19వ అధ్యాయం
ఆయన సంరక్షించాడు, పోషించాడు, తన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాడు
1, 2. (ఎ) యోసేపుకు, ఆయన కుటుంబానికి ఎలాంటి పరిస్థితి ఎదురైంది? (బి) యోసేపు ఏ చేదు వార్త తన భార్యకు చెప్పాల్సివచ్చింది?
యోసేపు ఇంకో మూట తీసి గాడిద మీద పెట్టాడు. ఆ చీకట్లో గాడిదను తోలుకుంటూ, చుట్టుపక్కల పరిసరాలను చూసుకుంటూ ముందుకు కదిలాడు. ఇప్పుడు ఆయన ఆలోచనంతా తాము చేయాల్సిన సుదీర్ఘ ప్రయాణం గురించే. వాళ్ల గమ్యం ఐగుప్తు! అక్కడ పూర్తిగా కొత్త మనుషులు, కొత్త భాష, కొత్త ఆచారాలు. ఆ మార్పును తన చిన్న కుటుంబం స్వాగతిస్తుందా?
2 తన ప్రియమైన భార్య మరియకు ఆ చేదు వార్త చెప్పడం అంత సులువు కాదు, అయినా ధైర్యం కూడగట్టుకుని చెప్పాడు. కలలో ఒక దేవదూత తీసుకొచ్చిన ఈ సందేశం గురించి ఆమెకు చెప్పాడు: రాజైన హేరోదు తమ చంటిబిడ్డను చంపాలని చూస్తున్నాడు! తాము తక్షణమే బేత్లెహేము నుండి వెళ్లిపోవాలి. (మత్తయి 2:13-15 చదవండి.) మరియ ఎంతో ఆందోళన పడింది. అన్నెంపున్నెం ఎరగని తమ పసిబిడ్డని ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారు? యోసేపుకుగానీ మరియకుగానీ ఈ విషయం అస్సలు అంతుబట్టలేదు. అయినా, వాళ్లు యెహోవా మీద నమ్మకముంచి ఐగుప్తుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు.
3. యోసేపు, ఆయన కుటుంబం బేత్లెహేము నుండి బయలుదేరడం గురించి వివరించండి. (189వ పేజీలోని చిత్రాన్ని కూడా చూడండి.)
3 బిడ్డను తీసుకొని యోసేపు, మరియలు బయలుదేరారు. హేరోదు కుట్ర గురించి ఏమీ తెలియని బేత్లెహేము గ్రామం హాయిగా నిద్రలోకి జారుకుంది. వాళ్ల పయనం దక్షిణంవైపుకు సాగుతోంది. తూర్పున తెలతెలవారుతుండగా, ముందుముందు ఏమి జరగనుందో అనే ఆందోళన యోసేపు మనసును కలచివేసింది. ఒక మామూలు వడ్రంగి, అలాంటి బలమైన శక్తుల నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడం సాధ్యమేనా? నిరాటంకంగా తన కుటుంబాన్ని పోషించుకోగలడా? ఈ ప్రత్యేకమైన బిడ్డని పెంచి పెద్దచేయమని యెహోవా దేవుడు తనకు అప్పగించిన బరువైన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించగలడా? యోసేపుకు పెద్దపెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. వాటిలో ఒక్కో దాన్నుండి ఆయన ఎలా గట్టెక్కాడో పరిశీలిద్దాం. ఆయన విశ్వాసాన్ని నేటి తండ్రులు, అలాగే మనందరం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో చూద్దాం.
యోసేపు తన కుటుంబాన్ని సంరక్షించాడు
4, 5. (ఎ) యోసేపు జీవితం ఎలా పెద్ద మలుపు తిరిగింది? (బి) బరువైన బాధ్యతను తీసుకునేలా ఒక దేవదూత యోసేపును ఎలా ప్రోత్సహించాడు?
4 సంవత్సరం క్రితం యోసేపుకు, హేలీ కూతురు మరియకు జరిగిన నిశ్చితార్థంతో ఆయన జీవితం ఒక్కసారిగా పెద్ద మలుపు తిరిగింది. మరియ, దేవుని మీద భయభక్తులు ఉన్న అమ్మాయని యోసేపుకు తెలుసు. కానీ ఆమె గర్భవతి అయ్యిందని ఆయనకు తెలిసింది! ఆమె నలుగురిలో అల్లరిపాలవడం ఇష్టంలేక రహస్యంగా విడాకులు ఇద్దామనుకున్నాడు.a అయితే ఒక దేవదూత ఆయనకు కలలో కనబడి, యెహోవా పరిశుద్ధాత్మ వల్లే మరియ గర్భవతి అయిందని వివరించాడు. ఆ దూత మాట్లాడుతూ, ఆమె కనే బిడ్డ ‘తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును’ అని చెప్పాడు. ఇంకా ఆ దూత, “నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము” అంటూ యోసేపుకు ధైర్యాన్నిచ్చాడు.—మత్త. 1:18-21.
5 యోసేపు నీతిమంతుడు, దేవునికి లోబడేవాడు కాబట్టి దేవదూత చెప్పినట్టే చేశాడు. తనది కాని బిడ్డను, దేవునికి ఎంతో అమూల్యమైన బిడ్డను పెంచి పెద్దచేసే బరువైన బాధ్యతను తన భుజాలమీద వేసుకున్నాడు. చక్రవర్తి జారీచేసిన ఆజ్ఞ మేరకు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి యోసేపు, గర్భవతియైన ఆయన భార్య బేత్లెహేముకు వెళ్లారు. అక్కడే బిడ్డ పుట్టాడు.
6-8. (ఎ) ఏ సంఘటనల వల్ల యోసేపు ఇంటివాళ్ల జీవితాల్లో మరో మార్పు చోటుచేసుకుంది? (బి) “నక్షత్రాన్ని” పంపించింది సాతానే అని స్పష్టంగా ఏది చూపిస్తోంది? (అధస్సూచి కూడా చూడండి.)
6 యోసేపు తన కుటుంబాన్ని మళ్లీ నజరేతుకు తీసుకువెళ్లలేదు. యెరూషలేముకు దాదాపు 10 కి.మీ. దూరంలో ఉన్న బేత్లెహేములోనే వాళ్లు ఉండిపోయారు. పేదరికంలో ఉన్నా యోసేపు తన కుటుంబాన్ని పోషించడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి చేయగలిగినదంతా చేశాడు. కొంతకాలానికి వాళ్లు ఉండడానికి ఒక చిన్న ఇల్లు దొరికింది. యేసుకు సంవత్సరం దాటాక, వాళ్ల జీవితాల్లో ఉన్నట్టుండి మళ్లీ ఓ పెద్ద మార్పు చోటుచేసుకుంది.
7 తూర్పు నుండి, బహుశా ఎంతో దూరాన ఉన్న బబులోను నుండి కొంతమంది జ్యోతిష్కులు వాళ్లింటికి వచ్చారు. యూదులకు రాజు కాబోయే బిడ్డను వెతుక్కుంటూ ఒక “నక్షత్రం” వెనకాలే నడుస్తూ వాళ్లు యోసేపు ఇంటికి చేరుకున్నారు. వచ్చినవాళ్లు ఎంతో గౌరవాన్ని చూపించారు.
8 తెలిసో తెలియకో ఆ జ్యోతిష్కులు చిన్నారి యేసును పెద్ద ప్రమాదంలో పడేశారు. ఆ “నక్షత్రం” వాళ్లను ముందు బేత్లెహేముకు కాకుండా యెరూషలేముకు నడిపించింది.b అక్కడ వాళ్లు, యూదులకు రాజు కాబోయే బిడ్డను వెతుక్కుంటూ వచ్చామని దుష్ట రాజైన హేరోదుతో చెప్పారు. ఆ మాట వినగానే అతను అసూయతో, కోపంతో రగిలిపోయాడు.
9-11. (ఎ) సాతాను, హేరోదుల కన్నా బలమైన శక్తులు యోసేపు కుటుంబానికి ఎలా సహాయం చేశాయి? (బి) వాళ్ల ప్రయాణం కొన్ని కట్టుకథల్లో వర్ణించినట్లు లేదని ఎలా చెప్పవచ్చు?
