స్వాతంత్ర్యమునిచ్చు దేవుని నూతన లోకమునుగూర్చి ఎలుగెత్తిచాటుట
“[దేవుడు] వారికన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు.”—ప్రకటన 21:4.
1, 2. నిజమైన స్వాతంత్ర్యమును ఎవరు మాత్రమే తీసుకురాగలరు, మరియు బైబిలునుండి ఆయననుగూర్చి మనమేమి నేర్చుకొనగలము?
యిర్మీయా ప్రవక్త చెప్పిన మాటల సత్యత్వమును చరిత్ర నిరూపించినది. ఆయనిట్లనెను: ““మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.” మనుష్యుల నడవడిని మరి ఎవరుమాత్రమే సరియైన రీతిగా నిర్దేశించగలరు? యిర్మీయా ఇంకనూ ఇట్లనుచున్నాడు: “ఓ, యెహోవా నన్ను సరిదిద్దుము.” (యిర్మీయా 10:23, 24 NW) అవును, మానవ కుటుంబమును పట్టిపీడించుచున్న సమస్యలనుండి కేవలము యెహోవా మాత్రమే నిజమైన స్వాతంత్ర్యము తీసుకురాగలడు.
2 ఆయనను సేవించు వారికి స్వాతంత్ర్యము తీసుకువచ్చు యెహోవా సామర్థ్యమును గూర్చిన అనేక ఉదాహరణలను బైబిలు కలిగియున్నది. “ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” (రోమీయులు 15:4) అబద్ధమతమునకు వ్యతిరేకముగా యెహోవా విధించిన తీర్పులుకూడా వ్రాయబడినవి, కాగా ఇవి “యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.”—1 కొరింథీయులు 10:11.
తన ప్రజలను విడుదలచేయుట
3. ఐగుప్తులోని తన ప్రజలను విడిపించుటకు యెహోవా ఎట్లు తన సామర్థ్యమును చూపించెను?
3 ప్రాచీన కాలమందు ఐగుప్తులో ఆయన ప్రజలు దాసులుగా ఉన్నప్పుడు, అబద్ధ ఆరాధనపై తీర్పుతీర్చి, ఆయన చిత్తము చేయువారిని విడిపించే దేవుని సామర్థ్యత నిరూపించబడెను. నిర్గమకాండము 2:23-25 ఇట్లు చెప్పుచున్నది: “తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును వినెను.” ఐగుప్తు దేవతలపై తన ఉన్నతత్వమును ఆశ్చర్యకరమైన రీతిలో ప్రదర్శించుటకు, సర్వశక్తిగల దేవుడు ఆ జనాంగముపై పది తెగుళ్లు రప్పించెను. వారు అబద్ధదేవతలని, తమను ఆరాధించు ఐగుప్తీయులకు సహాయము చేయలేనివారని చూపించుచూ, ఒక్కొక్క ఐగుప్తు దేవతను అవమానించుటకు ప్రతి తెగులు రూపించబడెను. ఆ విధముగా దేవుడు తన ప్రజలను విడిపించి ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో నాశనము చేసెను.—నిర్గమకాండము 7 నుండి 14 అధ్యాయములు.
4. కనానీయులపై దేవుడు తన తీర్పులు విధించుట ఎందుకు అన్యాయమై యుండలేదు?
