కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od అధ్యా. 13 పేజీలు 130-140
  • “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి”
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆధ్యాత్మికంగా, నైతికంగా పవిత్రంగా ఉండడం
  • శారీరక పరిశుభ్రత
  • ఆరోగ్యకరమైన ఉల్లాస కార్యకలాపాలు, వినోదం
  • స్కూల్‌ కార్యకలాపాలు
  • ఉద్యోగం, స్నేహితులు
  • క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి
  • పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఉత్తేజాన్నిచ్చే ఆరోగ్యదాయకమైన వినోదం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మీరు ఉల్లాసం కోసం చేసేవి ప్రయోజనకరంగా ఉంటున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • మనస్సునందును శరీరమందును పరిశుభ్రముగా ఉండుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od అధ్యా. 13 పేజీలు 130-140

13వ అధ్యాయం

“అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి”

యెహోవా సమర్పిత సేవకులముగా మన మాటల్లో, పనుల్లో ఆయన మహిమను ప్రతిబింబించాల్సిన బాధ్యత మనకుంది. దీనికి సంబంధించి మనకు సహాయం చేసే ఒక సూత్రం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మీరు తిన్నా, తాగినా, ఇంకేమి చేసినా అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి.” (1 కొరిం. 10:31) అలా చేయాలంటే, మనం యెహోవా పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా ఉన్న ఆయన నీతి ప్రమాణాల్ని పాటించాలి. (కొలొ. 3:10) అంతేకాదు, పవిత్రమైన ప్రజలుగా మనం దేవుణ్ణి అనుకరించాలి.—ఎఫె. 5:1, 2.

2 క్రైస్తవులకు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “మీరు విధేయులైన పిల్లల్లా ఉండండి, దేవుని గురించి తెలియని రోజుల్లో మీకున్న చెడ్డ కోరికల ప్రకారం నడుచుకోకండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు, ఆయనలాగే మీరు కూడా మీ ప్రవర్తనంతటిలో పవిత్రులుగా ఉండండి. ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: ‘మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.’” (1 పేతు. 1:14-16) ప్రాచీన ఇశ్రాయేలీయుల్లాగే, క్రైస్తవ సంఘంలోని ప్రతీఒక్కరు కూడా పవిత్రంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. అంటే వాళ్లు ఏ కళంకం లేకుండా, పాపం అలాగే ఈ లోక స్ఫూర్తి వల్ల కలుషితం అవ్వకుండా ఉండాలని అర్థం. ఆ విధంగా, వాళ్లు పవిత్ర సేవ కోసం ప్రత్యేకించబడతారు.—నిర్గ. 20:5.

3 పవిత్ర లేఖనాల్లో స్పష్టంగా రాయబడిన యెహోవా నియమాల్ని, సూత్రాల్ని పాటించడం ద్వారా మనం పవిత్రంగా ఉంటాం. (2 తిమో. 3:16) బైబిలు అధ్యయనం చేయడం ద్వారా మనం యెహోవా గురించి, ఆయన మార్గాల గురించి నేర్చుకున్నాం, ఆయనకు దగ్గరయ్యాం. అంతేకాదు, దేవుని రాజ్యాన్ని మొదట వెదకడం, మన జీవితంలో యెహోవా ఇష్టం చేయడానికే అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని బలంగా నమ్ముతున్నాం. (మత్త. 6:33; రోమా. 12:2) దానికోసం మనం కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి.—ఎఫె. 4:22-24.

