లోకానికి వెలుగైయున్న వానిని ఎవరు అనుసరిస్తున్నారు?
“మీరు . . . లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు.”—ఫిలిప్పీయులు 2:15.
1. నకిలీ మత వెలుగులను గూర్చి బైబిలు ఏమి చెబుతున్నది?
యేసును “గొప్ప వెలుగు,” లేక “లోకమునకు వెలుగు” అని బైబిలు స్పష్టంగా గుర్తిస్తోంది. (యెషయా 9:2; యోహాను 8:12) అయినా, ఆయన భూమిపైనున్నప్పుడు బహుకొద్దిమంది మాత్రమే ఆయనను అనుసరించారు. చాలమంది, నకిలీ వెలుగులను అంటే, నిజానికి అంధకారసంబంధులైన వారిని అనుసరించుటకు ఎన్నుకొన్నారు. వీరిని గూర్చి దేవుని వాక్యం ఇలా చెప్తున్నది: “ఏలయనగా అట్టివారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారైయుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునైయున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును.”—2 కొరింథీయులు 11:13-15.
2. దేనినిబట్టి ప్రజలకు తీర్పుతీర్చబడుతుందని యేసు చెప్పాడు?
2 ఆవిధంగా వెలుగెంత అద్భుతమైనదైనా, అందరూ దానిని కావాలనుకోరు. యేసు యిట్లనెను: “ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెనుగాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్ క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.”—యోహాను 3:19, 20.
అంధకారాన్ని ప్రేమించేవారు
3, 4. యేసు కాలంనాటి మతనాయకులు వారికి వెలుగును అనుసరించడం ఇష్టంలేదని ఎలా చూపించారు?
3 యేసు భూమిపైనున్నప్పుడు అలాంటి పరిస్థితి ఎలా ఉండిందో గమనించండి. ఆయనే మెస్సీయ అని రుజువయ్యేలా ఆశ్చర్యంగొల్పే అద్భుతాలు చేయడానికి దేవుడు యేసుకు అధికారమిచ్చాడు. ఉదాహరణకు, ఒక విశ్రాంతి దినాన, పుట్టు గ్రుడ్డివానికి చూపు వచ్చేలా చేశాడు. ఎంతటి దయాపూర్వక చర్య! ఆ వ్యక్తి ఎంతటి మెప్పును ప్రదర్శించాడు! అతను మొదటిసారి చూడగలిగాడు! అయితే, దీనికి మతనాయకుల ప్రతిచర్య ఏమిటి? యోహాను 9:16 తెలియజేస్తున్నది: “కాగా పరిసయ్యులలో కొందరు—ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి.” వారి హృదయాలెంతగా చెడిపోయాయి! అంత అద్భుతమైన స్వస్థత జరిగితే, మునుపు అంధుడైన వానిని బట్టి ఆనందాన్ని వ్యక్తపరచి, స్వస్థపరచిన వానిని మెచ్చుకొనే బదులు వారు యేసును నిందించారు! అలా చేయడం ద్వారా, వారు నిస్సందేహంగా దేవుని పరిశుద్ధాత్మ ప్రత్యక్షతకు వ్యతిరేకంగా పాపం చేశారు. అది క్షమింపరాని పాపము.—మత్తయి 12:31, 32.
4 తరువాత, ఆ వేషధారులు అంతకు ముందు గ్రుడ్డివానిగానున్న వ్యక్తిని యేసు గురించి ప్రశ్నించినప్పుడు, అతడు, “ఆయన [యేసు] ఎక్కడి నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే; అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము; ఎవడైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డివాని కన్నులెవరైన తెరచినట్టు లోకము పుట్టినప్పటినుండి వినబడలేదు. ఈయన [యేసు] దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాని యెడల ఏమియు చేయనేరడని వారితో చెప్పెను.” దీనికి మతనాయకులెలా ప్రతిస్పందించారు? “అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి.” ఎంతటి నిర్దాక్షిణ్యత! వారు కఠిన హృదయులు. అందుకే భౌతిక నేత్రాలతో చూడగలిగినా వారు ఆత్మీయ గ్రుడ్డివారని యేసు వారితో అన్నాడు.—యోహాను 9:30-41.
5, 6. మొదటి శతాబ్దపు మతనాయకులు చేసిన దేనిని బట్టి వారు అంధకారాన్ని ప్రేమించారని చెప్పవచ్చు?
5 ఇంకొక సందర్భంలో, యేసు లాజరును పునరుత్థానము చేసినప్పుడు కూడ ఈ మతవేషధారులు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేయడాన్ని చూడవచ్చు. ఆ మహత్కార్యం మూలంగా సామాన్యజనులనేకులు యేసునందు విశ్వాసముంచారు. అయినా, మతనాయకులు ఏం చేశారో చూడండి. “కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండిన యెడల అందరు ఆయనయందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.” (యోహాను 11:47, 48) వారు తమ స్థానాల గురించి, ప్రధానత్వం గురించి చింతకలిగి ఉండిరి. ఫలితం ఏమైనప్పటికీ, వారు దేవున్ని కాదు రోమీయులను ప్రీతిపరచాలనుకున్నారు. అందుకు వారేమి చేశారు? “కాగా ఆ దినమునుండి వారు ఆయనను [యేసును] చంప నాలోచించుచుండిరి.”—యోహాను 11:53.
6 అంతేనా? కాదు. అంధకారాన్ని వారెంతగా ప్రేమించారో ఆ తరువాత వారు చేసింది చూపిస్తుంది: “అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరును కూడ చంప నాలోచనచేసిరి.” (యోహాను 12:10, 11) ఎంతటి వింతైన దుష్క్రియ! తమ స్థానాలను కాపాడుకోవటానికి వారు ఇదంతా చేసినప్పటికీ, ఏం జరిగింది? ఆ తరంలోనే వారు తమ మీదికి సా.శ. 70 లో దండెత్తి వచ్చి వారి స్థలాలను, వారి దేశాన్ని, వారి ప్రాణాలను కూడ బలిగొన్న రోమీయులపై తిరుగుబాటు చేశారు!—యెషయా 5:20; లూకా 19:41-44.
యేసు చూపిన కనికరం
7. సత్యాన్ని ప్రేమించేవారు ఎందుకు యేసునొద్దకు సమకూర్చబడతారు?
7 మన కాలంలో కూడ, అందరూ ఆత్మీయజ్ఞానం కావాలనుకోరు. కాని, సత్యాన్ని ప్రేమించేవారు వెలుగునొద్దకు రావాలని ఇష్టపడతారు. దేవుడు తమ సర్వాధిపతిగా ఉండాలని కోరుతూ, వెలుగు అంటే ఏమిటో వివరించటానికి, ఆయనను అనుసరించటానికి దేవుడు పంపిన యేసు వైపు వారు ఆతురతతో తిరిగారు. యేసు భూమిపైనున్నప్పుడు సాత్వీకులైన వారు అదే చేశారు. వారాయన యొద్దకు వచ్చారు. పరిసయ్యులు కూడ దాన్ని ఒప్పుకోవలసి వచ్చింది. వారు ఇలా ఫిర్యాదు చేశారు: “లోకము ఆయనవెంట పోయినది.” (యోహాను 12:19) స్వార్థ, అహాంకార, అధికారదాహం గల మతనాయకులకు ఆయన పూర్తి విరుద్ధంగా ఉండెను గనుక గొర్రెవంటి వారు యేసును ప్రేమించారు. వారిని గూర్చి యేసు ఇలా చెప్పాడు: “మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు.”—మత్తయి 23:4, 5.
8. మత వేషధారులకు వ్యతిరేకంగా, యేసు ఏ దృక్పథాన్ని కలిగియుండెను?
8 దానికి భిన్నంగా ఉన్న యేసు కరుణాగుణాన్ని గమనించండి: “ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడెను.” (మత్తయి 9:36) దాని గురించి ఆయనేమి చేశాడు? సాతాను విధానం చేత పలువిధాలుగా దోచుకొనబడుచున్న వారితో యేసు ఇలా అన్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తుకొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్తయి 11:28-30) యెషయా 61:1-3 నందు తన గురించి ప్రవచింపబడినదానినే యేసు చేశాడు. అక్కడ ఇలా ఉంది: “జనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును . . . ఆయన నన్ను పంపియున్నాడు.”
వెలుగు ప్రకాశకులను సమకూర్చుట
9. ఏ మహత్వపూర్ణ సంఘటనలు 1914 లో జరిగాయి?
9 పరలోకానికి ఆరోహణుడైన తరువాత, దేవుడు తనకు రాజ్యాధికారం ఇచ్చేంతవరకు యేసు వేచియుండాల్సి వచ్చింది. పిమ్మట ఆయన “గొర్రెలను,” “మేకల” నుండి వేరుచేస్తాడు. (మత్తయి 25:31-33; కీర్తన 110:1, 2) “అంత్యదినములు” 1914 లో ప్రారంభమైనప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. (2 తిమోతి 3:1-5) దేవుని పరలోక రాజ్యానికి రాజుగా అధికారం పొందిన తరువాత యేసు, వెలుగును అనుసరించుటకు ఇష్టపడేవారిని తన కుడిచేతివైపుకు ప్రోగుచేయడం మొదలుపెట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఆ సమకూర్చేపని ప్రభలమైన అభివృద్ధితో కొనసాగింది.
10. సమకూర్చేపనిలో యేసు ఉపయోగించుకొంటున్న వారిని గూర్చి ఏ ప్రశ్న అడుగవచ్చు?
10 యేసుక్రీస్తు నాయకత్వం క్రింద, సమకూర్చేపని గొప్పవిజయాన్ని సాధించింది. వెలుగొందిన సత్యారాధనలో అన్ని దేశాలనుండి అంతమంది ప్రజలు సమకూర్చ బడడం చరిత్రంతటిలో ఎన్నడు జరగలేదు. దేవుని నుండి, క్రీస్తు నుండి వస్తున్న ఆ వెలుగును ఈనాడు ఎవరు అనుసరిస్తున్నారు? ఫిలిప్పీయులు 2:15 చెప్తున్నట్లుగా, “లోకమందు జ్యోతుల వలె” ఉంటూ, ‘జీవజలమును ఉచితముగా పుచ్చుకొనుము’ అని ఎవరు ఇతరులను ఆహ్వానిస్తున్నారు?—ప్రకటన 22:17.
11. ఆత్మీయవెలుగుకు సంబంధించి క్రైస్తవమత సామ్రాజ్య స్థానమేమిటి?
11 క్రైస్తవమత సామ్రాజ్యం అలా చేస్తున్నదా? క్రైస్తవమత సామ్రాజ్యం, దాని విభాగిత మతాలతో నిశ్చయంగా జ్యోతివలె ప్రకాశించడం లేదు. వాస్తవానికి, మతాధికారులు యేసు కాలంనాటి మతనాయకుల వలె వున్నారు. వారు దేవుడు మరియు క్రీస్తు నుండి నిజమైన వెలుగును ప్రతిబింబించడం లేదు. థియాలజీ టుడే అనే పత్రిక 33 సంవత్సరాల క్రితం ఇలా చెప్పింది: “ఈ వెలుగు చర్చీలలో చెప్పుకోదగినంత తేజోవంతంగా ప్రకాశించుటలేదని విచారకరంగా అంగీకరించవలసిందే. . . . చర్చి చాలావరకు దాని చుట్టూనున్న సమాజంవలే తయారుకావడం మొదలెట్టింది. లోకంలో ప్రకాశించే వెలుగులనే అది ప్రతిబింబించింది కాని అది లోకానికి వెలుగైయుండ లేదు.” క్రైస్తవమత సామ్రాజ్యం పరిస్థితి ఈనాడు మరీ దిగజారింది. నిజానికి అది లోకంనుండి ప్రతిబింబిస్తున్న భూటకపు వెలుగు అంధకారమే ఎందుకంటే, సాతాను, అతని లోకం ఇవ్వగల్గేది అదే. పరస్పర విరుద్ధము, పూర్తిగా లోకసంబంధము అయివున్న క్రైస్తవమత సామ్రాజ్య మతాల నుండి సత్యం యొక్క వెలుగు ప్రకాశించడంలేదు.