4 దేవుడు ఇశ్రాయేలీయులను కనానుకు తీసుకువచ్చినప్పుడు, దయ్యముల నారాధించు దాని నివాసులను ఆయన నాశనముచేసి, ఆ దేశమును దేవుని ప్రజలకు యిచ్చెను. విశ్వసార్వభౌమాధిపతిగా, యెహోవా అట్టి నీచమైన మతములపై తన తీర్పులుతీర్చు హక్కును కలిగియున్నాడు. (ఆదికాండము 15:16) మరియు కనాను మతమును గూర్చి, హాలీ వ్రాసిన బైబిల్ హ్యాండ్‌బుక్ ఇట్లు చెప్పుచున్నది: “కనాను దేవతల . . . ఆరాధన బహుగా హద్దులుమీరిన ఉన్మాదములను కలిగియుండెను; వారి ఆలయములు అశ్లీలతకు కేంద్రములై యుండెడివి. . . . తమ దేవతల సమక్షములో కనానీయులు ఒక మతాచారముగా లైంగిక క్రియలు చేయుటద్వారా ఆరాధన చేసేవారు; ఆ పిమ్మట వారు అదే దేవతలకు బలియర్పణగా తమ ప్రథమ సంతానమును హత్యచేసేవారు. దేశవ్యాప్తముగా పెద్దయెత్తులో కనాను దేశము ఒకవిధమైన సొదొమ గొమొర్రాలవలె తయారైనట్లుగా కన్పించుచున్నది.” ఆయనింకనూ తెల్పునదేమంటే, “అంతటి హేయకరమైన, కౄరమైన నాగరికత ఉనికిలో ఉండుటకు ఏమైనా హక్కును కలిగియున్నదా? . . . కనాను పట్టణముల శిధిలాలలో త్రవ్వకాలు సాగించు పురావస్తు శాస్త్రజ్ఞులు, దేవుడు వాటిని నాశనంచేసిన దానికంటే ఇంకా ముందుగానే ఎందుకాయన నాశనం చేయలేదని ఆశ్చర్యపడుచున్నారు.”
5. తన ప్రాచీనకాల ప్రజలను దేవుడు విడిపించుట మనకాలము కొరకు ఎట్లు ఒక మాదిరిగా పనిచేయుచున్నది?
5 అబద్ధ ఆరాధనపై దేవుడు చర్య గైకొని, తన నిబంధనా ప్రజలను విడిపించి వారికి వాగ్దాన దేశమును అనుగ్రహించుటను గూర్చితెలుపు యీ వృత్తాంతము రానైయున్న సంగతులకు ఒక మాదిరిగా పనిచేయుచున్నది. దేవుడు ఈ లోక అబద్ధ మతములను వాటి మద్దతుదారులను తుత్తినియలుచేసి, ఆపై తన ఆధునిక-దిన సేవకులను ఒక నీతియుక్తమైన నూతన లోకములోనికి ప్రవేశింపజేయు సమీప భవిష్యత్తును ఇది సూచించుచున్నది.—ప్రకటన 7:9, 10, 13, 14; 2 పేతురు 3:10-13.
దేవుని నూతన లోకములో నిజమైన స్వాతంత్ర్యము
6. నూతన లోకములో దేవుడు దయచేయు కొన్ని అద్భుతకరమైన స్వాతంత్ర్యములు ఏమైయున్నవి?
6 నూతన లోకములో మానవ కుటుంబము యెడల ఆయన సంకల్పించిన స్వాతంత్ర్యపు అద్భుతమైన ముఖరూపములన్నింటితో దేవుడు తన ప్రజలను ఆశీర్వదించును. రాజకీయ, ఆర్ధిక మరియు అబద్ధమత శక్తుల అణచివేతనుండి అక్కడ స్వాతంత్ర్యము ఉండును. ప్రజలు భూమిపై నిత్యము జీవించు ఉత్తరాపేక్షతో, అక్కడ పాపమరణముల నుండి స్వాతంత్ర్యము ఉండును. “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29; మత్తయి 5:5.
7, 8. నూతన లోకములో పరిపూర్ణ ఆరోగ్యమును మరలా సంపాదించుటలో ఎటువంటి అనుభవము ఉండును?
7 నూతన లోకము వచ్చినవెంటనే, దాని నివాసులు అద్భుతరీతిలో పరిపూర్ణ ఆరోగ్యమునకు పునరుద్ధరింపబడుదురు. యోబు 33:25 చెప్పునదేమనగా, “అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి కలుగును.” యెషయా 35:5, 6 ఇట్లు వాగ్దానము చేయుచున్నది: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులు వేయును మూగవాని నాలుక పాడును.”
