18వ అధ్యాయం
ఆమె ‘వాటి గురించి ఆలోచించింది’
1, 2. మరియ ప్రయాణం గురించి చెప్పండి. ఆమెకు ప్రయాణం ఎందుకు కష్టంగా అనిపించిందో వివరించండి.
మరియ భారంగా కదిలింది, అప్పటికే ఆమె ఎన్నో గంటల నుండి గాడిద మీద కూర్చొని ప్రయాణిస్తోంది. ఆమె సుదూరాన ఉన్న బేత్లెహేముకు వెళ్తోంది. భర్త యోసేపు దారి చూపిస్తూ ఆమె ముందు నిదానంగా నడుస్తున్నాడు. తన గర్భంలోని శిశువు మళ్లీ కదిలినట్లు మరియకు అనిపించింది.
2 మరియకు నెలలు నిండాయి. మరియ పరిస్థితిని వర్ణిస్తూ ఆమె ‘నిండు గర్భిణి’ అని బైబిలు స్పష్టంగా చెబుతోంది. (లూకా 2:5, NW) పొలాల వెంబడి వెళ్తున్న ఈ జంటను, పొలం పనులు చేసుకుంటున్న కొంతమంది రైతులు చూసి, ఇలాంటి స్థితిలో ఈమె ఎందుకు ప్రయాణం చేస్తుందా అని అనుకొనివుంటారు. మరియ తన సొంతూరు నజరేతు నుండి ఇంతదూరం ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది?
3. మరియ ఏ బాధ్యత పొందింది? ఆమె గురించి మనం ఏమి నేర్చుకోబోతున్నాం?
3 యూదురాలైన ఈ యువతి కొన్ని నెలల క్రితం, మానవ చరిత్రంతటిలో ఎవ్వరూ పొందని ఒక ప్రత్యేకమైన బాధ్యతను పొందింది. అప్పటి నుండి ఇదంతా మొదలైంది. కాబోయే మెస్సీయకు అంటే దేవుని కుమారునికి ఆమె జన్మనివ్వాల్సివుంది. (లూకా 1:35) నెలలు నిండే సమయానికి ఆమె ఇలా బయలుదేరాల్సి వచ్చింది. ఆ బాధ్యత నెరవేరుస్తున్నప్పుడు మరియకు ఎన్నో విశ్వాస పరీక్షలు ఎదురయ్యాయి. విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి ఆమెకు ఏది సహాయం చేసిందో మనం పరిశీలిద్దాం.
బేత్లెహేముకు ప్రయాణం
4, 5. (ఎ) యోసేపు, మరియలు బేత్లెహేముకు ఎందుకు పయనమయ్యారు? (బి) కైసరు జారీచేసిన ఆజ్ఞ వల్ల ఏ ప్రవచనం నెరవేరేందుకు మార్గం ఏర్పడింది?
4 అలా వెళ్లింది యోసేపు, మరియలు మాత్రమే కాదు. దేశంలోని ప్రజలందరూ తమ సొంతూళ్లకు వెళ్లి, పేర్లు నమోదు చేయించుకోవాలని కైసరు ఔగుస్తు కొత్తగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు యోసేపు ఏమి చేశాడు? బైబిలు ఇలా చెబుతోంది: “యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక . . . గలిలయలోని నజరేతునుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.”—లూకా 2:1-5.
5 కైసరు ఆ సమయంలో ఆ ఆజ్ఞను జారీచేయడం అనుకోకుండా జరిగింది కాదు. మెస్సీయ బేత్లెహేములో పుడతాడని దాదాపు ఏడువందల సంవత్సరాల ముందే బైబిలు చెప్పింది. నజరేతుకు కేవలం 11 కి.మీ. దూరంలో ఒక బేత్లెహేము పట్టణం ఉంది. కానీ, మెస్సీయ “బేత్లెహేము ఎఫ్రాతా” అనే గ్రామంలో పుడతాడని ప్రవచనం స్పష్టంగా చెప్పింది. (మీకా 5:2 చదవండి.) నజరేతు నుండి ఈ చిన్న గ్రామానికి చేరుకోవడానికి ప్రయాణికులు కొండల గుండా, సమరయ మీదుగా దాదాపు 130 కి.మీ. ప్రయాణించేవాళ్లు. యోసేపు వెళ్లాల్సింది కూడా ఈ బేత్లెహేముకే. ఎందుకంటే ఇది దావీదు రాజు పూర్వీకుల సొంతూరు. యోసేపు, ఆయన భార్య కూడా ఆ కుటుంబానికి చెందినవాళ్లే.
6, 7. (ఎ) బేత్లెహేముకు ప్రయాణించడం మరియకు ఎందుకు కష్టమైవుంటుంది? (బి) యోసేపుకు భార్య అయ్యాక మరియ తీసుకునే నిర్ణయాల్లో ఎలాంటి మార్పు వచ్చింది? (అధస్సూచి కూడా చూడండి.)
6 కైసరు జారీచేసిన ఆజ్ఞను పాటించాలని భర్త తీసుకున్న నిర్ణయానికి మరియ మద్దతు ఇచ్చిందా? ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రయాణం చేయడం మామూలు విషయం కాదు. బహుశా అది శరదృతువు మొదలౌతున్న సమయమైవుంటుంది. కాబట్టి కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అదీకాక ‘గలిలయ నుండి’ బేత్లెహేముకు వెళ్లాలంటే ఎన్నో రోజులపాటు చాలా కష్టపడి ప్రయాణించాలి, పైగా బేత్లెహేము 2,500 కన్నా ఎక్కువ అడుగుల ఎత్తులో ఉంది. మరియ నిండు గర్భిణి కాబట్టి ఎన్నోసార్లు ఆగి ఆగి ప్రయాణించాల్సి వస్తుంది. దానివల్ల, మామూలు కన్నా ఎక్కువ సమయం పట్టవచ్చు. మొదటిసారి గర్భం ధరించిన ఏ స్త్రీయైనా నెలలు నిండి, పురిటినొప్పులు మొదలయ్యే సమయానికి ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుంది. అక్కడైతే తనకు సహాయం చేయడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ దగ్గరుంటారు. వీటన్నిటిని బట్టి చూస్తే, ఈ ప్రయాణానికి సిద్ధపడేందుకు మరియకు చాలా ధైర్యమే కావాలి.
బేత్లెహేముకు ప్రయాణించడం అంత సులువుగా ఉండేది కాదు
7 యోసేపు “మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు” వెళ్లాడని బైబిలు చెబుతోంది. (లూకా 2:4, 5) యోసేపు భార్య అయ్యాక మరియ తీసుకున్న నిర్ణయాల్లో పెద్ద మార్పు వచ్చింది. ఆమె తన భర్త శిరస్సత్వానికి లోబడింది, ఆయన నిర్ణయాలను గౌరవిస్తూ మంచి సహకారి అనిపించుకుంది.a కాబట్టి, విధేయత అనే ఒక్క లక్షణంతో ఆమె ఈ విశ్వాస పరీక్షను జయించింది.
8. (ఎ) యోసేపుతో కలిసి బేత్లెహేముకు వెళ్లడానికి మరియను ఇంకా ఏది కదిలించివుంటుంది? (బి) మరియ ఆదర్శం మనకు ఎలాంటి ప్రోత్సాహాన్నిస్తుంది?
