పరదైసుకు మరలా మార్గమును తెరచుట
[యేసు] ఆయనతో ఇట్లనెను: ‘నీవు నాతోకూడా పరదైసులో ఉందువని, నేడు నేను నీతో నిజముగా చెప్పుచున్నాను.’”—లూకా 23:43.(NW)
1, 2. (ఎ)“పరదైసు” అనగా అర్థమేమి, మరియు ఏదెను తోట దేనివలెయుండి ఉండవచ్చును? (బి) “తోట”అనుట కొరకైన హెబ్రీపదము క్రైస్తవ గ్రీకు లేఖనములలో ఎట్లు భాషాంతరము చేయబడినది?
మానవకుటుంబ ఆరంభము పరదైసులో జరిగినది. నరుని సృష్టినిగూర్చి, పరిశుద్ధ లేఖనములలోని మొదటి పుస్తకమునందు మనము చదువుదుము: “దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.” (ఆదికాండము 2:7, 8) “ఏదెను” అను నామమునకు “ఆహ్లాదకరమైన” అని భావము, ఆవిధముగా ఏదెను తోట అనేకములైన మరియు వివిధ అందమైన సంగతులతో నిండియున్న, ఆహ్లాదకర సువిశాల ఉద్యానవనమైయుండెను.
2 “పరదైసు”అను పదము గ్రీకు భాషనుండి తీసుకొనబడినది, దీనికి ఆ భాషలో తోటవంటి ఉద్యానవనమని భావము. “తోట”అని అర్థముగల, హెబ్రీ నామవాచకమగు గాన్ (gan)ను భాషాంతరము చేయుటకు పారడియోసొస్ (pa.ra’deisos) అను గ్రీకుపదము ఉపయోగింపబడినది. లేఖనములు మత్తయి నుండి ప్రకటన వరకు గ్రీకుభాషలో వ్రాయబడెను, అయితే ఈ గ్రీకుపదము మాత్రము, సా.శ. 33వ సంవత్సరము నీసాను 14వ తేదీన కపాలమనబడిన స్థలములో ప్రభువైన యేసు క్రీస్తు హింసాకొయ్యపై మరణశిక్షననుభవించుచుండగా పలికిన మాటలను వ్రాయునప్పుడు ఉపయోగించబడినది.
ఒక నేరస్థునికి యేసు చేసిన పరదైసు వాగ్ధానము
3. (ఎ) సానుభూతిచూపిన నేరస్థుడు యేసును దేనికొరకు అడిగెను? (బి) యేసు విషయములో తన నమ్మకమేమిటని నేరస్థుని విన్నపము చూపించినది?
3 అదే సమయములో ఇద్దరు నేరస్థులుకూడా యేసుతోబాటు వ్రేలాడదీయబడిరి. యేసుకు మరొకవైపున వ్రేలాడదీయబడిన రెండవ బందిపోటు దొంగ ఇంకను నిందించుచున్నట్లుగా యేసును దూషించుటను అందలి ఒకడు మానుకొనెను. సానుభూతిచూపిన ఆ నేరస్థుడు యేసువైపు తిరిగి ఆయనతో ఇట్లనెను: “యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము.” ఆవిధముగా ఆయనయందు విశ్వాసమును వ్యక్తముచేయుటద్వారా యేసు తనతోబాటు వ్రేలాడదీయబడినను, ఆయన భవిష్యత్తులో రాజ్యమునకు వచ్చునని నమ్మెను. (లూకా 23:42; మార్కు 15:32) అది ప్రభువైన యేసు హృదయమును ఎంతగా స్పర్శించియుండవచ్చును! యేసు నిర్దొషియని ప్రజలందరిలో అవమానకరముగా వ్రేలాడదీయబడు శిక్షకు పాత్రుడుకాడని ఆ స్నేహపూర్వక నేరస్థుడు నమ్మియుండెను. (లూకా 23:41) యేసు మృతులలోనుండి పునరుత్థానుడగునని, ఆయన రాజ్యములోనికి వచ్చునని తానునమ్మెనని తన విన్నపము ద్వారా అతడు చూపించెను. తనను మృతులలోనుండి పిలిచి భూమిమీద సరిక్రొత్త జీవితమునివ్వగలవాడు యేసు అని, తనకు పునరుత్థానము కలుగవచ్చుననికూడా ఆ నేరస్థుడు విశ్వాసమును చూపించెను.
4. నేరస్థుని విన్నపమునకు యేసు ఎట్లు ప్రత్యుత్తరమిచ్చెను, అది ఏమి సూచించుచున్నది?
4 “నీవు నాతోకూడా పరదైసులో ఉందువని, నేడు నేను నీతో నిజముగా చెప్పుచున్నాను.” అని యేసు అతనితో చెప్పినప్పుడు, సానుభూతిచూపిన నేరస్థుని పునరుత్థానమును ఆయన సూచించెను. విశ్వాసము చూపిన నేరస్థునికి అది తప్పక నిజమైన ఓదార్పయి ఉండవచ్చును. ఆ మనుష్యుని పునరుత్థానము జరుగుటకు, యేసు మొదట పునరుత్థానుడు కావలెను. అప్పుడు దేవుడు తనకిచ్చిన పునరుత్థాన-బలమును ఉపయోగించుచు, యేసు మానవలోక పునరుత్థాన దినమున ఈ నేరస్థునికూడా మృతులలోనుండి పిలుచును.—లూకా 23:43 (NW); యోహాను 5:28, 29; 1 కొరింథీయులు 15:20, 23; హెబ్రీయులు 9:15.
5, 6. (ఎ) ఏలికయైన పొంతి పిలాతు వ్రేలాడదీయబడిన యేసు తలపైభాగమున ఏమని వ్రాయింపజేసెను? (బి) బహుశ యేసు నేరస్థునితో ఏ భాషలో మాట్లాడియుండవచ్చును?
5 ఏ భాషలో యేసు ఆ వాగ్ధానమును ఇచ్చెను? అనేక భాషలు ఆ కాలమందు వాడుకలోయుండెను. ఆ దారిగుండా పోవువారందరు చదివి ఆయనను గుర్తించుటకు వీలుగా వ్రేలాడదీయబడిన యేసు క్రీస్తు తలపైభాగమున ఏలికయైన పొంతి పిలాతు వ్రాయింపజేసిన మాటలద్వారా ఇది చూపించబడినది. యోహాను 19:19, 20 (NW)లోని వృత్తాంతము ఇట్లు చెప్పుచున్నది: “పిలాతు ‘యూదుల రాజైన నజరేయుడగు యేసు’ అను పైవిలాసము వ్రాయించి హింసాకొయ్యపై పెట్టించెను. యేసు వ్రేలాడదీయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, మరియు అది హెబ్రీ, గ్రీకు, లాటీను భాషలలో వ్రాయబడినందున; యూదులలో అనేకులు దానిని చదివిరి.”
6 తన తల్లియగు కన్యయైన మరియకు బేత్లెహేమునందు జన్మించుటద్వారా, యేసు పుట్టుకతో యూదుడును, లేక హెబ్రీయుడునై యుండెను. అదేప్రకారము, తన మాతృదేశమందు మూడున్నర సంవత్సరములు, ఆయన సాక్ష్యాధారముగా అప్పుడు చెలామణిలోయున్న యూదుల భాష, లేక హెబ్రీభాషలో ప్రచారముచేసెను. కాబట్టి, ఆయన సానుభూతిచూపిన నేరస్థునికి హెబ్రీభాషయందే బహుశ తన అభయమిచ్చి యుండవచ్చును. అందువలన, ఆయన పరదైసును సూచించినప్పుడు—ఆదికాండము 2:8లో కనుగొనబడు పదమైన, హెబ్రీపదమగు గాన్ (gan)ను ఉపయోగించి యుండవచ్చును. పవిత్ర లేఖనముల గ్రీకు సెప్టాజింటు భాషాంతరము ఆదిమభాషా పదమగు గాన్ (gan)ను అనువాదము చేయునప్పుడు పారడియోసొస్ (paradeisos) అను పదమును ఉపయోగించుచున్నది.
7. పునరుత్థానుడైనప్పుడు యేసు ఎట్లు మహిమపరచబడెను?
7 వ్రేలాడదీయబడిన తర్వాత మూడవదినమున లేక హెబ్రీ కాలపట్టికలోని నీసాను నెల 16వ తేదీన యేసు మృతులలోనుండి పునరుత్థానుడయ్యెను. నలభైదినముల తర్వాత మరింత ఉన్నతదశలో ఆయన తన అసలైన గృహమునకు అనగా పరలోకమునకు మరలివెళ్ళెను. (అ.కార్యములు 5:30, 31; ఫిలిప్పీయులు 2:9) తన పరలోకపు తండ్రితో భాగమువహించు ఒక లక్షణమగు అమర్త్యతను ఆయనిప్పుడు ధరించుకొనియున్నాడు. నీసాను నెల 16వ తేదీ, ఆదివారమునాడు యేసు మృతులలోనుండి పునరుత్థానుడగు పర్యంతము యెహోవా దేవుడు మాత్రమే అమర్త్యతను పూర్తిగా స్వతంత్రించుకొనిన వాడైయుండెను.—రోమీయులు 6:9; 1 తిమోతి 6:15, 16.
విమోచన మార్గమును తెరుచుచున్నది
8. భూమి విషయములో యెహోవాయొక్క ఆది సంకల్పమేమైయున్నది, మరియు ఆయన తనసంకల్పమునకు హత్తుకొనియుండునని ఏమి చూపించుచున్నది?
8 యావత్ భూమిని ఉద్యానవన అందాలతో అలంకరించుటకు, అవును భూగోళవ్యాప్తముగా పరదైసును తయారుచేయుటకుగల దేవుని సంకల్పములో ఇవన్నియు ఆయాదశలైయున్నవి. (ఆదికాండము 1:28; యెషయా 55:10, 11) 1 కొరింథీయులు 15:45నందు అపొస్తలుడైన పౌలు యేసును “కడపటి ఆదాము” అని చెప్పుచున్నాడు. దేవుడు భూమి విషయమైన తన ఆదిసంకల్పమునకు హత్తుకొనియున్నాడని, మొదటి ఆదాము నెరవేర్చుటకు తప్పిపోయిన సంకల్పమును ఎవరో నెరవేర్చుదురని ఇది సూచించుచున్నది.
9. పరదైసుకు మరలా మార్గము తెరుచుటకు యేసు ఏమి దయచేసెను?
9 పౌలు ప్రకారము యేసు “సరిసమానమైన విమోచనామూల్యమును” అందించెను. (1 తిమోతి 2:6, NW.) యేసు క్రీస్తు తానుగా ఇట్లుచెప్పెను: “అలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనా క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను.” యేసు క్రీస్తునందు విశ్వాసముంచువారు నిత్యజీవము పొందుటకు ఇది సాధ్యతను ఏర్పరచినది.—మత్తయి 20:28; యోహాను 3:16.
10. (ఎ) ఆదరింపబడిన మానవుల పరిమిత సంఖ్య విషయమై దేవుడు ఏమి తీర్మానించెను? (బి) “చిన్నమంద” ఎంపిక ఎప్పుడు ప్రారంభమాయెను, మరియు ఎవరి ద్వారా?
10 మృతులలోనుండి పునరుత్థానుడై యేసు పరలోకమునకు ఎక్కిపోయినప్పుడు, మానవజాతి పక్షమున దేవునికి ఆయన తన విమోచనా బలివిలువను అందించగల్గెను. ఏమైనను, భూజనాంగములనుండి “తన నామముకొరకు ఒక ప్రజను” ఏర్పరచుకొనుట పరలోకపు తండ్రియైన యెహోవా దేవుని సంకల్పమైయున్నది. (అ.కార్యములు 15:14) ప్రకటన 7:4 మరియు 14:1-4 ప్రకారము, వీరు కేవలము 1,44,000 మందియైయుండి, “చిన్నమంద”గా దేవుని పరలోక రాజ్యమునకు పిలువబడియున్నారు. (లూకా 12:32) యెహోవా కొరకు ప్రత్యేకముగా ఆదరింపబడిన వీరి ఎంపిక యేసు క్రీస్తు తన 12మంది అపొస్తలులను ఎంపికచేసుకొనుటతో ఆరంభమైనది. (మత్తయి 10:2-4; అ.కార్యములు 1:23-26) తన సంఘ పునాదిసభ్యులతో యేసు ఇట్లనెను: “మీరు నన్ను ఏర్పరచుకొనలేదు;. . .నేను మిమ్మును ఏర్పరచుకొంటిని.” (యోహాను 15:16) వీరు రాజ్యపాలనక్రింద రానైయున్న భూవ్యాప్త పరదైసును ప్రకటించు పనిని ముందుకు తీసుకువెళ్ళుదురు.
రాజ్యముయొక్క నిర్ణీతకాలము
11. మెస్సీయా రాజ్యము ఏర్పరచబడవలసిన నిర్ణీత సమయము ఏదైయుండెను?
11 యెహోవా రాజ్యము రావలెనని ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఈనాటికిని మనము ప్రార్థించుచునేయున్నాము. (మత్తయి 6:9, 10; యోహాను 14:13, 14) “అన్యజనముల కాలములు” సంపూర్ణమైనప్పుడు మెస్సీయా రాజ్యము ఏర్పరచబడవలసియుండెను. (లూకా 21:24) ఆ అన్యజనముల కాలములు 1914 నాటికి నెరవేర్చబడెను.a
12. తన అదృశ్యసాన్నిధ్యమును సూచించు యేసు అసాధారణ సంగతుల ప్రవచనానుసారముగా 1914లో ఏమి సంభవించినది?
12 ఆ సంవత్సరము మానవచరిత్రలోని మొదటి ప్రపంచ యుద్ధముద్వారా గుర్తింపబడెను. ఇది భూమిమీది రాజ్యాధికారముతో వచ్చు తన అదృశ్యసాన్నిధ్యమును సూచించు అసాధారణమైన సంగతులనుగూర్చి యేసు చెప్పిన ప్రవచనానుసారముగా యున్నది. ఆయన శిష్యులు ఆయననిట్లడిగిరి: “ఇవి ఎప్పుడు జరుగును, నీ సాన్నిధ్యమునకును ఈ విధాన సమాప్తికిని సూచన ఏమైయుండును?” దానికి జవాబుగా యేసు ఇట్లనెను: “జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, ఒక ప్రాంతము వెంబడి మరొక ప్రాంతములో కరవులును భూకంపములును కలుగును. ఇవన్నియు వేదనలకు ప్రారంభము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్తయి 24:3, 7, 8, 14 (NW); మార్కు 13:10.
13. (ఎ) ఏ విషయమందు దేవుని రాజ్యమును ప్రకటించుట సువార్తయైయున్నది? (బి) దేవుని రాజ్యము రావలెనని ఎంతకాలముగా ప్రార్థనలు చేయబడుచున్నవి, మరియు ఈ ప్రార్థనలను చేయుటలో ఆయన సాక్షులెప్పుడైనా అలసిపోయరా?