8 వృద్ధాప్యము లేక అనారోగ్యము కారణముగా శారీరక రుగ్మతలున్న మీరు, నూతన లోకములో ప్రతి ఉదయం మంచి ఆరోగ్యముతో, నూతననోత్సాహముతో మేల్కొనుటను మీకైమీరు ఊహించండి. ముడతలు పడిన మీ చర్మము నున్నగా ఆరోగ్యవంతముగా—చర్మసంబంధ మలాములు ఇక ఏమాత్రము అవసరము లేకుండా తయారైనది. మసకబారిన లేక అంధత్వము కలిగిన మీ నేత్రములకు పరిపూర్ణ దృష్టి పునరుద్ధరించబడినది—ఇక ఏమాత్రము కళ్లద్దాలు అవసరం లేదు. వినికిడి సామర్థ్యము పూర్తిగా పునరుద్ధరించబడింది—ఆ వినికిడి సహాయక పరికరాలను ఇక విసిరి అవతల పారేయండి. సడలిన కాళ్లు ఇప్పుడు బలంగా ఆరోగ్యంగా ఉన్నాయి—ఆ చేతికర్రలను, చంకలక్రింది కర్రలను, చక్రాల కుర్చీలను వదిలించుకోండి. రోగమక్కడ లేనేలేదు—ఆ మందులన్నింటిని పారవేయండి. అదే విధముగా యెషయా 33:24 ప్రవచించుచున్నది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” ఆయనింకను తెల్పునదేమనగా, “వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును.”—యెషయా 35:9.
9. యుద్ధము ఎట్లు శాశ్వతముగా అంతమొందించబడును?
9 ఎవరును ఇక ఎంతమాత్రము యుద్ధమునకు బలికారు. “[దేవుడు] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.” (కీర్తన 46:9) దేవుని రాజ్య పరిపాలకుడైన, యేసుక్రీస్తు ఎన్నటికిని యుద్ధాయుధములను మరలా అనుమతించడు. ఆయనను యెషయా 9:6 “సమాధానకర్తయగు అధిపతి” అని పిలుచుచున్నది. 7వ (NW) వచనము ఇంకను తెల్పునదేమనగా, “అధిపతి పాలనకు మరియు సమాధాన సమృద్ధికి అంతముండదు.”
10, 11. భూమికి సంపూర్ణ సమాధానము అనగా దాని భావమేమి?
10 యుద్ధాయుధములు లేకుండుట, మానవజాతికి, యీ భూమికి ఎంత ఆశీర్వాదకరము! అంతెందుకు, ప్రస్తుతకాలములో గతమందు యుద్ధములలో ఉపయోగించిన ఆయుధములు ఇంకను ప్రజలను నాశనము చేయుచున్నవి. ఒక దేశములో, అనగా ఫ్రాన్సులో జరిగిన గతయుద్ధములలో వదిలివేయబడిన ప్రేలుడు పదార్థాలను తీసివేయు సమయములో బాంబులను నిర్వీర్యముచేయు నిపుణులు 1945 నుండి 600 మందికి పైగా చనిపోయారు. బాంబులను నిర్వీర్యముచేయు సంస్థయొక్క అక్కడి పైఅధికారి ఇట్లనెను: “1870 నాటి ఫ్రాంకో-ప్యూషియన్ యుద్ధమందలి ఇంకను శక్తిగల ఫిరంగి గుండ్లను మేము కనుగొనుచున్నాము. మొదటి ప్రపంచ యుద్ధమునాటి విషపూరిత చేతిబాంబులతో నిండిన సరస్సులును కలవు. ఆయా సమయాలలో, రెండవ ప్రపంచయుద్ధమునాటి టాంకు-విధ్వంసక మందుపాతర మీదుగా తన ట్రాక్టరునడిపి చనిపోయిన రైతుల సంఘటనలు కలవు. ఇలాంటివి ప్రతిచోటా కలవు.” రెండు సంవత్సరాల క్రితం ది న్యూయార్క్ టైమ్స్ ఇలా వ్యాఖ్యానించినది: “రెండవ ప్రపంచ యుద్ధము ముగిసిన దగ్గరనుండి 45 సంవత్సరాలలో, [బాంబులను నిర్వీర్యముచేయు బృందాలు] [ఫ్రాన్సుదేశ] భూమినుండి 1 కోటి 60 లక్షల కాల్బలసైనిక బాంబులను, 4,90,000 బాంబులను, 6,00,000 జలాంతర మందుపాతర్లను వెలికితీసినవి. . . . విపరీతముగా ప్రేలుడు పదార్ధములతో నిండియున్న లక్షలాది ఎకరాలచుట్టూ కంచెవేసి, దానికి ‘ముట్టుకోవద్దు, అది నిన్ను చంపుతుంది!’ అని వ్రాసివున్న ప్రకటన పత్రాలను అంటించారు.”
11 ఆ నూతన లోకము ఎంతగా భిన్నమైయుండును! ప్రతివారు మంచి గృహమును, సమృద్ధిగా ఆహారమును, భూమినంతటిని పరదైసుగా మార్చు ప్రతిఫలదాయకమైన మరియు సమాధానకరమైన పనిని కలిగియుందురు. (కీర్తన 72:16; యెషయా 25:6; 65:17-25) ప్రజలు, భూమి మరలా ఇక ఎన్నటికిని లక్షలసంఖ్యలో ప్రేలుడు పదార్ధాల తాకిడికి గురికావు. తనయందు విశ్వాసముచూపిన వ్యక్తితో యేసు, “నీవు నాతోకూడ పరదైసులో ఉందువు” అని చెప్పినప్పుడు ఆయన అటువంటి నూతన లోకమునే తన మదిలో కలిగియుండెను.—లూకా 23:43.
జీవము కొరకు భూవ్యాప్తముగా విద్య
12, 13. మన కాలము కొరకు యేసు మరియు యెషయా ఏ భూవ్యాప్తమైన విద్యా పనినిగూర్చి ప్రవచించిరి?
12 ఒక వ్యక్తి దేవుని నూతన లోకమునుగూర్చి నేర్చుకొనునప్పుడు, అతడు మన దినములలో సత్యారాధన కొరకు యెహోవా ఒక ప్రపంచవ్యాప్త సంఘము నొకదానిని వ్యవస్థీకరించాడని కూడ నేర్చుకొనును. అది నూతన లోకమునకు కేంద్రీయ భాగమైయుండును, మరియు దేవుడు దానిని తన సంకల్పములను గూర్చి ఇతరులకు ఉపదేశించుటకు ఇప్పుడు ఉపయోగించుచున్నాడు. క్రిత్తమెన్నడూ చూడనంత భారీగాను, రీతిలోను ఈ క్రైస్తవ సంస్థ భూవ్యాప్త విద్యాపనిని నెరవేర్చుచున్నది. ఇది జరిగింపబడునని యేసు ముందుగానే చెప్పెను. ఆయనిట్లనెను: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:14; మత్తయి 6:9, 10 కూడా చూడుము.
13 యెషయా కూడ ఈ భూవ్యాప్త విద్యాపనిని గూర్చి మాట్లాడెను: “అంత్యదినములలో [మన కాలములో] పర్వతములపైన యెహోవా మందిర పర్వతము [ఉన్నత పరచబడిన ఆయన సత్యారాధన] పర్వత శిఖరమున స్థిరపరచబడును . . . ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. జనములు గుంపులు గుంపులుగా వచ్చి— . . . యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.”—యెషయా 2:2, 3.
14. ఈనాడు మనము దేవుని ప్రజలను ఎట్లు గుర్తించగలము?
14 కావున, దేవుని రాజ్యమునుగూర్చిన భూవ్యాప్తముగా సాక్ష్యమిచ్చు ఈ పని మనము ఈ దుష్ట విధానాంతమునకు దగ్గరున్నామనుటకు, నిజమైన స్వాతంత్ర్యము చేరువలో ఉన్నదనుటకు బలమైన రుజువై యున్నది. దేవుని నూతన లోకముయొక్క నిరీక్షణతో-నిండిన వర్తమానమును ప్రజలకు అందజేయు వారు అపొ. కార్యములు 15:14లో “[దేవుని] నామము కొరకు ఒక జనము” అని వర్ణింపబడిరి. ఎవరు యెహోవా నామమును ధరించికొని యెహోవాను గూర్చి ఆయన రాజ్యమును గూర్చి భూవ్యాప్తముగా సాక్ష్యమిచ్చుచున్నారు? ఈ 20వ శతాబ్దపు చరిత్రయే దానికిట్లు సమాధానమిస్తుంది: అలా చేసేవారు కేవలము యెహోవాసాక్షులు మాత్రమే. ఈనాడు ప్రపంచవ్యాప్తముగా వారు 60,000కు పైగావున్న సంఘములలో వారు 40 లక్షలకుమించి ఉన్నారు.—యెషయా 43:10-12; అపొ. కార్యములు 2:21.
15. రాజకీయ వ్యవహారముల విషయములో, దేవుని నిజమైన సేవకులను మనమెట్లు గుర్తించగలము?
15 రాజ్య-ప్రచార పనినిగూర్చిన ప్రవచనములను యెహోవాసాక్షులు నెరవేర్చుచున్నారనుటకు మరొక రుజువు యెషయా 2:4లో వ్రాయబడినది: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇకమానివేయును.” కాబట్టి దేవుని రాజ్యమును గూర్చి భూవ్యాప్తముగా ప్రచారముచేయు వారు తప్పక ‘యుద్ధముచేయ నేర్చుకొనుట మానివేయవలెను.’ వారు “లోక సంబంధులు” కాకూడదని యేసు చెప్పెను. (యోహాను 17:16) అంటే దేశముల వైరుధ్యములలో మరియు యుద్ధములలో ఏ పక్షమూ వహించకుండా, వారు రాజకీయ వ్యవహారములలో తప్పక తటస్థముగా ఉండవలెనని దాని భావము. లోక సంబంధులు కాకుండా, యుద్ధముచేయ నేర్చుకొనకుండా ఎవరున్నారు? మరలా, ఈ 20వ శతాబ్దపు చరిత్రయే దానిని రుజువు చేయుచున్నది: అట్టివారు యెహోవాసాక్షులు మాత్రమే.
16. దేవుని భూవ్యాప్తమైన విద్యాపని ఎంత సంపూర్ణముగా ఉండును?
16 ఈ ప్రస్తుత దుష్ట విధానమును దేవుడు అంతమొనర్చిన పిదపకూడ యెహోవాసాక్షులు యీ భూవ్యాప్తమైన విద్యాపని కొనసాగును. యెషయా 54:13 ఇట్లనుచున్నది: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు.” ఈ ఉపదేశము ఎంత సంపూర్ణముగా ఉండునంటే యెషయా 11:9 ఇట్లు ప్రవచించుచున్నది: “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.” ఈ పాతలోక అంతమునుండి తప్పింపబడిన వారికి మాత్రమే గాక నూతన లోకములో జన్మించు పిల్లలకును ఆలాగే పునరుత్థానమగు కోటానుకోట్ల మందికికూడా యీ నిర్విరామ ఉపదేశము అవసరము. చివరకు, భూమిపై జీవించు ప్రతివ్యక్తి దేవుని నియమముల హద్దులలోనే యుక్తముగా తన స్వయంచిత్తమును అభ్యసించుటకు ఉపదేశింపబడుదురు. దాని ఫలితమేమి? “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.
గొప్ప స్వాతంత్ర్యములు ఇప్పుడు కూడ
17. ఏమి చేయవలెనని మోషే దేవుని ప్రాచీన ప్రజలకు చెప్పెను?
17 ప్రాచీన ఇశ్రాయేలీయులు వాగ్దానదేశములో ప్రవేశించుచుండగా మోషే వారితో మాట్లాడి ఇట్లనెను: “నీ దేవుడైన యెహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి—నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు?”—ద్వితీయోపదేశకాండము 4:5-7.
18. దేవుని సేవించువారికి ఇప్పుడు సహితము ఏ గొప్ప స్వాతంత్ర్యములు లభించగలవు?
18 ఈనాడు యెహోవాను ఆరాధించు లక్షలాదిమంది కూడ వాగ్దాన దేశపు—నూతన లోకపు ద్వారమున ఉన్నారు. వారు దేవుని నియమములకు లోబడుచున్నందున ఆయన వారికి సమీపముగా ఉన్నాడు మరియు వారు ఇతర ప్రజలందరినుండి ప్రత్యేకముగా ఉన్నారు. ఇప్పటికే దేవుడు వారిని అబద్ధమత తలంపులు, జాతివివక్ష, అక్రమ మాదక ద్రవ్యముల వాడుక, జాతీయవాదము, యుద్ధము మరియు సుఖరోగములు ప్రబలుటనుండి విడుదల చేశాడు. అంతేకాకుండా, ఆయన వారిని అవిఘ్న అంతర్జాతీయ సహోదర ప్రేమయందు ఐక్యపరచియున్నాడు. (యోహాను 13:35) వారు భవిష్యత్తునుగూర్చి కలతచెందరు గాని “హృదయానందముచేత కేకలు వేసెదరు.” (యెషయా 65:14) దేవున్ని ఇప్పుడే పరిపాలకునిగా సేవించుట ద్వారా వారు ఎంతటి గొప్ప స్వాతంత్ర్యముల ననుభవించుచున్నారు!—అపొ. కార్యములు 5:29, 32; 2 కొరింథీయులు 4:7; 1 యోహాను 5:3.
అబద్ధ నమ్మకములనుండి ఇతరులను విడిపించుట
19, 20. చనిపోయినవారి స్థితినిగూర్చి బైబిలు చేయు బోధద్వారా ప్రజలెట్లు విడుదల చేయబడుచున్నారు?
19 యెహోవాసాక్షులు ప్రకటించుచున్న ప్రజలు సహితము ఈ స్వాతంత్ర్యములను కనుగొనుచున్నారు. ఉదాహరణకు, పూర్వికుల ఆరాధనచేసే దేశములలో, చనిపోయిన వారు ఎక్కడా సజీవులై లేరని, బ్రతికియున్న వారికి ఏ హానియు చేయలేరని యెహోవాసాక్షులు ఇతరులకు తెల్పుచున్నారు. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు” అని చెప్పుచున్న ప్రసంగి 9:5ను సాక్షులు సూచింతురు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతడు ‘మంటిపాలగును. అతని సంకల్పములు నాడే నశించును’ అని సూచించుచున్న కీర్తన 146:4ను కూడా వారు సూచింతురు. కావున, ప్రేతాత్మ లేక అమర్త్యమైన ఆత్మ స్వస్థత చేకూర్చునని లేదా బ్రతికియున్న వారిని జడిపించునని బైబిలు చూపించుట లేదు. అందువలన, కష్టపడి సంపాదించిన డబ్బును మాంత్రికులు లేక పూజార్ల సేవలకొరకు ఖర్చుచేయనవసరము లేదు.
20 అటువంటి ఖచ్ఛితమైన బైబిలు జ్ఞానము ప్రజలను నరకాగ్ని మరియు పాపవిమోచన లోకం వంటి అబద్ధ బోధలనుండి విడుదల చేయును. చనిపోయిన వారు, గాఢనిద్రలో ఉన్నట్లు స్పృహలేని స్థితిలో ఉన్నారను బైబిలు సత్యమును ప్రజలు నేర్చుకొనినప్పుడు, చనిపోయిన తమ ప్రియమైన వారికి ఏమి జరిగినదని ఎంతమాత్రము చింతించరు. బదులుగా, వారు అపొస్తలుడైన పౌలు తెల్పిన అద్భుతమైన సమయము కొరకు ఎదురుచూచెదరు. ఆయనిట్లనెను: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.”—అపొ. కార్యములు 24:15.
21. పునరుత్థానమగు వారిలో నిస్సందేహముగా ఎవరు చేరియుందురు, మరియు బహుశ వారి ప్రతిస్పందన ఏమైయుండును?
21 ఆదాముద్వారా సంక్రమించిన మరణమునుండి శాశ్వతముగా విడిపింపబడిన భూమిమీది జీవితమునకు మృతులు పునరుత్థానము చేయబడుదురు. పునరుత్థానమైన వారిలో మోలెకువంటి కనాను దేవతలకు బలియర్పింపబడిన పిల్లలు, ఎజ్‌టెక్ దేవతలకు బలియివ్వబడిన యువకులు, యుద్ధదేవతకు బలిచేయబడిన లెక్కకురాని లక్షలాదిమంది వ్యక్తులు నిస్సందేహముగా చేరియుందురు. అబద్ధ నమ్మకములకు బలియైన ఆ పూర్వికులు ఎంతగా ఆశ్చర్యపడుదురు మరియు ఆనందింతురు! అలా పునరుత్థానము చేయబడిన వారు అప్పుడు ఆనందముతో ఇలా ప్రకటింతురు: “ఓ మరణమా, [షియోల్ NW] నీ విజయమెక్కడ? [నాశనకర ప్రభావము NW] ఓ మరణమా, నీ ముల్లెక్కడ?”—హొషేయ 13:14.
యెహోవా కొరకు వెదకుము
22. మనము దేవుని నూతన లోకములో జీవించుటకు కోరుకొనినట్లయిన, మనమేమి మనస్సు నందుంచుకొనవలెను?
22 నిజమైన స్వాతంత్ర్యము ఉండు దేవుని నూతన లోకములో జీవించుటకు నీవు కోరుదువా? అట్లయిన, 2 దినవృత్తాంతములు 15:2లోని మాటలను నీవు హృదయములోనికి తీసికొనవలెను: “మీరు యెహోవా పక్షపు వారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును.” దేవుని గూర్చి నేర్చుకొని ఆయనను ప్రీతిపరచుటకు నీవు నిష్కపటముగాచేయు ప్రయత్నములు గమనించబడకుండా ఉండవని మనస్సునందుంచుకొనుము. దేవుడు “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడు” అని హెబ్రీయులు 11:6 తెల్పుచున్నది. మరియు రోమీయులు 10:11 ఇట్లు చెప్పుచున్నది: “ఆయనయందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు.”
23. దేవుని నూతన లోక స్వాతంత్ర్యమును మనమెందుకు ఎలుగెత్తి చాటవలెను?
23 దేవుని నూతన లోకముయొక్క నిజమైన స్వాతంత్ర్యము కనుచూపు మేరలోనే ఉన్నది. అక్కడ “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందును.” మరియు “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (రోమీయులు 8:21; ప్రకటన 21:4) అప్పుడు యెహోవా సేవకులందరు, ‘చివరకు నిజమైన స్వాతంత్ర్యము నిచ్చినందుకు, యెహోవా మీకు కృతజ్ఞతలు’ అని కేకలువేస్తు వారు తమ తలలెత్తుకొని సంతోషముతో దేవుని నూతన లోక స్వాతంత్ర్యమును ఎలుగెత్తిచాటుదురు. (w92 4/1)
మీరెట్లు జవాబిత్తురు?
◻ తన ప్రజలను విడిపించు తన సామర్థ్యమును యెహోవా ఎట్లు ప్రదర్శించెను?
◻ దేవుని నూతన లోకములో ఎటువంటి అద్భుతకరమైన స్వాతంత్ర్యములు ఉండును?
◻ జీవము కొరకు యెహోవా ప్రజలకెట్లు విద్యాబోధన జరిగించుచున్నాడు?
◻ యెహోవాను సేవించుటద్వారా ఇప్పుడును దేవుని ప్రజలు అనుభవించు కొన్ని స్వాతంత్ర్యములు ఏమైయున్నవి?
[14వ పేజీలోని చిత్రాలు]
తన ఆరాధికులను విడిపించుచు, యెహోవా ఐగుప్తు అబద్ధ దేవతలపై తన ఉన్నతత్వమును చూపించెను
[16, 17వ పేజీలోని చిత్రాలు]
ఆయన భూవ్యాప్త విద్యాపనిని నెరవేర్చుటద్వారా మరియు ఆయన నామము ధరించుటద్వారా ఈనాడు దేవుని నిజమైన సేవకులు గుర్తింపబడుచున్నారు