12. నిజమైన వెలుగును ప్రకాశించే సంస్థగా ఈనాడు ఎవరున్నారు?
12 యెహోవాసాక్షుల నూతనలోక సమాజమే నేడు నిజమైన, వెలుగును కల్గియున్న సంస్థ అని కచ్చితంగా చెప్పవచ్చు. దాని సభ్యులందరు, పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, అందరు ఐక్యంగా మానవజాతి యంతటి యెదుట యెహోవా మరియు యేసు నుండి వచ్చే వెలుగును ప్రతిబింబిస్తారు. గత సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 70,000 యెహోవాసాక్షుల సంఘాలలో, 40 లక్షల కంటె ఎక్కువమంది వెలుగు ప్రకాశకులు దేవున్ని గూర్చి, ఆయన సంకల్పాలను గూర్చి చురుకుగా ఇతరులకు చెప్తున్నారు. ఆత్మీయజ్ఞానం కావాలనుకునే వారందరూ పెద్దగుంపుగా సమకూర్చబడడం ఇప్పుడు ప్రతి సంవత్సరం కొనసాగుతూనే ఉంది. లక్షలాదిమంది బైబిలును పఠించి కచ్చితమైన జ్ఞానాన్ని పొందిన తరువాత బాప్తిస్మం తీసుకుంటున్నారు. నిజంగా దేవుడు, “మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు”.—1 తిమోతి 2:4.
13. యెహోవానుండి వస్తున్న వెలుగును మనం దేనికి పోల్చవచ్చు?
13 ఇప్పుడు యెహోవానుండి వస్తున్న జ్ఞానాన్ని ప్రాచీనకాలంలోని దేవుని ప్రజలు ఐగుప్తును విడిచివచ్చినప్పుడు జరిగిన దానితో పోల్చవచ్చు: “వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను.” (నిర్గమకాండము 13:21, 22) దేవుడనుగ్రహించిన పగటిపూట మేఘము, రాత్రి అగ్నియు ఆధారపడదగిన మార్గదర్శకములే. అవి, మనకు పగటివేళ్లలో వెలుగిచ్చుటకు దేవుడు సృజించిన సూర్యునిపై ఆధారపడదగినంతగా ఉండినవి. అలాగే దుష్టత్వంతో నిండియున్న ఈ అంత్యదినములలో సత్యాన్వేషకుల మార్గాన్ని ఆత్మీయంగా ప్రకాశవంతం చేస్తూనే ఉండుటకు మనం యెహోవాపై ఆధారపడవచ్చును. “పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” అని సామెతలు 4:18 మనల్ని దృఢపరుస్తోంది.
రాజ్యవెలుగును ప్రతిబింబించుట
14. వెలుగు ప్రకాశకుల మూల ఉద్దేశం ఏమైయుండవలెను?
14 యెహోవా జ్ఞానానికి మూలం, క్రీస్తు ఆ వెలుగును ప్రతిబింబించుటలో ప్రధానుడు, గనుక యేసు అనుచరులు కూడా దాన్ని ప్రతిబింబించాలి. వారిని గూర్చి ఆయనిలా అన్నాడు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు; . . . మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.” (మత్తయి 5:14, 16) ఆయన అనుచరులు మానవజాతి యెదుట ప్రకాశింపవలసిన ఈ వెలుగు యొక్క మూలాంశమేమై యుండెను? ప్రపంచ చరిత్ర యొక్క ఈ అంతిమ దశలో వారు ఏమి బోధించవలసి యుండిరి? తన అనుచరులు ప్రజాస్వామ్యాన్ని, నిరంకుశత్వాన్ని, చర్చీ మరియు రాష్ట్రాల ఐక్యతను, లేక మరే యితర లోకసంబంధ సిద్ధాంతాలను బోధిస్తారని యేసు చెప్పలేదు. దానికి బదులుగా, ప్రపంచవ్యాప్త వ్యతిరేకత ఉన్నప్పటికీ: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును” అని ఆయన మత్తయి 24:14 లో ముందే తెలియజేశాడు. సాతాను లోకాన్ని అంతమొందించి, నీతియుక్త నూతన లోకాన్ని ప్రవేశపెట్టే దేవుని రాజ్యాన్ని గూర్చి ఈనాడు వెలుగు ప్రకాశకులు ఇతరులకు తెలియజేస్తున్నారు.—1 పేతురు 2:9.
15. వెలుగు కావాలనుకునేవారు ఎటు తిరుగుతారు?
15 వెలుగును ప్రేమించేవారు ఈ లోక హక్కులు, ఆశయాలతో పెడత్రోవ పట్టరు. లోకం దాని అంతాన్ని చేరుకుంటోంది గనుక ఆ హక్కులు, ఆశయాలు అన్నీ త్వరలోనే ఆదృశ్యమౌతాయి. నీతిని ప్రేమించేవారు, భూదిగంతాల వరకు దేవునిరాజ్య వెలుగును ప్రకాశింపజేస్తున్న వారిచే ప్రకటింపబడుతున్న సువార్తవైపుకు తిరగటానికి ఇష్టపడతారు. వీరు ప్రకటన 7:9, 10 నందు చెప్పబడినవారే, అక్కడ ఇలా వుంది: “అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము . . . [దేవుని] సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల [క్రీస్తు] యెదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.” “వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు” అని 14 వచనం చెప్తున్నది. అవును, వారు ఈ లోకాంతాన్ని తప్పించుకొని, దేవుని రాజ్యము క్రింద శాశ్వత నూతన లోకంలోనికి రక్షింపబడతారు.
వెలుగొందిన నూతన లోకం
16. మహాశ్రమలప్పుడు సాతాను లోకానికి ఏమి సంభవించును?
16 నూతన లోకం ప్రకాశవంతమైన సత్య వెలుగుతో నిండియుంటుంది. వాస్తవానికి, దేవుడు ఈ విధానాన్ని అంతమొనర్చిన దినాన పరిస్థితి ఏమైయుంటుందో పరిశీలించండి. సాతాను, అతని దయ్యాలు, అతని రాజకీయ వ్యాపార మత విధానాలు—ప్రతి ఒక్కటి గతించిపోతుంది! సాతాను యొక్క ప్రచారసాధనాలన్నీ కూడా గతించిపోతాయి. అలా, మహాశ్రమల తరువాత ఈ దుష్టలోకానికి మద్దతునిచ్చే వార్తాపత్రిక, పత్రిక, పుస్తకం, చిన్నపుస్తకం లేక కరపత్రం ఒక్కటి కూడ మళ్లీ ముద్రింపబడదు. ప్రపంచవ్యాప్త దూరదర్శని లేక రేడియో ద్వారా కలుషిత ప్రభావాలు కల్గించేవేవి ప్రసారం కావు. ఒక్క దెబ్బతో సాతాను ప్రపంచపు మొత్తం విషపూరిత పరిస్థితంతా తీసివేయబడుతుంది!—మత్తయి 24:21; ప్రకటన 7:14; 16:14-16; 19:11-21.
17, 18. సాతానులోక అంతం తరువాత ఉండే ఆత్మీయ పరిస్థితిని మీరెలా వర్ణిస్తారు?
17 అదెంతటి అపరిమితమైన ఉపశమనమై యుంటుంది! అది మొదలుకొని యెహోవా నుండి ఆయన రాజ్యం నుండి వెలువడే, సంపూర్ణమైన, ప్రోత్సాహాన్నిచ్చే ఆత్మీయ వెలుగు మాత్రమే మానవజాతిని ప్రభావితం చేస్తుంది. యెషయా 54:13 యిలా తెలియజేస్తున్నది: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” భూమియంతటా దేవుని పరిపాలన విస్తరించి యుండగా, యెషయా 26:9 లో చెప్పినట్లు ఆయనిలా వాగ్దానం చేస్తున్నాడు: “లోక నివాసులు నీతిని నేర్చుకొందురు.”
18 త్వరలో, మానసిక, ఆత్మీయ పరిస్థితంతా మంచిగా మారిపోతుంది. ఇప్పుడు విస్తృతంగా వ్యాపించియున్న కృంగదీసే, అవినీతికర విషయాలకు బదులు, ప్రోత్సాహాన్నిచ్చే విషయాలే ఉంటాయి. జీవిస్తున్న వారందరికి దేవున్ని, ఆయన సంకల్పాలను గూర్చిన సత్యాలు బోధింపబడతాయి. యెషయా 11:9 నందలి ప్రవచనం పూర్తిగా నెరవేరుతుంది. అక్కడ ఇలా వుంది: “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.”
వెలుగును అనుసరించవలసిన అత్యవసరత
19, 20. వెలుగును అనుసరించాలనుకునే వారు ఎందుకు జాగ్రత్తగా వుండాలి?
19 ఇప్పుడు, ఈ దుష్టవిధానం యొక్క చివరి సంవత్సరాలలో, లోకానికి వెలుగైయున్నవానిని అనుసరించవలసిన అత్యవసరత ఉంది. మనల్ని వెలుగులో నడవకుండ ఆటంకపరచుటకు తీవ్రపోరాటం సాగుతున్నది గనుక మనం జాగ్రత్తగా వుండవలసిన అవసరత ఉంది. సాతాను, అతని దయ్యాలు, అతని భూసంస్థయైన అంధకార సంబంధమగు శక్తులనుండి ఈ వ్యతిరేకత వస్తున్నది. అందుకే అపొస్తలుడైన పేతురు ఇలా హెచ్చరిస్తున్నాడు: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”—1 పేతురు 5:8.
20 వారు అంధకారంలోనే కొనసాగాలని సాతాను కోరుతున్నాడు గనుక, వెలుగుతో సంబంధమేర్పరచుకోనేవారి మార్గంలో ప్రతి విధమైన అవాంతరాన్ని వుంచుతాడు. అది బంధువులనుండి లేక సత్యాన్ని వ్యతిరేకించే మునుపటి స్నేహితుల నుండి వత్తిడి అయివుండవచ్చు. దేవుడున్నాడా లేడా అని సందేహం కలవారు లేక విశ్వాసంలేని నాస్తికుల ప్రచారం ద్వారా లేక అబద్ధమత బోధలచేత అంధులైపోవడం ద్వారా బైబిలును గూర్చిన అనుమానాలై యుండవచ్చు. తమ స్వంత పాపాలమూలంగా దైవిక నియమాలకు కట్టుబడి జీవించడం కష్టంకావచ్చు.
21. దేవుని నూతన లోకంలో జీవించాలనుకునే వారు ఏ చర్యలు గైకొనాలి?
21 ఎలాంటి ఆటంకాలు ఉన్నప్పటికీ పేదరికము, నేరము, అన్యాయము, యుద్ధము లేని నూతన లోకంలో జీవితాన్ని అనుభవించాలని మీరు ఇష్టపడుతున్నారా? పరదైసు భూమిపై నిత్యజీవం, పరిపూర్ణ ఆరోగ్యం కావాలనుకుంటున్నారా? అయితే, యేసు లోకానికి వెలుగైయున్నాడని అంగీకరించి, ఆయన్ని అనుసరించి, “జీవ వాక్యమును” చేపట్టి, “లోకమందు జ్యోతుల వలె కనబడుచున్న” వారి సమాచారమును వినండి.—ఫిలిప్పీయులు 2:15, 16. (w93 4/1)
మీరెలా జవాబిస్తారు?
▫ వారు అంధకారప్రియులై యున్నారని మతనాయకులు ఎలా చూపించారు?
▫ ప్రజలయెడల యేసు దృక్పథమేమైయుండెను?
▫ వెలుగు ప్రకాశకుల సమకూర్చేపని ఎలా కొనసాగుతున్నది?
▫ త్వరలో ఏ మహత్వపూర్ణ మార్పులు జరుగుతాయి?
▫ లోకానికి వెలుగైయున్నవానిని అనుసరించుట ఎందుకు ఈనాడు అత్యవసరము?
[బాక్సు]
యేసుద్వారా చూపుపొందిన వ్యక్తిని కఠినహృదయులైన పరిసయ్యులు వెలివేసారు