ఆధ్యాత్మికంగా, నైతికంగా పవిత్రంగా ఉండడం

4 యెహోవా నీతి ప్రమాణాల్ని పాటించడం ప్రతీసారి అంత తేలిక కాదు. ఎందుకంటే, మన శత్రువైన సాతాను మనల్ని సత్యం నుండి పక్కకు మళ్లించాలని ప్రయత్నిస్తున్నాడు. దానికితోడు, ఈ లోకపు చెడు ప్రభావాలు, మన పాపభరిత స్వభావం కూడా మనల్ని తప్పుదారి పట్టించవచ్చు. మన సమర్పణకు తగ్గట్టు జీవించాలంటే, మనం ఆధ్యాత్మిక పోరాటం చేయాలి. మనకు వ్యతిరేకత లేదా కష్టాలు ఎదురైనప్పుడు ఆశ్చర్యపడకూడదని లేఖనాలు చెప్తున్నాయి. మనం నీతి కోసం శ్రమపడాల్సి ఉంటుంది. (2 తిమో. 3:12) కష్టాలు అనుభవిస్తున్నప్పుడు మనం సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే, మనం దేవుని ఇష్టం చేస్తున్నామనడానికి ఆ కష్టాలు రుజువని మనకు తెలుసు.—1 పేతు. 3:14-16; 4:12, 14-16.

5 యేసు పరిపూర్ణుడైనప్పటికీ, ఆయన పడిన బాధల వల్ల విధేయతను నేర్చుకున్నాడు. ఆయన ఎన్నడూ సాతాను శోధనలకు లొంగిపోలేదు లేదా ఈ లోకసంబంధమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. (మత్త. 4:1-11; యోహా. 6:15) వాటి విషయంలో ఒక్కసారి కూడా రాజీపడాలని ఆయన అనుకోలేదు. నమ్మకంగా జీవించినందుకు లోకం తనను ద్వేషించినా, ఆయన యెహోవా నీతి ప్రమాణాలకే కట్టుబడివున్నాడు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, ఈ లోకం శిష్యుల్ని కూడా ద్వేషిస్తుందని యేసు వాళ్లను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాతి నుండి, యేసు అనుచరులు కష్టాల్ని అనుభవిస్తూ వచ్చారు. కానీ, దేవుని కుమారుడు ఈ లోకాన్ని జయించాడని తెలుసుకుని వాళ్లు ధైర్యం తెచ్చుకున్నారు.—యోహా. 15:19; 16:33; 17:16.

6 లోక సంబంధులుగా ఉండకూడదంటే, మన యజమానియైన యేసులాగే యెహోవా నీతి ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండాలి. లోక రాజకీయాల్లో, సామాజిక వివాదాల్లో పాల్గొనకుండా ఉండడంతోపాటు, మనం ఈ లోకంలోని దిగజారిన అనైతిక వాతావరణానికి దూరంగా ఉండాలి. మనం యాకోబు 1:21 లో ఉన్న ఈ సలహాను గంభీరంగా తీసుకుంటాం: “ప్రతీ మలినానికి, చెడుతనపు జాడకు దూరంగా ఉంటూ, మిమ్మల్ని రక్షించగల దేవుని వాక్యం మీ హృదయాల్లో నాటబడేటప్పుడు దాన్ని సౌమ్యంగా స్వీకరించండి.” బైబిల్ని అధ్యయనం చేయడం ద్వారా, కూటాలకు హాజరవడం ద్వారా, దేవుని వాక్యంలోని సత్యం మన మనసుల్లో, ‘హృదయాల్లో నాటబడడాన్ని’ చవిచూస్తాం. అంతేకాదు, ఈ లోకం అందించే వాటిపై కోరికనేదే పుట్టనివ్వం. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “ఈ లోకంతో స్నేహం దేవునితో శత్రుత్వమని మీకు తెలీదా? ఈ లోకానికి స్నేహితుడిగా ఉండాలనుకునే వ్యక్తి తనను తాను దేవునికి శత్రువుగా చేసుకుంటున్నాడు.” (యాకో. 4:4) అందుకే, యెహోవా నీతి ప్రమాణాల్ని పాటించమని, లోకానికి వేరుగా ఉండమని బైబిలు గట్టిగా హెచ్చరిస్తుంది.

7 సిగ్గుకరమైన, అనైతిక ప్రవర్తనలో పాల్గొనకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. బైబిలు ఇలా చెప్తుంది: “లైంగిక పాపం, అన్నిరకాల అపవిత్రత, అత్యాశ అనేవాటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి, అది పవిత్రులకు తగదు.” (ఎఫె. 5:3) కాబట్టి మనం అసభ్యకరమైన, సిగ్గుకరమైన, లేదా హీనమైన విషయాల గురించి ఆలోచించకూడదు, అలాంటివాటిని మన మాటల్లో కూడా రానివ్వం. మనమలా చేయడం ద్వారా నైతిక విషయాల్లో యెహోవాకున్న పవిత్రమైన, నీతియుక్తమైన ప్రమాణాల్ని పాటించాలని కోరుకుంటున్నట్లు చూపిస్తాం.

శారీరక పరిశుభ్రత

8 క్రైస్తవులు ఆధ్యాత్మికంగా, నైతికంగా పవిత్రంగా ఉండడంతోపాటు, శారీరకంగా పరిశుభ్రంగా ఉండడం కూడా చాలా ప్రాముఖ్యమని గుర్తిస్తారు. ప్రాచీన ఇశ్రాయేలీయులు తమ పాలెమును శుభ్రంగా ఉంచుకోవాలని పవిత్రుడైన దేవుడు కోరుకున్నాడు. అదేవిధంగా, యెహోవాకు మనలో “అశుద్ధమైనది” ఏదీ కనిపించకుండా మనం శుభ్రంగా ఉండాలి.—ద్వితీ. 23:14.

9 బైబిలు ప్రకారం పవిత్రతకు, శారీరక పరిశుభ్రతకు దగ్గరి సంబంధం ఉంది. ఉదాహరణకు, పౌలు ఇలా రాశాడు: “ప్రియ సహోదరులారా . . . శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం; దైవభయంతో పూర్తిస్థాయిలో పవిత్రులమవ్వడానికి కృషిచేద్దాం.” (2 కొరిం. 7:1) అందుకే, క్రైస్తవ స్త్రీపురుషులు తమ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజూ స్నానం చేయాలి, శుభ్రమైన బట్టలు వేసుకోవడానికి కృషి చేయాలి. పరిస్థితులు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. అయినా మనల్ని, మన పిల్లల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కావాల్సినన్ని నీళ్లు, సబ్బు మాత్రం అంతటా అందుబాటులో ఉంటాయి.

10 మనం ఇతరులకు సాక్ష్యమిస్తుంటాం కాబట్టి, మన ప్రాంతంలోని ప్రజలకు మన గురించి బాగా తెలుసు. మన ఇంటి లోపలా బయటా శుచిగా, శుభ్రంగా ఉంచుకున్నప్పుడు అది ఇతరులకు మంచి సాక్ష్యంగా పనిచేస్తుంది. దీని కోసం, కుటుంబంలోని ప్రతీ ఒక్కరు కృషి చేయవచ్చు. సహోదరులు ఇంటిని, ఇంటి పరిసరాల్ని శుభ్రంగా ఉంచడానికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకున్నప్పుడు అది ఇతరులకు మనపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అలా శుభ్రంగా ఉంచడంతోపాటు, ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ముందుండి నడిపించే కుటుంబ శిరస్సులు, తమ ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహిస్తున్నారని చెప్పడానికి గుర్తుగా ఉంటుంది. (1 తిమో. 3:4, 12) సహోదరీలు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా, వాళ్లు ఇంట్లో పనులు చూసుకోవాలి. (తీతు 2:4, 5) చక్కగా శిక్షణ పొందిన పిల్లలు తమను, తమ గదులను శుభ్రంగా, చక్కగా ఉంచుకోవడానికి తమ వంతు కృషిచేస్తారు. ఆ విధంగా, దేవుని రాజ్య పరిపాలన కింద కొత్త లోకంలో జీవించడానికి అవసరమయ్యే శుభ్రతా అలవాట్లను అలవర్చుకోవడానికి కుటుంబమంతా కలిసికట్టుగా కృషిచేస్తుంది.

11 నేడు చాలామంది యెహోవా ప్రజలు కూటాలకు వెళ్లడానికి వాహనాల్ని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో, పరిచర్యకు వెళ్లడానికి కారును తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటివాళ్లు తమ కార్లను శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచుకోవాలి. మనం యెహోవా దేవుని శుభ్రమైన, పవిత్రమైన ప్రజలమని మన ఇల్లు, వాహనాలు రుజువు చేయాలి. మనం పరిచర్య కోసం ఉపయోగించే బ్యాగు, బైబిలుకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది.

12 మన బట్టలు, కనబడేతీరు కూడా దేవుని సూత్రాలకు తగినట్లు ఉండాలి. ఒక ప్రముఖ వ్యక్తిని కలవడానికి వెళ్లేటప్పుడు, నిర్లక్ష్యంగా కనబడే బట్టల్ని లేదా ఇంట్లో వేసుకునే బట్టల్ని వేసుకోం. అలాంటిది, పరిచర్యలో లేదా స్టేజీమీద యెహోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో కదా! మన బట్టలు, కనబడే తీరును బట్టి ప్రజలు యెహోవా ఆరాధనపట్ల ఒక అభిప్రాయానికి రావచ్చు. కాబట్టి, ఇతరుల భావాల్ని పట్టించుకోకుండా అమర్యాదకరమైన బట్టల్ని వేసుకోవడం ఏమాత్రం తగదు. (మీకా 6:8; 1 కొరిం. 10:31-33; 1 తిమో. 2:9, 10) పరిచర్యకు, సంఘ కూటాలకు, ప్రాంతీయ సమావేశాలకు లేదా ప్రాదేశిక సమావేశాలకు తయారౌతున్నప్పుడు శారీరక పరిశుభ్రత గురించి, గౌరవప్రదమైన బట్టలు వేసుకోవడం గురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయో గుర్తుంచుకోవాలి. మనం ఎల్లప్పుడూ యెహోవాను ఘనపర్చాలని, మహిమపర్చాలని కోరుకుంటాం.

యెహోవా సమర్పిత సేవకులముగా మన మాటల్లో, పనుల్లో ఆయన మహిమను ప్రతిబింబించాల్సిన బాధ్యత మనకుంది

13 యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయాన్ని లేదా బ్రాంచి కార్యాలయాన్ని చూడడానికి వెళ్తున్నప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. బెతెల్‌ అనే పేరుకు “దేవుని ఇల్లు” అని అర్థమని గుర్తుంచుకోండి. కాబట్టి, రాజ్యమందిరంలో కూటాలకు హాజరౌతున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటామో, ఎలా నడుచుకుంటామో బెతెల్‌ చూడడానికి వెళ్లేటప్పుడు కూడా అలాంటి బట్టల్నే వేసుకోవాలి, అలాగే నడుచుకోవాలి.

14 ఖాళీగా ఉన్న మిగతా సమయాల్లో కూడా మన బట్టలు, కనబడే తీరు ఎలా ఉన్నాయో చూసుకోవడం ప్రాముఖ్యం. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను వేసుకున్న బట్టల్ని బట్టి అనియత సాక్ష్యమివ్వడానికి ఇబ్బందిపడతానా?’

ఆరోగ్యకరమైన ఉల్లాస కార్యకలాపాలు, వినోదం

15 మనం సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉండడానికి విశ్రాంతి, ఉల్లాస కార్యకలాపాలు అవసరం. యేసు ఓ సందర్భంలో, “కాస్త విశ్రాంతి” తీసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశానికి రమ్మని తన శిష్యులతో అన్నాడు. (మార్కు 6:31) విశ్రాంతి, మంచి వినోదం, ఉల్లాస కార్యకలాపాలు మన పనుల నుండి కాస్త ఆహ్లాదకరమైన విరామం ఇవ్వగలవు. అంతేకాదు, అవి మనకు సేదదీర్పును ఇచ్చి మళ్లీ మన రోజువారీ పనుల్లో కొనసాగడానికి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపగలవు.

