కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 4/1 పేజీలు 13-18
  • మనస్సునందును శరీరమందును పరిశుభ్రముగా ఉండుడి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనస్సునందును శరీరమందును పరిశుభ్రముగా ఉండుడి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మానసిక పరిశుభ్రత
  • వ్యక్తిగత పారిశుభ్రత
  • చక్కగా తీర్చిదిద్దబడినట్టి గృహములు మరియు కారులు
  • ఆత్మీయ అర్పణలను అర్పించునపుడు పరిశుభ్రత
  • ప్రాంతీయ సేవకు, కూటములకు చక్కగా మరియు శుభ్రముగా ఉండుట
  • పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • సత్క్రియలు చేసే ప్రజలుగా పవిత్రపరచబడ్డారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా ప్రజలు పవిత్రంగా ఉంటారు
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • దేవుని సేవకులు పరిశుభ్రంగా ఉండాలి
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 4/1 పేజీలు 13-18

మనస్సునందును శరీరమందును పరిశుభ్రముగా ఉండుడి

“పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను. . .సమర్పించుకొనుడి”—రోమీయులు 12:1.

1. అపొస్తలుడైన పౌలు ప్రకారము మనస్సునందును, మరియు శరీరమందును పరిశుభ్రత ఎందుకు అవసరము?

పరిశుద్ధ దేవుడైన యెహోవాను సేవించగోరు ఒక వ్యక్తి ఆత్మీయంగా మరియు నైతికంగా స్వచ్ఛతగలవాడై యుండవలెను. సహేతుకంగా ఇది, మనస్సునందలి మరియు శరీరమందలి పరిశుభ్రతను కూడా సూచించుచున్నది. ప్రస్తుత లోకవిధానము తాను ఉన్నరీతిననే ఉంటుండంగా, యెహోవాను సేవించుటకై దానిలోనుండి బయటకువచ్చువారు తమ ఆలోచనా అలవాట్లయందు మాత్రమేగాక, తరచు తమ వ్యక్తిగత అలవాట్లయందును మార్పుచేసికోవలసియున్నారు. దీనినిగూర్చి రోములోనున్న క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఇట్లు వ్రాసెను: “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:1, 2) మనస్సు మరియు శరీరముయొక్క పరిశుభ్రతలో ఏమి ఇమిడియున్నది?

మానసిక పరిశుభ్రత

2. మన కన్నులు మరియు హృదయము మనలను కామాతురతలో పాల్గొనునట్లు ఎట్లు చేయగలవు, మరియు దీనిని విసర్జించుటకు ఏమి అవసరము?

2 చివరకు ధర్మశాస్త్రమివ్వబడక ముందుకూడా, నమ్మకస్థుడైన యోబు మనము మన కన్నులను మరియు హృదయమును అదుపులో ఉంచుకొనకపోయిన అవి కామాతురతలో పాల్గొనగలవని చూపించెను. ఆయన ఇలా అనెను: “నేను నా కన్నులతో నిబంధనచేసికొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును? నేను పరస్త్రీని మోహించినయెడల. . .అది దుష్కామకార్యము. అది న్యాయాధిపతులచేత శిక్ష నెందతగిన నేరము.” (యోబు 31:1, 9-11) మనకు తిరుగులాడు కన్నులు, చంచల హృదయము ఉన్నట్లయిన “బుద్ధికుశలతనిచ్చు క్రమశిక్షణ” అనగా మానసిక క్రమశిక్షణ అవసరము.—సామెతలు 1:3 NW.

3, 4. (ఎ) దావీదు మరియు బత్షెబల ఉదాహరణ ఏమి చూపుచున్నది, మరియు చెడు ఆలోచనా అలవాట్లను మానుకొనుటకు ఏమి అవసరము? (బి) ప్రత్యేకముగా క్రైస్తవ పెద్దలెందుకు జాగ్రత్త గలిగియుండవలెను?

3 రాజైన దావీదు కన్నులు ఆయనను బత్షెబతో వ్యభిచారముచేయుటకు నడిపించినవి. (2 సమూయేలు 11:2, 4) అనగా యెహోవాచే ప్రముఖంగా ఉపయోగించబడినవారును తమ మనస్సులను క్రమశిక్షణలో పెట్టుకొనకపోయిన పాపములో పడగలరని ఈ ఉదాహరణ చూపుతుంది. మన ఆలోచనా అలవాట్లను మార్చుకొనుటకు బలమైన ప్రయత్నము అవసరము కావచ్చును. అట్టి ప్రయత్నముతోపాటు యెహోవా సహాయముకొరకై పట్టుదలతో ప్రార్థించవలెను. బత్షెబతో తాను చేసిన పాపమునుగూర్చి పశ్చాత్తాపపడిన తరువాత దావీదు ఇలా ప్రార్థించెను: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.”—కీర్తన 51:10.

4 ప్రత్యేకముగా క్రైస్తవ పెద్దలు, తమను గంభీరమైన పాపమునకు నడుపు చెడుకోరికలు తమలో నివసించకుండునట్లు జాగ్రత్తపడవలెను. (యాకోబు 1:14, 15) క్రైస్తవ పెద్దయగు తిమోతికి పౌలు ఇట్లు వ్రాసెను: “ఉపదేశసారమేదనగా పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసమునుండియు కలుగు ప్రేమయే.” (1 తిమోతి 1:5) అపరిశుద్ధతను జరిగించు ఆలోచనలను హృదయములో రేకెత్తించే తిరుగులాడు కంటిని పెట్టుకొని, ఒక పెద్ద తన ఆత్మీయవిధులను నిర్వహిస్తున్నట్లయిన నిశ్చయముగా అది వేషధారణ అవుతుంది.

5. మానసిక పరిశుభ్రతను కాపాడుకొనుటకు వేటిని విసర్జించవలెను?

5 క్రైస్తవులుగా మనమందరము మానసిక పరిశుభ్రతను కలిగియుండుటకు మన శక్తికొలది కృషిచేయవలెను. అనగా మన ఆలోచనను మలినపరచు ప్రభావముగల సినిమా, టివి కార్యక్రమములు, చదివే సమాచారమును విసర్జించవలెనని దీని భావము. మానసిక పారిశుభ్రతలో “సత్యమైనవి,. . .నీతియుక్తమైనవి,. . .పవిత్రమైన వాటియందు” మనస్సు నిలిపియుండుటకు మనస్సాక్షి పూర్వకంగా కృషిచేయుట ఇమిడి ఉన్నది. మరియు పౌలు: “యే యోగ్యతయైనను, మెప్పైనను ఉండిన యెడల. . .వాటియందు ధ్యానముంచుడని” చెప్పుచున్నాడు.—ఫిలిప్పీయులు 4:8.

వ్యక్తిగత పారిశుభ్రత

6. (ఎ) సామూహిక మరియు వ్యక్తిగత పారిశుభ్రత ఇశ్రాయేలీయులలో కోరబడినదని చూపించుచు లేవీయకాండపు పుస్తకమునుండి ఉదాహరణములను ఇమ్ము. (బి) ఆ ఆజ్ఞలలోని ఉద్దేశ్యమేమైయున్నది?

6 “దైవత్వము తరువాత పరిశుభ్రతయే” అని చెప్పబడినది. నిజమే, నైతికంగా మరియు శరీరకంగా పరిశుభ్రముగా ఉన్నవ్యక్తి దైవికంగా లేకపోవచ్చును. అయితే దైవికమైన వ్యక్తి తప్పక అవశ్యకతతో నైతికంగా మరియు శరీరకంగా పరిశుభ్రత గలవాడైయుండవలెను. ఇండ్లు అంటుపడినప్పుడు శుభ్రముచేయుట, నానావిధ అపవిత్రతలందు వ్యక్తిగతంగా స్నానము చేయుటనుగూర్చి మోషే ధర్మశాస్త్రము నిర్దిష్టమైన ఉపదేశములనిచ్చినది. (లేవీయకాండము 14, 15 అధ్యాయములను చూడుము) ఇశ్రాయేలీయులందరు తమ్మును తాము పరిశుద్ధులుగా రుజువుపరచుకొనవలసియుండిరి. (లేవీయకాండము 19:2) ఇన్‌సైట్‌ ఆన్‌ ది స్క్రిఫ్చ్‌ర్స్‌ ప్రచురణ ఇట్లు చెప్పుచున్నది: “ఆహారము, పారిశుభ్రత, మరియు నైతిక విషయములందు దేవుడు వారికిచ్చిన [ఇశ్రాయేలీయులకు] ఆజ్ఞలు దేవునియెడల వారు కలిగియుండవలసిన ప్రత్యేకత మరియు పరిశుద్ధతను ఎల్లప్పుడు జ్ఞాపకముచేయు సూచనలైయున్నవి.”—వాల్యూమ్‌ 1, పేజి 1128.

7. ఒక ప్రజగా యెహోవాసాక్షుల విషయంలో ఏది సత్యమైయున్నది, కానీ, కొందరు ప్రయాణకాపరులు ఏమని నివేదించిరి?

7 యెహోవాసాక్షులు ఒక ప్రజగా బబులోను అబద్ధమత కలుషితమునుండి శుద్ధిచేయబడినవారై నైతిక అపవిత్రతను తమ మధ్య క్షమించనివారైయున్నారు. కానీ, ప్రయాణకాపరుల నుండి వచ్చు నివేదికలు కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత పారిశుభ్రతను, చక్కని దిద్దుబాటును నిర్లక్ష్యము చేస్తున్నారని చూపుచున్నవి. అయితే ఈ విషయమందును మనము పరిశుభ్రతను కలిగియున్నామని ఎట్లు నిశ్చయత కలిగియుండగలము? ఈ విషయములో క్రెస్తవగృహములన్నిటికి బేతేలు ఒక మంచి మాదిరి. ఆ పేరుకు “దేవుని గృహము” అని అర్థము.

8, 9. (ఎ) బేతేలు కుటుంబముయొక్క క్రొత్త సభ్యులందరికి ఏ ఉపదేశము ఇవ్వబడుతుంది? (బి) బేతేలు గృహములలో అనుసరించబడు ఏ సూత్రములు ప్రతి క్రైస్తవ గృహమును నడిపించవలెను?

8 ఒక వ్యక్తి వాచ్‌టవర్‌ సొసైటి కేంద్రకార్యాలయమందు లేక ప్రపంచవ్యాప్తంగానున్న దాని బ్రాంచిలందు బేతేలు కుటుంబ సభ్యుడైనప్పుడు గవర్నింగ్‌ బాడీచే తయారుచేయబడిన ఒక బ్రోషూర్‌ ఆయనకు ఇవ్వబడుతుంది. ఈ ప్రచురణ పనిచేయు అలవాట్లు మరియు వ్యక్తిగత అలవాట్లయందు తననుండి ఏమి కోరబడుతుందో ఆయనకు తెలియజేస్తుంది. “గదిని గూర్చిన శ్రద్ధ మరియు పరిశుభ్రత” అను శీర్షిక క్రింద అది ఇట్లు చెప్పుచున్నది: “బేతేలు జీవితమునకు ఉన్నతమైన భౌతిక, నైతిక, మరియు ఆత్మీయ ప్రమాణములను కాపాడుకొనుట అవసరము. బేతేలునందు ఉన్న ప్రతివ్యక్తియు తనను మరియు తన గదిని పరిశుభ్రముగా ఉంచుకొనుటలో శ్రద్ధ కలిగియుండవలెను. ఇది మంచి ఆరోగ్యమునకు దోహదపడుతుంది. ఎవరును మురికిగా ఉండుటకు కారణమేమీలేదు. ప్రతిదినము స్నానముచేయుట మంచి అలవాటు. . . .భోజన సమయమునకు ముందు శుభ్రముగా కడుగుకొనుట ప్రాముఖ్యము. ఇది అందరినుండి కోరబడుతుంది. మీతోపాటు గదిలో ఉండు మీ సహవాసి మరియు గృహమును చక్కదిద్దువ్యక్తి శ్రద్ధను గమనించి వాష్‌బేసిన్‌ లేక తొట్టిని ఉపయోగించిన వెంటనే శుభ్రము చేయవలెను.”

