నైజీరియా అత్యున్నత న్యాయస్థానం మత స్వాతంత్య్రాన్ని సమర్థించింది
గ్రామస్తులు ఒక రైతు పంటను సర్వం దోచుకున్నారు. ఇతరులు ఒక తాపీ మేస్త్రీ ఇంటిపై దాడిచేసి పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకొందరు మరొక స్త్రీని ఏమి కొనకుండా అమ్మకుండా ఆపుజేశారు. ఎందుకీ దురాగతమంతా? వీటికి గురైనవారంతా యెహోవాసాక్షులే. వారి సమ వయస్కుల సంఘములో వీరు సభ్యులు కాలేదు. ‘దేంట్లో?’ అని మీరు ఆశ్చర్య పడవచ్చును.
సమవయస్కుల సంఘమంటే, సాధారణంగా ఒకే కాలంలో గ్రామంలో పుట్టిన పురుషులంతా కూడి ఒక సంఘంగా ఏర్పడతారు. తూర్పు నైజీరియాలో ఇలాంటి సమ వయస్కుల సంఘం సహజం. సామాజిక ప్రయోజిత పథకాలను ప్రారంభిస్తూ వాటిని నిర్వహిస్తుంటారు. వాటితోపాటు విగ్రహారాధన, వారు ఒక వయస్సువారని చూపే అభిచార కార్యకాలాపాల్లో పాల్గొటం కూడ ఉంటుంది. అయితే నిజమైన క్రైస్తవులు అటువంటి అలవాట్లలో పాల్గొనటాన్ని బైబిలు ఖండిస్తున్నందున యెహోవాసాక్షులు అలాంటి గుంపులకు దూరంగా ఉంటుంటారు.—1 కొరింథీయులు 10:20, 21; 1 యోహాను 5:21.
సామ్యూల్ ఒకాగ్బ్యూ నైజీరియాలోని అబానందు టైలర్‌గా పనిచేసేవాడు. అలయ్లోని యుమ్యూన్కాల్యు సమ వయస్కుల సంఘ సభ్యులు 1978 తొలికాలంలో ఒక ఆరోగ్య కేంద్రాని నిర్మించేందుకు ఈయనను “పన్ను” కట్టమని డిమాండు చేశారు. ఒక క్రైస్తవునిగా తన శక్తికొలది ఇతరులకు సహాయం చేసే ఈ సామ్యూల్, ఈ సమవయస్కుల సంఘంలో మాత్రం మనస్సాక్షిని బట్టి పాలుపొందడానికి తిరస్కరించాడు. అదే సంవత్సరం ఏప్రిల్ 22వ తేదిన, ఈ సంఘ సభ్యులు ఆరు మంది ఆయన దుకాణంలోకి బలవంతంగా జొరబడి తాను ఈ డబ్బు కట్టేంతవరకు తన మిషన్ ఇవ్వమని దాన్ని పట్టుకెళ్లారు. ఆ సంఘంలో తాను సభ్యుడు కానందున తానేమీ కట్టాల్సిన విధి తనపై లేదని సామ్యూల్ ఎదురుతిరిగాడు. మిషన్‌ను తిరిగి సంపాదించుకోలేని సామ్యూల్ కోర్టుకెళ్లాడు.
ఒక కోర్టునుండి మరొక కోర్టుకి
చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టుముందు ఈ సమవయస్కుల సంఘం, సామ్యూల్ తన వయస్సువాడైనందున యాంత్రికంగానే వారి సభ్యుల్లో ఒకడౌతాడని, తమపై తాముగా విధించుకున్న పన్నులను ఆయన చెల్లించాల్సిన బాధ్యత ఉంటుందని వాదించింది. వారి స్వసాంప్రదాయం ప్రకారం ఏ సభ్యుడైనా ఈ పన్ను కట్టకపోతే అతడు దాన్ని కట్టేంతవరకు అతని ఆస్తిని స్వాధీనపరచుకోవడం కూడా ఉంది.
ఇందుకు కోర్టుకు అంగీకరించలేదు. ఫిబ్రవరి 28, 1980వ తేదీన ఈ సమవయస్కుల సంఘంలో సభ్యుడయ్యేందుకు సామ్యూల్‌ను బలవంతపెట్ట వీల్లేదని ఆదేశించింది. చీఫ్ మెజిస్ట్రేట్; “ఒక పౌరున్ని తన స్వేచ్ఛప్రకారం సహవాసాన్ని ఎన్నుకోకుండా చేసే ఏ సాంప్రదాయమైనా ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా రాజ్యాంగం సెక్షన్ 37కు వ్యతిరేకమైంది. అందుచేత దీన్ని చట్టం అనుమతించదు” అని చెప్పాడు.