16 నేడు ఎన్నో రకాల ఉల్లాస కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి, కాబట్టి క్రైస్తవులు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. వాళ్లు చేసే ప్రతీ దాంట్లో దైవిక జ్ఞానాన్ని చూపించాలి. మనకు ఉల్లాస కార్యకలాపాలు అవసరమే, కానీ మన జీవితంలో వాటికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకూడదు. “చివరి రోజుల్లో . . . దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు” ఉంటారని బైబిలు మనల్ని హెచ్చరించింది. (2 తిమో. 3:1, 4) ఇప్పుడు ఉన్న వినోదం, ఉల్లాస కార్యకలాపాలు అని చెప్పుకునే వాటిల్లో చాలావరకు, యెహోవా నీతి ప్రమాణాల్ని పాటించాలని కోరుకునేవాళ్లకు తగనివే ఉన్నాయి.

17 తొలి క్రైస్తవులు, సుఖభోగాల్ని ప్రేమించే లోకంలోని చెడు పరిస్థితులతో పోరాడాల్సి వచ్చింది. రోమన్‌ సర్కస్‌లో ఇతరులు బాధలు అనుభవించడం చూసి ప్రేక్షకులు ఆనందించేవాళ్లు. ప్రజల కనువిందు కోసం అక్కడ హింస, రక్తపాతం, లైంగిక అనైతికత వంటివి చోటుచేసుకునేవి. కానీ తొలి క్రైస్తవులు మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉన్నారు. నేడు ఈ లోకం అందిస్తున్న వినోదంలో చాలావరకు అలాంటివే ఉన్నాయి. అవి మనుషుల దిగజారిపోయిన కోరికల్ని తృప్తిపర్చేవిగా ఉన్నాయి. కాబట్టి, అనైతిక వినోదానికి దూరంగా ఉంటూ, మనం ఎలా నడుచుకుంటున్నామో “జాగ్రత్తగా” చూసుకోవాలి. (ఎఫె. 5:15, 16; కీర్త. 11:5) కొన్నిసార్లు, మనం ఆనందిస్తున్న వినోదం తప్పు కాకపోయినా, ఆ వినోదాన్ని ఆనందించే చోటు క్రైస్తవులకు తగినట్లు ఉండకపోవచ్చు.—1 పేతు. 4:1-4.

18 అయితే క్రైస్తవులు ఆనందించగల ఉల్లాస కార్యకలాపాలు, వినోదాలు కొన్ని ఉన్నాయి. లేఖనాధారిత ఉపదేశాన్ని, మన ప్రచురణలో వచ్చిన ఉపయోగపడే సలహాల్ని పాటించి చాలామంది ప్రయోజనం పొందారు.

19 అప్పుడప్పుడు, క్రైస్తవ సహవాసం ఆనందించడం కోసం కొన్ని కుటుంబాలు ఒకరి ఇంట్లో కలుసుకోవచ్చు. లేదా వివాహ విందుకు గానీ, అలాంటి ఇతర సందర్భాలకు గానీ సహోదరసహోదరీలను పిలవవచ్చు. (యోహా. 2:2) అలాంటప్పుడు, ఆహ్వానించినవాళ్లు ఆ విందులో లేదా పార్టీలో జరిగే వాటికి వ్యక్తిగత బాధ్యత వహించాలి. ఒకవేళ పార్టీకి ఎక్కువమందిని ఆహ్వానిస్తుంటే, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే, హాయిగా సమయం గడిపే క్రమంలో కొంతమంది హద్దులు మీరి, క్రైస్తవులకు తగని విధంగా ప్రవర్తించారు. వాళ్లు మితిమీరి తినడం, తాగడంతోపాటు ఘోరమైన తప్పుల్ని కూడా చేశారు. అందుకే, వివేచనగల క్రైస్తవులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని, పార్టీకి తక్కువ మందిని ఆహ్వానిస్తారు, అంతేకాదు పార్టీ ఎక్కువసేపు ఉండకుండా చూసుకుంటారు. ఒకవేళ పార్టీలో మద్యాన్ని అందిస్తుంటే, దాన్ని మితంగానే ఉపయోగించాలి. (ఫిలి. 4:5) కలిసి సరదాగా సమయం గడిపే సందర్భాలు చక్కగా, ఆధ్యాత్మిక సేదదీర్పును ఇచ్చేవిగా ఉండడానికి ప్రతీ ప్రయత్నం చేయాలి. వాటిముందు ఆహారం, మద్యం వంటివి అంత ప్రాముఖ్యమైనవిగా ఉండవు.

20 ఆతిథ్యం ఇవ్వడం మెచ్చుకోదగినది. (1 పేతు. 4:9) అయితే, మన సహోదరసహోదరీలను భోజనానికి, టీ-బిస్కెట్‌లకు, కాసేపు కబుర్లు చెప్పుకోవడానికి, సహవసించడానికి మన ఇంటికి ఆహ్వానిస్తున్నప్పుడు, మనం దీనస్థితిలో ఉన్నవాళ్లను గుర్తుంచుకోవాలి. (లూకా 14:12-14) ఒకవేళ మనల్ని అలా ఎవరైనా పిలిచినప్పుడు, మనం మార్కు 12:31 లోని సలహాకు తగినట్లు ప్రవర్తించాలి. ఇతరులు చూపించే దయకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపించడం మంచిది.

21 దేవుడు ఉదారంగా ఇచ్చిన ఎన్నో బహుమానాల్ని బట్టి, అలాగే ‘తింటూ తాగుతూ తన కష్టమంతటిని బట్టి సుఖపడవచ్చు’ అనేదాన్ని బట్టి క్రైస్తవులు సంతోషిస్తారు. (ప్రసం. 3:12, 13) మనం “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా” చేసినప్పుడు, ఆహ్వానించినవాళ్లు అలాగే ఆహ్వానించబడినవాళ్లు, ఆ పార్టీలను గుర్తుచేసుకున్నప్పుడు ఆధ్యాత్మిక సేదదీర్పు పొందామనే తృప్తితో ఉంటారు.

స్కూల్‌ కార్యకలాపాలు

22 యెహోవాసాక్షుల పిల్లలు, స్కూల్లో అందించే ప్రాథమిక విద్య నుండి ప్రయోజనం పొందుతారు. స్కూల్లో వాళ్లు చక్కగా చదవడం, రాయడం నేర్చుకుంటారు. అక్కడ వాళ్లు నేర్చుకునే ఇతర సబ్జెక్ట్‌లు, ఆధ్యాత్మిక లక్ష్యాల్ని చేరుకుంటున్నప్పుడు ఉపయోగపడగలవు. అయితే, వాళ్లు స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడే, ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వడం ద్వారా “మహాగొప్ప సృష్టికర్తను” గుర్తుచేసుకోవడానికి కృషి చేయాలి.—ప్రసం. 12:1.

23 మీరు స్కూల్‌కు వెళ్తున్న యౌవన క్రైస్తవులైతే, ఈ లోకంలోని యౌవనులతో అనవసరంగా సమయం గడపకుండా జాగ్రత్తపడండి. (2 తిమో. 3:1, 2) యెహోవా మీకు అవసరమైన కాపుదలను అందిస్తాడు కాబట్టి, మీరు గట్టిగా కృషిచేస్తే ఈ లోక ప్రభావాల్ని తిప్పికొట్టగలరు. (కీర్త. 23:4; 91:1, 2) కాబట్టి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, యెహోవా చేసిన ఏర్పాట్లను చక్కగా ఉపయోగించుకోండి.—కీర్త. 23:5.

24 చాలామంది యౌవన సాక్షులు, లోకానికి వేరుగా ఉండడం కోసం స్కూల్‌లో జరిగే కొన్ని అదనపు కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటారు. వాళ్లు ఎందుకు పాల్గొనట్లేదో టీచర్లు, తోటి విద్యార్థులు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు. కానీ, దేవుణ్ణి సంతోషపెట్టడమే చాలా ప్రాముఖ్యం. అంటే, బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగిస్తూ, లోకంలోని పోటీతత్వాన్ని లేదా జాతీయతను ప్రోత్సహించే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని మీరు నిశ్చయించుకుంటారు. (గల. 5:19, 26) దేవుని మీద ప్రేమ ఉన్న మీ అమ్మానాన్నలు ఇచ్చే లేఖన సలహాల్ని పాటించడంవల్ల, సంఘంలో ఆదర్శంగా ఉన్నవాళ్లతో స్నేహం చేయడం వల్ల, యౌవనులైన మీరు యెహోవా నీతి ప్రమాణాల్ని అంటిపెట్టుకుని ఉండగలుగుతారు.

ఉద్యోగం, స్నేహితులు

25 తమ ఇంటివాళ్లకు అవసరమైనవి సమకూర్చాల్సిన బాధ్యత కుటుంబ శిరస్సులకు ఉందని లేఖనాలు చెప్తున్నాయి. (1 తిమో. 5:8) అయినప్పటికీ దేవుని ప్రచారకులుగా, తమ ఉద్యోగం కంటే రాజ్యసంబంధ విషయాలకే ప్రాముఖ్యతనివ్వాలని కుటుంబ శిరస్సులకు తెలుసు. (మత్త. 6:33; రోమా. 11:13) దైవభక్తి చూపిస్తూ ఆహారం, బట్టలతో తృప్తిపడితే, సిరిసంపదల్లో మునిగితేలే ఉరిని, దానివల్ల కలిగే ఆందోళనల్ని తప్పించుకుంటారు.—1 తిమో. 6:6-10.

26 ఉద్యోగం చేసే సమర్పిత క్రైస్తవులందరూ లేఖన సూత్రాల్ని మనసులో ఉంచుకోవాలి. మనకు కావాల్సినవి నిజాయితీగా సంపాదించాలంటే, మనం దేవుని నియమాలకు లేదా చట్ట నియమాలకు విరుద్ధమైన ఏ పనీ చేయకూడదు. (రోమా. 13:1, 2; 1 కొరిం. 6:9, 10) చెడు స్నేహాల వల్ల వచ్చే ప్రమాదాల్ని మనం మనసులో ఉంచుకుంటాం. క్రీస్తు సైనికులుగా మనం దేవుని ప్రమాణాలకు విరుద్ధమైన వ్యాపారాలకు, క్రైస్తవ తటస్థత విషయంలో రాజీపడేలా చేసే లేదా మన ఆధ్యాత్మికతను ప్రమాదంలో పడేసే వాటికి దూరంగా ఉంటాం. (యెష. 2:4; 2 తిమో. 2:4) అలాగే, దేవునికి విరుద్ధంగా ఉన్న మత శత్రువైన ‘మహాబబులోనుతో’ ఎలాంటి పొత్తూ పెట్టుకోం.—ప్రక. 18:2, 4; 2 కొరిం. 6:14-17.