9 బేతేలు గృహములందు మరుగుదొడ్లు అత్యంత ప్రాధాన్యతతో పరిశుభ్రముగా ఉంచబడుచున్నవి. వాటిని ఉపయోగించువారు తమచేతులను వెంటనే కడుగుకొనునట్లు తగిన ఏర్పాటుచేయబడినది. మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత దానిని పరిశుభ్రముగా విడిచివెళ్లవలెనని ఆ కుటుంబసభ్యులు కోరబడుచున్నారు. అనగా సరైనరీతిగా మరుగుదొడ్డిలో తగినంత నీరు కొట్టబడునట్లు చూడాలి. ఇది తరువాత ఉపయోగించు వారియెడల మరియు గృహమును చక్కదిద్దువారియెడల శ్రద్ధచూపించేదైయుండును. అట్టి శ్రేష్టమైన ప్రేమగల సూత్రములు ప్రతి క్రైస్తవ గృహమును నడిపించేవైయుండవలదా?

10. (ఎ) ఒక వ్యక్తి తనను మరియు తన పిల్లలను పరిశుభ్రముగా ఉంచుకొనుటకు అన్ని వసతులుగల సంపూర్ణమైన స్నానపుగదియే ఎందుకు అవసరములేదు? (బి) ఇశ్రాయేలు నందలి ఏ ఆజ్ఞలు ఆరోగ్యమునకు సహాయకరమైనవి, మరియు దీనినుండి ఈనాడు యెహోవా ప్రజలు ఏ పాఠములను నేర్చుకొనగలరు?

10 సహజంగా దేశదేశానికి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కొన్ని స్థలాలలో గృహములు స్నానపు తొట్టినిగాని లేక ఒంటిపై నీళ్లను వెదజిమ్మే పంపునుగాని కలిగియుండవు. అయితే, సాధారణంగా మాట్లాడాలంటే క్రైస్తవ పురుషులు, స్త్రీలు తమ స్వంతశరీరాలను, వారి పిల్లలను పరిశుభ్రంగా ఉంచుకొనుటకు కావలసినంత సబ్బు మరియు నీళ్లను కలిగియుండగలరు.a ప్రపంచవ్యాప్తంగా చాలా గృహములు భూమిలోపలినుండి మురికి నీటిని బయటకు పంపు విధానమును కలిగిలేవు. అయితే ఇశ్రాయేలీయుల సైనిక శిబిరములందును కోరబడినట్లు మలమును కప్పివేయుటద్వారా సురక్షితముగా దానిని లేకుండా చేయవచ్చును. (ద్వితీయోపదేశకాండము 23:12, 13) దీనితో పాటు పాళెములో జీవించునప్పుడు వారు గైకొనవలసిన యెహోవా ఆజ్ఞలందు తరచు వస్త్రములను ఉతుకుకొనుట, స్నానముచేయుట, జబ్బులను వెంటనే గుర్తించి చికిత్సచేయుట, మృతదేహములతో వ్యవహరించవలసిన విధానము, పరిశుభ్రమైన నీరు, ఆహారపదార్థములను కాపాడుకొనుట చేర్చబడినది. ఈ ఆజ్ఞలన్నియు జనాంగముయొక్క ఆరోగ్యమునకు దోహదపడినవి. ఈనాడు యెహోవా ప్రజలు తమ వ్యక్తిగత అలవాట్లయందు తక్కువ పారిశుభ్రత గలవారైయుండవలెనా?—రోమీయులు 15:4.

చక్కగా తీర్చిదిద్దబడినట్టి గృహములు మరియు కారులు

11. (ఎ) అత్యంత సామాన్యమైన క్రైస్తవ గృహము విషయములోను, ఏది సత్యమైయుండవలెను? (బి) బేతేలు కుటుంబ సభ్యులందరినుండి ఏ సహకారము కోరబడుతుంది?

11 మనగృహములు ఎంతటి సామాన్యమైనవియైనను వాటిని క్రమముగా తీర్చిదిద్దుకొని, పరిశుభ్రంగా ఉంచుకొనవచ్చును. అయితే కుటుంబస్థాయిలో ఇందుకు మంచి క్రమమైన వ్యవస్థ అవసరము. ఒక క్రైస్తవ తల్లి సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని ప్రకటించుపనిలోను మరియు ఆత్మీయవిషయాలలోను గడపాలని యిష్టపడుతుంది. కాబట్టి, ఆమె ప్రతిరోజు కుటుంబ సభ్యులు చెల్లచెదురుగా విడిచివెళ్లిన దుస్తులు, పుస్తకాలు, కాగితములు, పత్రికలు లేక మొదలగువాటిని చక్కపెట్టుటకు సమయమును తీసుకొనవలసిన పరిస్థితి ఉండకూడదు. బేతేలులో పరిశుభ్రముచేసే గృహమును తీర్చిదిద్దువారున్నప్పటికిని కుటుంబపు ప్రతి సభ్యుడు ప్రతి ఉదయాన్నే తన పడకను చక్కపెట్టి గదిని సొగసుగా దిద్దుబాటుచేసి వెళ్లవలెను. మనందరము చక్కగా తీర్చిదిద్దబడి పరిశుభ్రముగా ఉండు మన రాజ్యమందిరములను, అసెంబ్లీహాలులను మెచ్చుకొందుము. అలాగే మన గృహములు కూడా మనము యెహోవాయొక్క పరిశుద్ధమైన మరియు పరిశుభ్రతగల ప్రజలలో భాగమైయున్నామని సాక్ష్యమిచ్చుగాక!

12, 13. (ఎ) యెహోవాసేవలో ఉపయోగించబడు మోటారు వాహనములనుగూర్చి ఏ ఉపదేశము ఇవ్వబడియున్నది, మరియు ఎందుకిది ఎక్కువ సమయాన్ని తీసుకొనేదైయుండనవసరములేదు? (బి) భౌతికముగా శుభ్రముగా ఉండుటకును మరియు గృహములను, కారులను చక్కగా తీర్చిదిద్దబడినట్టివిగాను ఉంచుకొనుటకు ఏ ఆత్మీయకారణమున్నది?

12 యెహోవా సేవకులలో ఈనాడు అనేకమంది మోటారు వాహనములను కూటములు మరియు ప్రాంతీయసేవకు రవాణా సౌకర్యంగా ఉపయోగిస్తుంటారు. కొన్నిదేశములలో యెహోవాను సేవించుటకు కారు నిజంగా ఒక అవశ్యకమైన సాధనంగా ఉంది. అటువంటి పరిస్థితిలో మన కారు కూడ మన గృహమువలె తీర్చిదిద్దబడి పరిశుభ్రముగా ఉండవలెను. అయితే కొందరు లోకప్రజలు చేయునట్లు క్రైస్తవులు తమకారులకు అధిక రూపునిస్తూ విలాసవంతముగా చేయుటకు అమితంగా సమయమును గడుపలేరు. అయితే అట్టి అమితమైన వైఖరిని అవలంభించకుండానే యెహోవా సేవకులు తమ మోటారు వాహనములను ఉండవలసినంతమట్టుకు పరిశుభ్రముగాను మంచి ఆర్డరులోను ఉంచుకొనునట్లు కృషిచేయవలెను. కొన్నిదేశములందు గ్యాస్‌స్టేషన్‌లలో కారును కడిగించుట ఎక్కువ ఖరీదైనది లేక ఎక్కువ సమయమును తీసుకొనేదైయుండదు. కారు లోపలిభాగము విషయంలో పదినిముషముల పరిశుభ్రత మరియు దిద్దుబాటుతో అద్భుతములను చేయవచ్చును. ప్రత్యేకముగా పెద్దలు మరియు పరిచారకులు తరచు ప్రాంతీయ సేవలో ప్రచారకుల గ్రూప్‌నకు వాటిని రవాణాసౌకర్యంగా ఉపయోగిస్తుంటారు గనుక ఈ విషయంలో వారు మాదిరికరంగా ఉండుటకు కృషిచేయవలెను. ఒక ప్రచారకుడు ఆసక్తిగల వ్యక్తిని కూటమునకు తీసుకువెళ్లుటకు కారును ఉపయోగించునపుడు అది మురికిగా మరియు సరిగా తీర్చదిద్దబడనిదిగా ఉన్నట్లయిన నిశ్చయంగా అది మంచి సాక్ష్యమునివ్వదు.

13 ఆవిధంగా, మనము భౌతికముగా శుభ్రముగాయుండుటకు, మరియు గృహములను, మోటారు వాహనములను శుభ్రముగా మరియు తీర్చిదిద్దబడినట్లు ఉంచుకొనుటకు కృషిచేయుటనుబట్టి ఆయన పరిశుభ్రమైన సంస్థయొక్క సభ్యులముగా యెహోవాను ఘనపరచుదుము.

ఆత్మీయ అర్పణలను అర్పించునపుడు పరిశుభ్రత

14. ఇశ్రాయేలునందు ఆచారబద్ధమైన శుద్ధీకరణను ఏ ఆజ్ఞలు నడిపించెను, మరియు ఈ ఆజ్ఞలు దేనిని సూచించుచున్నవి?

14 ఆరాధనసంబంధముగా ఇశ్రాయేలీయులలో కోరబడిన ఆచారబద్ధమైన శుద్ధీకరణ, మరణశిక్షకు నడుపునంతటి తీవ్రమైనది. మోషే అహరోనులతో యెహోవా ఇలా చెప్పెను: “ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.” (లేవీయకాండము 15:31) పాపపరిహారార్థబలిదినమున ప్రధానయాజకుడు తన దేహమును రెండుమారులు నీళ్లతో కడుగుకొనవలెను. (లేవీయకాండము 16:4, 23, 24) ప్రత్యక్షగుడారముయొద్దగల ఇత్తడి గంగాళము మరియు ఆ తరువాత ఆలయములో ఏర్పరచబడిన సముద్రపువంటి పెద్దతొట్టి యెహోవాకు బలులు అర్పించబోవు ముందు యాజకులు శుద్ధిచేసుకొనునట్లు నీళ్లతో నింపబడెను. (నిర్గమకాండము 30:17-21; 2 దినవృత్తాంతములు 4:6) సామాన్యముగా ఇశ్రాయేలీయుల విషయమేమి? ఆచారబద్ధముగా వారు ఏరీతినైనను అపవిత్రులైనట్లయిన తమనుండి కోరబడిన శుద్ధీకరణను పూర్తిచేయువరకు వారు ఆరాధనలో భాగము వహించుటనుండి నిషేధించబడిరి. (సంఖ్యాకాండము 19:11-22) పరిశుద్ధదేవుడైన యెహోవాను ఆరాధించువారందరినుండి భౌతిక పరిశుభ్రత కోరబడుతుందని ఇదంతయు నెక్కిచూపెను.

15. జంతుబలులు ఎంతమాత్రమును ఇక ఎందుకు అవసరములేదు, అయితే ఏ ప్రశ్నలు ఉత్పన్నమైయున్నవి?

15 నిజమే, యెహోవా ప్రజలు ఈనాడు భూసంబంధమైన ఆలయములో జంతుబలులనర్పించాలని కోరబడుటలేదు. ధర్మశాస్త్రము క్రింద అర్పించబడు బలుల స్థానములో “యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడెను.” (హెబ్రీయులు 10:8-10) మనము “తండ్రిని ఆత్మతోను సత్యముతోను ఆరాధించుదుము.” (యోహాను 4:23, 24) అయితే మన పరిశుద్ధదేవుడైన యెహోవాకు అర్పించుటకు మనకు ఏ బలులు లేవని దీని అర్థమా? ఆనాటి ఇశ్రాయేలీయులకు కోరబడినదానికంటె పరిశుభ్రత మనకు తక్కువగా కోరబడుతుందా?

16. 1918 నుండి అభిషక్త క్రైస్తవులపైన మలాకీ 3:3, 4 ప్రవచనము ఎట్లు నెరవేరియున్నది, మరియు అనుకూలమైన ఏ బలులను వారు యెహోవాకు అర్పించగలరు?

16 అంత్యకాలమందు భూమిపై ఉండు అభిషక్త క్రైస్తవులు నిర్మలులుగా లేక శుద్ధీకరించబడినవారిగా చేయబడుదురని మలాకీ ప్రవచనము చూపుతుంది. ఈ శుద్ధిచేయుపని 1918లో ప్రారంభమైనట్లు చరిత్ర చూపుచున్నది. నిశ్చయముగా 1919 నుండి అభిషక్త శేషము “నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు” చేయుప్రజలైరి. వారి నైవేద్యము “యెహోవాకు ఇంపుగా ఉండును” (మలాకీ 3:3, 4) ఆవిధముగా వారు “యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించ” గలుగుదురు. (1 పేతురు 2:5) అపొస్తలుడైన పౌలు ఇట్లు వ్రాసెను: “కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము.”—హెబ్రీయులు 13:15.

17. రాజరికపు యాజకత్వమందు “గొప్పసమూహము” భాగమైయుండనప్పటికిని, ఎందుకు వారు భౌతికంగా, మానసికంగా, నైతికంగా మరియు ఆత్మీయంగా పరిశుభ్రతను కలిగియుండవలెను?

17 “గొప్ప సమూహము” అభిషక్త శేషమువలె యాజకత్వ సంబంధమగు ఆలయసేవకు పిలువబడనప్పటికిని, ఆత్మీయ ఆలయపు భూ ఆవరణలో వారు “రాత్రింబగళ్లు ఆయన [యెహోవా] పరిశుద్ధసేవ చేయుచున్నారు.” (ప్రకటన 7:9, 10, 15) గుడారమందలి ఆరాధనలోనేగాని లేక తదుపరి ఆలయమందలి ఆరాధనలోనేగాని పాల్గొనుటకు యాజకులు కాని ఇశ్రాయేలీయులు ఆచారబద్ధముగా శుద్ధిచేసుకొనవలసియుండిరని గుర్తుకు తెచ్చుకొనవచ్చును. ఆలాగే, వేరేగొర్రెల యొక్క గొప్పసమూహముకూడ ఆలయములో సేవించుటకు యిష్టపడి “ఆయన నామమును ఒప్పుకొనుచు” శేషముతోపాటు “దేవునికి స్తుతియాగము” నర్పించవలెనంటే భౌతికముగా, మానసికముగా, నైతికముగా మరియు ఆత్మీయముగా పరిశుభ్రముగా ఉండవలెను.

ప్రాంతీయ సేవకు, కూటములకు చక్కగా మరియు శుభ్రముగా ఉండుట

18. బహిరంగంగా సాక్ష్యమిచ్చుపనిలో పాల్గొనునప్పుడు మరియు కూటములకు హాజరగునప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత, దుస్తులు మరియు పాదరక్షల విషయంలో మన శ్రద్ధ ఏమైయుండవలెను?

18 అభ్యాసయుక్తమైన ఆచరణలో దీని భావమేమి? ఇంటింటి పరిచర్యలోను, వీధులలోను లేక మరొకరి గృహములోను భౌతిక శుభ్రత లేకుండా లేక సరైనరీతిగా దుస్తులను వేసుకొనకుండా యెహోవాకు ప్రాతినిధ్యము వహించుట ఎంతమాత్రము తగనిదై, ఆయనను అగౌరపరచునదైయుండును. కావున ఆ విషయములలో మనము అతి సామాన్యముగా ఉండకూడదు. ఏలయనగా యెహోవా నామమును ధరించిన పరిచారకులకు తగినట్లు ప్రవర్తించుటకు మనము వాటికి జాగరూకతతో శ్రద్ధనివ్వవలెను. మన దుస్తులు వెలగలవైయుండ నవసరములేదు, అయితే అవి పరిశుభ్రంగాను, ప్రీతికరంగాను, అణకువను ప్రదర్శించునవిగాను ఉండవలెను. పాదరక్షకులు సరైనరీతిగా మరమ్మత్తు చేయబడి చక్కగా కనిపించవలెను. అలాగే సంఘపుస్తక పఠనముతోపాటు కూటములన్నిటియందును మన శరీరములు శుభ్రముగా ఉండవలెను. మనము చక్కగా మరియు తగిన విధముగా వస్త్రములు ధరించవలెను.

19. క్రైస్తవపరిచారకులుగా మనము చక్కగా మరియు శుభ్రతగా అగుపించినపుడు ఏ ఆత్మీయ ప్రయోజనములు ప్రాప్తించును?

19 సాక్ష్యమిచ్చుపనిలో ఉన్నప్పుడును, కూటములందును చక్కగా మరియు శుభ్రముగా కనిపించుట “మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించుకొనుటలో” ఒక మార్గమైయున్నది. (తీతు 2:10) అది దానంతటదే ఒక సాక్ష్యమైయుండును. మనయొక్క పరిశుభ్రత మరియు చక్కని దిద్దుబాటుకు అనేకులు ముగ్ధులైరి. మరియు ఇది నీతియుక్తమైన క్రొత్త ఆకాశములు మరియు శుభ్రమైన క్రొత్తభూమికొరకైన యెహోవా అద్భుత సంకల్పములను గూర్చిన మన వర్తమానమును వినుటకు వారిని నడిపినది.—2 పేతురు 3:13.

20. మనస్సునందును, శరీరమందును పరిశుభ్రముగా ఉండుటనుబట్టి ఏ ఇతర మంచిఫలము లభించును?

20 యెహోవా యొక్క పరిశుభ్రమైన నూతన విధానము సమీపించుచుండగా, మన ఆలోచనలోను లేక మన వ్యక్తిగత అలవాట్లయందును కొంత దిద్దుబాటు మనము చేసికొనవలసియున్నామా అని మనమందరము పరిశీలించుకొనవలెను. పౌలు ఇలావ్రాసెను: “మీ శరీర బలహీనతనుబట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను ఏలాగు దాసులుగా అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి” (రోమీయులు 6:19) ఆత్మీయ పరిశుభ్రత మరియు శరీర పరిశుభ్రత యిప్పుడును మంచి ఫలితమునివ్వగలదు. ఏలయనగా “పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.” (రోమీయులు 6:22) కావున మనము ‘దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మన శరీరములను సమర్పించుకొనుకొలది’ మనస్సునందును, శరీరమందును పరిశుభ్రముగా ఉందము.—రోమీయులు 12:1. (w89 6/1)

[అధస్సూచీలు]

a కష్టమైన పరిస్థితులందు పారిశుభ్రతకొరకైన ఆచరణాత్మకమైన సలహాలకొరకు సెప్టెంబరు 22, 1988, అవేక్‌, పేజీలు 8-11లలో ప్రచురింపబడిన “మీటింగ్‌ ది ఛాలెంజ్‌ ఆఫ్‌ క్లీన్‌లినెస్‌,” అను శీర్షికను చూడుము.

గుర్తుకు తెచ్చుకొనవలసిన అంశములు

◻ మన కన్నులు మరియు హృదయము కామాతురతయందు పాల్గొనునట్లు మనకు ఎట్లు కారణమవును?

◻ సామూహిక మరియు వ్యక్తిగత పారిశుభ్రత విషయమందు ఇశ్రాయేలీయులు యెహోవా ఆజ్ఞలకు లోబడినప్పుడు ఏ ప్రయోజనము పొందిరి?

◻ బేతేలు గృహములో అనుసరించబడు ఏ సూత్రములు ప్రతి క్రైస్తవ గృహమును నడుపవలెను?

◻ ఎప్పుడు ప్రత్యేకముగా మనము, మనము కనపడు తీరును గూర్చి జాగ్రత్తవహించవలెను?

◻ యెహోవా సేవకులు తమ గృహములను మరియు కారులను చక్కగా మరియు పరిశుభ్రముగా కాపాడుకొనుటకు ఏ ఆత్మీయ కారణములను కలిగియున్నారు?

[15వ పేజీలోని చిత్రాలు]

“బేతేలు జీవితమునకు ఉన్నతమైన భౌతిక, నైతిక మరియు ఆత్మీయ ప్రమాణములను కాపాడుకొనుట అవసరము”

[16వ పేజీలోని చిత్రాలు]

అనాలోచనపరులైన కుటుంబసభ్యులవలన ప్రతిదినము తల్లి పరిశుభ్రతకొరకు అదనపుసమయమును గడుపవలెనా?

[17వ పేజీలోని చిత్రాలు]

కారు లోపలి భాగమును శుభ్రముచేయుటయందు పదినిముషములలో అద్భుతములు చేయవచ్చును”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి