ప్రార్థన ఆలకించు యెహోవాకు, భయపడుము
“ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు.”—కీర్తన 65:2.
1. ప్రార్థనయందు తనను సమీపించుటకు ఇచ్ఛయించువారు పాటించవలసిన విషయములను యెహోవా కోరునని మనమెందుకు అపేక్షించవలెను?
యెహోవా దేవుడు “యుగములకు రాజు.” అంతేకాకుండా ఆయన “ప్రార్థన ఆలకించువాడు,” ఆయనయొద్దకు “సర్వశరీరులు వచ్చెదరు.” (ప్రకటన 15:3; కీర్తన 65:2) అయితే వారు ఆయన యొద్దకు ఎట్లు రావలెను? భూరాజులు తమ సన్నిధికివచ్చుటకు అనుమతింపబడువారు ఎట్లు ప్రవర్తింపవలెను మరియు ఎటువంటి దుస్తులు ధరించవలెను వంటి విషయములను నిర్దేశింతురు. కావున, విజ్ఞాపనలతో కృతజ్ఞతాస్తుతులతో తనయొద్దకు వచ్చుటకు ఇష్టపడువారు పాటించవలసిన విషయములను యుగములకు రాజైనవాడు నిశ్చయముగా కలిగియుండునని మనము అపేక్షించవలెను.—ఫిలిప్పీయులు 4:6, 7.
2. ప్రార్థన విషయమై ఏ ప్రశ్నలు ఉత్పన్నమగును?
2 ప్రార్థనయందు తనను సమీపించువారినుండి యుగములకు రాజైనవాడు ఏమికోరును? ఎవరు ప్రార్థించగలరు మరియు వారి ప్రార్థన ఎట్లు ఆలకింపబడును? మరియు వారు దేనికొరకు ప్రార్థించగలరు?
యుగములకు రాజైన వానిని సమీపించుట
3. దేవుని తొలిసేవకులు చేసిన ప్రార్థనల ఏ ఉదాహరణలు మీరు ఇవ్వగలరు, మరియు వారు మధ్యస్తముగా దేనినైనా ఉపయోగించి ఆయనను సమీపించిరా?
3 తాను పాపికాకముందు, ఆదాము “దేవుని కుమారునిగా” సాక్ష్యాధారముగా యుగములకు రాజైన వానితో సంభాషించెను. (లూకా 3:38; ఆదికాండము 1:26-28) ఆదాము కుమారుడైన హేబెలు దేవునికి “తన మందలో తొలిచూలున పుట్టిన వాటిని” అర్పించినప్పుడు, నిస్సందేహముగా ఈ అర్పణతో కృతజ్ఞత మరియు స్తుతి జోడింపబడెను. (ఆదికాండము 4:2-4) నోవహు, అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబు బలిపీఠములు కట్టించి తమ అర్పణలతో వారు ప్రార్థనాపూర్వకముగా యెహోవాను సమీపించిరి. (ఆదికాండము 8:18-22; 12:7, 8; 13:3, 4, 18; 22:9-14; 26:23-25; 33:18-20; 35:1, 3, 7) సొలొమోను, ఎజ్రా మరియు దైవ ప్రేరితుడైన కీర్తన రచయితల ప్రార్థనలు, ఇశ్రాయేలీయులు ఎటువంటి మధ్యవర్తిత్వము లేకుండా దేవుని సమీపించిరని సూచించుచున్నవి.—1 రాజులు 8:22-24; ఎజ్రా 9:5, 6; కీర్తన 6:1, 2; 43:1; 55:1; 61:1; 72:1; 80:1; 143:1.
4. (ఎ) ప్రార్థనయందు దేవుని సమీపించుటకు మొదటి శతాబ్దములో ఏ క్రొత్తవిధానము ప్రవేశపెట్టబడెను? (బి) యేసు నామమున ప్రార్థనచేయుట ప్రత్యేకముగా ఎందుకు సముచితమైయున్నది?
4 దేవుని సమీపించుటకు ఒక క్రొత్తవిధానము మన సామాన్య శకముయొక్క తొలి శతాబ్దములో ప్రవేశపెట్టబడెను. అది మానవజాతి యెడల ప్రత్యేకమైన ప్రేమను కలిగియుండిన ఆయన కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా. తన మానవపూర్వ ఉనికిలో యేసు మానవజాతికి సంబంధించిన విషయములందు ఆనందించుచు “ప్రధాన శిల్పిగా” సంతోషముతో సేవచేసెను. (సామెతలు 8:30, 31) భూమిపై మానవునిగా యేసు, అసంపూర్ణ మానవులకు ఆత్మీయముగా ప్రేమతో సహాయము చేసెను, బాధపడువారిని బాగుచేసెను ఆలాగే ఆయన చనిపోయిన వారిని సహితము లేపెను. (మత్తయి 9:35-38; లూకా 8:1-3, 49-56) అన్నింటికంటే పైగా, యేసు ‘అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చెను.’ (మత్తయి 20:28) కావున, విమోచన క్రయధనముద్వారా ప్రయోజనముపొందు వారు మానవజాతిని ఇంతగా ప్రేమించిన వానిద్వారా దేవుని సమీపించుట ఎంత సముచితము! ఇప్పుడు యుగములకు రాజైన వానిని సమీపించుటకు కేవలము ఇదియే మార్గము, ఏలయనగా యేసు తానుగా ఇట్లు చెప్పెను: “నాద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” మరియు, “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును.” (యోహాను 14:6; 16:23) యేసు నామమున అడుగుటయంటే, ప్రార్థన ఆలకించువానిని సమీపించుటకు ఆయన మార్గమైయున్నాడని ఆయనను గుర్తించుటయని భావము.
5. మానవ లోకముయెడల దేవుని దృక్పధము ఏమైయున్నది, మరియు ఇది ప్రార్థనపై ఎటువంటి ప్రభావమును కలిగియున్నది?
5 ప్రత్యేకముగా విమోచన క్రయధనమును సమకూర్చుటలో యెహోవా చూపిన ప్రేమను మనము ప్రశంసించవలెను. యేసు ఇట్లనెను: “దేవుడు [మానవ] లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) దేవుని ప్రేమయొక్క గాఢత కీర్తనల రచయిత మాటలలో చక్కగా వ్యక్తపరచబడెను: “భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు. తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.” (కీర్తన 103:11-14) యెహోవా సమర్పిత సాక్షుల ప్రార్థనలు ఆయన కుమారునిద్వారా అంతటి ప్రేమగల తండ్రియొద్దకు చేరునని తెలిసికొనుట ఎంత హృదయానందకరము!
కట్టుబాట్లుగల ఆధిక్యత
6. ఎటువంటి దృక్పధముతో ప్రార్థనయందు యెహోవాను సమీపించవలెను?
6 అప్రకటితముగా ఎవరుబడితేవారు రాజసౌధము లోనికి వచ్చుటను మానవ రాజులు అనుమతించరు. రాజు సముఖమునకు వచ్చుట కట్టుబాట్లతో కూడిన ఆధిక్యతయైయుండును. ఆలాగే యుగములకు రాజైనవానికిచేయు ప్రార్థనయు ఉన్నది. దేవుని దివ్య ఘనతయెడల ప్రశంసతో యేసుక్రీస్తుద్వారా ఆయనను సమీపించువారు తమ ప్రార్థనలు ఆలకింపబడునని అపేక్షించవచ్చును. పూజ్యభావముతో, ఆరాధనా దృక్పధముతో యుగములకు రాజైనవానిని సమీపించవలెను. తమ ప్రార్థన ఆలకింపబడవలెనని ఇచ్ఛయించువారు “యెహోవాయందు భయభక్తులను” ప్రదర్శించవలెను.—సామెతలు 1:7.
7. “యెహోవాయందు భయభక్తులు” అనగానేమి?
7 “యెహోవాయందు భయభక్తులు” అనగానేమి? అది ఆయనను అప్రీతిపరచుటకు ఆరోగ్యదాయకమైన భయముతోకూడిన లోతైన పూజ్యభావమైయున్నది. ఈ భయము ఆయన కృప మరియు మంచితనము కొరకైన లోతైన కృతజ్ఞతనుండి ఉద్భవించును. (కీర్తన 106:1) దీనియందు, తనకు అవిధేయులగు వారికి మరణశిక్ష విధించుటతోసహా శిక్షించు శక్తి మరియు హక్కుగల యుగములకు రాజుగా ఆయనను ఒప్పుకొనుట ఇమిడియున్నది. యెహోవాయందు భయభక్తులు ప్రదర్శించు వ్యక్తులు వారి ప్రార్థన ఆలకింపబడునని అపేక్షించవచ్చును.
8. తనకు భయపడువారి ప్రార్థనలను దేవుడు ఎందుకు వినును?
8 సహజముగా, దేవుడు దుష్టులు, విశ్వాసరహితులు, మరియు స్వనీతిపరులైన వారి ప్రార్థనలకు ప్రత్యుత్తరమివ్వడు. (సామెతలు 15:29; యెషయా 1:15; లూకా 18:9-14) అయితే యెహోవాకు భయపడువారి ప్రార్థనలు ఆలకింపబడును, ఏలయనగా వారు ఆయన నీతికట్టడల ప్రకారము తమ జీవితములను మార్చుకొనిరి. వారు అంతకంటే ఎక్కువనే చేసిరి. యెహోవాయందు భయముగలవారు ప్రార్థనయందు దేవునికి సమర్పించుకొని దీనిని నీటి బాప్తిస్మముద్వారా ప్రదర్శించిరి. ఆ విధముగా వారు ప్రార్థనయొక్క అపరిమితమైన ఆధిక్యతను కలిగియున్నారు.
9, 10. తమ ప్రార్థనలు ఆలకింపబడునను నిరీక్షణతో బాప్తిస్మము పుచ్చుకొనని వ్యక్తులు ప్రార్థించగలరా?
9 దేవుడు తనను ఆలకించవలెనంటే, ఒకడు తప్పక దేవునిచిత్తమునకు అనుగుణ్యముగావున్న ప్రార్థనాపూర్వక మనోభావములను వ్యక్తపరచవలెను. అవును, అతడు చిత్తశుద్ధిగలవాడైయుండవలెను, అయితే ఇంకా ఎంతో అవసరము. “విశ్వాసములేకుండ [దేవునికి] ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” అని అపొస్తలుడైన పౌలు వ్రాసెను. (హెబ్రీయులు 11:6) సరే, వారి ప్రార్థన ఆలకింపబడునను నిరీక్షణతో ప్రార్థించుడని బాప్తిస్మము తీసికొనని వారిని ప్రోత్సహించవచ్చునా?
10 ప్రార్థన కట్టుబాట్లతో కూడినదైయున్నదని జాగ్రత్తపడవలెను, యెరూషలేములోని దేవాలయముతట్టు తిరిగి ప్రార్థించు పరదేశుల ప్రార్థనలను మాత్రమే యెహోవా ఆలకించవలెనని సొలొమోను అడిగెను. (1 రాజులు 8:41-43) శతాబ్దముల తరువాత, భక్తిపరుడైన పరదేశియగు కొర్నేలీ “ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసెను.” ఖచ్ఛితమైన జ్ఞానము సంపాదించిన తరువాత కొర్నేలీ తననుతాను దేవునికి సమర్పించుకొనగా, ఆయన అతనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. దీనివెంబడి, కొర్నేలీ మరియు ఇతర అన్యులు బాప్తిస్మము పుచ్చుకొనిరి. (అపొ.కార్యములు 10:1-44) కొర్నేలీ వలెనే, ఈనాడు ఎవరైనను సమర్పణవైపు అభివృద్ధి చెందుచున్నయెడల వారిని ప్రార్థించుటకు ప్రోత్సహించవచ్చును. అయితే లేఖనములను పఠించుటలో చిత్తశుద్ధిలేక, ప్రార్థనయెడల దైవిక కట్టడలను ఎరుగకయున్న వ్యక్తి, ఇంకను దేవుని ప్రీతిపరచు దృక్పధమును ప్రదర్శించలేదు గనుక యెహోవాకు భయపడవలెనని, విశ్వాసము కలిగియుండవలెనని, లేక నమ్మకముగా ఆయనను వెదకమని చెప్పలేము.
11. బాప్తిస్మమువైపు పురోగమించుచున్న కొందరికి ఏమి సంభవించెను, మరియు వారికైవారు ఏమని అడుగుకొనవలెను?
11 ఒకప్పుడు సమర్పణవైపు పురోగమించి ఆపిమ్మట వెనుకకు తగ్గినవారిగా కొందరు కన్పించవచ్చును. ఎలాంటి షరతులేకుండా ఆయనకు సమర్పించుకొను విషయమై వారి హృదయములో దేవుని కొరకై తగినంత ప్రేమలేనట్లయిన, ప్రార్థించు ఆ అద్భుతకరమైన ఆధిక్యతను తామింకను కలిగియున్నామా లేదాయని తమను ప్రశ్నించుకొనవలెను. స్పష్టముగా వారికి ఆ ఆధిక్యత లేదు, ఎందుకనగా దేవుని సమీపించువారు ఆయనను నమ్మకముగా వెదకవలెను అంతేకాదు నీతిని మరియు సాత్వికమునుకూడ వెదకవలెను. (జెఫన్యా 2:3) యెహోవాకు నిజముగా భయపడు ప్రతివాడు దేవునికి సమర్పించుకొని దానిని నీటిబాప్తిస్మముద్వారా ప్రదర్శించిన విశ్వాసియైయున్నాడు. (అపొ.కార్యములు 8:13; 18:8) కాగా ప్రార్థనయందు యుగములకు రాజైన వానిని సమీపించు అపరిమితమైన ఆధిక్యతను కేవలము బాప్తిస్మము తీసికొనిన విశ్వాసులు మాత్రమే కలిగియున్నారు.
“పరిశుద్ధాత్మతో ప్రార్థనచేయుట”
12. ఒక వ్యక్తి “పరిశుద్ధాత్మతో ప్రార్థించుచున్నాడని” ఎప్పుడు చెప్పవచ్చును?
12 ఒకవ్యక్తి దేవునికి సమర్పించుకొని దానిని బాప్తిస్మముద్వారా సూచించిన పిదప, ఆయన ‘పరిశుద్ధాత్మతో ప్రార్థనచేయు’ స్థానములో ఉండును. దీనిని గూర్చి యూదా ఇట్లు వ్రాసెను: “ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మ(తో)లో ప్రార్థనచేయుచు నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.” (యూదా 20, 21) దేవుని ఆత్మ లేక చురుకైన శక్తి ప్రభావము క్రింద మరియు ఆయన వాక్యములో చెప్పబడిన విషయముల కనుగుణ్యముగా ప్రార్థించునప్పుడు, ఒకడు పరిశుద్ధాత్మతో ప్రార్థించినవాడగును. యెహోవా ఆత్మ ప్రేరణక్రింద వ్రాయబడిన లేఖనములు, మనము ఎలా ప్రార్థించవలెను మరియు ప్రార్థనలో ఏమి విన్నవించవలెనో చూపును. ఉదాహరణకు, దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునను నమ్మకముతో మనము ప్రార్థించవచ్చును. (లూకా 11:13) మనము పరిశుద్ధాత్మతో ప్రార్థించునప్పుడు, యెహోవా ప్రేమించు హృదయ పరిస్థితిని మన ప్రార్థనలు వెల్లడిచేయును.
13. మనము పరిశుద్ధాత్మతో ప్రార్థించినట్లయిన, మనము దేనిని విడనాడుదుము, యేసుయొక్క ఏ సలహాను మనము అన్వయింతుము?
13 మనము పరిశుద్ధాత్మతో ప్రార్థించునప్పుడు, మన ప్రార్థనలు పెద్దపెద్ద మాటలతో నిండినవై యుండవు. అవి యాంత్రికముగా పదేపదే ఉచ్ఛరించు పదసూత్రములతో నిండియుండవు. అవి చిత్తశుద్ధిలేని అర్థరహిత క్లుప్త స్తుతి పదజాలములతో కూడుకొనియుండవు అటువంటి ప్రార్థనలు క్రీస్తుమత సామ్రాజ్యమందు మరియు మిగతా ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన, మహాబబులోనునందు విస్తారమై యున్నవి. అయితే నిజమైన క్రైస్తవులు యేసు యిచ్చిన ఈ సలహాను లక్ష్యపెట్టుదురు: “మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు; ఏలయనగా వారు మనుష్యులకు కన్పించవలెనని సమాజమందిరములలోను ముఖ్యవీధుల మూలలలోను నిలిచి ప్రార్థింతురు . . . మరియు ప్రార్థించునప్పుడు అన్యులవలె పదములను అదేపనిగా వచింపవద్దు; ఏలయనగా తాము చెప్పినమొత్తమును బట్టి తమ మనవి వినబడునని వారు [తప్పుగా] తలంచుదురు. కావున మీరు వారివలె ఉండకూడదు.”—మత్తయి 6:5-8, బైయింగ్‌టన్.
14. ప్రార్థననుగూర్చి కొంతమంది గ్రహించగల ఎటువంటి మాటలు చెప్పిరి?
14 యేసు మరియు బైబిలు రచయితలకు తోడుగా ఇతరులును ప్రార్థననుగూర్చి గ్రహించగలుగు మాటలు చెప్పిరి. ఉదాహరణకు, ఆంగ్ల రచయితయైన జాన్ బన్యన్ (1628-88) ఇట్లనెను: “ప్రార్థన, ఆత్మయొక్క బలము మరియు సహాయమునందు క్రీస్తుద్వారా, చిత్తశుద్ధితో, భావగర్భితముగా, అనురాగానుభూతితో దేవునియెదుట, ఆత్మను కుమ్మరించుటయై యున్నది.” ప్యూరిటన్ పరిచారకుడైన థామస్ బ్రూక్స్ (1608-80) ఇలా అభిప్రాయపడెను: “ఎంత రమ్యముగా ఉన్నను, దేవుడు మీ ప్రార్థనల వాక్‌పటిమను చూడడు; లేక అవి ఎంత పొడవుగా ఉన్నను, మీ ప్రార్థనల జ్యామితిని చూడడు; లేక అవి ఎన్ని ఉన్నను, మీ ప్రార్థనల అంకశ్రేణిని చూడడు; అవి ఎంత పద్ధతిగా ఉన్నను, మీ ప్రార్థనల న్యాయసమ్మతను చూడడు; గాని ఆయన వాటి చిత్తశుద్ధిని చూచును.” బన్యన్ మాటలకు ఈ వ్యాఖ్యలనుకూడ చేర్చవచ్చును: “ప్రార్థనయందు హృదయములేని మాటలకు బదులు, మాటలులేని హృదయమునుంచుట శ్రేష్ఠము.” అయితే మనము చిత్తశుద్ధిగలవారమైయుండి దైవిక కట్టడలను పాటించుచున్నను, యుగములకు రాజైనవాడు మన ప్రార్థనలను ఆలకించునను నిశ్చయతను మనమెట్లు కలిగియుండగలము?
ఎన్నడును ఎడబాయలేదు
15. సారాంశమందు, లూకా 11:5-8 లో యేసు ఏమిచెప్పెను?
15 తన సమర్పిత సేవకుల ప్రార్థనలను వినకుండ యెహోవా దేవుడు ఎన్నడును ఎడబాయలేదు. తన శిష్యులు ప్రార్థననుగూర్చి నేర్పుమని విన్నవించినప్పుడు, యేసు హృదయంగమమైన మాటలందు దీనిని స్పష్టముచేసెను. కొంత భాగమందు ఆయనిట్లనెను: “మీలో ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి, ‘స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము; నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని’ అతనితో చెప్పినయెడల అతడు లోపలనేయుండి, ‘నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొనియున్నారు, నేను లేచి ఇయ్యలేనని’ చెప్పును. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును.” (లూకా 11:1, 5-8) ఈ ఉపమానములోని అంశము ఏమైయున్నది?
16. ప్రార్థన సంబంధముగా, మనమేమి చేయవలెనని యేసు కోరుచున్నాడు?
16 మనకు సహాయము చేయుటకు యెహోవాకు ఇష్టములేదని నిశ్చయముగా యేసు భావము కాదు. బదులుగా, మనము దేవుని ఖచ్ఛితముగా నమ్మవలెనని ఎడతెగక ప్రార్థించునంతగా ఆయనను ప్రేమించవలెనని యేసు కోరుచున్నాడు. యేసు ఇంకను ఈ విధముగా చెప్పెను: “అటువలె మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.” (లూకా 11:9, 10) కాబట్టి నిశ్చయముగా మనము హింసననుభవించునప్పుడు, ఏదైనా లోతుగా పాతుకుపోయిన వ్యక్తిగత బలహీనతవలన, లేక మరేదైనా పరీక్షవలన కృంగినప్పుడు ఎడతెగక ప్రార్థించవలెను. తన నమ్మకమైన సేవకులకు సహాయము చేయుటకు యెహోవా ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నాడు. “నన్ను తొందరపెట్టవద్దు” అని ఆయన ఎన్నడు అనడు.
17, 18. (ఎ) పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించుమని యేసు మనలను ఎట్లు ప్రోత్సహించెను, మరియు ఆయన మాటల ప్రభావమును ఏది అధికము చేసెను? (బి) ఒక భూసంబంధమైన తండ్రి వ్యవహారములతో దేవుని చర్యలను యేసు ఎట్లు పోల్చెను?
17 దేవునితో మనము సన్నిహిత సంబధమును అనుభవించవలెనంటే, మనకు ఆయనయొక్క పరిశుద్ధాత్మ, లేక చురుకైన శక్తి అవసరము. కావున, యేసు ఇంకను ఇట్లనెను: “మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును!” (లూకా 11:11-13) మత్తయి 7:9-11 రొట్టెకు బదులు రాతినిచ్చుటను గూర్చి మాట్లాడుచున్నది. ప్రాచీన బైబిలు ప్రదేశములలో రొట్టె సమతలముగాయున్న గుండ్రని రాయివంటి రూపము మరియు పరిమాణమును కలిగియుండునని మనము గ్రహించినట్లయిన, యేసు మాటల ప్రభావము అధికమగును. కొన్ని రకముల పాములు కొన్ని రకములైన చేపలను పోలియుండును, మరియు కొంతమేరకు గుడ్డును పోలియుండు చిన్నదైన తెల్లని తేలుకూడా కలదు. అయితే రొట్టె, చేప, లేక ఒక గుడ్డుకొరకు అడిగినట్లయిన, తన కుమారునికి రాతిని, పామును, లేక తేలునిచ్చు తండ్రి ఎటువంటి వాడైయుండును?
18 యేసు ఆ తర్వాత భూసంబంధమైన తండ్రి వ్యవహారములను దేవుడు తన ఆరాధికుల కుటుంబ సభ్యులతో కలిగియుండు చర్యలతో పోల్చెను. స్వాస్థ్యముగా పొందిన పాపమువలన మనము ఎంతోకొంత దుష్టులమైయున్నను, మన పిల్లలకు మనము మంచి బహుమానములను ఇచ్చువారమైయుండగా, వినయముతో అడుగు తన యథార్థ సేవకులకు మన పరలోకపు తండ్రి తన అద్భుతకరమైన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని మనము మరెంతగా అపేక్షించవచ్చును!
19. (ఎ) లూకా 11:11-13 మరియు మత్తయి 7:9-11 లో వ్రాయబడిన యేసు మాటలు ఏమి తెల్పుచున్నవి? (బి) మనము పరిశుద్ధాత్మతో నడిపింపబడినట్లయిన, మన పరీక్షలను మనమెట్లు దృష్టింతుము?
19 మనము ఆయన పరిశుద్ధాత్మ కొరకు మరియెక్కువగా అడుగవలెనని యేసు మాటలు తెల్పుచున్నవి. మనము దానిచే నడిపింపబడినట్లయిన, మనము ‘జీవిత భాగ్యమును గూర్చి సణుగుకొనము’ మరియు మనకు కలుగు పరీక్షలు, రిక్తతలు నిజముగా హానికరమైనవని దృష్టించము. (యూదా 16) నిజమే, “స్త్రీ కనిన కుమారుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును,” మరియు అనేకమంది సమస్యలు లేక హృదయవేదనల అంతము చూడకనే మరణించిరి. (యోబు 14:1) అయితే మనము మన పరీక్షలను ప్రార్థన ఆలకించువాడు ఏదో ఒకరీతిలో మనకు ఇచ్చిన రాళ్లవలెను, పాములవలెను, మరియు తేళ్లవలెను ఎన్నడును దృష్టించకూడదు. ఆయన ప్రేమకు మారుపేరైయున్నాడు మరియు ఆయన ఎవరిని కీడుచేత శోధించడు. బదులుగా, ‘పరిపూర్ణమైన ప్రతి మంచి వరమును’ ఆయన మనకు దయచేయుచున్నాడు. చివరకు ఆయన తనను ప్రేమించి తనకు భయపడువారందరి కొరకు ప్రతిదానిని చక్కబెట్టును. (యాకోబు 1:12-17; 1 యోహాను 4:8) అనేక సంవత్సరములుగా సత్యమందు నడుచుకొనినవారు తమ అనుభవమునుండి వారికి కలిగిన కొన్ని కఠినమైన పరీక్షలు ప్రార్థన విశ్వాసముల ద్వారా తమకు ప్రయోజనకరమైనవిగా మారుటను, మరియు వారి జీవితములలో దేవుని ఆత్మ ఫలములను వృద్ధిపరచినవని తెలిసికొనిరి. (3 యోహాను 4) వాస్తవానికి, ఇంకే శ్రేష్ఠమైన రీతిలో మన పరలోకపు తండ్రి మీద ఆధారపడుటను నేర్చుకొందుము మరియు ఆత్మ ఫలములైన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆశానిగ్రహమును పెంపొందించుకొనుటకు సహాయము చేయబడుదుము?—గలతీయులుకు 5: 22,23.
20. లూకా 11:5-13లో వ్రాయబడిన యేసు మాటలు మనపై ఎటువంటి ప్రభావమును కలిగియుండవలెను?
20 ఆ విధముగా, లూకా 11:5-13 లో వ్రాయబడిన యేసు మాటలు యెహోవా ప్రేమ మరియు ఆప్యాయతా శ్రద్ధలు ఆశీర్వాదకరమైన అభయము నిచ్చుచున్నవి. ఇది మిక్కిలి కృతజ్ఞత మరియు ప్రేమతో మన హృదయములను నింపవలెను. అది మన విశ్వాసమును బలపరచి మనము తరచుగా యుగముల రాజైనవాని పాదపీఠమునొద్దకు వెళ్లుచు, ఆయన ప్రేమపూర్వక ప్రత్యక్షతయందు నిలుచు మన కోరికను అభివృద్ధిపరచవలెను. అంతేకాకుండా, యేసు మాటలు మనమెన్నడు అలక్ష్యము చేయబడమని అభయమిచ్చుచున్నవి. మనము మన భారమును ఆయనపై వేయుట మన పరలోకపు తండ్రికి ప్రీతికరము. (కీర్తన 55:22; 121:1-3) మరియు మనము ఆయన నమ్మకమైన సమర్పిత సేవకులుగా, ఆయన పరిశుద్ధాత్మను అడిగినప్పుడు, ఆయన దానిని విస్తారముగా దయచేయును. ఆయన ప్రేమగల మన దేవుడు, మరియు ఆయన మన ప్రార్థన ఆలకించువాడను సంపూర్ణ విశ్వాసమును కలిగియుండగలము. (w90 5/15)
మీరు జ్ఞప్తికి తెచ్చుకొందురా?
◻ ప్రార్థనయందు మనము ఎవరిద్వారా సమీపించవలెను, ఎందుకు?
◻ ప్రార్థన ఏవిధముగా ఒక కట్టుబాట్లుగల ఆధిక్యతయై యున్నది?
◻ ‘పరిశుద్ధాత్మతో’ ప్రార్థించుట అనగానేమి?
◻ యెహోవా నమ్మకమైన బాప్తిస్మముపొందిన సాక్షుల ప్రార్థనలు ఆలకింపబడునని లేఖనానుసారముగా నీవెట్లు నిరూపించగలవు?
[15వ పేజీలోని చిత్రాలు]
మానవ తండ్రులు తమ పిల్లలకు మంచి ఈవులనిచ్చినట్లే, యెహోవా తనను అడుగువారికి పరిశుద్ధాత్మనిచ్చును