ఇదే తీర్పును సమవయస్క సంఘం హైకోర్టుకు తీసుకెళ్లి గెలిచింది. అక్కడి జడ్జి ఇది కేవలం తన స్వంత సామాజాభివృద్ధికి దోహదపడుతుందే గనుక సామ్యూల్ పన్ను కట్టాల్సిందేనని ఆదేశించాడు.
దీన్ని అన్యాయంగా గుర్తించిన సామ్యూల్ అప్పీలు చేసుకున్నాడు. అప్పీలు చేసుకొన్న కోర్టు, హైకోర్టు తీర్పును తిప్పికొట్టి సామ్యూల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఓటమిని అంగీకరించని ఈ సమ వయస్కుల సంఘం కేసును నైజీరియా అత్యున్నత న్యాయ స్థానానికి (సుప్రీం కోర్టు) తీసుకెళ్లింది.
ఈ లోగా సంఘ సభ్యులు గ్రామంలో ఉర్రూతలూగుతున్నారు. సామాజిక అభివృద్ధి పథకాలన్నింటికి సాక్షులు వ్యతిరేకలేనంటూ, ఆ ఊరి పెద్దను ఒప్పించి ఆ ప్రాంతంలో యెహోవాసాక్షుల కార్యకలాపాలన్నింటిని బహిష్కరించేలా జేశారు. యెహోవాసాక్షులతో వ్యవహారాలు పెట్టుకున్న ఎవరికైనా జురిమానా తప్పదని దండోరా వేయించారు. పొరుగు పట్టణాలలోవున్న సాక్షులు కలగజేసుకొని విషయాలను ఊరి పెద్దలకు స్పష్టంచేశారు. సమాజాభివృద్ధికి దేవుని ప్రజలు ఏ విధంగాను వ్యతిరేకులుకారని వివరించారు. సమవయస్క సంఘం ద్వారా తలపెట్టబడని అనేక సమాజాభివృద్ధి పథకాలకు తాను విరాళాలిచ్చానని రుజువుచేస్తూ సామ్యూల్ రసీదులు కోర్టువారి ముందుంచాడు. తర్వాత ఊరి పెద్దలు సాక్షులకు నిషేధించాలనే నిర్ణయాన్ని మానుకున్నారు.
మత స్వాతంత్ర్యం జయించింది
అక్టోబరు 21, 1991న నైజీరియా అత్యున్నత న్యాయస్థానం యొక్క ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా సామ్యూల్‌కు అనుకూలంగా తీర్పు చెప్పారు. జస్టిస్ పాల్ నోకాడి, జస్టిస్ ఆబ్యుకార్ వాలి ఇవ్వబడిన తీర్పును: “ముద్దాయి [సామ్యూల్] విధించబడిన పన్నును చెల్లించడానికి వ్యతిరేకించడం కాదు. ఆయన యెహోవాసాక్షులలో ఒక సభ్యునిగా ఏ సొసైటిలోనైనా, క్లబ్బు లేక సమవయస్కుల సంఘంలోనైనా సభ్యుడైయుండడానికి వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకనగా ఇది ఆయన మత నమ్మకానికి వ్యతిరేకం” అని పేర్కొన్నారు.
న్యాయమూర్తి ఇంకా: “ఈ 1963 రాజ్యాంగం, సెక్షన్ 24 (1) నైజీరియా పౌరులందరికి మనసాక్షి, ఆలోచన, మతస్వాతంత్ర్యాలనిస్తుంది. ముద్దాయి సమవయస్కుల సంఘంలో చేరకుండా నిరోధించే తన మత అభిప్రాయానికి, ఆలోచనకి, మనస్సాక్షికి కట్టుబడివుండే హక్కు కల్గివున్నాడు. ఇందుకు భిన్నంగా తనపైబడే ఏ సాంప్రదాయమైనా రాజ్యాంగం విరుద్ధం, అందువలన అది చెల్లదు. దానికి విలువలేదు” అని విశదీకరించారు.
క్లుప్తంగా చెప్పాలంటే అది సామాజిక ఆచారమైనప్పటికి, ఏ వ్యక్తిని సమవయస్కుల సంఘంలో చేరేలా బలవంతపెట్టడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. చెల్లింపులు సామాజిక అభివృద్ధికైనప్పటికి తాను సభ్యునిగా లేని సంఘం ద్వారా తాను డబ్బు చెల్లించాలని ఏ వ్యక్తిని బలవంతం చేయకూడదని కూడా ఆదేశించింది. ఈ క్లుప్తమైన వివరణద్వారా నైజీరియనుల మత స్వాతంత్య్రం సమర్థించబడింది.