8 యోసేపుతో కలిసి బేత్లెహేముకు వెళ్లడానికి మరియను ఇంకా ఏది కదిలించివుంటుంది? మెస్సీయ బేత్లెహేములో పుడతాడని ప్రవచనం చెబుతున్నట్లు ఆమెకు తెలుసా? అది బైబిలు చెప్పడంలేదు. అంతమాత్రాన ఆమెకు తెలియదని కూడా మనం అనలేం, ఎందుకంటే అది అప్పటి ప్రధానయాజకులకు, శాస్త్రులకే కాదు సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయమే. (మత్త. 2:1-7; యోహా. 7:40-42) పైగా, మరియకు లేఖనాలు బాగా తెలుసు. (లూకా 1:46-55) తన భర్తకు లోబడి ప్రయాణించినా, ప్రభుత్వాజ్ఞకు లోబడి ప్రయాణించినా, యెహోవా ప్రవచన నెరవేర్పు కోసం ప్రయాణించినా, లేక ఈ మూడు కారణాలనుబట్టి ప్రయాణించినా ఆమె చక్కని ఆదర్శంగా నిలిచింది. వినయవిధేయతలు చూపించే స్త్రీపురుషులకు యెహోవా చాలా విలువిస్తాడు. విధేయత అనే లక్షణాన్ని చాలా చిన్నచూపు చూసే ఈ రోజుల్లో, మరియ ఆదర్శం మనకు చక్కని ప్రోత్సాహాన్నిస్తుంది.
క్రీస్తు పుట్టుక
9, 10. (ఎ) బేత్లెహేము దగ్గరపడుతుండగా మరియ, యోసేపులు ఏ విషయాలు జ్ఞాపకం చేసుకొనివుంటారు? (బి) వాళ్లు ఎక్కడ ఉన్నారు? ఎందుకు?
9 దూరం నుండి బేత్లెహేమును చూడగానే మరియ హాయిగా ఊపిరి పీల్చుకొని ఉంటుంది. కొండ ప్రాంతాల మీదుగా, ఒలీవ తోటల (కోతకోసే చివరి పంటల్లో ఒలీవ పంట ఒకటి) గుండా ప్రయాణిస్తూ మరియ, యోసేపులు ఆ చిన్న గ్రామానికున్న చరిత్ర గురించిన ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకొనివుంటారు. మీకా ప్రవక్త చెప్పినట్లే యూదా పట్టణాల్లో అది అంత ప్రముఖమైనదేమీ కాదు. కానీ వెయ్యి కంటే ఎక్కువ సంవత్సరాలకు ముందు బోయజు, నయోమి, ఆ తర్వాత దావీదు అక్కడే పుట్టారు.
10 మరియ, యోసేపులు అక్కడికి చేరుకుని గ్రామమంతా జనంతో క్రిక్కిరిసిపోయివుండడం చూశారు. చాలామంది పేర్లు నమోదు చేసుకోవడానికి వీళ్లకంటే ముందే రావడంతో వీళ్లకు సత్రంలో స్థలం దొరకలేదు.b ఆ రాత్రికి వాళ్లు ఉండడానికి ఎక్కడా స్థలం దొరకకపోవడంతో పశువుల పాకలో ఉండాల్సివచ్చింది. తన భార్యకు కలిగిన అసౌకర్యాన్ని చూసి యోసేపు ఎంత కంగారుపడి ఉంటాడో ఒకసారి ఊహించండి. జీవితంలో ఇప్పటివరకు ఆమె అలాంటి బాధ ఎరుగదు. ఆమె ఇబ్బంది ఇంకాస్త ఎక్కువై, అనువుగానిచోట ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి.
11. (ఎ) మరియ పరిస్థితిని ఏ స్త్రీయైనా ఎందుకు అర్థంచేసుకోగలదు? (బి) యేసును ఏయే రకాలుగా “తొలిచూలు” అనవచ్చు?
11 మరియ పరిస్థితిని ఏ స్త్రీయైనా అర్థంచేసుకోగలదు. వారసత్వంగా వచ్చిన పాపాన్ని బట్టి, బిడ్డను కనే సమయంలో స్త్రీలందరూ ప్రసవవేదన పడతారని అప్పటికి దాదాపు 4,000 సంవత్సరాల పూర్వమే యెహోవా దేవుడు చెప్పాడు. (ఆది. 3:16) మరియ ప్రసవవేదన పడలేదని అనడానికి ఎలాంటి ఆధారం లేదు. ఆమె పడిన వేదన గురించి లూకా చెప్పలేదు, కానీ ఆమె ‘తన తొలిచూలు కుమారుని కన్నది’ అని మాత్రమే చెప్పాడు. (లూకా 2:7) మరియకు పుట్టిన పిల్లలందరిలో ఈయన “తొలిచూలు” కుమారుడు. ఆ తర్వాత ఆమెకు కనీసం ఏడుగురు పిల్లలు పుట్టారు. (మార్కు 6:3) ఈ బిడ్డ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైనవాడే. ఈయన మరియకు మాత్రమే మొదటి కుమారుడు కాదు యెహోవా దేవుని “సర్వసృష్టికి ఆదిసంభూతుడు,” ఆయన అద్వితీయ కుమారుడు.—కొలొ. 1:15.
12. మరియ తన బిడ్డను ఎక్కడ పడుకోబెట్టింది? క్రీస్తు జననం గురించి వివరిస్తూ వేసే నాటకాల్లో, వర్ణచిత్రాల్లో, దృశ్యాల్లో చూపించేదానికీ, నిజంగా జరిగినదానికీ ఉన్న తేడా ఏమిటి?
12 లూకా వృత్తాంతం ఈ సుపరిచితమైన వివరణను ఇస్తోంది: ‘ఆమె తన కుమారుణ్ణి పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను.’ (లూకా 2:7) క్రీస్తు జననాన్ని వివరిస్తూ వేసే నాటకాల్లో, వర్ణచిత్రాల్లో, దృశ్యాల్లో ఈ సంఘటనను మరీ దయనీయంగా, అతిగా చూపిస్తారు. నిజానికి ఏమి జరిగిందో పరిశీలించండి. పశువుల తొట్టి అంటే పశువులు తినడానికి మేతవేసే గోలెం. ఆ కుటుంబం పశువుల పాకలో బసచేసిందని గుర్తుంచుకోండి. పశువుల పాక అది ఆనాడే గానీ, ఈనాడే గానీ స్వచ్ఛమైన గాలి, శుచిశుభ్రత లేని స్థలమే. మరో అవకాశం గనుక ఉంటే, ప్రసవానికి ఇలాంటి చోటును ఏ తల్లిదండ్రులు మాత్రం ఎంచుకుంటారు? సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రేష్ఠమైన దాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. అలాంటిది, దేవుని కుమారునికి మరియ, యోసేపులు శ్రేష్ఠమైనదాన్ని ఇవ్వాలని ఇంకెంత కోరుకొనివుంటారు?
13. (ఎ) మరియ, యోసేపులు తమకున్నంతలో తాము చేయగలిగినదంతా ఎలా చేశారు? (బి) సరైన ప్రాధాన్యతలు ఏర్పర్చుకోవడం పిల్లలకు నేర్పిస్తున్నప్పుడుతెలివైన తల్లిదండ్రులు మరియ, యోసేపులను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?
13 తమ పరిమితులను బట్టి వాళ్లు నిరాశపడలేదు కానీ తమకున్నంతలో చేయగలిగినదంతా చేశారు. ఉదాహరణకు, శిశువు విషయంలో మరియ ఎంతో శ్రద్ధతీసుకుంది. బిడ్డను వెచ్చగా, సురక్షితంగా ఉంచడానికి పొత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టిలో జాగ్రత్తగా పడుకోబెట్టిందని గమనించండి. మరియ తానున్న పరిస్థితులను బట్టి ఎక్కువగా ఆందోళన పడకుండా తాను చేయగలిగినదంతా చేసింది. తమ బిడ్డకు దేవుణ్ణి ప్రేమించడం నేర్పడమే తాము చేయగల వాటిలో ముఖ్యమైన పనని కూడా వాళ్లకు తెలుసు. (ద్వితీయోపదేశకాండము 6:6-8 చదవండి.) దేవుని సేవకు విలువివ్వని నేటి లోకంలో తెలివైన తల్లిదండ్రులు మరియ, యోసేపులను ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యమిచ్చేలా వాళ్లను పెంచుతారు.
ప్రోత్సాహాన్నిచ్చిన సందర్శనం
14, 15. (ఎ) కాపరులు శిశువును చూడడానికి ఎందుకు పరుగుపరుగున వచ్చారు? (బి) పశువుల పాకలో యేసును చూశాక కాపరులు ఏమి చేశారు?