9 సంతోషకరమైన విషయమేమిటంటే సాతాను, హేరోదుల కన్నా బలమైన శక్తులు యోసేపు కుటుంబానికి అండగా ఉన్నాయి. అదెలాగో చూద్దాం. జ్యోతిష్కులు యోసేపు ఇంటికి వచ్చినప్పుడు యేసును, మరియను చూసి కానుకలు సమర్పించారు, వాళ్లు తిరిగి ఏమీ ఆశించలేదు. ఇదంతా చూసి యోసేపుకు, మరియకు చాలా ఆశ్చర్యమేసివుంటుంది. వాళ్ల దగ్గర ఇప్పుడు ‘బంగారం, సాంబ్రాణి, బోళము’ వంటి విలువైన వస్తువులు ఉన్నాయి! బిడ్డ ఎక్కడున్నాడో హేరోదు రాజుకు చెప్పడానికి జ్యోతిష్కులు ఆయన దగ్గరకు వెళ్దామనుకున్నారు. కానీ, యెహోవా కలుగజేసుకున్నాడు. మరో దారిలో తమ ఇళ్లకు వెళ్లిపొమ్మని వాళ్లకు కలలో చెప్పాడు.—మత్తయి 2:1-12 చదవండి.
10 జ్యోతిష్కులు వెళ్లిపోయిన తర్వాత యెహోవా దూత యోసేపుకు ఈ హెచ్చరిక చేశాడు: “హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును, ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుము.” (మత్త. 2:13) మనం మొదట్లో చూసినట్టు, యోసేపు తక్షణమే చర్య తీసుకున్నాడు. బిడ్డ ప్రాణాలే అన్నిటికన్నా ముఖ్యం అనుకుని కుటుంబాన్ని తీసుకుని ఐగుప్తుకు వెళ్లిపోయాడు. జ్యోతిష్కులు ఇచ్చిన విలువైన కానుకలు, ఐగుప్తులో కొంతకాలం నివసించడానికీ, అక్కడ అయ్యే ఖర్చులకూ ఉపయోగపడ్డాయి.
యోసేపు తన స్వార్థం చూసుకోకుండా బిడ్డను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు తీసుకున్నాడు
11 యోసేపు కుటుంబం ఐగుప్తుకు చేసిన ప్రయాణాన్ని ఆ తర్వాతి కాలాల్లో కొన్ని కట్టుకథలు, పుక్కిటిపురాణాలు రసవత్తరంగా వర్ణించాయి. యేసు అద్భుతం చేసి ప్రయాణ దూరాన్ని తగ్గించాడని, దారి మధ్యలో దోపిడీ దొంగలను బురిడీ కొట్టించాడని, తన తల్లి కోయడానికి వీలుగా ఖర్జూరపు చెట్లు వంగేలా చేశాడని ఆ కథలు చెబుతున్నాయి.c నిజానికి వాళ్లు ఎంతో ప్రయాసపడి, ఎత్తుపల్లాల మార్గం గుండా ఎంతో దూరం ప్రయాణం చేసి ఐగుప్తుకు చేరుకున్నారు.
కుటుంబం కోసం యోసేపు తన సొంత సుఖాన్ని కూడా పక్కనబెట్టాడు
12. ప్రమాదభరితమైన లోకంలో పిల్లల్ని పెంచుతున్న తల్లిదండ్రులు యోసేపు నుండి ఏమి నేర్చుకోవచ్చు?
12 యోసేపు నుండి తల్లిదండ్రులు ఎంతో నేర్చుకోవచ్చు. కుటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడడానికి ఆయన తన పనులను, ఆఖరికి తన సుఖాన్ని కూడా పక్కనబెట్టాడు. కుటుంబాన్ని చూసుకోవడం యెహోవా అప్పగించిన పవిత్రమైన బాధ్యతగా ఎంచాడని స్పష్టంగా తెలుస్తోంది. నేటి తల్లిదండ్రులు ప్రమాదభరితమైన లోకంలో తమ పిల్లల్ని పెంచాల్సివస్తోంది. పిల్లల్ని పెడదారి పట్టిస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేసే ఎన్నో శక్తులు మన చుట్టూ పనిచేస్తున్నాయి. అలాంటివాటి నీడ పడకుండా పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు కూడా యోసేపులాగే చేయాల్సినదంతా చేస్తే ఎంత బాగుంటుందో కదా!
యోసేపు తన కుటుంబాన్ని పోషించాడు
13, 14. యోసేపు కుటుంబం నజరేతులో స్థిరపడడానికి ఏ పరిస్థితులు దారితీశాయి?
13 కొంతకాలానికే, హేరోదు చనిపోయాడని దేవదూత యోసేపుకు చెప్పాడు. దీన్నిబట్టి వాళ్లు ఐగుప్తులో ఎక్కువకాలం లేరని తెలుస్తోంది. కుటుంబాన్ని తీసుకుని యోసేపు సొంతూరుకు తిరిగి వచ్చాడు. యెహోవా “ఐగుప్తులో నుండి” తన కుమారుణ్ణి పిలుస్తాడని ఒక ప్రాచీన ప్రవచనం చెబుతోంది. (మత్త. 2:14, 15) యోసేపు అలా తిరిగి రావడం వల్ల ఆ ప్రవచనం నెరవేరింది. అయితే ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉంటారు?
14 హేరోదు తర్వాత అతని వారసుడు అర్కెలాయు పాలించడం మొదలుపెట్టాడు. అతను దుష్టుడు, క్రూరుడు కాబట్టి యోసేపు అతనికి భయపడి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. దేవుని నిర్దేశంతో యోసేపు యెరూషలేముకు, దాని కుతంత్రాలకు దూరంగా ఉత్తరాన గలిలయలోని సొంతూరు నజరేతుకు తన కుటుంబాన్ని తీసుకొచ్చాడు. అక్కడ వాళ్ల కుటుంబం స్థిరపడింది.—మత్తయి 2:19-23 చదవండి.
15, 16. యోసేపు పని గురించి వివరించండి. ఆయన ఏ పనిముట్లను వాడివుంటాడు?
15 అక్కడ వాళ్లు నిరాడంబరంగా జీవించారు, అది కూడా ఏమంత సాఫీగా సాగలేదు. యోసేపు వడ్రంగి అని బైబిలు చెబుతోంది. వడ్రంగంలో చెక్కను ఉపయోగించి చేసే పనులు ఎన్నో ఉంటాయి. వడ్రంగి పని చేసేవాళ్లు ముందుగా చెట్టును నరికి, మొద్దును లాక్కొచ్చి ఎండబెట్టేవాళ్లు. అలా ఎండబెట్టిన మొద్దులతో ఇళ్లను, చిన్నచిన్న వంతెనలను నిర్మించేవాళ్లు. ఇంకా పడవలు, చక్రాల బండ్లు, చక్రాలు, నాగళ్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారుచేసేవాళ్లు. (మత్త. 13:55) దానికి ఎంతో శారీరక శ్రమ అవసరమయ్యేది. ఆ కాలాల్లో ఒక వడ్రంగి తన ఇంటిముందో, ఇంటిని ఆనుకుని ఉన్న ఓ గదిలోనో వృత్తిపని చేసుకునేవాడు.
16 యోసేపు ఈ పనికి ఎన్నో పనిముట్లు వాడాడు, కొన్ని తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చివుంటాయి. గొడ్డలి, రంపం, సుత్తి, మూలమట్టం, తొరపణం, లంబసూత్రం, కొలబద్ద, బాడిసె, ఉలి, కొన్ని రకాల జిగుర్లు, మేకులు వంటి పనిముట్లు ఖరీదైనవే అయినా యోసేపు వాటిని ఉపయోగించివుంటాడు.
17, 18. (ఎ) యేసు తన పెంపుడు తండ్రి దగ్గర ఏమి నేర్చుకున్నాడు? (బి) యోసేపు వడ్రంగి పనిని ఎందుకు ఎంతో చెమటోడ్చి చేయాల్సివచ్చింది?
17 చిన్నవాడైన యేసు తన పెంపుడు తండ్రి చేసే పనిని గమనిస్తున్న వైనాన్ని ఊహించుకోండి. యోసేపు చేసే పనిలో ప్రతీ ఘట్టాన్ని యేసు కళ్లు విప్పార్చి తీక్షణంగా పరిశీలించివుంటాడు. యోసేపు విశాలమైన ఛాతిని, రాటుదేలిన కండరాలను, చేతుల్లో ఉట్టిపడుతున్న ప్రావీణ్యాన్ని, కళ్లలో తొణికిసలాడుతున్న నైపుణ్యాన్ని చూసి ఆ బాలుడికి తండ్రి మీద గౌరవం ఎక్కువైవుంటుంది. యోసేపు తన వృత్తిని కుమారుడికి నేర్పించాడు. మొదట్లో బహుశా ఎండు చేప తోలునిచ్చి గరుకుగా ఉన్న చెక్కను నునుపు చేయడం వంటి చిన్నచిన్న పనుల్ని నేర్పించివుంటాడు. తాను ఉపయోగించే కలప గురించి బహుశా అత్తి, సింధూరం, ఒలీవ చెట్ల కలపల్లో ఉన్న తేడాల గురించి యేసుకు వివరించివుంటాడు.
వడ్రంగి పనిలో నైపుణ్యం సంపాదించేలా యోసేపు తన కుమారుడికి మంచి శిక్షణనిచ్చాడు
18 వృక్షాలను కొట్టి, మొద్దులుగా నరికి రాటుదేలిన ఆ చేతులే తనను, తోబుట్టువులను, తల్లిని ఆప్యాయంగా లాలించడం, ఓదార్చడం యేసు చూశాడు. యోసేపు, మరియలకు యేసు తర్వాత చాలామంది పిల్లలు పుట్టారు. వాళ్లు కనీసం ఆరుగురు. (మత్త. 13:55, 56) వాళ్లందర్నీ కంటికిరెప్పలా కాపాడుకోవడానికి, పోషించడానికి యోసేపు ఎంతో చెమటోడ్చాల్సి వచ్చింది.
కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలు చూసుకోవడం అన్నిటికన్నా ప్రాముఖ్యమని యోసేపు అనుకున్నాడు
19. యోసేపు తన కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలను ఎలా చూసుకున్నాడు?
19 అయితే వాటన్నిటికన్నా తన కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలు చూసుకోవడం ఇంకా ప్రాముఖ్యమని యోసేపు అనుకున్నాడు. అందుకే ఆయన సమయం తీసుకుని తన పిల్లలకు యెహోవా దేవుని గురించి, ఆయన నియమాల గురించి నేర్పించేవాడు. సమాజమందిరంలో ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదివి, వివరించేవాళ్లు కాబట్టి ఆ దంపతులిద్దరూ పిల్లల్ని క్రమంగా అక్కడకు తీసుకువెళ్లేవాళ్లు కూడా. యేసు ఆ తర్వాత యెహోవా గురించి, ఆయన నియమాల గురించి తండ్రిని ఎన్నో ప్రశ్నలు అడిగివుంటాడు. యోసేపు వాటన్నిటి గురించి విపులంగా చెప్పడానికి శాయశక్తులా ప్రయత్నించివుంటాడు. ప్రతి ఏటా పండుగలు చేసుకోవడానికి కుటుంబాన్ని తీసుకుని దాదాపు 120 కి.మీ. దూరంలో ఉన్న యెరూషలేముకు వెళ్లేవాడు. పస్కా పండుగ సమయంలోనైతే దాన్ని ఆచరించి, ఇంటికి తిరిగొచ్చేసరికి దాదాపు రెండు వారాలు పట్టేది.
ఆరాధన కోసం యోసేపు తన కుటుంబాన్ని ప్రతి ఏటా యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్లేవాడు
20. క్రైస్తవ తండ్రులు యోసేపును ఆదర్శంగా తీసుకుని ఏమి చేయవచ్చు?
20 నేటి క్రైస్తవ తండ్రులు అదే పద్ధతిని పాటిస్తారు. వాళ్లు తమ కుటుంబ భౌతిక అవసరాలు తీర్చడానికి కష్టపడి పనిచేసినా కుటుంబ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి అధిక ప్రాధాన్యమిస్తారు, దీని కోసం వాళ్లు తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. ఇంట్లో కుటుంబ ఆరాధన చేసుకోవడానికి, కూటాలకు, సమావేశాలకు హాజరవడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసే ఈ కృషి ముందు మరేవీ సాటిరావని యోసేపులాగే నేటి తండ్రులకు కూడా తెలుసు.
‘దుఃఖపడిన’ సమయంలో . . .
21. యోసేపు కుటుంబం పస్కా పండుగ సమయంలో ఏమి చేసేది? యేసు తమతో లేడని యోసేపు, మరియలు ఎప్పుడు గ్రహించారు?
21 యేసుకు 12 ఏళ్లున్నప్పుడు పస్కా పండుగకని యోసేపు ఎప్పటిలాగే కుటుంబంతో కలిసి యెరూషలేముకు వెళ్లాడు. అలాంటి సమయాల్లో, చాలామంది పిల్లాపాపలతో కలిసి ఊరి పొలిమేరల గుండా ఏపుగా పెరిగిన మొక్కలను దాటుకుంటూ నడిచివెళ్లేవాళ్లు. యెరూషలేము దగ్గరపడుతున్న కొద్దీ వాళ్ల నడక భారం పెరుగుతూవుంటుంది, ఎందుకంటే ఆ దారి అంతా రాళ్లూరప్పలతో నిండివుంటుంది. తమకు తెలిసిన యాత్రకీర్తనలు పాడుకుంటూ కొండమీదున్న ఆ పట్టణానికి చేరుకునేవాళ్లు. (కీర్త. 120-134) అప్పుడు లక్షలమందితో ఆ పట్టణమంతా కిటకిటలాడుతుంది. పండుగ తర్వాత అందరూ తమతమ కుటుంబాలతో కలిసి పెద్దపెద్ద గుంపులుగా ఇళ్లకు బయలుదేరేవాళ్లు. యోసేపు, మరియలు ఆ హడావిడిలో పడిపోయి, యేసు తమ బంధువులతో కలిసి నడుస్తున్నాడని అనుకున్నారు. ఒకరోజంత ప్రయాణం చేశాక యేసు తమతో లేడని గ్రహించారు. వాళ్ల గుండెల్లో పిడుగు పడినట్టయింది!—లూకా 2:41-44.
22, 23. తమ పిల్లవాడు తప్పిపోయాడని తెలుసుకున్న యోసేపు, మరియలు ఏమి చేశారు? యేసు దొరికినప్పుడు మరియ ఏమి అంది?
22 కంగారుకంగారుగా వాళ్లు యేసును వెతుక్కుంటూ మళ్లీ యెరూషలేముకు వెళ్లారు. యేసును వెదుకుతూ, పేరు పెట్టి పిలుస్తూ ఆ పట్టణ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్లకు ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా అనిపించివుంటుంది. పిల్లవాడు ఎక్కడున్నాడో? ఏమి చేస్తున్నాడో? వాళ్ల మనసు నిండా ఇవే ఆలోచనలు. అప్పటికి మూడురోజులు గడిచిపోయాయి కానీ యేసు జాడ తెలియలేదు. యెహోవా తనకు అప్పగించిన పవిత్రమైన బాధ్యతను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యానని యోసేపు అనుకునివుంటాడా? చివరగా, వాళ్లు దేవాలయానికి వెళ్లారు. దానిలో యేసును వెతుక్కుంటూ ఒక పెద్ద గది దగ్గరకు వచ్చారు. అక్కడ ధర్మశాస్త్రంలో ఆరితేరిన వాళ్ల మధ్య యేసు కూర్చొనివుండడం చూశారు! యేసును చూడగానే వాళ్ల ప్రాణాలు ఒక్కసారిగా లేచివచ్చాయి!—లూకా 2:45, 46.
23 యేసు వాళ్లు చెప్పేది వింటూ ఆసక్తిగా వాళ్లను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాడు. యేసు విషయాలను అర్థం చేసుకునే తీరును చూసి, ఆయన చెప్పే సమాధానాలను విని వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు. కానీ యేసు తల్లిదండ్రులు విస్తుపోయారు. ఆ సమయంలో యోసేపు మాట్లాడినట్టు బైబిల్లో లేదు. కానీ మరియ మాట్లాడిన ఈ మాటలు వాళ్లిద్దరి మనోభావాలకు అద్దంపడుతున్నాయి: “కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు, నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమి.”—లూకా 2:47, 48.
24. తల్లిదండ్రుల పరిస్థితిని బైబిలు ఎలా కళ్లకుకట్టినట్టు చూపిస్తోంది?
24 తల్లిదండ్రుల పరిస్థితి కొన్నిసార్లు ఎలా ఉంటుందో బైబిల్లోని ఈ చిన్న వృత్తాంతం కళ్లకుకట్టినట్టు చూపిస్తోంది. పిల్లల్ని పెంచడమనేది ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని. ఆఖరికి పిల్లవాడు పరిపూర్ణుడైనా ఇది అంతే నిజం! నేటి ప్రమాదభరితమైన లోకంలో పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు కూడా కొన్నిసార్లు చెప్పలేనంత ‘దుఃఖం’ కలుగుతుంది. కానీ, పిల్లల్ని పెంచడం ఓ సవాలేనని బైబిలు కూడా చూపిస్తోందని తెలుసుకోవడం వాళ్లకు ఊరటనిస్తుంది.
25, 26. యేసు తన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాడు? తన కుమారుడు అన్న మాటల గురించి యోసేపుకు ఎలా అనిపించివుంటుంది?
25 యేసు దేవాలయంలో ఉండడానికి కారణముంది. అక్కడే తన పరలోక తండ్రి యెహోవాకు తాను దగ్గరగా ఉన్నానన్న భావన యేసుకు కలిగింది, అక్కడ యెహోవా గురించి నేర్చుకోవడం ఆయనకు చాలా నచ్చింది. తన తల్లిదండ్రులతో యేసు మర్యాదగానే ఇలా అన్నాడు: “మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?”—లూకా 2:49.
26 తన కుమారుడు అన్న మాటల గురించి యోసేపు ఎన్నోసార్లు ఆలోచించివుంటాడు, సంతోషంతో మనసులో గర్వపడివుంటాడు కూడా. దీనికి కారణం లేకపోలేదు, యెహోవా దేవుని గురించి అలా ఆలోచించడం తన కుమారునికి నేర్పించడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆ వయసులోనే యోసేపుతో ఉన్న అనుబంధం వల్ల, ప్రేమానురాగాలు చూపించే తండ్రి ఎలావుంటాడో యేసుకు తెలుసు.
27. ఒక తండ్రిగా మీకు ఏ గొప్ప అవకాశముంది? యోసేపు ఉదాహరణను మీరు ఎందుకు గుర్తుంచుకోవాలి?
27 మీరు ఒక తండ్రయితే, భద్రతను కల్పించే ప్రేమగల తండ్రంటే ఎలా ఉంటాడో మీ పిల్లలకు చూపించే గొప్ప అవకాశం మీ చేతుల్లో ఉందని మీరు గ్రహిస్తున్నారా? మీరు సవతి పిల్లలను లేదా దత్తత తీసుకున్న పిల్లలను పెంచుతున్నట్లయితే, యోసేపు ఉదాహరణను గుర్తుంచుకొని ప్రతీ బిడ్డను అమూల్యంగా, అపురూపంగా ఎంచండి. తమ పరలోక తండ్రి యెహోవా దేవునికి దగ్గరయ్యేలా వాళ్లకు సహాయం చేయండి.—ఎఫెసీయులు 6:4 చదవండి.
యోసేపు తన బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాడు
28, 29. (ఎ) లూకా 2:51, 52 వచనాలు యోసేపు గురించి ఏ విషయాలు చెబుతున్నాయి? (బి) తన కుమారుణ్ణి జ్ఞానవంతునిగా తీర్చిదిద్దడంలో యోసేపు పాత్ర ఎంతవుంది?
28 యోసేపు మిగతా జీవితం గురించి బైబిల్లో కొన్ని వివరాలే ఉన్నాయి. అయితే వాటిని పరిశీలించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. యేసు తన తల్లిదండ్రులకు ‘లోబడియుండెను. ఆయన జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయయందు, మనుష్యుల దయయందు వర్ధిల్లుచుండెను’ అని బైబిల్లో ఉంది. (లూకా 2:51, 52 చదవండి.) ఆ మాటలు యోసేపు గురించి చాలా విషయాలు చెబుతున్నాయి. పరిపూర్ణ పిల్లవాడైన యేసు తన తండ్రి అధికారాన్ని గౌరవిస్తూ, ఆయనకు లోబడి ఉన్నాడంటే నిజంగా యోసేపు ఒక తండ్రిగా తన బాధ్యతని చక్కగా నిర్వర్తించాడని అర్థమౌతోంది.
29 యేసు అంతకంతకు జ్ఞానం సంపాదించాడని కూడా మనం చూస్తాం. అందులో యోసేపు పాత్ర ఎంతో ఉంది. ఆ రోజుల్లో యూదులు ఒక ప్రాచీన సామెతను వాడేవాళ్లు. అది నేడు కూడా పుస్తకాల్లో కనిపిస్తుంది. ఆ సామెతకు అర్థమిది: జ్ఞానం సంపన్నులకే సొంతం. వండ్రంగులు, రైతులు, కమ్మర్లు వంటి వృత్తిపనులు చేసుకునేవాళ్లకు “మంచీచెడులను వివేచించే జ్ఞానం ఉండదు. నీతి సూక్తులు చెప్పడం వాళ్లవల్ల కాదు.” యేసు పెద్దయ్యాక ఆ సామెత బూటకమని నిరూపించాడు. ఆయన చిన్నతనంలో తన తండ్రి సామాన్య వడ్రంగే అయినా, యెహోవా దృష్టిలో “మంచీచెడులు” ఏమిటో సమర్థవంతంగా బోధించాడు! ఏదో ఒకట్రెండుసార్లు కాదు, ఎన్నో సందర్భాల్లో యోసేపు అలా బోధించివుంటాడు.
30. కుటుంబ పెద్దలకు యోసేపు ఎలా ఆదర్శంగా ఉన్నాడు?
30 యేసును పెంచి పెద్దచేసే విషయంలో కూడా యోసేపు గణనీయమైన పాత్ర పోషించాడు. ఆయన పెంపకంలో యేసు శరీరసౌష్ఠవం కలిగిన యువకునిగా ఎదిగాడు. వృత్తి పనిలో మంచి నైపుణ్యం సంపాదించేలా యోసేపు తన కుమారుడికి మంచి శిక్షణనిచ్చాడు. యేసు వడ్రంగి కుమారుడిగానే కాదు ‘వడ్లవాడిగా’ కూడా అందరికీ తెలుసు. (మార్కు 6:3) యోసేపు కష్టానికి మంచి ఫలితం దక్కింది! పిల్లలను శ్రద్ధగా పెంచుతూ, తమ కాళ్లమీద తాము నిలబడగలిగేలా వాళ్లను తీర్చిదిద్దే విషయంలో తెలివిగల కుటుంబ పెద్దలు యోసేపును ఆదర్శంగా తీసుకుంటారు.
31. (ఎ) యోసేపు ఎప్పుడు చనిపోయివుంటాడు? (బాక్సు కూడా చూడండి.) (బి) ఏ విషయాల్లో యోసేపు మనకు మంచి ఆదర్శాన్ని ఉంచాడు?
31 యేసు 30వ ఏట బాప్తిస్మం తీసుకునే సమయానికల్లా యోసేపు ప్రస్తావన బైబిల్లో కనిపించదు. యేసు పరిచర్య మొదలుపెట్టే సమయానికి మరియ విధవరాలని రుజువులు చూపిస్తున్నాయి. (“యోసేపు ఎప్పుడు చనిపోయాడు?” అనే బాక్సు చూడండి.) కుటుంబాన్ని పోషించి, కాపాడి, తన బాధ్యతను చివరివరకు నమ్మకంగా నిర్వర్తించిన తండ్రిగా యోసేపు మంచి ఆదర్శాన్ని ఉంచాడు. ప్రతీ తండ్రి, ప్రతీ కుటుంబ పెద్ద, ఆ మాటకొస్తే ప్రతీ క్రైస్తవుడు యోసేపులాంటి విశ్వాసాన్ని చూపించాలి.
a ఆ రోజుల్లో ప్రధానాన్ని (నిశ్చితార్థాన్ని) పెళ్లితో సమానంగా పరిగణించేవాళ్లు.
b ఈ “నక్షత్రం” మామూలు నక్షత్రం కాదు. అది దేవుడు పంపింది కూడా కాదు. యేసును అంతమొందించడానికి తాను పన్నిన కుట్రలో భాగంగా సాతానే సహజాతీతమైన ఆ నక్షత్రం కనిపించేలా చేశాడని స్పష్టంగా అర్థమౌతోంది.
c యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాతే, “మొదటి సూచకక్రియను” అంటే అద్భుతాన్ని చేశాడని బైబిలు స్పష్టంగా వివరిస్తోంది.—యోహా. 2:1-11.