13 యెహోవా రాజ్యముయొక్క ఈ సువార్త ప్రస్తుతము 200పైగా దేశములలో ప్రకటింపబడుచున్నది మరియు మరి ఎక్కువ ప్రాంతములకు విస్తరింపజేయుటకు ప్రయత్నములు చేయబడుచున్నవి. రానైయున్న ప్రపంచ ప్రభుత్వమును గూర్చికాక ఆ సువార్త అధికారమందున్న, మరియు ఇప్పటికే పాలించుచున్న రాజ్యమును గూర్చినదైయున్నది. ఆ రాజ్యము 1914లో స్థాపింపబడినది. దాదాపు 1,900సం.ల క్రితము యేసు చెప్పిన ప్రార్థనకు జవాబిచ్చుటకు అది రంగమును సిద్ధము చేసినది. ఆ ప్రభుత్వమునకు రాజైన వాడు తన శిష్యులకు దానిగూర్చి ప్రార్థించుడని చెప్పినదగ్గర నుండి ఆ ప్రార్థన ఆ రాజ్య స్థాపకునికి చేయబడుచునేయున్నది. కాబట్టి రాజ్య మూలకర్త దానికొరకైన విన్నపమును ఎంతో కాలమునుండి వినుచునేయున్నాడు. ఆ కాలమందతటిలో తన సాక్షులు భూమిమీదచేయు ప్రార్థనను వినుటకు ఆయన సంతోషించెను, ఏలయనగా రానైయున్న రాజ్యమందు వారు తమ విశ్వాసమును నిలిపియుంచిరని అది ప్రదర్శించినది. దాని రుచి తరిగిపోయినట్లుగా, “పరలోకమందున్న తండ్రికి” ప్రార్థించుటలో వారు అలసిపోలేదు.—మత్తయి 6:9, 10
14. దేవుని రాజ్యసువార్తను ప్రకటించుటలో యెహోవా సాక్షులు ఎందుకు పట్టుదలను కలిగియున్నారు?
14 రాజ్యము 1914లో పరలోకమునందు స్థాపింపబడినదని యెహోవా సాక్షులు నమ్ముచు దానిప్రకటించినను, వారు ఈ రాజ్యసువార్తను ప్రకటించుటలో ఇంకను పట్టుదలను కలిగియున్నారు. వారట్లు ఎందుకు చేయుదురనగా, స్థాపిత రాజ్యము భూమిమీద ఇంకా పూర్తి అధికారమును తీసుకోలేదు, అయితే అది మానవజాతిలోని అన్ని జాతులు తెగల మీద అధికారమును, మాటను చూపించుటకు ఈ లోక రాజ్యములను అనుమతించినది. (రోమీయులు 13:1) కాబట్టి భూమియందంతటిమీద దీనికి మాత్రమే అధికారము ఉన్నదనునంతమేరకు అది పూర్తి భావముతో రావలెను.—దానియేలు 2:44.
15. ఇశ్రాయేలీయుల రాజులు అభిషేకించబడిన దానికంటే మరియెక్కువైన రీతిలో సా.శ. 33 పెంతెకొస్తునాటి నుండి ఏమి జరుగుచున్నది?
15 ఆ రాజ్యమునకు రాజుగా నియుక్తుడైనను, యేసు ఒక్కడు మాత్రమే పరిపాలించడు. మెస్సీయా రాజ్యములో ఆయనతోపాటు వారసులైయుండుటకు, తన రాజకుమారుని అనుచరులలోని 1,44,000మందిని యెహోవా దేవుడు నియమించెను. (దానియేలు 7:27) ప్రాచీన ఇశ్రాయేలు రాజులను ప్రధాన యాజకుడు పరిశుద్ధ తైలముతో అభిషేకించినట్లుగానే, సా.శ. 33 పెంతెకొస్తు దినమునుండి, “ప్రభువులకు ప్రభువును రాజులకు రాజును” అయినవానితో పరలోకములోని ఆత్మీయ జీవమునకు జన్మింపజేయుచు, యెహోవా యేసు క్రీస్తుయొక్క 1,44,000 వారసులను పరిశుద్ధాత్మతో అభిషేకించెను.—ప్రకటన 19:16; 1 రాజులు 1:39 పోల్చుము.
“కడపటి ఆదాము” పరదైసును పునఃస్థాపించును
16. యేసు వ్రేలాడదీయబడిన సమయమున రాజ్యము విషయములో దృష్టి ఏమైయుండెను, అయితే ఆయన ఎందుకు ఒక తప్పుడు వార్తను ప్రకటించినవాడు కాదు?
16 సా.శ. 33లో యేసు వ్రేలాడదీయబడిన సమయములో ఆయన అసలు రాజ్యమును కలిగియుండగలడా, అదిసాధ్యమేనా అనేది కష్టముగా చూడబడినది. అయితే దేవుని రాజ్యమును ప్రకటించుటలో ఆయన తప్పుడు వార్తను ప్రకటించినవాడు కాదు. వ్రేలాడదీయబడిన మూడవ దినమున, రాజ్య వ్యవస్థాపకుడు యేసు అనుచరులు సాధ్యముకాని ప్రభుత్వము కొరకు ప్రార్థించరనుటను నిశ్చయపరచెను. ప్రార్థనలోని-రాజ్యమునకు తనకు ప్రాతినిధ్యమువహించు వానిని యెహోవా పునరుత్థానునిగావించి ఆయనకు అమర్త్యతను ధరింపజేసెను.
17, 18. (ఎ) యేసు “కడపటి ఆదాము” అని పిలువబడుటలోని ప్రాముఖ్యత ఏమైయున్నది? (బి) 1914నుండి జరుగుచున్న ప్రపంచ సంఘటనలు ఏమి సూచించుచున్నవి?
17 మొదటి పరదైసును సృష్టించినవాడు మరలా పరదైసును పునరుద్ధరించి ఆ భూవ్యాప్తిత తోట ప్రజలతో నింపబడునట్లు చూచు బాధ్యతను తనమీదయుంచునని యేసు ఎరిగియుండెను. 1 కొరింథీయులు 15:45, 47 (NW)లో మనమిట్లు చదువుదుము: “‘ఆదామను మొదటి మనుష్యుడు జీవాత్మ ఆయెను’ అని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవమునిచ్చు ప్రాణి ఆయెను. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు; రెండవ మనుష్యుడు పరలోకములోనుండి వచ్చినవాడు.” రెండవ ఆదాము పరలోకమునుండి వచ్చినవాడైయుండి పరదైసును ఇక్కడ భూమిమీద మరలా స్థాపించుటకు యెహోవా ఉపయోగించు వాడునైయున్నాడు. ఈ ఆధారముగానే యేసు సానుభూతిచూపిన నేరస్థునితో ఇట్లనెను: “నీవు నాతో కూడా పరదైసులో ఉందువు.” (లూకా 23:43) ఈ సంభాషణద్వారా “కడపటి ఆదాము” అయిన మహిమాన్వితుడగు యేసు క్రీస్తు చేతులలో పరలోక రాజ్యము క్రింద పరదైసు స్థాపించబడునని మరలా స్పష్టమగుచున్నది.
18 యేసు క్రీస్తు పలికిన ప్రవచనములతో 1914నుండి జరుగుచున్న ప్రపంచ సంఘటనలు పొందికను కల్గియున్నవి, ఆవిధముగా అవి యేసు అప్పటినుండి అధికారమునందున్నాడని నిరూపించుచున్నవి. 1914నుండి ఈ 20వ శతాబ్ద తరములోని ప్రజలు, ఇప్పటికి గత ఏడు దశాబ్దములుగా మత్తయి 24వ అధ్యాయమందు కనుగొనబడు యేసు ప్రవచన నెరవేర్పును అనుభవించియున్నారు. కాబట్టి, భూమిమీద పరదైసు పునరుద్ధరణ చేరువతో, ఈ కాలము అంతమునకు సమీపమయినది.—మత్తయి 24:32-35; కీర్తన 90:10 పోల్చుము.
ఉత్తేజకరమైన నూతన-యుగము కేవలము ముందున్నది
19, 20. (ఎ) హార్‌మెగెద్దోను తర్వాత, దేనిలోనికి యెహోవా తనను ప్రేమించువారిని ప్రవేశింపజేయును? (బి) హార్‌మెగెద్దోను తర్వాత కొద్దికాలమునకే ఏమి చేయబడవలసిన అవసరత కలదు?
19 హార్‌మెగెద్దోను యుద్ధములో బహుశ అను సందేహమునకు ఎలాంటి తావులేని రీతిలో యెహోవా తన విశ్వసార్వభౌమాధిపత్యమును మహిమపరచుకొనిన తర్వాత తనను ప్రేమించువారినందరిని ప్రవేశపెట్టు నూతన విధానము విసుగు కల్గించునదిగా, మందకొడిగాయుండదు. దేవుని కుమారుడైన, మెస్సీయా రాజగు యేసుయొక్క ఆరోగ్యదాయకమైన పరిపాలనక్రింద మానవ కుటుంబము కొరకు రానైయున్న యుగము, నిజముగా ఎంతో ఉత్తేజమును కల్గించునదైయుండును. ఓహా, ప్రయోజనకరమైనవి అక్కడ ఎంతగా చేయవలసియుండును! దుష్టుని బలగములు యెహోవా పరలోక సైన్యములమధ్య భౌగోళికముగా జరిగిన యుద్ధము వలన భూమిమీద ఎటువంటి మరకలు కలిగినను, అవన్నియు తీసివేయబడును. ఎలాంటి గురుతు లేకుండా చేయబడును.
20 అయితే జనాంగములన్నియు విడిచిపెట్టిన యుద్ధసామగ్రియంతటి విషయమేమి? కాలుచున్న వాటి భాగములను లేకుండాచేయుటకు తీసుకొను సూచనార్థక సమయముయొక్క సూచన దృష్ట్యా, అవి విస్తారమైయుండును. (యెహెజ్కేలు 39:8-10) హార్‌మెగెద్దోనునుండి తప్పించుకొనువారు మిగిలియున్న యుద్ధసంబంధ వస్తువులను ఉపయోగకరమైనవాటిగా తయారుచేయవచ్చును.—యెషయా 2:2-4.
21. జలప్రళయము తప్పించుకొనినవారి అనుభవమును పోలి, హార్‌మెగెద్దోను నుండి తప్పించుకొనువారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందురు, అయితే అందు ఏ పెద్దమార్పు ఉండును?
21 జలప్రళయమును అద్భుతరీతిన తప్పించుకొనిన నోవహు అతని కుటుంబమును పోలియున్న ఆశీర్వదించబడిన ఆధునిక-దిన ప్రజలు, నోవహు కుటుంబము కనుగొనినటువంటి భూవ్యాప్తిత పరిస్థితినే ఎదుర్కొందురు. ఏదిఏమైనను, అపవాదియగు సాతాను అతని దయ్యముల బలగములు భూమిని చుట్టియుండు అదృశ్య ఆకాశములను ఏమాత్రము చెరచవు, అయితే వారు పది శతాబ్దములవరకు పూర్తిగా కార్యరహిత స్థితియందుంచబడుదురు. (ప్రకటన 20:1-3) “సర్వాధికారియైన దేవుని మహాదినము”ద్వారా వచ్చిన భూమిని, ఆ దినము ఈ గ్రహముమీద వదిలిన ఎటువంటి ప్రభావములనైనను ఎదుర్కొంటు, హార్‌మెగెద్దోనునుండి తప్పించుకొనినవారు దానిని లోబరచుకొను సవాలుపూర్వకమైన పనిని కల్గియుందురు.—ప్రకటన 16:14.
22. పరదైసును భూవ్యాప్తముగా విస్తరింపజేయు సవాలును హార్‌మెగెద్దోను నుండి తప్పింపబడినవారు ఎట్లు ప్రతిఘటింతురు?
22 పరదైసును భూవ్యాప్తితముగా విస్తరింపజేయు బృహత్తర పనిని అప్పగించినప్పుడు, సారూప్యమైన రీతిలో హార్‌మెగెద్దోను యుద్ధమునుండి తప్పించుకొనువారిలో కొందరు సామాన్యముగా భయపడవచ్చును. అయితే దానివిస్తారతకు పులకరించిపోయి, వారుదానిని విధేయతతో వీరోచితముగా ప్రారంభింతురు. ఈ భూమి దేవుని పాదపీఠమని వారు పూర్తిగా ఎరిగియుండి, ఆయన పాదములు దీనిమీదయుండుటకు అర్హమైనదానిగా ఈ ఐహిక గోళమును రమ్యమైన మరియు అందమైనదానిగా తీర్చిదిద్దుటకు వారు మనసా కోరుకొందురు.
23. పరదైసును పునరుద్ధరించు తమపని విజయమును సాధించుననుటకు అభయముగా హార్‌మెగెద్దోను నుండి తప్పించుకొనువారు ఏ మద్దతును కలిగియుందురు?
23 భూమి విషయమై దైవికకార్యమును నెరవేర్చు ఈ సంతోషదాయకమైన సేవను చేపట్టిన తర్వాత వారు సహాయము లేకుండా ఒంటరిగా వదిలివేయబడరని తెలుసుకొనుట ఆనందదాయకమును ప్రోత్సాహకరమునైన విషయమైయున్నది. (యెషయా 65:17, 21-24 పోల్చుము.) పరలోకమునకు ఎక్కిపోయిన దినమున: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నదని” చెప్పినవాడును, పరదైసు పునరుద్ధరణను వాగ్ధానము చేసినవాడునునైన వాని పూర్తి మరియు అపరిమితమైన మద్దతును వారు కలిగియుందురు. (మత్తయి 28:18) ఆయన ఇంకను ఆ అధికారమును కల్గియున్నాడు, మరియు మనము తర్వాతి శీర్షికలో చూడబోవునట్లు ఆయన సానుభూతిచూపిన నేరస్థునికి తానుచేసిన ఆ అసాధారణమైన వాగ్ధానమును నెరవేర్చ శక్తిగలవాడునైయున్నాడు. (w89 8/15)
[అధస్సూచీలు]
a వివరములకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్టు సొసైటి వారు ప్రచురించిన “లెట్‌యువర్ కింగ్‌డం కం” పుస్తకములోని పుటలు 135-9 చూడుము. యెహెజ్కేలు 21:27కూడా చూడుము.
పునఃసమీక్షా ప్రశ్నలు
◻ కపాలస్థలములో యేసు చేసిన వాగ్ధానము మానవజాతికి మరియు ఒక నేరస్థునికి ఏలాంటి అభయమును ఇచ్చినది?
◻ పరదైసుకు మరలా మార్గమును తెరుచుటకు మూలాధారమేమై యున్నది?
◻ మొదటి ఆదాము ఏమి చేయుటలో తప్పిపోయెను, అయితే “కడపటి ఆదాము” ఏమి నెరవేర్చును?
◻ హార్‌మెగెద్దోను తర్వాత తనను ప్రేమించువారిని యెహోవా ఎలాంటి విధానములోనికి ప్రవేశపెట్టును?
[13వ పేజీలోని చిత్రాలు]
“ఎండ్ ఆఫ్ ఆల్ కింగ్‌డమ్స్ ఇన్ 1914” అను ఈ శీర్షిక 1914, ఆగష్టు 30న “ది వరల్డ్ మాగజైన్”లో అగుపించినది