14 అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న స్థలం ఒక్కసారిగా సందడిసందడిగా మారిపోయింది. ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆ శిశువును చూడడానికి గొర్రెల కాపరులు పశువుల పాకలోకి పరుగుపరుగున వచ్చారు. వాళ్లెంతో ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. కొండప్రాంతంలో తమ మందల్ని కాసుకుంటున్న వాళ్లల్లా గబగబ అక్కడికి వచ్చారు.c ఆశ్చర్యంగా తమకేసి చూస్తున్న ఆ తల్లిదండ్రులతో వాళ్లు కాసేపటి క్రితమే చూసిన అద్భుతం గురించి చెప్పారు. కాపరులకు ఆ రాత్రి అకస్మాత్తుగా ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. యెహోవా మహిమ వాళ్ల చుట్టూ ప్రకాశించింది. ఇప్పుడే బేత్లెహేములో క్రీస్తు (మెస్సీయ) పుట్టాడని ఆ దూత చెప్పాడు. అక్కడికి వెళ్తే, పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టివున్న ఆ శిశువు మీకు కనిపిస్తాడని కూడా చెప్పాడు. ఆ తర్వాత అంతకన్నా ఆశ్చర్యకరమైనది ఒకటి జరిగింది, దేవుణ్ణి స్తుతిస్తున్న దూతల సమూహం వాళ్లకు ప్రత్యక్షమైంది!—లూకా 2:8-14.
15 ఈ సామాన్య మనుషులు బేత్లెహేముకు అంత పరుగుపరుగున వచ్చారంటే అందులో ఆశ్చర్యం లేదు. దూత వివరించినట్లు అప్పుడే పుట్టిన శిశువును చూసి వాళ్లు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యుంటారు. వాళ్లు ఈ శుభవార్తను తమ దగ్గరే ఉంచుకోలేదు. “తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొఱ్ఱెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్న వారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.” (లూకా 2: 17, 18) అప్పటి మతనాయకులు గొర్రెల కాపరులను ఖచ్చితంగా చిన్నచూపు చూసివుంటారు. కానీ నమ్మకస్థులైన ఈ సామాన్యులకు యెహోవా ఎంతో విలువిచ్చాడని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, వాళ్ల రాక మరియపై ఎలాంటి ప్రభావం చూపించింది?
నమ్మకస్థులైన సామాన్య కాపరులకు యెహోవా ఎంతో విలువిచ్చాడని స్పష్టంగా తెలుస్తోంది
16. మరియ తాను నిజంగా ఆలోచనాపరురాలినని ఎలా చూపించింది? ఆమె విశ్వాసం దృఢంగా ఉండడానికి ముఖ్య కారణం ఏమిటి?
16 ప్రసవం వల్ల మరియ అప్పటికే ఎంతో నీరసించిపోయి ఉన్నా, వాళ్లు చెబుతున్న ప్రతీ మాటను ఎంతో శ్రద్ధగా వింది. వినడమే కాదు, ‘ఇవన్నీ మనస్సులో భద్రంగా దాచుకొని వాటి గురించి ఆలోచించింది.’ (లూకా 2:19, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) ఈ యువతి నిజంగానే ఆలోచనాపరురాలు. దూత వర్తమానం చాలా ప్రాముఖ్యమైనదని ఆమెకు తెలుసు. ఆమె బిడ్డ ఎవరో, ఎంత ప్రముఖుడో ఆమె అర్థంచేసుకోవాలని యెహోవా దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఆమె కేవలం విని ఊరుకోలేదు. ముందుముందు ఆ మాటలన్నిటినీ మళ్లీమళ్లీ మననం చేసుకునేందుకు ఆమె వాటిని తన హృదయంలో పదిలం చేసుకుంది. దానివల్లే మరియ జీవితాంతం విశ్వాసం చూపించగలిగింది.—హెబ్రీయులు 11:1 చదవండి.
కాపరులు చెప్పినదాన్ని మరియ జాగ్రత్తగా వింది, వాళ్ల మాటలను భద్రంగా మనసులో దాచుకుంది
17. ఆధ్యాత్మిక సత్యాల విషయానికొస్తే, మనమెలా మరియను ఆదర్శంగా తీసుకోవచ్చు?
17 మరియను మీరు ఆదర్శంగా తీసుకుంటారా? యెహోవా తన వాక్యాన్ని ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలతో నింపాడు. మనం ఈ సత్యాలపై మనసుపెడితేనే వాటి నుండి ప్రయోజనం పొందుతాం. దానికోసం మనం బైబిలును ఏదో పుస్తకంలా కాదుగానీ దేవుని ప్రేరేపిత వాక్యమని ఎంచి దాన్ని క్రమంగా చదవాలి. (2 తిమో. 3:16, 17) మరియలాగే మనం కూడా ఆధ్యాత్మిక విషయాలను మన హృదయాల్లో పదిలంచేసుకొని వాటి గురించి లోతుగా ఆలోచించాలి. యెహోవా ఉపదేశాల్ని మరింత చక్కగా పాటించడానికి ఇంకేమి చేయాలో ఆలోచిస్తూ, బైబిల్లో చదివిన విషయాలను మననం చేస్తే మన విశ్వాసం పటిష్ఠమౌతుంది.
మనసులో ఉంచుకోవాల్సిన మరికొన్ని విషయాలు
18. (ఎ) యేసు రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడు మరియ, యోసేపులు మోషే ధర్మశాస్త్రం చెప్పినట్టు ఏమి చేశారు? (బి) ఆలయంలో వాళ్లు అర్పించిన అర్పణను బట్టి వాళ్ల ఆర్థిక స్థితి ఎలా ఉండేదని తెలుస్తోంది?
18 మరియ, యోసేపులు 8వ రోజున మోషే ధర్మశాస్త్రం ప్రకారం శిశువుకు సున్నతి చేయించి, తమకు అందిన నిర్దేశాన్ని బట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టారు. (లూకా 1:31) శుద్ధీకరణ కోసం పేదవాళ్లు రెండు గువ్వలను గానీ, రెండు పావురాలను గానీ అర్పించవచ్చని ధర్మశాస్త్రం చెప్పింది. అందుకోసం వాళ్లు 40వ రోజున బేత్లెహేము నుండి దాదాపు 10 కి.మీ. దూరంలో ఉన్న యెరూషలేము దేవాలయానికి బిడ్డను తీసుకొని వెళ్లారు. ఇతర తల్లిదండ్రుల్లా గొర్రెను అర్పించలేకపోతున్నందుకు కాస్త చిన్నతనంగా అనిపించినా, వాళ్లు తాము ఇవ్వగలిగింది ఇచ్చి ధర్మశాస్త్రాన్ని పాటించారు. ఏదేమైనా అక్కడ వాళ్లకు మంచి ప్రోత్సాహం దొరికింది.—లూకా 2:21-24.
19. (ఎ) మరియ తన మనసులో ఉంచుకోవాల్సిన ఏ విషయాలు వృద్ధుడైన సుమెయోను చెప్పాడు? (బి) యేసును చూసి అన్న ఎలా స్పందించింది?
19 వృద్ధుడైన సుమెయోను, వాళ్ల దగ్గరకు వచ్చి మరియ తన మనసులో ఉంచుకోవాల్సిన కొన్ని విలువైన విషయాలను చెప్పాడు. మెస్సీయను చూసేంతవరకు ఆయన చనిపోడని దేవుడు ఆయనకు మాటిచ్చాడు. ఈ చిన్నారి యేసే వాగ్దత్త రక్షకుడని దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో సుమెయోను గ్రహించాడు. ఎంతో దుఃఖించే రోజు వస్తుందని కూడా సుమెయోను మరియకు చెప్పాడు. ఆమె హృదయంలోకి ఖడ్గం దూసుకుపోయినంత బాధ ఆమెకు కలుగుతుందని ఆయన అన్నాడు. (లూకా 2:25-35) ఆ మాటలు అప్పుడు ఆమెలో కలవరం రేపినా, మూడు దశాబ్దాల తర్వాత ఎదురైన దుఃఖాన్ని తట్టుకునేందుకు ఆమెకు సహాయం చేసివుంటాయి. సుమెయోను తర్వాత, ప్రవక్త్రియైన అన్న చిన్నారి యేసును చూసి, యెరూషలేము విడుదల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఆయన గురించి చెప్పింది.—లూకా 2:36-38 చదవండి.
యెరూషలేములోని యెహోవా ఆలయంలో మరియ, యోసేపులు మంచి ప్రోత్సాహం పొందారు
20. యేసును యెరూషలేములోని దేవాలయానికి తీసుకువెళ్లాలనుకోవడం ఎందుకు చక్కని నిర్ణయం?
20 మరియ, యోసేపులు తమ బిడ్డను యెరూషలేములోవున్న యెహోవా ఆలయానికి తీసుకువెళ్లాలనుకోవడం నిజంగా చక్కని నిర్ణయం. తమ కుమారుడు జీవితాంతం క్రమంగా యెహోవా ఆలయానికి వెళ్లేందుకు అది పునాది వేసింది. ఆ రోజు వాళ్లు తాము ఇవ్వగలిగిన దానిలో శ్రేష్ఠమైనదాన్ని ఇచ్చారు, మంచి ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని పొందారు. ఆ రోజు మరియ విశ్వాసం తప్పకుండా బలపడివుంటుంది. అంతేకాదు ధ్యానించడానికి, ఇతరులకు చెప్పడానికి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాల్ని హృదయంలో పదిలంగా దాచుకొని ఆమె దేవాలయం నుండి ఇంటికి వచ్చింది.
21. మరియ విశ్వాసంలాగే మన విశ్వాసం కూడా అంతకంతకూ దృఢమవ్వాలంటే మనం ఏమి చేయాలి?
21 నేటి తల్లిదండ్రులు ఆమెను ఆదర్శంగా తీసుకోవడం చూడముచ్చటైన విషయం. యెహోవాసాక్షులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రైస్తవ కూటాలకు క్రమంగా తీసుకువెళ్తారు. అలాంటి తల్లిదండ్రులు తమ మాటలతో తోటి విశ్వాసులను ప్రోత్సహించడానికి శాయశక్తులా కృషిచేస్తారు, దృఢమైన విశ్వాసంతో, సంతోషంతో కూటాల నుండి ఇంటికి వెళ్తారు. అంతేకాదు, ఇతరులకు చెప్పడానికి ఎన్నో మంచి విషయాల్ని తమతోపాటు తీసుకువెళ్తారు. కూటాలకు వెళ్లినప్పుడు అలాంటి వాళ్లను కలుసుకోవడం ఎంత ఆనందాన్నిస్తుందో కదా! అలాచేస్తే మరియ విశ్వాసంలాగే మన విశ్వాసం కూడా అంతకంతకూ దృఢమౌతుంది.
a ఈ సందర్భాన్ని, “మరియ లేచి” ఎలీసబెతును చూడడానికి ‘వెళ్లింది’ అని బైబిలు చెబుతున్న సందర్భంతో పోల్చి, రెండిటికీ ఉన్న తేడాను గమనించండి. (లూకా 1:39) ఆ సమయానికి మరియకు ప్రధానం అయ్యింది, కానీ ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి యోసేపును అడగకుండానే వెళ్లివుంటుంది. అయితే పెళ్లయిన తర్వాత ఈ ప్రయాణంలో యోసేపే మరియను తీసుకొని వెళ్లాడని బైబిలు చెబుతోంది.
b ఆ రోజుల్లో ప్రయాణికులు బసచేయడానికి సాధారణంగా పట్టణాల్లో సత్రాలుండేవి.
c క్రీస్తు పుట్టే సమయానికి గొర్రెల కాపరులు పొలంలో ఉండడం బైబిలు సూచిస్తున్న ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది: క్రీస్తు పుట్టింది అక్టోబరు నెలారంభంలోనే కానీ, కాపరులు తమ మందల్ని ఇంటికి దగ్గర్లోని పశువులపాకలో ఉంచే డిసెంబరు నెలలో కాదు.