ధరలు పెరిగిపోతుంటే బ్రతికేదెలా?
చేదు నిజాన్ని జీర్ణించుకోండి
పెరుగుతున్న రేట్లకు తగ్గట్టు మన జీతం కూడా పెరుగుతూ ఉంటే అంతా బాగానే ఉంటుంది. కానీ జీతం అలానే ఉండి, రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతుంటే మనకు లోపల దడ పుడుతుంది. ఒకవేళ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటే, మన గుండె గుబేలుమంటుంది.
రేట్లు పెరిగిపోకుండా ఆపడం మన చేతుల్లో లేని పని, దాన్ని మనం మార్చలేం. అయితే, ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోవడం మనకే మంచిది.
ఈ నిజాన్ని ఎందుకు జీర్ణించుకోవాలి?
రోజురోజుకి పెరిగే ధరల్ని ఆపడం మన చేతుల్లో లేదని గుర్తిస్తే . . .
ప్రశాంతంగా ఉంటాం. దానివల్ల మనం బాగా ఆలోచించగలుగుతాం, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.
కొన్ని తెలివితక్కువ పనుల్ని మానుకుంటాం. అంటే, కట్టాల్సిన బిల్స్‌ని పట్టించుకోకపోవడం, అనవసరమైన ఖర్చులు పెట్టడం లాంటివి చేయం.
డబ్బుల విషయంలో ఇంట్లోవాళ్లతో గొడవపడం.
పరిస్థితిని ఎలా నెట్టుకురావచ్చో ఆలోచిస్తాం. ఏవి అవసరమో, ఏవి అవసరం లేదో, వేటికి ఎంత ఖర్చు పెట్టాలో ఆలోచిస్తాం.
మీరేం చేయవచ్చు?
పరిస్థితులకు తగ్గట్టు మారండి. ధరలు మండిపోతున్నప్పుడు వీలైతే ఖర్చులు తగ్గించుకోండి. అదే తెలివైన పని, కొంతమంది తమ స్తోమతకు మించి ఖర్చు చేయాలని చూస్తుంటారు. అలాచేస్తే, పొంగే నదీ ప్రవాహానికి ఎదురీదినట్టే. చివరికి అది మీకే తలకు మించిన భారంగా తయారౌతుంది. కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని, వాళ్ల అవసరాలన్నీ తీర్చాలని అందరూ కోరుకుంటారు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి: మీ కుటుంబానికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్లకు మీ ప్రేమానురాగాలు పంచడం, వాళ్లతో సమయం గడపడం చాలా ముఖ్యం.
ముందూవెనకా ఆలోచించకుండా దర్జాగా బ్రతకడం కోసం ఖర్చులు చేసుకుంటూపోతే, పొంగే నదీ ప్రవాహానికి ఎదురీదినట్టే అవుతుంది