27 మనం దేవుని నీతి ప్రమాణాల్ని పాటిస్తే, కూటాల్లో, సమావేశాల్లో వ్యాపార లావాదేవీలు జరపం; అనవసరమైన వ్యక్తిగత విషయాలు మాట్లాడం. ఎందుకంటే మనం క్రైస్తవ కూటాల్లో, ప్రాంతీయ సమావేశాల్లో, ప్రాదేశిక సమావేశాల్లో కలుసుకునేది యెహోవాను ఆరాధించడానికి మాత్రమే. అక్కడ మనం ఆయన ఆధ్యాత్మిక బల్ల మీద భోజనం చేస్తాం, “ఒకరి విశ్వాసం వల్ల ఒకరం ప్రోత్సాహం” పొందుతాం. (రోమా. 1:11, 12; హెబ్రీ. 10:24, 25) కాబట్టి అలాంటి సమయాల్లో మనం ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడుకోవాలి.

క్రైస్తవులు ఐక్యంగా ఉండాలి

28 యెహోవా నీతి ప్రమాణాల్ని పాటించాలంటే ఆయన ప్రజలు “ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను” కూడా కాపాడుకోవాలి. (ఎఫె. 4:1-3) ప్రతీఒక్కరు తమను తాము సంతోషపెట్టుకునే బదులు, ఇతరులకు మంచి చేయడానికి కృషి చేయాలి. (1 థెస్స. 5:15) మీ సంఘంలో ఖచ్చితంగా ఇలాంటి స్ఫూర్తినే మీరు చూసివుంటారు. మన జాతి, తెగ, సామాజిక హోదా, ఆర్థిక స్థితి, చదువు ఏదైనా మనందరం ఒకే నీతి ప్రమాణాల్ని పాటిస్తాం. యెహోవా ప్రజలకున్న ఈ అసాధారణ లక్షణాన్ని బయటివాళ్లు కూడా గమనించారు.—1 పేతు. 2:12.

29 మనం ఎందుకు ఐక్యంగా ఉండాలో చెప్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మీరు ఏ నిరీక్షణ కోసం పిలుపు అందుకున్నారో ఆ నిరీక్షణ ఒక్కటే, అలాగే శరీరం ఒక్కటే, పవిత్రశక్తి ఒక్కటే; ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే; అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయనకు అందరి మీద అధికారం ఉంది, ఆయన అందరి ద్వారా పనిచేస్తున్నాడు, ఆయన శక్తి అందరిలో పనిచేస్తోంది.” (ఎఫె. 4:4-6) అందుకోసం మనం యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తిస్తూ ప్రాథమిక బైబిలు సిద్ధాంతాల్ని, అలాగే లోతైన బైబిలు బోధల్ని అందరం ఒకేవిధంగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి, తన ప్రజలు తనను ఐక్యంగా సేవించేలా సత్యమనే స్వచ్ఛమైన భాషను యెహోవా వాళ్లకు ఇచ్చాడు.—జెఫ. 3:9.

30 క్రైస్తవ సంఘంలో ఉండే శాంతి, ఐక్యతలు యెహోవా ఆరాధకులందరికీ సేదదీర్పును ఇస్తాయి. “దొడ్డిలోని గొర్రెల్లా . . . వాళ్లను ఐక్యం చేస్తాను” అని యెహోవా ఇచ్చిన మాట నెరవేరడాన్ని మనం కళ్లారా చూస్తున్నాం. (మీకా 2:12) మనం యెహోవా నీతి ప్రమాణాల్ని జాగ్రత్తగా పాటించడం ద్వారా సంఘంలో శాంతి, ఐక్యతలను కాపాడాలి.

31 యెహోవా స్వచ్ఛమైన సంఘంలో ఒకరిగా ఉండే అవకాశం దొరికిన వాళ్లంతా చాలా సంతోషంగా ఉంటారు! యెహోవా పేరుతో పిలవబడడం కోసం మనం ఏ త్యాగం చేసినా తక్కువే. యెహోవాతో మనకున్న అమూల్యమైన సంబంధాన్ని కాపాడుకుంటూ, ఆయన నీతి ప్రమాణాల్ని పాటించడానికి శ్రద్ధగా కృషిచేస్తాం, వాటిని పాటించమని ఇతరుల్ని ప్రోత్సహిస్తాం.—2 కొరిం. 3:18.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి