కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 31 పేజీలు 310-319
  • “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు”
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి?
  • యెహోవా చెప్పేది వినండి, ఆయనతో మాట్లాడండి
  • యెహోవాను ఆరాధించండి
  • యెహోవాను అనుకరించండి
  • “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు”
  • దేవుని ప్రేమలో నిలిచి ఉండండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • యెహోవాకు దగ్గరగా ఉండండి
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ‘నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 31 పేజీలు 310-319
మీటింగ్‌లో బ్రదర్స్‌, సిస్టర్స్‌ పాటలు పాడుతున్నారు.

అధ్యాయం 31

“దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు”

1-3. (ఎ) తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన తమ బిడ్డను ముద్దాడడం చూసినప్పుడు, మనుషుల నైజం గురించి మనకు ఏం తెలుస్తుంది? (బి) ఎవరైనా మనపై ప్రేమ చూపించినప్పుడు మన మనసులో ఏం జరుగుతుంది? మనం వేసుకోదగ్గ ముఖ్యమైన ప్రశ్న ఏంటి?

అప్పుడే పుట్టిన తన బిడ్డ నవ్వును చూడాలని తల్లిదండ్రులు చాలా ఇష్టపడతారు. అందుకే వాళ్ల ముఖాన్ని పిల్లాడి ముఖానికి ఆనించి, ముద్దాడుతూ నవ్వుతారు. ఆ పిల్లాడు ఏం చేస్తాడా అని ఆత్రంగా చూస్తారు. వెంటనే ఆ పిల్లాడి బుగ్గలు సొట్టబడి, పెదవులు విచ్చుకుని, ఒక అందమైన చిరునవ్వు విరబూస్తుంది. ఒకరకంగా తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమకు సమాధానంగా ఆ బిడ్డ నవ్వి, అప్పుడప్పుడే మొలకెత్తుతున్న ప్రేమను తెలియజేస్తాడు.

2 ఆ బిడ్డ నవ్వును బట్టి, మనుషుల నైజం గురించి మనకు ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. అదేంటంటే, ఎవరైనా మనల్ని ప్రేమిస్తే మనం సహజంగానే తిరిగి ప్రేమిస్తాం. ఎందుకంటే, యెహోవా మనల్ని అలానే చేశాడు. (కీర్తన 22:9) మనం పెరిగి పెద్దయ్యేకొద్దీ, ఇంకా బాగా ప్రేమ చూపించగలుగుతాం. బహుశా చిన్నప్పుడు మీ అమ్మనాన్నలు, చుట్టాలు, లేదా ఫ్రెండ్స్‌ ఎలా ప్రేమ చూపించారో గుర్తుచేసుకోండి. అప్పుడు మీ మనసులో వాళ్లమీద ఒక మంచి ఫీలింగ్‌ కలిగి ఉంటుంది. అది మొలకెత్తి, ఎదిగి, ప్రేమ అనే పూలు పూసి ఉంటాయి. అలా మీరు వాళ్లను తిరిగి ప్రేమించడం మొదలుపెట్టారు. మరి యెహోవా దేవునితో మీ బంధం కూడా అలాగే ఎదుగుతూ వచ్చిందా?

3 బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం.” (1 యోహాను 4:19) ఈ పుస్తకంలో 1 నుండి 3 సెక్షన్ల వరకు, యెహోవా మీకు సహాయం చేయడానికి తన శక్తిని, న్యాయాన్ని, తెలివిని ప్రేమగా ఎలా ఉపయోగిస్తున్నాడో నేర్చుకున్నారు. అలాగే 4వ సెక్షన్‌లో, యెహోవా మనుషుల మీద, ప్రత్యేకించి మీమీద అద్భుతమైన విధాలుగా ప్రేమను ఎలా చూపిస్తున్నాడో మీరు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, మనం వేసుకోదగ్గ ప్రశ్నల్లో అదే ముఖ్యమైనది: ‘నేను తిరిగి యెహోవా మీద ఎలా ప్రేమ చూపించవచ్చు?’

దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి?

4. చాలామంది దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏం అనుకుంటారు?

4 ఇతరుల్లో మంచి లక్షణాల్ని బయటికి తీసే శక్తి ప్రేమకు ఉందని, ప్రేమకు మూలమైన యెహోవాకు తెలుసు. అందుకే చాలామంది మనుషులు ఆయనకు ఎదురు తిరుగుతున్నా, నమ్మకంగా లేకపోయినా ఆయన మాత్రం కొంతమందైనా తన ప్రేమకు స్పందించకుండా పోతారా అని ఎదురు చూస్తున్నాడు. నిజానికి లక్షలమంది అలా స్పందించారు. కానీ బాధాకరంగా, ఈ చెడ్డ లోకంలోని మతాలు, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో మనుషులకు అర్థం కాకుండా చేస్తూ వాళ్లను తికమక పెడుతున్నాయి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని లెక్కలేనంత మంది చెప్పుకుంటున్నారు. వాళ్ల దృష్టిలో, ప్రేమంటే కేవలం మాటల్లో చెప్తే సరిపోయే ఒక ఫీలింగ్‌ మాత్రమే. మొదట్లో, అప్పుడే పుట్టిన బిడ్డ ఒక చిన్న నవ్వు నవ్వి, తల్లిదండ్రుల మీద తనకున్న ప్రేమను చూపిస్తాడు. అలాగే మనం దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు, ఆ ప్రేమను మాటల్లో చెప్తే సరిపోవచ్చు. కానీ మనం పెరిగి పెద్దౌతున్నప్పుడు, ఆ ప్రేమను వేర్వేరు విధాలుగా చూపించాల్సి ఉంటుంది.

5. బైబిలు ప్రకారం, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? అది మనకు ఎందుకు మంచి చేస్తుంది?

5 తనను ప్రేమించడం అంటే ఏంటో స్వయంగా యెహోవాయే చెప్తున్నాడు. బైబిల్లో ఇలా ఉంది: “దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే.” దీన్నిబట్టి మన ప్రేమ కేవలం మాటలతో ఆగిపోకూడదు గానీ, పనుల్లో చూపించాలని అర్థమౌతుంది. నిజమే, చాలామందికి లోబడడం అనే మాటే రుచించదు. అందుకే, ఆ వచనంలో హాయినిచ్చే ఈ మాట కూడా ఉంది: “[దేవుని] ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) యెహోవా నియమాలు, సూత్రాలు మన మంచి కోసమే గానీ మనల్ని కట్టిపడేయడానికి కాదు. (యెషయా 48:17, 18) దేవుని వాక్యం నిండా అలాంటి సూత్రాలే ఉన్నాయి. మనం ఆయనకు ఇంకా దగ్గరవ్వడానికి అవి సహాయం చేస్తాయి. అదెలా? యెహోవాకు దగ్గరవ్వడానికి సహాయం చేసే మూడు విషయాల్ని ఇప్పుడు చూద్దాం. అవేంటంటే ఆయనతో సంభాషించడం, ఆయన్ని ఆరాధించడం, ఆయనలా ఉండడం.

యెహోవా చెప్పేది వినండి, ఆయనతో మాట్లాడండి

6-8. (ఎ) మనం యెహోవా మాటల్ని ఎలా వినవచ్చు? (బి) మనం లేఖనాల్ని చదువుతున్నప్పుడు వాటికి ఎలా జీవం పోయవచ్చు?

6 మొదటి అధ్యాయం, “దేవుడే స్వయంగా మీతో మాట్లాడుతున్నట్టు మీరు ఊహించుకోగలరా?” అనే ప్రశ్నతో మొదలైంది. ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు. అంతెందుకు, దేవుడు మోషేతో ఒక దేవదూత ద్వారా మాట్లాడాడు. మరి మన సంగతేంటి? దేవుడు ఇప్పుడైతే దేవదూతల ద్వారా మనుషులతో మాట్లాడట్లేదు. కానీ, యెహోవా నేడు మనతో మాట్లాడడానికి ఒక చక్కటి ఏర్పాటు చేశాడు. మనం ఆయన మాటల్ని ఎలా వినవచ్చు?

7 “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు,” కాబట్టి మనం దేవుని వాక్యమైన బైబిల్ని చదవడం ద్వారా ఆయన మాటల్ని వినవచ్చు. (2 తిమోతి 3:16) మనం లేఖనాల్ని “పగలూ రాత్రీ” చదవాలని కీర్తనకర్త దేవుని సేవకుల్ని ప్రోత్సహిస్తున్నాడు. (కీర్తన 1:1, 2) దానికి చాలా కృషి అవసరం. అయితే ఆ కష్టం ఊరికే పోదు. మనం 18వ అధ్యాయంలో చూసినట్టు, బైబిలు అనేది మన పరలోక తండ్రి నుండి వచ్చిన విలువైన ఉత్తరం లాంటిది. కాబట్టి దాన్ని చదవడం మనకు ఒక పనిలా అనిపించకూడదు. మనం లేఖనాల్ని చదువుతున్నప్పుడు వాటికి జీవం పోయాలి. మనం దాన్ని ఎలా చేయవచ్చు?

8 బైబిల్లో మీరు చదువుతున్న దాన్ని ఊహించుకోండి. మీరు ఎవరి గురించి చదువుతున్నారో వాళ్లు నిజంగా మీ చుట్టూరా ఉన్నట్టు అనుకోండి. వాళ్ల నేపథ్యాన్ని, పరిస్థితుల్ని, ఉద్దేశాల్ని పసిగట్టండి. తర్వాత, ఈ ప్రశ్నలు వేసుకుంటూ దానిగురించి లోతుగా ఆలోచించండి: ‘ఇది యెహోవా గురించి నాకు ఏం నేర్పిస్తుంది? ఇందులో యెహోవాకున్న ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు? దీన్ని నా జీవితంలో ఎలా పాటించవచ్చు?’ అలా మీరు దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించి, పాటించినప్పుడు అది జీవం పోసుకోవడం మీరు కళ్లారా చూస్తారు.—కీర్తన 77:12; యాకోబు 1:23-25.

9. “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” అంటే ఎవరు? ఆ “దాసుడి” మాటల్ని మనం ఎందుకు జాగ్రత్తగా వినాలి?

9 యెహోవా “నమ్మకమైన, బుద్ధిగల దాసుడి” ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. ముందే చెప్పినట్టు, యేసు ఈ కష్టమైన చివరి రోజుల్లో మనకు “తగిన సమయంలో” ఆధ్యాత్మిక ఆహారం పెట్టడానికి, అభిషిక్త సహోదరుల చిన్న గుంపును నియమించాడు. (మత్తయి 24:45-47) మనం ఆ దాసుడు తయారుచేసిన ప్రచురణల్ని చదవడం ద్వారా బైబిలు గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదిస్తాం. అలాగే మనం మీటింగ్స్‌కి, సమావేశాలకు వెళ్లడం ద్వారా ఆ దాసుడు ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటాం. యేసు ఇలా చెప్పాడు: “మీరు ఎలా వింటున్నారనే దానిమీద మనసుపెట్టండి.” (లూకా 8:18) కాబట్టి క్రీస్తు నియమించిన దాసుని మాటల్ని మనం జాగ్రత్తగా వింటాం. ఎందుకంటే, యెహోవా మనతో మాట్లాడడానికి ఆ దాసుణ్ణి ఉపయోగించుకుంటున్నాడని మనం గుర్తించాం.

10-12. (ఎ) ప్రార్థన యెహోవా ఇచ్చిన అద్భుతమైన బహుమతి అని ఎందుకు చెప్పవచ్చు? (బి) యెహోవాకు నచ్చేలా మనం ఎలా ప్రార్థించవచ్చు? యెహోవాకు మన ప్రార్థనలు వినడం ఇష్టమే అని మనం ఎందుకు నమ్మవచ్చు?

10 మరి దేవునితో మాట్లాడడం సంగతేంటి? మనం యెహోవాతో మాట్లాడవచ్చా? బహుశా దాన్ని ఊహించుకుంటేనే కొంచెం కంగారుగా ఉంటుంది కదా. మన దేశంలో అందరికన్నా ఎక్కువ శక్తి ఉన్న రాజు దగ్గరికి వెళ్లి, మన బాధలు చెప్పుకుంటాం అంటే ఆయన వింటాడా? వినడు. కొన్నిసార్లయితే అలా ప్రయత్నించడమే ప్రమాదకరం! ఎస్తేరు, మొర్దెకై రోజుల్లో పర్షియా రాజు పిలవకుండా ఎవరైనా ఆయన్ని కలవడానికి వెళ్తే, ఇంక అంతే సంగతులు, వాళ్లను చంపేసేవాళ్లు. (ఎస్తేరు 4:10, 11) ఇప్పుడు ఆలోచించండి, ఈ విశ్వ సర్వాధిపతితో మాట్లాడడం ఎలా ఉంటుంది? అందరికన్నా శక్తివంతమైన మనుషులు కూడా ఆయన ముందు “మిడతల్లా ఉన్నారు.” (యెషయా 40:22) మరి మనం ఆయనతో మాట్లాడాలంటే భయపడాలా? ఆ భయం మనకు అక్కర్లేదు!

11 మనం తనతో మాట్లాడాలని యెహోవా ఆహ్వానిస్తున్నాడు. దానికోసం ఆయన ఒక సులువైన ఏర్పాటు చేశాడు, అదే ప్రార్థన. చిన్నపిల్లలు కూడా యేసు పేరున, విశ్వాసంతో యెహోవాకు ప్రార్థించవచ్చు. (యోహాను 14:6; హెబ్రీయులు 11:6) ప్రార్థన వల్ల మన లోతైన ఆలోచనల్ని, ఎవరికీ చెప్పుకోలేని ఫీలింగ్స్‌ని, ఆఖరికి మాటల్లో పెట్టలేని బాధను కూడా చెప్పడానికి వీలు అవుతుంది. (రోమీయులు 8:26) అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు రమ్యమైన పదాలతో, ఎక్కువ మాటలతో, గంటల తరబడి ప్రార్థించి యెహోవాను మురిపించాల్సిన అవసరం లేదు. (మత్తయి 6:7, 8) మరోవైపు మనం ఎంతసేపు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే విషయంలో యెహోవా రూల్స్‌ పెట్టలేదు. అంతెందుకు, “ఎప్పుడూ ప్రార్థించండి” అని ఆయన బైబిలు ద్వారా చెప్తున్నాడు.—1 థెస్సలొనీకయులు 5:17.

12 గుర్తుంచుకోండి, యెహోవా మాత్రమే ‘ప్రార్థనలు వినే దేవుడు’ అని బైబిలు చెప్తుంది. ఆయన నిజమైన శ్రద్ధతో మన ప్రార్థనలు వింటాడు. (కీర్తన 65:2) ఆయన తన నమ్మకమైన సేవకుల ప్రార్థనల్ని ఏదో తప్పదన్నట్లు వింటాడా? లేదు, ఆయనకు మన ప్రార్థనలు వినడం అంటే చాలా ఇష్టం. అందుకే బైబిలు మన ప్రార్థనల్ని ధూపంతో పోలుస్తుంది. ధూపాన్ని కాల్చినప్పుడు పొగ పైకి లేచి, ప్రశాంతతనిచ్చే ఒక మంచి వాసన వచ్చేది. (కీర్తన 141:2; ప్రకటన 5:8; 8:4) అదేవిధంగా, మీరు మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనలు ఆ ధూపంలా పైకి లేచి, ఈ విశ్వ సర్వాధిపతినే సంతోషపెడతాయి అని తెలుసుకోవడం మీకు ప్రశాంతంగా అనిపించట్లేదా? కాబట్టి మీరు యెహోవాకు దగ్గరవ్వాలనుకుంటే వినయంగా ప్రతీరోజు ప్రార్థించండి, ఎక్కువసార్లు ప్రార్థించండి. ఏదీ దాచుకోకుండా మీ హృదయాన్ని కుమ్మరించండి. (కీర్తన 62:8) మీ కష్టాల్ని, సంతోషాల్ని, కృతజ్ఞతల్ని, స్తుతుల్ని అన్నీ మీ పరలోక తండ్రికి చెప్పుకోండి. దానివల్ల మీకు, ఆయనకు మధ్య ఉన్న బంధం ఇంకా గట్టిగా అవుతుంది.

యెహోవాను ఆరాధించండి

13, 14. యెహోవాను ఆరాధించడం అంటే ఏంటి? ఆయన మన ఆరాధనను పొందడానికి ఎందుకు అర్హుడు?

13 యెహోవా దేవునితో మాట్లాడడం అంటే, కేవలం ఒక ఫ్రెండ్‌తో లేదా బంధువుతో మాట్లాడడం లాంటిది కాదు. నిజానికి మనం యెహోవాతో మాట్లాడుతున్నామంటే, ఆయనకు చెందాల్సిన ఘనతను ఆయనకు ఇస్తూ ఆయన్ని ఆరాధిస్తున్నట్టు. యెహోవాను ఆరాధించడం అంటే నిండు ప్రాణంతో ఆయన్ని ప్రేమిస్తున్నామని, ఆయన మీద భక్తి ఉందని చూపించడం. కాబట్టి నిజమైన ఆరాధన మన జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, అది అటు పరలోకంలో, ఇటు భూమ్మీద ఉన్న దేవుని నమ్మకమైన సేవకులందర్నీ ఒక్కటి చేస్తుంది. ఒక దర్శనంలో దేవదూత ఇలా ఆజ్ఞాపించడం అపొస్తలుడైన యోహాను విన్నాడు: “ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటల్ని చేసిన దేవుణ్ణే ఆరాధించండి.”—ప్రకటన 14:7.

14 మనం యెహోవాను ఎందుకు ఆరాధించాలి? ఈ పుస్తకంలో ఇప్పటివరకు చూసిన ఆయన లక్షణాల్ని ఒకసారి గుర్తుచేసుకోండి: పవిత్రత, శక్తి, ఆత్మనిగ్రహం, న్యాయం, ధైర్యం, కరుణ, తెలివి, వినయం, ప్రేమ, కనికరం, విశ్వసనీయత, మంచితనం. ఈ అందమైన లక్షణాల్లో ప్రతీ ఒక్కదాన్ని ఆయన గొప్ప స్థాయిలో చూపిస్తాడు. ఇక వాటన్నిటినీ కలిపి చూస్తే, ఆయన కేవలం మనం అభిమానించగల గొప్ప వ్యక్తి మాత్రమే కాదని అర్థమౌతుంది. నిజానికి, ఆయన మహిమ మనం ఊహించలేనంత గొప్పది. ఆయన మనకన్నా చెప్పలేనన్ని రెట్లు ఉన్నతమైనవాడు. (యెషయా 55:9) కాబట్టి ఏ సందేహం లేదు, ఆయనే మనకు సరైన సర్వాధిపతి, మన ఆరాధనను పొందే అర్హత ముమ్మాటికి ఆయనకే ఉంది. ఇంతకీ, మనం ఆయన్ని ఎలా ఆరాధించాలి?

15. మనం యెహోవాను “పవిత్రశక్తితో, సత్యంతో” ఎలా ఆరాధించవచ్చు? మీటింగ్స్‌లో మనకు ఏ అవకాశం దొరుకుతుంది?

15 యేసు ఇలా అన్నాడు: “దేవుడు అదృశ్య వ్యక్తి, ఆయన్ని ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించాలి.” (యోహాను 4:24) మనం “పవిత్రశక్తితో” ఆరాధించాలంటే, పవిత్రశక్తి కోసం ప్రార్థించి అది నడిపిస్తున్నట్లు నడవాలి. అలాగే మనం “సత్యంతో” ఆరాధించాలంటే, దేవుని వాక్యంలో ఉన్న సరైన జ్ఞానానికి తగ్గట్టు ఆయన్ని ఆరాధించాలి. మీటింగ్స్‌లో తోటి ఆరాధకుల్ని కలిసినప్పుడు, యెహోవాను “పవిత్రశక్తితో, సత్యంతో” ఆరాధించే అమూల్యమైన అవకాశం మనకు దొరుకుతుంది. (హెబ్రీయులు 10:24, 25) అలా అందరం కలిసి యెహోవాకు పాటలు పాడి, ఆయనకు ప్రార్థన చేసి, బైబిల్లో ఉన్న మాటలు విని, కామెంట్స్‌ చెప్పినప్పుడు సత్యారాధన ద్వారా యెహోవా మీద ప్రేమ చూపిస్తాం.

మీటింగ్స్‌లో యెహోవాను సంతోషంగా ఆరాధించే అవకాశం దొరుకుతుంది

16. నిజ క్రైస్తవులు పాటించాల్సిన ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒకటి ఏంటి? మనం దాన్ని పాటించాలని ఎందుకు తపిస్తాం?

16 మనం వేరేవాళ్లకు యెహోవా గురించి చెప్తూ, బహిరంగంగా ఆయన్ని స్తుతించడం ద్వారా కూడా యెహోవాను ఆరాధిస్తాం. (హెబ్రీయులు 13:15) చెప్పాలంటే, నిజ క్రైస్తవులు పాటించాల్సిన ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒకటి, దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించడం. (మత్తయి 24:14) మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి దాన్ని ఎప్పుడెప్పుడు పాటించాలా అని చూస్తాం. ‘ఈ లోక దేవుడైన’ సాతాను యెహోవా గురించి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తూ, “అవిశ్వాసుల మనసులకు గుడ్డితనం” కలుగజేస్తున్నాడు. ఇదంతా చూసినప్పుడు మనం యెహోవా వైపున నిలబడి సాక్ష్యం చెప్తూ, ఆ నిందలు తప్పని నిరూపించాలని అనిపించదా? (2 కొరింథీయులు 4:4; యెషయా 43:10-12) అలాగే యెహోవాకున్న అద్భుతమైన లక్షణాల గురించి ఆలోచించినప్పుడు, ఆయన గురించి వేరేవాళ్లకు చెప్పాలనే తపన మనలో కలగట్లేదా? మనం ఎలాగైతే మన పరలోక తండ్రిని తెలుసుకుని ప్రేమించామో, అలాగే వేరేవాళ్లు కూడా ఆయన్ని తెలుసుకుని ప్రేమించేలా మనం సహాయం చేస్తాం. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు.

17. యెహోవాను ఆరాధించడంలో ఏమేం వస్తాయి? మనం ఎందుకు యెహోవాను యథార్థంగా ఆరాధించాలి?

17 మన ఆరాధనలో అంతకన్నా ఎక్కువే ఉంది. అది మన జీవితంలోని అన్ని అంశాల్ని ప్రభావితం చేస్తుంది. (కొలొస్సయులు 3:23) మనం నిజంగా యెహోవాను మన సర్వాధిపతిగా ఒప్పుకుంటే, మన జీవితంలోని ప్రతీ విషయంలో అంటే కుటుంబంతో ఉన్నా, పనిలో ఉన్నా, ఇతరులతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా ఆయన ఇష్టం చేయాలనే చూస్తాం. మనం ఆయన్ని “సంపూర్ణ హృదయంతో,” యథార్థంగా సేవించాలని కోరుకుంటాం. (1 దినవృత్తాంతాలు 28:9) అప్పుడు మన హృదయంలో వేరేదానికి చోటు ఉండదు, లేదా మనం రెండు జీవితాల్ని జీవించం. అంటే బయటికేమో యెహోవాను ఆరాధిస్తున్నట్లు నటిస్తూ, లోపలేమో ఘోరమైన పాపాలు చేయం. యథార్థత ఉంటే అలా చేయడం అసాధ్యం; ప్రేమ ఉంటే అసలు అలా చేయడాన్ని కూడా అసహ్యించుకుంటాం. ఈ విషయంలో దైవభయం కూడా మనకు సహాయం చేస్తుంది. దైవభయం ఉన్నవాళ్లే యెహోవాతో దగ్గరి స్నేహాన్ని అనుభవిస్తూ ఉంటారని బైబిలు చెప్తుంది.—కీర్తన 25:14.

యెహోవాను అనుకరించండి

18, 19. అపరిపూర్ణ మనుషులు యెహోవా దేవుణ్ణి అనుకరించడం సాధ్యమేనని మనకు ఎలా తెలుసు?

18 ఈ పుస్తకంలో ప్రతీ సెక్షన్‌లోని చివరి అధ్యాయం, మనం ఎలా ‘దేవునికి ప్రియమైన పిల్లల్లా ఆయన్ని అనుకరించవచ్చో’ వివరించింది. (ఎఫెసీయులు 5:1) మనం అపరిపూర్ణులమే అయినప్పటికీ శక్తిని ఉపయోగించే విషయంలో, న్యాయంగా ఉండే విషయంలో, తెలివిగా ప్రవర్తించే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో నిజంగా యెహోవాను అనుకరించగలం అని గుర్తుంచుకోవాలి. మనం సర్వశక్తిమంతుణ్ణి అనుకరించగలం అని మనకు ఎలా తెలుసు? గుర్తుంచుకోండి, యెహోవా పేరుకు అర్థం, ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎలా కావాలంటే అలా మారగలడు. ఆ సామర్థ్యాన్ని బట్టి మనం చాలా ఆశ్చర్యపోతాం, కానీ ఈ సామర్థ్యం మనలో ఉందా? చూద్దాం.

19 యెహోవా మనల్ని తన స్వరూపంలో చేశాడు. (ఆదికాండం 1:26) అందుకే మనుషులకు, అలాగే భూమ్మీద ఉన్న వేరే ప్రాణులకు చాలా తేడా ఉంది. జంతువులు ఎలా ఉండాలి అనేది వాటి సహజ సిద్ధమైన తెలివి, జన్యువులు, ప్రకృతి నిర్ణయిస్తాయి. కానీ మనుషుల విషయం అది కాదు. దేవుడు మనుషులకు స్వేచ్ఛాచిత్తం అనే అమూల్యమైన బహుమతి ఇచ్చాడు. మనకు కొన్ని పరిమితులు, అపరిపూర్ణతలు ఉన్నా మనం ఎలా అవ్వాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకు ఉంది. దానికితోడు యెహోవా పేరుకు, తన సేవకుల్ని ఎలా కావాలంటే అలా మార్చగలడు అనే అర్థం కూడా ఉంది. మీరు శక్తిని సరిగ్గా ఉపయోగించే ప్రేమగల, తెలివిగల, న్యాయమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా? యెహోవా పవిత్రశక్తి సహాయంతో మీరు అలా అవ్వగలరు! అప్పుడు ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి.

20. మనం యెహోవాను అనుకరించినప్పుడు ఏ మంచి జరుగుతుంది?

20 అప్పుడు మీరు మీ పరలోక తండ్రి హృదయాన్ని సంతోషపెడతారు. (సామెతలు 27:11) చెప్పాలంటే ఆయనకు మీ పరిమితులు తెలుసు కాబట్టి, మీరు ఆయన్ని ‘పూర్తిగా సంతోషపెట్టవచ్చు.’ (కొలొస్సయులు 1:9, 10) మీరు మీ ప్రియమైన తండ్రి లక్షణాల్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉండే కొద్దీ, ఆయన మీకొక గొప్ప అవకాశం ఇస్తాడు. అదేంటంటే, మీరు ఈ చీకటి లోకంలో వెలుగుగా ఉంటారు. (మత్తయి 5:1, 2, 14) యెహోవా లక్షణాల గొప్ప వెలుగును కొంతవరకు మీరు భూమి నలుమూలలా వెదజల్లుతారు. అది ఎంత గొప్ప గౌరవమో కదా!

“దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు”

ఒక బ్రదర్‌ సాయంత్రం పూట రంగురంగుల ఆకాశాన్ని చూస్తున్నాడు.

మీరు యెహోవాకు ఎప్పుడూ దగ్గరౌతూ ఉండాలి

21, 22. యెహోవాను ప్రేమించే వాళ్లందరి ముందు ఏ ప్రయాణం ఉంది?

21 యాకోబు 4:8 లో “దేవునికి దగ్గరవ్వండి” అని ఉంది. అది గమ్యం కాదు, అదొక ప్రయాణం. మనం యెహోవాకు నమ్మకంగా ఉన్నంతకాలం ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. మనం యెహోవాకు ఇంకాఇంకా దగ్గరౌతాం, దాన్ని ఎప్పుడూ ఆపం. ఎందుకంటే, యెహోవా గురించి నేర్చుకోవాల్సింది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ పుస్తకం చదివాం కాబట్టి, మనకు యెహోవా గురించి అంతా తెలుసని అనుకోకూడదు. చెప్పాలంటే, మనం బైబిల్లో యెహోవా గురించి ఉన్న విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాం అంతే. అక్కడిదాకా ఎందుకు, బైబిలే యెహోవా గురించి పూర్తిగా చెప్పట్లేదు. యేసు ఈ భూమ్మీద ఉన్నప్పుడు చేసిన ప్రతీ పని గురించి రాస్తే, “అలా రాసిన గ్రంథపు చుట్టల్ని పెట్టడానికి ఈ లోకం కూడా సరిపోదని” అపొస్తలుడైన యోహాను అన్నాడు. (యోహాను 21:25) కుమారుడి గురించే ఇలా అంటే, తండ్రి గురించి ఇంకేం అనాలో మీరే ఆలోచించండి!

22 చివరికి మనం శాశ్వతకాలం జీవించినా కూడా, యెహోవా గురించి నేర్చుకోవడం పూర్తవ్వదు. (ప్రసంగి 3:11) మన ముందున్న బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించండి. మనం వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాలు జీవించేశాక, ఇప్పటితో పోలిస్తే అప్పుడు మనకు యెహోవా గురించి చాలా ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయి. అయినా, మనం యెహోవా గురించి నేర్చుకోవాల్సినవి లెక్కలేనన్ని ఉన్నాయని అనిపిస్తుంది. మనం వాటన్నిటి గురించి తెలుసుకోవాలని తహతహలాడతాం. ఎందుకంటే, కీర్తనకర్తలాగే మనకు కూడా ఇలా అనిపిస్తుంది: “నా విషయానికొస్తే, దేవునికి దగ్గరవ్వడం నాకు మంచిది.” (కీర్తన 73:28) పరదైసులో శాశ్వత జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఊహించలేం. దానికన్నా అద్భుతమైన విషయం ఏంటంటే, మనం యెహోవాకు ఇంకాఇంకా దగ్గరౌతూ ఉంటాం.

23. మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు?

23 మీరు యెహోవా ప్రేమకు స్పందించి మీ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో, నిండు మనసుతో, పూర్తి బలంతో ప్రేమించాలి. (మార్కు 12:29, 30) మీ ప్రేమ విశ్వసనీయంగా ఉండాలి, చెక్కుచెదరకుండా ఉండాలి. మీరు ప్రతీరోజు తీసుకునే నిర్ణయాలు అవి చిన్నవైనా, పెద్దవైనా అవన్నీ మీ పరలోక తండ్రితో మీకున్న బంధాన్ని పెంచేలా ఉండాలి. అన్నిటికి మించి మీరు ఇప్పుడూ, ఎల్లప్పుడూ యెహోవాకు దగ్గరౌతూ ఉండాలి. అలాగే యెహోవా కూడా మీకు దగ్గరౌతూ ఉండాలి. అదే మా కోరిక!

ధ్యానించడానికి ప్రశ్నలు

  • కీర్తన 25:1-22 మనం యెహోవాకు ఎలా దగ్గరవ్వవచ్చు? అప్పుడు మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

  • హోషేయ 6:3 యెహోవా గురించి తెలుసుకోవడానికి కృషి అవసరమని, దానివల్ల ఆశీర్వాదాలు వస్తాయని ఈ వచనం ఎలా చూపిస్తుంది?

  • మత్తయి 16:21-27 మనం యెహోవాలా ఉండాలంటే ఎవరి అడుగుజాడల్లో నడవాలి? మనకు ఎలాంటి స్ఫూర్తి ఉండాలి?

  • ప్రకటన 21:3, 4 భవిష్యత్తులో యెహోవా ఇచ్చే ఆశీర్వాదాల గురించి ఆలోచించినప్పుడు, మీకు ఏం చేయాలనిపిస్తుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి