కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 16 పేజీలు 162-168
  • ఐక్య సహోదర బృందం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఐక్య సహోదర బృందం
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన ఆలోచనా తీరును సరిచేసుకోవడం
  • మన అంతర్జాతీయ ఐక్యతను కాపాడడం
  • ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపించుకోవడం
  • యెహోవా ఇష్టం చేయడం కోసం ప్రత్యేకించబడ్డాం
  • ఇతరులను మీరు యెహోవా చూసినట్లే చూస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • నూతన లోకపు పునాది ఇప్పుడు రూపుదిద్దుకొంటోంది
    దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
  • నిజమైన క్రైస్తవ ఐక్యత—ఎలా సాధ్యమవుతుంది?
    మన రాజ్య పరిచర్య—2003
  • “దేవునికి పక్షపాతం లేదు”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 16 పేజీలు 162-168

16వ అధ్యాయం

ఐక్య సహోదర బృందం

దాదాపు 1500 సంవత్సరాలపాటు, ఇశ్రాయేలీయులు యెహోవా పేరును ధరించారు. ఆ తర్వాత కాలంలో, ఆయన “తన పేరు కోసం అన్యజనుల్లో నుండి కూడా ప్రజల్ని” ఎంచుకోవడం మొదలుపెట్టాడు. (అపొ. 15:14) యెహోవా పేరును ధరించిన ప్రజలు ఈ భూమ్మీద ఎక్కడ జీవిస్తున్నా, వాళ్లు ఆయనకు సాక్షులుగా ఉంటూ తమ ఆలోచనల్లో, పనుల్లో ఐక్యంగా ఉంటారు. దేవుని పేరు కోసం ప్రజల్ని ఐక్యపర్చడం, యేసు తన అనుచరులకు ఇచ్చిన ఈ ఆజ్ఞ ఫలితమే: “కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.”—మత్త. 28:19, 20.

మీరు జాతి-తెగ, బీద-ధనిక వంటి భేదాలకు చోటివ్వని ప్రపంచవ్యాప్త క్రైస్తవుల ఐక్య సహోదర బృందంలో భాగమయ్యారు

2 మీరు యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసుక్రీస్తు శిష్యులయ్యారు. అలా మీరు జాతి-తెగ, బీద-ధనిక వంటి భేదాలకు చోటివ్వని ప్రపంచవ్యాప్త క్రైస్తవుల ఐక్య సహోదర బృందంలో భాగమయ్యారు. (కీర్త. 133:1) కాబట్టి మీరు సంఘంలోని తోటి క్రైస్తవుల్ని ప్రేమిస్తారు, వాళ్లను గౌరవిస్తారు. వాళ్లలో కొంతమంది వేరే జాతికి, దేశానికి లేదా విద్యా స్థాయికి చెందినవాళ్లు అయ్యుండవచ్చు. బహుశా ఈ కారణాల వల్లే ఒకప్పుడు మీరు అలాంటివాళ్లను దూరం పెట్టి ఉంటారు. కానీ ఇప్పుడు, మీరు వాళ్లపట్ల సహోదర ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమ బంధం సమాజంలో, మతంలో లేదా కుటుంబంలో ఉండే ఏ బంధంకన్నా పటిష్ఠమైనది.—మార్కు 10:29, 30; కొలొ. 3:14; 1 పేతు. 1:22.

మన ఆలోచనా తీరును సరిచేసుకోవడం

3 కొంతమందికి జాతీయ, రాజకీయ, సామాజిక వివక్షల్ని లేదా తమలో లోతుగా పాతుకుపోయిన ఇతర వివక్షల్ని అధిగమించడం కష్టంగా ఉండవచ్చు. అలాంటప్పుడు వాళ్లు తొలి యూదా క్రైస్తవుల గురించి ఆలోచించవచ్చు. ఇతర దేశాల ప్రజల పట్ల మతపరమైన వివక్షల్ని ఆ క్రైస్తవులు తీసేసుకోవాల్సి వచ్చింది. ఓ సందర్భంలో, రోమా సైనికాధికారి అయిన కొర్నేలి దగ్గరికి వెళ్లమని దేవుడు పేతురుని ఆదేశించాడు. ఆ నియామకం కోసం యెహోవా పేతురును దయతో సిద్ధం చేశాడు.—అపొ. 10వ అధ్యా.

4 ఒక దర్శనంలో, ధర్మశాస్త్రం ప్రకారం యూదులకు అపవిత్రమైన కొన్ని జంతువుల్ని చంపుకొని తినమని పేతురు ఆజ్ఞాపించబడ్డాడు. అలా చేయడానికి పేతురు నిరాకరించినప్పుడు, పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పింది: “దేవుడు పవిత్రపర్చిన వాటిని నిషిద్ధమైనవని అనొద్దు.” (అపొ. 10:15) ఒక అన్యుణ్ణి కలవడానికి పేతురును పంపించే ముందు, ఆ నియామకం కోసం ఆయన మనసును సిద్ధం చేయడానికి యెహోవా అలా చేశాడు. పేతురు యెహోవా నిర్దేశానికి లోబడుతూ, అక్కడున్న ప్రజలతో ఇలా అన్నాడు: “యూదుల చట్టం ప్రకారం, ఒక యూదుడు వేరే జాతికి చెందిన వ్యక్తితో సహవాసం చేయడం గానీ, అతన్ని కలవడం గానీ ఎంత తప్పో మీకు బాగా తెలుసు. అయినాసరే, నేను ఏ మనిషినీ అపవిత్రుడిగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు. అందుకే మీరు నా కోసం మనుషుల్ని పంపినప్పుడు, ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా వచ్చాను.” (అపొ. 10:28, 29) ఆ తర్వాత కొర్నేలి మీద, అతని కుటుంబ సభ్యుల మీద యెహోవా ఆమోదం ఉందని పేతురు చూశాడు.

5 తార్సువాడైన సౌలు ఉన్నత విద్యను అభ్యసించిన ఒక పరిసయ్యుడు. అయినప్పటికీ, ఇంతకుముందు ఆయన నలుగురిలో సహవసించడానికి ఇష్టపడని వాళ్లతో సహవసించడానికి తనను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, కొన్నిసార్లు వాళ్లిచ్చే నిర్దేశాల్ని కూడా ఆయన తీసుకోవాల్సి వచ్చింది. (అపొ. 4:13; గల. 1:13-20; ఫిలి. 3:4-11) మంచివార్తను అంగీకరించి యేసు శిష్యులుగా మారిన సెర్గి పౌలు, దియొనూసి, దమరి, ఫిలేమోను, ఒనేసిము వంటివాళ్ల, మరితరుల ఆలోచనా తీరులో మార్పు వచ్చివుంటుంది.—అపొ. 13:6-12; 17:22, 33, 34; ఫిలే. 8-20.

మన అంతర్జాతీయ ఐక్యతను కాపాడడం

6 నిస్సందేహంగా, సంఘంలోని సహోదరసహోదరీలు చూపించే ప్రేమ మిమ్మల్ని యెహోవా వైపుకు, ఆయన సంస్థ వైపుకు ఆకర్షించి ఉంటుంది. యేసుక్రీస్తు నిజమైన శిష్యుల్ని స్పష్టంగా గుర్తించే ప్రేమను మీరు వాళ్ల మధ్య గమనించి ఉంటారు. యేసు ఇలా చెప్పాడు: “నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహా. 13:34, 35) సంఘంలో మీరు చూసే ప్రేమ, ప్రపంచవ్యాప్త సహోదరసహోదరీలు చూపించే ప్రేమకు ప్రతిబింబం అని తెలుసుకున్నప్పుడు యెహోవా పట్ల, ఆయన సంస్థ పట్ల మీకున్న మెప్పుదల ఇంకా పెరుగుతుంది. చివరి రోజుల్లో ప్రజలు యెహోవాను శాంతిగా, ఐక్యంగా ఆరాధించడానికి పోగు చేయబడతారనే బైబిలు ప్రవచనం నెరవేరడం మీరు కళ్లారా చూస్తున్నారు.—మీకా 4:1-5.

7 విభజనలు సృష్టించే అనేక పరిస్థితులున్న ఈ కాలంలో “అన్నిదేశాల నుండి, గోత్రాల నుండి, జాతుల నుండి, భాషల నుండి” వచ్చిన ప్రజల్ని ఐక్యపర్చడం సాధ్యమౌతుందని ఎవరు అనుకుంటారు? (ప్రక. 7:9) అత్యాధునిక సమాజంలోని ప్రజలకు, పాతకాలపు ఆచారాలు పాటించే ప్రజలకు ఎన్ని తేడాలు ఉన్నాయో కదా. అది మాత్రమేనా, ఒకే జాతికి-దేశానికి చెందినవాళ్ల మధ్య ఉండే మతపరమైన గొడవల సంగతేంటి? జాతీయతా భావానికి ప్రాధాన్యత ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు ముందెప్పటికన్నా ఇప్పుడు రాజకీయపరంగా విడిపోతున్నారు. మీరు గమనిస్తే, పేద-ధనిక తేడాలు, విభజనలు సృష్టించే ఇతర విషయాల మధ్య అన్ని దేశాల, భాషల, గుంపుల, తరగతుల ప్రజల్ని శాశ్వత బంధమైన ప్రేమతో, శాంతితో ఐక్యం చేయడమనే అద్భుతాన్ని కేవలం సర్వశక్తిగల దేవుడైన యెహోవా మాత్రమే చేయగలడు.—జెక. 4:6.

8 అలాంటి ఐక్యత అక్షరాల నిజం! సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షులుగా, మీరూ దాంట్లో భాగం అయ్యారు. అలాంటి ఐక్యత నుండి ప్రయోజనం పొందుతున్న మీకు దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అపొస్తలుడైన పౌలు గలతీయులు 6:10 లో చెప్పిన ఈ మాటల్ని పాటించడం ద్వారా అలా చేయవచ్చు: “మనకు అవకాశం ఉన్నంతవరకు అందరికీ మంచి చేద్దాం, ముఖ్యంగా తోటి విశ్వాసులకు.” అంతేకాదు మనం ఈ సలహాను కూడా పాటిస్తాం: “గొడవలకు దిగే మనస్తత్వాన్ని, అహాన్ని చూపించకండి; బదులుగా వినయంతో ఇతరుల్ని మీకన్నా గొప్పవాళ్లుగా ఎంచండి; మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.” (ఫిలి. 2:3, 4) మనం, మన సహోదరసహోదరీల పైరూపాన్ని చూసే బదులు, వాళ్లను యెహోవా చూస్తున్నట్లుగా చూడడానికి స్వీయ శిక్షణ ఇచ్చుకున్నంత కాలం, వాళ్లతో మన బంధం శాంతిగా, సంతోషంగా సాగుతుంది.—ఎఫె. 4:23, 24.

ఒకరి మీద ఒకరు శ్రద్ధ చూపించుకోవడం

9 అపొస్తలుడైన పౌలు ఒక ఉదాహరణతో చెప్పినట్లు, సంఘం విభజించబడలేదు గానీ అందులోని వాళ్లందరికీ ఒకరి మీద ఒకరికి శ్రద్ధ ఉంటుంది. (1 కొరిం. 12:14-26) ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలు మనకు ఎంతో దూరంలో నివసిస్తున్నా వాళ్ల బాగోగుల విషయంలో మనకు చాలా శ్రద్ధ ఉంది. మన సహోదరసహోదరీల్లో ఎవరైనా హింసించబడితే మనందరం చాలా బాధపడతాం. అలాగే మన సహోదరసహోదరీలు ఎవరైనా అవసరాల్లో ఉన్నప్పుడు లేదా విపత్తుల వల్ల, యుద్ధాల వల్ల, పోరాటాల వల్ల బాధలు పడుతుంటే మనం వాళ్లకు ఆధ్యాత్మికంగా, వస్తుపరంగా సహాయం అందించే మార్గాల కోసం చూస్తాం.—2 కొరిం. 1:8-11.

10 మనందరం మన సహోదరసహోదరీల గురించి ప్రతీరోజు ప్రార్థించాలి. కొంతమంది సహోదరసహోదరీలు, తప్పు చేయాలనే శోధనల్ని ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది అందరికీ తెలిసే లాంటి కష్టాల్ని అనుభవిస్తున్నారు. ఇంకొంతమంది, తోటి ఉద్యోగుల నుండి, కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుండవచ్చు. బహుశా వాటి గురించి అందరికీ తెలియకపోవచ్చు. (మత్త. 10:35, 36; 1 థెస్స. 2:14) వాటి విషయంలో మనందరికీ పట్టింపు ఉంది ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్త సహోదర బృందంలో ఒక భాగం. (1 పేతు. 5:9) మనలో కొంతమంది ప్రకటనా పనిలో అలాగే సంఘాల్లో నాయకత్వం వహిస్తూ యెహోవా సేవలో కష్టపడి పని చేస్తున్నారు. అంతేకాదు, కొంతమందికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పనిని పర్యవేక్షించే బాధ్యత అప్పగించబడింది. వాళ్లందరికీ మన ప్రార్థనలు అవసరం. వాళ్లకు మనం వ్యక్తిగతంగా సహాయం చేసే అవకాశం లేకపోయినా వాళ్ల కోసం ప్రార్థించడం ద్వారా వాళ్ల పట్ల ప్రేమ, నిజమైన శ్రద్ధ ఉన్నాయని చూపిస్తాం.—ఎఫె. 1:16; 1 థెస్స. 1:2, 3; 5:25.

11 ఈ చివరి రోజుల్లో భూమ్మీద పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి కాబట్టి, యెహోవా ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. భూకంపాలు, వరదలు, ఇతర విపత్తులు వచ్చినప్పుడు విస్తృతస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది, అలాగే పెద్ద మొత్తంలో వస్తుపరమైన సహాయం అందించే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు చక్కని ఆదర్శం ఉంచారు. ఓ సందర్భంలో, అంతియొకయలోని శిష్యులు యేసు ఇచ్చిన సలహాను గుర్తుంచుకొని, యూదయలోని సహోదరులకు సంతోషంగా వస్తుపరమైన బహుమతులు పంపించారు. (అపొ. 11:27-30; 20:35) తర్వాత అపొస్తలుడైన పౌలు, క్రమపద్ధతిలో జరుగుతున్న సహాయక చర్యలకు మద్దతివ్వమని కొరింథీయులను ప్రోత్సహించాడు. (2 కొరిం. 9:1-15) నేడు కూడా, సహోదరసహోదరీలు ఎవరైనా విపత్తుల బారినపడి, వస్తుపరమైన సహాయం అవసరమైనప్పుడు, సంస్థ అలాగే సహోదరసహోదరీలు వెంటనే స్పందించి వాళ్లకు కావాల్సిన వాటిని అందిస్తారు.

యెహోవా ఇష్టం చేయడం కోసం ప్రత్యేకించబడ్డాం

12 ప్రపంచవ్యాప్త ఐక్య సహోదర బృందంగా మనం యెహోవా ఇష్టం చేయడానికి సంస్థీకరించబడ్డాం. ప్రస్తుతం యెహోవా ఇష్టం ఏమిటంటే, అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడాలి. (మత్త. 24:14) ఆ పనిని చేస్తుండగా, మనం తన ఉన్నత నైతిక ప్రమాణాల ప్రకారం జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 పేతు. 1:14-16) కాబట్టి, ఒకరికొకరు లోబడివుండడానికి, మంచివార్తను వ్యాప్తి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. (ఎఫె. 5:21) మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రాకులాడడానికి ఇది సమయం కాదు. బదులుగా, దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇవ్వడం ముందెన్నటికన్నా ఇప్పుడు చాలా అవసరం. (మత్త. 6:33) మనం ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని మంచివార్త వ్యాప్తి చేయడానికి కలిసికట్టుగా కృషిచేస్తే, ఇప్పుడు సంతోషాన్ని, సంతృప్తిని పొందుతాం అలాగే భవిష్యత్తులో శాశ్వతమైన ఆశీర్వాదాల్ని సొంతం చేసుకుంటాం.

13 యెహోవాసాక్షులమైన మనం ప్రత్యేక ప్రజలం. దేవుణ్ణి ఉత్సాహంగా సేవించే ప్రజలుగా, పవిత్రమైన ప్రజలుగా మనం లోక ప్రజల నుండి ప్రత్యేకించబడ్డాం. (తీతు 2:14) యెహోవాకు చేసే ఆరాధన మనల్ని భిన్నంగా ఉంచుతుంది. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరసహోదరీలతో కలిసికట్టుగా పనిచేయడం మాత్రమే కాదుగానీ మనందరం సత్యమనే స్వచ్ఛమైన ఒకే భాషను మాట్లాడతాం, దానికి తగ్గట్టు జీవిస్తాం. ఈ విషయం గురించి యెహోవా జెఫన్యా ప్రవక్త ద్వారా ఇలా ప్రవచించాడు: “నేను దేశదేశాల ప్రజలకు స్వచ్ఛమైన భాష నేర్పిస్తాను. దానివల్ల వాళ్లందరూ యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థిస్తారు, ఐక్యంగా నన్ను సేవిస్తారు.”—జెఫ. 3:9.

14 ఆ తర్వాత, నేడు వాస్తవరూపం దాల్చిన ఒక ప్రపంచవ్యాప్త సహోదర బృందం గురించి పవిత్రశక్తి ప్రేరణతో జెఫన్యా ఇలా వర్ణించాడు: “ఇశ్రాయేలీయుల్లో మిగిలినవాళ్లు ఎలాంటి అవినీతి పనులూ చేయరు; వాళ్లు అబద్ధం ఆడరు, తమ నాలుకతో ఇతరుల్ని మోసం చేయరు; వాళ్లు తిని, పడుకుంటారు, ఎవ్వరూ వాళ్లను భయపెట్టరు.” (జెఫ. 3:13) యెహోవా సత్య వాక్యాన్ని గ్రహించి, మన మనసు మార్చుకొని, ఆయన ప్రమాణాల ప్రకారం జీవించడం ద్వారా మనం ఐక్యంగా పని చేయగలుగుతున్నాం. అలా, మనుషుల దృష్టి నుండి చూస్తే అసాధ్యం అనిపించిన దాన్ని మనం సుసాధ్యం చేస్తున్నాం. అవును, నిజంగా మనం ప్రత్యేకమైన ప్రజలం, దేవుని ప్రజలం. భూవ్యాప్తంగా ఆయనకు ఘనత తీసుకొచ్చే ప్రజలం.—మీకా 2:12.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి