పాఠకుల ప్రశ్నలు
హెబ్రీయులు 11:26లో మోషేయే “క్రీస్తని” చెప్పబడుచున్నాడా, లేక ఆయన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడా?
అపొస్తలుడైన పౌలు మోషే విశ్వాసమును చర్చిస్తూ ఆయన, “ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొనెను. . . ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను” నని వ్రాసెను. (హెబ్రీయులు 11:26) ఇక్కడ పౌలు మోషేనే ఒక విధంగా “క్రీస్తు” లేక అభిషక్తునిగా సూచిస్తున్నట్లు కనబడుతుంది.
నిజానికి, అనేక విషయాలలో మోషే రానైయున్న మెస్సియాకు పోలికను కలిగియున్నాడు. ఆయనమట్టుకు ఆయనే ప్రవక్తయైనా ‘ఆయనలాంటి’ ఒక గొప్ప ప్రవక్త రానైయున్నాడని ఆయన ప్రవచించాడు. అనేకమంది యూదులు యేసే “ఆ ప్రవక్త” అని గ్రహించారు. దీనిని ఆయన అనుచరులు కూడా స్థిరపరచారు. (ద్వితీయోపదేశకాండము 18:15-19; యోహాను 1:21; 5:46; 6:14; 7:40; అపొ. కార్యములు 3:22, 23; 7:37) మోషే ధర్మశాస్త్ర నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే యేసు “మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది,” “మరి యెక్కువైన నిబంధనకు” అనగా మహిమగల క్రొత్తనిబంధనకు “మధ్యవర్తియై యున్నాడు.” (హెబ్రీయులు 8:6; 9:15; 12:24; గలతీయులు 3:19; 1 తిమోతి 2:5) కాబట్టి కొన్నివిషయాలలో ఆయన రానైయున్న మెస్సియాకు సాదృశ్యంగా ఉన్నాడు.
అయినా, హెబ్రీయులు 11:26లో అది ప్రధాన భావంగా కన్పించుటలేదు. మెస్సియాను గూర్చిన వివరాలన్ని తెలిసి తాను మెస్సియా తరపున లేక ఆయనకు ప్రతినిధిగా ఉన్నాడని బుద్ధిపూర్వకంగా మోషే ఎరిగినవాడై ఐగుప్తులో వాటి ననుభవించాడనుటకు ఏవిధమైన సూచన లేదు.
హెబ్రీయులు 11:26 లోని పౌలు మాటలు క్రైస్తవులు “క్రీస్తుయొక్క శ్రమలు” అనుభవించారని అతడు వ్యాఖ్యానించినట్టి భావమును సూచిస్తున్నాయని కొందరు అన్నారు. (2 కొరింథీయులు 1:5) అభిషక్త క్రైస్తవులకు యేసుక్రీస్తు శ్రమననుభవించాడని, ‘వారును అలాగే శ్రమ ననుభవించినట్లయిన ఆయనతోపాటు’ పరలోకములో మహిమపొందుదురని తెలుసు. అయితే మోషేకు మాత్రము రానైయున్న మెస్సియా ఏ శ్రమలు అనుభవిస్తాడో తెలియదు. లేక మోషేకు పరలోక నిరీక్షణ లేదు.—రోమీయులు 8:17; కొలొస్సయులు 1:24.
మోషే “క్రీస్తునుగూర్చిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొన్నాడను” దానిని అర్థంచేసుకొనే సులువైన మార్గమున్నది.
హెబ్రీయులు 11:26లో “క్రీస్తు” అని వ్రాసినప్పుడు పౌలు క్రి.స్టో’, అనే గ్రీకుపదాన్ని ఉపయోగించాడు. ఇది హెబ్రీ మె.షి’యాక్ లేక మెస్సియా అను దానికి సమానమైనది. “మెస్సియా” లేక “క్రీస్తు” అనగా “అభిషక్తుడు” అని అర్థము. కాబట్టి మోషే ‘అభిషక్తునిగా పొందే నిందను భాగ్యంగా ఎంచుకున్నాడని’ పౌలు వ్రాయుచున్నాడు. అయితే మోషే తనను తాను “అభిషక్తుడు” అని పిలుచుకోవచ్చా?
అవును. బైబిలు కాలాలలో ఒకని తలపై నూనె పోయబడుటతో అతడు ఒక ప్రత్యేక స్థానానికి నియమించబడేవాడు. “అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిపట్టుకొని సౌలు తలమీద తైలముపోసెను.” “సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులయెదుట వానికి అభిషేకముచేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను.” (1 సమూయేలు 10:1; 16:13; నిర్గమకాండము 30:25, 30 ను పోల్చుము; లేవీయకాండము 8:12; 2 సమూయేలు 22:51; కీర్తన 133:2.) అయినా, ప్రవక్తయైన ఎలీషా, సిరియా రాజైన హజయేలు మీద నిజమైన తైలము పోసినట్లు రుజువులేమీ లేక పోయినప్పటికినీ వారు “అభిషక్తులు” గా పిలువబడ్డారు. (1 రాజులు 19:15, 16; కీర్తన 105:14, 15; యెషయా 45:1) ఆవిధంగా ఒకవ్యక్తి ఎన్నుకొనబడుటద్వారా లేదా ప్రత్యేకంగా నియమించబడుటద్వారా “అభిషక్తుడు” కాగలడు.
ఈ భావంలో మోషేకూడా దేవుని అభిషక్తుడే, కొన్ని బైబిల్లు కూడా “దేవుని అభిషక్తుడు,” “అభిషక్తుడు” అని హెబ్రీయులు 11:26లో తర్జుమా చేయుచున్నవి. మోషే యెహోవా ప్రతినిధిగా నియమించబడినవాడై ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి నడిపెను. (నిర్గమకాండము 3:2-12, 15-17) మోషే ఐగుప్తు ధన, ఘనతలందు పెరిగినను ఆయన తన పనిని గొప్పగా యెంచుకొని దానిని అంగీకరించి నెరవేర్చెను. అందుచేత మోషే “ఐగుప్తు ధనముకంటె క్రీస్తునుగూర్చిన నింద గొప్పభాగ్యమని యెంచుకొన్నాడని” పౌలు వ్రాయగలిగెను.