల యెడలకూడ జాగ్రత్తవహించండి. మీరు ఆత్మీయంగా వృద్ధి అయ్యేకొలది, స్నేహితులను ఎన్నుకోవడంలో మీ అభిరుచి బహుశ మారవచ్చు. “నేను వేర్వేరు సంఘాలలోని క్రొత్త మిత్రులతో సహవాసం చేస్తూవున్నాను. ఇది లోకసంబంధమైన మిత్రులు ఎంత అనవసరమో నేను గుర్తించేటట్లు చేసిందని” ఒక యౌవనసాక్షి చెబుతుంది.
చెడుతలంపులను విడిచి పారిపోవుట
10, 11. (ఎ) “యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము” అనే దాని భావమేమైయున్నది? (బి) ఒకడు యేవిధంగా ‘జారత్వమునకు దూరముగా పారిపోగలడు’?
10 “యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము” అని కూడా పౌలు తిమోతికి ఉద్బోధించాడు. మీరు యౌవనంలో నున్నప్పుడు, పేరుగాంచాలని, హాస్యమాడాలని, లేదా లైంగిక కోరిక తీర్చుకోవాలని యిష్టపడవచ్చును. పరిశీలించకుండా వదలినట్లయితే, అటువంటి కోరికలు మిమ్మును పాపమునకు నడుపవచ్చును. అందుచేతనే ఒకని ప్రాణము అపాయస్థితిలో ఉన్నంతగా, హానికరమైన వాంఛలను విడిచి పారిపొమ్మని పౌలు చెప్పాడు.a
11 ఉదాహరణకు, లైంగిక వాంఛ చాలామంది యౌవన క్రైస్తవులను ఆత్మీయ వినాశనానికి నడిపించింది. అందుచేతనే, మంచి కారణమును బట్టి, “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని బైబిలు మనకు చెబుతుంది. (1 కొరింథీయులు 6:18) స్త్రీ పురుషులుకలసి జంటగా తిరిగే సమయంలో, డేటింగ్ చేసే సమయంలో నిలిచియున్న కారులో లేదా ఒక మేడగదిలో ఇద్దరు మాత్రమే ఉండి—శోధించే పరిస్థితులను విసర్జించడం ద్వారా ఈ సూత్రాన్ని అనువర్తించుకోవచ్చును. మీతోపాటు ఒక తోడు తీసుకెళ్లడం పాతకాలపు పద్ధతిగా కన్పించవచ్చుగాని, అది నిజంగా ఒక రక్షణ కాగలదు. అనురాగంతో కూడిన కొన్ని మాటలు, క్రియలు సరియైననూ, అదేసమయంలో అపవిత్రమైన ప్రవర్తనను విసర్జించేందుకు సహేతుకమైన హద్దులను ఏర్పరచవలెను. (1 థెస్సలొనీకయులు 4:7) వ్యభిచారమును విడిచి పారిపోవుటలో చెడు తలంపులను రేకెత్తించే టివి ప్రదర్శనలను లేదా చలనచిత్రాలను విసర్జించడం కూడ యిమిడివుంది. (యాకోబు 1:14, 15) అనుకోకుండానే అవినీతికరమైన తలంపులు మీ మనస్సులో ప్రవేశించినట్లయితే, మనస్సులోనే ఆ అంశాన్ని మార్చుకోండి. షికారుకు వెళ్లండి; ఏదైనా చదవండి; ఏదైనా ఇంట్లో మామూలుగా చేసేపనిని చేయండి. ముఖ్యంగా ఈ విషయంలో ప్రార్థన ఒక బలమైన సహాయకం.—కీర్తన 62:8.b
12. చెడును ద్వేషించుటను మీరెలా నేర్చుకోగలరు? వివరించండి.
12 అతి ప్రాముఖ్యంగా, మీరు చెడును ద్వేషించుటను, తిరస్కరించుటను, అసహ్యించుటను నేర్చుకోవాలి. (కీర్తన 97:10) మొదటిసారి హాస్యంగాను లేదా ఆనందంగానున్న దానిని మీరెలా ద్వేషిస్తారు? ఫలితాలను గూర్చి ఆలోచించడం ద్వారానే! “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును.” (గలతీయులు 6:7, 8) మోహానికి దాసోహమయ్యేలా శోధించబడినప్పుడు, ఒకడు దానికి లొంగిపోయినట్లైతే అది యెహోవాను యేవిధంగా నొప్పింస్తుందో—ఆ తీవ్రమైన ఫలితమేమిటో ఆలోచించండి. (కీర్తన 78:41 పోల్చండి.) అక్కరలేని గర్భం లేదా ఎయిడ్స్ వంటి రోగాలు సోకే అవకాశాన్ని గురించికూడ ఆలోచించండి. మీరు అనుభవించబోయే మానసిక రుగ్మత, కోల్పోయే ఆత్మగౌరవాన్ని ఆలోచించండి. దీర్ఘకాలికంగా అనుభవించే ఫలితాలు కూడ ఉండవచ్చును. ఒక క్రైస్తవ స్త్రీ ఈవిధంగా ఒప్పుకుంటుంది: “మేమిద్దరం ఒకరినొకరు కలసుకొనే ముందు నాభర్త, నేను ఇతరులతో లైంగిక సంబంధం కల్గియుంటిమి. ఈనాడు మేమిద్దరం క్రైస్తవలమైనప్పటికి, మా గత లైంగిక జీవితం మా వివాహంలో వాదనకు, పట్టుదలకు మూలమైంది.” అలక్ష్యం చేయబడదుగాని, మీకున్న దైవీక ఆధిక్యతలను కోల్పోవుటగాని లేదా క్రైస్తవ సంఘంనుండి బహిష్కరించబడే అవసరతగాని ఏర్పడుతుంది! (1 కొరింథీయులు 5:9-13) క్షణికమైన ఎటువంటి ఆనందమైనా ఇంత మూల్యం కల్గినదా?
యెహోవాతో దగ్గర సంబంధాన్ని సంపాదించుకొనుటకు ప్రయాసపడుట
13, 14. (ఎ) చెడుకు దూరంగా పారిపోవుట మాత్రమే ఎందుకు సరిపోదు? (బి) ఒకడు ఏవిధంగా ‘యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించగలడు’?
13 ఏమైనప్పటికీ, చెడుకు దూరంగా పారిపోవడం మాత్రమే సరిపోదు. “నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుమని” కూడ తిమోతి ఉద్బోధింపబడ్డాడు. ఇది శక్తియుత పనిని సూచిస్తుంది. అదేసరళిలో ప్రవక్తయైన హోషేయ అవిశ్వాసులైన ఇశ్రాయేలు జనాంగాన్ని యిలా వేడుకున్నాడు: “మనము యెహోవాయొద్దకు మరలుదము రండి . . . యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి.” (హోషేయ 6:1-3) మీకై మీరు అలాంటి పనిని చేపట్టారా? కేవలం కూటములకు హాజరు కావడం, ప్రాంతీయసేవలో మీ తలిదండ్రులతోకూడా వెళ్లడంకంటే ఎక్కువ దీనిలో యిమిడివుంది. ఒక క్రైస్తవ స్త్రీ ఇలా ఒప్పుకుంది: “నా తలిదండ్రులు నన్ను సత్యంలో పెంచారు, నేను చిన్నతనంలోనే బాప్తిస్మం పొందాను. . . . నేను కూటమునకు వెళ్లకుండా ఉండడం చాలా అరుదు, నేనెప్పుడూ ఏనెలలోకూడ సేవకు వెళ్లకుండాలేను, కాని నేనెన్నడూ యెహోవాతో వ్యక్తిగతంగా దగ్గర సంబంధాన్ని వృద్ధిచేసుకోలేదు.”
14 యెహోవాను ఎక్కువగా అడ్డుపడే ఒక ఆత్మగా దృష్టించి, ఆయనను ఒక స్నేహితునిగా, తండ్రిగా తెలుసుకొనుటలో విఫలమయ్యానని మరొక యౌవనస్థురాలు అంగీకరిస్తున్నది. ఆమె అవినీతికరమైన అపరాధంలోపడి, 18 వ ఏటనే ఒక వివాహంగాని తల్లిగా మారింది. అలాంటి పొరపాటునే చేయవద్దు! హోషేయ కోరినట్లుగా, “యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించండి.” ప్రార్థనద్వారా, ప్రతిదినమూ యెహోవాతోపాటు నడచుటద్వారా, మీరాయనను మీ చెలికానిగా చేసుకోవచ్చును. (మీకా 6:8; యిర్మీయా 3:4 పోల్చండి.) ఒకవేళ మనమాయనను వెదకినట్లయితే “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:27) కాబట్టి ఒక క్రమ వ్యక్తిగత బైబిలు పఠన కార్యక్రమమనేది ప్రాముఖ్యమైయుంది. అటువంటి దినచర్య విస్తారమైందిగాను లేదా క్లిష్టమైందిగాను ఉండనవసరం లేదు. “ప్రతిరోజూ 15 నిమిషాలపాటు బైబిలు చదువుతానని,” మెలొడి అనే ఒక యౌవన బాలిక చెబుతుంది. ది వాచ్‌టవర్ మరియు అవేక్! ప్రతిసంచికలనూ చదువుటకు సమయాన్ని కేటాయించుకోండి. సంఘకూటములకు సిద్ధపడండి తద్వారా మీరు “ప్రేమచూపుటకును, సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు [ఇతరులను] పురికొల్ప” వచ్చును.—హెబ్రీయులు 10:24, 25.
మీ హృదయాన్ని మీ తలిదండ్రులకు యివ్వండి
15. (ఎ) ఎందుకు కొన్ని సమయాలలో ఒకడు తన తలిదండ్రులకు లోబడియుండుట కష్టము? (బి) ఎందుకు లోబడియుండుట సాధారణంగా ఒక యౌవనస్థునికి ప్రయోజనకరమై యుంది?
15 దైవభయముగల్గిన తలిదండ్రులు నిజమైన సహాయము, అండకు మూలం కాగలరు. కాని మీరు చేయవలసిన దానిని గుర్తించండి: “పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండండి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.” (ఎఫెసీయులు 6:1-3) నిజమే, మీరు పెద్దవాళ్లవుతున్నారు, బహుశ మీరు ఎక్కువ స్వాతంత్ర్యం కోరవచ్చు. పెరుగుతున్న కొలది మీరు మీ తలిదండ్రుల హద్దులనుగూర్చి ఎరిగినవారై యుండవచ్చును. “మన మానవ తలిదండ్రులు కేవలం వారు మంచిదని అనుకున్నదానినే చేయగలరు.” అని అపొస్తలుడైన పౌలు అంగీకరించాడు. (హెబ్రీయులు 12:10, ది జెరూసలెమ్ బైబిల్) అయినప్పటికి, మొత్తానికివచ్చే ప్రయోజనాలను పరిశీలిస్తే, యింకనూ వారికి లోబడుట మీకే ప్రయోజనకరం. ఇతరులకంటే మీ తలిదండ్రులే మిమ్మును ప్రేమిస్తారు, మరియు మీగురించి బాగుగా తెలుసినవారు. ఎల్లప్పుడూ మీరు వారితో ఏకీభవించకపోయినను, వారి హృదయంలో మీకొరకు మంచినే కల్గియుంటారు. “ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను” మిమ్ములను పెంచుటకు వారు చేసే ప్రయత్నాలను ఎందుకు ప్రతిఘటిస్తారు? (ఎఫెసీయులు 6:4) నిజంగా, ఒక మూఢుడు మాత్రమే “తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును.” (సామెతలు 15:5) జ్ఞానంగల్గిన ఒక యౌవనుడు తన తలిదండ్రుల అధికారాన్ని గుర్తించి, సరియైన గౌరవాన్ని చూపుతాడు.—సామెతలు 1:8.
16. (ఎ) ఎందుకు యౌవనులు సమస్యలను తమ తలిదండ్రుల నుండి మరుగుచేయడం అవివేకమైనది? (బి) యౌవనులు తమ తలిదండ్రులతో సంభాషణను వృద్ధిచేసుకొనుటకు ఏమి చేయవచ్చును?
16 మీ తలిదండ్రులతో సత్యం మాట్లాడుట, సత్యానికి సంబంధించిన వేధించే అనుమానాలు లేదా సంశయాత్మక ప్రవర్తనకు సంబంధించిన పొరపాటువంటి ఏదైనా సమస్య మీకు ఉన్నట్లయితే వారికి తెలియజేయుట కూడ దానిలో యిమిడివుంది. (ఎఫెసీయులు 4:25) తలిదండ్రులకు తెలియకుండా దాచిన అటువంటి వ్యాకులపెట్టు పరిస్థితులు ఎక్కువ సమస్యలను సృష్టిస్తాయి. (కీర్తన 26:4) నిజమే, కొందరు తలిదండ్రులు సంభాషించుటకు అంతగా ప్రయత్నించరు. “నా తల్లి ఎప్పుడూకూడ కూర్చుని నాతో మాట్లాడదు, నాకెప్పుడూకూడ నా భావాలను చెప్పుకునే ధైర్యం లేదు ఎందుకంటే ఆమె నన్ను విమర్శిస్తుందని భయపడతానని” ఒక యౌవన బాలిక ఫిర్యాదు చేసింది. మీరొకవేళ అదేపరిస్థితిలో ఉన్నట్లయితే, తెలివిగా ఒక మంచి సమయాన్ని ఎన్నుకుని మీ భావాలను మీ తలిదండ్రులకు తెలియజేయండి. “నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము” అని సామెతలు 23:26 ఉద్బోధిస్తుంది. తీవ్రమైన సమస్యలు వృద్ధిగాకుండక ముందే, మీ చింతలనుగూర్చి వారితో క్రమంగా సంభాషించడానికి ప్రయత్నించండి.
నీతిని వెంబడిస్తూనే ఉండండి!
17, 18. నీతిని ఎడతెగకుండా వెంబడించుటకు ఒక యౌవనునికి సహాయపడేదేమిటి?
17 పౌలు తన రెండవ పత్రిక ముగింపునందు తిమోతిని యిలా ఉద్బోధించాడు: “నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలుకడగా ఉండుము.” (2 తిమోతి 3:14, 15) మీరుకూడ అలాగే చేయండి. మీరు వెంబడిస్తున్న నీతినుండి మిమ్మును ఎవరైనా లేక ఏదైనా మభ్యపెట్టి తీసుకుపోనియ్యవద్దు. సాతాను లోకం—దాని ప్రలోభాల వలన—దుర్మార్గతతో పొర్లిపోయింది. తొందరలోనే అది దానిలో భాగమైన వారంతా సంపూర్ణనాశనాన్ని అనుభవిస్తారు. (కీర్తన 92:7) సాతానుమూకతో పాటు నాశనంగాకుండుటకు నిశ్చయించుకోండి.
18 ఈ ఉద్దేశ్యమును మనస్సులో పెట్టుకుని, మీ గురులను, కోరికలను, అభిరుచులను మీరు తదేకంగా పరీక్షించాలి. మీకై మీరు, ‘నా తలిదండ్రులు, సంఘసభ్యులు చూడని సమయంలో మాట్లాడుటలోను, ప్రవర్తించుటలోను నేను ఉన్నతప్రమాణాలను కనబరుస్తున్నానా? ఎలాంటి స్నేహితులను నేనెన్నుకుంటాను? నా దుస్తులు, తలదువ్వుకొనుటను లోకస్నేహితులు ఆదేశిస్తారా? నాకోసం నేను ఏ గురులను పెట్టుకున్నాను? నా హృదయాన్ని పూర్తికాలసేవపైనా—లేక నాశనం కాబోతున్న సాతాను లోకంలోని ఉద్యోగంపై కేంద్రీకరించానా?’ అని ప్రశ్నించుకోండి.
19, 20. (ఎ) ఒక యౌవనుడు యెహోవా కోరేవాటినిబట్టి ఎందుకు భీతిచెందకూడదు? (బి) ఏ యేర్పాటులనుండి యౌవనులు ప్రయోజనం పొందగలరు?
19 బహుశ మీ ఆలోచనలలో కొన్ని మార్పులు చేసుకొనే అవసరతను మీరు చూస్తారు. (2 కొరింథీయులు 13:11) మీరు చిక్కులలో మునిగి పోయినట్లు భావించవద్దు. సహేతుకమైన దానికంటే ఎక్కువ యెహోవా మిమ్మును కోరడు. ప్రవక్తయైన మీకా ఇలా అడిగాడు: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవునియెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.” (మీకా 6:8) మీకు సహాయంచేయుటకు యెహోవా చేసిన యేర్పాటులను మీరు వినియోగించుకున్నచో అది అంత కష్టతరం కాదు. మీ తలిదండ్రులకు అతి సన్నిహితంగా ఉండండి. క్రైస్తవ సంఘంతో క్రమమైన సహవాసం కల్గియుండండి. ప్రాముఖ్యంగా, సంఘపెద్దలతో పరిచయం పొందుటకు కృషిచేయండి. వారు మీ సౌభాగ్యం యెడల చింతకల్గియున్నారు కాబట్టి, మద్దతుకు, ఓదార్పుకు వారు మూలం కాగలరు. (యెషయా 32:2) అన్నింటికంటే, యెహోవాతో ఒక మంచి సన్నిహిత సంబంధాన్ని వృద్ధిచేసుకోండి. ఏది మంచిదో దానిని సంపాదించి వెంబడించుటకు బలమును, కోరికను దయచేయువాడు ఆయనే!
20 కొందరు యౌవనులు అవినీతికరమైన సంగీతమును వినడంద్వారా, ఆత్మీయంగా అభివృద్ధి చెందుటకు చేయు కృషిని బలహీనంచేస్తున్నారు. దీని తరువాతి శీర్షిక ఈ విషయానికి ప్రత్యేక శ్రద్ధనిస్తుంది. (w93 4/15)
[అధస్సూచీలు]
a మత్తయి 2:13 లో హత్యచేయాలనే హేరోదు కుట్రనుండి తప్పించుకొనేందుకు మరియ, యోసేపులను “ఐగుప్తుకు పారిపొమ్మని” చెప్పినప్పుడు కూడా, “పారిపోవుట” అనే గ్రీకు పదమే ఉపయోగించబడింది.—మత్తయి 10:23 పోల్చండి.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి ఆఫ్ న్యూయార్క్ వారు ప్రచురించిన యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ అను పుస్తకంలోని 26 వ అధ్యాయంలో లైంగిక కోరికలను అదుపులో పెట్టుటకు సహాయకరమైన ఎన్నో సలహాలను మీరు కనుగొంటారు.
మీకు జ్ఞాపకమున్నవా?
▫ ఎందుకు ప్రాముఖ్యంగా యౌవనులు సాతాను “తంత్రముల” దాడికి అనువైయున్నారు?
▫ లోకసంబంధమైన యౌవనులతో సన్నిహితంగా సహవసించడం ఎందుకు అపాయకరమైనది?
▫ ఏవిధంగా మీరు లైంగిక అవినీతిని విడిచి పారిపోగలరు?
▫ ఏవిధంగా మీరు యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని వెంబడించగలరు?
▫ మీ తలిదండ్రులతో సంభాషించుట ఎందుకు ప్రాముఖ్యమైయుంది?
[బాక్సు]
ఇతరులనుండి వేరుకాకుండా ఉండే ఐస్ స్కేటింగ్ వంటి ప్రదేశాలలో, కలిసితిరిగే జంటలు తెలివిగా ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు