10వ అధ్యాయం
స్వచ్ఛారాధనను సమర్థించిన వ్యక్తి
1, 2. (ఎ) ఏలీయా ప్రజల పరిస్థితిని వివరించండి. (బి) కర్మెలు పర్వతం మీద ఏలీయా ఎవర్ని ఎదుర్కొన్నాడు?
ఏలీయా కర్మెలు పర్వతం పైకి వస్తున్న ప్రజలను గమనిస్తున్నాడు. తెల్లవారుజామున మసక చీకట్లోనూ వాళ్ల ముఖాల్లో పేదరికం, కటిక దారిద్ర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మూడున్నర సంవత్సరాల కరువు వాళ్ల జీవితాలను నాశనం చేసింది.
2 ఆ ప్రజలతోపాటు, గర్విష్ఠులైన 450 మంది బయలు ప్రవక్తలు కూడా ఎంతో గర్వంగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్లకు యెహోవా ప్రవక్త ఏలీయా అంటే ఎంతో ద్వేషం. యెజెబెలు రాణి అప్పటికే యెహోవా సేవకులెందరినో చంపించింది, అయితే ఏలీయా మాత్రం బయలు ఆరాధనను పూర్తిగా వ్యతిరేకిస్తూనేవున్నాడు. కానీ ఎంతకాలమని అలా చేయగలడు? ఈ ఒంటరివ్యక్తి తమను ఓడించడం అసంభవమని ఆ యాజకులు అనుకొనివుంటారు. (1 రాజు. 18:4, 19, 20) అహాబు రాజు కూడా వైభవోపేతమైన తన రథమెక్కి అక్కడికి వచ్చాడు. అతనికి కూడా ఏలీయా అంటే అస్సలు గిట్టదు.
3, 4. (ఎ) ఆ ముఖ్యమైన రోజు తెల్లవారేకొద్దీ ఏలీయాకు ఎందుకు కాస్త భయమేసి ఉంటుంది? (బి) మనం ఏ ప్రశ్నల గురించి పరిశీలిస్తాం?
3 యెహోవా ఆరాధనను సమర్థించిన ఆ ఒంటరి ప్రవక్త తన జీవితంలో ముందెన్నడూ చూడని సంఘటనను చూడబోతున్నాడు! ఏలీయా అలా చూస్తుండగానే మంచికి, చెడుకు మధ్య లోకంలో క్రితమెన్నడూ జరగనంత అత్యంత నాటకీయ పోరాటానికి రంగం సిద్ధమైంది. తెల్లవారేకొద్దీ ఆయనకు ఎలా అనిపించివుంటుంది? ఏలీయా కూడా “మనవంటి స్వభావముగల మనుష్యుడే” కాబట్టి ఆయనకు ఖచ్చితంగా భయమేసివుంటుంది. (యాకోబు 5:17 చదవండి.) కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం. విశ్వాసంలేని ప్రజలు, మతభ్రష్ట రాజు, కసితో ఉన్న యాజకులు అలా వాళ్లందరి మధ్య తాను ఒక్కణ్ణే అయిపోయానని ఏలీయాకు తప్పక అనిపించి ఉంటుంది.—1 రాజు. 18:22.
4 అయితే ఇశ్రాయేలు దేశానికి అసలు అంతటి గడ్డు పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ వృత్తాంతం నుండి మీరేమి నేర్చుకోవచ్చు? ఏలీయా చూపించిన విశ్వాసం ఎలాంటిదో, నేడు అది మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం.
సుదీర్ఘ సంఘర్షణ తుది ఘట్టానికి చేరుకుంది
5, 6. (ఎ) ఇశ్రాయేలీయులు ఏ తలంపుల మధ్య ఊగిసలాడారు? (బి) అహాబు రాజు ఏ విధంగా యెహోవాకు చాలా కోపం తెప్పించాడు?
5 ఏలీయా తన జీవితంలోని అధికభాగం, ప్రజలు సత్యారాధనను నిర్లక్ష్యం చేస్తూ దాన్ని రూపుమాపుతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. యెహోవాను ఆరాధించాలా లేక చుట్టుపక్కలున్న దేశాల విగ్రహాలను ఆరాధించాలా అన్న తలంపుల మధ్య ఇశ్రాయేలీయులు ఎంతోకాలంగా ఊగిసలాడుతున్నారు. ఏలీయా కాలంలో ఆ పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.
6 అహాబు రాజు యెహోవాకు చాలా కోపం తెప్పించాడు. అతను సీదోను రాజు కుమార్తె యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. ఇశ్రాయేలు దేశంలో యెహోవా ఆరాధనను రూపుమాపి బయలు ఆరాధనను వ్యాప్తి చేయాలని యెజెబెలు కంకణం కట్టుకుంది. కొంతకాలానికే అహాబు ఆమె చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. అతను బయలుకు ఒక దేవాలయాన్ని, బలిపీఠాన్ని కట్టించి, ఆ అన్య దేవతను ఆరాధించడంలో నాయకత్వం వహించాడు.—1 రాజు. 16:30-33.
7. (ఎ) బయలు ఆరాధన ఎందుకంత హేయమైనది? (బి) ఏలీయా కాలంలోని కరువు నిడివి గురించి బైబిల్లో ఉన్న వివరాలు పరస్పర విరుద్ధంగా లేవని మనం ఎందుకు నమ్మవచ్చు? (బాక్సు కూడా చూడండి.)
7 బయలు ఆరాధన ఎందుకంత హేయమైనది? ఎందుకంటే, ఇశ్రాయేలీయులు దాని ప్రలోభంలో పడి సత్యదేవునికి దూరమయ్యారు. బయలు ఆరాధకులది ఒక అసహ్యమైన, క్రూరమైన మతం. స్త్రీపురుషులు ఆలయంలో వేశ్యావృత్తి చేయడం, కామవికారమైన చర్యలకు పాల్పడడం, చివరకు పిల్లలను బలివ్వడం వంటివి ఆ ఆరాధనలో భాగంగా ఉండేవి. అందుకే యెహోవా తాను ఆ దేశం మీదకు కరువును రప్పించబోతున్నానని అహాబుకు చెప్పడానికి ఏలీయాను అతని దగ్గరికి పంపించాడు. అంతేకాదు, ఏలీయా చెప్పేంతవరకు ఆ కరువు పోదని కూడా యెహోవా అహాబుకు చెప్పమన్నాడు. (1 రాజు. 17:1) ఆ తర్వాత కొన్నేళ్లకు ఏలీయా అహాబును మళ్లీ కలుసుకొని, బయలు ప్రవక్తలతోపాటు ప్రజలందర్నీ కర్మెలు పర్వతం దగ్గర సమావేశపరచమని అతనితో చెప్పాడు.a
ఒకరకంగా, బయలు ఆరాధనకు సంబంధించిన కొన్ని శక్తిమంతమైన అంశాలు నేడు కూడా బలంగా పనిచేస్తున్నాయి
8. బయలు ఆరాధన గురించిన వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
8 ఆరాధన విషయంలో ఇశ్రాయేలులో నెలకొన్న పరిస్థితి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఇప్పుడు మన చుట్టూ బయలుకు సంబంధించిన గుళ్లుగానీ బలిపీఠాలుగానీ లేవు కాబట్టి బయలు ఆరాధన గురించిన వృత్తాంతం మనకు అవసరం లేదని కొందరు అనుకునే అవకాశం ఉంది. అయితే ఈ వృత్తాంతం ప్రాచీన చరిత్ర మాత్రమే కాదు. (రోమా. 15:4) “బయలు” అనే పదానికి “యజమాని” అని అర్థం. తనను ‘బయలుగా’ లేదా భర్తగా, యజమానిగా స్వీకరించమని యెహోవా తన ప్రజలకు చెప్పాడు. (యెష. 54:5) నేడు కూడా ప్రజలు సర్వోన్నత దేవుణ్ణి కాకుండా ఇతర యజమానులెందరినో సేవిస్తున్నారని మీరు ఒప్పుకోరా? ప్రజలు తమ జీవితాల్లో యెహోవాకు ప్రాధాన్యమివ్వకుండా డబ్బు సంపాదనకు, ఉద్యోగంలో పైకెదగడానికి, ఉల్లాస కార్యకలాపాలకు, లైంగికేచ్ఛల్ని తీర్చుకోవడానికి, కోకొల్లలుగా ఉన్న ఇతర దేవుళ్లలో ఒకరిని ఆరాధించడానికి ప్రాధాన్యమిస్తే, వాళ్లు వాటిని తమ యజమానులుగా చేసుకున్నట్లే. (మత్త. 6:24; రోమీయులు 6:16 చదవండి.) ఒకరకంగా, బయలు ఆరాధనకు సంబంధించిన కొన్ని శక్తిమంతమైన అంశాలు నేడు కూడా బలంగా పనిచేస్తున్నాయి. అప్పట్లో యెహోవాకు, బయలుకు మధ్య జరిగిన పోరాటం గురించి ఆలోచిస్తే, మనం ఎవరిని సేవించాలనే విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతాం.
వాళ్లు ఎలా ‘తడబడుతున్నారు’?
9. (ఎ) బయలు ఆరాధన తప్పు అని రుజువు చేసేందుకు కర్మెలు పర్వతం ఎందుకు సరైన స్థలం? (అధస్సూచి కూడా చూడండి.) (బి) ఏలీయా ప్రజలతో ఏమన్నాడు?
9 కర్మెలు పర్వత శిఖరం పైనుండి చూస్తే కిందవున్న కీషోను వాగు, దగ్గర్లోవున్న మహా సముద్రం (మధ్యధరా సముద్రం), సుదూర ఉత్తరాన ఉన్న లెబానోను కొండలు చక్కగా కనిపిస్తాయి.b కానీ ఈ ప్రాముఖ్యమైన రోజున సూర్యోదయం అయ్యే సమయానికి దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. యెహోవా అబ్రాహాము సంతానానికి ఇచ్చిన నేల ఒకప్పుడు సారవంతంగా ఉన్నా, ఇప్పుడు నిస్సారంగా తయారైంది. ఇప్పుడు అది సూర్యుని ప్రతాపానికి బీటలువారింది, దేవుని ప్రజల మూర్ఖత్వం వల్ల నాశనమైపోయింది! ఆ ప్రజలు పర్వతంపైకి వచ్చాక ఏలీయా వాళ్లతో ఇలా అన్నాడు: “యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే [“సత్యదేవుడైతే,” NW] ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడి.”—1 రాజు. 18:21.
10. ఏలీయా ప్రజలు ఏ రకంగా ‘రెండు తలంపుల మధ్య తడబడుతున్నారు’? ఏ ప్రాథమిక సత్యాన్ని వాళ్లు మర్చిపోయారు?
10 ‘రెండు తలంపుల మధ్య తడబడడం’ గురించి మాట్లాడినప్పుడు ఏలీయా అసలు ఏమి చెప్పాలనుకున్నాడు? యెహోవా ఆరాధన, బయలు ఆరాధన ఈ రెండిట్లో ఒక్కదాన్నే ఎంచుకోవాలని అప్పటి ప్రజలు గ్రహించలేదు. ఇద్దర్నీ ఆరాధించవచ్చని అంటే హేయమైన ఆచారాలతో బయలును శాంతింపజేస్తూనే ఆశీర్వాదాల కోసం యెహోవా దేవుణ్ణి వేడుకోవచ్చని వాళ్లు అనుకున్నారు. బయలేమో తమ పాడిపంటల్ని రక్షిస్తే, ‘సైన్యములకధిపతియగు యెహోవానేమో’ యుద్ధాల్లో తమను కాపాడతాడని వాళ్లు అనుకొనివుంటారు. (1 సమూ. 17:45) కానీ యెహోవా తనకు చెందాల్సిన ఆరాధనను ఎవ్వరితోనూ పంచుకోడనే ప్రాథమిక సత్యాన్ని వాళ్లు మరచిపోయారు. నేడు కూడా చాలామంది ఆ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. తన ప్రజలు సంపూర్ణ భక్తితో తనను మాత్రమే ఆరాధించాలని యెహోవా కోరుతున్నాడు, ఆయన దానికి అర్హుడు కూడా. ఆయనకు చేసే ఆరాధనను వేరే ఏ ఆరాధనతో కలిపినా ఆయన దాన్ని ససేమిరా అంగీకరించడు. అలాంటి ఆరాధనంటే ఆయనకు అసహ్యం!—నిర్గమకాండము 20:4, 5 చదవండి.
11. కర్మెలు పర్వతంపై ఏలీయా చెప్పిన మాటలు మనం వేటికి ప్రాధాన్యమిస్తున్నామో, మన ఆరాధన ఎలా ఉందో మరోసారి పరిశీలించుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి?
11 అలా ఇశ్రాయేలీయులు ఎటు వెళ్లాలో తేల్చుకోలేక “తడబడే” వ్యక్తిలా ఉన్నారు. నేడు కూడా చాలామంది, ఇతర ‘బయలులకు’ తమ జీవితాల్లో స్థానమిస్తూ దేవుని ఆరాధనను పక్కనపెడుతూ అలాంటి తప్పే చేస్తున్నారు! తడబడడం మానుకోమని ఏలీయా చేసిన ఆ స్పష్టమైన అత్యవసరమైన అభ్యర్థన, మనం వేటికి ప్రాధాన్యమిస్తున్నామో, మన ఆరాధన ఎలా ఉందో మరోసారి పరిశీలించుకోవడానికి సహాయం చేస్తుంది.
ప్రాముఖ్యమైన ఓ పరీక్ష
12, 13. (ఎ) ఏలీయా ఏ పరీక్షను ప్రతిపాదించాడు? (బి) దేవుని మీద ఏలీయా ఉంచినంత నమ్మకాన్ని మనం ఎలా ఉంచవచ్చు?
12 ఆ తర్వాత ఏలీయా ఒక పరీక్షను ప్రతిపాదించాడు. అది చాలా చిన్న పరీక్షే. బయలు యాజకులు ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద ఒక జంతువును పెట్టాలి. ఆ తర్వాత, దాన్ని కాల్చమని వాళ్లు తమ దేవుణ్ణి వేడుకోవాలి. ఏలీయా కూడా అలాగే చేస్తాడు. “ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుటచేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడు [“సత్యదేవుడు,” NW]” అని ఆయన చెప్పాడు. సత్యదేవుడు ఎవరో ఏలీయాకు తెలుసు. ఆయన మీద ఏలీయాకు ఎంత గట్టి నమ్మకం ఉందంటే, తన ప్రత్యర్థులకు ప్రతీది అనుకూలంగా ఉండేలా చేశాడు. ప్రార్థించే అవకాశాన్ని ముందు వాళ్లకే ఇచ్చాడు. కాబట్టి వాళ్లు తమ ఎద్దును బలిపీఠం మీద పెట్టి బయలుకు ప్రార్థన చేశారు.c—1 రాజు. 18:24, 25.
13 మనకాలంలో అద్భుతాలేమీ జరగడం లేదు. అయితే యెహోవా మారలేదు. ఆయన మీద ఏలీయా ఉంచినంత నమ్మకాన్ని మనం కూడా ఉంచవచ్చు. ఉదాహరణకు, బైబిలు బోధిస్తున్న విషయాలను ఎవరైనా ఒప్పుకోకపోతే, ముందు తమ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం వాళ్లకు ఇవ్వడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో, ఏలీయాలాగే మనం కూడా సత్యదేవుని మీద ఆధారపడవచ్చు. సొంత సామర్థ్యాన్ని నమ్ముకోకుండా, “తప్పు దిద్దుటకు” రూపొందిన దేవుని ప్రేరేపిత వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా మనం ఆయనపై ఆధారపడవచ్చు.—2 తిమో. 3:16, 17.
బయలు ఆరాధన పచ్చిమోసమని ఏలీయా గ్రహించాడు, దేవుని ప్రజలు కూడా అది గ్రహించాలని కోరుకున్నాడు
14. బయలు ప్రవక్తలను ఏలీయా ఎలా ఎగతాళి చేశాడు? ఎందుకలా చేశాడు?
14 బయలు ప్రవక్తలు బలిని సిద్ధం చేసుకుని తమ దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. “బయలా, మా ప్రార్థన వినుము” అంటూ వాళ్లు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నారు. అలా నిమిషాలు, గంటలు గడిచిపోయాయి. కానీ ‘ఒక మాటయైనను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడును లేకపోయెను.’ మధ్యాహ్నం అయ్యేసరికి ఏలీయా వాళ్లను ఎగతాళి చేస్తూ, బయలుకు వాళ్ల ప్రార్థనలు వినేంత తీరిక లేదేమో, దూరాన ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ అతణ్ణి లేపాల్సివుంటుందేమోనని అన్నాడు. ‘పెద్దకేకలు వేయమని’ ఏలీయా ఆ మోసగాళ్లను ప్రోత్సహించాడు. బయలు ఆరాధన పచ్చిమోసమని ఏలీయా గ్రహించాడనీ, దేవుని ప్రజలు కూడా ఆ విషయాన్ని గ్రహించాలన్నదే ఆయన కోరికనీ స్పష్టంగా తెలుస్తోంది.—1 రాజు. 18:26, 27.
15. యెహోవాను కాకుండా వేరే దేన్నైనా యజమానిగా చేసుకోవడం తెలివితక్కువ పనని బయలు ప్రవక్తల ఉదాహరణ ఎలా చూపిస్తోంది?
15 దాంతో బయలు యాజకులు ఇంకా రెచ్చిపోయి “మరి గట్టిగా కేకలువేయుచు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను” కోసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఫలితం శూన్యం! “మాటయైనను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసినవాడైనను లేకపోయెను.” (1 రాజు. 18:28, 29) అసలు బయలనేవాడు ఉంటే కదా. ప్రజల్ని యెహోవా నుండి దూరం చేయడానికి సాతాను సృష్టించిన దేవుడే ఆ బయలు. నిజమేమిటంటే, యెహోవాను కాకుండా వేరే దేన్నైనా యజమానిగా చేసుకుంటే నిరాశే మిగులుతుంది, అవమానాలపాలు కూడా కావాల్సి వస్తుంది.—కీర్తన 25:3; 115:4-8 చదవండి.
పరీక్షకు ఫలితం లభించింది
16. (ఎ) ఏలీయా కర్మెలు పర్వతం పైనున్న యెహోవా బలిపీఠాన్ని బాగుచేయడం అక్కడున్న వాళ్లకు ఏమి గుర్తుచేసివుంటుంది? (బి) ఏలీయా తన దేవునిపై ఉన్న నమ్మకాన్ని ఇంకా ఎలా చూపించాడు?
16 సాయంకాలం కావస్తుండగా ఏలీయా వంతు వచ్చింది. పాడైన యెహోవా బలిపీఠాన్ని ఆయన బాగుచేశాడు. ఖచ్చితంగా, స్వచ్ఛారాధనను ద్వేషించేవాళ్లే దాన్ని పాడుచేసివుంటారు. బలిపీఠం కోసం ఏలీయా 12 రాళ్లను ఉపయోగించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం పది గోత్రాల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పటికీ వర్తిస్తుందనే విషయం అక్కడున్న చాలామందికి గుర్తుచేయడానికే ఆయన అలా చేసివుంటాడు. బలిపీఠంపై జంతువును పెట్టి, బహుశా దగ్గర్లోనే ఉన్న మధ్యధరా సముద్రం నుండి తెచ్చిన నీళ్లను దానిమీద పోయించాడు. ఆ బలిపీఠం చుట్టూ కందకాన్ని కూడా తవ్వించి దాని నిండా నీళ్లు నింపించాడు. ఆయన బయలు ప్రవక్తలకు ప్రతీది అనుకూలంగా ఉండేలా చేశాడు కానీ, ఇప్పుడు యెహోవాకు మాత్రం ప్రతీది అననుకూలంగా ఉండేలా చేశాడు. దేవుని మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది!—1 రాజు. 18:30-35.
యెహోవా తన ప్రజల ‘హృదయాలను తన తట్టుకు’ తిప్పుకోవడం చూడాలనే తపనతో ఏలీయా చేసిన ప్రార్థన, తన ప్రజల మీద ఆయనకు ఇంకా శ్రద్ధ ఉందని చూపిస్తోంది
17. ఏలీయాకు ఏ విషయాలు ప్రాముఖ్యమైనవో ఆయన ప్రార్థన ఎలా చూపిస్తోంది? మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయనను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?
17 అంతా సిద్ధం చేసుకుని ఏలీయా ప్రార్థించాడు. ఆయన సరళంగా ప్రార్థించినా, అదెంతో శక్తిమంతంగా ఉంది. దాన్ని పరిశీలిస్తే ఆయన ఎలాంటి విషయాలకు ప్రాధాన్యమిచ్చాడో స్పష్టంగా తెలుస్తుంది. మొట్టమొదటిది, యెహోవాయే ‘ఇశ్రాయేలీయుల దేవుడు’ కానీ బయలు కాదని అందరికీ తెలియాలని ఆయన కోరుకున్నాడు. రెండవది, తాను యెహోవాకు సేవకుణ్ణి మాత్రమేనని అందరూ తెలుసుకోవాలనుకున్నాడు, ఘనతంతా యెహోవాకే చెందాలని కోరుకున్నాడు. చివరిది, తన ప్రజల మీద తనకు ఇంకా శ్రద్ధ ఉందని ఆయన చూపించాడు. ఎందుకంటే, యెహోవా తన ప్రజల ‘హృదయాలను తన తట్టుకు’ తిప్పుకోవడం చూడాలని ఏలీయా తపించాడు. (1 రాజు. 18:36, 37) వాళ్ల విశ్వాసలేమి వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఏలీయా వాళ్లనింకా ప్రేమిస్తూనేవున్నాడు. మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు అలాంటి వినయాన్ని, దేవుని నామంపట్ల ఆసక్తిని, సహాయం అవసరమైన వాళ్లపట్ల కనికరాన్ని వ్యక్తం చేద్దాం.
18, 19. (ఎ) ఏలీయా ప్రార్థనకు యెహోవా ఎలా జవాబిచ్చాడు? (బి) ప్రజలను ఏమి చేయమని ఏలీయా ఆజ్ఞాపించాడు? బయలు యాజకులపట్ల కనికరం చూపించాల్సిన అవసరం ఎందుకు లేదు?
18 ఏలీయా ప్రార్థించకముందు, యెహోవా కూడా బయలులాగే నిరాశపరుస్తాడేమోనని అక్కడున్నవాళ్లు అనుకొనివుంటారు. కానీ ప్రార్థన అయిన తర్వాత వాళ్లకిక ఆలోచించేంత సమయం దొరకలేదు. “అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను” అని బైబిలు చెబుతోంది. (1 రాజు. 18:38) ఎంతటి మహత్తరమైన ఫలితమో కదా! దానికి ప్రజలెలా స్పందించారు?
అప్పుడు ‘యెహోవా అగ్ని దిగివచ్చింది’
19 వాళ్లంతా “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలువేశారు. (1 రాజు. 18:39) ఎట్టకేలకు, ఏది సత్యమో వాళ్లు తెలుసుకోగలిగారు. అయితే, వాళ్లకు విశ్వాసం ఉందని చూపించడానికి అదొక్కటే సరిపోదు. నిజం చెప్పాలంటే, ఏలీయా ప్రార్థనకు జవాబుగా ఆకాశం నుండి అగ్ని దిగి రావడం చూసిన తర్వాత యెహోవాయే సత్యదేవుడని ఒప్పుకుంటే వాళ్లకు విశ్వాసం ఉన్నట్లు కాదు. అందుకే ఏలీయా, వాళ్లు తమ విశ్వాసాన్ని మరోలా చూపించాలని చెప్పాడు. వాళ్లు ఏనాడో చేసివుండాల్సిన పనిని ఇప్పుడు చేయమన్నాడు, అంటే దేవుని ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండమన్నాడు. అబద్ధ ప్రవక్తలకు, విగ్రహారాధకులకు మరణశిక్ష విధించాలని ధర్మశాస్త్రం చెప్పింది. (ద్వితీ. 13:5-9) యెహోవా దేవునికి బద్ధశత్రువులైన ఈ బయలు యాజకులు కావాలనే ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. వాళ్లను కనికరించాల్సిన అవసరం ఉందా? బయలుకు వాళ్లు సజీవంగా అర్పించిన అభంశుభం తెలియని పసిపిల్లల పట్ల వాళ్లు ఏమైనా కనికరం చూపించారా? (సామెతలు 21:13 చదవండి; యిర్మీ. 19:5) ఈ బయలు యాజకులపట్ల కనికరం చూపించే సమయం ఎప్పుడో దాటిపోయింది. అందుకే వాళ్లను వధించాలని ఏలీయా ఆజ్ఞాపించగానే వాళ్లను వధించారు.—1 రాజు. 18:40.
20. ఏలీయా బయలు ప్రవక్తలను వధించడం గురించిన ఆధునిక విమర్శకుల ఆందోళనలు ఎందుకు సరైనవి కాదు?
20 కొందరు ఆధునిక విమర్శకులు కర్మెలు పర్వతం మీద ఏలీయా బయలు ప్రవక్తలను వధించడాన్ని తప్పుబట్టే అవకాశం ఉంది. మతోన్మాదులు దీన్ని ఒక సాకుగా చేసుకుని, దురభిమానంతో తాము చేస్తున్న దౌర్జన్యాన్ని ఎక్కడ సమర్థించుకుంటారో అన్నదే వాళ్ల ఆందోళన. విచారకరంగా నేడు అలాంటి మతోన్మాదులు చాలామందే ఉన్నారు. అయితే ఏలీయా అలాంటివాడు కాదు. న్యాయమైన శిక్షను అమలుచేయడానికి ఆయన యెహోవా ప్రతినిధిగా పనిచేశాడు. అంతేకాదు, ఏలీయాలా తాము దుష్టులను చంపకూడదని నిజక్రైస్తవులకు తెలుసు. పేతురుతో మాట్లాడుతూ క్రీస్తు తన శిష్యులందరి కోసం ఏర్పర్చిన ఈ ప్రమాణాన్ని నిజక్రైస్తవులు పాటిస్తారు: “నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్త. 26:52) భవిష్యత్తులో తన న్యాయాన్ని అమలు చేయడానికి యెహోవా తన కుమారుణ్ణి ఉపయోగిస్తాడు.
21. నేటి నిజక్రైస్తవులకు ఏలీయా ఎలా మంచి ఆదర్శం?
21 విశ్వాసంతో జీవించాల్సిన బాధ్యత నిజ క్రైస్తవులకు ఉంది. (యోహా. 3:16) ఏలీయాలాంటి నమ్మకమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే వాళ్లు అలా చేయవచ్చు. ఏలీయా యెహోవాను మాత్రమే ఆరాధించాడు, ఇతరులను కూడా అదే చేయమని ప్రోత్సహించాడు. ప్రజలను యెహోవా నుండి దూరం చేయడానికి సాతాను ఉపయోగించిన మతం మోసకరమైనదని ఆయన ధైర్యంగా బట్టబయలు చేశాడు. విషయాల్ని చక్కబెట్టడానికి ఆయన సొంత సామర్థ్యాలను నమ్ముకోలేదు, తనకు నచ్చినట్లు చేసుకుంటూ పోలేదు. కానీ, యెహోవా మీద పూర్తిగా నమ్మకం ఉంచాడు. అవును, ఏలీయా స్వచ్ఛారాధనను సమర్థించాడు. మనందరం ఆయనలా విశ్వాసం చూపిద్దాం!
a “ఏలీయా రోజుల్లో ఎంతకాలం వర్షాలు పడలేదు?” అనే బాక్సు చూడండి.
b సముద్రం నుండి వీచే తేమతో నిండిన గాలుల వల్ల కర్మెలు పర్వతంపై తరచూ వర్షాలు పడుతుంటాయి, మంచు కూడా బాగా కురుస్తుంది. అందుకే అది సాధారణంగా ఏపుగా పెరిగిన మొక్కలతో పచ్చగా ఉంటుంది. బయలు వల్లే వర్షాలు కురిసేవని ప్రజలు నమ్మేవాళ్లు కాబట్టి బయలు ఆరాధనలో ఆ పర్వతం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటుంది. అందుకే, బయలు దేవత ఒక మోసగాడని రుజువుచేసేందుకు బీటలువారి, ఎండిపోయిన కర్మెలు పర్వతం సరైన స్థలం.
c బలి ‘కింద అగ్నియేమియు వేయవద్దని’ కూడా ఏలీయా వాళ్లకు చెప్పాడని గమనించండి. అలాంటి విగ్రహారాధకులు కొన్నిసార్లు బలిపీఠాల కింద గోప్యంగా ఉన్న రంధ్రంలోనుండి మంట వచ్చేలా చేసి, అదేదో మానవాతీత శక్తులవల్ల పుట్టుకొచ్చిందని అనిపించేలా చేసేవాళ్లని కొందరు విద్వాంసులు చెబుతున్నారు.